భారత అర్థశాస్త్రము/మొదటి భాగము - రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రెండవ ప్రకరణము

వాంఛలు పురోభివృద్ధికిఁ గారణములు కాన ననుగ్రహింపఁదగినవి

                "సొమ్ము గోరిన యంతనె సుఖము గలుగ
                 దది యుపార్జింపగా సిద్దియగుట నిజమె ?" -భారతము

అర్థము తనంత ప్రత్యేకముగా మన కుపయోగమునకు వచ్చునట్టిది గాదు రూప్యములను వేచి తినువారెవ్వరును లేరు. ఇక ధనమువలని ప్రయోజన మేమన్న మనకు వలయు వస్తువులు కొనుట కనుకూలమైన సాధనముగనుంటయే. ధనముగాక తక్కిన వస్తువులుగూడ దమంత బ్రత్యేకముగ నుపయోగించునవికావు. ఏపదార్థమైన నుపయోగ పడవలెనన్న నందులకు కాంక్ష ముఖ్యమైన కారణము. చూడుడు ! గ్రుడ్డివానికి జిత్తరు వుపయోగించునా ? చెవిటికి సంగీత మానంద మిడునా ? కనులులేనిచో సౌందర్యమును, చెవులులేకున్న గానమును నెట్లప్రయోజకములో, యావిధముననే మనుజునకు వాంఛలేకయుండిన నేవస్తువును బనికిరావు. ఆకలిలేకున్న నన్నమెందులకు ? మానంబుచే గాదె వస్త్రములకు విలువగలిగె ? అలంకారాభిలాషయేకదా స్వర్ణాది వస్తువుల యుత్కృష్టతకు గారణభూతము ? నిష్కామియైనవానికి లోకమంతయు నిష్ప్రయోజనంబును మూల్యశూన్యంబునైయుండును. అట్టివాడెట్టిపనిని జేయబూనడు. జడపదార్థములకును వానికిని భేద మిసుమంతయు గానరాదు. ఇట్టివారలేదేశమున నెక్కువగనుందురో యాదేశము బొత్తిగా నశించి పోవుననుటకు సందియములేదు. కామము లేనిది కార్యముగాని యర్థముగాని యుండదు. కార్యములేనిది జీవయాత్ర నడువదు. సంపూర్ణసన్యాసులకు బరలోకమబ్బునో యబ్బదో కాని, యిహలోకచ్యుతి మాత్రము సత్యము. అట్టివారికి మోక్షంబు గలుగుననుటయు నమ్ముట కష్టముగనున్నది. దేశమునకును జాతికిని గీడుగలుగజేయు నిష్కామ్యతవలన తనకు మాత్రము మేలు కలుగు ననుట యత్యాశ్చర్యకరంబు

                 "కేవల నిష్కర్మత మో
                  క్షావహ మగునేని గిరులు - నవనీజములున్
                  భూవర : ముక్తిం బడయం
                  గావలవదె ? యడవి నునికి కైవల్యదమే ?" -భారతము.

అర్థాభివృద్ధిలేనిది దేశాభివృద్ధి కలుగదు. కోరికలు మున్ముందుగ వ్యాపింపవేని అర్థాభివృద్ధి యడరనేరదు. ఈ న్యాయములను హిందూదేశచరిత్రమునుండియే విశదీకరింపవచ్చును.

1. హీనకులస్థులైన మాలమాదిగెలు, ఒకచింపిరిబట్ట, కొంచెము రాగి, యంబలి, దొరకిన జాలునని తృప్తిజెందుటంజేసి, తరుణ మబ్బినను ఇంక నెక్కువ యేటికని పనిజేయక యూరకుందురు. ఇందుచే వారికి వృద్ధిలేకపోవుటయేకాదు. దినదినమునకు హైన్యస్థితికి కూడ వచ్చుచున్నారు.

