Jump to content

భారతీయ చిత్రకళ/తొమ్మిదవ అధ్యాయము

వికీసోర్స్ నుండి



తొమ్మిదవ అధ్యాయము


మొగలు చిత్ర లేఖనము 3

అక్బరుచక్రవర్తి కాలమున పర్షియా విధానములు భారతదేశమును బ్రవేశించిన కొలదిదినములకే సుమారు నూరుమంది చిత్రకారు లుండిరట! ఇట్టి శుభముతో ప్రారంభమై రెండున్నర శతాబ్దములవరకు నేదోవిధమున నాదరణను బడసిన యీ కళ నభ్యసించిన వారనేకు లుండవచ్చును. జహంగీరు చిత్రరచనను మిగుల ప్రేమించుచుండెను. షాజహాను దీని కెట్టి ప్రతిబంధకములను కలుగజేయలేదు. ఔరంగజేబునకు దీనియెడల ననురాగము లేకపోయినను అప్పటికి ప్రజల యాదరణను బడయజొచ్చెను. మహారాష్ట్రులవలన మొగలు సామ్రాజ్యము కూలినప్పుడును, హైందవ సంస్థలందు సానుభూతిలేని యాంగ్లసైనికుల దుండగములందును, ఈ కారణముల వలన దేశమునగలిగిన సంక్షోభమునందును చిన్న రాజ్యములు కూలెను; రాజుల యాస్తులు చెదరెను; ధనికులు, ఉద్యోగులు తలదాచుకొనుటకు పలాయితులైరి; ప్రజలయందు శాంతిలేకపోయెను; నూతన ప్రభువుల ధనాశ మెండయ్యెను. ఇట్టికాలమున చిత్తరువులనుగూర్చి తలచువా రెవరు? కొన్నినశించెను. లభించిన వాటి నాంగ్లేయులు తమదేశములకు గొనిపోయిరి. కాలప్రవాహమున గొన్ని మలినమై చెడెను. ఇన్నియు పోగా మనకు మిగిలినవే యింత సంఖ్యయుండ నాకాలమున నెన్ని వ్రాయబడి యుండవలెనో యోచింపుడు.

అక్బరు, జహంగీరు చక్రవర్తులు ప్రోత్సాహపరచక పోయినయెడల పర్షియాదేశపు చిత్రరచనా బీజములు మొలకలెత్తి పెరిగియుండకపోవును. భక్తుడగు ఔరంగజేబునకు కళలయెడలనుండిన నిరాదరము లోకప్రసిద్ధము. బెర్నియరు యీ కాలపు చిత్రకారులగూర్చి యిటులు వ్రాసెను:

ఇంతకు మించిన మంచిప్రభుత్వమునందును, శాంతిగల మన ఫ్రాన్సునందును వర్ధిల్లునటులు ఇట్టి పరిస్థితులం దిచ్చట కళలు వర్దిల్లక పోవుటయం దాశ్చర్యము లేదు. బీదలగు దౌర్భాగ్యులమధ్యను, ధనికులయ్యు బీదలవలె నటించుచు సౌందర్యమును పాటింపక చౌకనే యెంచెడివారి మధ్యను, చిత్తరువుయొక్క విలువను బాగుగ చెల్లించక బుద్ధిపుట్టినయెడల ప్రతి ఉమ్రా (గొప్పవాడు) యింటివాకిట వ్రేలాడు కొరడాలతో తనపైకమును కోరు చిత్రకారుని దండించు గొప్పవారి మధ్యను ఎట్టి చిత్రకారుడైనను తన వృత్తియందు శ్రద్ధగలిగి యుండజాలడు. ఎట్టి పేరును సంపాదింపజాలరని గ్రహించినయెడల చిత్రకారుల యుత్సాహము కుంటుపడదా?... చక్రవర్తియు, ముఖ్య మగు ఉమ్రాలు తమ పోషణక్రింద కొందరు చిత్రకారులను పనిచేయుటకుసు పిల్లలకు నేర్పుటకును నియమించి పనిచేయనప్పుడు కొరడాలతో దండించెదమని భయపెట్టకపోయినయెడల హిందూదేశమునందు కళల సౌందర్యము, లాపణ్యము చాలకాలము క్రిందటనే నశించియుండును.... ఒక గదియందు కొందరు చమికీపనివాండ్రు తమ పోషకుని తనికీక్రింద పనిచేయుదురు; రెండవ గదియందు బంగారుపనివాండ్రు, మూడవ గదియందు చిత్రకారులు...

