Jump to content

భారతీయ చిత్రకళ/పదునొకండవ అధ్యాయము

వికీసోర్స్ నుండి

పదునొకండవ అధ్యాయము


రాజపుత్ర చిత్రలేఖనము 2

వేదాంతము శాస్త్రముల సారమనియు, దేవునారాధించుటచే జన్మము సాఫల్యము జెందుననియు భావించు హిందూకళాకోవిదులు తమవిద్యను, దేవునిలీలలను గొనియాడుటకే ముఖ్యముగ వినియోగించుటయం దాశ్చర్యములేదు. హిందూమతమును విడనాడి, అలంకారముల నన్నిటిని త్యజించి బౌద్ధమతమును స్వీకరించిన హైందవులును బుద్ధుని చరిత్రను చిత్రరూపమున బ్రదర్శించి తృప్తులైరి. హిందూమతము తలయెత్తిన పిమ్మట శిల్పులు చక్కని దేవాలయాదులను నిర్మించి ధన్యులమైతిమని తలచిరి. అట్టియెడ మొగలు చిత్రరచనవలన గలిగిన కళాసంచలనమును హిందువు లీవిషయమై యుపయోగపరుపక యూరకుండెదరా?

తక్కిన మతములకంటె హిందూమతము చిత్రరచన కెట్టి ప్రతిబంధకమును కలుగజేయకపోవుటయేకాక దానిని బాగుగ ప్రోత్సాహపరచును. పురాణములందు దశావతారముల వర్ణన గలదు. వీరు రాక్షసులను జంపుట, భక్తుల నాదరించుటనుగూర్చి చక్కని కథలందు వివరములు కలవు. ఇవికాక, స్వర్గము, ఇంద్రసభ, మొదలగువాని వర్ణనములు గలవు. నలచరిత్ర, హరిశ్చంద్రోపాఖ్యానము మొదలగు కథ లెన్నియోకలవు. భారత, భాగవత, రామాయణాదు లిట్టి కథలకు పుట్టినిండ్లు. సర్వసాధారణముగ నిందు విశేషభాగములు ప్రజలెరిగినవి. వారిభక్తికి వీటిని దెలుపు చిత్తరువు లెంతయు నుపయోగపడును. ఈ కారణములవలన రాజపుత్రచిత్రములలో ననేకములు పురాణములకు జెందును.

ఉత్తర హిందూదేశమున శ్రీకృష్ణు ననేకు లారాధింతురు. జన్మముతోనే యీ మహాపురుషుడు ప్రజల నాకర్షించెను. కారాగృహమున జన్మించుట, వేరుస్థలమునకు రహస్యముగ గొనిపోబడుట, బాలక్రీడలచే చూచువారి నాకర్షించుట, గోపికలతో విహరించుట, పెరిగి పెద్దవాడైన పిమ్మట ఘనకార్యములను నిర్వహించుట మొదలగునవన్నియు చిత్రకారుని ప్రవీణతను బ్రదర్శించుటకు సహాయపడును. వాని యుదరపోషణయు జరుగును. జయపూరునందు 'రాజమ్‌నామా' యను సచిత్ర మహాభారతముకలదు. ఇందుగల 169 చక్కని చిత్తరువులందు దమయంతి స్వయంవరమునుగూర్చిన చిత్రము చాలచక్కనిది. ప్యారిసునందుగల భాగవతమున 71 సుందరమైన చిత్రములుకలవు.

