భారతీయ చిత్రకళ/ఆరవ అధ్యాయము
ఆరవ యధ్యాయము
చిత్రలేఖనము క్షీణించుట
అజంత చిత్రకారులు 642వ సంవత్సరమున తమరంగులను, కుంచెలను విడిచిన నాటినుండియు సుమారు 1570 వ సంవత్సరము వరకు - అనగా అక్బరు చక్రవర్తి చిత్రరచనను ప్రోత్సాహపరచినవరకు - హిందూదేశమున రచింపబడిన చిత్తరువు లెచ్చటను గానరాకపోవుట యాశ్చర్యము. మిక్కిలి యభివృద్ధిజెందగల కళాబీజము లజంత చిత్రములందు గలవని కళావిమర్శకు లభిప్రాయపడి యుండ చిత్రలేఖన మొక్కపరి క్షీణించియుండదు. పర్షియాదేశపు చిత్రవిధానముల విదేశీయులు ప్రవేశపెట్టిన వెంటనే వాటియందు హైందవులు ప్రవీణులగుట వలన వీ రీవిద్య కచ్చటచ్చట జీవమును బోసి యీ వేయిసంవత్సరములు నేదో యొకవిధమున బోషించియుండిరని యూహింపవచ్చును. లేనియెడల చిత్రవిద్యయన్న నేమియో యెరుగనివారు కొంత ప్రవీణత గలిగియుండిన విదేశపు చిత్రకారులతో వారి విద్యయందు సమానులుగ నుండజాలుట యసంభవము. ఇందుకు కొన్ని నిదర్శనములు కలవు:
1. పదునైదవశతాబ్దమునకు జెందిన జైనమత గ్రంథములయందు కొన్నిచిత్తరువులు కానవచ్చుచున్నవి.
2. ఈ కాలమున దశ్వంతు అనే చిత్రకారుడుండెనని నిదర్శనములు కలవు.
3. తారానాధుని చరిత్ర.
ఇదివరకు జెప్పినటులు హిందూదేశపు చిత్తరువులన్నియు గోడలవిూద వ్రాయబడుటవలన కాలవాహిని యం దవి కొట్టుకొనిపోయెను. గ్రంథకర్త లీకళాచరిత్రము నెన్నడును వ్రాయ దలపెట్టకపోవుటవలనను, తక్కిన గ్రంథములం దెట్టియాధారములును గానరాక పోవుట వలనను, ఈ కాలపుచిత్రరచననుగూర్చి విశేషము తెలియకున్నది. అచ్చటచ్చట తలయెత్తినను, మొత్తమున నీ విద్య యనేకకారణములవలన క్షీణించెను.
భాషయందు, మతమునందు, ఆచారమునందు, వేషమునందు, సాంఘికజీవనమునందు హిందువులతో నెట్టి సంబంధమునులేని మహమ్మదీయు లీదేశమును జయింప మొదలిడిరి. హిందూనృపులందు గొప్పవారు లేకపోవుటవలన దేశమున నుత్సాహము సన్నగిలెను. గుప్తులకాలమున నన్నివిద్యలు నెంతయభివృద్ధికివచ్చెనో యిప్పు డంతతగ్గెను.
ప్రజల మతమునందు గొప్ప మార్పులు జరిగెను. చాల శతాబ్దములు దేశమున నాదరింపబడిన బౌద్ధ మతము కలహముల వలనను, గొప్ప మతప్రచారకులు లేకపోవుటవలనను క్షీణించుచు వచ్చెను. హిందూమతము బౌద్ధమతసంపర్కమువలన గొంత సంస్కరింపబడి నూతన రూపమున బ్రజ్వరిల్లసాగెను. మతమున చిత్రలేఖనమునకు జోటివ్వని మహమ్మదీయు లాధిపత్యమును వహించిరి. ఈ కారణముల వలన బౌద్ధులచే ముందుకు తేబడిన చిత్రలేఖనము బౌద్ధమతముతోపాటు క్షీణించుటయేకాక వేరు రూపముననైనను మరల లేవజాలకపోయెను. హిందూమతము చిత్రకళను బ్రోత్సాహపరచునదైనను ఈ విషయమున నెట్టి యుత్సాహమును కలిగింపజాలక పోయెను. చిత్రకళ కుంచెలను, వర్ణములను బరిత్యజించి, యినుప పనిముట్టులను, శిలలను సహాయముగా గొనెను. ఎలిఫెంటా, ఎల్లోరా, బొరొబుదరు లందలి శిలానిర్మాణ ములను జూడ హిందూమత మెట్టి చిత్రకళాప్రోత్సాహకారియొ గోచరించును. ఇట్టి మహాశిల్సు లీ కాలమున నుండుటయు చిత్రకళ పూర్తిగ మాయము కాలేదనుటకు మరియొక నిదర్శనము.
