భారతీయ చిత్రకళ/ప్రవేశాధ్యాయము
భారతీయచిత్రకళ
ప్రవేశాధ్యాయము
భారతదేశము హిందువుల పాలనక్రింద నున్నప్పుడు చిత్రకళ చాల ఉన్నతదశయం దుండెను. విదేశీయులు దేశము నాక్రమించిన పిమ్మట హిందూసాంప్రదాయములు రాజసభలయందు మన్ననలను బొందుట యరుదయ్యెను. నిజమెటులున్నను, పాలకులకంటికి పాలితుల నాగరికత హేయముగ దోచెను. భరతఖండ మించు మించుగ నన్నిశాస్త్రములందును బ్రపంచమునకు మార్గదర్శకమై తన నాగరికతను ప్రాక్పశ్చిమ దేశములందు వ్యాపింప జేసినను, స్వతంత్రమును గోల్పోవుటవలన, ఉపనిషత్తులకును, భగవద్గీతకును జన్మకారణమైన హిందూమతమును, రామాయణ మహాభారతాది ఇతిహాసములు, పురాణములు శాకుంతలాదికావ్యములు కల హైందవ భాషలను, వేదకాలమునుండి ఘనతవహించి వింతనడక లతో వినువారి నందరిని బరవశులనుగ జేయజాలు హైందవ సంగీతమును, విదేశీయులు తృణీకరించిరి. వందలకొలది సంవత్సరములు పరుల యాధిపత్యమును స్వీకరించుచు, ఆత్మగౌరవమును, జన్మభూమియొక్క యాధిక్యమును మరచిన భారతీయులకు పాలకుల తృణీకారమే పరమసత్యముగ గనబడెను.
మతము, కవిత్వము, సంగీతము, వీనితోపాటు హైందవ చిత్రవిద్యయు పాశ్చాత్యుల కనుసన్నలకు లోనయ్యెను. లలితకళ లిచ్చట శైశవదశయం దున్నవని యేబదిసంవత్సరములకు పూర్వము ఆంగ్లేయులు భావించుచుండిరి. హిందూదేశమునుండి తీసుకొనిపోబడిన చిత్తరువులు పాశ్చాత్య చిత్రలేఖన నిబంధనముల ననుసరించియుండక పోవుటవలన వాటిని వింతగ జూచుచుండిరి. ఏదేశమునందైనను నాగరికతతోపాటు లలితకళలును అభివృద్ధి చెందును కాన, అట్టివి హిందూదేశమునందు వారికండ్లకు కానరాకపోవుటచే హైందవు లనాగరికులని వా రభిప్రాయపడిరి. పాశ్చాత్యవిధానముల ననుసరించి గ్రీసు, రోము దేశవాసు లద్భుతములగు శిలా విగ్రహములను నిర్మించిరి కాన ఆయాదేశములను ప్రపం చమునకు మార్గదర్శకములుగ బరిగణించిరి. [1] పిరమిడులు మొదలగు వాటిని నిర్మించి నంతమాత్రమున యీజిప్టు (Egypt) దేశీయులు నాగరికు లైయుండిరని ఐరోపా వ్యామోహితులకు దోచెను కాని, హైందవ నాగరికతాధిక్యమును కొనియాడువారు లేకుండిరి.
చిత్రలేఖనమునకు సంబంధించిన కళలందు విమర్శకుడని ఖ్యాతిగాంచిన సర్ జార్జి బర్డువుడ్ (Sir George Birdwood) గారు "హిందూదేశపు చిత్రలేఖనమును, శిల్పమును కళలుగ బరిగణించుటకు తగ”వని చెప్పిరి. హృదయమునందు గల యున్నత భావములు మేల్కొని చిత్రలేఖనముగ బరిణమించెనని చెప్పుట కొక్కనిదర్శన మైనను వారికి కానరాలేదు. రాయల్ సొసయిటీ ఆఫ్ ఆర్ట్సు (Royal Society of Arts. చిత్రకళాసమితి) వారిచే "హిందూదేశపు మతవిషయిక శిల్పములం దుత్తమమైన”దని కీర్తింపబడిన జావాయందలి బుద్ధవిగ్రహము వీరి కనులకు వికారరూపమున గనబడెను. తరుచుగ బుద్ధుడు పద్మాసనాసీనుడయి యోగనిష్ఠను ఉన్నటులు పూర్వులు ప్రదర్శించుచువచ్చిరి. ఇట్టి విగ్రహములందు వీరి కేమియు వింత కానరాలేదు. ఆత్మయొక్క శాంతిని, నైర్మల్యమును, పాపరాహిత్యమును బ్రదర్శించుటకు దిబ్బరొట్టె యెంత యుపయోగకరమో యిట్టివిగ్రహములు నంతయే యని వారనిరి.
