భారతీయ చిత్రకళ
ఆంధ్రగ్రంథమాల - నెం. 13
భారతీయ చిత్రకళ
గ్రంథకర్త:
తలిశెట్టి రామారావు, బి. ఏ., బి. యల్.,
ప్రకాశకులు:
కాశీనాథుని నాగేశ్వరరావు
1930 సంవత్సరము]
[వెల రూ. 1-0-0
చెన్న పురి :
ఆంధ్రపత్రికా ముద్రాలయమున
ముద్రితము.
విషయానుక్రమణిక
1 |
20 |
40 |
55 |
70 |
91 |
103 |
116 |
133 |
154 |
169 |
185 |
196 |
తలిసెట్టి రామారావు, బి. ఏ., బి. యల్.
గ్రంథకర్త
పరిచయవాక్యములు
ఆంధ్ర గ్రంథమాలయందు శ్రీ తలిశెట్టి రామారావుగారు రచియించిన భారతీయచిత్రకళ పదవ కుసుమము. ఈగ్రంథ మాంధ్రమునందు చిత్రకళావిషయమునకు సంబంధించిన మొదటి గ్రంథము. చిత్రకళాభినివేశము లేని పరిచయవాక్యములును ప్రయోజనకరములు గావు. విశ్వప్రవృత్తియందు రసానందమునకు భావరూపములు సాధనములుగ నున్నవి. భావరూపము లవినాభావసంబంధమును గలిగి అనిత్యములైన రూపముల ద్వారా నిత్యమైన ఆత్మానందమును గలుగ జేయుచున్నవి. మానవవిజ్ఞానాంకురములు రూపలేఖనములతో నారంభమై కాలక్రమమునను మహావికాసమును బొందినవి. ఆది యుగవాసులు రచియించిన చిత్రములు ప్రాచీనగుహల యందు గనుపట్టుచున్నవి. ప్రపంచమునందు భిన్న దేశములందు చిత్రకళ వారిసంస్కారాశయముల కనురూపముగ వికసించుచు మానవధర్మాభ్యుదయమునకు సాధనం బగుచున్నది. పాశ్చాత్యశిల్పమునకురూపమును, ప్రాచ్యశిల్పమునకు భావమును మూలాధారము లై వికసించినవిధమును శిల్ప పరిశోధనలు విశదముచేయుచున్నవి. యవన రోమక శిల్పమునకు రూపసౌందర్యమును, రూపవ్యామోహమును హృదయముగను బరిణమించినది. యవన రోమక శిల్ప ప్రభవమైన పాశ్చాత్యశిల్పమునకును భౌతికవిభూతులు హృదయముగను బరిణమించినవి. భారతీయ శిల్పమునకును, విజ్ఞానమునకును భావగాంభీర్యము హృదయముగను బరిణమించినది. విశ్వప్రవృత్తియందు పాశ్చాత్య శిల్ప మాధిభౌతికకల్పనలను, ప్రాచ్యశిల్ప మాధ్యాత్మిక కల్పనలను ప్రత్యక్షము చేయుచు రూప భావ రసానందమును గలుగజేయుచున్నవి. సక లేంద్రియములయందును ప్రధాన మైన నయనేంద్రియము రూప భావానందములను గలుగజేయుచున్నది. భారతీయశిల్పము భారతీయ విజ్ఞానమువలె స్వతంత్రవ్యక్తిత్వమును గలిగియున్న విధమును శిల్పహృదయము విశదముచేయుచున్నది.
