Jump to content

భారతీయ చిత్రకళ/ఎనిమిదవ అధ్యాయము

వికీసోర్స్ నుండి


ఎనిమిదవ అధ్యాయము


మొగలు చిత్ర లేఖనము 2

ఆక్బరు చక్రవర్తి మతభేదమును పాటింపక చిత్రకళతో సాహిత్యమునకుకూడ చేయూతనొసగెను. అనేక మతములవారిని బిలిపించి వాదనలను సలుపుచుండెను; కవులకు బహుమతుల నొసగుచుండెను. ఇట్టి సానుభూతి వలన ఆగ్ర, ఢిల్లి మొదలగు నగరములందు గ్రంథాలయములు నెలకొల్పబడెను. ప్రాగ్దేశపు గ్రంథరాజముల నన్నిటిని చక్కగ వ్రాయించి, చిత్తరువులనుజేర్చి సంగ్రహించుటచే మన కిప్పు డనేక చిత్రములు లభించు భాగ్యము కలిగెను. జయపురమునందున్న 'రాజంనామా'యను మారుపేరుకల మహాభారతసంగ్రహమును, వాషింగ్టనునందున్న రామాయణమును, సౌత్ కెన్సింగ్టనునందున్న అక్బరునామా యందలి 117 చిత్తరువులును దీనికి నిదర్శనములు.

అక్బరు తదనంతరము జహంగీరు, షాజహాను, ఔరంగజీబు, రెండవఅక్బరు, మీర్ మహమ్మదు, షాఆలమ్, రోహిల్‌కండు ప్రభువగు హఫీజ్ రహమత్, అయోధ్య ప్రభువగు అసఫుద్దౌలా మొదలగువారు నీ గ్రంథాలయముల నాదరించుచుండుట వలన నూతనచిత్రములు చేర్పబడుచుండెను. కాని మొగలాయిప్రభుత్వ మంతమొందు కాలమున దేశమునగలిగిన సంక్షోభమునం దీ చక్కని గ్రంథకూటములు నాశనమయ్యెను. నశించగా మిగిలి ప్రపంచమునం దచ్చటచ్చట కానవచ్చుచున్న గ్రంథములందలి చిత్తరువులు మనకిప్పుడు మొగలు చిత్రరచనను విమర్శించుటకు ముఖ్యాధారములుగ నున్నవి.

బసవన్, దశ్వంతు మొదలగు సుప్రసిద్ధ చిత్రకారులచే చిత్రింపబడినవైనను గ్రంథములందు కానవచ్చెడి చిత్రము లంతగా ప్రసిద్ధములుకావు. కాని చిత్తరువులను వ్రాయుటయందు చిత్రకారులకు విశేషము స్వేచ్ఛ లేకుండుటచే విడిగ లభించిన చిత్తరువుల మించియుండ జాలవని విమర్శకుల యభిప్రాయము. ఇట్టి చిత్తరువులు చిత్రసంపుటము (Album) లందు మనకు లభించుచున్నవి. షాజహాను చక్రవర్తి కుమారులలో నొకడుగు దారాషుకోషు గృహకలహములవలన గలిగిన యుద్ధమునం దోడిపోయి పలాయితు డగుచుండ త్రోవలో దప్పిగొని నీరు దొరకక తన భార్య మరణించె నని విని దుఃఖితు డయ్యెను. ఆమెను స్మరించుట కీనిర్భాగ్యు డొకచిత్రసంపుటమును సమకూర్చి యామె కంకితమిచ్చెను. ఇది యిప్పుడు 'దారాషుకోషు చిత్రసంపుట' మను పేర బ్రసిద్ధిచెంది యున్నది. హఫీజ్ రహ్మత్ వద్ద మరియొకసంపుట ముండెను. మొగలు సామ్రాజ్యమునాశ మొందినపిమ్మట మహరాష్ట్రుల కాలమునగూడ చిత్రరచన కొంతవరకు నిరాటంకముగ జరుగుచుండుటవలన నిట్టి సంపుటములు పూర్తిగ నశింపలేదు. ఆంగ్లేయులు భారతదేశమును జయించుకాలమున కంపెనీవారి యుద్యోగస్థులకును, సైనికులకును చిత్తరువుల నేకములు లభించుటవలన వానిని తమస్వదేశమగు ఇంగ్లండునకు గొనిపోయిరి. వానియందును కొన్ని నశించెను. మిగిలినవి చిత్రప్రదర్శనశాలలు మొదలగు సంస్థలను జేరెను.

