భారతీయ చిత్రకళ/పండ్రెండవ అధ్యాయము
పండ్రెండవ అధ్యాయము
ఇప్పటికాలము
ఆంగ్ల పరిపాలమునందు హిందూదేశమున పెద్దమార్పులు కలుగుచున్నవి. ఉద్యోగములు గోరువారును, పాలకుల స్నేహము నాసించువారును ఆంగ్లాచారములను చాలవరకు నవలంబించిరి. ఆంగ్ల విద్యాభ్యాసముతో నాంగ్లేయుల సాహిత్యము ప్రతివారికిని చనువయ్యెను. అజ్ఞానమువ నుండువారి కాంగ్లభాషాజ్ఞానము వలన ప్రపంచమంతయు గోచరమగునటులయ్యెను. నూతనభావములు, నూతనరుచులు అంకురించెను. దేశభాషలు దేశీయనాగరికత వెనుకబడెను. పాలకులచే బ్రవేశపెట్టబడిన జ్ఞానమే సారమైనదని హైందవవిద్యాధికులు తలంపసాగిరి. ఈనూతన పరిస్థితులందు ఆంగ్లచిత్రకళా విధానములు నాదరింపబడుట యొకవింతకాదు. దీనికి సుప్రసిద్ధ చిత్రకారుడగు రాజారవివర్మ తోడ్పడెను. ఈతడు తిరువాన్కూరు రాజకుటుంబమునకు జెందినవాడు. చిన్నప్పటినుండి చిత్రరచనయం దభిరుచి యుండుటవలన మధురనివాసియగు అలగిరినాయనివద్దను దక్షిణ హిందూదేశమునకు వచ్చిన 'థియొడోరు జెన్సను' మొదలగు చిత్రకారులవద్దను తైలవర్ణ లేపనమును నేర్చుకొనెను. ఇట్లు నాటబడిన ఐరోపావిధానములు మహావృక్షమై చక్కగ ఫలించినవి. అప్పటికి రాజపుత్ర, మొగలు చిత్రరచనలు క్షీణించి యుండుటచే నీతనినూతన మార్గము ప్రజల నాకర్షించెను. పురాణ కథలు స్ఫుటముగ బ్రజల కీతని చిత్రములందు గానవచ్చెను. తిరువాన్కూరు, బరోడా మహారాజులచే ప్రోత్సాహితుడై యనేకచిత్రములను వ్రాసి యితడు అచ్చువేయించెను. రసికులగృహముల నలంకరించుట కివి చక్కని వర్ణములతో, సుందర విగ్రహములతో, బాగుగ నుపయోగపడెను. తమదేశపు సాంప్రదాయముల ననుసరించివ్రాసెను కాన నైరోపీయులితనిని బొగడ మొదలిడిరి. అప్పటికి పాలకులదేశపు పండితులు చెప్పెడిదంతయు హైందవుల కింపుగ నుండెను. కాన, తమ కిదివరకు గలిగిన యభిప్రాయము ధృడపడెను. రవివర్మయంతటి చిత్రకారు డికనుండబోడని నమ్ముటచే నీతని కీర్తి త్వరలో దేశమంతయు వ్యాపించెను.
రవివర్మయొక్క చిత్రములందు హిందూచిత్రరచనా సాంప్రదాయముల చిహ్నము లేమియు కానరావు. ఇప్పుడు మన కనుదినమును కానవచ్చు వ్యక్తులఛాయాచిత్ర మాత్రములుగ నీతనిచిత్రము లుండును. సుప్రసిద్ధమగు సరస్వతి చిత్తరువును జూడుడు. కిరీటమును, రెండుచేతులను దీసివైచిన సుందరాంగియొకతె యుద్యానవనమున వీణను మీటుచు నానందించుచున్నటులు గానవచ్చును. వీరు దేవతలని చూపుటకు కిరీటాది అలంకారములును, గరుడుడు, సర్పమాలలు, నాలుగు మొగములును మొదలగునవిమాత్ర మాధారములు. పురాణకథలు మనకు బాగుగ దెలియునుకాన చిత్తరువును జూచిన వెంటనే పోల్చగలుగుచున్నాము. లేనియెడల ఆచీరలు, నగలు మొదలైనయలంకారములను జూచి యెవరేవ్యక్తియో, యేనవలల చిత్తరువులోయని భ్రమపడవలసివచ్చును. భారత వ్యక్తిత్వములేని యిట్టి చిత్రములను భారత సాహిత్యముకలయే యైరోపాచిత్రకారుడైనను వ్రాయజాలును. లక్ష్మి, సరస్వతి, బ్రహ్మ, మన్మథుడు ఇత్యాది పురాణవ్యక్తులు “భారతమాత" వలె ధనము, విద్య మొదలగువాటి భావరూపములని కొందరి నమ్మకము. ఇట్టియర్థమును స్వీకరించి చూచినను రవివర్మ చిత్రములు విమర్శన కాగజాలవు.
