భారతీయ చిత్రకళ/నాల్గవ అధ్యాయము
నాల్గవ అధ్యాయము
అజంతగుహలు -2
9, 10 గుహలయందలి చిత్తరువులు బరుహుత్, అమరావతి, సాంచి వీనియందలి శిల్పములను బోలియుండుటచే నివి దక్షిణమున ఆంధ్రరాజుల పాలన కాలములందు క్రీ. పూ. 27 మొదలు క్రీ. త. 236 సం. వఱకు గల కాలమున చిత్రింపబడినటులున్నవి. ఆంధ్ర నృపులు బౌద్ధులు కాకపోయినను, విశాలహృదయులై, బౌద్ధమత వ్యాప్తి కెట్టియాటంకములను కలుగజేయక యుండుట వలన చిత్రరచన యిటులు వర్ధిల్లెను. ఆ కాలమున
"మతగురువులకును, రాజులకును ఎట్టిసంబంధముండెనో తెలియదు. పాలకుల యాజ్ఞానుసారము సన్న్యాసు లీగుహలను దొలచి, యలంకరించుటసంభవము. ఈ నిర్మాణముల నంకితముగ గొనుటకు రాజులు కోరుటవలన పిమ్మట బౌద్ధసన్యాసులకును, రాజులకును మైత్రి యేర్పడినటులు కానవచ్చును. కాని ఎట్టి సంఘపరిస్థితులవలన నీ కళ యిట్లు వర్ధిల్లెనో తెలియదు." భారతీయ సన్న్యాసులు జనసంకులమైన స్థలములందు నివసించుట యాచారముకాదు. అజంతగుహలున్న స్థలమును జూడ నిది మొదటి నుండియు మరుగుపడియుండి నటులు కానవచ్చును. అట్టియెడ నీ సన్న్యాసులు ప్రపంచమునందలి మార్పులను సరకుగొనక తమ యారాధన, చిత్రరచన నిర్విఘ్నముగ నెరవేర్చుకొనుట సహజము; కానివీరు ప్రపంచజ్ఞానశూన్యులు కారు: లోకమున జరుగు అరాజకముల జూచి యసహ్యపడి, యది యిచ్చు స్వల్ప సుఖములు నిస్సారములని గ్రహించి సన్న్యసించినవారు. అప్పటి కళాప్రపంచమున గల యుద్దేశములను బాగుగ జీర్ణించుకొని, మతావేశమువలన తమ జ్ఞానమును చిత్రరూపమున వెలిపుచ్చినవారు. ఇందువలననే యిట్టి చిత్ర సంపత్తి.
పదియవ గుహయందొక రాజు రాణుల, పరిచారికల మధ్య నానందించుచున్నటులు గలదు. ఈ కాలము నందును సంఘ మభివృద్ధిజెందియుండెననియు, బౌద్ధమతస్థు లొకవైపున త్యాగమును గూర్చి బోధించుచుండ నృపులు తమభోగములను విడువలేదనియు, ప్రపంచ మెంతమారినను మానవస్వభావము మారుట దుర్లభమనియు నీ చిత్తరువును జూచిన స్ఫురించును. ఇందుగల స్త్రీల శిరోజముల యేర్పాటు లనేకవిధముల నుండుటవలన చిత్రకారుడు లోకముతో బాగుగ పరిచయము గలిగియుండుట నిశ్చయము. ముఖ్యముగ చేతు లిందు బాగుగ నున్నవి. తొమ్మిదవ గుహయందలి సేవకురాలు, దృఢమగు రేఖలతో గీయబడిన చిత్తరువులు, ఏనుగులు నాహ్లాదకరములు. గుర్రపు రౌతులు, బల్లెపు బంటులు, స్త్రీలు కల చిత్తరువులు పూర్వ మిందుండెడివి. కాని యిప్పు డవి కానరావు.
ప్రవేశాధ్యాయమున బేర్కొనిన నిదర్శనములను మరువక యిందలి చిత్తరువులను బరిశీలించిన నప్పటికే చిత్రరచన విరివిగ నామోదింపబడుచుండెననియు, చిత్రకారులు తమ విద్యయం దనుభవశాలురనియు గోచరించును. ఇందలి విగ్రహములు విశేషముగ నలంకృతములు కావు. వర్ణలేపనమున నాడంబరరహితములుగు నున్నను వ్యక్తుల యేర్పాటు మనోహరముగ నుండుటచే నన్యపురాతన చిత్రములకు విశేషముగ వెనుకబడవు.
