భారతీయ చిత్రకళ/రెండవ అధ్యాయము
రెండవ అధ్యాయము
బౌద్ధుల కాలము (క్రీ. త. 50-700)
అనేక కారణములవలన మలినమైన హిందూ మతమునుండి భారతీయుల నుద్ధరించుటకు బుద్ధుడు తన సంస్కరణములను వ్యాపింపజేసిననాటి నుండియు పాపమును దహింపజేయు దావానల మనునటులు బౌద్ధమతము భారతభూమియం దంతటను వ్యాపించెను. ఆశోకుడు మొదలగు మహాచక్రవర్తుల యాదరణను బడసి యిది చైనా, జపాను మొదలగు దేశములకు వ్యాపించుటయే కాక యచ్చటి పురాతనమతముల నణగద్రొక్కి యాధిక్యమును వహించెను. ఈ మతము హైందవ సంఘమును శుద్ధిచేసి మహదాశయములతో నింపెను. హృదయము నిర్మలముగ నున్నప్పుడు మానవుడు పరోపకారము, జ్ఞానోపార్జనము మొదలగు సత్కార్యములందు ప్రసక్తుడగును కాన నాకాలమున జ్ఞాన మనేకవిధముల బెరిగెను. దీనితోపాటు లలితకళ లున్నతస్థితికి వచ్చుట యొక వింతకాదు. నేపాలు, టిబెట్టు, బర్మా, సయాము, జావా, చైనా, జపాను, హిందూదేశములందు గల నిదర్శనముల వలన శిల్పము, చిత్రలేఖనము తక్కిన కళలకంటె ఎక్కువ యభివృద్ధిచెందినటులు కానవచ్చును. ఆ కాలమునాటి ప్రతిమలు, చిత్రములు విశేషము బౌద్ధులకు సంబంధించిన వగుటజేసి బౌద్ధమత విజృంభణమే దీనికి కారణమగుట నిశ్చయము. బౌద్ధమత మెచ్చట యుండెనో యచ్చట కళావిశారదు లుండిరని తారానాధుడు పైనజెప్పిన యంశములను బలపరచుచు వ్రాసెను.
నలువైపులనున్న దేశముల కిట్లు మార్గదర్శకమైన భారతభూమి విదేశీయులచే ఎక్కువ గౌరవింపబడుచుండెను. ఈ నూతన మతమును స్వీకరించిన ప్రాక్పశ్చిమ దేశీయులు బుద్ధుని జన్మస్థానమును దర్శించి, వారి శిష్యులవద్ద శిక్షనుపొంది జ్ఞానము నార్జించుటకు ప్రయాణ సౌకర్యములు లేకపోయినను వ్యయప్రయాసల కోర్చి హిందూదేశమునకు వచ్చుచుండిరి. ఇట్టివారి సంఖ్య యల్ఫమగుటచే తమకు దైవసముడగు బుద్ధునివిషయమై, తాము స్వీకరించిన మతము విషయమై యెక్కువ తెలిసికొనుట కాసించువారు. బౌద్ధమత గురువులను తమతమ దేశములకు రప్పించి యాదరించుచుండిరి. తమ యున్న తాశయములకు కారకుడైన బుద్ధుని సందేశము నితరదేశముల వ్యాపింపజేయుటకు హిందూదేశపుమతగురువులు అశోకాది చక్రవర్తుల యాజ్ఞలకు బద్ధులయ్యు, తమంతట తామును విదేశములకు తరుచుగ బోవుచుండిరి. తమ భాషయైన తెలియని వారిమధ్య, మతప్రచారము జేయుట కష్టసాధ్యము కాన అన్నిభాషల వారికిని బోధపడు చిత్తరువులను విరివిగ నుపయోగించుచుండిరి. స్వదేశమునందు శిలాశాసనములను, గ్రంథములను చదువజాలని వారివిషయమై వారు చేయబూను బోధనలను, గౌతమబుద్ధుని జీవితచరిత్రమును చిత్రరూపముగ బ్రదర్శించుచు ప్రజలను మెప్పించి తమ మతమున గలుపుకొనుచుండుట సంభవము. గుహలయం దిప్పటికిని కానవచ్చు చిత్తరువులకును, టిబెట్టు, నేపాలు దేశములందు దేవాలయపతాకముల మీద గల రూపములకును ఇదియే కారణముగ దోచుచున్నది. ఉన్న తాశయములను మనంబున కంటజేయజాలు చిత్తరువులు నాగరికులచే స్వీకరింపబడిన ప్రతి మతప్రచారమునందును ముఖ్యాధారములుగ నున్నవి. ఇట్టి యున్న తాశయజనకమగు నీకళ తన సౌందర్యము వలన నితరుల నాకర్షించి వారి హృదయముల నట్టి యాశ యముల నంకురింపజేయును కాన నీమార్గమును బౌద్ధులును త్రొక్కిరనుట నిర్వివాదాంశము.