ఈ వ్రాతలందు కొంత యసత్యమున్నను తక్కిన పనివాండ్రతో సమానముగ చిత్రకారుడు గణింపబడు చుండుటయు, వీనికి గౌరవము లేకపోవుటయే కాక జీవనము గడచుటయే కష్టమగుటయు నిశ్చయము. ఒకవిధమగు ఆవేశము - ఉత్సాహముపై లలితకళాభ్యాసకు డాధారపడియుండును. ఇట్టి నిర్మలవ్యక్తి పైజెప్పిన పరిస్థితులందు పనిజేయవలసి వచ్చిన తా నభ్యసించెడి కళయొక్క యంత్యదశ దగ్గరపడుట నిశ్చయము.

చిత్రకారు లందరును చక్రవర్తు లిచ్చుజీతములపై నాధారపడియుండలేదు. అక్బరు కాలమునందుకూడ కొందరు రాజులకొలువునం దుండక చిత్రములను వ్రాసి యర్పించి బహుమతుల బొందుచుండిరి. ఔరంగజేబు కాలమునను, తరువాత డిల్లియందు పాలించిన వారి కాలమునను రాజుల పారితోషకములపైననే కాక ప్రజలు చిత్తరువులను గొనుచు నర్పించెడి ధనముపైనను ముఖ్యముగ నాధారపడుటకు పరిస్థితులేర్పడినవి. కాన నిట్టివారి సంఖ్య రానురాను అధికమయ్యెను. అక్బరు జహంగీరుల కాలమునందైనను వీరి కుండవలసిన గౌరవము లేకపోయెను. ప్రపంచపునాగరికత నధికపరచు కళాకోవిదులలో నొకడగు చిత్రకారున కే మనసబుదారుపనినో యిచ్చిన నేపాటి? పుస్తకసంపుటములను గట్టువారితో వీరిని సమానముగ గణించు నదనున చిత్రలేఖనముయొక్క యాధిక్యమును వారు గ్రహించిరని యెట్లు జెప్పగలము?

బౌద్ధచిత్రములందు చిత్రకారుల నామములులేవు. తిబెత్తున నొక్కచిత్రమున మాత్రము చిత్రకారుని రూపచిత్రము కలదు. ఇతర చిత్రములనుబట్టి చిత్రకారుల నామములు తెలియుటలేదు. మనకు వీరివిషయమై తెలిసిన యంశములు తారానాధుని చరిత్రయందును, తదితర గ్రంథములందును కానవచ్చుచున్నవి.

మొగలు చిత్రకారులు కొందరు పర్షియా యాచారము ననుసరించి తమ చిత్తరువులందు పేర్లను వ్రాసు కొనుచుండిరి. మనకు మిగిలినచిత్రములలో నధికాంశమున నిట్టి పేరులు లేవు. కాని సనామములుగు నున్న వాటి సహాయమున వందమొదలు రెండువందల చిత్రకారులు మనకు పరిచితులు కాగలరు. 1600 సంవత్సరమున వ్రాయబడిన 'వాఖియతై బాబరీ' యందును, 'అక్బరు నామా' యందును కొందరి పేరులు కానవచ్చుచున్నవి. నామములుతెలిసినను వారి జీవితములను గూర్చి యేమియు వివరములు లభించుటలేదు.

'మీర్ సయ్యదాలి', 'అమీరు హంజా' యొక్క చరిత్రనుగూర్చి చిత్రములను వ్రాసెను. మొగలు చిత్తరువులందు పెద్దవని పేరుగాంచిన రెండుచిత్రములను వీరే చిత్రించినటులు కానవచ్చుచున్నది. ఈ చిత్రములం దొక్కొక్కటియు 2 అ. 8అం. పొడవును, 2అ. 2అం. వెడల్పును కలిగియున్నవి.