రామాయణమున రామునిగుణములను జదివి హర్షించనివారుండరు. నీతితో ప్రవర్తింపజూచు ప్రతి హిందువునకు నీ రాజకుమారు డాదర్శపురుషుడు. పరమభక్తుడగు తులసీదాసు రామచరితమానసమను గ్రంథమున నీ రాముని గుణములను గూర్చి పాడెను. క్రైస్తవులకు బైబిలెట్టిదో కొందరు హిందువుల కీగ్రంథ మట్టిదని యొకానొక పాశ్చాత్య పండితుడు వ్రాసెను. సచిత్రమైన యీగ్రంథ ప్రతి యొకటి కాశీరాజువద్దనున్నది. ఐదువందలకు మించియున్న యిందలి చిత్తరువులు బంగారు వెండిపూతలతో, చక్కనివర్ణములతో నలరారుచున్నవి. కొన్నిటియం దనేక విగ్రహము లుండుటవలన సౌందర్యరహితములైయున్నవి. ఒకమూల తులసీదాసును, మరియొకమూల నాతనిగురువును, చిత్రకూటపర్వతమున సీతారామలక్ష్మణు లొకచోటను, కామధేనువాదగ్గరను, ఇంకను ఋషులు, సర్ప ములు, చెట్లు, సరస్సు మొదలగునవియు నొకేచిత్రమున నుండుటవలన భావరహితమైయున్నది. రచనయు నాచార బద్ధమగుటచే జీవకళ కొంచమైనను కానరాదు. “రాముని బాల్యము” అనబడు చిత్తరువు మిగుల సుందరమైనది. వస్తువులపొందిక, ప్రమాణము మొదలగునవి చిత్రకారుని ప్రావీణ్యమును జూపుచున్నవి. యశోదయు, రాముడును మధ్యనుండుటవలన వారిప్రాముఖ్యము బాగుగదెలియును. అంతఃపురమున మెలగు హిందూస్త్రీల లావణ్యము, నాగరికత యిటునటుగల స్త్రీలయం దవతరించియున్నవి. తక్కిన చిత్తరువులందువలె ననవసరముగ దీనియందు స్త్రీపురుషులు, వస్తుసముచ్చయము లేవు. వర్ణికాభంగ మతియుత్కృష్టము.

శైవమతముయొక్క చిత్తరువులు, అనగా శివపార్వతు లొకచోటనున్నటులును, శివుడు తాండవమాడుచున్నటులు మొదలగున వనేకములు కలవు. మోహనసింగుచే వ్రాయబడిన చిత్తరువులు చక్కనివి. ఉమాదేవి శివుని ప్రార్థించుచున్నటులుగల చిత్రము మనస్సు నాకర్షించును. భక్తిపూరితమగు ఉమయొక్క సుందరవదనము, దగ్గరనున్న యిరువురు పరిచారికల పొందిక, పూజాద్రవ్యము లు, దూరముననున్న వృక్షములు, పర్వతము, ఆకాశమున మేఘము, సగముకనబడు చంద్రుడు, అన్నియుగలసి చిత్తరువున నతిరమణీయముగ నున్నవి.

యముడు, వ్యాసుడు మొదలగువారి చిత్రములు బాగుగనున్నవి.

మనంబున బుట్టు ఉన్నతభావములు లలితకళల రూపమున వెలువడును కాన వీటి కన్యోన్యసంబంధము కలదు. దీని నాధారముగగొని రాజపుత్రచిత్రకారులు సంగీతమును, చిత్రలేఖనమున బ్రదర్శింప దమ ప్రవీణత నుపయోగించిరి. ప్రపంచమున నెచ్చట నిట్టిప్రయత్నము జరుగలేదు. లలితకళయగు కవిత్వమును చిత్తరువులరూపమున బ్రదర్శించినప్పుడు సంగీతము నేల నిటులుపయోగ పరుపరాదు ?

హిందూసంగీతమున ఋతుభావమునకు దగిన రాగము, రాగమున కుపరాగములు కలవు. అన్ని విధములగు భావములకు దగిన రాగము లేర్పరుపబడెను. రాగమున కుపరాగములుగ నైదురాగిణులు కలవు. ఈ భావములను వెలిపుచ్చునటులు పెక్కు,చిత్తరువులు కలవు. ఆచారబద్ధులు కానందున నీచిత్రములందు చిత్రకారులు తమ స్వేచ్ఛనంతనుజూపి లావణ్యమును చక్కగ బ్రదర్శింపజాలిరి. వారనుహేస్టింగ్సు రాజప్రతినిధిగ నున్నప్పుడు వీటిని విశేషముగ తమదేశమున కంపెను. హిందుదేశమునం దిప్పటికిని అనేకములుకలవు. ఇట్టి రచనయందు పహాడీ చిత్రకారు లితరులను మించిరి.

కాళిదాసాది మహాకవులు రచించిన నాటకములందలి, ప్రబంధములందలి నాయికానాయకుల యన్యోన్య ప్రేమను జూపు చిత్రములు, ముఖ్యముగ రాధాకృష్ణుల లీలలు హైందవ చిత్రకారులచే చిత్రింపబడినవి. ఇందధికాంశము 17, 18, శతాబ్దములందు పహాడీ చిత్రకారులు వ్రాసినవి.