హిందూదేశమున చిత్రరచన యున్నతదశయందుండుకాలమున నలువైపులనున్న దేశముల కన్నిటికిని వ్యాపించెను. ఈ కాలపు చిత్తరువులు మాతృ దేశమున గానరాకపోయినను తురుష్కస్థానము, తిబెత్తు, నేపాళములందు హిందూవిధానములను, తత్తద్దేశీయరుచులను అనుసరించి మార్పుజెంది యభ్యసింపబడెను. వీటిని బరిశీలించిన నీ కాలపు హైందవచిత్రరచనను గూర్చి మనకు గొంత బోధపడగలదు.
1866వ సంవత్సరమున డాక్టరు సైయిన్, గ్రున్వెడెల్ పండితుడు, డాక్టరు లీకాక్ చైనాకు జెందిన తురుష్క స్థానమునందలి 'టాక్లమాకెన్' యెడారి యం దిసుకచే గప్పబడియుండిన పురాతన సౌధములను గనిపెట్టువరకు నే యాధారములును లేకయుండెను. వీటియందు లభించిన వివిధభాషల గ్రంథములందు పెక్కు చిత్తరువులు కలవు. వీటిని పండితు లింకను పూర్తిగ బరీక్షింప లేదు. కాని యివియన్నియు ఏడు, ఎనిమిది శతాబ్దములకు జెందినవనియు, చిత్తరువులలో నధికాంశ మజంత విధానముల ననుసరించియున్న వనియు, నిందు గ్రీకు, హైందవ, పర్షియను, చైనీయ నాగరికతలు మేళవించెననియు జెప్పవచ్చును.
చైనా పర్షియా దేశములందు హైందవ కళ యెట్టి మార్పులను జెందెనో 'డండన్' ఉయిలిక్' నందలి చిత్తరువులవలన స్పష్టముగ దెలియగలదు. అచ్చట నిర్మాణములన్నియు క్రీ. త. 791వ సంవత్సరమున జనశూన్యము లైనందున నీచిత్తరువు లాకాలమునకు బూర్వము వ్రాయబడినవగుట నిశ్చయము.
నములైయుండ చిత్రరచన స్పష్టముగ పర్షియాదేశమునకు జెందియున్నది. ఇచ్చట గల జలకన్యక అన్నిటిని మించిన సుందరమైన చిత్తరువు. ఖొటానుభూములను సారవంతములుగ జేయుటకు విధవ యైన నాగులరాణి నొకమంత్రి వివాహమాడెనని హు అన్త్సాంగు వ్రాసెను. ఈ కథ యీచిత్రమునకు జెందినదై యుండవచ్చును. చిత్రలేఖనము, అలంకారములు అజంతచిత్తరువులను బోలియున్నవి. ముఖము మాత్రము చైనీయము. దీనిప్రక్కనున్న యిరువురుపురుషుల చిత్రములును, వెనుకభాగముననున్న బుద్ధుని విగ్రహమును నిస్సంశయముగ హిందూదేశమునకు జెందినవి.
పూర్వకాలమున చైనాదేశపు రాజకన్యయగు ఖొటానురాణి తన శిరోజములందు పట్టుపురువుల గూళ్లను దాచి తన రాజ్యమునకు దెచ్చెనని యొక కథ కలదు. ఈ రాణియొక్క చిత్రము వెడల్పు రేఖలతో మోటుగ వ్రాయబడి యున్నను సుందరముగ నున్నది.
తొమ్మిదవ శతాబ్దమున పాడైన 'ఇదికుత్తైషాహ్రి' నగరప్రాంతమున చైనాదేశీయులు బౌద్ధసన్న్యాసుల నందరిని జంపివైచిరి. ఇచ్చట లీకాక్గారు కొన్ని చిత్తరువులను సంగ్రహించిరి. ఈ చిత్రములవంటి విప్పటికిని తిబెత్తున వ్రాయుచున్నారు.
యార్ఖోటొ యందును, చిక్కన్కోల్, టొయోఖ్లందును లభించిన చిత్తరువులన్నియు హైందవ విధానముల ననుసరించి యున్నవి.
భారత చిత్రరచన మొదట ఖొటానుకు వ్యాపించెను. అచ్చట నుండి కొరియాద్వారా జపానును ప్రవేశించెను. కబోధ, ధర్మకుక్షయను నిరువురు భారతసన్న్యాసులును, అటుపిమ్మట 605-17 సంవత్సరములలో చైనా నేలిన యాంగ్టి చక్రవర్తియొక్క దర్బారున నుండిన 'బజ్న ' యను చిత్రకారుడును, ఈతని కుమారుడగు 'వెయిఛియైసాంగ్'ను ఈ విధానము లచ్చట వ్యాపించుటకు కారకులైరి. బజ్నయు, నాతని కుమారుడును బౌద్ధ చిత్రకారులుగ బ్రసిద్ధివహించి యుండిరని చైనాదేశపు విమర్శకుల యభిప్రాయము.
