భారతీయ చిత్రకళ/ఏడవ అధ్యాయము
ఏడవ అధ్యాయము
మొగలు చిత్రలేఖనము 1
ఎనిమిదవ శతాబ్దము నుండి అక్బరు చక్రవర్తి సింహాసనమునలంకరించువరకు - అనగా సుమారు తొమ్మిదివందల ఏండ్లకాలమున - భారతదేశమున వ్రాయబడిన చిత్తరువులు లభించుటలేదు. ఈ కాలమున చిత్రకళ దేశమున మరుగుపడెనని చెప్పజాలము. చిత్రలేఖనమున నెట్టి యభ్యాసమును లేని భారతీయులు అక్బరు కాలమున 'అబ్దుల్ సమదు’గారి చిత్రరచనావిధానములను గ్రహించి వారితో సమానులగుట యసంభవము. తమకు నూతనమైన విదేశపు విధానము నంత సులభముగ గ్రహించుటకు వీరు స్వదేశవిధానములందు విశేషముగ ననుభవమును కలిగియుండవలెను. ఇది యూహామాత్రముకాదు. కహార్ అను పల్లకీమోయు జాతికిచెందిన దశ్వంతు అను చిత్రకారుడు జన్మము వలని ప్రతిబంధకముల నన్నిటిని జయించి అక్బరు చక్రవర్తి దర్బారున చిత్రకారుడుగ బ్రసిద్ధికెక్కుట దీనికి ప్రబలనిదర్శనము. ఒకనాడు చక్రవర్తియొక్క దృష్టి దశ్వంతుమీద పడెను. వెంటనే అక్బ రీతని ప్రవీణతను గ్రహించి 'అబ్దుల్ సమద్ 'గారి కప్పజెప్పెను. కొలదికాలమున నీతడు తక్కిన చిత్రకారుల నందరిని మించుటయే కాక జీవితకాలమునంతను చిత్రరచనయందే గడపెను. కాని యీత డకాలమున నున్మత్తుడై యాత్మహత్య గావించుకొనెను.
అక్బరు పర్షియా చిత్రలేఖనమును భారతదేశమున బ్రవేశపెట్టకపూర్వము కాశ్మీరమున నీకళ యభ్యసింపబడు చుండెననుటకు వస్త్రముమీద వ్రాయబడిన పెద్ద చిత్తరువు లిరువదినాలుగు లభించెను. 'తబ్రిజ్' నివాసియగు 'మీర్ సయ్యద్ ఆలి'చే రచింపబడిన చిత్తరువుల నివి పోలినవి. ఇవియన్నియు యుద్ధమును తెలియజేయును. వీటి చరిత్ర యెట్టిదో తెలియక పోయినను అక్బరు సోదరుడగు 'హైదర్ మీర్జాదగ్లక్' 'కాశ్మీరము నేలుకాలమున నివి చిత్రింపబడినవి. కాన క్రీ.త. 1540-1550 సంవత్సరముల నాటివనిమాత్రము చెప్పవచ్చును.
అక్బరుకాలమున మొగలుచిత్రరచన ప్రారంభమై, తరువాతి యిరువురు చక్రవర్తుల కాలమున బ్రబలి, పిమ్మట క్షీణించుటచే దీని కాలము చాల తక్కువ. భారతదేశమున జన్మించుట కాని, పెరుగుటకాని జరుగకపోవుటచే హైందవచిత్రరచనకును, దీనికిని గల సంబంధ మల్పము. అజంత చిత్తరువులును, పర్షియా చిత్తరువులును ఒకేదేశమున వ్రాయబడెనని యిచ్చటి పరిస్థితులు తెలియనివారు నమ్మజాలరు. ఇది భారతదేశపు చిత్రలేఖనచరిత్ర కంతగా జెందకపోయినను, ఇందు గణనకువచ్చినవన్నియు నిచ్చట వ్రాయబడుటవలనను, భారత చిత్రకళ అనేకవిధముల దీని ననుసరించి మారుటవలనను కొంత చర్చించుట భావ్యము.
చిత్రరచన చైనానుండి రష్యాతురుష్కస్థానములద్వారా పెక్కుమార్పులను జెంది పర్షియాలో ప్రవేశించుటచే నిందు ఇప్పటికిని మంగోలియా చిహ్నములు కలవు.