కలకత్తాయందలి చిత్రకళాభవనమున కధికారిగ నుండిన డాక్టరు ఏండర్సన్ (Dr. Anderson) గారు హైందవశిల్పులు సర్వసామాన్యమైన ప్రతిమలనే నిర్మింపగలిగిరని వ్రాసిరి. కాని కొంతకాలమునకు హైందవ శిల్పాధిక్యమును వారు గ్రహించి యింతకంటె ఎక్కువ యనుకూలమగు అభిప్రాయమును వెల్లడించిరి. వెస్టుమకాట్ పండితుడు (Professor Westmacott) కూడ మన శిల్పమును తృణీకరించెను.
రావణుడు దశకంఠుడనియు, బ్రహ్మ చతుర్ముఖుడనియు, వినాయకుడు గజాననుడనియు, రామచంద్రునకు కపులు మిత్రులనియు, విష్ణువాహనము గరుడుడనియు చరిత్రకారులు నమ్మినను, నమ్మకపోయినను, ఇతరులకు మార్గదర్శకులైన పండితులును, వారి ననుసరింప యత్నించు పామరులును, పురాణములే ముక్తికి సాధనములని భావించు భక్తులును, ఈ యసాధారణరూపములయెడ భక్తి విశ్వాసములతో మెలగిరి. ఇట్టివిశ్వాసముగల కళాకోవిదు లీపవిత్రపురాణవ్యక్తుల రూపములను వేనవేలుగ నిర్మించిరి. హిందూదేశమునందును, గ్రీసు, రోముదేశము లందును, ఈజిప్టుదేశమునందును సనాతనముగ బూజింపబడిన యిట్టి రూపములను జూచి, “క్రైస్తవేతరుల దేవతలివి" యని హేళనచేయువారు మన పాలకులగుటంజేసి యిట్టిశిల్పరాజములు, చిత్తరువులు కొంత కాలము నిందల పాలయ్యెను. ఇక వీటితో పాటు మన లలిత కళలన్నియు వీరిబుద్ధికి వికారములుగ దోచుట వింతగాదు. లేఫ్ కేడియో హెర్‌న్ (Lafcadio Hearn) గా రీపరిస్థితులను గనిపెట్టి, “ప్రతి మతము నందును దైవమును గ్రహించిన వారును, కళాసౌందర్యమున కది యనుకూలములని భావించు వారును, ప్రాచ్యఖండవాసుల దృక్పథమును బోధపరచుకొనిన వారును పెక్కు తలలు, పెక్కుచేతులుకల యిట్టి దేవతాప్రతిమల భవ్యతను జూడగల”రని వ్రాసిరి. అగోచరమును, ఆద్యంత శూన్యమును అగు మహాశక్తియొక్క యనంతరూపము లివి యని వీరు తలచిరి. హిందూమతావలంబకులమగు మన కివి యుగ్గుతో పెట్టినవి కనుక పాశ్చాత్యుల సంకుచితదృష్టిని జూచి ప్రత్యుత్తరముగ లోలోన నవ్వుకొను చున్నాము.
