Jump to content

భారతీయ చిత్రకళ/మూడవ అధ్యాయము

వికీసోర్స్ నుండి

మూడవ అధ్యాయము


అజంత గుహలు

ప్రాపంచిక సుఖములను త్యజించి, సన్న్యాసాశ్రమము గొన్నవారందరు కాంతాకనకాది బంధనములందు చిక్కుకొనియున్న వారి సంపర్కము లేకుండ నవిఘ్నముగ దైవస్మరణము జేయుట కేకాంతస్థలమునకు బోవుట ముఖ్యముగ హిందూదేశమున ననాది నుండియు ఆచారమై యున్నది. మతప్రచారమునకై దేశమునందంతటను సంచారము చేయుచుండినను, జనసంకులమైన స్థలములందు, అనేకవృత్తులవారి మధ్యను మెలగుచుండినను, బౌద్ధసన్న్యాసులు గుహలయందు నివసించు చుండిరి. బౌద్ధమత ప్రాముఖ్యము పెరిగినకొలది ఈ గుహలు సుప్రసిద్ధములైన యాశ్రమములుగ మారెను. అచ్చటికి వచ్చుచుండిన పామరుల దృష్టి నాకర్షించి బౌద్ధమతమునం దభిరుచి కలుగజేయుటకును, అంతకు పూర్వమే బౌద్ధ మతమును స్వీకరించిన వారి దృక్పథమున మతస్థాపకుడగు బుద్ధుడు నిలిచియుండునట్లు చేయుటకును ఈగుహ లలంకరింపబడినటులు గానవచ్చును. వెనుక జెప్పినటులు బౌద్ధమతావలంబకులగు కళావిశారదులు తమ హృదయముల నాటిన భక్తిని చిత్రరూపముగ వ్యక్తపరచి ధన్యులైరి. ఇంతటి యుత్సాహవంతులు నొకే మార్గమున నడుపుట దుర్లభము. వారిని నియమించిన వారి యుద్దేశము లెటులున్నను, మతముయొక్క కట్టుబాట్లెంత కఠినముగ నున్నను, ఉన్నతాదర్శములతో గూడిన కళ యనేక విధముల వ్యాపింపక మానదు. నృపుల చరిత్రలు, యువతీ యువకుల విలాసములు, బుద్ధుని జీవితచరిత్ర, జంతువులు, వేయేల, చిత్రకారునకు కానవచ్చిన యన్ని దృశ్యములు అజంత గుహాకుడ్యముల మీద నుండుట కిదియే కారణము.

నైజాము రాష్ట్రమునందలి ఫరీద్ పురమునకు మూడున్నరమైళ్లు దూరమునను, అజంతయను గ్రామమునకు నాలుగుమైళ్ల దూరమునను, ఇంధ్యాద్రిపర్వతములయొక్క కనుమద్వారమునను అజంతగుహలు కలవు. సుమారు 250 అడుగుల యెత్తుకల అర్ధవలయాకారముగ నున్న పర్వతశిలయం దీయిరువది తొమ్మిది గుహలు దొలువబడెను. ఈ గుహలన్నియు తూర్పునుండి పశ్చిమమునకు 600 గజముల పొడవున వ్యాపించియున్నవి.