అజంతగుహల నలంకరించుట తరువాత చాలకాలమువరకు, విడిచిపెట్టినటులు కానవచ్చును. “నాగార్జునుని యాధిపత్యమున నాగులు చిత్రించిన పిమ్మట యీ కళ క్షీణదశకు వచ్చె”నని తారానాధుడు వ్రాసెను. ఈ కాలము బహుశః క్రీ. త. 100 మొదలు 350 సం. వరకు నైయుండవలెను. బుద్ధపక్షనృపునికాలమున మధ్యదేశమున చిత్రవిధానమును బింబిసారుడు స్థాపించెననుట అజంతయెడల వర్తించుచున్నది. ఈ కాలమున నచ్చటచ్చట కొందరు చిత్రకారులుండినను ప్రజలయామోదము చిత్రరచనయెడల తగ్గెను. దక్షిణమున నప్పుడు రాజకీయ సాంఘిక, ఆర్థిక పరిస్థితు లెటులుండెనో, చిత్రలేఖనము నణగద్రొక్కుటకు తదితరము లెవ్వి తోడ్పడెనో తెలియరాదు.
కాని క్రీ.త. 320వ సంవత్సరమున గుప్తుల విజృంభణమున, ముఖ్యముగ సముద్రగుప్తుని సుప్రసిద్ధపరిపాలనమున మరల నీ కళ యాదరింపబడెను. ఈ కాలమున పదియవ గుహయందలి స్తంభములమీదిచిత్తరువులు వ్రాయబడి యుండవలెను. 350 లేక 400 సంవత్సరముల కివి చెందునని పరిశోధకులు నిర్ణయించిరి. ఈ పటములు కాంతిమకుటములందును, దుస్తులతీరునందును పశ్చిమోత్తర పరగణములందు గాంధారశిల్పచిత్రములని పిలువబడు యవన-బౌద్ధ శిలావిగ్రహములను బోలియున్నవి. ఇవి కొంత నియమబద్ధములై యున్నను భావవైశాల్యమునందును, ఠీవియందును ఆ గుహయొక్క గోడలమీది పటములను మించియున్నవి.
అజంత చిత్తరువులం దధికాంశము క్రీ.త. 550 మొదలు 642 సం. వరకు పాలించిన చాళుక్యరాజుల కాలమున చిత్రింపబడెను. బీరారునందు రాజ్యముచేసిన వాకాటక రాజుల ప్రోత్సాహమున నారవశతాబ్దము నందు 16,17 సంఖ్యల గుహల చిత్రములు వ్రాయబడి యుండవలెను. ఈ రాజులసేవ చేసిన యొక యమాత్య పుత్రుని యాజ్ఞవలన నీ విహారము నిర్మింపబడెనని పదునారవ గుహయందు సగము శిథిలమైయున్న శాసనమువలన దెలియుచున్నది. వాకాటకరాజుల పరిపాలన మెట్టిదియో తెలియదుకాని, మిక్కిలి ప్రబలియుండిన గుప్తవంశపు రాజుకుమార్తె నీరాజులలో నొకరు వివాహమాడి వారితో మిత్రులైయుండు పాటి గొప్పవారని మాత్రము నిస్సంశయముగ జెప్పగలము.
పదునారవగుహయందలి చిత్తరువులు పదునేడవ గుహయందలి చిత్తరువులకన్న కొంచెము ముందు వ్రాయబడినవి. గ్రిఫిత్తుగా రిందలి చిత్తరువులు ప్రతుల నల్పముగ వ్రాయించిరి. ఒకానొకప్పు డిచ్చటి గోడలన్నియు సచిత్రములై యుండినటులు నిదర్శనములు కలవు. మిగిలియున్నవి చాలసుందరములుగను, భావజనకములుగను పర్షియాశిల్పరీతుల చిహ్నములతోను ఉన్నవి. “మరణించుచున్న రాకుమార్తె” యను చిత్తరువు సుప్రసిద్ధ చిత్రకళావిమర్శకుల పొగడ్తను బొందెను. గ్రిఫిత్తుగారు దీని నిటులు వర్ణించిరి:
ఒక యుత్తమవంశజాత తెలగడపై నెడమచేతి నూతగనుంచి, పరిచారికయొక్క సహాయమున మంచముపై కూర్చొని యున్నది. వెనుకనుండి యొకబాలిక తనరొమ్ముపై చేతినుంచి యామెను జూచుచున్నది. రొమ్ము పైని వస్త్రబంధనము కల పరిచారిక యెకతె వింజామరముతో నామెను విసరుచుండ నింకొకతె స్తంభమువద్ద కూర్చుని యున్నది. ముం దిరువురు స్త్రీలు కూర్చునియున్నారు. ప్రక్కగదియం దిరువురున్నారు. అందొకడు పర్షియాదేశపు అంగరకాను ధరించి కలశమును, గిన్నెను పట్టుకొని నిలువబడియుండ నీగ్రోజాతి శిరోజములతోనున్న యితరవ్యక్తి యేమియో యాతని నడుగుచున్నాడు. మరియొక గదియం దిరువురు సేవకురాండ్రు కూర్చొనియున్నారు.