బౌద్ధుల మతముతో పాటు వారిచే నాదరింపబడిన చిత్రలేఖనమును ముఖ్యముగ హిందూదేశమున వర్ధిల్లెను. ఎచ్చటనైనను బౌద్ధసన్న్యాసుల యాశ్రమముకొరకు భవనములను నిర్మింపదలచినప్పు డా మతమును స్వీకరించి సన్న్యాసాశ్రమములందు మెలగు చిత్రకారులచ్చటికి బోయి, యితరుల మేలుకొరకు తమవిద్యను గోడలపై బ్రదర్శించి తృప్తిజెందుచుండిరి. ఇందు నియుక్తులై యున్నంతవరకు భవనములను నిర్మించు వారితో కాలమును గడపుచు, వారు పెట్టు భిక్షపై నాధారపడియుండిరి. ద్రవ్యోపార్జనమునకుగాక యుత్సాహకారణమైన బౌద్ధమతసేవను జేయునుద్దేశముతో వీరు చిత్రించుచు వచ్చిరి కాన నీకాలపు చిత్తరువులందు నిజమగుకళారహస్యములు కానవచ్చును. దైవారాధనమునకు, స్వమతసేవకుమించిన యున్నతభావము లుండుట యరుదగుటచే మతముతో నంతగా జోక్యములేని తరువాతి భారతీయచిత్రములు వీటితో సరిపోలవు.
గోడలపై చిత్తరువులను వ్రాయుట మనదేశమున ననాదియైన యాచారమని తోచును. ఈ కాలమున దేశ పాలకులభవనము లీరీతిని చిత్రింపబడినటులు ప్రబల నిదర్శనములు కలవు. ఇదివరకు జెప్పినటులు హైందవవాతావరణ తీవ్రతవలనను, తురుష్కుల దండయాత్రలందలి సైనికుల దుర్మార్గమువలనను ఇట్టి భవనములు నశించుటచే వాటితో నమూల్యములగు చిత్తరువులును నశించెను. కాని గుహలయందు జిత్రింపబడినవి మాత్రము కొన్ని మిగిలియుండుటచే అద్వితీయమైన బౌద్ధుల చిత్రలేఖనమును గూర్చి మనకు కొంతతెలియుచున్నది. మలినమై సగము నశించిన అజంతా గుహలందును, సింహళమున గల సీగిరియా యందునుగల చిత్రములు చూపరుల నద్భుతరసనిమగ్నులుగ జేయుచున్నవి. సయాము దేశమున ఆంకోరునందు చిత్రశాలల చిహ్నములు కానవచ్చుచున్నవి. క్రీ. త. 400 వ సంవత్సరమునను, 629-645 సంవత్సరముల మధ్యను భారతదేశమున సంచారముచేసిన ఫాహియాన్, హుఅన్‌త్సాంగు అను చైనాయాత్రికు లిచ్చటి నిర్మాణములను, వాటిమీద గానవచ్చిన చిత్తరువులను జూచి యాశ్చర్యపడిరి. బుద్ధుడు శ్వేతహస్తిపై నారోహించి తనతల్లియగు మాయాదేవి గర్భమున బ్రవేశించుచున్నటు లొకచిత్తరువు కపిల వస్తుపురమున నుండెనని ఫాహియాను వ్రాసెను. ఇప్పుడు బహుశః పంజా బని పిలువబడుచున్న భాగమున కాబోలు ఉండిన యొక యాశ్రమముయొక్క గోడలు, తలుపులు, కిటికీలు సుందరముగ జిత్రింపబడి యుండెనని హుఅన్‌త్సాంగు వ్రాసెను. క్రీస్తుకు పూర్వము నాల్గవ శతాబ్దమున పాళీభాష యందు వ్రాయబడిన బౌద్ధుల “వినయపిటక”మను గ్రంథమందు పాసెనాడ నృపుని చిత్రగృహము పెక్కు చిత్తరువులతో నలంకరింపబడెనని కలదు. దుత్తగామినియను నృపునిచే నిర్మింపబడిన డగోబా చిత్తరువులచే నలంకరింపబడెనని యైదవ శతాబ్దమున వ్రాయబడిన “మహావంశ” మను గ్రంథమున గలదు. వీటిని జూడ నాకాలమున చిత్రలేఖనము సర్వసాధారణముగ నుండియుండె ననుట నిశ్చయము.