2. మొత్తముమీద మనదేశస్థులు సోమరిపోతులు. ఇందునకు గారణమ్ములు రెండు కలవు. అందు మొదటిది, మనపూర్వులు పోయిన త్రోవనే పోవలయుననియు, గ్రొత్తమార్గము నవలంబించుట పాపమనియు దలచి యుండుటబట్టి నవీన వస్తువులు మంచివని ఎఱిగియు వానిని మానుచుండుట. తిరువాన్కూరిలో వేలకొలదిస్త్రీలు వారి పెద్దలు ఱవికెలు వేయలేదుగాన దామును వేయుటవిడిచి, చూచువారికి జుగుప్స బుట్టించుచు వీధులం బోయెదరు. వీరు తమదేహమును మఱుగుగా నుంచుకొనునంతటి నాగరికత గలవారైన, వస్త్రము లెక్కువగ నేయబడవా ? దైవవశమున నట్లెవరేని నాగరికతకు మూలమగు క్రొత్తత్రోవ ద్రొక్కినచో వారి కితరులవలన గలుగు కష్టములు చెప్పనలవిగాదు. అంత్యజులు గొడుగుల బూనిరేని నది సంప్రదాయవిరుద్ధమని శూద్రులుసైతము నీతివిరుద్ధములగు మితిలేని హింసలకు వారిని బాలుపఱుతురు. ఎట్టిభోగమునుకూడదని వితంతువు లను వికారవేషము దాల్చునట్లు నిర్బంధింతురు. ఇట్లు ఏ కీడును గలుగజేయని నిష్కల్మషములగు కోరికలసయితము నిషేధించి మనుజుల జీవనంబునకు స్వాతంత్ర్యమనునది లేకుండజేయు దేశంబున నేపురుషార్థంబు గడింప నలవియగును ?

ఇక రెండవది. ఇదియు బైదానితో సంబంధించినదే. ప్రతి జాతికిని ఉపజాతికిని వెవ్వేఱ వేషవర్తనంబులు నిర్దేశింపబడి యుంట బట్టి, స్వాతంత్ర్యవర్తనముగాని, వర్తనమున కనుగుణమైన పదవిని గాని యెట్టివారునుజెందుట దుర్లభంబు. ఎంతగొప్పవాడైనను శూద్రుడు ఎట్టినీచుడైన బ్రాహ్మణునకుం దక్కువవాడుగ నెన్న బడుచున్నాడు. గుణములచేగాక జన్మమాత్రంబుచేతనే తారతమ్య మేర్పడుటచే వృద్ధిజెందవలయునను నుత్సాహమునకు భంగము గలుగుచున్నది. పౌరుషముచేత బుట్టుకను మార్ప సాధ్యముగాదు. ఇక బుట్టుకను మార్పకున్న గతిలేదు ! ఎయ్యవి పురుష ప్రయత్నంబున మార్పనగునో (అనగా గుణములు పదవి మొదలగునవి) ఆవానిని మార్పనియ్యరు. అట్లుకాదని మార్చినను లాభములేదు. కనుక ఎట్లు చూచినను మనుష్య ప్రయత్నము చెల్లునట్లు కానము. కావుననే మనవారు సర్వము దైవకృతమనియు, కర్మము ననుసరించి యుండుననియు, బూతుసిద్ధాంతములను స్థాపించి యొకవిధముగ మనసునకు సమాధానము గల్పించుకొనిరి. నిజముగా జూడబోయిన దైవ ముండుటవలన నుద్యోగము పనికిరాకపోలేదు. ఉద్యోగము లేక పోవుటంజేసి దైవమున కట్టి సత్త్వం బారోపింపబడియె.

               "ఉద్యోగినం పురుషసింహ ముపైతి లక్ష్మీ:
                     దైవేన దేయమితి కాపురుషా వదంతి
                దైవం విజిత్య కురు పౌరుష మాత్మశక్త్యా
                     యత్నే కృతే యదినసిద్ధ్యతి కోత్రదోష:"[1]

అనుమాట యసత్యమా ? కావున ప్రతిజాతికేగాక స్త్రీ పురుషులకు సైతము బాల్యము మొదలుగ నన్నియవస్థలయందును అన్నివేళల యందును నిట్టిట్లే నడవవలయునని లేచుట కొకశాస్త్రము, కూర్చుండుట కొకశాస్త్రముగా నిర్ణయించి, మనకెట్టి స్వాతంత్ర్యమునీయక, స్వతస్సిద్ధముగా మనకు గల్గిన శక్తియుక్తుల నుపయోగింపనీయక మృగంబులరీతిని, బొమ్మలమాడ్కి నాడించు దురాచారపిశాచమును దూరముగ దోలినంగాని మనకు సుఖాభివృద్ధు లేనాటికిని గలుగ బోవనుట ముమ్మాటికి నిక్కువము. పరిశ్రమము లేనందున దేహమెట్లో మనస్సును నట్లే కృశించును. దేహవికాసముగాని, మనోవికాసముగాని లేని దేశస్థులకు మోక్షము గతియగునా ? కావున తృష్ణారహితత్వము శ్రేయోహేతువనుట తప్పు.