చరిత్రనుగూడ రవివర్మ పాటింపలేదు. దమయంతి చిత్తరువులందు గల భననము లిప్పటి పాశ్చాత్య నిర్మాణములవలె గానవచ్చును. చీరకట్టునందును, ఆభరణము లందును సనాతన వాతావరణము, ఆచారములు మచ్చున కైనను లేవు.
హైందవ సాహిత్యమునం దుత్ప్రేక్ష హెచ్చు. కవులయాలోచన, భావములు పెక్కురీతుల వింతమార్గములద్రొక్కెను. ఐరోపా కళలందు సాధారణముగ నుండుటయే సొగసు. హైందవ లలితకళ లందలంకారచిత్రణము, సొగసు. దీని ననుసరించి రవివర్మచిత్రములను విమర్శించిన నీతడు పాశ్చాత్యకళాభ్యాసకుడని చెప్పక తప్పదు. చిత్రములందు విగ్రహములకు పొందిక గూర్చుటయం దీతనిప్రజ్ఞవిశేషము. రెండుమూడు చిత్రములందు తప్ప తక్కినవాటియందు వ్యక్తులుకొందఱేయైనను చిత్తరువులభావమును వ్యక్తపరచుట కివియే చాలుననునటు లేర్పరుపబడెను. కృష్ణ రాయబారము మొదలయిన చిత్రములందు వ్యక్తు లెక్కువయైనను అతిమనోహరముగ నున్నవి. దీనికితోడు చూపరుల నాకర్షించు సౌందర్యము, లావణ్యము, భావము, వస్తుపరిచయము వీటియందు మూర్తీభవించియున్నవి.ఇట్టి చిత్రములందు భారతీయవ్యక్తిత్వము లేకపోవుటయు విచారకరము.
చెట్లు, ఉద్యానవనములు, సరస్సులు, పచ్చికబయళ్లు మొదలగు చిత్రాంగములను వ్రాయుటయం దీతడు భారతచిత్రకారులలో నగ్రగణ్యుడు. మానవుడులేని ప్రకృతి నీతడు ప్రత్యేకముగ వ్రాయకపోయినను, వీటిని వ్రాయుటయం దీతనికి తగిన యవకాశములు లేక పోయినను ప్రతి చిత్రమున నీతని గొప్పతనము తప్పక కానవచ్చును.
రవివర్మ రూపచిత్రములను చాల సొగసుగ వ్రాయగలిగెను. ఇవి దేశమం దచ్చటచ్చట గానవచ్చును కాని యచ్చుకాలేదు.
శ్రీకృష్ణ రాయబారము
చిత్రకారుడు: శ్రీరాజా రవివర్మగారు.
మధుర నివాసియగు రామస్వామినాయడును రూపచిత్రములను వ్రాయుటయందు చాల నిపుణుడు. ఈత డిందు రవివర్మను మించెనని కొందరియభిప్రాయము.
ఫైజీరహమానుగారు పాశ్చాత్యహైందవ విధానములను చక్కగ మేళవించి రూపచిత్రములను వ్రాయుచున్నారు. పాశ్చాత్యస్నాయుపుష్టిని, హైందవాలంకారములను కలిపి వ్రాయుట వీరి సొమ్ము.
