Jump to content

భారతీయ చిత్రకళ/పదియవ అధ్యాయము

వికీసోర్స్ నుండి



పదవ అధ్యాయము


రాజపుత్ర చిత్రలేఖనము 1

బౌద్ధమతమునందు ఉత్సవములకు తావులేదు. మానవజీవనముయొక్క ప్రాముఖ్యమును గ్రహించి, నిర్వాణమును బొందుటకు శక్తినంత నుపయోగించుటకు పాపపూరితములైన సాంసారికసుఖముల నన్నిటిని త్యజించి, శిరోముండనమును గావించుకొని, సన్న్యసించి, భిక్షాటనము గావించుచు పాటుపడుట యీమతముయొక్క ముఖ్యోద్దేశము. ఇంత త్యాగముచేసి యీమతమును స్వీకరించినవా రితరులను గూడ తమవలె నిర్మల ప్రవర్తనమును గలిగియుండునటులు చేయ బ్రయత్నించుట సహజము. అటులుగానియెడల వీరు చిత్రలేఖనమును బోషించుటకు బదులు నిర్మూలమును జేయుటకు తోడ్పడియుండెడివారు.

భారతదేశమున బౌద్ధమతముయొక్క ప్రాముఖ్యము తగ్గిన వెంటనే మరల హిందూమతము తల యెత్తెను. సంఘమున నానందమున మెలగుటకు సాధారణముగ మానవులు కోరుచుందురు. కాన, బౌద్ధమతము యొక్క కాఠిన్యమునకు లోనై యణగియుండి యిప్పుడు కలిగిన యనుకూలతను జూచి హిందూమతమున హిందువు లనేకములైన దర్శనీయములగు నుత్సవాద్యాచారములను బ్రవేశపెట్టిరి. హిందూమతము తన పరాజయమునం దనేకవిషయములను నేర్చుకొని నూతనరూపమును దాల్చెను. జాతిభేదము, పురాణముల ప్రాముఖ్యము, పూజావిధానములు, ఉత్సవములు మొదలగునవి ప్రజల నాకర్షించుటకు తలలెత్తెను. విగ్రహారాధన ప్రధానముగ నెంచువారికి బౌద్ధులచే బోషింపబడిన చిత్రలేఖనము చాలలేదు. మనుష్యాకారమున విగ్రహముండవలెనను కోరిక పెరుగుటచే చిత్తరువులకు బదులు శిలావిగ్రహములు నిర్మింపబడెను. దేవాలయములు శాశ్వతముగ నుండవలెను. కాన నిట్టి విగ్రహములు చిత్తరువులను మించినవని తలచిరి. శైవులకు, వైష్ణవులకు గలిగిన మతద్వేషములందు పోటీయెక్కువయై యెవరి దేవాలయములను వారే నిర్మించుకొని యలంకరింపజొచ్చిరి. ఎచ్చట జూచినను చక్కని శిలానిర్మితములగు దేవాలయములు కానవచ్చుటకిది - యొకముఖ్యకారణ మయ్యెను. శిల్పము నందు కళా భ్యాసకులు నియుక్తులగుటవలన చిత్రలేఖనము వెనుకబడెను.