'క్వాజా అబ్దుల్ సమద్ ' గారు- హుమయూనుకు మిత్రుడు, అక్బరు కాలమున గూడ జీవించియుండెను. పర్షియాలిపిని వ్రాయుటయం దద్వితీయుడై 'పీరీనుకలమ్' అను బిరుదును పొందెను. 'ఫర్రుఖ్' అనువాడు 'క్లార్కు' గారివద్దనున్న అక్బరునామాయొక్క ప్రతియందు కానవచ్చెడి మూడు చక్కని చిత్తరువులను వ్రాసెను.

మిస్కినునకు 'ఉస్తాద్' అను మారుపేరు కలదు. ఈతడు క్రైస్తవ మతమునకు జెందిన చిత్తరువులను వ్రాసెను.

మహమ్మదు నాదీరు, మీరు హాషిమ్, మహమ్మదు ఫకీరుల్లాఖాను, మహమ్మదు ఫజల్ అను చిత్రకళాకోవిదులు చక్కని రూపచిత్రములను వ్రాసిరి. వీరిలో కొందరు జంతువుల చిత్రములను కూడ బాగుగ వ్రాయగలుగు చుండిరి.

హిందూ చిత్రకారులపేరు లధికముగ కానవచ్చుచున్నవి. ‘వాఖియతై బాబరీ' యందు కానవచ్చిన యిరువదిరెండు పేరులందును పందొమ్మిది పేరులు హిందువులవి. అబుల్ ఫజల్ పేర్కొనిన పదునేడ్గురు చిత్రకారులందు పదుముగ్గురు హిందువులు. 'రాజమ్‌నామ' యను భారతకథను చిత్రించిన యిరువది యెనమండ్రయందును సుమా రిరువది మంది హిందువులు. దశవం తీకాలపు హైందవ చిత్రకారులలో నెన్నదగినవాడు. 'రాజమ్‌నామా 'యందీతని చిత్రముల విగ్రహములు హిందువులను బోలియున్నవి. రచనయందును కొంత స్వేచ్ఛ కలదు. ఏ కారణముననో కాని యీతడాత్మహత్య గావించుకొనెను.

బసవాన్ మరియొక సుప్రసిద్ధ చిత్రకారుడు. ఈతని చిత్తరువులు చాల సుందరముగ నున్నవి. దశవంతుకు మించినవా డీతడని కొందరి యభిప్రాయము.

కేశవదాసు పల్లకీమోయు జాతివాడైనను దశవంతువలె తన ప్రవీణతవలన గౌరవ పాత్రుడయ్యెను.

జగన్నాథు, సర్వాను, మానశూరు అనువారు మృగముల, పక్షుల చిత్రముల నతి నిపుణతతో వ్రాసిరి.

లాలు, ముకుందు, మాధవ, మహేశ, క్షేమకరణ, తారా, సన్‌ల్వ, హరిభాను, రామ యను చిత్రకారులను అబుల్‌ఫజల్ పేర్కొనెను.

కళ్యాణదాసు, అనుఫ్‌ఛతర్, మనోహరు, నన్హరాయి, ఛాజ్ మల్లు అనువారు వ్రాసిన చిత్తరువులు చక్కనివి లభించినవి.

లిపి చిత్రము

(కంగ్రాకలము)



2. పక్షులు

ఉస్తాదు జ్ఞానచందు, బహదుర్‌సింగు అను సిక్కు చిత్రకారులు కూడ ఉండిరి.

