Jump to content

భారతీయ చిత్రకళ/ఒకటవ అధ్యాయము

వికీసోర్స్ నుండి

ఒకటవ అధ్యాయము

హైందవ చిత్రలేఖనోదయము

అజంతా, సీగిరియాలయందుగల సుప్రసిద్ధములగు చిత్తరువులను వ్రాయుటకు బూర్వము భారతభూమియం దీవిద్య యభివృద్ధి చెందియుండెనని చెప్పుటకు ప్రబలాధారములు విశేషముగ గానరాకయున్నవి. మానవు డెంత ప్రయత్నించినను పూర్వసాంప్రదాయములు లేనిది యిట్టి చిత్తరువులను తొలుదొలుతనే వ్రాయజాలుట యసంభవము కాన తురుష్కులైనను, యవనులైనను, మన దేశమునకు వచ్చి చిత్రరచనను నేర్పిరనియు, తదుపరి అజంతా మొదలగు గుహలయందలి చిత్తరువులు నిర్మింప బడెననియు గొంద రూహించుటకు వీలు కలుగుచున్నది. విదేశీయుల రాకపోకలు కలచోటుల నజంతా గుహ లుండుటవలన నిట్టియూహలకు బలము కలిగెను. కాని ఉత్కళమునందును, తదితరస్థలములందును కానవచ్చు చిత్తరువులను జూచిన నీవాదము ఊహామాత్ర మని తోచును. అజంత మొదలగు గుహల చిత్తరువులకు, పాశ్చాత్య చిత్రములకు నెట్టిసంబంధము గానరాకయున్నది. ఆ కాలమునాటి తురుష్కచిత్రములకంటె అజంత చిత్తరువు లెన్ని యోరెట్లుత్తమముగ నున్నవి. తురుష్క హైందవాది ఆసియాఖండపు చిత్రకళావిధానములకు తురుష్కస్థానము జన్మస్థలమై యుండిన నుండవచ్చును కాని, మన దేశమున నీవిద్య ప్రత్యేకముగ నభ్యసింపబడి, నూతనమార్గముల ద్రొక్కి యున్నత దశకు వచ్చెనని చెప్పజాలుటకు తగినన్ని నిదర్శనము లున్నవి. పిమ్మట హైందవ చిత్రవిద్య యితరదేశములందు గౌరవింపబడెననియు, అభ్యసింపబడెననియు చెప్పుటకును నిదర్శనము లున్నవి.

చిత్రరచన, వర్ణలేపనము హిందూదేశమున రెండువేల సంవత్సరములకు బూర్వము నుండియు నభ్యసింపబడుచుండెను. తరువాత వ్యాపించిన శిల్పవిద్య కిది మార్గదర్శకమయ్యెను. ఆకాలమున నైరోపా శైశవ దశయందుండుటయే కాక, ఇటీవల పదునాలుగు, పదునైదు శతాబ్దముల వరకు నచ్చట నిట్టి చిత్తరువులను వ్రాయజాలక పోయిరని విన్సెంటు స్మిత్తుగారి యభిప్రాయము. కాని ఆకాలపు చిత్తరువు లిప్పుడింత యల్పముగ గానవచ్చుటకు హైందవ వాతావరణమే కారణము. మన పూర్వులచే గోడలమీద జిత్రింపబడిన చిత్తరువులన్నియు వర్షజలాపాతమున దడిసి, మండువేసవియందు బీటలు వారి నశించినటులు గోచరించు చున్నది.

