భీమేశ్వరపురాణము/పుటలు93-94

వికీసోర్స్ నుండి
తే.

సోమశేఖరుండు భీమేశ్వరస్వామి, తివిరినాఁడు సంప్రతిష్టఁ బొంద
వేళదప్పకుండ విచ్చేయఁగారాదె, త్ర్యంబకాద్రిసరసిధామలక్ష్మి.

177


మ.

అని మెప్పించి మహర్షు లేడ్వురును నత్యాశ్చర్య మొప్పన్ బ్రభా
వ నిరూఢిం గొనివచ్చి రంధ్రవసుధావక్షోజహారావళిన్
మును బృందారక సేవ్యమానసలిలన్ గోదావరీవాహినిన్
వెనుక న్ముందఱఁ బార్శ్వదేశముల నావేశించి సేవించుచున్.

178


వ.

అప్పుడు ప్రతిష్ఠావలోకంబునకు లోకపాలకగంధర్వయక్షసిద్ధసాధ్యవిద్యాధరోరగామరసహితుండై దేవేంద్రుం డంబరమార్గంబున ఋషుల ననుసరించి యేతెంచుచుండె నాసమయమ్మున.

179


తే.

ఒక్కనదిపొంత గార్హస్థ్యయుక్తమైన, పుణ్యతప మాచరించుచుఁ బుణ్యజనులు
తారు బంధులుఁ దామరతంపరగుచుఁ, గూడియుండంగ నెంతయుఁ గాడుచేసి.

180


తే.

ఋషులవెంబడి సంరంభ మెసఁగవచ్చు
తటిని నడుత్రోవ వనములోఁ దపము సేయు
దైత్యమునులపుణ్యాశ్రమస్థలము సొచ్చి
వఱదఁ గొనిపోయె నిండు సర్వస్వములను.

181


శా.

ప్రాగ్వంశంబులు స్రుక్స్రువంబులును యూపస్తంభపంక్తుల్ హవి
ర్భుగ్వేదీనిలయంబులున్ వఱదలోఁ బోవంగ దేవార్చనా
స్రగ్వాసోఘటికాకమండలు బ్రుసీసంఘాతముం దేలిపో
వాగ్వాదం బొనరించి రప్పుడు మునివ్రాతంబుతో దానవుల్.

182


క.

ఆకాశదివ్యమునులును, నాకౌకఃప్రత్యనీకనాయకమునులున్
వాకాటులకుం జొచ్చిరి, పాకంబులు దప్పినట్టి పటురోషములన్.

183


తే.

శిఖలు వీడఁగ ముఖములు జేగురింప
గటము లదరంగ నొకవిడిఁ గాటులాడి
యొండొరులమీఁద శాపంబు లుగ్గడింప
హస్తములయందు సలిలంబు లందుకొనిరి.

184


వ.

ఇట్లందుకొని దానవులు సప్తర్షిసమానీతయైనయవ్వాహిని శుష్కతోయ యయ్యెడుమనియును, మునులు దానవులకు సమాశ్రయంబైయప్పుణ్యవాహిని యపూజ్యయై యస్పృశ్య యయ్యెడు మనియును, శపియించి రప్పుడు.

185

తుల్యభాగ యుత్పత్తిక్రమము

తే.

అమరులకు నాశ్రయంబైన యాస్రవంతి, తుల్యభాగాహ్వయుండు దైత్యుండు దేరఁ
బూర్వమున గౌతమీగంగఁ బుట్టివచ్చె, నందు రితిహాసతత్త్వజ్ఞు లైనబుధులు.

186


వ.

తుల్యభాగుం డనుదైత్యుండు పరమార్థతత్త్వజ్ఞుండై పక్షపాతంబు లేక సురాసురులకు మాధ్యస్థ్యంబున వివాదంబులు తీర్చుచుండుటకు సమర్థుం డగుట నద్దానవుండు తుల్యభాగాహ్వయుఁ డనంబరఁగుట నన్వర్థనామధేయుండు.

187


క.

ఆతుల్యభాగుపేరను, నాతటికినిఁ దుల్యభాగ యనునామము ప్ర
ఖ్యాతివడసె నవ్వాహిని, గౌతమకన్యకునుఁ గూర్మి కన్యక మొదలన్.

188


సీ.

ఆతుల్యభాగమహామునీంద్రుఁడు ప్రీతి, మునిదానవశ్రేణి మ్రోల నిలిచి
వరుసతో వాదించి యిరుదెఱంగులవారి, వారించి కోపంబు వలదు మీకు
శపియింపఁ దగునయ్య సర్వసర్వంసహా, భువనపావనలైన పుణ్యనదులఁ
గ్రమ్మఱింపుఁడు శాపగరళాక్షరంబులు, క్రోధంబు లేల తపోధనులకు


తే.

ననుటయును వార లామాట లాదరించి
క్రమ్మఱువరాదు పలు కమోఘమ్ము మాకు
నీవు నిప్పుడు చెప్పిన హితవు నూది
వేఱు చందాన మేలు గావింతు మింక.

189


వ.

అని రాక్షసులు సప్తమునిసింధువునకు నంతఃప్రవాహంబును మునులు తుల్యభాగకు నుత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలంబులను సూర్యచంద్రగ్రహణంబులను బ్రతిభానువారంబునను దర్శ పౌర్ణమాసీ ప్రభృతిమహాపర్వకాలంబులను సంక్రమణంబులు మొదలైనవిశేషకాలంబులను స్నానదానజపదపోహోమశ్రాద్ధదేవార్చనావిధానంబు లక్షయఫలంబు లగునట్టుగాను బతిసమేతంబుగా సతికి రజస్వలాత్వాద్యంతరాయంబు లేక యధశ్శయనబ్రహ్మచర్యోపవాసనియమంబులతో భానువారచతుష్టయంబు స్నానంబు సిద్ధించిన సంతానప్రాప్తి యౌనట్టుగాను వరంబు ప్రసాదించిరి తదనంతరంబ.

190


మ.

కెలనన్ ముందర సిద్ధకింపురుషులుం గీర్వాణులు న్నాగసా
ధ్యులు విద్యాధరకిన్నరేంద్రులు సమద్భూషింప దివ్యాప్సరో
లలనాబృందము లాడ దానవులు పిల్లంగ్రోళ్ళు పట్టంగ బొ
బ్బలు నార్పుల్ పటుసింహనాదములు నుత్పాదిల్ల ధాత్రీస్థలిన్.

191


చ.

మలఁగి మలంగి భీమపతిమందిరమండలసిద్ధభూమికిన్
దొలఁగి తొలంగి యుచ్చలితతోయతరంగపరంపరోద్ధతిన్
జెలఁగి చెలంగి యారభటి శీర్ణదరాధరధాతురేణులం
గలఁగి కలంగి పాఱె వడి గౌతమకన్యక దక్షవాటికన్.

192


తే.

దేవదుందుభు లుడువీథి దీటుకొలుప, నమరు లందంద పుష్పవర్షములు గురియ
మునిజనంబులు జయజయధ్వను లొనర్ప, దక్షవాటంబు చొచ్చె గౌతమతనూజ.

193


వ.

ఇవ్విధంబున గోదావరీపుణ్యవాహినిం గొనివచ్చి సప్తర్షులు పరమహర్షోత్కర్షంబున.

194