వీటివద్ద నిలువబడి నలువైపులజూచిన నాప్రదేశము బుద్ధదేవుని గుణకీర్తనము జేయుచు ఉన్నతావేశము గలిగినట్టియు, ప్రకృతి సౌందర్యమున సృష్టికర్తయొక్క గొప్పతనమును గ్రహింపగలిగినట్టియు బౌద్ధసన్న్యాసులకు దగిన యాశ్రమమని మనంబునకు దట్టును. దగ్గరనే యున్న అస్సైయుద్ధభూమిని స్మరించి, గుహలవైపు జూచిన నాభూమి పవిత్రమైనదనియు, ఎంతటిగొప్ప సంస్థలైనను కాలపరిమితిని నశించుననియు, మానవుడు మహాకార్యములను జేయజాలినను అజేయుడు కాడనియు దోచును. హైందవ నాగరకతియొక్క ఘనతనెల్లెడల వెదచల్లు అజంతగుహల ప్రాంతమున హైందవ పరాభవమును జాటు అస్సై రణరంగముండుట జ్ఞప్తియందుంచుకొనవలసిన విషయము. పచ్చని బీడులు కండ్ల నానందపరుప మధ్య మధ్యను పర్వతశిఖరముల శిలలు “ఆనందమున దుఃఖముకల”దని స్ఫురింపజేయుచుండును. దిగువను జలప్రవాహము సుఖదుఃఖములందు జీవయాత్రవలె వంకరగ గానవచ్చును.

సాధారణముగ “గుహ”లని పేర్కొనబడుచున్న యిరువది తొమ్మిది అజంతనిర్మాణములందు 9,10,19,26 సంఖ్యలచే పిలువబడుచున్నవి. చైత్యగృహములు. కొన్ని పూర్తిగ నిర్మింపబడినవి కావు. ఇవన్నియు నిర్మాణమునందు సుందరముగ నున్నను, వీటియందు గల చిత్తరువులే ముఖ్యముగ గణింపదగినవి. 1,2,4,6,9,10,11,15,16,17,19,20, 21,22,26 సంఖ్యల గుహలందు చిత్తరువు లుండినటులు నిదర్శనములు కలవు. ఇప్పుడు 1,2,9,10,11,16,17,19,21 గుహలు మాత్రము సచిత్రములుగ నున్నవి. 18,22,23 గుహలందు చిత్తరువుల చిహ్నములు కొంచెమైనను లేవు. ఇవి తక్కినవాటికన్న ముందు, అనగా సుమారు క్రీ. పూ. రెండవ శతాబ్దమున, నిర్మింపబడినవి.