కైమూరు పర్వతములందుగల గుహా కుడ్యములపైన పురాతనములయిన చిత్తరువులు కొన్ని కానవచ్చు చున్నవి. వింధ్యపర్వతములందుకూడ నిట్టి చిత్తరువులు, కొంతయెరుపురంగు, రంగులను నూరెడురాతిపలకలు లభించినవి. ఈ చిత్తరువులు మంచివికాకపోయినను హిందూదేశమునందలి చిత్రవిద్యకు తొలిప్రయత్నము లగుటజేసి, చరిత్రకారుల దృష్టి నాకర్షించినవి. కొలది కాలముక్రిందట మధ్యపరగణాలందలి రామగడ రాజ్యమునకుజేరిన సంగనుపురము దగ్గర గుహాముఖమున నొకరాతిపై నెరుపువర్ణముతో వ్రాయబడిన కొన్ని చిత్తరువులు లభించెను. ఇచ్చట మానవుని తొలిరాతిపనిముట్లు కూడ దొరకుటచే నీచిత్తరువులు వేలకొలది సంవత్సరములకు బూర్వము వ్రాయబడెనని స్పష్టమగుచున్నది. ప్రపంచము నందంతటను మానవుడు ప్రథమమున క్రూరమృగములను, ఆహారమునకు దగిన మృగములను వేటాడి తనకాలమును గడపుచుండెను కాన నీత డిట్టి చిత్తరువులనే రచించుచుండెను. ఇచ్చటి చిత్తరువులును వేటకు సంబంధించినవి. ఇందు ఏనుగు, లేడి మొదలగు జంతువు లనేకరకముల వ్రాయబడినవి. ఒకచోట నొక యెనుబోతును జయించు యతనమున ననేకమృగయులు దానిచే పరాభవింపబడినటులు గలదు. మరియొక చోట నొక యెనుబోతును వేటకాండ్రు తమబల్లెములతో బొడుచుచున్నటులును, తమ ప్రయత్నఫలమును జూచి తక్కినవా రానందించు చున్నటులును కలదు. ఇందు కొన్ని చిత్తరువుల యర్థమంతగా తెలియకున్నను, హైందవ పురాతన చిత్రకారుడు కొంత ప్రవీణతను సంపాదించెనని తోచును.

మీర్జాపురము జిల్లాయందుకూడ పురాతనములయిన చిత్తరువు లనేకములు కానవచ్చుచున్నవి. ఈ ప్రదేశమునకు సమీపమున సురుగుజా రాజ్యమునందలి రామగడ పర్వతమున గల 'జోగిమారా' యని పిలువబడు గుహలయందు చిత్తరువులు కలవు. వీటిపై నితరులెవరో దిద్దుటవలన నివి తొలిరూపుచెడి వికారముగ గనబడును కాని నిదానించి చూచినయెడల మొదటి సౌందర్యము గ్రహింప వీలగును. ఎరుపు పసుపు వర్ణములతో చదరమునందు చదర మిమిడియున్నటు లివి కలవు. ఈ చదరముల చుట్టు మకరము మొదలగు నీటిజంతువుల రూపము లలంకారముగ గలవు. చదరములందు మనుష్యులయు, జంతువులయు, వృక్షములయు నాకారము లున్నవి. ఒక చదరమునందు చెట్టు క్రింద నొక పురుషుడును, ఎడమవైపున గాయకులతో నొక నర్తకియు, కుడివైపున ఏనుగులతో నొక యుత్సవమును కలవు. మఱియొక చదరమున నొక దిగంబరుడును, రథము, ఏనుగు మొదలగు రాజచిహ్నములును కలవు. ఈ చిత్తరువుల యర్థము పూర్తిగ తెలియకపోయినను, దిగంబర విగ్రహమునలన నివి జైనులకు జెందినవని తోచును. తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు రంగులతోమాత్రమే యివి వ్రాయబడుట వలనను, ఇచ్చటగల శాసనములవలనను, సాంచి, బార్‌హత్ నందుగల శిల్పములతో బోల్చి చూచుట వలనను, ఇవి చాల పురాతనము లనియు, బహుశః క్రీస్తుకు పూర్వము మొదటిశతాబ్దమునాటి వనియు గోచరించును. తరువాతి చిత్తరువులతో సరిపోల్చి చూచిన యెడల నివి హైందవ చిత్రలేఖనము యొక్క శైశవదశకు జెందినటులు గాన్పించును. పైన జెప్పిన చిత్తరువులందు కళానైపుణ్య మంతగా కానరాదు. ఎంతవెదకిన నిదివరకు నితరాధారములు లభించలేదు. అజంత, సీగిరియా చిత్తరువులను, అప్పటి వాఙ్మయమును బరిశీలించిన నంతకు పూర్వమే యీవిద్య యున్నత దశయం దుండెనని స్పష్టపడుచున్నది. ఈవిరుద్ధ నిదర్శనములను జూడ జోగిమారా గుహల చిత్తరువులు కళాజ్ఞాన మల్పముగ గలవారిచే చిత్రింపబడియుండవలెను; లేక, వాఙ్మయమునందు కవులు తక్కిన వర్ణనలవలె నీకళనుగూడ మితిమీర బొగడి యుండవలెను - అని తోచును. కవుల యుత్ప్రేక్ష కొంత యథార్థము కావచ్చును కాని అజంత గుహల చిత్రసౌరభమును బట్టి చిత్రలేఖనము మహోన్నతదశయం దుండెననియు, మధ్య రెండువందల సంవత్సరములందు లిఖింపబడిన చిత్తరువులు నశించెననియు జెప్ప సాహసింపవచ్చును.