ఈ కాలమునను హిందువుల యాచారము ననుసరించి గోడలమీదను చిత్తరువులను వ్రాయుటకలదు. ఆగ్రాకు సమీపముననున్న 'ఫతెహ్‌పూర్ సిక్రి'యందలి అక్బరు పడకగదియందును, ' మేరియముజ్ జామను'అనుపేర బిలువబడిన యాతని హిందూభార్యయొక్క నివాసమునను కుడ్యచిత్రములు కలవు. నలుబది యేబది సంవత్సరములకుపూర్వ మిందు కొన్ని మంచిస్థితియం దుండినను ఇప్పుడవి చాలవరకు చెడిపోయినవి. చిత్రసంపుటములందును, గ్రంథములందును, ఎన్నిరకముల చిత్రము లుండెనో యీ గోడలమీదను అన్నిరకముల చిత్రము లుండెను. ఇప్పటికిని బౌద్ధమత చిత్రములు మొదలుకొని జపానువారిరీతిని పుష్పములవరకును గలవు. రెక్కలుకల దేవదూతల చిత్రము లుండుటవలన సుమారు 1570 వ సం.మునందే ఐరోపాచిత్రముల నీచిత్రకారులు చూచినటులు కనుపడుచున్నది. బుద్ధుని రూపచిత్రము చైనా విధానములను స్మరింపజేయును. అక్బరు ప్రపంచము నందున్న యన్ని మతములవారి రుచులను చవిజూచెను.

పదునెనిమిదవ శతాబ్దానంతరము జానుస్మార్టు, ఒజియాస్, హంఫ్రీజ్ మొదలగు చిత్రకారులు హిందూదేశమునకు వచ్చి దంతముమీది చిత్రములను రాజగృహములందు బ్రవేశపెట్టిరి. వీటినిజూచి యిట్టిచిత్రములను ఢిల్లి యందు వ్రాయ బ్రారంభించిరికాని వీటియందు భావప్రదర్శనమేమియు గానరాకున్నది. వీరు ప్రసిద్ధిచెందిన చిత్రముల ప్రతులను దీయుటతో తృప్తినొందినట్లు కానవచ్చుచున్నది. (చూ. 137పు.)ఇట్టిప్రతులందు ఉత్తమమైనవి రచనాచమత్కృతిని జూపుచునాహ్లాదపరుపగలవుకాని భావముయొక్క "పొంగు”లేకపోవుటచే కళాభాగములుగ గణింపబడజాలవు.


టైమూరుషా సముఖమున కైది సుల్తాను బెయజిద్

యన్. సి. మెహతాగారి 'ఇండియన్ పెయింటింగు' అను గ్రంథమునుండి.

మొగలు చిత్తరువులు ప్రపంచమునందలి యన్నివిషయములగూర్చియు గలవు కాని విగ్రహారాధనను మహ

మ్మదీయ మతము సహింపకపోవుటచే మతవిషయక చిత్రములు మచ్చునకైనను కానరావు. అచ్చటచ్చట హైందవ, బౌద్ధ, క్రైస్తవ మతముల చిత్తరువులు మాత్రము కలవు. మహమ్మదీయ స్త్రీలు పరుల కంటబడరు. ఈ యాచారము వీరి పాలనలో హిందూ సంఘమునందును బ్రవేశించెను. అందుచే గృహజీవనమును గూర్చిన చిత్తరువు లల్పముగలవు గాని మహమ్మదీయుల సహజముగ భోగ ప్రియులుకొన కొన్ని స్త్రీచిత్రములును, స్త్రీలుపురుషులు కలిసియుుడు చిత్రములు కొన్నియును కలవు. ఒక స్త్రీ కూర్చుని సాంధ్యరాగమును జూచి యానందించు చున్న

టులు రావు గోవిందసింగు వ్రాసిన చిత్రము చాల సుందరముగ నున్నది. 'మల్కాజమీనియా' అను స్త్రీయొక్క చిత్రమును ఎన్నదగినది. ఒక మందిరమున నిరువురు స్త్రీ లున్నటులు మహమ్మదు ఫకీరుల్లా వ్రాసిన చిత్తరు వాహ్లాదకరముగ నున్నది. ఇట్టి వనేకములు కలవు.