వందలకొలది సంవత్సరము లివి సాంద్రారణ్యములందు మరుగుపడియుండెను. హైందవ పండితులు వీటిని జూచియుండినను, ఏ గ్రంథమునందైనను పేర్కొనలేదు. ప్రథమమున 1819 సంవత్సరమున ఐరోపీయుల కివి కానవచ్చెను; కాని వాటి గొప్పతనమును వారును గ్రహింపజాలకపోయిరి. శిల్పచరిత్ర పండితులగు జేమ్సు ఫెర్గుస్సన్ గారు 1843 వ సంవత్సరమున నీచిత్తరువులను గూర్చి ప్రచురించి, వాటి ప్రతులను కాగితములపై వ్రాయింపవలెనని ఈస్టు ఇండియా కంపెనీ యధికారులను బలవంత పెట్టిరి. కొన్నిసంవత్సరములు కడచిన పిమ్మట ఈ యధికారుల యుత్తరువుల ప్రకారము మేజరు గిల్లుగారు 1857 న సంభవించిన సిపాయీల తిరుగుబాటువరకు శ్రమపడి సుమారు ముప్పది చిత్తరువులను వ్రాయగలిగిరి. వీటియం దైదుతప్ప తక్కినవన్నియు సీమలో క్రిస్టలు భవనము ( Crystal Palace) కాలిపోయినప్పుడు నశించెను. కాని యిటులు పాడైన చిత్తరువుల నమూనాలు 1856 న స్ఫియర్ దొరసానిగారును, 1869న ఆమెయే మారుపేరుతోను, 1879 న డాక్టరు బర్గెస్సుగారును వ్రాసిన గ్రంథములందు కానవచ్చుచున్నవి. అటుపిమ్మట 1872 - 1885 సంవత్సరముల మధ్యను బొంబాయి చిత్రకళాశాలాధికారిగ నుండిన గ్రిఫిత్తుగారును, వారి శిష్యులును అజంతచిత్తరువుల ప్రతులను చిత్రించి, కొన్నిటిని రెండు చక్కని గ్రంథములందు బ్రచురించిరి. ఈ కాలమునం దీ పండితులు మేలుతో కొంత కీడునుకూడ చేసినటులు కానవచ్చును. చిత్తరువులు నీటిచే చెడకయుండుటకు గిల్లుగారో, గ్రిఫిత్తుగారో వీటిపైని వార్నిషు పూయుటచే అది యిప్పుడు మాసి, పసుపువర్ణముగ మారి, వాటిరూపునంతను చెడిపెనని హెఱ్ఱింగాము దొరసానిగారు వ్రాసిరి. ఇటీవలను దక్షిణ కెన్సింగ్టను ప్రదర్శనశాల(South Kensington Museum) కాలుటవలన గ్రిఫిత్తుగారు తమ రెండవ గ్రంథ సూచికయందు పేర్కొనిన వాటిలో కొన్నిపటములు నశించెను. మిగిలిన సుమారు నూరు చిత్తరువులును రంగులు వాడుటచే చెడియున్నవి. ఈ అజంతచిత్తరువుల నాశనమునకు కారకులు నైజాము ప్రభుత్వమువారు. వీటిని సంరక్షించుటకు తొలుత వీరు విశేషముగ శ్రద్ధ వహించలేదు. గుహలపై అధికారులుగ నియమింపబడినవారు వాటిని చూడవచ్చిన కళాభిమానులగు యాత్రికుల నానందపరచుటకు చిత్తరువులందలి వ్యక్తుల శిరస్సులను సున్నముతోగూడ బిళ్లలుగగోసి బహుమతులుగ నర్పింప సాగిరి. బొంబాయియందలి ప్రదర్శనమందిరము కొరకు డాక్టరు బర్డుగారు నిటులే చేసిరి. సహజముగ నిట్టి బిళ్లలన్నియు కొలది కాలమునకు చితికి ముక్కలైపోయినవి. నరసంచారము విశేషముగ లేనప్పు డచ్చట చేరిన గబ్బిలములు, పక్షులు, గూడులనుకట్టు పురుగులు మొదలగు వాటివలనను, వీటిఘనత నెరుగని యాత్రికులు గోడలపై వ్రాయుటవలనను, సన్న్యాసుల యగ్నిహోత్రముల పొగవలనను వీటిరూపు చాలవరకు చెడెను. 1819 వ సంవత్సరమున నుండిన చిత్తరువులలో కొన్ని 1879 న కానరాలేదు. 1879 న బర్గెస్సుగారు పేర్కొనిన విప్పుడు కానవచ్చుటలేదు.

1903-04 సంవత్సరమున నీగోడలను శుభ్రపరచి వాటిముందు తీగెలతో జేసిన తెరల నమర్చిరి. నైజాము వారిప్పుడు కొంతధనమును వెచ్చించి, చిత్తరువులను కాపాడుచున్నారు. ఈ ప్రయత్నముల వలననైన నికముందీ యమూల్యములగు చిత్తరువులు చెడకయుండునను నాశకలదు. ఇప్పు డారుగుహలందున్న చిత్తరువులబట్టి తక్కిన గృహములం దుండినవాటి సౌందర్యమును కొంతవరకూహింపనగును. ఒక్కొక్కగుహ అరువది యడుగుల చదరమగుటచే పైని జెప్పిన కారణములవలన నెన్ని యమూల్యములగు చిత్తరువులు చెడెనో యని విచారము కలుగును. గోడలేకాక మీదికప్పును, స్తంభములును గూడ చిత్తరువులచే నిండియుండినవి.