పాశ్చాత్యులకు ప్రాగ్దేశముల నాగరికత, రుచులు బోధపడక పోవుటయే యిట్టి పరిస్థితులకు కారణము. జపానుదేశపు చిత్తరువులందు కొన్ని యైరోపా చిత్తరువులను బోలి యుండును; కాన వాటియందలి గుప్తభావములను గనిపెట్టి సారమును చవిజూచిన నాటినుండియు పశ్చిమదేశవాసులకు మన చిత్రకళలయెడ నుండిన తృణీకారభావము తగ్గజొచ్చెను. ఐరోపాయందే కాక, యితర దేశములందును ఈ విద్యలలో బ్రవీణులుండి రనియు, హిందూదేశమునందుకూడ ననాదిగ వీటిపోషణము బాగుగ నుండెననియు వారు తెలిసికొనజాలిరి. అప్పటి నుండియు మన పూర్వులకు చిత్రకళలందు గల యుత్సాహము, ప్రవీణత ప్రపంచమునకు వెల్లడి యగుచున్నవి. శాస్త్రపరిశోధకులు అజంతా, ఎల్లోరా మొదలగు గుహలను గనిపెట్టియు, దేవాలయములను బరిశీలించియు, పురాతన సంస్థాపనలను వెదకియు, చిత్రములయు, శిల్పములయు కాలములను స్థిరపరచి, ఆయాకాలపరిస్థితులనుబట్టి యవి యెట్టిరూపములను దాల్చెనో గ్రహించి, వాటి యౌన్న త్యమును జూటుచున్నారు. జపానుదేశపు చిత్తరువులు హిందూదేశమున వ్రాయబడెనని బ్రమసి, వాటి తారతమ్యమును గ్రహింపక, యీదేశముల వివిధరుచులను దెలిసికొనజాలక, మన యమూల్య నిర్మాణములను దిట్టినవారు ఇప్పుడు తమపొరపాటును గ్రహించిరి. ఈ విషయమై హేవెల్, డాక్టరు ఆనందకుమారస్వామి, మార్షల్, పెర్సీ బ్రౌన్, విన్సెంటు స్మిత్ మొదలగు వారు చేసిన పని కొనియాడదగినది. వెదకినకొలది భారతభూమియందు క్రొత్తవింతలు కానవచ్చుచున్నవి. కొలదికాలమునకు మన చిత్రకళల యౌన్నత్యమును సంశయించువా రరు దగుదురు.
ప్రపంచమునం దంతటను ప్రసిద్ధిగాంచిన ఆంగ్లచిత్రకారుల సమితియగు రాయల్ సొసయిటీ ఆఫ్ ఆర్ట్సువారు హిందూదేశమునందు నూతనముగ లభించిన చిత్రములను, శిల్పములను జూచి, బర్డుపుడ్, వెస్టుమకాట్ మొదలగు వారికి తగిన ప్రత్యుత్తరముగ నిటులు చెప్పిరి:
[2]కళాభ్యాసకులము, కళావిమర్శకులము, కళాకోవిదులమునగు మాకు భారతీయుల యుత్తము శిల్పములందు వారి మత విషయిక పవిత్రభావ సంజనిత హృదయ సంచలనముల యందును, దైవ విషయమున వారి గంభీర భావముల యందును సుసమగ్రసమున్నత కళాప్రదర్శనము గోచరమైనది. బుద్ధుని పవిత్రప్రతిమ ప్రపంచమునందలి యుత్తమ కళాజీవములలో నున్నతావేశ జనకము. జీవ కళాపరిపూర్ణమును, వ్యక్తిత్వవిభాసితమును, విచిత్రశక్తి సంపన్నమునునగు కళావిభవము భారతీయుల కమూల్యైశ్వర్యము. భారతీయులు, కళావిషయమున వారి యద్భుతకార్యదక్షత నాదరించు నితరులు నీ కళావిభవమును భక్తితోనూ, ప్రేమతోను ఆదరింప దగుదురు. దీనినిబట్టి తరతరములనుండి ఆచారప్రాయముగ ఛాయాచిత్రమాత్రములుగ ప్రతి మల నిర్మించుట మాయాదరణను బడయదు; కాని భారతీయుల పూర్వజాతీయకళలనుండియే వారి కళాభివృద్ధికి మార్గ మేర్పడగలదని నమ్మెదము. ఐరోపీయ సుప్రసిద్ధకళాకోవిదులలో నధికుల యభిప్రాయ మిదియేయని మా నమ్మకము. భారతజాతీయ కళాసాధకులు, హైందవ జీవమును, హైందవ భావములను బ్రదర్శించుట యందు తమ కౌశలమును, విచిత్రశక్తులను జూపగలిగినంతవరకు, వారు తమ జాతీయకళయెడ విశ్వాసముతో మెలగునంతవరకు మా యభినందనములకు బాత్రు లయ్యెదరు. ఇతరదేశములందు వారి కనుకూలమగుదానిని, వారి వ్యక్తిత్వమునకు వినాశకరముకాకుండుదానిని, సవినయముగ బరిగ్రహించుచు, భారత భౌతికపరిస్థితులవలన, భారతదేశ చరిత్రవలన, భారత సనాతనమతధర్మములవలన నేర్పడిన వ్యక్తిత్వమును భారతదేశమునకే కాక ప్రాచ్యఖండముల కంతకును జగజ్జేగీయమానమగు కీర్తి దెచ్చిన భారతజాతీయకళాసంపదను గోలుపోవుట కెంతమాత్రము నెడమీయరాదు. సర్ పర్డన్ క్లార్కుగారు (Sir Purdon Clarke) హైందవ చిత్రకళల కగ్రస్థానము నివ్వకపోయినను, భారతీయులకును, భారతభూమికిని భారతకళలే తగినవని యొకానొకచోట జెప్పిరి. భారతనాగరికతా నిర్మితములగుటవలన నవి యిటు లుండకతప్పదు.