విదేశములందు గానవచ్చు చిత్తరువులను జూతము. క్రీ. త. 67-వ సంవత్సరమున మింగుటాయి అను చైనా చక్రవర్తియొక్క యనుజ్ఞవలన కశ్యపదుంగ యను నొక బౌద్ధ సన్న్యాసి ప్రాగ్దేశములకు కొన్ని చిత్తరువులతో బ్రయాణము చేసెనని కలదు. అప్పటినుండి యేడవ శతాబ్దమువరకు నిట్టి యాత్రికులు చైనా, జపాను దేశములకు బోయి యచ్చట సుప్రసిద్ధ చిత్రములను చిత్రించినటులు కానవచ్చును. జపానునందు “నార” కాలము (ఏడవ శతా బ్దమున) చిత్రింపబడిన వాటియందు అజంత మొదలగు హైందవ చిత్రలేఖన విధానముల చిహ్నములు కానవచ్చుచున్నవని డిల్లనుగారి యభిప్రాయము. క్రీ. త. 708-715 సంవత్సరములమధ్యను జపానునందు నిర్మింపబడిన 'హొరుయుజి' దేవాలయమున గల సుప్రసిద్ధ చిత్రము అజంత చిత్తరువులవలె నున్నదని బినియనుగారు చెప్పుచున్నారు. ఈ కాలమునకు సంబంధించక పోయినను పదునైదవ శతాబ్దమున ప్రబలిన జపానునందలి “టోసా” విధానములు కాలపరిమితివలన మార్పుచెందిన హైందవ విధానములే యనియు, బౌద్ధుల కివి సంబంధించినవనియు రిక్కట్సుగారు వ్రాసిరి. చిత్రలేఖనము నభ్యసించుటకు ప్రత్యేకము కొందరు విదేశీయులు హిందూదేశమునకు వచ్చినటులు కానవచ్చుచున్నది. ఇచ్చటి నుండి అచ్చటకు వెళ్లినవారి వద్ద నభ్యసించుటకంటె మార్గదర్శకమైన యీ కళయొక్క జన్మస్థానముననే శిక్షబొందుట శ్రేష్ఠము కాన నిది మిగుల సంభవము.
బౌద్ధమత మెంతగొప్పదయినను, చిత్రలేఖనమును బౌద్ధసన్న్యాసు లెంత యాదరించినను, దేశమునందు శాంతిలేనిది నలువైపుల నిట్టి జ్ఞానాభివృద్ధి కలుగనేరదు. నాల్గవ శతాబ్ద ప్రారంభమున గుప్తుల రాజ్యముతో దేశమున శాంతియు స్థాపిత మయ్యెను. దక్షిణమున ఆంధ్ర రాజుల పతనమువలనను, ఉత్తరమున కుషనుల నాశనము వలనను కలిగిన సంక్షోభమునందు సంఘ మనేకములగు మార్పులనుజెంది యా యెడతెగని యరాజకము లెన్నడంత మొందునాయని వేచియుండెను. గుప్తులకాలమున - ముఖ్యముగ విక్రమాదిత్యుని పరిపాలనమున - నదివరకు నణగియుండిన సంఘశక్తులు ప్రజ్వరిల్లి యనేకవిధముల సత్కార్యరూపమున మరల అవతరించినవి. ఈ చక్రవర్తి కాలమునను, తరువాతి గుప్తులకాలమునను వాఙ్మయము, శాస్త్రములు, కళలు దేశమునందంతటను అభివృద్ధిజెందినవి. కాళిదాసాదిమహాకవు లీకాలమునే యలంకరించిరని పండితులు నిర్ణయించిరి. నాటకరచన నూతన మార్గములను వెదకెను. నాణెములు, శిల్పములు క్రొత్తరూపములతో దేశీయుల నానందపరచెను. పేరుపొందిన కొన్ని అజంత, బాగ్, సీగిరియ చిత్తరువు లీకాలముననే చిత్రింపబడినవి.