అజంతలో నొక గుహ లోపలిభాగము

ఈ గుహలన్నియు నేకకాలమున దొలిచినవి కావనియు, గుహల శిల్పములు, చిత్తరువులు నొకకాలముననే పుట్టినవి కావనియు పండితులు నిర్ణయించిరి. చిత్తరువులన్నియు నొకే చిత్రకారునిచే వ్రాయబడుట యసంభవము. అనేకులచే చిత్రింపబడి, విధానములందు భేదము కలిగియుండుటచే అనేకశతాబ్దములం దప్పుడప్పు డివి చిత్రింపబడియుండు ననుట నిశ్చయము. ఏయే చిత్రకారు డేయే చిత్తరువులను వ్రాసెనో తెలియరాదు. కాని,

9,10 గుహల చిత్తరువులు క్రీ. త. మొదటి శతాబ్దమునను,

10 వ గుహయందలి స్తంభములమీద నున్నవి బహుశః క్రీ.త. 350 సంవత్సరమునందో, లేక తరువాతనో,

16,17 గుహలం దున్నవి సుమారు క్రీ.త. 500 సం.నను,

1,2 గుహలందు గలవి క్రీ. త. 626-628 సంవత్సరములను,

చిత్రింపబడెనని చెప్పవచ్చును.

అలంకారార్థము చిత్రింపబడిన కొన్నియు, అప్పటి చరిత్ర, ఘన కార్యములను తెలియజేయు కొన్నియు తప్ప. తక్కిన చిత్తరువులన్నియు బౌద్ధమతమునకు జెందినవి. బుద్ధుని జీవితమును, బుద్ధుని రూపమును తెలియజేయునవే కాక, బుద్ధుని పూర్వజన్మములను గూర్చి చెప్పు జాతకకథల నాధారముగ దీసుకొని వ్రాయబడినవి అధికాంశము కలవు. అప్పటి ప్రజలయందు ప్రచారము నొందియుండిన కథ లించుమించుగ నన్నియు నీ చిత్రములవలన మనకు దెలియును. ఇవికాక అవలోకితేశ్వరునియొక్కయు, జీవిత చక్రములయొక్కయు, సింహళమున విజయుడు ప్రవేశించు చరిత్రయొక్కయు చిత్తరువులు మనకు కానవచ్చును.

పాంపేయందు తప్ప ఇన్ని పురాతన చిత్తరువు లొక్క చోట ప్రపంచమునందెచ్చటను లేవట. భావము యొక్క గంభీరత, వైశాల్యము, చిత్రరచనయొక్క పొందిక, రేఖల లావణ్యము వీటి కీర్తికి ముఖ్యకారణములు. కొన్ని చిత్తరువులు ప్రకృతి సహజ పరిమాణములను గలిగియున్నను, అధికభాగము సగము కొలతతో నున్నవి. హైందవ సంప్రదాయముల రీతిని ముఖ్యవిగ్రహములు మాత్రము తక్కిన వాటికంటె పెద్దవిగ నున్నవి. చిత్రము యొక్క యుద్దేశము చూపరులకు వెంటనే గోచరమగుట చిత్రరచనయందు చాల ముఖ్యము. రాధాకృష్ణుల లీలాభి వర్ణనమందు ప్రక్కనున్నగోవు, పుష్పవృక్షములు, సరస్సు మొదలగు నవన్నియు ముఖ్యవిగ్రహములగు రాధాకృష్ణుల ప్రాముఖ్యమునకు తోడ్పడవలెను కాని, వాటిని మించియుండరాదు. ఇట్టి కేంద్రీకరణనైపుణ్యము అజంత చిత్తరువుల యలంకారము. ఉన్నతభావము లతి విపులముగ వీటియందు ప్రదర్శితములగుట వలన నీచిత్తరువులు కళారాధకులను బలవంతముగనో యనునటులు సమున్నత భావసోపానములకు లేవనెత్తును. ఇట్టి సుగుణములతో నిన్ని చిత్తరువు లొకచోట నుండుటనుబట్టి అజంతగుహలు భూలోకస్వర్గమువలె నుండునని యొకపండితుడు వ్రాసెను. ఇది యుత్ప్రేక్షయైనను చూపరులకట్టి యుత్సాహము, ఆనందము కలుగుట సహజము.