రాజకీయ పరిస్థితులనుజూపు చిత్రములందు ఢిల్లిలో జరిగిన గొప్ప యుత్సవములకు జెందిన వధికాంశ మున్నవి. జహంగీరు కాలమున పర్షియా దేశమునుండి వచ్చిన రాయబారమునకు స్వాగతమొసగుట, షాజహానుయొక్క జన్మ దినోత్సవమును జరుపుట, షాజహాను తల్లియొక్క యొడియందు గూర్చొనియుండుట, సుప్రసిద్ధమైన నెమలి సింహాసనము నధిష్ఠించుట, యమునానది తీరమున సైన్యపరీక్ష మొదలగు చిత్తరువు లిందు ముఖ్యము. వీటి వర్ణలేపనము, బంగారుపూత మనోహరముగ నున్నవి. చక్రవర్తులకు సంబంధించినవియు, వారి దయ నార్జించుటకు వ్రాయబడినవియు నగుటవలన నీచిత్రములందు చిత్రకారులు తమ శక్తినంతయు జూపిరి.

'తిరియ' వ్రాసిన పంక్తిభోజనము చాల బాగుగ నున్నది. ఆనందముతో మాటలాడుచు, భోజనముచేయు


ఖొరాను చదువుట

చున్న వారును, ఫలహారములతో వెనుక నిలువబడిన సేవకులును ఎవరిస్థానమున వారున్నారు. గృహము నెదుటనొక విశాలస్థలమున, భోజనము, చుట్టును ప్రాకారము, ప్రాకారము వెనుక వృక్షములు, వానివెనుక నాకాశము, ఆకాశముననెగురు జలపక్షులు అన్నియు నింపుగ చిత్తరువున నిమిడియున్నవి.

జహంగీరు గురువువద్ద విద్యాభ్యాసము చేయునటులున్న చిత్తరు వతిమనోహరము. గురుశిష్యుల విగ్రహములు, గ్రంథములు, ప్రక్కను తివాసిపై నిద్రించుచున్న పిల్లియు లావణ్యముగ జిత్రింపబడినవి. దూరముననున్న గృహములు, చెట్లు, చిత్రకారుని ప్రకృతిజ్ఞానమును తెలియజేయును.

దారాషుకోషు చిత్రసంపుటమున గల “ఖొరాను చదువుట” యను చిత్రము నలుగురు మహమ్మదీయుల నత్యంత స్వాభావికముగ ప్రదర్శించుచున్నది.

పర్షియా భారతదేశముల కథలనుగూర్చి విశేషముగ చక్కని చిత్తరువులు లభిం చెను.

సహజముగ గల అభిరుచివలననో, తమ్ముపోషించెడి ప్రభువుల యాజ్ఞవలననో యీ కాలపు చిత్రకారులు వేటనుజూపు చిత్రములను విరివిగ వ్రాసిరి. రెండవకారణమే నిజమై యుండును. చక్రవర్తు లెన్ని పర్యాయములు వేటకు వెళ్ళిరో యన్ని చిత్తరులు కలవని తోచుచున్నది. తాము చూపెడి బాహుబలము, ధైర్యసాహసములు చిరస్మరణీయముగ నుండుటను వేటకాండ్రుకోరెదరు. వేటను జేయువారు చక్రవర్తులేయైన నిక చెప్పునదేమి? జంతువులను జంపుట, అపాయముల నుండి తప్పించుకొనుట, చిత్రరూపముగ నెదుటబెట్టి పూర్వము ప్రభువులు చేసిన పరాక్రమకార్యములను స్మృతికి దెచ్చిన బహుమతులు లభింపకుండునా? “చక్రవర్తి వేటకు వెళ్ళెను. ఒకపులి యేనుగుమీది కురికెను. పాలకుని తుపాకియందు మందు లేకపోయెను. వాహనముగ నున్న హస్తి భయపడి పలాయనమగుటకు దలంచెను. ఆపత్తులో నుండిన ప్రభువును విడిచి సేవకుడు పరుగిడుచుండెను.” ఇట్టి చిత్తరువును వ్రాయుటకు చిత్రకారున కుత్సాహముగ నుండును. ఆపదనుండి సురక్షితముగ నగరు చేరిన చక్రవర్తియు నాచిత్తరువు నానందముతో జూచును.