వేదము, తదితరవిద్యలు దేవతలవలన మనకు లభించెనని వాడుక. చిత్రలేఖనోత్పత్తి విషయమైకూడ నిట్టికథ యొకటి కలదు. పూర్వ మొకబ్రాహ్మణపుత్రుడు మరణింప నాతనితండ్రి దుఃఖము నాపజాలక పుత్రభిక్ష నిడుమని యముని ప్రార్థించెను. యమునిహృదయము కరగలేదు. అంత నాభూసురుడు బ్రహ్మను ప్రార్థించెను. సృష్టికర్తయగు నీవేల్పు పంచభూతములలో లీనమైన దేహమును మరల సృజింపజాలక యాకుమారుని రూపమును వ్రాయుటను నేర్పి, కుంచెలను, రంగులను ప్రసాదించెను. బ్రాహ్మణుడు తన ప్రియకుమారుని రూపమును స్మరించి యొకవిగ్రహమును నిర్మింప, దానియందాదేవుడు ప్రాణమును బోసెను. తరువాత నీవిద్య యెల్లెడల వ్యాపించెను. ఈకథ నిజమయినను, కాకపోయినను, చిత్రలేఖనమునందు హిందువుల కెట్టి గౌరవము కలదో దీనివలన తెలియగలదు.

రాజగృహములందు వివాహము తలపెట్టినప్పుడు రాకొమరితలయు, రాకొమరులయు చిత్రపటములను తరుచుగ నుపయోగపరుచుచుండిరి. కొన్ని సమయములందు వీరి యన్యోన్యప్రేమ కివి కారణము లయ్యెను. దీని నుదాహరించుట కొక ప్రసిద్ధిజెందిన చక్కని కథ పురాణములందు గలదు. "శ్రీకృష్ణుని మనుమడగు అనిరుద్ధుడు ఉషయను రాజకన్యకకు స్వప్నమున గాన్పించెను. ఆమె తన చెలికత్తెయగు చిత్రలేఖ కీవార్త దెలిపి యాసుందర యువకు డెవడని సంశయించెను. చిత్రలేఖ తనకు దెలిసిన అందఱు రాకొమరుల చిత్రములను వ్రాసి చూప ఉష స్వప్నమున తన హృదయమును హరించిన వానిని పోల్చగలిగెను. కొంత కాలమునకు వారిరువురికి వివాహమయ్యెను.” రామాయణ మహాభారతములందు చిత్రశాలల వర్ణనలు కలవు. భాసుడు, కాళిదాసు, భవభూతి వ్రాసిన గ్రంథములందును చిత్రకళను గూర్చి కలదు. వ్యక్తుల కాలిగోరును, దలవెంట్రుకలను, ఇతరావయవములను జూచి వారి రూపచిత్రములను వ్రాయుట కలదని చెప్పుట వినుచున్నాము.