హైందవనాగరికత యొక్కయు, మతము యొక్కయు వ్యక్తిత్వమును మొదటినుండియు గాపాడిన భారతజాతియొక్క పట్టుదల, మార్పులయెడలగల యనుమానమునందును చిత్రకారులకు లాభకారియయ్యెను. ఎన్నిమార్పులు కలిగినను, శిల్పమెంత యామోదింపబడినను, బౌద్ధులకాలమున విజృంభించిన చిత్రలేఖనము సంపూర్ణముగ మాయముకాక యచ్చటచ్చట నభ్యసింపబడుచుండెను. కాని యీకాలపు చిత్తరువు లించుమించుగ నన్నియు నశించుటవలనను, తక్కిన యాధారము లెవ్వియు లేకపోవుటవలనను, చిత్రలేఖన మెట్టిమార్పులను జెందెనో, యెవరిపోషణ బడసెనో చెప్పుట దుర్లభము. తొమ్మిదవశతాబ్దమున రాజపుత్రులు నిద్రావస్థనుండి లేచుటయు, గుజరాతు రాజుల పరిపాలనపటుత్వమువలన నుత్తరహిందూదేశముసంతను వారిగొప్పతనమును స్వీకరించుటయు చిత్రలేఖనమునకు కొంత యనుకూలముగ నుండెను. మహమ్మదీయులు భారతదేశమును జయించుటకు వీలగు పరిస్థితులను గల్పించిన రాజపుత్రుల యంతఃకలహములకు పూర్వము చిత్రిం పబడిన కుడ్యచిత్రములు జయపూరు, బికనీరు, జోదుపూరు, ఉదయపూరుల పురాతన రాజగృహములందు గనబడుచున్నవి. పర్షియా, చైనాలవిధానములు వీటియం దుండుటవలన బౌద్ధచిత్రములకును, మొగలాయీల కాలమునాటి రాజపుత్ర చిత్రములకును సంబంధ మేర్పడుచున్నది. ఎనిమిదవ శతాబ్దమున మహమ్మదుఖాసిము సింధును జయించుచున్నప్పుడు కొందరు చిత్రకారు లాతనివద్దకువెళ్లి యావీరుని రూపచిత్రమును వ్రాయుట కనుమతి నడిగిరట. పదునైదవ శతాబ్దమున జైనమత గ్రంథములందు కొన్ని చిత్రములు కలవు. దేశమం దంతటను వ్యాపించిన విద్య యొక్కపరి నశించుట చరిత్రకు విరుద్ధము. అక్బరుకాలమున మొగలు చిత్తరువులనుజూచి హిందూచిత్రకారులు తమదేశాచారములను మరువక వ్రాయజాలుట యీ వాదనను బలపరచును. ఐనను అక్బరుచక్రవర్తి కాలముననే రాజపుత్ర చిత్రలేఖనమును విజృంభించెననుట పొరపాటు. మొగలు చిత్రలేఖనము రాజదర్బారు నుండి ప్రజలందు వ్యాపించిన పిమ్మటనే యీ హిందూవిధానములు విశేషముగ నభ్యసింపబడెను.

బౌద్ధమతముతో పెద్దయాశ్రమములు, చైత్యగృహములు త్యజింపబడెను. శిల్పముయొక్క ప్రాముఖ్యము హెచ్చినకొలది దేవాలయకుడ్యములమీద పెద్దచిత్తరువులకు చోటులేకపోయెను. మొగలు చిత్రకారుల సాంప్రదాయముల ననుసరించి హిందువుల రాజదర్బారులం దామోదింపబడుచుండిన చిత్తరువులవలె చిన్నవిగ వ్రాయ బ్రారంభించిరి. చూచుట కివి మొగలు చిత్రములను బోలియున్నవికాని విమర్శించిచూడ అజంతమొదలగు హిందూచిత్తరువుల నమూనాలవలెనుండును. రేఖలప్రాముఖ్యము యిందు బాగుగనున్నది. భావమునందును, మతావేశమునందును, రాజపుత్ర చిత్రరచనకును, మొగలు చిత్రరచనకును చాల భేదముకలదు. మొగలు చిత్రములు ప్రకృతిననుసరించియుండును. హిందూచిత్రములకు భావమే యాధారము. మహమ్మదీయమతము మహమ్మదుయొక్క బోధనపై నాధారపడియుండునటులు, మొగలు చిత్రలేఖన మేదేశపాలకులనో యాశ్రయించి యుండును. హిందూమతముయొక్క మహావ్యక్తిపైనే కాక ప్రజలనమ్మకముపై నాధారపడినటులు హిందూ చిత్రలేఖనమును ప్రజల నాశ్రయించియుండును.