విచారభావ ప్రదర్శనమునందును, కథను స్ఫుటముగ చెప్పుటయందును కళాప్రపంచమున దీనిని మించిన చిత్రములేదని వీరి యభిప్రాయము. కొందరు సేవకులు పరిచారము చేయుచుండ, నితరు లేమియు దోచక కూర్చుని యుండ, స్త్రీలు (బహుశః బంధువులై యుండవచ్చును) యేడ్చుచుండ, నొక సుందరస్త్రీ రోగబాధచే నాయాసపడుచున్నది. ఇట్టి చిత్తరు వెట్టి హృదయమునైన నాకర్షింపకమానదు. ఇతర పరిస్థితుల నేర్పరచి విషాదమును చిత్రకారుడు వెలిపుచ్చెను కాని “రాకుమారిత” యొక్క ముఖమును మాత్రము మలినము చేయజాలక పోయెను. చుట్టునున్నవారి శిరోజము లనేకవిధముల నలంకృతములైయుండ, రోగి జుత్తువిరియబోసికొని యున్నటు లుండుట వలన స్థితిగతు లొక్క పరి స్ఫురించును.
ఈ గుహయందలి మరియొక చిత్తరువునందును పర్షియాటోపీలవా రుండుటవలన నీకాలపు చిత్రకళకును, పర్షియా చిత్రకళకును సంబంధమున్నదా యని యనుమానము కలుగును. పర్షియా యం దాకాలమునకుగాని యంతకు పూర్వమునకు గాని చెందిన చిత్తరువులు కానరాలేదు. ఒకటవ గుహయందు “పర్షియారాయబారము” అను చిత్రముండుటవలన గూడ పర్షియాదేశస్థు లాకాలమున నిచ్చటికి వచ్చుచుండిరనియు నప్పటి గొప్పకుటుంబములందు పర్షియాదేశీయులు సేవకులుగ నుండిరనియు మాత్రము చెప్పవచ్చును. పదునేడవ గుహయందలి చిత్తరువులు అజంతయందలి యితర చిత్రముల నన్నిటిని మించియున్నవి. ముప్పది సంవత్సరములకు పూర్వము డాక్టరు బర్గెసుగారు అరువదియొక్క చిత్తరువులను వర్ణించిరి. ఇందలి జీవచక్రమును కళాభాగముగ గణింపలేము. బౌద్ధమతమును ప్రచారముచేయుట కిట్టివి తిబెత్తునం దిప్పటికి నుపయోగపరచుచున్నారు. తదితర చిత్రములు అజంతవిధానములను బాగుగ వ్యక్తపరుపగలవు. వీటివలన కొన్నికథలను పూర్తిగ జిత్రకారులు ప్రజలకు బోధపరుపజూచిరి. ఎట్టిమార్గముల వలన సన్న్యాసులు బౌద్ధమతమును ప్రజలకు జాటజూచిరో యిందు తెలియగలదు. తక్కిన చిత్రములవలె నీకథలును ముఖ్యముగ బుద్ధభగవానుని జీవితచరిత్రకును, మరణమునకును చెందినవి. ఇట్టి యుద్దేశము కల చిత్తరువులం దత్యున్నతభావములకు విశేషముగ తావులేదు కాన, ప్రజల నాకర్షించుట కివి వివిధములగు రంగములందు చరిత్రను స్పష్టముగ బ్రదర్శించు చలనచిత్రములు (Action pictures) గ నున్నవి. అంతకు పూర్వపు చిత్రవిధానములను మర్కటములవలె నవలంబింపక నూతన విధమున ఘనోద్దేశములు నెరవేరునటులు తమకళ నుపయోగపరచిరి. బౌద్ధమత ప్రతిభ యీకాలమున నశించు చుండుటచే బౌద్ధసన్న్యాసు లిట్లు ప్రజలను మరియొక మా రాకర్షించుటకు మహాప్రయత్నములను జేసినటులు కనబడుచున్నది. ఇట్లు హెర్రింగాము సతి పొగడెను:
సింహము కణుతులవేటాడుట, ఏనుగులవేట, రాజుదర్భారున ఏనుగుసలాముచేయుట అను మూడు చిత్తరువులు పదునేడవ గుహయందున్నవి. తక్కిన వాటికిని, వీటికిని భేదము కలదు. ఈచిత్రములు చాయ వెలుతురుల యేర్పాటున పదునేడవ శతాబ్దమునకుపూర్వపు ఇటలీ చిత్తరువులను మించియున్నవి. పచ్చిక, ఆకులయొక్క తేజోహీనమైన ఆకు పచ్చరంగు తప్ప, చిత్రములు లేతరంగులతో గలవు. పొందిక, యేర్పాటులయందు నవీనములుగను, స్వాభావికములుగను, వ్రాతయందు స్వేచ్ఛతోను, వర్ణలేపనమునందు ధృఢముగను,...... ఉన్నవి. మృగములు - గుఱ్ఱములు, ఏనుగులు, కుక్కలు కణుతులు - చక్కగ వ్రాయబడినవి.
పదునారవ గుహయందలి "మరణించుచున్న రాకుమార్తె” యను చిత్తరువువంటి దిచ్చటను కలదు. ఒకరాణి రోగపీడితయై మరణమును సమీపించుచు విచారముతో నున్న తన భర్తయొక్క విశాల వక్షస్థలముపై నొరగియున్నది. ఇచ్చటను చిత్రకారుడు రోగమునందలి సౌందర్య వినాశక చిహ్నములను, మరణ సూచనలను చూపజాలక పోయెను. తల్లియు, పిల్లయు బుద్ధునారాధించునటులు నీగుహయం దొకచిత్రము కలదు. కుమార్తెముఖము నం దానందమును బుద్ధదేవుని జీవితాదర్శములను గ్రహింపజాలిన తల్లియొక్కవదనమున గౌరవభావము, భక్తి తాండవమాడుచున్నవి. తల్లియొక్క హస్తములు కుమారిక భుజముపైనుండుటవలన నామె తన యనుంగుబిడ్డను బుద్ధదేవునారాధించి పవిత్రురాలవు కమ్మని ప్రోత్సాహపరచుచున్నటులు తోచును. ఎంతో యింపుగ వ్రాయబడిన శిరోజముల నీచిత్తరువున ముఖ్యముగ జూడదగును.
[1]పదునేడవగుహయందు మహాహంసజాతకమును గూర్చిచెప్పు కుడ్యచిత్రమున చిత్రకారుని వర్ణజ్ఞానము చూడదగును. ఖేమరాణి బంగారు హంసలను కలయందు జూచి యట్టిదానినొకటి తనకు తెప్పింపుమని సంయమ నృపుని బ్రతిమాలెను. తన పాలితులచే త్యజింపబడిన హంసరాజును, తన్నువిడువకయుండిన సుముఖుడను మంత్రిని రాజమృగయుడు పట్టి సంయముని వద్దకు తేగా నాతడు వాటిని విశేషముగ గౌరవించెను. హంసరా జాతనికి నీతిని బోధింప వాటినివాసమగు చిత్రకూట సానువులకు బొమ్మని విడచిపెట్టెను. 'ఇంతటితో బుద్ధుఁడు కథను ముగించి జన్మరహస్యము నెరిగించెను. మృగయుడు ఛన్నుఁడుగను, ఖేమరాణి ఖేమదాసిగను, రాజు సారిపుత్తుడుగను, సుముఖు డానందుడుగను ఉండిరి. హంసరాజు నేనే' అని జాతకమున గలదు.