ప్రకృతి దేవుని రూపమనియు, అందు ప్రాపంచిక శక్తులు మూర్తీభవించి యున్నవనియు, తత్కారణమున నది పూజార్హ మనియు హిందూదేశీయులు భావింతురు. మనము చేయు సాంఘికసేవ, జంతుసేవ మొదలగు సత్కార్యము లన్నియు దైవారాధనయని వీరి నమ్మకము. ఏ కార్యమును జేయ బ్రారంభించినను జయము నపేక్షించి మనసార భగవంతుని బ్రార్థించెదరు. వారి దైనిక కార్యక్రమము దేవ హితాచారబద్ధము కాన, దానికి వ్యతిరిక్తముగ బ్రవర్తించుట మోక్షదాయకుని యాగ్రహమునకు గురియగుట యని విశ్వసించియున్నారు. అట్టియెడ మన లలితకళలయందు మతము ప్రాముఖ్యము వహించుట వింతకాదు. మన దేవాలయములందు శిల్పనైపుణ్యమును శిల్పులు విరివిగ జూపించుటకును, దేశమునం దంతటను గనబడుచున్న శిల్పములలో నధికాంశము మతమునకు సంబంధించియుండుటకును, బౌద్ధదేవుని జీవితము, శ్రీకృష్ణుని లీలలు, రామచంద్రుని సచ్ఛీలము చిత్తరువులందు విశేషముగ భారతీయులు ప్రదర్శించుటకును కారణ మిదియే.
పశ్చిమదేశీయుల దృక్పథము వేరు: కోరిక లేకుండ శుద్ధపరబ్రహ్మము నారాధించుటకంటె ధనార్జనము, వ్యక్తి సౌఖ్యము, సంఘాభివృద్ధి వారికి ముఖ్యములు. ఈ హేతువున వారి చిత్రకళలకు మత మాధారము కాదు. దైవాభి వర్ణన యం దున్నను లేకపోయినను అవి యింపుగ నున్న వారు తృప్తి జెందెదరు.
ఇట్టి విభిన్న జీవితాశయములు కల లలితకళలు వేరురూపములను దాల్చుటచే ఐరోపీయ కళావిధానముల నాధారముగ గొని చిత్రించిన రవివర్మగారు హైందవ జాతీయకళల నభ్యసించిన వారికంటె నెక్కువగ పాశ్చాత్యదేశములందు కీర్తి బడసిరి. స్వదేశమగు జపానున బొగడ్త బడయజాలని హోకుసాయి (Hokusai) గారు మిల్లెట్, విస్లర్ (Millet & Whistler) మొదలగు ఐరోపీయుల స్తుతికి పాత్రులైరి.
పాశ్చాత్య కళాకోవిదుడు తన చిత్తరువును ప్రకాశము, ఛాయ, వర్ణములతో ప్రకృతియందు వివిధ వస్తుజాల మెటులు కానవచ్చునో యటులే ఛాయారూప మాత్రముగ జిత్రించును. వస్తువుల పొందిక, వర్ణవిభేదము, వికారసౌందర్య ప్రదర్శనము మొదలయినవాని వలన నీతడు చూపరుల నాకర్షించి, తన హృదయము నందుగల యున్న తాదర్శములను, పవిత్రభావము”ను వారికి బోధచేయును. జనులను మొదట నాకర్షించి, చిత్తరువులం దభిరుచిని గలుగజేసిన కాని వారికి గంభీర భావములు మనంబున నాట బ్రయత్నించుట యసంగతమని వీని వాదము. పాశ్చాత్యుల ప్రార్థనమందిరములును, గానసభలును సాంఘికములు. చిత్రకారుడును తన చిత్తరువులను పలువురు జనులు చూచి యానందించుట కుద్దేశించి చిత్రించును.