మొగలుచిత్రలేఖకుడు వేటయందు, పందెములందు మృగములను వ్రాసెను. చక్రవర్తులచే నియమింపబడినప్పుడు జంతువులను, పక్షులను ప్రత్యేకముగ వ్రాసెను. కాని హిందువులగు రాజపుత్రుల దృక్పథము వేరు. వీటికిని సుఖదుఃఖములు కలవని గ్రహించి సానుభూతిని - కొన్ని సమయములందు ప్రేమను - జూపుచుండిరి. పురాణకథలను జదివినవారు కాన గరుడపక్షి, హంస, నెమలి, యెలుక, యెద్దు, గేదె మొదలగునవి తాము పూజించిన దేవతల వాహనములనియు, ఏనుగు విష్ణువుచే నుద్ధరింపబడిన భక్తుడనియు, వానరులు శ్రీరాముని బంటులనియు, గోవులు శ్రీకృష్ణుని చెలికాండ్రనియు గౌరవముతోను, భక్తితోను స్మరింతురు. హనుమంతుని విగ్రహమున కోతికిగల చలనభావము కానరాదు. కృష్ణుని దగ్గరనున్న యావులందు దుష్టస్వభావ మేమాత్రము నుండదు. స్త్రీపురుషులవలె నివియు నలంకృతములు. ఇట్టి భావములు కల రాజపుత్ర చిత్రకారులు పక్షులను, మృగములను చక్కగ వ్రాయజాలుట వింతకాదు. పురాణములందు గౌరవస్థానము నీయబడని మృగములు కూడ వీరి చిత్తరువులం దెంతయు స్వాభావికముగ నున్నవి.

రాజపుత్రచిత్రకారులు రేఖలనే కాక చాయను, వెలుతురును చక్కగ చిత్రించిరి. చంద్రుని ప్రకాశము పెక్కుచిత్తరువులందు గలదు. కొన్ని చోట్ల వెనుకవైపున, మార్గమున బసలందు మంటలవెలుతురు వేరొకవైపున బ్రసరించుచున్నటులు గలదు. ఈ రెండు వెలుతురుల మేళవింపతిమనోహరము. సువర్ణరజమును తొలుతబూసి, పిమ్మట వర్ణములను బూయుటవలన నిందు వీరు నూతన మైన సొంపును గూర్పజాలిరి. నీటిపై చంద్రకాంతి ప్రసరించునటులు చూపుటకు రజతరజము నుపయోగపరచిరి.

రాజపుత్రచిత్రకారులలో జశ్వంతు, తులసి, మోహనసింగు, గోవిందసింగు, ఉదాత్‌సింగు, గులాము రజా, గులాము ఆలీఖాను, బలదేవు, కపూరుసింగు మొదలగువారిని ప్రవీణులుగ బేర్కొనవచ్చును.

దక్షిణహిందుస్థానమున పదునారవ శతాబ్దమునాటి చిత్రములందు పర్షియావిధానములు కానవచ్చుచున్నవి. ఔరంగజేబుయొక్క దక్షిణ దండయాత్రయందు, మొగలాయీల పోషణ తగ్గుటవలన స్వపోషణార్థమై చాలమంది చిత్రకారులు దక్షిణమునకుపోయి ఢిల్లివిధానములను బ్రవేశపెట్టిరి. దక్కనునందలి పాలకుల చిత్తరువు లనేకములు కలవు కాని యెన్న దగినవి కావు. నైజామున ఆనెగొందెయందుగల జంగము మఠమున గొందరు ఫకీరుల, వారి యాశ్రితుల చిత్రములు చక్కనివి కలవుకాని అవి ఉత్తరహిందూదేశపు చిత్తరువులతో సరిపోల్పదగవు.