వీరు రచించిన చిత్తరువుల లోపాలోపములను కొంత విమర్శించి చూతము:

అజంత చిత్రములందు స్వేచ్ఛకలదు. అంగములందు చలన ముండుటచే జీవముపోసినటుల కానవచ్చును. ప్రాగ్దేశములం దుత్సాహజనకమగు మతముపై నివి యాధారపడి యుండుటచే చిత్రకారుని "పొంగు” ఇందు కలదు. మొగలుచిత్రము లిటులు లేవు. మనుష్యరూపము లందెక్కువ యర్ధభాగము కనపడునటులు నున్నవి కాన, సుప్రసిద్ధులు చిత్రించినవి కాక తక్కినవన్నియు కొయ్యబొమ్మలవలె కానవచ్చును. అంగచలనము వీటియందు చాల తక్కువ. ఈ లోపము జహంగీరు, షాజహానుల నాటి చిత్తరువులందు కొంతపోయెను. భారతచిత్రరచనా సంపర్కము దీనికి కారణమై యుండవచ్చును.

మొగలు చిత్తరువులందలి వివరముల నొక్కొక్క సమయమునందు దుర్భిణితో జూడవలసివచ్చును. శిరోజుములందు, గడ్డమునందు ప్రతి వెండ్రుకను వ్రాయవలెనని వీరియభిలాష. ఇట్టియోపిక ప్రపంచమున మరేదేశమునను కానరాదు. చిన్న చిత్రమున ననేకులరూపముల నిట్టి సూక్ష్మతతో వ్రాయగలిగినవారి నిపుణత నెంతయు కొనియాడదగును. కాని యీ వివరములయెడ శ్రద్ధబూని వీరు చిత్తరువునకు గావలసిన యితర విషయములను మరచిరి.

భావములేని చిత్రము జీవములేని శరీరమువంటిది. ఇదిగాక చిత్తరువునగల వివిధవస్తువుల పొందిక, కూర్పు వీటియందు తక్కువగనున్నవి. రాజులయొక్కయు, ధనికులయొక్కయు పోష్యవర్గముక్రింద వర్ధిల్లువారు దయనార్జించుటకు ప్రతివ్యక్తియొక్క సౌందర్యమును జూపవలసివచ్చెను. చిత్తరువునం దెవరి ప్రాముఖ్యమును తగ్గించిన నెవరికి కోపమువచ్చునోయను భయము వీరిని పీడించి యుండవచ్చును. ఈ కారణమే నిజమైన, వీరు భావము నంతగా పాటింపక పోవుటకు కొంత క్షమాపణకలదు.

ప్రారంభమున నచ్చటచ్చట కొన్ని మంచి చిత్రములు వ్రాయబడెను. రానురాను జహంగీరు, షాజహానుల కాలమున చిత్రకారులు మొగలు దర్బారును విడువలేదు. ఏ గ్రంథముయొక్క చిత్తరువులను వ్రాసినను రాజాజ్ఞవలననే; ఏచిత్తరువును వ్రాసినను ధనికుల నానందపరచుటకే. ఇట్టి దాస్యమునందుండిన చిత్రలేఖనమునకు విశాలత కలుగుట దుర్లభము. ప్రకృతిని చిత్రించుటయందు ఐరోపా, జపానుదేశములవారియంత శ్రద్ధ ఈ చిత్రకారులు పూనలేదు. ఎచ్చటనైన చెట్లు, పర్వతములు మొదలగునవి యున్న చిత్రములందలి వ్యక్తుల రూప సౌందర్యము నధికపరచుటకేకాని ప్రకృతియం దాసక్తికలిగి కాదు. కొన్నిచిత్తరువులం దిట్టివి బాగుగ నున్నను కళావిమర్శకుల దృప్తిపరుపజాలవు.