కాని పరిస్థితు లొక్కరీతి నుండజాలవు. గుప్తుల రాజ్యము పరులచేతులలో పడెను. బౌద్ధమతస్థులయందు మహాయానము, హీనయానము అను రెండుతెగ లేర్పడి కలహములు పెరుగుటవలన హిందూమతము కొన్ని మార్పులతో మరల ప్రచారమునకు వచ్చెను. బౌద్ధ మతమునెడల ప్రజలకు విశ్వాసము తగ్గుటవలన చిత్రలేఖ నావశ్యకత యంతగా లేకపోయెను. పూర్వమువలె చిత్రకారునకు పనిలేకపోవుటచే నాతడు తన పరికరములను విడచిపెట్టి వేరు పనులయుదు నియుక్తుడయ్యెను. అచ్చటచ్చట కానవచ్చుచుండెడి చిత్తరువులు మహమ్మదీయుల దండయాత్రలయందును, విగ్రహారాధనమునెడల సానుభూతిలేనివారి యాధిపత్యముక్రిందను, ఇతర మతవైషమ్యములందును నశించెను. 'గ్రుడ్డిలో మెల్ల' యనునటులు రాజ్యకాంక్షవలన గలిగిన యీ యల్లరులందు రాజులు, సైనికులు అజంతాది గుహలను మరచిరి. ఒకానొక సమయమున నృపులచేతను, ప్రజలచేతను ఆదరింపబడి యించుమించుగ ప్రతిపట్టణపు గోడలమీదను కాన వచ్చిన చిత్తరువుల యాధిక్యమును బొగడుట కిట్లు మిగిలినవే మన కాధారము లయ్యెను.
తారానాధుడు హైందవచిత్రలేఖనమును బొగడుచు దాని చరిత్రను కొంతవరకు వ్రాసెను. ఇది విశ్వాసార్హమైనను కాకపోయినను ఇందు కొన్ని ముఖ్యము లైన యంశములు కలవు. ఈతడు దేవతలు, యక్షులు, నాగులు చిత్రకారులని వ్రాసెను. “దేవతల”చే వ్రాయబడిన చిత్తరువులు చూపరులకు సజీవములా యని భ్రమింపజేయగలవని వినయాగమమున గలదట. యక్షులు మానవులైనను, దేవతలైనను వీరి చిత్తరువు లద్భుతములై యుండెనట. మూడవ శతాబ్దమున నుండిన నాగార్జునునిక్రింద ఉత్తర హిందుస్థానమం దంతటను వ్యాపించి యుండిన నాగులు సుప్రసిద్ధ చిత్రకారులు. శిల్పమునందును వీరు ప్రవీణులై యుండినటులు అమరావతి స్తూపమువలన తెలియవచ్చుచున్నది.