ఇంతేకాదు. కోరికలు నానాటికి హెచ్చుటయే నాగరికతకును దేశాభివృద్ధికిని ప్రధానమైన కారణంబు. పక్షి మృగాదులకన్న మనుజులకు వాంఛలెక్కువ. శ్రీరాముల కాలములో నెట్లో యట్లే కాకులు నేటికిని గూళ్ళుకట్టుచున్నవి. మనుష్యులు నానాటికి నూతన విధముల నివాసంబు లేర్పఱుచుకొనెదరు. ఏనాదులు చెంచులు మొదలగువారు కందమూలములతోడను, పచ్చిమాంసములతోడను తృప్తి జెందుదురు. నాగరికత జెందినవారికి రుచులయందు నభిలాష యెక్కువగాన షడ్రసోపేతమగు మృష్టాన్నమున్నగాని సరిపడదు. హిందువులు భోజనముమాత్రము చక్కగానున్న జాలునందురు. వారికన్న నెక్కువ నాగరికతగల యింగ్లీషువారికి భోజనశాలయు నలంకారముగ నున్నంగాని యింపులేదు. వడ్డించువారు శుభ్రములగు బట్టలను ధరించినవారుగా నుండవలెను జిహ్వకేగాక నేత్రములకు గూడ నంతయు రమ్యముగనున్నగాని వారి కిచ్చగింపదు. కావున నింద్రియోన్మూలనముకన్న నిద్రియోన్మేషమే మంచిదని యెఱుగునది. బాలురంబోలె నింద్రియంబులను శాసించి యుత్తమమార్గమున బోవునట్లు చేయవలయునేకాని, కొందఱు శాస్త్రకారులు చెప్పినట్లు నిగ్రహమనుపేర ఛేదించుట తగవుగాదు. వేయి ప్రమాణములేల ? ఇంద్రియములను వాంఛలను శత్రువులని నమ్మిన మన మేస్థితిలో నున్నాము ? వానిని మిత్రములని నమ్మిన పశ్చిమఖండనివాసు లేస్థితిలో నున్నారు ? సరిపోల్చి చూడుడు !

వాంఛాస్వభావము

1. వాంఛలు అసంఖ్యములు. ఒకటి తృప్తి జెందుసరికి వేరొకటి యంకురించును నాగరికత యెక్కువయగుకొలది వాంఛల సంఖ్యయు నెక్కువయగును. హిందూదేశములో మునుపటికన్న నిప్పుడు వస్తువులయం దభిలాషలు హెచ్చుచున్నవి. ఇండ్లు, బండ్లు, వస్రములు, నీరు మొదలగునవి మునుపటికన్న మంచివిగా నుండ వలయునని మనము ప్రయత్నపడుచుండుట యెల్లరకు విదితమే. నిరాశులై యెందులకు బనికిరాకయుండిన మన కాంగ్లేయుల సత్సహవాసం బాశాధాన మొనరించి తన్మూలకముగ నాగరికత నొందుటకు ద్రోవసూపినది. అన్నిదానములకన్న నాశాదానమే ప్రధానము. గింజలు మొలిచి భూమికి రమణీయత దెచ్చునట్లు కోరికలీరికలెత్తి జనసమూహమునకంతయు నుత్సాహోద్యోగముల నొసంగి కనుల పండువుగా నొనరించును. మన జీవితము నొక నదితో బోల్ప వచ్చును. నది సదా జలము ప్రవహించుచుండినయెడల చూచుటకు గడు రమ్యముగాను, త్రాగుట కారోగ్యకరముగాను నుండును. పాఱుట నిలచినచో నీరు కంపెత్తి యసహ్యత బుట్టించును. అట్లే ఏదేశములో నానాటికి గ్రొత్త క్రొత్త యుద్దేశములు ప్రభవిల్లి వెల్లివిరిసి విజృంభించుచుండునో యాదేశము శ్రీమంతముగాను శక్తిమంతముగాను నుండును. 'ఈమాత్రము దొరికినది చాలును. పెద్దలుపోయినత్రోవ చాలదా ? క్రొత్తయేర్పాటు లెందులకు ? ఇక్కడనె యీరీతినె బ్రదికినన్నినాళ్లు సుఖముగ విశ్రాంతిగ నుండుదుము.' అనువారు నానాటికి మిగుల హీనస్థితికివచ్చి దుర్బలులై బలవంతుల వాతబడుదురనుట దేశచరిత్రంబులు వేయినోళ్ళ ఘోషింపుచున్నను చెవిటిహిందువులకు వినరాకున్నది కాబోలు !