అజంత చిత్తరువులందు స్త్రీలను, పురుషులను విలువయగు నలంకారములతో భూషించిరి. ఈచిత్రములం దున్నంత విరివిగ మొగలుచిత్రములం దలంకారములు లేకపోయినను, స్త్రీపురుషు లెక్కువ కనుల కింపుగ కానవచ్చునటులు ప్రయత్నించిరి. గాఢములగు రంగులను, బంగారు, వెండి పూతలనువేసి ముఖ్యమగు చిత్తరువులందు వజ్రపు కెంపుతునుకల నంటించిరి. వీటివిషయమై యెంతశ్రద్ధ పూనినను చాయవెలుతురుల విషయమై శ్రమకలుగజేసుకొనలేదు. ప్రాక్పశ్చిమదేశములచిత్రరచన కిదియే ముఖ్యమైన భేదము. ప్రాగ్దేశములందు చిత్రలేఖనమునకు రేఖయే ప్రధానాధారము. ఇదిలేని చిత్తరువు కానబడదు. అధికాభ్యాసము లేనియెడల రేఖ, చిత్తరువునంతను పాడుచేయును. మొగలుచిత్రకారులు దీనిని మృదువుగను, లావణ్యముగల దిగను, దృఢముగను వ్రాయుటయందు ప్రవీణతను గనపరచిరి. సగము చిత్రింపబడిన చిత్రములం దాధారముగ మొదట వ్రాసుకొనిన రేఖలు కానవచ్చుచున్నవి. ఇవియు చక్కగ నుండుటబట్టి చిత్రములు పూర్తికాకపోయినను సుందరముగనే యున్నవి. అనుభవశాలు రగు చిత్రకారులు రేఖలతో చిత్తరువులనేర్పరచి, వారిశిష్యులచేతనో, లేక యితరులచేతనో రంగులను పూయించినటులు కొన్ని చిత్రములవలన దెలియుచున్నది. రంగులను పూయుటకన్న రేఖలను వ్రాయుటయే ముఖ్యమని వీరు తలచిరి.

అక్బరు కాలానంతరమున నచ్చటచ్చట ఛాయ నిచ్చుట కలదు. ఒకరంగులో మరియొక రంగు క్రమముగ కలియుటయం దెచ్చటనైన నొకరంగు హెచ్చుటయు, రెండవరంగు తగ్గుటయు లేదు. తలచినఛాయ నత్యద్భుతముగ జిత్రించుటకు వీరు సమర్థులైనను అది చిత్తరువున కనవసరమని త్యజించినటులు కనపడుచున్నది.

నవనాగరికులైన భారతీయులు కొందరు పాశ్చాత్యవిధానవ్యామోహమునబడి యీ చిత్తరువులను తీవ్రముగ విమర్శించుట కలదు. ప్రాగ్దేశవిధానములు పాశ్చాత్యదేశముల కెటులు పనికిరావో, పాశ్చాత్య విధానములు ప్రాగ్దేశముల కటులే పనికిరావు. ఐరోపా చిత్తరువులయందువలె వీటియందు ఛాయ, స్నాయుపుష్టి కానరావు. రేఖల సౌందర్యము, ఐరోపాచిత్రములందు కానరాదను కారణముననాచిత్తరువులన్నియు నిస్సారములని చెప్పజాలము. శిల్పమునందును, చిత్రలేఖనమునందును భారతదేశ మితరదేశములనుండి యనేకవిషయములను నేర్చుకొనినను తనవ్యక్తిత్వము నెన్నడును మరుగుపరుపలేదు. పాశ్చాత్యచిత్రములనుజూచి, భారతచిత్రములను తూలనాడి యీజాతీయ వ్యక్తిత్వమునకు కళంక మాపాదించుట భావ్యముకాదు.

ఒక మొగలు చిత్తరువునంతయు నొకే చిత్రకారుడు రచించెనని తలచుట పొరపాటు. ఏదేని వర్ణముతో చిత్తరువును రేఖారూపముగ నేర్పరచుట సుప్రసిద్ధ చిత్రకారునిపని. రంగులనువేయుట కీతనికోపికయు, సమయము లేనప్పుడు సలహానిచ్చి తన శిష్యులచే పూర్తిచేయించును. కొన్ని చిత్రములందలి ముఖ్యవిగ్రహములను, వస్తువులను తానేచిత్రించి, ఆకాశము, దూరముగనుండుకొండలు, చెట్లు మొదలగు వాటి నితరులచే వ్రాయించును. చిత్తరువునంతయు నీతడే చిత్రించి చుట్టునున్న యంచున కితరులను నియమించుటయుగలదు. ఈతడెక్కువ శ్రద్ధతో కాగితములను రంగులను ఎంచుచుండెను. పూర్వము హిందూదేశమున పెక్కురకముల కాగితములను తయారుచేయుచుండిరి. ఇందు ముఖ్యమగునది "హరిరి” అనుకాగితము. ఇది కొంతకాలమునకు విరిగి చెడును. నైజాము రాష్ట్రమునందలి దౌలతాబాదున జేయబడినదానికి "దౌలతాబాది” యనియు, సయలు కోట యందు చేయబడినదానికి “సయలుకోటి”యనియు, పర్షియా నుండి దిగుమతిజేయబడినదానికి “ఇస్పహాని”, లేక “ఇరాని” యనియు, వెదురుతో జేయబడినదానికి “బంసి” యనియు పేర్లుండెను. హైందవ చిత్రకారులు సాధారణముగ "హింది" యను కాగితమును వాడుచుండిరి. దక్షిణమున “మొగలి” యనుకాగిత మామోదింపబడు చుండెను. మైసూరుయొక్క “కార్డే” యనునదియు, నారతోచేయబడిన “తతాహ” యు, "తులత్" అను దూదికాగితమును, “సున్ని” యనునదియుగూడ వాడుకయందుండెను.