తైమూరిద్ రాజులు భోగేచ్ఛ కలవారు. లోకమిచ్చు సౌఖ్యముల నన్నిటిని ఎట్టి జంకును లేక యనుభవించిరి. చిత్తరువులును వీరి యానందముకొర కుపయోగింపబడినవి. కాన పదునైదవశతాబ్దమున పర్షియాయందిది యింతయున్నతదశకు వచ్చెను. మొగలు చిత్రలేఖన మను పేర పిలువబడునది దీని శాఖయని చెప్పవచ్చును. తైమూరువంశపు రాజులలో నొకడుగు తైమూర్లేను హిందూదేశమున చక్కని నిర్మాణములను పాడుచేసెను కాన వీరిక్రింద కళ యభివృద్ధిపొందుట యసంభవమని కొందరు భావింపవచ్చును. ఈతడు మూర్ఖుడైనను ఈతని వంశమువారు కొంత నాగరికులై యుండిరని పర్షియాదేశపు చరిత్రయందు గలదు.
పదునాల్గవ శతాబ్దమున జింగిస్‌ఖాను రాజ్యము నేలినప్పుడు వ్రాయబడిన చిత్తరువులు కొన్ని లండనునందు కలవు. ఇవి చక్కని రంగులతో నాహ్లాదకరముగ నున్నవి. ప్రకృతి భక్తిపూర్వకముగ బ్రదర్శింపబడెను. చైనా కళయొక్క చిహ్నములుమాత్ర మన్ని చిత్తరువులందును కనబడుచున్నవి.
మూగయగు ఉస్తాద్ గంగు యొక్క శిష్యుడును, ఖురాసానునం దుండిన హుస్సేను సుల్తానుయొక్క యాశ్రితుడును అగు బిహ్జాద్ ఈ చిత్రకారులలో ముఖ్యుడు. ఈతడు మంగోలియా విధానములను చాలవరకు మార్చి తనశిష్యుల సహాయమున పర్షియా చిత్రరచనకు నూతన సౌందర్యమును దెచ్చెను. వర్ణ లేపనములో నీతని మించిన వాడు లేడని బేబరుచక్రవర్తి వ్రాసెను. ఈతని శిష్యు లలో 'మీరక్' వన్నె కెక్కెను. పర్షియారాజగు 'షాతహ్ మస్పు' కొరకు వ్రాయబడిన 'ఖామ్సాయై నిజామీ' యను గ్రంథమున విూరక్ వ్రాసిన చక్కనిచిత్ర మొకటి కలదు. ఇందు ప్రకృతి బాగుగ లేదు కాని పులులు మొదలగు మృగములు మాత్రము చాల అందముగ నున్నవి.
ఈ చిత్రకారుల విధానములనే అక్బరుచక్రవర్తి భారతదేశమున బ్రవేశపెట్టెను. సంపాదించిన రాజ్యమును స్థిరపరచుకొనుటయందును, క్రొత్తరాజ్యములను వశపరచుకొనుట యందును మొగలు చక్రవర్తులు సదా నియుక్తులై యుండినను, వీలగునప్పుడెల్ల చిత్రలేఖనమును, తక్కిన కళలను ప్రోత్సాహపరచుచు వచ్చిరి.
