భారతీయ చిత్రకళ/ఐదవ అధ్యాయము
అయిదవ అధ్యాయము
బాఘ్-సింహళము
బౌద్ధులకాలమునగుహలు రాజగృహములు విహారములు సచిత్రములైయుండెనని యిదివరకు చెప్పియుంటిని. అజంతగుహలుతప్ప తక్కినవన్నియు ననేక కారణములవలన నశించెను. నిర్మాణములున్నను వాటిగోడల మీదనుండిన చిత్రము లిప్పుడు కానవచ్చుట లేదు. బాఘ్ గుహ లీతరగతికి చేరినవి.
గుజరాతు మాల్వాదేశములకు రాకపోకలేర్పరచు పురాతనమార్గము చెంత గ్వాలియరురాజ్యమున నీగుహలు కలవు. ఇందు ముఖ్యమైనవి యెనిమిది. వీటిలో నన్నిటికంటెపెద్దది 94 అడుగుల చదరము. దీనిగోడలు, కప్పు, స్తంభములు విలువైన చిత్తరువులతో నిండియుండెను. మరిరెండు గుహలందును చిత్రచిహ్నములు కలవు. వర్షము వలనను, సున్నమురాలిపోవుట వలనను ప్రయాణికుల వంటల పొగవలనను ఇవి యిప్పుడు బాగుగ కానరాకు న్నవికాని గొప్పచిత్రకారులు వీటిని తడుపుచు కానవచ్చినంతవరకు ప్రతులను వ్రాసియుండుటచే గొన్నియైనను లభించినవి.
ఎట్టి పరిస్థితులయం దీగుహలు నిర్మింపబడినవో, ఆకాలమున నాప్రాంతములం దెవరు పాలించుచుండిరో నిర్ణయించుటకు వీలులేదు. శాసనములు, వీటిని పేర్కొను పురాతన గ్రంథములు లభించుటలేదు. గుప్తరాజ్య కాలమునాటి శిల్పములందువలె తలపాగాలు దేహమునకంటి యుండు దుస్తులు నిచ్చటిపటములందు కానవచ్చుటవలనను, చిత్రరచనయందును, గుహా నిర్మాణమునందును అజంత గుహాపంక్తిని బోలియుండుటవలనను ఇవి యేడవ శతాబ్దమున నిర్మింపబడెనని చెప్పవచ్చును. దేశపటముపై తిన్నగ కొలచిన నజంత బాఘుల నడుమ సుమారు 150 మైళ్లదూర ముండును. రాకపోకలకు వీలులేనటు లీ రెండు ప్రదేశములకు మధ్యను నర్మదయున్నది. అందువలన నీ చిత్తరువులన్నియు నొకే చిత్రకారులచే వ్రాయబడెనని చెప్పజాలము. దేశమందంతట నభ్యసింపబడిన చిత్రకళావిధానము లీరెండుచోట్లను కానవచ్చుటవలన నివి యొకే కాలమునకు జెందియుండవలెను. 1818 వ సంవత్సరమున కెప్తాను డేంజరు ఫీల్డుగారీగుహలను చూచి సం. 1820న ఆంగ్లలోకమునకు వెల్లడిచేసిరి. వీరు రచించిన చిత్తరువులిప్పుడు కానరాలేదు. డా. బర్గెస్సుగారు వీటినిగూర్చి వ్రాయుచు 'గ్రిఫిత్తుగారు శిష్యవర్గముతో బోయి యీ చిత్తరువులను వ్రాసిన బాగుగ నుండునని సూచించిరికాని యిది జరుగలేదు. ఈమధ్యను మేజరు లువార్డుగారు వీటివర్ణనను పూర్తిగ వ్రాసిరి. గ్వాలియరు సంస్థానపు ఆర్కియలాజికల్ డిపార్టుమెంటువారి సహాయమున ఇండియా సంఘమువా రీగుహలనుగూర్చి చక్కనిగ్రంథమును ప్రచురించిరి. హల్దారు, బోసు మొదలగు సుప్రసిద్ధచిత్రకారులు చిత్తరువులనమూనాలను పూర్తిగవ్రాసిరి.
ఈ చిత్తరువులందు కొన్ని మధ్యమధ్య నెర్రమట్టి రంగుతోను, ముఖ్యముగ నలుపుతెలుపులతోను, కొన్ని అజంతపటములవలె గాఢమగునీలి, యెరుపు, పసుపు వర్ణములతోను జిత్రింపబడినవి. ఈ రెండుతరగతులు రెండు భిన్న కాలములకు జెందుట స్పష్టము.