విశ్వావృతమైన ఆత్మస్వరూపమునే కావ్యములు వర్ణించుచు చిత్తమునకు బ్రహ్మానందమును గలుగజేయుచున్నవి; చిత్రములు నేత్రములకు ఆనందము గలుగ జేయుచున్నవి; గానములు వీనులకు విందుగొల్పుచున్నవి. సామాన్యముగ కావ్యములు, రూపలేఖనములును, గీతములు, భౌతికమైన రూపప్రదర్శనమునకు వినియోగపడినపుడు రూపాతీతమైన ఆనందము గలుగజాలదు. సాహిత్య కళావిషయములందు ప్రాచ్యపండితులకును, పాశ్చాత్యపండితులకును రూపభావాశ్రయమునందు భేదము గోచర మగుచున్నది. పాశ్చాత్యులకు రూపమునందును, ప్రాచ్యులకు భావమునందును అభినివేశము గోచరమగుచున్నది. ప్రవృత్తియందు భావాశ్రయము లేనిరూపముగాని, రూపాశ్రయము లేనిభావముగాని యసంభవములు. సాహిత్యకళలు రూపాశ్రయమును వ్యక్తముచేయునపుడు భౌతికవైభవమును, భావాశ్రయమును వ్యక్తముచేయునపు డాత్మవైభవమును ప్రదర్శించుచున్నవి. ఆత్మాశ్రయము లేనిపాశ్చాత్యశిల్పులకు భారతీయచిత్రకళ విచిత్రముగ దోచుట సహజము. పాశ్చాత్యశిల్పము రూపాశ్రయము ప్రముఖమైన గ్రీకు శిల్పము ననుకరించినవిధమును పాశ్చాత్యశిల్పము వెల్లడించుచున్నది. పాశ్చాత్యవైఖరి లేని భారతీయచిత్రలేఖనము పాశ్చాత్యశిల్పజ్ఞుల పరిహాసమునకు పాత్రమైనది. లోపము విమర్శకులదె కాని చిత్రకళది కాదు. రూపలేఖన మపరిమితమైన భావప్రదర్శనమును జేయుట దుష్కరము గాని పరిమితమైన రూపప్రదర్శనము జేయుట దుష్కరముగాదు. ఈపరమార్థమును గ్రహించిన పాశ్చాత్యపండితులు ప్రాచ్య చిత్రలేఖనమందలి ఔన్నత్యమును కొనియాడుచున్నారు. నూఱేండ్లక్రిందటను భారతచిత్రకళను నిరసించినపాశ్చాత్యకళాకోవిదులు వర్తమానకాలమందు భారతీయ చిత్రకళను ప్రశంసించుచున్నారు.
ప్రజల స్వాతంత్య్ర్యస్థితి సాహిత్యకళా వికాసమునకును, పారతంత్ర్యస్థితి సాహిత్యకళాక్షీణతకును, సాధనమగుచున్న విధమును సాహిత్యకళాచరిత్రము విశదము చేయుచున్నది. బ్రిటిషు పరిపాలనము భారతీయవిజ్ఞానమును స్తంభింపజేసినవిధముననే భారతీయ శిల్పమును స్తంభింపజేసినది. భారతీయసాహిత్యశిల్పములకు రాజ ప్రజాదరములు లేకపోవుటయే కాక అనాదరణముకూడ నేర్పడి సాహిత్యశిల్పములు జీవకళావిరహితము లైనవి. భారత జాతీయప్రబోధము సాహిత్యకళోద్ధరణమునకును, ఆత్మవిశ్వాసమునకును సాధన మైనది. పాశ్చాత్య పండితులు భారతీయచిత్రములందు రూపాతీత మైన భావార్థమును గమనించి దానియౌన్నత్యమును ప్రశంసించుట కుపక్రమించిరి.