రూపచిత్రములందు మొగలు చిత్రరచన భారత చిత్రరచనయం దగ్రస్థానము నలంకరించును. ఇట్టిరూప చిత్రసముచ్చయము ప్రపంచమున మరి యేదేశమునను లేదని పండితులు తలంచుచున్నారు. రాజులు, రాణులు, రాజకుమారులు, విరాగులు, సైనికులు, వేయేల? అందరును ఈరూపచిత్రముల గలరు. హైందవ చరిత్రకారులు చరిత్రపురుషుల రూపవర్ణనను జేయలేదను వాదము కలదు. ఈ కొరత హైందవ చిత్రకారుడు మొగలాయీల కాలమున దీర్చివైచెను.

రూపచిత్రములను వ్రాయుట హిందూదేశమునకు క్రొత్తకాదు. చిత్రరేఖ రూపచిత్రములను వ్రాయు చిత్రకారిణియని పురాణములందు గలదు. బుద్ధుని చిత్రములు, విగ్రహములు వేనవేలు ప్రాగ్దేశములందు గానవచ్చు చున్నవి. సీగిరియ యందలి కశ్యప నృపుని భార్యలచిత్రము లెంతయో బాగుగ నున్నవి. అజంతగుహలం దిప్పటికిని 'ఖుస్రుపర్విజ్', 'పులకేశు'లు కానవచ్చెదరు. ఈ గుహల చిత్తరువు లన్నియు చిత్రకారులు స్వయముగ జూచినవారి యొక్కయో, ప్రసిద్ధివలన వర్ణనలు కలవారియొక్కయో చిత్తరువులై యుండవచ్చును. ఇప్పటికిని హిందూదేశమున చిత్రకారులు విష్ణువు, రాముడు, శ్రీకృష్ణుడు మొదలగు వారి చిత్రములను నియమముతప్పక పూర్వపు వర్ణనల ననుసరించి యాచారప్రాయముగ జిత్రించుచున్నారు. భారత విధానముల ననుసరించి తిబెత్తున వ్రాయబడిన యొక చిత్తరువునందు చిత్రకారుని రూపచిత్ర మున్నది. సింధుదేశమునందు నిట్టిచిత్తరువులను వ్రాయుట యుండెను.

అక్బరు యొక్క దర్బారు నలంకరించుటకు పర్షియానుండి వచ్చిన చిత్రకారులు కొన్ని చిత్తరువులనుదెచ్చి నటులు గన్పట్టుచున్నది. వీటియం దధికాంశము 'బిహ్జదు' వద్ద చిత్రరచనను నేర్చుకొనిన సుల్తాను మహమ్మదుచే వ్రాయబడెను. క్రొత్తగ నీదేశమునకు దేబడిన యీ చిత్తరువులకు చిరకాలము నుండి కల యభిరుచి తోడ్పడుటవలన త్వరలో మొగలు చిత్తరువులందు రూపచిత్రములు మిక్కుటమయ్యెను. మహమ్మదు నాదిరు, మీరుహాషిము, మీరు మహమ్మదు, మహమ్మదు ఫజిలు మొదలగు రూపచిత్రకారుల నడుమ భగవతి, హునారు అను హిందూ చిత్రకారు లుండిరి. భగవతి పర్షియా విధానములకు దాసుడైనను హునారు మాత్రము హిందూమార్గములను ద్రొక్కి కీర్తి నార్జించెను. అక్బరు చక్రవర్తియె తనరూప చిత్రమునకుగాను చిత్రకారునియెదుట గూర్చుండెననియు నట్టి చిత్రములను వ్రాయించుకొనుడని తన యుద్యోగుల నందరి నాజ్ఞాపించెననియు, ఈ కారణమువలన నిట్టి చిత్తరువుల సంపుటమొకటి పెరిగెననియు, నిందు మరణించిన వా రమృతులుగ నున్నారనియు 'అయిని అక్బరీ' యందు కలదు. ఇట్టిప్రోత్సాహము కలచోట రూపచిత్రములు విరివిగ వ్రాయబడుట యొకవింత కానేరదు.