వాంఛ యుత్తమోత్తమ మనుటకు మఱియొక్క నిదర్శనము చూపవచ్చును. మనుష్యులలో నైకమత్యమున కిదియొక ముఖ్యకారణము. ఇల్లు గట్టవలయునన్న, ఆభరణములు చేయింప వలయునన్న ననేకుల సాహాయ్యములేనిది కొనసాగదు. నిస్పృహత్వము వహించిన వారు తమంతట బ్రత్యేకముగ నడవులలో నుండనౌనుగాని సంసారులమగు మనమట్లు ఇతరులసాయము నపేక్షింపకయుంట యసాధ్యంబు. కావున గాముకత్వంబు (అనగా ఆశలుకల్గియుండుట) సంఘీభావమునకు హేతుభూతంబు, సంఘీభావములేనిది దేశము దేశస్థులును నాశమొందుదురు గాన లోకోద్ధారణమునకు సస్పృహత్వం బాలవాలంబు. ఆశను బాశమందురు. జనుల నొకటిగాజేర్చి సామర్థ్యవంతులజేయు పాశమేగాని యమపాశము గాదుగాన దీనిని ద్రెంప నక్కఱలేదు.

2. ఆశలు అసంఖ్యములైనను ననంతములుగావు. అనగా ప్రతికోరికను తృప్తిజెందింపవచ్చును. తృప్తియైనచో నప్పటికాయాశ యంతమొందును. ఎంత యాకలి గొన్నవాడైనను గడుపార భుజించిన పిమ్మట నప్పటి కాకలి లేనివాడగును. భూషణప్రియులు దమకు గావలసిన నగలు లభించినతోడనె సొమ్ములను గుఱించి కలవరించుట మానుదురు ఇదియెంతయు ముఖ్యాంశము. ఇట్లు గాకున్న బ్రతివాడును ఏదైన నొకవస్తువునే యార్జింపుచు యావజ్జీవము గడుపవచ్చును. అట్లేల కాదన గావలసిన కొలది సేకరింప బడిన వెనుక నావస్తువునందు ప్రీతి మనకు దగ్గును. ఇంకను నధికముగ సేకరించుట కుపక్రమించితిమా యీన్యూనతహెచ్చి తుదకు అసహ్యత గలిగించును కావుననే మనమేవస్తువునైన నభిలాషకొలది నాదర ముంచి యార్జింతుము. ఇందునకు మఱియొక నిదర్శనము - పిపాసాపీడితుడైనవాడు జలము ద్రావబూనెనేని తొలిగ్రుక్కయెంతో సుఖము నొసంగును. త్రాగను త్రాగను ఈ సుఖము తఱుగుచు వచ్చును. సంపూర్ణముగా దాహమారిన పిమ్మట నింకను ద్రావబోయిన సుఖము లేకపోవుటయే కాదు కష్టము సంబవించును. ఒకబానెడునీళ్లు వానినోటిలో బలవంతముగబోసిన వాడు మృతిజెందును. 'అధికమగుడు విసంబగు నమృతమైన' నన్నట్లు వస్త్వాధిక్య మెక్కువైనట్లెల్ల క్రొత్తగా వినియోగమునకువచ్చు భాగములవలని ప్రయోజనము తగ్గుచు వచ్చును. ఈ విషయమునే ప్రక్కపటమున బ్రదర్శింతుము.

ఈ పటములో నీరు ద్రాగను త్రాగను వెనుకటి గ్రుక్కల వలని సుఖము తక్కువయగుటయు గొంతవడికి సుఖ మగోచరత్వంబు నొందుటయు ఆమీద గష్టము కనబడుటయు నింకను ద్రాగను కష్ట మెక్కుడగుటయు విస్పష్టంబు.