మానవ సౌభాగ్యమునకు సాధనము లైన ప్రకృతి విభూతులను దైవాధిష్ఠితములుగ భారతీయశిల్పము పరి కల్పించుచున్నది. కైలాసశిఖరము శివునకు నివాసము. క్షీరసాగరము నారాయణునకు శయనస్థానము. గంగా నది భీష్మునకు జనని. ప్రవృత్తియందలి సుందరగంభీర స్వరూపములు దైవాధిష్ఠితములుగపరిగణింపబడిన విధమును భారతీయ పురాణేతిహాసములు విశదము చేయుచున్నవి. దేవతార్చనతో నారంభ మైన భారతీయశిల్పము బౌద్ధవిహారములతో పూర్ణవికాసమును బొందినవిధమును బౌద్ధగాథలు, విహారములు విశదము చేయుచున్నవి. అమరావతీ, సంచి స్తూపములు, అజంతాచిత్రములు భారతీయ శిల్పమునందు ఆధ్యాత్మికహృదయమును విశదముచేయుచున్నవి. రూపప్రదర్శనమునందును, లావణ్యమునందును, భావగాంభీర్యమునందును, అంగవిన్యాసమునందును అజంతాచిత్రములు చిత్రలేఖనమందు నిరుపమానములై కళాకోవిదులప్రశంసలకు పాత్రము లగుచున్నవి. అజంతాచిత్రముల ప్రాశస్త్యమునకు మూలకారణము రేఖా విన్యాసము. సామాన్యముగ చిత్రకారులు రంగులపొందికతో వ్యక్తముచేసెడి రూపకల్పనను అజంతాచిత్రములు రేఖలతోనే వ్యక్తముచేయుచున్నవి. అజంతాచిత్రము లందు అంగసౌష్ఠవము, అంగవిన్యాసము, అంగాలంకారములు, కాంతిచ్ఛాయలు, రేఖామాత్రకల్పితము లై అపూర్వ మైన శృంగార లావణ్య విలాసములను రూప లేఖనమునందు ప్రదర్శించుచున్నవి. భారతీయచిత్రకళకు జీవాధారము లైన దైవవిభూతులు, రేఖావిన్యాసము అజంతాచిత్రములందు సర్వత్ర ప్రత్యక్ష మగుచు పాశ్చాత్య ప్రాచ్య చిత్రకళలందు గల భేదమును వ్యక్తము చేయుచున్నవి. ధ్యానబుద్ధ స్వరూపమునందు ప్రకృతిపరవశు లైన పాశ్చాత్యశిల్పులకు జడస్వరూపము మాత్రమే గోచరంబైనను ప్రాచ్యశిల్పులకు రూపాతీతమైన శాంత, సుందర, శివస్వభావములు గోచర మగుచున్నవి. భారతీయుల ప్రత్యభిజ్ఞానము భారతీయ చిత్రలేఖనమునకును ప్రత్యభిజ్ఞానమును గలుగజేసినది. పాశ్చాత్యకళాకోవిదుల యవజ్ఞతను నిర్లక్ష్యము చేయుచు ప్రాచీన సంప్రదాయముల కనురూపముగ భారతీయచిత్రకళ నుద్ధరించుట భారతీయప్రబోధనమునకు నిదర్శనముగ నున్నది.
భరతవర్షమునందు బౌద్ధమతము క్షీణించిన తరువాత చిత్రలేఖనమును క్షీణించినది. చిత్రకళయందు రేఖావిన్యాసమునకు బదులు వర్ణవిన్యాసము ప్రముఖత నొందినది. చిత్రకళయందు రాజపుత్రకళాశైలి, మొగలాయి కళాశైలి ప్రబలి ప్రాచీనశైలిని క్షీణింపజేసినవి. పాశ్చాత్యసంపర్కము ప్రాచ్యరచనలు కనాదరణమును, పాశ్చాత్యరచనల కాదరణమును గలుగజేసినది. పాశ్చాత్యయంత్రాలయములందు ముద్రితములైన చిత్రపటములు భారతగృహముల నలంకరించి లలితకళాప్రయోజనమును సంకుచితము చేసినవి. భారత జాతీయ ప్రబోధముతో చిత్రకళయందును నవయుగనిర్మాణము ప్రారంభ మైనది. నవయుగ చిత్రనిర్మాణమునందు వంగరచనలు, ఆంధ్ర రచనలు వ్యక్తిత్వము గలిగి ప్రాచీన