భారతీయుల దైవారాధనము, సంగీతము ఏకవ్యక్తిత్వమును గోరును. ఒకవ్యక్తి చూచి, యానందించి, యందు సాధారణముగ గుప్తపరచిన భావమునందు మగ్నుడై, భావప్రపంచమున గొలదికాలమైనను మెలగ నుద్దేశింపబడెను కాన బౌద్ధులచే సృజింపబడినవి కాక తక్కిన ప్రాగ్దేశపు చిత్తరువు లన్నియు రేఖలతో చిన్నవిగ జిత్రింపబడెను. వ్యక్తియొక్క హృదయసంస్కరణమున కేకాంతవాసము ముఖ్యమని మన ఋషులు లోక మునకు తమ జీవితములవలన జూపిరి. వారికిని, బుద్ధుడు మొదలగు మతసంస్కర్తలకును జ్ఞానోదయ మేకాంతముననే కలిగెను. అట్టియెడ భారతీయ చిత్రములు వ్యక్తికొరకు వ్రాయబడుట యుచితము.
లలితకళ లితరశాస్త్రములపై నాధారపడియుండ కూడదనియు, నీతిని నేర్పకపోయినను కళావిధానముల ననుసరించినయెడల చాలుననియు నొక వాదము కలదు. అట్టికళలు భారతదేశమున నరుదు. హైందవులు తమకు గల సర్వస్వమును దేవున కర్పింతురు. కాన ప్రత్యేకము వారు సృజించు కళలుమాత్ర మన్యములుగ నుండుట యసంభవము. ఇట్టి కట్టుబాట్లను హైందవ చిత్రకారుడు లక్ష్యపెట్టడు. ఏలయన-
భారతశిల్పి స్వతంత్రుడు. వస్తువుయొక్క యాకృతిని తన యిష్టము వచ్చినట్లు మార్చగలడు. భావము వస్తువునకు దాస్యము చేయుట కెంతమాత్రము నొప్పుకొనడు. వస్తువును భావప్రాబల్యముచే రూపాంతరము నొందించును. అస్థిసంస్థానవిద్యకు (anatomy) కట్టు బడడు. భారత చిత్రకారుడు చిత్రించునది భావము యొక్క రూపము; భావముయొక్క పరిమాణము; భావముయొక్క లావణ్యము; భావముయొక్క సాదృశ్యము. వస్తువు భావము ననుసరించుచుండవలసినదే కాని, భావము వస్తువునందు బంధింపబడదు. పాశ్చాత్యశిల్పులు వాస్తవజగత్తు నొక బంధిఖానాగా జేసికొని యెంతకాలమును దాని యావరణలో దిరుగుటయేకాని, దాని ద్వారమును దెరచి, విముక్తులగుటకు జూడరు. భారతశిల్పి యీ వాస్తవ జగత్తును “పద్భ్యాం పృథ్వీ" దేవతలకు బాదపీఠముగజేయగల్గెను. వారిని జగత్తులో బంధించిలేదు. కమలములపై లక్ష్మీదేవి నధిష్ఠింపజేసెను; నాగముపై చతుర్భుజుని బరుండబెట్టెను; వృషభముపై శివుని గూర్చుండబెట్టెను; వటపత్రమున నారాయణుని నిలిపెను; హంసపై సరస్వతి నూరేగించెను; విష్ణువును జతుర్భుజుని జేసెను. భూలోకముపై స్వర్గకాంతులను బ్రసరింప జేయుటయే భారతశిల్ప లక్షణము. ' _కృష్ణాపత్రిక సంక్రాంతిసంచిక.