ఈ చిత్తరువు లన్నిటియందును రేఖ ప్రధానమును వహించెను. జపాను, చైనాలందు చిత్రలేఖన మంతకుముందు లేదని చెప్పజాలము. బ్రిటిషు మ్యూజియము నందు గల నాల్గవ శతాబ్దమునకు జెందిన 'కుకయెచిహి'చే రచింపబడిన చిత్ర మిట్టి యూహకు తావీయదు. కాని హిందూవిధానములు బౌద్ధమత సహాయమున నీదేశములందు వ్యాపించి యాదరింపబడి పురాతన దేశీయకళను చాలవరకు మార్చగలుగుట నిశ్చయము.
ఇతర మతముల నుండి హిందూమత మనేకాంశములను గ్రహించెను. ఇటులనే హైందవకళ యెంత గొప్పదైనను పరదేశ రచనను నీరసభావమున నిరాకరింపలేదు. గ్రీకు విధానములు గాంధారశిల్పమున గానవచ్చుచున్నవి. అజంతయందు చైనావిధానములు కొంతవరకు గలవని కొందరి యభిప్రాయము. దగ్గరగనున్న తిబెత్తు నేపాళములందు హైందవకళ యెటులు విజృభించెనో యిక జూతము.
చిత్రకళ నభ్యసించునంతటి యభివృద్ధి తిబెత్తు చెందకపూర్వమే నేపాళము హిందూవిధానముల నభ్యసించెను కాని యిప్పు డీచిత్తరువు లంతగా లభించుట లేదు.
ధనార్జనమునకును, ప్రార్థనకును తిబెత్తునందిప్పటికిని చిత్రరచన విశేషముగ జరుగుచున్నది. గోడలమీదను, కాగితముల మీదను వ్రాయబడుచున్నను 'టంకా'లను పతాకములమీద విశేషముగ చిత్రములు కానవచ్చుచున్నవి.
ఈ చిత్తరువులం దెక్కువ ప్రత్యేకనియమ బద్ధములుగ వ్రాయబడును. ఒక సమకోణ చతుర్భుజమునువ్రాసి దానిని నిడివిగీతలవలనను, అడ్డుగీతలవలనను అనేక సమభాగములుగ విభాగించెదరు. ఇం దేయేభాగమున నేయే యంగ ముండవలెనో యటులు నియమము దాటక విగ్రహమును వ్రాసెదరు. ఇట్టివి భావోదయమునకు దావీయకపోయినను వర్ణలేపనమున బ్రసిద్ధిచెందుచున్నవి. రంగులు గాఢముగను, పొందికగను ఉండును. నీలియు, నలుపును కలియుచోట లేపనము మనోహరముగ నుండును. హైందవాచారానుసారము వివరములన్నియు నతిస్పష్టముగ గానవచ్చును.
చిత్రప్రదర్శనశాలలందు గల పతాకములం దెక్కువ పదునేడవ శతాబ్దము, తరువాతి కాలమునాటివైనను, 'చ్యు-జు‘నందు లీకాక్ గారికి లభించినవిమాత్ర మెనిమిదవశతాబ్దము నాటివి. ఇంతకు బూర్వముకూడ నిట్టి పతాకములపైని చిత్తరువులను రచించుచుండిరనుటకు నిదర్శనములు కలవు. బ్రిటిషు మ్యూజియమునందు గల పట్టుపతాకములన్నియు మంచిస్థితియం దున్నవి. ఇవి బౌద్ధమతమునకు జెందినను, చిత్రరచనయందు చైనా చిత్రములను బోలియున్నవి. తక్కిన పతాకములందువలె వీటియందును వర్ణలేపనము మనోహరము. నూలుతో నల్లబడిన పతాకము లనేకములు కలవుగాని ఇవియంత సుందరముగ లేవు. 11. వ శతాబ్దమున నాలందయందు బుద్ధుని బోధిసత్వుల చిత్రములను బట్టలపై జిత్రించిరని కలదు కాన హిందూదేశమునందు నిట్టివి వ్రాయుటయు గలదని చెప్పవచ్చును.