అజాతశత్రువు బుద్ధుని రూపచిత్రమునుగోర నాతడు తన నీడ యొక వస్త్రము మీద బడునటులు గూర్చుండెను. దీని సహాయమున చిత్రకారుడు గౌతముని రూపచిత్రమును రచించెను. మొగలు చిత్తరువు లించుమించుగ నన్నియు నిట్టి యర్ధరూప చిత్రములు (Profiles) అని చెప్పవచ్చును. పూర్వకాలపు పర్షియా రూప చిత్రములందు మొగము మూడు భాగ ములు కనబడునటులు వ్రాసిరి. రానురాను మొగలు చిత్రకారు లర్ధభాగమే కనబడునటులు వ్రాయుట కేల నియమబద్ధులయిరో తెలియకున్నది. ఇట్టి బంధములచేకట్టుపడియు వీరు భావము, లావణ్యము, రూపమున సత్యము మొదలగునవన్నియు లోపములేక వ్రాసి శ్లాఘాపాత్రులైరి. చిత్రరచనయందు మిగుల ప్రవీణతయుండిననే కాని ఇట్టి చిత్తరువులను వ్రాయుట సాధ్యము కాదు.

ఔరంగజేబువద్ద నుండిన ఫ్రాన్సిసు బెర్నియరు అను నొకపరాసు వైద్యుడు హైందవ చిత్రములను బొగడుచు, "హైందవ చిత్రకారులు అంగసాదృశ్యమును, ముఖభావమును బాగుగ చిత్రింపజాలరు. గొప్ప కళావిశారదుల వద్ద నభ్యసించిన నిట్టిలోపములు త్వరలో పోవు"నని వ్రాసెను. ఈతని విరోధాభిప్రాయము నిజము కాదని లభించిన చిత్తరువులవలన దెలియుటయే కాక యీ కాలపు చిత్రకారులు ప్రపంచమున నితర చిత్రకారుల కీవిషయములలో వెనుకబడరని సుప్రసిద్ధ కళావిమర్శకు లిపు డభిప్రాయ పడుచున్నారు. చిత్రకారు లందరు ఢిల్లీ చక్రవర్తుల నాశ్రయించి యుండుటచే రూపచిత్రములం దధికాంశము చక్ర

వర్తుల చిత్రములు —— ముఖ్యముగ నక్బరువి. అబుల్ ఫజల్, బీర్ బల్, రాజామాన్‌సింగు మొదలగు అక్బరు మిత్రులును కొన్ని మోటుచిత్తరువులందు గలరు. షాజహాను, ఔరంగజేబు మొదలగు మొగలుచక్రవర్తులవి కొన్ని మంచివికలవు. వీరివి వారివి అననేల? పేరుగలిగిన ధనికులయు, ఉద్యోగస్థులయు, వీరులయు చిత్తరువు లనేకములు లభించినవి.

చిత్రకారుల రచనాప్రవీణతను జూపుటకు విలువగల యాభరణములు, దుస్తులు ధరించెడి చక్రవర్తుల రూపచిత్రములందు మంచియవకాశము లభించెను. చిత్రమున సాధారణముగ నొక్కరి రూపమునే మిక్కిలి యోపికతో వ్రాయుటవలన నివి మిగుల సుందరముగ నున్నవి. బంగారుపూత యుక్తముగ వేయబడెను. కొన్నిటియందు నలుపుమధ్యను గాఢమైన రంగులతో మనుష్య విగ్రహములు కలవు. మరికొన్నిటియం దంగములు కనబడునట్లు వేసవిదుస్తులు కలవు. ముఖము లితరభాగముకన్న చక్కని ఛాయలతో విరాజిల్లుచున్నవి. ఈ కాలమున చిత్తరువులందు ఛాయ విశేషముగ బాటింపబడక పోవుటచే యనవసరమగు ఛాయలకు వీటియందు తావులేదు. ముఖమునందు మనుష్యునిగుణము కనపడుచున్నదా, రూపము బాగుగ వచ్చెనా, పనితనము బాగుగ నున్నదా, అంగములు పొందికగ నున్నవాయని మాత్రము చిత్రకారులు ప్రశ్నించుకొనిరి. తక్కిన నియమములను విశేషము పాటింపలేదు.