మొగలు చిత్రలేఖనవిధానములు ప్రజలందు వ్యాపించి హిందువుల యుద్దేశముల కనుగుణముగ మా రెను. ప్లాసీ యుద్ధానంతరము - అనగా పదునెనిమిది, పందొమ్మిది శతాబ్దములం దీచిత్తరువులు విశేషముగ వ్రాయబడెను. హిందువుల కనేకవిధముల బాధ కలుగజేసిన మొగలు సామ్రాజ్యముయొక్క పతనము, మహారాష్ట్రుల రాజ్యస్థాపనము, జైనమతవిజృంభణము ప్రజలందు నూతనోత్సాహమును బుట్టించుటచే మొగలు చక్రవర్తుల పోషణ లేకపోయెనను చింత చిత్రకారులకు లేకపోయెను.

రాజపుత్రస్థానమున జయపూరు రాజ్యము చిత్రలేఖనమునకు ముఖ్యమైన యాశ్రమముగ నేర్పడెను. అక్బరునకు పూర్వము స్థాపితమై మొగలు సామ్రాజ్యానంతరముకూడ వాడుకలోనుండిన జయపురకలము ననుసరించి చిత్రకారులు చక్కని చిత్రములను వ్రాయుచుండిరి. డేగయొక్క చిత్ర మెంతస్వభావసిద్ధముగ నున్నదో చూడుడు. ఈ ప్రాంతముననే ఆల్వారునందు చిత్రింపబడిన చిత్రములు కొన్ని చక్కగనున్నవి. ఇచ్చట గ్రంథాలయములందు గానవచ్చు 'గులిస్తాను' అను పురాతన గ్రంథమునగల జంతువుల చిత్రము లతి మనోహరములు. కాని యీచిత్ర సమూహమునందలి రూపచిత్రము లాచారప్రాయములుగను, జీవకళారహితములుగను ఉండుటవలన బాగుగలేవు.

మొగలు సామ్రాజ్యము విజృంభించుటయు, చిత్రలేఖనమున ఢిల్లీ యందుగల యాదరణయు నీరాజపుత్ర చిత్రకారుల ననేకుల నాకర్షించెను. మొగలులకు ముఖ్యస్థానములగుడిల్లి, ఆగ్రా, లాహోరు మొదలగు మహా పట్టణములందు విదేశపు చిత్రలేఖనము తోపాటు హిందూచిత్రరచనయు నభ్యసింపబడెను కాని ఔరంగజేబునకు కళల రుచి తెలియక పోవుటవలనను, ఖోరానుబోధనయే ప్రమాణ మగుటవలనను, చిత్రకళాకోవిదులు కాశీ, లక్నో, హైదరాబాదు, పాట్నామొదలగు స్థలములందు జీవనోపాధిని కలుగజేసికొనుటకు చెదరిపోయిరి. ఇప్పటివలె నా కాలమున ప్రయాణ సౌకర్యములు

లేకుండుటచే ఎక్కడివారక్కడనే నిలిచిపోయి ఒక్కొక్క స్థలమువారు ఒక్కొక్కవిధమున చిత్తరువులను వ్రాయుచువచ్చిరి. ఈ నూతనచిత్రములందు కంగ్రాచిత్తరువులు ముఖ్యమైనవి. పంజాబునందుత్తరభాగమున హిమాలయపర్వత సానువులందు కంగ్రా, లేక నగరుకోటయను శత్రువుల కభేద్యమగు దుర్గముండెను. ఇచ్చట పాలించుచుండిన హిందూరాజుల పోషణయం దేకాలమునుండియో కొందరు చిత్రకారులు చిత్రములను వ్రాయుటయే వృత్తిగ నేర్పరుచుకొనియుండిరి. 1621. వ సంవత్సరమున జహంగీరు చక్రవర్తి యీ కోటను వశపరచుకొనినపిమ్మటగూడ వీరివృత్తినివదలక చక్కనిచిత్తరువులను చుట్టునున్న ప్రదేశములందు వ్యాపింప జేయుచుండిరి. నూరుపూరు, బసోహ్లి, చంబ, జమ్ము మొదలగు కంగ్రా పరిసరదేశములందును చిత్రకారులుండుట వలన వీరిని కంగ్రాచిత్రకారులని పిలుచుటకంటె “పహాడి” అనగా కొండప్రదేశపు చిత్రకారులని పిలచుట సమంజసమని యిప్పటి కళావిమర్శకుల యభిప్రాయము.