బేబరు చక్రవర్తి జీవనమంతయు కష్టములలో గడపుట కలిగెను. కాన తన కళాభిరుచి నంతగా కార్యరూపమున బెట్టజాలకపోయెను. అక్బరు పాలన మన్నివిధముల మొగలు రాజ్యకాలమున నుత్తమమైనది. దేశమున శాంతికలుగుటచే లలితకళలు ముందుకు వచ్చెను. చిత్రలేఖనమునం దీచక్రవర్తికి మిగుల నభిలాషయని 'అబుల్ ఫజల్' తన 'అయినీ అక్బరీ' యందు వ్రాసెను. రాజపోషణ కలదని విని దేశ దేశములనుండి చిత్రకారులు ఢిల్లికి వచ్చి తమ ప్రవీణతను చాటించుచుండిరి. హిందూ మహమ్మదీయభేదమును పాటింపక కళాప్రవీణుల నందరిని సమభావమున అక్బరు మన్‌సబ్దారులు అనగా తన కొలువున ముఖ్యమగు ఉద్యోగులుగ నియమించి, మంచి వేతనముల నిచ్చుచుండెను. ఇట్టివారు సైన్యమునందును, రాజకీయమునందును అధికారులుగ బరిగణింపబడి గౌరవమును బొందుచుండుటచే నుత్సాహముతో బనిచేసి తమపోషకుని మెప్పింపజూచుచుండిరి. పుస్తకములసంపుటముల గట్టెడి బంగారు, వెండిపూఁతల బూసెడి, తక్కిన పనులను జేసెడి పనివాండ్రందరు సైనికులతో సమానులుగ నెంచబడుచుండిరి. సౌఖ్యముగ గాలయాపనము జేయుటకు చాలునటులు వీరికి వేతనములు లభించుచుండెను. వారమున కొకమారు చక్రవర్తి వీరిపనులను స్వయముగ బరీక్షించి తగురీతిని బహుమతుల నిచ్చుచుండెను. హైందవులకు క్రొత్తయగు నిజామి మొదలగు మహాగ్రంథములను వ్రాయుటకు 'బసవన్, దశ్వంతు, కేశుదాసు' మొదలగు హిందూచిత్రకారులను నియమించుటయం దా చక్రవర్తియొక్క హృదయ వైశాల్యము తెలియగలదు.
చిత్రకళను ప్రోత్సాహపరచుటయందు జహంగీరు అక్బరును మించెను. తన పోషణక్రిందనుండిన చిత్రకా రుల చిత్తరువులను జూచి యీత డుప్పొంగు చుండెను. పదునేడవ శతాబ్దపు ప్రారంభమున మొగలుదర్బారును తిలకించుటకు వచ్చిన యైరోపీయు లీతనికిగల చిత్రకళాభిమానమును పొగడుచు వ్రాసిరి. జహంగీ రొకానొక రూపచిత్రముయొక్క ప్రతుల నైదింటిని వ్రాయించి 'సర్ థామస్ రో' గారికి చూపించెను. మూలమునకును, ప్రతులకును వ్యత్యాసము వీరు కనుగొనజాలక పోయినందుకు చక్రవర్తి బాలునివలె నానందించి, “మేము మీరనుకొనునంత చేతకానివారము కాము” అనుచు నొకచిత్రమును కాగితమున జుట్టి, యొక గ్రంథముననుంచి ఇంగ్లండున బ్రదర్శింపుడని యిచ్చెను. వేటనుజూపు చిత్రములను, వింతజంతువుల చిత్రములను ఈ కాలమున విశేషముగ వ్రాయుచువచ్చిరి. ఇప్పటికే భారతదేశమునకు వచ్చుచుండిన ఐరోపీయనుల చిత్రము లనేకములు కానవచ్చుచున్నవి. ఇట్టి పోషణక్రింద చిత్రలేఖన మభివృద్ధిబొందుట యొకవింత కాదు.
బౌద్ధుల చిత్రలేఖనము క్షీణించినపిమ్మట శిల్పమౌన్నత్యమును వహించినటులు జహంగీరుతో మొగలు చిత్రలేఖనము క్షీణించి మొగలు శిల్పము వృద్ధిజెందెను. ఆగ్రాయందలి తాజ్ మహలు మొదలగు మహానిర్మాణ ములందు షాజహానుచక్రవర్తి నియుక్తుడగుటవలన చిత్రలేఖనమునకు ప్రోత్సాహము తక్కువయయ్యెను. రంగులు, పొందిక యీకాలపుచిత్రములందు బాగుగ నున్నను పటుత్వము మాత్రము లేదు. ఇప్పడే 'ఢిల్లీకలమ్' అను చిత్రరచనావిధానము ప్రారంభమయ్యెను.
షాజహాను యొక్క వార్ధక్యమున రాజ్యము కొరకాతని నలుగురుపుత్రులు పోరాడజొచ్చిరి. ఇందు వలన గలిగిన యశాంతిలో నీకళ వాడెను. కపటియైన ఔరంగజేబునకు లలిత కళలందు కొంచెమైనను అభిరుచి లేకపోవుటవలన నుద్యోగులందుగల యభిమానము గూడ సన్నగిల్లెను. ఔరంగజేబు దక్షిణమును జయింప వచ్చినప్పుడు మొగలు చిత్రరచన కొంతవరకు దక్షిణమున వ్యాపించి 'దక్కనికలమ్ ' అను శాఖగ నేర్పడెను. ఈ చక్రవర్తియొక్క యంత్యకాలమున కొన్ని చిత్రకారుల కుటుంబములకు పాట్నా, బీహారు లందు కాపురములు స్థిరపడుటవలన నచ్చటను కొన్ని మొగలు చిత్తరువులు కానవచ్చుచున్నవి.