హిందూవాఙ్మయమునందేకాక బౌద్ధుల వాఙ్మయమునందును చిత్రలేఖనము సామాన్యముగ నుండెనని చెప్పుటకు చాల నిదర్శనములు కలవు. క్రీస్తుకు పూర్వము నాల్గవశతాబ్దమున పాళీభాషయందు వ్రాయబడిన బౌద్ధుల “వినయపిటక”మను గ్రంథమందు 'పాసెనాడ' నృపుని చిత్రగృహ మనేకములగు చిత్రములచే నలంకరింపబడెనని కలదు. సయాము దేశమున ఆంకోరు నందును, జావాద్వీపమున బోరుబందరునందును చిత్రశాలల చిహ్నములు కానవచ్చుచున్నవి. దుత్తగామిని యను రాజుచే నిర్మింపబడిన డగోబా చిత్తరువులచే నలంకరింపబడెనని యైదవ శతాబ్దమున వ్రాయబడిన “మహావంశ”మను గ్రంథమున గలదు.

ఈనిదర్శనములనుబట్టి చూడ మననృపు లీకళను విశేషముగ నాదరించుచుండిరని తెలియును. లాఫర్‌గారు చిత్రలేఖనము రాజగృహములందే జన్మించెనని తలచుచున్నారు. ఇవన్నియు అజంత, సీగిరియా చిత్తరువుల వలె గోడలమీదనే వ్రాయబడుట స్పష్టము. ఇప్పటికిని హిందూదేశమున గొన్ని భాగములందు ఉత్సవములకు గోడల నలికి వాటిపై చిత్తరువులను వ్రాయుదురు. ఆంధ్రులును ముగ్గులతోను, బొమ్మలతోను ఇండ్లను, గోడలను అలంకరించుచున్నారు.

ఐదు, ఆరు, ఏడు శతాబ్దములందు చైనాదేశము నుండి వచ్చిన యాత్రికులు బౌద్ధులు చిత్రకళానైపుణ్యము నధికముగ గొనియాడియున్నారు. పదునేడవ శతాబ్దమున టిబెట్టునందు నివసించియుండిన తారానాధుడను బౌద్ధచరిత్రకారు డీకళ బుద్ధునకు బూర్వమునుండియు బ్రసిద్ధి జెందియుండెనని వ్రాసెను. పురాతన కుడ్యచిత్రముల సౌందర్యమును జూచి యవి దేవతలచే జిత్రింపబడి యుండవలెనని అతడు తలచెను. అశోకునిచే నియమింప బడిన యక్షులును, నాగార్జునుని యాధిపత్యముక్రింద నాగులును చిత్రములను జిత్రించుచు వచ్చిరని వీరు వ్రాసిరి.

ఒకానొక రాజున కర్పించుట కొకచిత్రకారుడు గౌతముని యెదుటనే గౌతముని రూపమును జిత్రించు చున్నటులును, ఆ చిత్తరువును జూచి యానృపు డాశ్చర్యపడి దాని నారాధించుచు బౌద్ధమతమును స్వీకరించినటులును టిబెట్టునందు చిత్తరువులు గలవు. పూర్వమును రూపచిత్రములను వ్రాయుట కలదనుట కది మరియొక చక్కని నిదర్శనము.

బౌద్ధుల కాలమునకు పూర్వమే చిత్రలేఖనము విషయమై కొన్ని నిబంధన లేర్పడినటులు కానవచ్చు చున్నది. మూడవ శతాబ్దమున వాత్స్యాయనుడు తన కామశాస్త్రమునందు రూపభేదము, ప్రమాణము, భావయోజనము, లావణ్యయోజనము, సాదృశ్యము, వర్ణికాభంగము చిత్రలేఖనమునకు షడంగములని వ్రాసెను:


శ్లో.

రూపభేదాః ప్రమాణాని భావలావణ్య యోజనమ్;
సాదృశ్యం వర్ణికాభంగ మితి చిత్రం పడంగకమ్.


1. రూపభేదము : మానవులు, జంతుజాలములు, తదితరవస్తువులు ప్రకృతియం దెటులు గానవచ్చునో చిత్ర కారు డెరుంగవలెను. వీటి వివరములు, వివిధవస్తువులకు గల భేదము చిత్తరువునందు ప్రదర్శించుట ముఖ్యము :

శ్లో.