బంగాళమునను రూపచిత్రములను వ్రాయువారు చాలమంది కలరుకాని యీ కళాభాగమునందు బ్రసిద్ధిజెందినవా రల్పము. హైందవ సంస్థానాధిపతులలో చిత్రకళాపరిచయము కలవారు 'ఆండ్' మహారాజుగారొక్కరే. వీరు రాజపుత్ర చిత్రములవంటివి వ్రాయుట యానందింపదగినది.
వేషభాషలందే కాక ఆత్మానుభవమును వెల్లడిచేసి, యాత్మను పరిపక్వము జేయజాలి, జాతీయతను నిలువబెట్ట జాలిన లలితకళలందును పాశ్చాత్యభావము లగ్రస్థానమును వహించినను చూచుచు నిద్రావస్థయందుండుట యాత్మహత్యను గోరుటకు సమానము. ఈ ప్రమాదమును కొందరు గ్రహించుటచే తక్కిన జాతీయోద్యమములతోపాటు హైందవ చిత్రకళాప్రపంచమునగూడ సంచలనము కలిగెను.
ప్రజాసామాన్యము భారత చిత్రకళయం దాకర్షణశక్తి లేదని భావించుటవలన బూర్వకాలపు చిత్తరువు లామోదింపబడుటలేదు. పాలకులు స్థాపించిన చిత్రకళాశాలలందు చిత్రకళ నభ్యసించినవారే గొప్పవారుగ పరిగణింపబడుచున్నారు. ఉదరపోషణకై పాఠశాలలందు ఉపాధ్యాయులుగనున్న వారందరుపాశ్చాత్యవిధానములనే పొగడుచున్నారు. వివాహములందు గోడలపై కొందరు చిత్రములను వ్రాయించుచున్నారు. బజారునందును, తీర్థయాత్రలందును చిత్రములమ్ముడుపోవుచున్నవి. ఇవి బాగుగ లేకపోయినను ఆంగ్లవిద్యాగంధము లేనివా రివియే మంచివని భావించుచున్నారు. చిత్రము లెట్టివైనను, దేవతావిగ్రహమందున్న కొందరికిచాలును. ఇట్టి పరిస్థితులం దీ నూతనసంస్థలు త్వరలో వర్ధిల్లుట కష్టము.
కాని గ్రుడ్డిలో మెల్ల యనునటులు అజంతచిత్ర విధానములు, రాజపుత్రకళ యింకను కొన్నిప్రాంతములం దాదరింపబడుట యొక శుభసూచకము. ఇది చాలవరకు వంగదేశపు చిత్రకారులకు తోడ్పడుచున్నది.
భారత చిత్రకళయందు జొరబడిన విదేశరుచులను బారదోలి నిజమగు హైందవ వ్యక్తిత్వమును మరల సింహాసనమున స్థాపింపజూచుచున్న యువకులకు అవనీంద్రనాధఠాకురు నాయకుడు. రాజపుత్ర చిత్రరచనయందు పర్షియా విధానములుకలవు. కాన సుప్రసిద్ధ అజంత, సీగిరియ చిత్రములు భారతకళ నుద్ధరించుటకు మూలా
శ్రీ అవనీంద్రనాథఠాకురు
చిత్రముల కట్టుబాట్లను మరువక వ్రాయుటయే కళకు క్షేమకరము.
రవివర్మవలె ఠాకురును చిత్రములను నూనెరంగులతో మొదట నభ్యసించెను. హైందవ సాంప్రదాయముల కిది తగదని కొంతకాలమునకు గ్రహించి నీటిరంగులతో చిన్న చిత్రములను వ్రాయుట ప్రారంభించెను. అప్పటికి కలకత్తా చిత్రకళాశాలకు ప్రధానోపాధ్యాయుడుగనుండిన హేవెల్ - సుప్రసిద్ధ చిత్రకళావిమర్శకుడు-ఈతని మార్గముల నామోదించి దొరతనమువారితో వాదించి యీ నూతనరుచులను తనపాఠశాలలో బ్రవేశపెట్టగల్గెను. అవనీంద్రనాథ ఠాకురుగారి వద్ద గగనేంద్రనాధఠాకురు, నందలాలుబోసు, ఈశ్వరప్రసాద్ , అసితకుమారహల్దారు, ప్రమోదకుమార చటోపాధ్యాయ, హకీమ్ మహమ్మదుఖాను, అబ్దుర్ రహమాను చుగతాయి మొదలగువారు శిష్యులుగజేరి సనాతనకాలము నుండి వివిధ రూపములదాల్చి, వింతరుచులను జూపిన భారత చిత్రరచన నుద్ధరించుటకు బూనుకొనిరి.