భారతశక్తియపారము. భారతనాగరికతయొక్క పటుత్వము మరేనాగరికతకును లేదు. మన మతము బౌద్ధ, జైన, మహమ్మదీయ, క్రైస్తవ మతముల నాకర్షించి యందలి సారాంశమును జీర్ణించుకొని, నూతనరూపముల బ్రజ్వలించెను కాని వాటి యాధిపత్యమునకు తావొసంగలేదు. ఇటులే హైందవ శిల్పము ఇతరదేశపు శిల్పవిద్యల నాకర్షించి క్రొత్తమార్గముల గనిపెట్టి ఖ్యాతిజెందెను. తక్షశిల (Taxila) యందు మొదట ప్రారంభమై గాంధారదేశమునం దంతటను వ్యాపించిన యవనశిల్పము దీనికి ప్రబలనిదర్శనము. పశ్చిమఖండమున బ్రసిద్ధిగాంచిన యిది హైందవశిల్పమునందు లీనమయ్యెను. భారతభూమియందు వాటిరూపు చెడెనని కొందరు పాశ్చాత్య పండితులు తలచినను, హైందవ నాగరికత వీటిని నిజమగు దేశీయకళాభాగములుగ మార్చెనని డాక్టరు కుమారస్వామి, హేవెల్ మొదలగు పండితులు చెప్పుచున్నారు. అక్బరు చక్రవర్తికాలమున మొగలాయీల చిత్రములు మనదేశమును బ్రవేశించి, రాజుల మన్ననలను బొందినను, కొంతకాలమునకు భారతదేశీయుల మనోభావములకు లోనయ్యెను. వేలకొలది సంవత్సరములందు జరిగిన మార్పులలో హైందవవ్యక్తిత్వము ప్రజ్వలించెను. అజంతా చిత్రములకును, మొగలు చిత్రకళావిధానముల ననుసరించిన రాజపుత్రచిత్రములకును తారతమ్యమున్నను, హైందవవ్యక్తిత్వము మాత్రము ప్రబలముగ వీటి యన్నిటి యందును గానవచ్చును.
అజంతా చిత్రకారులు వారికుంచెల నొక మూల బడవేసిన నాటినుండియు, భారతభూమియం దీకళ క్షీణదశకు వచ్చెను. రానురాను రాజపోషణ యరుదగుట వలన బ్రజలయుత్సాహము తగ్గినటులు గానబడుచున్నది. ఈకారణముల వలన హైందవ చిత్రలేఖన చరిత్రయందలి మొదటి ప్రకరణములను వ్రాయుటకు తగిన యాధారములు లేవు. అజంతా, సీగిరియా మొదలగుచోట్ల కుడ్యములపైనున్న చిత్తరువులును, పురాణాది గ్రంథముల యందు గానవచ్చువర్ణనలును కొంత మార్గదర్శకములుగు నున్నవి. లభించిన చిత్తరువులను క్రమముగ పరిశీలించి చూచినయెడల భారతభూమి యీ కళయం దితరదేశములకు వెనుకబడలేదని గ్రహింపగలము.
మనదేశమున మహాపవిత్రమైనవాటితోపాటు నసహ్యకరములును, మానభంగకరములును నగు శిల్పములు, చిత్తరువులు కలవు. ఇట్టివి యమూల్య శిల్పనైపుణ్యమును జాటుదేవాలయ కుడ్యముల కెటు లెగబ్రాకినవో తెలియదు. విషయలోలురగు యువకు లర్పించు ధనమున కాసించి, శ్రీకృష్ణుని జీవితచరిత్రమున కపార్థములను గల్పించు అసభ్యములగు చిత్రములను రాధాకృష్ణులపేరను జిత్రించుచు వచ్చిరి; ప్రబంధములందును, సంగీతమునందును ఇట్టి భావము లచ్చటచ్చట కానవచ్చును. ఇంతమాత్రమున హైందవలలితకళలను విడనాడ జనదు. ఇట్టి శిల్పములందును, చిత్తరువులందును విశేషము కళానిపుణత కానరానందున నివి యల్పుల కృత్యములని నిర్ధారణ చేయవచ్చును. ఇదియునుకాక వీటిసంఖ్య యల్పముగ నున్నది.
విగ్రహారాధనకు మనదేశము పుట్టినిల్లు కాన కొన్ని ప్రసిద్ధవిగ్రహములవలె ఉదరపోషణార్థము వందల కొలది విగ్రహములను కొందరు నిర్మించి విక్రయించుచున్నారు. ఇదివరకు ఖ్యాతిగాంచిన దేవాలయము ననుసరించి యింకొకరు నిర్మింప యత్నించునప్పుడు కూడ ఇతర శిల్పావలంబనము నిరాటంకముగ జరుగుచుండెను. ఇట్టివి మన దేశమునందంతటను కాన వచ్చును. ఉత్తరమున వ్యాపించియున్న బుద్ధవిగ్రహములును, దక్షిణమున బ్రఖ్యాతిగాంచిన “నటరా”జను తాండవ శివుని విగ్రహములును దీనికి నిదర్శనములు. మొగలాయీల కాలమున బ్రఖ్యాత పురుషులయొక్క రూపచిత్రములను జిత్రించి విక్రయించుచు ననేకులు జీవించుచుండిరి. ఇట్టి శిల్పములు, చిత్రములు కళాభాగములుగ గణింపబడవు. వీటికి కారణ భూతములైన సుప్రసిద్ధశిల్పములయు, చిత్రములయు కళానిపుణత వీటి కుండుట యసంభవము.