అంగా న్యభూషితాన్యేన కేనచి ద్భూషణాదినా;
యేన భూషితవ ద్భాతి తద్రూప మితి కథ్యతే.

ఐరోపాచిత్తరువులందువలె, ఛాయాచిత్రములందువలె వస్తువులరూపములు చాయవెలుతురులవలన స్ఫుటముగ దెలియును. కాని హైందవచిత్రకారు లీప్రకృతి జ్ఞానము నొకమూల ద్రోసి, రేఖలతో తమచిత్తరువులను నిర్మించిరి. లోకమునగల యన్నిటియొక్క రూపములయర్థమును గ్రహించి, యాలోపలి రహస్యమును వెలిపుచ్చుట శిల్పియొక్క పవిత్రమైన విధి. ఛాయాచిత్ర మాత్రముగ వ్రాయుటకంటె నిది యెక్కువ ప్రయోజనకారి.

2. ప్రమాణము: ప్రతివస్తువుయొక్క పరిమాణము చిత్తరువునందు చాల అవసరము. ప్రకృతియందు కొన్ని వస్తువులు పెద్దవిగను, కొన్ని చిన్నవిగను ఉండును. పర్వతము, ఏనుగు చూపరుల కొకేదూరమున నున్నప్పుడు ఏనుగుకంటె పర్వతము పెక్కు రెట్లు పెద్దది గానబడును. కాని ఏనుగు దగ్గరగను, పర్వతము దూరముగనునున్నప్పుడు పర్వతమే చిన్నదిగ కన్పించవచ్చును. కాని హైందవచిత్రకారునకు ఆధ్యాత్మికచింత ముఖ్యమని జ్ఞాపక ముంచుకొనవలెను. మాయాదేవి నిద్రించు చున్నటు లొకశిల్పము కలదు. ఇందు మాయాదేవి ముఖ్యము. తక్కిన వన్నియు నాధ్యాత్మికదృష్టియందు చిన్నవి. ఆమె పండుకొనియున్న శయ్య, చుట్టునున్న పరిచారికలు మాయాదేవికంటె పెక్కురెట్లు చిన్నగ చిత్రింపబడిరి. ఇట్టి శిల్పము లనేకములు మనదేశమునందు కలవు. ఈ నియమమును మనుష్యుల విగ్రహముల వివిధాంగములను వ్రాయునప్పుడు మనపూర్వులు విశేషముగ బాటించిరి. వివిధాంగముల కొలతలన్నియు నియమింపబడెను. అజంతాచిత్తరువులం దీకొలత లన్నియు బాగుగ జూపబడెను.


3. భావము :

శ్లో.

శరీరేంద్రియ నర్గస్య వికారాణాం విధాయకాః;
భావానుభావజనితా శ్చిత్తవృత్తయ ఈరితాః.

మనంబునగలభావములను ముఖమునజూడగలము. నవ్వునప్పుడు, ఏడ్చునప్పుడు, కోపముతోనున్నప్పుడు, ఆతురతతో నున్నప్పుడు వదనమనేకరూపములను దాల్చును. వదనమే కాదు; దీనికితోడుగ ప్రతియంగము యొక్క స్థితియు భావమువలన మారుచుండును. “యతోభావస్తతోరసః.” దీనిని మనము రవివర్మ చిత్తరువులందు బాగుగజూడగలము. అజంతచిత్తరువులం దీయంగము నేల లక్ష్యపెట్టలేదని ప్రశ్నింపవచ్చును. దేవునిపై లగ్నమైనహృదయమున నీభావముల కంతగా చోటులేదు. శాంతియే ముఖ్యము. బుద్ధుని రూపమును జూడుడు: ఇందు ఆనందము, దుఃఖము, కోపము మొదలగు మనోవికారము లెవ్వియు కానరావు. వీటిని త్యజించుటవలననే యాతడు నిర్వాణమును కాంచ గలిగెను. ఆతని ప్రతియంగమునందును శాంతి మూర్తీభవించి యున్నది. ఇదియేకద వాంఛనీయము! ఇంతకుమించిన జ్ఞానఫలిత మింకొకటి లేదు. ఈభావప్రదర్శనము విశేషముగ లేకపోయినను అజంతచిత్తరువులం దొకపవిత్రత కలదు. మతమునకు సంబంధించని చిత్తరువులలో కొన్నిటియందు మాత్రము భానము చక్కగ గనబడుటవలన నాటి చిత్రకారు లిందు ప్రవీణులైయుండియు ప్రదర్శించుట మానుకొనినటులు దోచును.