హైందవ చిత్రలేఖనమునందు రేఖలే ప్రధానమని యిదివరకు చెప్పియుంటిని. ఈ రేఖారచనకు అజంత పుట్టినిల్లు. అంగపుష్టి, వెలుతురు చాయలు, వస్తువులస్థితి రేఖలతోనే వ్యక్తపరుపబడెను. సనాతన గ్రీకుచిత్రములందు రేఖలు ప్రాముఖ్యమువహించినను అజంత చిత్తరువులందుగల రేఖావిన్యాసముతో నేవిధమునను సరిపోలవు. విూదజెప్పిన కారణములవలన అజంతచిత్తరువుల రంగులు చాలవరకు మాసి చిత్రపుష్టిని తెలుపు లేత చాయలను, వర్ణములు వేరువేరుచోటుల వ్యత్యాసముతో చిత్రించుటవలన గలిగిన విస్పష్టతను, వీటియన్నిటివలన గలుగు సౌందర్యమును అధికాంశము గోలుపోయినవి. తీవ్రతను విడనాడిన వర్ణములు-ముఖ్యముగ నలుపుమాత్ర మిప్పుడు మిగిలినవి. ఒకానొకసమయమున నీచిత్తరువులు గాఢమైనట్టియు, తేజోవంతమైనట్టియు నీలి యాకు పచ్చలతోను, వాటివద్దనే వ్యతిరేకభావమున దోచు ఊదా మట్టిరంగులతోను విరాజిల్లుచుండెను. రంగుల సౌందర్యము నధికపరచునటులు మిక్కిలి ప్రవేశము కల చేతితో దృఢముగ వ్రాయబడిన రేఖలు విరాజిల్లుచుండెను. అజంత చిత్రరచనయెడల సానుభూతికల సుప్రసిద్ధచిత్రకారు లీచిత్రములు వేయిసంవత్సరములక్రింద నెటులుండెనో యటులూహించి వ్రాసిన అజంత గుహల మహిమ లోకమునకు పూర్తిగ వెల్లడికాగలదు.

తొమ్మిదవ గుహయందలి చిత్తరువులందు తప్ప ఇంచుమించుగ నన్ని చిత్రములందును గాఢమైన వర్ణముల (సాధారణముగ నలుపునకు సంబంధించిన రంగుల) మధ్య లేతరంగులతో మనుష్యాకారము లుండుటవలన చిత్రోద్దేశములు స్ఫుటముగ కానవచ్చును. అచ్చటచ్చట లేతరంగులమధ్యను గాఢమైన రంగులతో మనుష్యాకారములను చిత్రించి వీటియందు భిన్న రుచులను జూపజాలిరి. ఈ రెండవతరగతి చిత్తరువులందు నల్లగ కొప్పును చూపుటవలన ముఖము తేజోవంతమై, చిత్రకారుడు చూపజూచిన భావములన్నియు స్పష్టముగ కానవచ్చును.