ఉత్తర హిందూస్థానమునతో విశేషము సంపర్కములేని జయ, పరోజయ, విజయ అనుముగ్గురు చిత్రకారులు దక్షిణముననుండిరని తారానాధుడు వ్రాసెను. తిరు



4. నారీ కుంజరము




5. నారీ తురగము

మలెయని జైనుల యాత్రాస్థానమున గోడలపై గొన్ని చిత్తరువులు కలవు. ఇందలి శాసనములబట్టి యివి పదునొకొండవశతాబ్దమున వ్రాయబడినటులు నిర్ణయింపబడెను. ఒక యిటుకగోడపై నొకచక్రాకారము కలదు. దీనిమధ్యను జైనులమతగురువగు తీర్థంకరుని చిత్రముకలదు. చక్రము పండ్రెండు భాగములుగ విభాగింపబడి యుండ, ఒక్కొక్కభాగమున స్త్రీల, జంతువుల చిత్తరువులు కలవు. చక్రము నాల్గువైపుల నెగురుచున్నటులు నప్సరసలు కలరు.

కాంచీపురమునందుగల కామాక్షి, వరదరాజ పెరుమాళుల దేవాలయములందును చిత్తరువులు కలవు. ఇందొకదానియందు ఏనుగుపై విల్లుబూనిన పురుషుడున్నటులు గలదు. ఏనుగు నవనారీకుంజరము, అనగా నా యాకారము తొమ్మండుగురు స్త్రీలతో నేర్పరుపబడెను. దగ్గరనే మరియొక చిత్రమున నశ్వముపై స్త్రీ కలదు. గుర్రము అయిదుగురు స్త్రీలతో నేర్పరుపబడెను. పురుషుడు మన్మథుడు; స్త్రీ కుంతీదేవి. ఈ చిత్తరువులు చాల చక్కనివి. తంజావూరును పాలించిన శరభోజుని కాలమున, అనగా పదు నెనిమిదవ శతాబ్దమున కొందరు రాజపుత్ర చిత్రరచనను రాజాస్థానమున బ్రవేశపెట్టిరి. క్రీ. త. 1833-55 సంవత్సరములందు బాలించిన శివాజీవలన వీరాదరింపబడి దంతము మీదను, కర్రమీదను చక్కని చిత్రములను వ్రాసిరి. ఉత్తరు హిందూదేశమున 'జారా’ యని పిలువబడు రకమున నీటి రంగులతో చిత్రించి బంగారుపొడితోను, మణులతోను చిత్రముల నలంకరించుచుండిరి. నూనె రంగులతో వీరు వ్రాసిన రూపచిత్రములు కలవు. ఇవి యిప్పటికిని తంజావూరు, పుదుక్కోట లందు గానవచ్చును. శివాజి మరణించిన పిమ్మట వీరు చెదరిపోయి చిన్న చిన్న చిత్రములను వ్రాయుచు బజారులం దమ్ముచుండిరి. వీటియందు కళాచిహ్నము లరుదైనను పూజకొరకు విక్రయమగుచున్నవి. కొన్ని చిత్రకారుల కుటుంబములు కంసాలివృత్తి నవలంబించిరి.

మైసూరునందును హిందూచిత్రలేఖన మొకశతాబ్దమువరకు నేదోవిధమున నభ్యసింపబడి కృష్ణరాజ ఒడయరు పాలనమున నభివృద్ధి జెందెను. తన కొలువున ననేక చిత్రకారులను చేరదీసి, పోటీపరీక్షల నేర్పరచి, చక్కని చిత్రములను వ్రాయించుచుండెను. దంతముమీద నీతడు చిత్రింపించిన రూపచిత్రములు మైసూరుకోట యందిప్పటికిని గలవు. 1868 సం॥ మున నీరాజు మరణించినపిమ్మట నీ చిత్రకారులందరు పోషణలేక తమవృత్తిని మానుకొనిరి.

1749-78 సం॥ములలో సింహళమును బాలించిన కీర్తి శ్రీరాయసింహుడు అప్పటికచ్చటగల యీకళను బ్రోత్సాహపరచెను. దీనికి ఫలముగ 'సిల్వతెన్న' మొదలగు చిత్రకారులు ‘రిదీ విహారము’నను, 'దెగాలు దొరువ’ యందును జాతక చిత్తరువులను వ్రాసిరి. ఇది సుప్రసిద్ధ చిత్తరువులు కాకపోయినను అలంకారార్థముపనికివచ్చును.

మరికొన్ని చిత్తరువులు కలవుకాని వాటినిచ్చట పేర్కొనుట యనవసరము.