సంప్రదాయములకును, నవీనసంప్రదాయములకును సంయోగసాహచర్యములను గల్పించుచున్నవిధమును చిత్రలేఖనములు విశదముచేయుచున్నవి. వంగదేశమునందు అవనీంద్రనాథఠాకూరు, నందలాలు బోసు, అసితకుమార హల్దారు, ప్రమోదకుమార ఛటోపాధ్యాయుడు మైసూరునందు వెంకటప్ప, పంజాబునందు అబ్దుల్ రహమాను చుగతాయి, హకీము మహమ్మదు ఖాను, ఆంధ్రదేశమునందు దామెర్ల రామారావు మొదలగువారు రచించిన చిత్రములు భారతీయ చిత్రకళయందు ప్రాచీనసంప్రదాయసిద్ధమైన సంస్కారమును నిరూపించుచు భారతీయుల చిత్రకళాప్రతిభను విశదముచేయుచున్నవి. ఆంధ్రదేశస్థమైన అజంతాచిత్రములకును వర్తమానచిత్రములకును చిత్రలేఖనమునందుగల భేదము ఆంధ్రులపతనమును విశదము చేయుచున్నది. ఆంధ్రజాతీయకళాశాలయును, రామారావుచిత్రకళామందిరమును చిత్రకళాభ్యుదయమునకు జేయుచున్న ప్రయత్నములు కళాభిమానుల పోషణమునకు పాత్రము లగుచున్నవి. 'భారతీయచిత్రకళ'ను రచించిన శ్రీ రామారావుగారు భారతీయ చిత్రకళయొక్క వృద్ధి క్షయములను, ఔన్నత్యమును సప్రమాణముగ వారి గ్రంథమునందు వివరించి చిత్రకళాభ్యుదయమున కుపకార మొనరించిరి. ఈ గ్రంథమునందు చిత్రలేఖనోదయము, బౌద్ధయుగము, అజంత గుహలు, బాఘ్ చిత్రములు, మొగలు చిత్రలేఖనము, రాజపుత్రలేఖనము, మొదలగు విషయములకు సంబంధించినవి పండ్రెండుఅధ్యాయములు గలవు. అజంతాచిత్రములకు సంబంధించిన పటములును, వర్ణచిత్రములును భారతచిత్రకళాచరిత్రను విశదముచేయుచున్నవి. గ్రంథమునందు గ్రంథకర్త తెలిపిన క్రింది భావములు చిత్రకళావికాసావసరమును తెలుపుచున్నవి.
"వేషభాషలందేకాక ఆత్మానుభవమును వెల్లడిచేసి, యాత్మిను పరిపక్వము జేయజాలి, జాతీయతను నిలువబెట్టజాలిన లలితకళలందును పాశ్చాత్యభావము లగ్రస్థానమును వహించినను చూచుచు నిద్రావస్థయం దుండుట యాత్మహత్యను గోరుటకు సమానము. ఈ ప్రమాదమును కొందఱు గ్రహించుటచే తక్కిన జాతీయోద్యమములతోపాటు హైందవచిత్రకళా ప్రపంచమునగూడ సంచలనము కలిగెను.
భారత చిత్రకళయందు జొరబడిన విదేశరుచులను బారద్రోలి నిజమగు హైందవవ్యక్తిత్వమును మరల సింహాసనమున స్థాపింపజూచుచున్న యువకులకు అవనీంద్రనాథఠాకురు నాయకుడు. రాజపుత్ర చిత్రరచనయందు పర్షియావిధానములు కలవు. కాన సుప్రసిద్ధ అజంత, సీగిరియచిత్రములు భారతకళ నుద్ధరించుటకు మూలాధారములుగ నుండవలయునని వీరి కోరిక. కాని తరువాతి దేశానుభవమును కళాభిమాని మఱవరాదు. రాజపుత్రులచే నామోదింపబడిన విధానములం దనేకమలు వాంఛనీయచిహ్నములు కలవు. జపాను, ఐరోపావిజ్ఞానములచే పోషింపబడిన చిత్రరచనయందును క్రొత్తరుచులు కలవు. ఇంత విశాల భావముతో ప్రారంభమైన చిత్రకళ జాతీయతను నిలుపుకోగలదా యని సంశయింపవచ్చును. ఏదేశపు విజ్ఞానమునైనను తిరస్కరింపక భారతచిత్రముల కట్టుబాట్లను మఱవక వ్రాయుటయే కళకు క్షేమకరము.