అజంతగుహల స్త్రీ చిత్రములు[1] మాత్ర మీచిత్తరువులను సుప్రసిద్ధములుగ జేయుటకు చాలును. నవలాది గ్రంథరచయితల గొప్పతనము ముఖ్యముగ వారు సృజించు స్త్రీపాత్రలపై నాధారపడియుండునటులు చిత్రకారుల చాకచక్యమును వారి స్త్రీచిత్రములవలన గ్రహింపవచ్చును. అజంతచిత్రకారు లీవిషయమున మిగుల పరిశ్రమచేసి గెలిచిరి. వీరిచే సృజింపబడిన స్త్రీలందరు సురూపవతులు. వికారము స్త్రీలకిడుట యా చిత్రకార సన్న్యాసుల మతము కాదు. మగవా రెంత సురూపులై యున్నను, మనోహరములగు వస్తువు లెన్ని యున్నను స్త్రీలు ప్రపంచము నలంకరించుటయం దగ్రస్థానమున నుండుటకు తగిన వారలు, అజంతయందు స్త్రీ లిట్టి స్థానము నలంకరించియున్నారనుట నిస్సంశయము. ఎన్ని చిత్తరువులందు వీరు కానవచ్చినను సౌందర్యము లేనివారు మాత్ర మచ్చట కానరారు. పుష్పములచే హిందువులు పవిత్రహృదయముతో దేవు నెటులారాధింతురో యటులు అజంత చిత్రకారులు స్త్రీలతో నృపుల సభలను, వీధులను, కిటికీలను అలంకరించి లలితకళాసరస్వతి నారాధించిరి. మతవిషయికములగు చిత్తరువులనే కాదు - అలంకరించు కొనునటులు, సంభాషించుచున్నటులు, నిలువబడియున్నటులు, సేవ చేయుచున్నటులు, భిక్షమెత్తుకొనునటులు స్త్రీలను చిత్రించి చిత్రకారులు తృప్తి జెందిరి. అలంకరించు కొనుటయం దద్వితీయులని గ్రహించి వారిస్త్రీలను తమకు తోచిన యన్ని భూషణములతోను నింపిరి. స్త్రీ లలంకారముగ నుపయోగపడని చోటుల వారి యలంకారములగు ముత్యములు మొదలగువాటి నలంకారముగ వ్రాసిరి. ఇట్టి స్త్రీల యారాధన యితర చిత్రసమితుల యందు కానవచ్చుట దుర్లభము. స్త్రీల నెన్నివిధముల వీరు చిత్రించినను, నిందారోపణము, పాతివ్రత్యములేమి మాత్రము కానరాదు. ఎచ్చట జూచినను వీరియెడ సోదరీభావము కలుగుచుండును. అచ్చటచ్చట పురుషులవద్ద వీరు కానవచ్చెదరు. కాని యసభ్యత మాత్రము వెదకినను కానరాదు. ఇంతకు మించిన నారీమణుల యారాధన వేరు కలదా?

స్త్రీలనేకాక తక్కినవస్తువులనుకూడ యీ చిత్రకారు లలంకారార్థము వినియోగించిరి. వీటి నత్యంతానందముతో పరిశీలించిన గ్రిఫిత్ గారు ఆశ్చర్యమున మునిగిపోయిరి. పర్షియాదేశపు తలపాగాలను, అంగీలను, గీరల షరాయీలను ధరించి నవ్వును పుట్టించునట్టియు, ఫలపుష్పములమధ్య విహరించునట్టియు, మద్యపానముచేసి యాడుచు పాడుచు నానందించునట్టియు మనుష్యులను, ఏనుగు, ఎద్దు, కోతి మొదలగు జంతువులను, చిలుకలు, బాతులు మొదలగు వింతపక్షులను, పూర్తిగ విడిన, సగము విడిన, విడుటకు సిద్ధముగనున్న కలువ, తామర పూవులను, మామిడి మొదలగు ఫలజాతులను అలంకారములుగ నుపయోగించిరి. వీటియందును చిత్రకారుల భావనాశక్తి, ప్రదర్శనశక్తి, జీవితప్రవాహమునగల యభిరుచి కానబడును.

సుగుణసంపత్తి గల యీయమూల్య చిత్రసంపదవలన సనాతనభారత నాగరికతాధిక్యమును మనము కొంత కనుగొనగలము.




  1. బొంబాయి చిత్రకళాశాల కధ్యక్షులుగ నున్న డబ్ల్యు. ఇ. గ్లాడ్ స్టన్ సోలమన్ గారు వ్రాసిన అజంతగుహల స్త్రీలు అను గ్రంథము ననుసరించి యీ భాగము వ్రాయబడెను.