మూడవ శతాబ్దమునకు పిమ్మట ఈ కళ క్షీణదశకు వచ్చినటులును, తర్వాత మరల (గుప్తుల రాజ్యమునం దైయుండవలెను) అభివృద్ధిజెంది మూడుభాగములుగ నేర్పడెననియు తారానాధుడు వ్రాసెను. ఐదు, లేక ఆరు శతాబ్దములందు రాజ్యముచేసిన బుధపక్షుని కాలమున మగధదేశీయుడగు బింబిసారునిచే “మధ్య దేశము”న (సంయుక్త పరగణాలు) చిత్రలేఖన మభివృద్ధి పరుపబడెనట. ఈ కాలమున నెక్కువగ చిత్రకారు లుండిరనియు, వీరి చిత్తరువులు పూర్వము “దేవతల”చే చిత్రింపబడిన వాటివలె నుండెననియు గలదు. ఉదయపురమున నేడవ శతాబ్దపు మధ్యమున పాలించిన మేవారు శిలాదిత్యగుహిలుని (సిలానృపుడని తారానాధుడు వ్రాసెను) కాలమున శృంగధరుని యాధిపత్యము క్రింద యక్షుల చిత్తరువుల వంటివి పశ్చిమము (రాజపుత్రస్థానము)న చిత్రింపబడెను. తొమ్మిదవ శతాబ్దమున రాజ్యముచేసిన ధర్మపాలదేవపాలుర కాలమున ధీమనునిచే వరేంద్రము (వంగదేశము)న చిత్రలేఖన మభ్యసింపబడెను. పిమ్మట బీహారు ఉత్కళములందు ధీమనుని కుమారు డగు 'బిటపాళొ' అను వానిచేత నాగుల కళావిధానముల ననుసరించియు, హర్షశిలాదిత్యునికాలమునను, తరువాతి నృపులకాలమునను నేపాళమున యక్షనాగుల విధానముల ననుసరించియు, ఎనిమిదవ శతాబ్దమున లలితాదిత్యుని రాజ్యమునందు యక్షుల విధానము ననుసరించియు, పదునొకటవ శతాబ్దమున హంసరాజనుమంత్రి కాలమునను, కాశ్మీరమునను చిత్రలేఖన మభ్యసింపబడెనని తారానాధుడు వ్రాసిన చరిత్రయందు గలదు. అజంత, బాఘ్‌లందుగల చిత్తరువుల బట్టి యీ చరిత్రయందు కొన్నితప్పు లున్నటులు గానవచ్చినను యిం దధికాంశము నిజమని పండితు లభిప్రాయపడుచున్నారు.
బౌద్ధుల చిత్తరువులందలి హస్తముద్ర మనోహరముగ నున్నది. దైవపూజయం దిప్పటికి నీముద్ర మన దైనికకార్యములం దెట్టి ప్రాముఖ్యము వహించెనో చూడగలము. నిర్జీవములగు నీచిత్రములు తమభావములను వాక్కుద్వారా కాక వ్రేళ్లద్వారా చూపరులకు జెప్పునటులుండును. ప్రతివ్రేలియందును జీవమున్నటు లుండును. చేతులు ముడుచుకొనుట, వ్రేళ్లను అనేక విధములుగ వంచుట, మణికట్టుయొక్క సుందరమైన వంపు, వీటన్నిటికిని అర్థము కలదు. తెలియబరుచు భావ మేదియు లేనప్పుడు పాత్రయో, వింజామరయో, పుష్పమో హస్తము నలంకరించియుండును. ఇట్టిసమయములందు కూడ నీహస్తముల సౌందర్య మద్వితీయము. చిత్రకారున కిందుగల ప్రవీణత ముఖ్యముగ మృదంగము మొదలగు వాటిని వాయించుచున్నటులు చిత్రించినప్పుడు - చూడదగును. కోమలములును, సుందరములు నైన వేళ్ల తాకుడు మాత్రమున నాయంత్రములు వింతస్వరములతో సజీవము లైనటులు నాతడు చిత్రింపగలిగెను. తక్కినవిషయము లటుండ ఈయొక్క ప్రవీణతకు మాత్రము హైందవ చిత్రకారుడు మిగుల గౌరవార్హుడు.
ఇప్పటికిని హిందూదేశమున గోడలమీద చిత్తరువులను వ్రాయుట యాచారమై యున్నది. సున్న మెండిన పిమ్మట రంగులను పూసినయెడల సూర్యుని వేడిమి కది పొక్కి రాలిపోవును. కాన, యిసుక సున్నము గలిపి పూసినపిమ్మట నది యారకమునుపే దానిపై రంగులను బూయుదురు. చిత్రమంతయు నొకటి రెండుదినములలో పూర్తికానియెడల నది పూర్తియగువరకు జాగరూకతతో సాయంకాలమున దానిపై నీటిని జల్లి మరుచటి దినమున రంగులు పూయుటకు సిద్ధముగ నుంచెదరు. పూసిన సున్నము నునుపుగ నున్న యెడల చిత్తరువు విశేషకాల ముండజాలదు. కాన నొక కఱ్ఱచెక్కతో దానిని గరుకుగ జేసెదరు.