ప్రారంభముననే విడువబడినట్టియు, సగము చిత్రించిన పిమ్మట విడువబడినట్టియు చిత్తరువులు లభించెను. వీటి సహాయమున నప్పటి చిత్రకారు లేమార్గములను ద్రొక్కిరో మనకు తెలియగలదు. ఏ తరగతియం దున్న చిత్తరువులైనను సుందరముగనే యుండుట మొగలు రచన యొక్క మరియొక విశేషము.

మృదువుగ వ్రాయబడిన ముఖమునకు సమీపముననే గాఢమగు వర్ణములతో శిరోభూషణములు, కంఠహారములు సాధారణముగ నుండును కాన బంగారమున విలువగల మణి పొదిగిననుండు సౌందర్య మీచిత్రములందు కలదు. చుట్టును నీలియాకాశము, నల్లని, పచ్చని పచ్చికపట్టులు ఉండుటవలన ముఖ్యవిగ్రహమునకు ప్రాముఖ్యము కలుగుచున్నది. స్త్రీయైన పుష్పము, చక్రవర్తియైన ఖడ్గము, విరాగియైన జపమాల ముఖ్యముగ హస్తభూషణ ములై ఒప్పియున్నవి. అర్ధముఖమే కనపడుచున్నదను చింత యీ హస్తసౌందర్యమున మాయమగును. రూపచిత్రములందు హస్తముల కెట్టి ప్రాముఖ్య ముండవలెనో యితరదేశముల చిత్రకారు లీ చిత్రములనుండి నేర్చుకొనవలెను.

అనేకులు స్త్రీలు పురుషులు నొకేచోట నుండునట్లు చూపుచిత్రములందు స్థలము చాలక వ్యక్తుల విగ్రహములను చిన్నవిగ వ్రాయవలసియుండును. ఇట్టి సందర్భములందు కూడ రూపము లతిజాగరూకతతో లోపములు లేక, వివరము లన్నిటితో జిత్రింపబడినవి.

అక్బరు కాలమున తామర్లేనుయొక్కయు, ఔరంగజేబు కాలమున అక్బరుయొక్కయు చిత్రములు కావలసి వచ్చినయెడల పూర్వపు చిత్తరువుల సహాయమున నతినిపుణతతో ప్రతులను వ్రాయుచుండిరి. రాను రా నిట్టి చిత్రముల రూపు చెడినను పూర్వరాజుల రూపములు వీటివలన మనకు తెలియుచున్నవి. ఈ మార్గమును వీ రవలంబింపక పోయినయెడల నిప్పుడు నాశనమైన తొలిరూపచిత్రము లెట్టివియో మనకు తెలియకపోయియుండును.

ఔరంగజేబు కాలమున రాజపోషణ తగ్గునాటికి రూపచిత్రములయెడల ప్రజలయం దనురాగ ముదయిం చెను. కాన చౌకగ లభించు చిత్తరువులు కావలసివచ్చెను. ఉదరపోషణకే కష్టపడు చిత్రకారు లేదో యొకవిధముగ ప్రాతచిత్తరువుల ప్రతులను వ్రాయ బ్రారంభించిరి. ఇట్టి చిత్తరువులందు కళాప్రవీణత యుండుట యసంభవము. మొగలు చిత్రలేఖనము క్షీణించుట కిది యొక హేతువు.

పలుచని చర్మముమీద సుప్రసిద్ధ రూపచిత్రములను రేఖలతో వ్రాసి చిత్రకారులు సంగ్రహించుకొనిరి. వీనినొక కాగితపుముక్కపై నుంచి దిద్దుటవలన నూతనచిత్రాకృతి దానిపై నేర్పడును. దీనిపై రంగులనువేసి పూర్తిజేసి బజారునందమ్ముచుండిరి. ఇట్టివియు నచ్చటచ్చట లభించెను కాని పూర్వపు చిత్తరువులను వెక్కిరించునటులు నున్నవి.