'ఈ వస్తువు మంచిది' అని సాధారణముగ మనము వాడు కొనుమాట కర్థ మేమనగా :- ఒక పరిమితి మీరక దొరకిన నంతయు మంచిది ; అంతకు మించిన గొన్నిభాగములు నుపయోగము లేనివి గాను నష్టకరములుగాను నుండుననుట. ఈ విషయమైన కథ యొండు గలదు. పూర్వమొక రాజు గలడు. అతడు మిగులలోభి. ధనమునకు మించినదేదియులేదని నమ్మినవాడు. అతడు ధనము నాశించి తపంబుసేయగా దేవుడు ప్రత్యక్షమయ్యెను. ఏమివరము కావలయునని దేవుడడుగగా నతడు, "స్వామీ ! నేను ముట్టినదంతయు బంగారు గావలయు " నని వేడుకొనెను. దేవుడు వల్లెయని యంతర్థానమాయెను. పిమ్మట నీరాజు మహదానందమున నింటికి వచ్చిచేరి భార్యనుజూచి తన సంపాదించిన వర మామెకు దెలిపి యుత్సాహ సూచకముగ ముద్దు వెట్టెను. వెంటనే భార్య బంగారు బొమ్మ యయ్యెను. ఇదియేమి గ్రహచారమని చింతింపుచు నాకలి కోర్వలేక పరిచారికంబిలిచి యన్నము పెట్టుమనగా నామె వడ్డించిన పదార్ధములన్నియు దినుట కారంభింప స్వర్ణ మయములయ్యె ! విధిలేని యేకాదశి యాయెగదాయని నీరు త్రావబోవ నవియును బంగారయ్యె ! పిదప నాతడు తెలివి దెచ్చుకొన్నవాడై భగవంతుని బ్రార్థించి యావరమును దొలగించుకొనెను.

తనకు సంబంధించినవియు సహజములునగు వాంఛలను పురుషుడు సులభముగ దృప్తి జెందింపగలడు. అరపడి బియ్యముకన్న నెక్కువగ నెవడును తినబోడు. నిద్రాహారములు త్వరలో మితిజెందును. విద్య, నాగరికత మొదలైన వానివలన గలుగు కోరికలను దీర్చుట యంత సులభముగాదు చిత్రకారు డెంతబాగుగ జిత్రించినను తృప్తింజెందడు. ఇంకను జక్కగ జిత్రింపలేకపోతిని గదాయని చింతించును. త్యాగము చేయుటకు మేరలేదు. మృగ సాధారణములగు విషయములయం దాసక్తి త్వరలో లాఘవ మొందును. కావ్యరచన, విజ్ఞానము, శాస్త్రవిచారణము, దేశసేవ, పరోపకారము, భగవద్భక్తి మొదలగు సర్వోత్కృష్టవాంఛ లెన్నటికిని నశింపవు. లోకమునకును మనకును శ్రేయోదాయకములైన కాంక్ష లెన్నటికిని నశింపక స్థిరముగనుంట ఎంతమేలో యోచింపుడు ! 3. కొన్నివాంఛలు పరస్పర విరుద్ధములు. అనగా నొకటి యున్న నింకొకటి యాతరుణమ్మున మనసులో నిలువజాలదు. కార్యసిద్ధియం దాదరమున్నవాడు సోమరితనమును మానుకోవలసి వచ్చును. లోకోపకారబుద్ధియున్నవానికి స్వప్రయోజన పరత్వము నశించును.

4. ఏక్రమప్రకారము వాడుకగలిగి వర్తింతుమో యాక్రమము దృఢమైన యాచారస్వభావము జెందును. అనగా వాడుకలవల్ల వాంఛ లుద్భవిల్లుననుట. ఎట్లన - స్నానముచేయక మయిలబట్టలనే కట్టుకొని చూచువారికి ఱోతయగునట్లు వర్తించు మాల మాదిగలను గొన్నిమాసములు నయముచేతనో భయముచేతనో ప్రతిదినమును శుద్ధిగానుండునట్లు చేసితిమేని వారికే సహజముగ శుభ్రతయం దభిరుచి కలుగును. ఊరక శిక్షించుటలో లాభములేదు. శీలము అభ్యాసమువలన గుదురును. మనదేశస్థులు తమ నివాసములనుగాని, గ్రామములనుగాని యారోగ్యకరమగు స్థితియందుంచక, యెక్కడజూచినను ఎరువు, పేడ మొదలగు దుర్గంధపదార్థముల నుండనిత్తురు. ఇందుచేత రోగములు అంటువ్యాధులు విశేషముగ వ్యాపించుచున్నవి. మఱియు ననేకులు ముఱికినీళ్ళనుద్రాగుట, కుళ్ళిన వస్తువుల దినుట మొదలగు చెడ్డవాడుకల వదలకున్నారు. దీనిచే దమకేగాక యిరుగు పొరుగు వారికిని కీడుమూడును గదాయని యోచింపరు. అభ్యాసము వలననే యనాచారముసైత మాచారమట్లు తోచును. తీర్థయాత్రలకు బోయి వ్యాధిగ్రస్తులు వ్రణపీడితులును స్నానముజేసి గుడ్డలుతికిన కొలనిలో జుగుప్సజెందక తామును స్నానముజేసి గుడ్డలుతికి యా రోతనీటినే పరమపావనమైన తోయమని కృష్ణార్పణమని బహుప్రీతితో బెదవులు చప్పరించుచు ద్రావుచుండుట జూచిన శుచిత్వబుద్ధిగల యేనరునకును వాంతిరాకమానదు.