ఒకసేవకుడు ఛత్రమును బట్టియుండ, రెండవ సేవకుడు వింజామరమును వీచుచుండ, పరివార మాజ్ఞకై వేచియుండ రాజు సింహాసనారూఢుడై యున్నాడు. మూడవ సేవకుని ముఖము నల్లగనున్నది. ఈతఁడు బహుశః నీగ్రో కావచ్చును. తీవ్రమైన యెరుపుచాయకలవాడు రాజు పాదములవద్ద నున్నాడు. ఈతడు తన కథనుచెప్పు రాజమృగయుడు కావలెను. కాని మధ్యనున్న హంసల నందరు నేకాగ్రచిత్తముతో జూచుచున్నారు. మీదనున్న చాందినీని రాజు బహుశః ఈ పక్షులను గౌరవించుటకు కట్టించినటులు కనబడును. వెనుకభాగమున వ్రేలాడుచు నలంకారములతో నున్న 'కణాతు' (తెర) యీ సభ బహిరంగము కాదని తెలియజేయును, ఈ హంసలనుబట్టిన విధానము నిజమని చెప్పుచు కాబోలు నొక హీనకులజుడు రాజుయొక్క పాదములచెంత గూర్చొనియున్నాఁడు. ముందుభాగమున నెర్రనిపద్మములతోను, నీటి మొక్కలతోను నిండియున్న జలాశయము కలదు. ఇం దాడుచున్న జలపక్షులు అడవిపక్షులకు గల స్వేచ్ఛను తెలియజేయును. అజంతా చిత్రము
ఈ చిత్తరువున తేలికరంగులతోనున్న మానవులను, గాఢమైన ఆకుపచ్చరంగుతో నున్న వెనుక భాగమునకు వ్యతిరేకముగ వ్రాయబడెను. ఆ యాకుపచ్చరంగు దిగువ నలుపుగ బరిణమించెను. చిత్రముయొక్క క్రిందిభాగమున పసుపుపచ్చయు, మధ్యమధ్యగల తెలుపును, లేత యెరుపును మనోహరముగ అంతర్లీనమై యున్నవి."
ఒక రాజతనయ అలంకరించుకొనుచుండ పరిచారిక యామె బడలికతీరుటకు విసరుచున్నటు లొకచిత్రము కలదు. ఇందు పరిచారికయొక్క పొందిక చాల యింపుగ నున్నది. నిలువబడినరీతి విసరువిధానము స్వేచ్ఛతో వ్రాయబడెను. ముఖమున గౌరవభావము, సంతోషము వినమ్రత, మూర్తీభవించి యున్నవి. రేఖాసౌందర్య వర్ణలేపన చాతుర్యములందు తక్కిన యే యజంత చిత్తరువుతోనైనను సరితూగును.
పందొమ్మిదవ గుహయొక్క శిల్పము చాలచక్కనిది. బౌద్ధుల శిల్ప రాజములలో నిది యొకటని ఫెర్గుసన్‌గా రభిప్రాయ పడిరి. ఇందలి చిత్తరువులు ముఖ్యముగ బుద్ధుని జీవితమునకు జెందినవి. పుష్పగుచ్ఛము లలంకారములుగ నుపయోగపరుపబడెను.