దీనికిని అజంత విధానమునకును భేదము కలదు. ఈగుహలందు సున్నమునకు బదులు జిగటమన్ను, పేడ, రాతిగుండ కలపి రాతిపై మెత్తిరి. ఇచ్చటి రాళ్లయందు చిన్నకన్నము లుండుటచే నిది వాటి కంటుకొని యిప్పటికిని రాలక యున్నది. కొన్నిచోటుల మంటిలో ఊకను కలపినటులు కానవచ్చును. సీగిరియ యందు ఇంచుమించుగ నిట్టి వస్తువులతోనే చిత్రించుటకు స్థలమును సిద్ధపరచిరి. ఈ మెత్తుడు సుమారు అంగుళమున పరకవంతునుండి ముప్పాతిక వంతువరకు దళసరిగ గలదు. సీగిరియయందు పాతికఅంగుళమునుండి యరయంగుళమువరకు గలదు. అజంతయందలి తొమ్మిదవగుహయందు చాలపలుచగ, నునుపుగ నున్నది. రసాయనాది శాస్త్రపరిజ్ఞాన మిప్పుడు విశేషముగనున్నను ఇంతటి పటుత్వముకల పదార్థము వేరులేదని పండితులభిప్రాయ పడుచున్నారు. చిత్తరువులను దీనిపై వ్రాయక ముందు పలుచగ సున్నమును బూసినటుల కానవచ్చును.
తొలుత చిత్తరువుయొక్క రూపును ఎరుపురంగుతో గీసి యేర్పరచుచుండిరి. దీనియందు మార్పులను చేయవలసి వచ్చినయెడల నలుపుతో కాని, మట్టిరంగుతోకాని దిద్దుటకలదు. పిమ్మట నీ రేఖలు కనబడునటులు ఫలుచని యాకుపచ్చరంగును పూసిరి. ఇది యారిన పిమ్మట కావలసిన వర్ణలేపనమును జేసి, మరల మట్టిరంగుతోను, నలుపుతోను తొలిరేఖవిూద దిద్దుచుండిరి. ఈ చిత్రకారుల గురువు వాటిని బరీక్షించి యచ్చటచ్చట సవరించి నటులు గొన్ని చిత్రములందు కానవచ్చును.
సున్నముపైని పూసినయెడల కొన్నిరంగులరూపు చెడును కాన హైందవ చిత్రకారు డన్నివర్ణముల నుప యోగింపజాలక పోయెను. ఈత డుపయోగించిన రంగులించుమించుగ నన్నియు ప్రకృతియందు లభించునవిగ కానవచ్చుచున్నవి. అజంత, బాఘ్‌లందు తెలుపు, ఎరుపు, మట్టి రంగు, నలుపుకలిసిన ఆకుపచ్చ, నీలి మొదలయినయనేక విధములగు రంగులు పూయబడెను. రామగడపర్వతపుచిత్తరువులందు, సీగిరియయందు నీలిరంగు కానరాదు. సింహళము నందలి అనురాధపురమున విశేషముగ నుపయోగపరుపబడిన పసుపుపచ్చ అజంత గుహలం దచ్చటచ్చట మాత్రము వినియోగమునకు దేబడెను. సున్నమువలన సాధారణముగ నాశనమగు ఊదా, గులాబి, ఆకుపచ్చ మొదలగు వర్ణము లెచ్చటను కానరావు. వీటిని హైందవ చిత్రకారు డుపయోగపరుపలేదో, లేక ఇటీవల నివి నశించి పోయినవో నిర్ణయించుట దుస్సాధ్యము.
ప్రాచీన హైందవచిత్రకారుని కుంచెలు మొదలగు పరికరములను గూర్చి తెలియుట లేదు.