ఆత్మసందర్శనమునకును, దైవసందర్శనమునకును సాధనభూతములైనలలితకళల నాంధ్రు లారాధించి పురుషార్థమును బడయుదురుగాత !
ప్రమోదూత చైత్ర బ. 8 సోమవారము (21-4-1931)
కా. నాగేశ్వరరావు.
ఒక్క మాట
మన ఆంధ్రదేశమున జాతీయచిత్రకళ ప్రాముఖ్యము వహించుచుండుటవలన రవివర్మ చిత్రములవలనను,. పాశ్చాత్యవిద్యవలనను, వ్యాపించిన ఐరోపా చిత్రరచనావ్యామోహము తగ్గజొచ్చినది. ఇట్టియదనున ప్రాచీనకాలమునుండి భారతదేశమున చిత్రకళపొందిన మార్పులను, దానియాధిక్యమును తెలుపుచరిత్ర ప్రజలకందజేసినయెడల నీప్రబోధమునకు లాభము చేకూరునను నాశతో నే నీచిన్నగ్రంథమును వ్రాసితిని.
ఈగ్రంథమును వ్రాయుటయందు “పెర్సీబ్రౌను” గారి 'భారతీయవర్ణ లేపనము'ను, 'విన్సెంటుస్మిత్తు'గారి 'హిందూసింహళ దేశములందలి లలితకళయొక్క చరిత్రను, ఆధారముగ గొంటిని. మొదటిప్రకరణమున కృష్ణా పత్రికాధిపతులు ప్రకటించిన 'సంక్రాంతి' సంచికయు తోడయ్యెను. ఈగ్రంథకర్త లందఱికి నా వందనములు.
ఇట్టిగ్రంథములను కొనువా రరుదు కాన ప్రకటించువారును అరుదు. మీదుమిక్కిలి సచిత్రముగ ప్రకటింపవలసినదగుటచే వ్యయమును అధికముగ నగును. కావున గ్రంథప్రకాశకులు దీనిని ముద్రించి ప్రకటించుటకు వెనుదీయుట సహజము. శ్రీ దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు రాజకీయసాంఘికాదులగు ఉద్యమములకు నాయకులై వానికి ప్రోత్సాహము నొసగుచు ఆంధ్రులయౌన్నత్యముకొఱ కొంతయైన త్యాగము జేయుచున్నవా రనుట క్రొత్తకాదు. నేను ఈ నాచిన్న గ్రంథమును వారి కర్పించి దానిని వారిని స్వయముగ చదువగోరితిని. వారును, నాకోరిక ననుసరించి దాని నామూలాగ్రము చదివి తమ 'ఆంధ్రగ్రంథమాల'యందు ప్రచురించుట కంగీకరించి యచిరకాలముననే ఇట్లు ముద్రింపించి వెలువరించిరి. వ్యయమునకు వెనుదీయక త్రివర్ణచిత్రములతోను, పెక్కు ఏకవర్ణ చిత్రములతోను, ఇట్లు సుందరరూపమున వెలువరించిన యీపుస్తకము శ్రీ పంతులుగారి కళాపోషణపరాయణతకు గట్టి నిదర్శనము. ఇట్లు నాప్రయాసమును సఫలముగావించిన శ్రీపంతులు గారికి కృతజ్ఞతాపూర్వకములగు నావందనసహస్రములు. ఇంకను జాతీయచిత్రరచనయెడల విముఖులైయున్న యాంధ్రులను కొందఱినైనను ఈగ్రంథము సుముఖులను జేయ గలిగినయెడల నేను కృతార్ధుడ నగుదును.
గ్రంథముద్రణానంతరము భారతీయచిత్రకళాచరిత్రయందు, కొన్నినూతనాంశములు వెల్లడియైనవి. వానిని పునర్ముద్రణమున జేర్చుకొందును.
చెన్నపురి
30-4-30
తలిశెట్టి రామారావు
హర్షవర్ధన రాజకుమారుడు