అనుష్ఠానమువలన నేపనియైనను స్థిరమైన యలవాటుగా పరిణమించునుగాన హీనకులులను వృద్ధికి దేవలయునన్న వారికి నాగరికత గలిగి జీవించుటకువలయు నుపకరణముల సమకూర్చుట యత్యావశ్యకము, ధనము, విద్య, పదవి లభించినచో మాలవాడు సయితము ఉత్తమకులజులట్ల తేజోవంతుడగును. శుచిగానుండుమని యూరక బుద్ధిజెప్పిన నేమియు ఫలములేదు. మైలగానుండిన నెవరికేమి నష్టమని యుందురు. అట్లుగాక ప్రియమైన వస్త్రమొకటి యొసంగితిమేని పసిబిడ్డలు సయితము ముఱికితగిలిన నష్టమగును గదాయని బహుజాగ్రత్తగ వర్తించి శుచిగానుందురు. కాబట్టి జడపదార్థములద్వారా కలుగు మేలు వేదవాక్యములచే గలుగదు అనుష్ఠానమునకువలయు నుపకరణములు సమకూర్చుటచే సుగుణసంపత్తి యతిశయిల్లునేగాని సుబోధమాత్రముచే నెన్నటికినిగాదు.

ఈ తత్త్వమును బాగుగ గ్రహించిన వారగుటచే చెంగల్పట్టు జిల్లాలోను మంగళూరుపురంబునను కొందఱు దయాళువులు అధమజాతివారి నుద్ధరింపబూని విస్తారమైన భూమిని సంపాదించి చిన్నచిన్న భాగములుగా విభజించి యొక్కొక్కదాని నొక్కొక్క కుటుంబమునకు నుచితంబుగ నిచ్చుటయేకాక పరామరికలేక వారు వ్యవసాయము చక్కగ జేయుచున్నారా, ఇండ్లు వాకిండ్లు శుభ్రముగ నుంతురా, యని దినదినము స్వయముగ విచారణలుజరిపి, విద్యాభ్యాసార్థము పాఠశాలల స్థాపించియు, కళానైపుణ్యముకొఱకు "కాయకష్ట కర్మశాలా" ప్రతిష్ఠయొనర్చియు, తమకు బుణ్యంబును వారికి నీచత్వవిమోచనంబును సంఘటించుచున్న వారని నిదర్శనముగా జూపుట కెంతయు సంతసంబయ్యెడి !

ఇట్లు శిక్షితులును ప్రేరితులును అయిన పంచములు దినదిన ప్రవర్ధమానులై దేశక్షేమము నభిలషించు వారికి హృదయానందము గలుగజేయునంత శ్రేష్ఠత్వమును వహించుచున్నవారు.

ప్రసంగవశమున జాలదూరము వ్రాయబడియె. అర్థార్జనమునకును దన్మూలమున దేశాభివృద్ధికిని నిదానము సస్పృహత్వమని యీ ప్రకరణము వలన దెలియ దగినది.

  1. "ప్రయత్నముజేయు మనుజుని లక్ష్మీ స్వయముగ వచ్చిచేరును. దైవమేమన కిచ్చుననుట చేతగానివా రాడుమాట. కావున దైవము నట్లుంచి నీశక్తి నుపయోగించి ప్రయత్న మొనరింపుము. యత్న మొనరించియు గార్యము సిద్ధింపని యెడల నది నీదోషముగాదు."