బుద్ధునకు తల్లియు, ఆమెశిశువును భిక్షమిచ్చుచు గౌరవించుచున్నటు. లొకచిత్తరువు కలదు. ఇది పదునేడవ
రెండవపులికేశి అనురాజు వద్దకు పర్షియా రాజగు ఖుస్రుపర్విజ్ పంపిన రాయబారము చిత్తరువు ఒకటవ గుహయందుండుట వలన 1, 2 సంఖ్యలుకల గుహలు ఏడవశతాబ్దపు ప్రారంభమున జిత్రింపబడెనని నిర్ణయింప వచ్చును. ఈ రాయబారము క్రీ.త. 626-628 వ సంవత్సరముల జరిగియుండెనని దేశచరిత్రవలన దెలియును. ఇప్పటికి బౌద్ధమతము క్షీణించుచుండెను. ప్రజల యుత్సాహము తగ్గినకొలది బౌద్ధసన్న్యాసులయు, చిత్రకారులయు కలవరపాటు హెచ్చుకాజొచ్చెను. ఈ చిహ్నములన్నియు నీ గుహల చిత్తరువులందు గానవచ్చుచున్నవి. పర్షియాదేశపు చిత్తరువు లచ్చటచ్చట గానవచ్చుచుండుట వలనను ఖోటానున కానవచ్చు చిత్రవిధానములచిహ్నము లుండుటవలనను, పర్షియాతో నీకాలమున బాగుగ సంపర్క మేర్పడినటులును, పర్షియావిధానములను కొంతవరకు హైందవచిత్రకారు లనుసరించినటులును కానవచ్చును. చైనాచిత్తరువుల ననుసరించియు కొన్నికలవు. బౌద్ధ సన్న్యాసులు మొదట మతప్రచారమునకు చైనామొదలగు దేశములకు తీసుకొనిపోయిన చిత్రముల ననుసరించి యచ్చటివా రభ్యసించి తమజాతీయ రుచులకు సరిపోవునటులు చిత్రములను మార్చిరి. టాంగ్ రాజ్యకాలమున జిత్రింపబడిన చిత్రములు దీనికి నిదర్శనము. బౌద్ధచిత్రకారులు హిందూదేశమున వెనుకబడినపిమ్మట ప్రాచ్యదేశములందు మార్పుజెందిన విధానములు మరల మనదేశమున వ్యాపించినవి. ఇతరదేశపుస్వమతస్థులతో హైందవబౌద్ధులు సంపర్కముగలిగి యుండుటనుబట్టి యివి యజంతయందు కానవచ్చుట సంభవించెను.
రెండవ గుహయందలి చిత్తరువులం దిట్టి లోపములున్నను ముఖ్యవిగ్రహములు మాత్రము చాలసుందరముగ నున్నవి. స్త్రీల ఒయ్యారము నీకాలపు చిత్రకారు లతి నిపుణతతో బ్రదర్శింపగలిగిరి. అలంకృతయై యాతురతతోను, సిగ్గుతోను, ప్రేమతోను స్తంభమునకు జేరబడి యున్న యీ యౌవనవతిని జూడుడు. ప్రియు డెంతకు రాకపోవుటచే యేమియు దోచక యామె యెటులు తన గోటిని మీటుచున్నదో చూడుడు. ముద్రయం దజంతచిత్రకారులకు గల ప్రవీణత యిందు మనకు కొంత యగుపడును. చిత్రకారుడు తన ప్రియురాలినే యిటులు చిత్రించెనేమో! ఈమె కిట్టి సొగసైన నగలుండుట కిదియే కారణమేమో!
ఒకటవ గుహయం దలంకారప్రాయముగ చిత్రింపబడిన చిత్తరువు లాహ్లాదకరములు. ఈ గుహచిత్తరువులు పేరుమ్రోగుట కివియే చాలును. ఎద్దులురెండు, పౌరుషముతో పోరాడుచున్నటులు గల చిత్తరువున నిజమగు జీవచలన చిహ్నము లద్భుతముగ నున్నవి. పెద్దచిత్తరువులలో గౌతమబుద్ధునకుసంబంధించిన చిత్రమాల బాగుగనున్నది. పర్షియారాయబార ప్రదర్శనము శ్లాఘనీయము. ఈ పెద్దచిత్తరువుయొక్క నాలుగు మూలలందును దీనికి సంబంధించిన చిత్తరువులు కలవు. ఖుస్రురాజు (?) సుప్రసిద్ధురాలైన తన షిరీన్ రాణితోగూర్చొని మద్య పానముచేయుచున్నటులు గలదు. ఇందలి రూపము లత్యద్భుతముగ మొగలాయీలను బోలియున్నవి. ఒక చిత్తరువున రాణియు, నామె పరిచారికలును భిక్షమిడుచున్నటులు గలదు.
[2]ఒకటవ గుహయందలి ఫలకమున దుఃఖముతోనున్న స్త్రీచిత్ర మొకటి కలదు.......తన్ను చంపనుద్దేశించి ఖడ్గపాణియై యున్న రాజునెదుట యామె వినమ్రయై యున్నది. చిత్రలేఖనము మనోహరము, నల్లనిరేఖలు ఇంగ్రెసుగారి రచనను పోలును. ఇంతటి మహాసమయమున నాముఖసౌందర్యమును దాచినటులుచేసిన కళయద్భుత మనదగును. తన్ను నశింపజేయుటకు దృఢసంకల్పముతో నున్న వాని పాదముల సోకుటకు వెరచుచు, వణకుతో సాచియున్న హస్తముల మధ్య శిరముమాత్రము కానవచ్చుచున్నది. రానున్న శిక్ష న్యాయమైనది; కాని యెంతఅద్భుతముగ కరుణారసమును చిత్రకారుడు ప్రదర్శించెను! నాశనమునకు సిద్ధముగనున్న యా మహాసౌందర్యము పాపియొక్క పాపమును మరుగుపరచు చున్నది.........