ఔరంగజేబు మరణించిన పిమ్మట మొగలరాజ్యము శక్తిని గోలుపోయెను. కొందరు దుర్బలురగు చక్రవర్తులు సింహాసనము నెక్కినను చిత్రలేఖనమును పోషించుపాటివారు కాకుండిరి. విదేశము నుండి తేబడిన మొగలు చిత్రరచన భారతీయులను విశేష మాకర్షింపక పోవుటచే మొగలు సామ్రాజ్యముతో నిదియు నంతమొందెను. పాలకులధనమున కాశించి, వారి దర్బారు నాశ్రయించియుండిన చిత్రకారులకు ప్రజలవలన జీవనోపాయము కలుగక పోవుటచే తమకుంచెల నొకమూల బారవైచి యుదరపోషణ కితరవృత్తులందు నియుక్తులైరి. మహమ్మదీయుల కాటపట్టుగనుండిన లక్నో యందును, అయోధ్యనబాబుల క్రిందను వీరు కొంతకాలము చిత్రించిరి. పందొమ్మిదవ శతాబ్దమున ఐరోపావిధానములుదేశమున బ్రవేశించుటవలన నింకను చిత్రకారు లనిపించుకొనుచుండిన వారు ఈస్టిండియా కంపెనీదొరల రుచుల కింపుగ నుండునటు లీనూతన విధానముల నభ్యసింప మొదలిడిరి. దీనితో పర్షియా చిత్రలేఖనము భారతభూమియందు మాయమయ్యెను.
స్వర్గమునందుకాని, భూమియందు కాని కల యేవస్తువుయొక్క రూపమునైనను మహమ్మదీయులు వ్రాయకూడదని మహమ్మదీయుల మతగ్రంథమగుఖురాను నిషే ధించుచున్నది. ఈ నిషేధమును మహమ్మదీయులు సాధారణముగ పాటించినను కొన్ని సమయములందు సరకుచేయలేదు. క్రీ. త. 685-705 లలో 'ఖలీఫ్ అబ్దుల్ మల్లిక్" జెరూసెలము'నం దొక మసీదును గట్టించి, స్వర్గనరకములచిత్రముల నందుచిత్రింపించెను. 'ఇస్ఫహాను 'నందున్న 'జుమెయి’మసీదుగోడలపై మహమ్మదుయొక్క అల్లుడగు 'ఆలీ' యొక్కయు, 'ఫతీమ' యొక్కయు చిత్రములుకలవు. అన్ని మసీదులు నిటులుండుననిభావింప జనదు. తక్కిన ప్రార్థనమందిరములన్నియు నెట్టి యలంకారములును లేకయే యున్నవి. ఈ నిషేధము నంతగా పాటింపని షియాతెగ మహమ్మదీయులు పర్షియాయం దధికసంఖ్యాకులు కలరుగాన పూర్వ కాలమునుండియు నాదేశమున చిత్రలేఖనము వర్ధిల్లుటకలిగెను. ఈ స్వేచ్ఛ ముఖ్యముగ గ్రంథములను సచిత్రములుగ వ్రాయుటయందు వినియోగింపబడెను. మొగలుచక్రవర్తులు హిందూదేశమున పరిపాలనకు, మతమునకు నధికారులుగ నుండిరి కాన నీఖురానుసూత్రమును లక్ష్యపెట్టుట కవసరము లేకపోయెను. తమ దర్బారు నలంకరించుటకును, చిత్రలేఖనము వినియోగించుటకును వీరు నిరాటంకముగ పర్షియా ననుసరించిరి. “చిత్రలేఖనమును జూచి యనేకు లసహ్యపడెదరు కాని యట్టివారు నాకు హితులుకారు. దేవుని గ్రహించుటకు చిత్రకారున కొకవింత మార్గమున్నటులు నాకు తోచుచున్నది. ఏలనన : చిత్రకారుడు జీవవస్తువులను వ్రాయుట యందు వాని వివిధాంగములను వ్రాయునప్పుడు వ్యక్తిత్వమును ప్రసాదింప నశక్తుడై జీవనప్రదాతయగు దేవుని దలపవలసివచ్చును. ఇందువలన నాతని జ్ఞాన మధికమగును.” అని అక్బరు చక్రవర్తి యొకానొక సందర్భమున జెప్పెను. ఈ కారణముల వలన ఔరంగజేబు తప్ప తక్కిన మొగలు చక్రవర్తు లందరు చిత్రలేఖనము నాదరించు భాగ్యము కలిగెను.