బౌద్ధమత పతన కారణములలో జారత్వమొకటి. గౌతముడు మరణించిన కొలది కాలమునకే బౌద్ధమతమున నీ యవగుణము ప్రవేశించె నని మధుర యందలి శిల్పములు చాటుచున్నవి. ఈ జాతికి చెందిన చిత్తరువు - బుద్ధుడు కాళిని కౌగలించుకొనునటులు - ఫ్రాన్సునందు గలదు. ఇది కడు హేయమైనది.
ఈ చిత్తరువులందు రూపచిత్రములు (Portraits) చాల సుందరమైనవి కలవు. ఇందు తిబెత్తు లామాలచిత్రములు రెండెంచతగ్గవి.
రష్యాకుజెందిన మంగోలియాయందు కూడ బౌద్ధచిత్రములు భారత కళావిధానముల ననుసరించి చిత్రింపబడెను. హిందూదేశమున “క్షితిపతి" యనియు, చైనాయం “దాయుస్సునిచ్చు దేవు"డనియు, జపానునందు “సౌఖ్యప్రదాత”యనియు బ్రసిద్ధిగాంచిన వృద్ధుని చిత్తరువును, పూర్వజన్మమున బుద్ధు డొక రాక్షసియై యనేకులను జంపి తుదకు పశ్చాత్తప్తుడయ్యెనను కథను తెలియజేయు చిత్తరువును ఇందు ముఖ్యములు.
ఈకాలపు బౌద్ధచిత్రము లించుమించుగ నన్నియు నిట్టివగుటచేతనే వీటియందు జీవకళతక్కు వగనున్నది. వేలకొలది సంవత్సరము లొకేవిధముగ వ్రాయబడు చిత్రములు వేరువిధముననుండుట యసంభవము. కాలము ననుస రించి మారుచుండు భారతీయ చిత్రరచన విదేశములందు పాదుకొనినను, ఎక్కువసత్వమును జూపజాలకపోయెను. దీనికి ముఖ్యకారణ మాదేశములందలి కళాభ్యాసకులభావ శూన్యతయై యుండవచ్చును.
ఇప్పుడు కానవచ్చు సనాతన నేపాళ చిత్రములన్నియు తిబెత్తు చిత్రములను బోలియుండును. ఇవన్నియు బౌద్ధమతమునకు జెందినవి. ఫ్రాన్సునం దిట్టిచిత్తరువులు పది కలవు. మత్స్యేంద్ర లేక పద్మపాణియను మారుపేరులు కల యవలోకితేశ్వరు నారాధించు భక్తుల యుత్సవమును తెలియజేయునది యిందు ముఖ్యము. ప్రకృతిదర్శన జ్ఞానము దీనియందు కానవచ్చుచున్నను, హైందవ కళాచర్చయం దిది యెవ్విధమునను ఉపయోగకారికాదు. ఇది కాక తాంత్రికచిత్రము లనేకము లున్నవి. వీటియందు చిత్రకారుని అలంకార జ్ఞానము గోచరించుచున్నను, కళాజ్ఞానము మాత్రము కాన్పింపకున్నది.
కలకత్తాయందును, కేంబ్రిడ్జియందును రెండు పురాతన గ్రంథములు కలవు. వీటియందలి చిత్తరువులు గణింపదగినవైనను విమర్శన కాగజాలవు. వీటికాలమును నిర్ణయించుట సాధ్యము కాకున్నది. ఇది పదునొకండవ శతాబ్దమునకు జెందినయెడల తారానాధుడుచెప్పిన ధీమనుని పశ్చిమవిధానములకు జెందినవై యుండవచ్చును. కేంబ్రిడ్జి గ్రంథమున సింహళద్వీపపు జంబాలుని (ధనదేవుడు) చిత్రమొకటి కలదు. స్పష్టముగ నిది భారతదేశమునకు జెందును.
సింహళమునందు పూర్వము పెక్కు. చిత్తరువులుండెను. పండ్రెండవ శతాబ్దమున 'పలొన్నారువ' యందలి 'మహాదమమశాయ' దేవాలయపు గోడలమీద కొన్ని జాతక కథలు చిత్రింపబడెను. వీటికాలమును నిశ్చయముగ జెప్పుట సాధ్యముకాదు. బహుశః 'పండ్రెండవశతాబ్దమునకు పూర్వము ‘నిస్సంక మల్లరాజు' సీగిరియ చెంతనున్న ‘దంబుల్ల' శిలాదేవాలయమును బాగుచేయించినప్పు డిందుగల చిత్తరువులు వ్రాయబడెను. ఈ దంబుల్ల దేవాలయమునందు విజయుడు సింహళమునకు వచ్చుట, మహేంద్రుని మతబోధ, దుత్తగామిని ఏలాలల పోరాటమును గూర్చిన చిత్తరువులు సుందరమైనవి కలవు.