4. లావణ్యయోజనము : చిత్తరువు చూపరుల మనంబుల నాకర్షించవలెనన్న నది సుందరముగ నుండవలెను. సుందరమైన వస్తువులను జూడ నందరు నిచ్చగిం తురు. కాని కాముకునకు యౌవనమున గాన్పించు సౌందర్యము, లోభికి బంగారమున గాన్సించు సౌందర్యము సౌందర్యము కానేరదు. అన్ని చిత్తరువులయందును సుందరమైన వస్తువులను వ్రాయుట యసంభవము. యౌవనమునకుగల సౌందర్యము వార్ధక్యమున కుండదు. నెమలి కున్న సౌందర్యము కాకికి లేదు. కాని వార్ధక్యము నందు నొక సౌందర్యము కలదు. నెమలి జీవితమున నెట్టి సార్థకత కలదో, కాకి జీవితమునందును దానికి తగిన సౌందర్యము కలదు. రక్తము స్రమించుచున్న యుద్ధభూమి యందును నీతియు, ఆధ్యాత్మికలావణ్యము కలవు. ఇందును దేవుని యాజ్ఞ నిర్వహింపబడును. బుద్ధదేవుని శుష్కములైన యంగములందుగల యాంతరంగిక సౌందర్యము వారకాంత యంగములందు లేదు. బుద్ధుని యంగములనుండి వెలువడు తేజము, నిర్మలత, ముఖ్యములయినవి. రామచంద్రుని కృష్ణవర్ణమునుండి వెలువడు నిజమగు క్షత్రియతేజము లక్ష్మణుని శ్వేతవర్ణమున లేదు.


[1]శ్లో.

ముక్తాఫలేషు ఛాయాయాస్తరళత్వ మినాంతరే,
ప్రతిభాతి యదంగేషు లావణ్యం తదిహోచ్యతే.

ఇందు ముత్యముల గుండ్రతనము, వర్ణములకంటె వాటి నుండి వెలువడు తేజము ముఖ్యము. తెల్లని గాజుపూసల యందిట్టితేజము లేదు. కాని యీ హైందవదృక్పథమునందు లావణ్యయోజనమన భౌతిక సౌందర్యము నిమిడి యుండకపోదు.

5. సాదృశ్యము: సాదృశ్యమన సత్యము. విషయమెట్టిదైనను, చిత్రకారుని రుచి యాధ్యాత్మిక మైనను, భౌతికమైనను చిత్తరువునందు సత్య మత్యంతావశ్యకము. ఇది లేని చిత్రము నిస్సారమైనది. తన మనోభావములను స్ఫుటముగ వ్యత్యాసములేక ప్రదర్శింప జాలని శెల్పి నిజమగు శిల్పికాడు. చూపరులను తప్పుత్రోవను బెట్టుట చిత్రకళ యుద్దేశము కాదు. సృష్టియొక్క నిజమగు అర్థమును ప్రదర్శించుట యాతని విధి.