వీరు తమకు దోచినటులు, భారతరామాయణాది పురాణముల, కాళిదాసాది కవుల గ్రంథరాజముల, భగవద్గీతాది మతగ్రంథముల, భారతచరిత్రను ఆధారముగగొని చిత్తరువులను వ్రాయుచున్నారు. వీటియందు కొన్నిమాత్రము మంచివగుటచే వీరిప్రయత్నము లింకను స్థిరపడనటులు గన్పట్టుచున్నది. జపాను విధానములను వీరధికముగ జొప్పించుచున్నారు. చిత్రములపై పేరులను వ్రాయుటయందును చైనా జసానులకు దాసులగుచున్నారు. ఇది యిటుండ కొన్ని చిత్రములు పాశ్చాత్యవిధానములందు రవివర్మచిత్రములను మించియున్నవి. కొందరు వెనుకముందు జూడక బాగుగనున్నను, లేకపోయినను అజంత చిత్తరువుల ననుకరించుచున్నారు. మరికొందరు ప్రకృతిని తిరస్కరించుటకు ధృఢసంకల్పులైనటులు గన్పట్టుచున్నది. కాని జాతీయ సంస్థయెడల వీరికి ప్రేమోత్సాహములు కలుగుటచే నూతన చిత్రకారుల నాకర్షించి యీ సమితి వర్ధిల్లునను ఆశకలదు. భారత సాహిత్య శిల్పము లీసంస్థకు ముఖ్యమైన యాధారములు.
ప్రమోద కుమారచటోపాధ్యాయుని రప్పించి జాతీయ చిత్రరచన నాంధ్రదేశముననాటుటకు కొన్నిప్రయత్నములు జరిగెను. దీనికి ఫలముగ బందరు జాతీయ కళాశాలయందు కొందరు చిత్రకారులు ప్రవీణులైరి. వీరినిగూర్చి వ్రాయుట కింకను నాధారములు చాలవు.
వంగదేశమున జరిగిన ప్రయత్నములవంటివి తొలుత ఆంధ్రదేశమున దామెర్ల రామారావు చేసెను. ఠాకురువలె వీరును తొలుత ఐరోపామార్గములనే త్రొక్కిరి. కాని త్వరలో హైందవ కళాధిక్యమును గ్రహించిరి. అజంత చిత్తరువులందలి లోపములను దీర్చి, ఆంధ్రకళాభి రుచులకు సరిపోవునటులు వ్రాసి యొక యాంధ్రకళాసంస్థను నెలకొల్పుట యీతని యభిలాష. ఈ చిత్రకారుని యకాలమరణమునలన నీమహోద్దేశములు నెరవేరలేదు. ఈతడు ప్రారంభించిన పని నితరులు పూని నిర్వహించెదరుగాక !
ఈకాలమున భారతీయులు చిత్రరచన నాదరించుట తక్కువ. ఏది మంచి చిత్రమో, యేది చెడ్డదో ప్రజాసామాన్యము గ్రహింపజాలకున్నది. కాని కొలదికాలములో నిట్టి యజ్ఞానము తొలగగలదు. హైందవ చిత్రరచనకు మున్ముందు మంచి దినములు రాగలవు. దేశీయ సంస్థలపై నభిమానము పెరుగుచున్నది. భారతదేశపు సనాతన నాగరికతయెడల నభిమాన మధికమగుచున్నది. సభలు జరుగుచున్నవి. శ్రీకళామయుని కృపవలన భారత చిత్రకళ లోకకళ్యాణమునకు దోడ్పడగలదు.
సంపూర్ణము