యవనశిల్పము గాంధారమున భారతరీతులకు లోనై హైందవ శిల్పసముద్రమున గలసిపోయినటులు పర్షియాచిత్రలేఖనమును భారత చిత్రరచనావిధానములకు లోనై యనేకములగు మార్పులనుబొందెను. మహమ్మదీయులు భారతదేశపు ప్రజలలో లీనమగురీతి నిదియువారితో భారతదేశపు చిత్రకళయందు లీనమయ్యెను. దర్బారున పర్షియాదేశపు చిత్రకారులు పొందిన ప్రోత్సాహమును జూచి భారత చిత్రకారులు నట్టిచిత్రములను వ్రాయ మొదలిడిరి. ఈ ప్రయత్నములందు రెండు రకములును మనోహరముగ మేళవించెను. మహమ్మదీయగ్రంథముల నలంకరించుటకు అక్బరు భారత చిత్రకారులను నియమించుటవలన పర్షియా విధానములందు సనాతన హైందవ విధానములు జొచ్చి, నూతనచిత్రము లేర్పడి యందరిదృష్టి నాకర్షించి సకలజనామోదమునుబడసెను. మహమ్మదీయులు నిట్టి చిత్రములను వ్రాయమొదలిడుటతో నివిసర్వసాధారణముగ నందరు చిత్రకారుల యాదరణనుబడసెను.
భారతదేశమున శుభప్రదముగ బ్రారంభమైన నిట్టి పర్షియాచిత్రరచన తొలుత మొగలు దర్బారునందును, ధనికుల, యుద్యోగస్థుల గృహములందును పోషింపబడి రానురాను రూపచిత్రముల రూపమున బ్రజలయందు కొంతవరకు వ్యాపించెను. గాఢముగ బూయబడుచుండిన వర్ణములు హిందూకళాకోవిదుల చేతులయందు లావణ్యముగ, తేలికగ, కనుల కింపగునటులు నుపయోగపడజొచ్చెను. కొన్ని చిత్రము లొకేవర్ణముతో నద్భుతముగ జిత్రింపబడెను. వెలుతురుచాయలు ప్రదర్శింపబడుటవలన బ్రజల నాకర్షించినను చిన్నవిగనుండి పర్షియావాటివలె గానబడి జన్మస్థలమును మరిపించక యుండెను. వేట, దర్భారునందలి యుత్సవములు, సాంఘికజీవనము, రాజకీయము, ఏవైనను, ఎంతటి పెద్దచిత్రమును వ్రా యుట కవసరము కలిగినను చిన్న చిత్రములందే యన్నియు నిముడు నటులు వ్రాయుచుండిరి. మొగలు చిత్తరువు లందిది యొక ముఖ్యవిశేషము.
మొగలుల యుద్యోగస్థులు భారతదేశమున నచ్చటచ్చట ప్రతినిధులుగ నుండి తమ దర్బారుల నతివైభవముతో జరుపుచుండిరి. తక్కిన యాశ్రితులతోపాటు చిత్రకారులు చిత్తరువులను వీరికి కానుకలుగు నిచ్చి బహుమతులను బొందజూచిరి. పాలకులరుచులనుబట్టి యీ మొగలు చిత్తరువులు సంస్థానాధీశులయాదరణను కూడ బడయజొచ్చెను.