6. వర్ణికాభంగము : ఈ చిత్రవిద్యాంగము చిత్రకారుడు తన రంగులను, కుంచెలను ఎటులుపయోగపరుపవలెనో చెప్పును. వీటి యుపయోగమునందు చిత్రకళా కోవిదుని ప్రవీణత కొంతవరకు దెలియును. ఇందును పాశ్చాత్య చిత్రకారునకును ప్రాగ్దేశపు చిత్రకారునకును భేదము కలదు. భారత చిత్రకారుడు రంగులను కొంతవరకు భావమున కనుగుణముగ జిత్రించును. మన దేశమున చిత్రలేఖనము మిక్కిలి యున్నత స్థితియం దుండకపోయిన నిట్టి సూక్ష్మబుద్ధితో చిత్రకారుని కార్యక్రమమును విమర్శింపజాలక పోదురు. బౌద్ధులచే నిది శ్రద్ధాభక్తులతో సభ్యసింపబడెను. ఈ కళ క్షీణదశకు వచ్చినకాలమున కళాభ్యాసకులు భావస్వాతంత్ర్యమును వీడి పూర్తిగ నీ నియమములపైననే యాధారపడియుండిరి. ఇట్టి నిబంధనలే చైనాయం దాదరింపబడు చుండెనని ఆరవశతాబ్దమున షియాహో (Hsieh Ho) వ్రాసెను. హిందూదేశపు షడంగములనే వీ రవలంబించి నటులు గానవచ్చుచున్నది.

సనాతన హైందవచిత్ర విద్యాధిక్యమును నిర్ధారణ చేయుటకు "చిత్రలక్షణ”మను గ్రంథము మరియొక యాధారము. ఈ గ్రంథము మతవిషయిక చిత్రలేఖనమును గూర్చి—ముఖ్యముగ పూజ మొదలగు ఆరాధనములం దుపయోగపడు దేవతల విగ్రహములను గూర్చి — తెలియజేయును. కాని యిందొక ప్రకరణమున "ప్రమాణము”ను గూర్చి కలదు. మానవులయు, దేవతలయు ప్రతిమ లెటులుండవలెనో విపులముగ వ్రాయబడి యున్నది. ఈ గ్రంథమునుబట్టి మానవుని ముఖము సుందరముగ నుండవలెను. గుండ్రముగను, వంకరగను, త్రిభుజ మువలెను ఉండకూడదు. ఇట్టి నిబంధనల ననుసరించి చిత్రించువారు వర్ధిల్లెదరు. ముక్తిని గోరు మానవుని ముఖము పొడవుగను, గుండ్రముగను, త్రిభుజమువలెను ఉండవచ్చును. నృపులయొక్కయు, దేవతలయొక్కయు శిరోజములు మృదువుగను, వలయములుగను, దివ్యమైన నీలిరంగు గలవిగను ఉండవలెను. స్త్రీల యాకృతి యెటులైన నుండవచ్చును కాని యంగములపొందిక మాత్రము ముఖ్యము. వారు వృద్ధులవలె వంగి యుండరాదు. సాధారణముగ యౌవనులవలె నుండుట మంచిది.

[2]శ్లో. ధ్యానయోగస్య సంసిద్ధౌ ప్రతిమా లక్షణం స్మృతమ్;
ప్రతిమాకారకో మర్త్యో యధా ధ్యానరతో భవేత్.

తథా నాన్యేన మార్గేణ ప్రత్యక్షేణాపి వా ఖలు;
దేవానాం ప్రతిబింబాని కుర్యా చ్ఛ్రేయస్క రాణిచ.

స్వర్గ్యాణి మానవాదీనా మస్వర్గ్యాణ్య శుభానిచ;
అపి శ్రేయస్కరం నౄణాం దేవ విలంబలక్షణమ్.
సలక్షణం మర్త్యబింబం నహి శ్రేయస్కరం సదా.