హైందవ మనగా నేమి ? అజంతా చిత్తరువులం దచ్చటచ్చట పర్షియాదేశపు చిత్రలేఖన విధానము కానవచ్చుచున్నది. కాని యన్నిటిని బరిశీలించి చూచిన యెడల వీటియందును, సీగిరియాయందును పాశ్చాత్యులు విశేషముగ జోక్యము కలుగజేసికొనలేదని కానవచ్చును. మొగలాయీల ప్రభుత్వమునందు వారిదేశపు చిత్రలేఖన విధానములను దేశమున బ్రవేశపెట్టినప్పుడు, ఉత్తరమున రాజపుత్రస్థానమునందును, దక్షిణమున తంజావూరు నందును కళాభ్యాసకులు పొట్టపోసుకొనుటకై యీనూతనవిధానముల నామోదించినను హైందవ వ్యక్తిత్వమును మాత్రము మరవరైరి. ఆంగ్లప్రభుత్వముక్రింద మనవారైరోపావిధానములను గొంతవరకు నభ్యసించినను, తమ తప్పిదమును గ్రహించి దేశీయముల నిప్పుడు ప్రారంభించిరి. భారతభూమియందు పారశీలు, మహమ్మదీయులు, క్రైస్తవులు లక్షలకొలది నివసించుచున్నను, చిత్రములను జిత్రించుచున్నను, ఎవరికి దోచినటులు వారు క్రొత్త త్రోవలను ద్రొక్కుచు నూతనములైన రుచులను జూపుచున్నను, నిజమైన హైందవచిత్రము లెవ్వియన మన దృష్టి అజంతా, సీగిరియాల వైపునకు బోవును. తక్కిన చిత్తరువు లన్నియు పాశ్చాత్యవిధానములచే కల్మషము లైనవి. వీటియందు కానవచ్చు హైందవవ్యక్తిత్వము అజంతా గుహలయందు మూర్తీభవించియున్నది. అజంతాచిత్తరువులు హిందువులచే వ్రాయబడెను. రాజపుత్ర చిత్రములందు గానవచ్చు హైందవ వ్యక్తిత్వము హిందూమతమునకు సంబంధించినది. మహమ్మదీయ, క్రైస్తవ మతములు విదేశీయము లగునటులు మతస్థులు మనకు జూపిన చిత్రలేఖనవిధానములు విదేశీయములు. అందు వలన హైందవ మనగా హిందువులకు సంబంధించినదని మనము నిర్ధారణచేయవచ్చును.
- ↑ ఇవి శిలానిర్మితములు. వీటియందు శిల్పనైపుణ్య మంతగా లేకపోయినను వీటి పెద్దయాకారము ఆశ్చర్యమును గలుగజేయును.
- ↑ "We, the undersigned artists, critics and students of art.........find in the best art of India a loftly and adequate expression of the religious emotion of the people and of their deepest thoughts on the subject of the divine. We recognise in the Buddha type of the sacred figure one of the greatest artistic inspirations of the world. We hold that the existence of a distinct, a potent, and a living tradition of art in a possession of priceless value to the people and one which they, and all who admire and respect their achievements in this field, cught to guard with the utmost reverence and love while opposed to the mechanical stereotyping of particular traditional forms, we consider that it is only in the organic development of the national art of the past that the path of the progress is to be found. Confident that we here speak for a very large body of qualified European opinion, we wish to assure our brother craftsmen and students in India that the school of national art in that country, which is still showing its vitality and its capacity for the interpretation of Indian life and thought, will never fail to command our admiration and sympathy so long as it remains true to itself. We trust that, while not disdaining to accept whatever can be wholesomely assimilated from foreign sources, it will jealously preserve the individual character which is an outgrowth of the history and physical conditions of the country, as well as of those ancient and profound religious conceptions which are the glory of India and all Easten world."