కొన్ని బౌద్ధమతమున కేదోవిధమున జెందినవైనను అధికాంశము మతేతరములు. బౌద్ధులచే వ్రాయ బడిన చిత్తరువు లిట్టివి ఉండుటచే కొందరి కాశ్చర్యము కలుగుచున్నది. కాని బౌద్ధమతము క్షీణించుచుండినప్పుడు మతమున దురాచారములు చేరెను. హిందూదేశమున నితరస్థలములం దిట్టివి లేకపోలేదు. ఇవియు నీ గుహలకాలమును నిర్ణయించుటయందు తోడ్పడుచున్నవి. ఒక పురుషుడు నాట్యముచేయుచుండ కొందరు స్త్రీలు వాద్యము వాయించుచున్నటులు రెండు చిత్తరువులు కలవు. ఇది
హల్లీసకమను నృత్యమని నిర్ణయింపబడెను. శాస్త్రమును బట్టి యిట్లు నృత్యముచేయువారు ఏడుగురు, ఎనమండ్రు, లేక పదుగురు ఉండవలెను. ఈచిత్తరువునం దారుగురు ఏడుగురు మాత్రమేకలరు. హిందూదేశమున నీకాలమునకు చెందిన చిత్తరువులు మరెచ్చటను కానరావు.
పూర్వమునుండియు బౌద్ధులు సింహళముతో సంపర్కము గలిగియుండుటవలన నిచ్చటను పురాతన చిత్రములు కానవచ్చుచున్నవి. మేతలిజిల్లాయందు సీగిరియ యను నొకగిరి కలదు. సీగిరియయన సింహగిరియని యర్థము. సూదివలె 600 అడుగులయెత్తుకల యీ కొండయొక్కశిఖరమున నొకదుర్గమున్నది. తండ్రిని జంపి కీ.త. 479 మొదలు 497 వరకు రాజ్యముజేసిన మొదటి కశ్యపుడు దీనిని నిర్మించెను. ఇందుగల యింపైన చిత్తరువు లిప్పు డీదుర్గమునకు కీర్తిదెచ్చెను. ఈచిత్తరువులన్నియు నీరాజుకాలమున వ్రాయబడుట నిశ్చయముకాన నివియు, అజంతయందలి పదునేడవగుహయందలి చిత్తరువులు నొకేకాలమునాటివి కావచ్చును.
హైదరాబాదు ప్రభుత్వమువారు అజంత చిత్తరువులయెడల నెంత యనాదరముతో మెలగిరో సింహళ ప్రభుత్వమువారు సీగిరియా చిత్తరువుల యెడల నంత యాదరముతో విశేషధనమును వెచ్చించి హెచ్. సి. పి. బెల్‌గారిచే పదిసంవత్సరములు పనిచేయించి దుర్గమును, అందలి చిత్తరువులను కాలప్రవాహమువలన గలుగు వినాశమునుండి సంరక్షించిరి. చిత్తరువులముందు తీగలతో చేయబడిన వలలను కట్టించుటచే నివి ఇప్పుడు సురక్షితముగ నున్నవి.
ఈ చిత్తరువులన్నియు నిరువదిరెండు. ఇందొకచేయి మాత్రమే ఉన్నది. కనుక మానవవిగ్రహము లిరువదియొకటి. మొదటిగదియందు సహజ పరిమాణముకంటె కొంచము పెద్దవి పదునేడును, రెండవగదియందు కొంచెము చిన్నవిగ నైదును కలవు. ఎ. ముర్రెగారు 1889 వ సంవత్సరమున పదమూడు విగ్రహముల ప్రతులను వ్రాసిరికాని తరువాతను పెరీరగారు చిత్రించిన నూనె రంగుల ప్రతులు ముర్రెగారి కళాసేవను మరుగుపరచెను. ప్రశం
సార్హముగ తొలి చిత్తరువులను బోలియున్నవని యివి ప్రసిద్ధిగాంచెను.
కొందరుస్త్రీలు పరిచారికలతో వరుసగ కొండ కుత్తరభాగముననున్న 'పిదు రెంగల' బౌద్ధదేవాలయమునకు ప్రార్థనవిషయమై పోవుచున్నటు లీచిత్తరువులు కలవు. ఇరువురుస్త్రీ లొకేచోటనున్న నందొకతె దాసివలె కనబడుచున్నది. కొన్ని చిత్తరువులందు రొమ్మున కొకబట్టయు దిగువభాగమున 'కంబేయ'యను వస్త్రమును కలవు. లేత పసుపు లేక నారింజనర్ణముతో సుందరముగనున్న వారందరు కశ్యపుని రాణులనియు, ఆకుపచ్చ వర్ణముగలవారు పరిచారికలనియు నిర్ణయింపబడెను. క్రిందిభాగమున మేఘమువలె రంగు పూయబడెను. ఈ స్త్రీలు స్వర్గనివాసులనుట కిది చిహ్నమని కొందరి యూహ కాని క్రిందిభాగమున మెత్తుడు బాగుగ లేకపోవుటచే కాళ్లను చిత్రించుటకు సాధ్యముకాలేదను బెల్ గారి యూహ యెక్కువ యామోదమును బడసెను.