దేవతల రూపములనెటులువ్రాసినను శ్రేయస్కరమనియు, మానవుల రూపములను, సలక్షణముగ వ్రాసినను సదా శ్రేయస్కరముకాదనియు, శ్రీశుక్రాచార్యునియుద్దేశము. చిత్రలక్షణమునందు నృపులయొక్కయు, దేవతలయొక్కయు, "ప్రమాణము”ను గూర్చి యిటులుగలదు. దేవతల విగ్రహములకంటె రాజులవి చిన్నవిగను, రాజుల విగ్రహములకంటె తదితరులవి చిన్నవిగను ఉండవలెను. ఇదివరకు జెప్పినటులు స్థూలశరీరబలముకంటె ఆధ్యాత్మిక బలము ఎక్కువ యనియు, పూర్వజన్మమునందు జేసిన సుకృతమువలన రాజు లట్టి యున్నతజన్మము నందెదరనియు హిందువులు నమ్మెదరు. దేవగడ దేవాలయమున అనంతశయనుడగు విష్ణుని విగ్రహమునందును, అనేకములగు ఇతర శిల్పములందును ఈ ప్రమాణనియమము స్ఫుటముగ గాన్పించును. సాముద్రికశాస్త్రము ననుసరించి చిత్తరువులను వ్రాయవలెనని యొక ముఖ్యనియమ మున్నటులు గోచరించును. ఇవికాక గుప్తవంశపు రాజుల పాలనలో వ్రాయబడిన శిల్పశాస్త్రములందు శిల్పచిత్రలేఖనముల విషయమై యనేక నిబంధనలు కలవు. వీటి నిప్పటికిని హిందూదేశమున వాడుచున్నారు.

సనాతన హైందవ యువతులు మతమునందును, భాషలయందును మంచిప్రవేశమును గలిగియుండిరనుటకు నిదర్శనములు కలవు. చిత్రరేఖ చిత్రలేఖనమున బ్రవీణు రాలని మనపురాణముల నున్నది కాన స్త్రీలును చిత్రవిద్యయందు బ్రవేశము కలిగియుండిరని చెప్ప సాహసింప వచ్చును.

ప్రాచీన హైందవచిత్రకారుడు రాజపోషణపై ముఖ్యముగ నాధారపడియుండెను. దేశీయసోదరుల గౌరవమును పొందుచుండెను. రాజపండితులు, రాజపురోహితులువలె నీతడును రాజగృహము నాశ్రయించియుండుట సంభవము.

హైందవ చిత్రకారుడు తన మనంబునగల భావములను వెల్లడించు నుద్దేశముతో గళాప్రపంచమున మునిగియుండెను. తన చిత్తరువులందు నవీనులవలె తన పేరును వ్రాసుకొనలేదు కాన నాతనిగూర్చి విశేషముగ వ్రాయుటకు తగిన యాధారములు లేవు.

చాలవరకు మలినమై తొలిరూపము చెడియున్నను, ఇప్పుడు మనకు మిగిలియున్న చిత్తరువులను బట్టి యాకాలపు వర్ణి కాభంగమును గూర్చి కొంత తెలిసికొన గలము. ప్రపంచమునం దన్ని దేశములందువలె భారతదేశమునందును నాగరికత శైశవమున నుండిన కాలమున. మానవుడు తన చిత్తరువుల నెరుపురంగుతో వ్రాయుచుం డెను. చాయను జూపవలసిన చోటుల నీవర్ణమునే కొంచెము నలుపురంగుకలిపి పూయుచుండెను. ఈ రంగు రాళ్లకును, గోడలకును అంటుకొనుట కిందు కొవ్వును గలిపి యుండవచ్చును. మోటుకుంచెలతో వర్ణలేపనమును జేసి, సన్నని పుడకలతో రేఖలను గీయుచుండినటులు గానవచ్చుచున్నది. జోగిమారా గుహలందు గరుకుగ నున్న రాళ్లపైని, కొన్నిచోటుల పలుచగ బూయబడిన మంటిపైని చిత్తరువులు కలవు. ఇందు చిత్రములు ఎరుపు, తెల్లని సుద్ద, కరక్కాయలనలుపుతో చిత్రింపబడినవి. ఈ రంగులను నూరు శిలాఫలకము లిచ్చట లభించెనని యిదివరకు వ్రాసియుంటిని. ఇట్టి మోటుపరికరములతో చిత్తరువులను వ్రాయు మానవు డనాగరికుడై యుండవలెను. కాని యీ కాలమునాటి యితరదేశములవారికీ విద్యయందు భారతీయు డెంతమాత్రము వెనుక బడలేదని తక్కిన దేశముల చరిత్రలను జూచిన స్పష్టపడును.




  1. కృష్ణాపత్రిక సంక్రాంతి సంచిక నుండి.
  2. కృష్ణాపత్రిక సంక్రాంతి సంచిక నుండి.