సవాయి జయసింహుడు

యన్. సి. మెహతాగారి 'ఇండియన్ పెయిటింగు' అను గ్రంథమునుండి.

పదునేడవ శతాబ్దపు సహాడి చిత్తరువులు కొన్ని లభించెను. అంతకుముందు చిత్తరువొక్కటియు లేకపోవుటచేతను, మొగలు సామ్రాజ్యమున చిత్రకళకు పోషణ మీకాలముననే తగ్గుటచేతను డిల్లీ మొదలగు పట్టణములనుండియు చిత్రకారు లీప్రాంతములకు వచ్చి కంగ్రాయొక్క ‘కటోచి’రాజుల నాశ్రయించినటులు గానబడును. ఈ చిత్రకారుల సమూహము పదునెనిమిదవ శతాబ్దమున 'సంసారచంద్' అను రాజుపాలనయందు మిక్కిలి యున్నతదశయం దుండిరని వీరు చిత్రించిన చిత్రములవలన దెలియుచున్నది. పంజాబునందు వీరిచిత్తరువు లనేకములు శ్రీమంతుల గృహములందునగలవు. మఱియు 1902-3 సంవత్సరములలో ఢిల్లి ప్రదర్శనమునజూపబడినవి రెండువందలకు మించెను.

తక్కిన రాజపుత్రచిత్రములవలె నివియు మొగలుచిత్రములటులు గానవచ్చును. పై జెప్పిన యంశములనుబట్టి చూడ నీ చిత్రకారులు మొగలువిధానములు కలవాటుపడి హిందూసాంప్రదాయముల ననుసరించిరని గోచరించును. అజంతాచిత్తరువులవలె వీరి చిత్రములందు జీవ కళ, ఆవేశము, ఆలోచనాప్రతిభ అంతగా కానరావు. కాని, రేఖల లావణ్యమునందును, వర్ణముల సొగసునందును, వస్తుపరిచయము నందును, వివరముల ప్రదర్శనమునందును తక్కిన యీకాలపు చిత్తరువులకు తీసిపోవు.

ఇవియన్నియు రాజులకొరకును, ఆప్రాంతపు ప్రజలకొరకును వ్రాయబడినవి. రానురాను వీటికీర్తి నలుదిశల వ్యాపించుటచే దూరదేశములందు నాదరణ బడయజొచ్చెను. రంజిత్ శింగు మహారాజుయొక్క లాహోరు, అమృతసరుదర్బారులం దామోదింపబడుటయే యచ్చటి యుద్యోగుల రూపచిత్రములు వీటియం దనేకములు కానవచ్చుటకు కారణము. పంజాబు శ్రీమంతుల గృహములందివి యిందువలననే యిప్పుడును ఉన్నవి.

పందొమ్మిదవశతాబ్దమున నీప్రాంతములకు మంచి మార్గములు వేయబడుటచే నితరదేశముల నాగరికత యిచ్చటను వ్యాపించెను. దీనితో పహాడి చిత్రరచనయొక్క వ్యక్తిత్వము నశించెను. సంకరచిత్రములు వ్రాయబడుటతో తొలిలావణ్యము తగ్గిపోయెను. ఇంతకెక్కువ రాబడివచ్చునని వీరి కుమారులు ప్రభుత్వపు ఉద్యోగముల బ్రవేశించి తమ వృత్తిని మానుకొనిరి. ఈ పరిస్థితులకు ప్రకృతియు దోడ్పడెను. 1905 వ సంవత్సరము ఏప్రిలు 4 తేదీని పెద్ద భూకంపము కంగ్రానగరమును, చుట్టునున్న ప్రదేశమును సంపూర్ణముగ నశింపజేసెను. ఇందు చిత్రకారులలో నధికసంఖ్యాకులు మరణించిరి. దీనితో నీపహాడి చిత్రరచన సంపూర్ణముగ నంతమొందెను.