ఇవి యజంతయందలి మంచిచిత్తరువులతో సరిపోలవుకాని స్త్రీవిగ్రహములు చాలబాగుగనున్నవి. వ్రేలిముద్ర, కలువపూవుల ప్రాముఖ్యము, రేఖలయింపులందు అజంత చిత్రములను బోలియున్నను అచ్చటి భిన్నరుచులు ఇచ్చట లేవు. ఒయ్యారముతో ఫలపుష్పములను, సంగీత యంత్రములను సీగిరియస్త్రీలు పట్టుకొనియుండుట వలన నిందొకవిధమైన సొగసు కలదు. విగ్రహములు జీవకళాపూరితములు. కోమలములుగు చేతివ్రేళ్లు బహుసుందరములు. రచనయందు చేసినమార్పు లిప్పటికిని కానవచ్చుచు చిత్రరచనావిధానములను బట్టి యీ చిత్రకారులు మిగుల ప్రవీణులని చెప్పవచ్చును.
సున్నమున జిగటమన్ను, ఊక, కొన్ని చోటుల కొబ్బరిపీచును గలిపి అరయంగుళము దళసరిగమెత్తి దానిపై పావునుండి అరయంగుళమువరకు దళసరిగా సున్నమునుపూసి బాగుగ నారబెట్టి చిత్తరువులను వ్రాసినటులు గానవచ్చుచున్నది. ఆకృతిని ఎరుపు, నలుపు వర్ణముల రేఖలతో నేర్పరచి ఎరుపు పసుపు ఆకుపచ్చలతో చిత్రించిరి. అజంత, బాఘ్ చిత్తరువులందు కానవచ్చు నీలిరం గిచ్చటలేదు. రేఖలను గీచినవారే రంగులను పూసిరని నిర్ధారణగ జెప్పజాలము.
ఈ చిత్రకారులెవరో, యెచ్చటినుండివచ్చిరో, యెట్టి యాదరణను బడసిరో నిర్ణయించుట కాధారములు లేవు.
అనురాధపురమున గూడ ననేకస్థలముల జిత్రచిహ్నములుకలవు. 'రునవేలి'డగోబాకుతూర్పునగలయొక నిర్మాణమున గానవచ్చునవి ఇందు ముఖ్యములు. 'స్మైదరు' గారి చిత్తరువులను బట్టిచూడ రేఖలందును, అలంకారములందును అజంతచిత్తరువుల నివి పోలియున్నవి. ఇవి
వీటియందు తెలుపు, పసుపు, ఎరుపు, నీలిరంగులు కానవచ్చుచున్నవి. ఆకుపచ్చ కావలసినప్పుడు నీలిని, పసుపును గలిపిరి. పసుపురం గధికముగ నుపయోగపరుప బడెను.
'తమంకడువ' సమీపమున గల రెండుగుహలందు బెల్‌గారు కొన్ని చిత్తరువులను జూచిరి. ఇవి విశేషముగ చెడలేదుకాని యంత విలువగలవి కావు. కిరీటముల తోను, కాంతి మకుటములతోను ఐదుగురు భక్తులు కూర్చొని యున్నటు లొకచిత్రము కలదు. ఇది పురాతనమేకాని కాలనిర్ణయము చేయుట కాధారములు లేవు. ఇది ఏడవ శతాబ్దమునకు బూర్వపు చిత్తరువై యుండును.
ఇట్టి చిత్రరాజములు సృజింపబడుటకు బౌద్ధమతము ముఖ్యకారణము. బౌద్ధమతము లేకపోయిన భారత భూమియందు చిత్రలేఖనము నశించియుండునని చెప్పుట కాదు. దేశమున జిత్రకారులను జూచియు, చిత్తరువులందు బ్రజలకుగల యాసక్తిని గనిపెట్టియు బౌద్ధులు తమ మతవ్యాప్తి కిది యొకయాధారముగ గొని చిత్రకారులను బ్రోత్సాహపరచిరి. ప్రజల యుద్యమబలము లేనిది రాజుల పోషణమాత్రమున నీ కళ యింత వ్యాపించి యుండ జాలదు.