రంగులనన్నిటిని చిత్రకారుడు స్వయముగ జేయించుకొనినటులు గానవచ్చుచున్నది. ఇవి చెడక యిప్పటికిని తేజముతో నుండుటవలన అతనిశ్రమ సార్థక మయ్యెను. కుంచెలను మేక, లొట్టియ, ఉడుత, ముంగిస మొదలగు జం తువుల వెండ్రుకలతో కట్టుకొనుచుండెను. సన్ననికుంచెలు కావలసిన యుడుతల మెత్తని వెండ్రుకల నుపయోగపరచెను. ఒక విధమగు గడ్డియు అతని కుంచెలకు చక్కగ నుపయోగపడెను.

అక్బరుకాలమునందును కొన్ని చిత్రములను దళసరి వస్త్రములపై నూనెరంగులతో నైరోపారీతిని చిత్రించుట కలదు. ఇప్పు డైరోపాయం దచ్చటచ్చట కానవచ్చు 'హమ్జనామా'యొక్క ప్రతులం దిట్టిచిత్రములుకలవు. కాని యివియెన్నడు నిచ్చట విశేషముగ నామోదింపబడుట లేదు. నూనెరంగులతో చిత్రింపబడెను కాన నొక యైరోపాచిత్తరువును జహంగీరు నిరాకరించెనట. దక్షిణ హిందూదేశమునగూడ రంగులతో గలుపుట కవిసెనూనె యుపయోగింపబడెను.

మెరుగుబిళ్లతో చిత్రకారుడు మొదట కాగితమును చదునుచేయుచుండెను. రేఖాకృతి నేర్పరుచుటకు జేగురురంగును ముఖ్యముగ వాడెను. కొన్ని సమయములందు నీటితో మాత్రము వ్రాయుచుండెను. రంగులన్నియు వేసినపిమ్మట ఆవనూనెయందు కర్పూరపువత్తిని కాల్చగా వచ్చిన నలుపుతో మరల రేఖల దిద్దుచుండెను; రంగుల నన్నిటిని నీటిలో గలపుచుండెను. జిగట కావలసివచ్చినప్పుడు బంక, బెల్లము, అవిసెనీరు మొదలగువాటిని జేర్చెను. ముఖమునందు చక్కనివర్ణము కావలసినప్పుడు వడపోసిన బురదనీటి నాచోటవేసి బాగుగ నారనిచ్చెను. బంగారపుపూత కావలసిన చోటులందు మొదట బియ్యపు గంజినిబూసి దానిపై కుంచెతోకాని, వస్త్రమున మూటకట్టి కాని బంగరురజమునురాల్చి యారపెట్టుచుండెను. ఎండిన పిమ్మట నూదివైచినచో గంజితో దడుపబడినచోటు లందు మాత్ర మీపూత యంటియుండును. ఇప్పటివా రీమార్గములకు హేళనచేయవచ్చునుకాని యిటులు చిత్రింపబడిన చిత్రములు బాగుగ నున్నవనిమాత్ర మట్టివారు జ్ఞాపక ముంచుకొనుట భావ్యము.