భారతదేశమునందు వివిధప్రాంతముల ప్రజలకు రుచులయందు వ్యత్యాసము కలదు. దేశమున ననేక ప్రాంతములందు కానవచ్చు చిత్తరువులందు ఈకారణమున భేదము కాన్పించు చున్నది. మొగలు చిత్రరచనా విధానములనెడి వృక్షమున కీవివిధప్రాంతముల చిత్రలేఖనరీతులు శాఖలవలె నున్నవి. వీటికి “కలము”లని పేరు. “కలము”సకు ఉరుదూభాష యందు "వ్రాయుపరికరము” అని యర్థము. ఇందువలన కుంచెయనియు, రీతి, లేక విధానము అనియు నర్థము నిచ్చును. వీటికికల భేదము వర్ణలేపనము నందు తప్ప ఇతరవిషయములందు లేదు. ఢిల్లీ కలము ఢిల్లీమొగలు దర్బారునకు జెందినది. ఈ కలములలో నిదియే ముఖ్యమైనది. ఈ చిత్తరువులందు రేఖలు స్పష్టముగ నుండును.
జయపురకలమున వస్తువులపుష్టిని జూపుచాయ ప్రాధాన్యము వహించుటచే రేఖ లంతస్ఫుటముగ గానరావు. రాజపుత్ర చిత్రలేఖనమునకు నీ ప్రదేశమే ముఖ్యస్థానమగుటవలన నీ రెంటికిని గలభేదము తక్కువ.
లక్నోకలముయొక్క చిన్న చిత్రము లన్నియు నించుమించుగ ఢిల్లీకలమునకు జెందినటులుండును. కాగితముపై తెలుపురంగు నెక్కువగ వాడి చిత్తరువుల నధికాంశము నీటిరంగులతో నిచ్చట చిత్రించిరి.
డక్కన్ కలమునందలి చిత్రములు, వాటియందలి వస్తువులకూడికలును చాల చిన్నవి. అచ్చటచ్చట బంగారపు రంగును పూయుట వలన నివి డిల్లిచిత్తరువులను పోలియున్నను వాటికంటె సుందరముగ గానవచ్చును.
పందొమ్మిదవ శతాబ్దమున పాట్నాకలము ముఖ్యముగ వంగదేశమున బ్రబలెను. ఈ చిత్రములు తొలుత లిఖించుటయందు సుందరముగ నున్నను పూర్తియైన పిమ్మట లలితములుగ కానరావు. పనితనమున డెల్హికల ముయొక్క ప్రాశస్త్య మున్నను వర్ణ లేపనమున మోటుగ నున్నవి.
కాశ్మీర కలమునకు వ్యక్తిత్వము చాల తక్కువ. కాశ్మీరదేశమునుండి లాహోరు మొదలగు పట్టణముల కీచిత్రకారులు త్వరలో చెదరి పోయిరి.
'రుమి'యను మఱియొకకలము కలదు. అది ఐరోపా విధానముల బోలియుండును. తమ నివాసముల నలంకరించుటకు మొగలాయి చక్రవర్తులవలనను, క్రైస్తవ మతప్రచారకులవలనను ఇది ప్రోత్సాహపరుపబడెను.
ఆకాలమున హిందూదేశమునందేకాక పర్షియాయందు కూడ ఐరోపా చిత్రరచన మిగుల నాదరింపబడు చుండెను. ఐరోపా చిత్తరువులను వ్రాయనేర్చుకొనుటకు కొందరు చిత్రకారులను 1587-1629 సంవత్సరములలో మొదటి 'షా అబ్బాసు' రోమునకు బంపెను. రెండవ 'షా అబ్బాసు'ను ఇటులు ప్రోత్సహింప జూచెను. ఇటులు నేర్చుకొనిన చిత్రకారులలో నొకడగు 'మహమ్మదు జామను పొలో జామన్' అను మారుపేరున స్వదేశమునకు మరలుట వలన ప్రజల యాగ్రహమునకు గురియై హిందూదేశమునకు వచ్చి షాజహానువద్ద మనసబుదారుగ నుండెను. ఈతడు వ్రాసిన మూడు ఐరోపా చిత్తరువులు లభించినది. 'దారాషుకోషు' చిత్రసమితియందు 'సెయింటు కేటెరిన డిసయోనా 'యొక్కయు, 'సెయింటు మార్గరిటా 'యొక్కయు చిత్తరువులు కలవు. 'ఫతెహ్‌పూరుసిక్రీ యందును, లాహోరునందును బైబిలునకు చెందిన చిత్తరువులు కొన్నికలవు. ఆదాము కుమారు డగు ఇబ్రహీము రాజ్యమును త్యజించి విరాగి యగుటయు, దేవదూత