మరియొకగొప్ప చిత్తరువుకలదు. ఇది బోధిసత్వానలోకితేశ్వరుని గూర్చియో సిద్ధార్థుని సర్వసౌఖ్య పరిత్యాగమును గూర్చియో తెలియుటలేదు. దీనియర్థమేమైనను ఇందు కనబడు విచారముకనికరము మహాద్భుతములు.ఇది చూచువారికి విచారకరమగు గొప్పకార్యమును జేయ సిద్దమైన మహాపురుషుని యెదుట నిలువబడియున్నటులు దోచును. ప్రాపంచిక సుఖమును విడనాడు విచారమును దానివలన ముందుగలుగబోవు శాంతియు నిందుమేళవించి యున్నవి. చిత్తరువు పెద్దదగుటవలన నీ భావములు ద్విగుణీకృతములగుచున్నవి.
క్రీ.త. 850 వ సంవత్సరమున చెక్కబడినవని పండితులచే నిర్ణయింపబడిన మధ్యజావాయందలి సుప్రసిద్ధ బౌద్ధశిల్ప మీ గుహయందలి చిత్తరువులను బోలియున్నది. హైందవ చిత్రలేఖన విధానములు మతప్రచారమువలన జావాయందు వ్యాపించెననియు పిమ్మట యీ
అజంతచిత్తరువులం దనేకములగు లోపములున్నవి. ఇప్పటి చిత్తరువులను జూచి వాటిని విమర్శించుట భావ్యము కాదు. ప్రపంచమునం దితర దేశములు చిత్రరచన శైశవదశయం దున్నప్పు డిట్టి చిత్తరువులను భారతదేశము
సృజింపగలిగెను. ప్రకృతినుండియు అధికాంశము స్వతంత్రముగ వ్రాయబడినవగుటజేసి వీటియందు ప్రాణము కలదు. ప్రతిముఖమును భావపూరితము; ప్రతి చిత్తరువును, మనోభావములను మేల్కొల్పును, ఫలపుష్పములకు, జంతువులకు, మనుజులకు - జీవప్రవాహమునందలి యన్నితరగతులకును - ఈచిత్రపంక్తియందు తావుకలదు. అన్నియు చిత్రకారునిచే తగురీతిని గౌరవింపబడెను. క్షీణించెడి వస్తువులన్నియు దైవశక్తులయావిర్భావమనియు, సకలజీవరాసుల కదలిక దేవునివిలాసమనియు నమ్మిన చిత్రకారులు భక్తితోను, గౌరవముతోను వీటిని చిత్రించినప్పుడవియన్యముగ నుండునా?
చాలకాలమువరకు మనము పాశ్చాత్యచిత్ర విమర్శకుల యుద్దేశములపై నాధారపడవలసియుండెను. బౌద్ధమతమును, హైందవచిత్తవృత్తిని, అజంతపరిస్థితులను ఎరుగనివారు వీటి నగౌరవపరచుట వింతకాదు. ఈపెద్ద చిత్తరువులను చిన్నవిగను, రేఖామాత్రములుగను బ్రచురించుటవలన వీటిరచనా చమత్కారము చాలవరకు మరుగుపడుచున్నది. కాని అజంత చిత్తరువులిట్టి ప్రతికూల పరిస్థితులందైనను మనోహరములుగ నున్నవి. పాశ్చాత్య విధానముల నవలంబించుటవలననో వారుచేసిన విమర్శన వలననో కలిగిన విరోధభావములన్నియు నజంతయాత్రతో తొలగిపోవును. అజంత చిత్తరువుల గొప్పతనమున కిదియొక తార్కాణము. రంగులు వాడుటవలనను, వెనుకప్రకరణమున జెప్పిన యితర కారణములవలనను ఈ చిత్తరువులు చాలవరకు రూపుచెడియున్నవి. వీటియాధిక్యమును సంశయించు వారివిషయమును జ్ఞప్తియందుంచుకొనుట చాల ముఖ్యము.