కాశీ మొదలగు స్థలములందు పెక్కు చిత్తరువులు లిఖింపబడెను కాని వాటిచరిత్రనుగూర్చి వివరములు అంతగాలేవు. ప్రత్యేకముగ తక్కిన చిత్తరువులకును, వీటికిని విశేషము భేదము లేదు కాని వీటివిమర్శన లాభకారికాదు.

[1]రాజపుత్ర వర్ణ లేపనము ముఖ్యముగ ప్రజలకళ, సహజముగ నిది వారి యానందౌన్నత్యముల కొరకు నిర్మితమయ్యెను. పల్లెటూరివాని నిర్మల జీవితము, వాని పనిపాటులు, వాని మతవిషయకోత్సవములు, వాని గృహమున కష్టసుఖములు, మతవాతావరణము లిందు ప్రతిబింబితము లయ్యెను.

తమకు కానవచ్చు చక్కని మానవజీవితమును కొన్ని కుంచెగీటులతో చిత్రరూపమున నిప్పటి యాంగ్ల చిత్రకారులు విలాసార్థము ప్రదర్శించుచున్నారు. ఇట్టి సాధారణ చిత్రములను తైలవర్ణములతో గుడ్డమీద వ్రాయుట సుళువుగనుండదు. రాజపుత్ర చిత్రకారు డీతర గతిలోజేరును. మొగలుదర్బారులందు కావలసివచ్చిన చిత్రములవలె వజ్రవు తునుకలతోను, వెండి బంగారు పూతలతోను చిత్తరువును సృజించుట యీతనికి లాభకారికాదు. ఇట్టి విలువగల పరికరము లీతనికి లభించుటకు నవకాశములేదు. తన దైనికజీవితమున గానవచ్చు కంసాలి, వడ్రంగి, సాలె, చమికీపనివాడు, అద్దకము పనివాడు తమ తమ పనులందు నియుక్తులైయున్నటులు ననేకచిత్రములను వ్రాసెను. పనిముట్లు, దగ్గర నాడుకొనుచున్న పిల్లలు, పిల్లలనాడించుచు నానందించుచున్న స్త్రీలు ఈచిత్రములం దుండుటచే మొగలు చిత్తరువులకులేని ప్రాముఖ్యము వీటికి కలదు. ఉదరపోషణకొరకు పాటుపడు వీరికష్టసుఖములు, తోడి పనివాండ్రయెడలగల సానుభూతి వీటియం దద్భుతముగగలవు.

పాములవాని చిత్రమును జూడుడు: పాము, దానిబుట్ట, బుట్టకుగట్టుబట్ట, పాములవాని బీదవస్త్రములు, వానిమూట అన్నియు నేకీభవించి సహజముగ నున్నవి.

[2]ప్రయాణమున సాధారణముగ గలిగిన యానంద విచారముల ప్రదర్శనమునందు రాజపుత్రచిత్రకారు డితరులను మించెను. ఇప్పటి ఇంజనుల సహాయమున బ్రయాణము జేయుటకు పూర్వము హిందూదేశమున బ్రయాణము తాపిగను, ఆనందముగను జరుగుచుండెను ................ చిత్తరు వాహ్లాదకరముగ నుండుటకు మధ్యాహ్నపు విశ్రాంతి, రాత్రియందు బసలవద్ద మంటలు, పల్లకియందు దీర్ఘప్రయాణము మొదలగునవన్నియు నీతడు నియతితో జూపెను. ప్రయాణికులకు మర్రిచెట్టుయొక్క చల్లని నీడ యాహ్లాదజనకము. ఈగ్రంథమునగల చిత్తరువునందు ప్రయాణికు లీ వృక్షముచుట్టు నున్నారు. ముందున నలసట జెందిన కూలివాడు తనబరువును దింపి యొక వస్త్రముపై దేహమును జాచియున్నాడు. దూరమున మరియొకడు విశ్రాం తిసుఖము ననుభవించుచున్నాడు. నూతివద్దనున్న యొక స్త్రీ జలమును పోయుచుండ నస్త్రపాణియగు భటుకు దాహమును దీర్చుకొనుచు