కొన్ని చిత్రములవిూద వానియందలి వ్యక్తులపేర్లను మొగలు చిత్రకారులు వ్రాయుచువచ్చిరి. ఎవరైన నొకవ్యక్తియొక్క చిత్రమును వెలకు కావలెనని కోరినప్పుడు, మొగలు సామ్రాజ్యానంతరము ఉదరపోషణకు చిత్రలేఖకులని నటించెడివారు తొలి చిత్తరువులవలె వ్రాయజాలక, వా రిదివరకు సంపాదించిన ప్రాతచిత్రములపై పేర్లను మార్చుచు విక్రయమున కర్పించుచుండిరి. ఇందువలన చిత్రములపై నున్న పేర్లపై చిత్రకారు లాధారపడజాలరు. ఏ సంస్థ యైనను క్షీణించుకాలమున నిట్టి విపరీతములు కలుగుట సంభవము.

జహంగీరు చక్రవర్తికి జంతువులయెడల, పక్షులయెడల ప్రేమ యెక్కు వగుటచే తనకు కానవచ్చిన ప్రతి వింత మృగము యొక్కయు, పక్షియొక్కయు చిత్రములను వ్రాయింపించుచుండెను. జగన్నాథు చిత్రించిన నెమళ్లచిత్రమును, దారాషుకోషు చిత్రసంపుటమునగల బాతు ఈకాలపు పక్షులచిత్రముల సౌందర్యమునకు నిదర్శనములు. మన్సూరు అను చిత్రకారుడు నిట్టిచిత్తరువుల ననేకములను వ్రాసెను. ఇట్టి రచనను వీరు జపానునుండి నేర్చుకొనిరా యను సంశయము కలదు.

జంతువుల చిత్రములందు చాల సుందరమైనవి కలవు. లొట్టియల చిత్రమును జూడుడు. ఒకపిల్ల పాలను త్రాగు

చున్నట్లు, మగలొట్టియ మేయుచున్నట్లు మనోహరముగ నున్నది. దూరమున చెట్లు, కొండలు, మేఘములు మొదలగునవి యనవసరముగ నిందులేవు. 'సర్వాను' వ్రాసిన యడవిపోతు, దారాషుకోష్ యందలి చిత్రములు, పిల్లి

చిత్తరువు చక్కగ నున్నవి.

చట్రములవలె చిత్రము నలువైపుల లతలను వ్రాయుటయం దీకాలపు చిత్రకారు లద్వితీయులు. ఏదేని యొక రంగును గాఢముగ బూసి దానిపై బంగారు పూతతోనైనను, మరి యేరంగుతోనైనను లతలుగ చక్కనిపువ్వులు, మొగ్గలు, ఆకులు ఉండునట్లు వ్రాసిరి. పక్షులు, సీతాకోకచిలుకలు కొన్నిచోటుల గలవు. కాని తరుచుగ నివియన్నియు నాచారప్రాయముగ నుండుటవలన బోల్చుకొనుటకు సర్వదా సాధ్యము కాదు. లతలు కొన్నిచోటుల రెండు వరుసలుగ వివిధవర్ణములతో గలవు.

బ్రాహ్మి, సంస్కృతము మొదలగు భాషలను చక్కగ వ్రాయవలెనను అభిలాష హిందువులకు కలుగలేదు. పర్షియా మొదలగు మహమ్మదీయ దేశములందును, చైనాయందును తప్ప మరియేదేశముననైన నిట్టి యక్షరలేఖన మంతగా పాటింపబడలేదు. పర్షియా చిత్రలేఖన

లిపి చిత్రము

(కంగ్రాకలము)


ఏనుగు

ముతో కూడ నిదియు హిందూదేశమున విరివిగ నభ్యసింపబడుచుండెను. ఈ రచనయం దెనిమిదివిధము లుండె

ననియు, నందు 'నష్టలీఖ్' అను కొంచెము వంకరగీతలతో వ్రాయబడిన రచన యక్బరునకు ప్రియమైనదనియు అబుల్ ఫజల్ వ్రాసెను. ఇందు కాశ్మీరదేశపు 'మహమ్మదు హుస్సే' నందరిని మించెను. కొందరు చిత్రలేఖనముకంటె దీనికే యెక్కువ ప్రాముఖ్యము నిచ్చుచుండిరి.