న్నాడు. క్రింద నొక సేవకుడు తన యజమానునికొరకు హుక్కాను సిద్ధపరచుచున్నాడు. యజమానుడొక యద్దమును చూచి కురులను దువ్వుకొనుచుండ నొక స్త్రీ కాళ్లు పట్టుచున్నది. మరియొకతె విసరుచున్నది. శునకము, ఖడ్గము, హుక్కాను బీల్చు మరియొక భటుడు మొదలగునవన్నియు జూడ నీచిత్రకారునకు వస్తుపరిచయము గోచరము కాగలదు. ఇది పదునెనిమిదవ శతాబ్దపుపహాడి చిత్తరువు.

పంజాబున చంబాను పాలించుచుండిన రాజుయొక్క రూపచిత్రము లనేకములుకలవు. ఇందొకదానియందు నృపుడు రాణితోను, యువరాజుతోను ఉన్నటులుగలదు. సహజముగ రాజపుత్ర చిత్రకారుడు రూపచిత్రములను వ్రాయువాడు కాడు. కాని భారతభూమినంతను బాలించుచుండిన ఢిల్లీ చక్రవర్తు లామోదించుటవలన గలిగిన జనాంగీకారమువలననో, యుదరపోషణకొరకో చక్కని రూపచిత్రములను చిత్రించెను. జయపూరు నందు చిత్రింపబడిన వాటికిని, కంగ్రాయందు చిత్రింపబడిన వాటికిని భేదముకలదు. జయపూరుచిత్రములు తక్కిన రాజపుత్రచిత్రములవలె రేఖానిర్మితములుగను, ఆచారప్రాయములుగను, అర్ధభాగము కనబడునటులును, పలుచని వర్ణములతోనుగలవు. రేఖలు సన్నముగను, ప్రాణపూరితముగను ఉన్నవి. కంగ్రా చిత్రములందు వర్ణములు గాఢముగను, వెలుతురుచాయలు తారతమ్యముగను, లలితముగను గలవు. ఈ చిత్రమున గల వృద్ధుని, బాలుర విగ్రహము లను జూడుడు. యోగి, వ్యాసుడు మొదలగు చిత్రములు కొనియాడదగినవి.


కాగితముమీద తొలుత నల్లనిరేఖలతో రూపము నేర్పరచుకొని, దానిపైని తెలుపునుబూసి, కావలసిన వర్ణలేపనమునుజేసి, మరల మొదటిరేఖలపై దిద్ది రూపచిత్రములను, వీరు పూర్తిచేయుచుండినటులు గానవచ్చుచున్నది. వర్ణసౌందర్యమే వీటియందు ప్రధానముకాదుకాన, దంతమువలె నిగనిగలాడుచు నాకారముకొరకే వర్ణములుండి చిత్రకారుని యుద్దేశమును జూపుటయే ప్రధానము. దీని నీరచనా విధానము నెరవేర్చెను.




రాధాకృష్ణులు

యన్. సి. మెహతాగారి 'ఇండియన్ పెయింటింగు' అను గ్రంథమునుండి.


  1. పెర్సీబ్రౌనుగారి " హైందవ వర్ణ లేపనము” ఆను గ్రంథము నుండి.
  2. పెర్సీబ్రౌనుగారి “వర్ణలేపనము" నుండి.