Jump to content

భారతం-శాంతిసప్తకం/ఆనుశాసనికపర్వము - చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి
​

శ్రీ

గణేశశారదాగురుభ్యో నమః

శ్రీమదాంధ్రమహాభారతము

ఆనుశాసనికపర్వము - చతుర్థాశ్వాసము

⁠



పరమమహిమనిశ్చల
తాపాదనకేళికౌతుకాతిశయమనో
వ్యాపారనిరూఢస్తు
త్యాపాంగవిలాసలలిత హరిహరనాథా.

⁠ 1

ధూపదీపనైవేద్యంబుల ఫలవిశేషము భీష్ముఁడు ధర్మజునకుఁ జెప్పుట

వ.⁠

దేవా వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె.

⁠ 2


తే.⁠

అట్లు గృహమేధిధర్మతత్త్వావగమము
దనకుఁ గలుగంగఁ జేసినతాత కెఱఁగి
మనుమఁ డూర్జితభక్తియు వినయగౌర
వంబు సమధికతావైభవంబుఁ బొంద.

⁠ 3


వ.⁠

మహాత్మా సుమనోధూపదీపనైవేద్యంబు లుత్తమంబు లగుపూజాసాధనంబు
లని వానిం గొని దేవతలం బూజింతురు తద్విశేషం బెఱింగింపవే యని యడుగు
టయు నతం డాదరభరతుం డయి దీని శుక్రుండు బలిదానవేంద్రునకు బలి
మనువునకు మనువు సువర్ణుం డనుతపోధనునకు సువర్ణుండు నారదునకుం జెప్పి
రప్పరమముని నాకుం జెప్పె నత్తెఱంగు సెప్పెద నాకర్ణింపు మని పలికి యప్పు
డమిఱేని కి ట్లనియె.

⁠ 4


సీ.⁠

ఓషధు లమృత మయ్యుత్తమవస్తుసం
                 తతిలోనఁ బుష్పవంతములు మేలు
పుష్పముల్ గొని సురపూజ లొనర్చిన
                 మానవులకు మంచిమనసు గలుగు
నట్లు గావున సుమనోభిధానము పుష్ప
                 ముల కయ్యెఁ దద్ద్రవ్యపూజ లిచ్చు
నరులకోర్కులు సుమనస్కతఁ దీర్చుట
                 నమరులు సుమనస్కు లనఁగఁ జనిరి

⁠


ఆ.⁠

కంపురూపుఁ దెలుపుఁ గలిగి యకంటక
భూరుహాదులందుఁ బుట్టినట్టి
పుష్పములఁ బ్రియంబుఁ బొంది కైకొండ్రు ని
ర్జరులు పూజనములఁ గురువరేణ్య.

⁠ 5

​

క.⁠

నలినంబులు జాజులునుం
దులసీదళములుఁ బ్రభూతతోషము గీర్వా
ణులకుం జేయును యక్షా
దులకు నలోద్భవము లెల్ల దృష్టి యొనర్చున్.

⁠ 6


క.⁠

అరుణంబులును సకంటక
తరుభవములుఁ గటుకగంధధామములు నొన
ర్తురు శాత్రవాభిచారిక
కరణమున నధర్వమాంత్రికతఁ గుసుమంబుల్.

⁠ 7


తే.⁠

భూతరక్షోగణములకు భూపవర్య
తీక్ష్ణగంధపుష్పంబులు తృప్తిఁ జేయు
నలఁపు దీపు [1]వలచి పరిమళసుకాంతి
భరితములు నగుపువ్వులు నరుల మెచ్చు.

⁠ 8


క.⁠

విను దేవాలయమునఁ బితృ
వనమునఁ బుట్టుకుసుమములు వలదు వివాహం
బునకును శాంతికపౌష్టిక
వనితాజనరంజనాదివర్తనములకున్.

⁠ 9


తే.⁠

కుసుమములగంధమున దేవకోటి వాని
దర్శంబున యక్షులు దదుపభోగ
మున భుజంగప్రతాన మీమూఁడుదెఱఁగు
లను మనుష్యులు ప్రియ మందు టనఘ కలుగు.

⁠ 10


క.⁠

దేవత లర్హకుసుమపూ
జావిధిఁ బ్రియమంది యపుడ జనులయెడల సం
భావించి వారికోర్కులు
గావింతురు సఫలములుగఁ గౌరవనాథా.

⁠ 11


తే.⁠

సల్లకీజాతనిర్యాస మెల్లదేవ
తలకు మే లంతకంటె గుగ్గిలము లెస్స
యగరు గంధర్వయక్షోరగాదులకుఁ బ్రి
యంబు ధూపదానము నెడ నధిపవర్య.

⁠ 12


వ.⁠

ధూపదానంబులయందు నధికతరంబు కర్పూరధూపం బని చెప్పి మఱియును.

⁠ 13


క.⁠

సమధురము గటువును దీ
క్ష్ణము నగుగంధములధూపకలన వరుస హృ
ద్యములు సురయక్షరక్ష
స్సమితులకును దత్ప్రకారజాతులకు నృపా.

⁠ 14


తే.⁠

తగినయట్టి ధూపము దేవతలకు నిచ్చి
పరమపుష్టియు నాయువుఁ బడయుఁ గర్త
యక్షగంధర్వపన్నగరాక్షసులును
ధూపమున మెచ్చి కోర్కు లిత్తురు కుమార.

⁠ 15


క.⁠

మలయజము నగలు మఱియుం
గలుగు సురభువస్తువులు నికామప్రియదం
బులు వైహారికధూపం
బులయెడ మానవులచిత్తములకు నరేంద్రా.

⁠ 16


ఆ.⁠

[2]దైవతార్చ లపుడు తామసభూతర
క్షోముఖంబులైన కుత్సితంపు
జాతు లెల్ల దీపసన్నిధి నడఁగు న
ట్లగుట దీపదాన మధికఫలము.

⁠ 17


క.⁠

ఆలోకదాన మన భూ
పాల పరఁగు దీప మీగి భావము సద్ధ
ర్మాలోకనశీలం బగు
నాలెస్స యొనర్చినట్టియతనికి నధిపా.

⁠ 18

​

తే.⁠

ఘృతము సాలమి వర్తి నికృష్ట యగుట
దగ సమర్పించి పెంచుట ధరణినాథ
కానియవి దీపదానవిధానమునఁ బ్ర
కాశవస్తువు దృఢదీప్తికముగ వలయు.

⁠ 19


వ.⁠

అని వెండియు.

⁠ 20


క.⁠

ఒరు లిచ్చిన దీపం బప
హరించి తత్పాతకమున నంధుం డగు భూ
వర [3]రథ్యాసభగుడిపై
గిరి దీపం బిడి విభూతికిం బాత్ర మగున్.

⁠ 21


తే.⁠

ఆలనేయి ముఖ్యము మహిషాదిమేష
జనితఘృతములుఁ దైలంబు మనుజనాథ
మధ్యమము లగు మేదోస్థిమాంసరసము
లరయ నింద్యముల్ దీపసమర్పణమున.

⁠ 22


క.⁠

జ్యోతిస్సాలోక్యకులో
ద్ద్యోతనమహిత ప్రకాశయోగంబులు పు
త్త్రా తెచ్చు దీపదానము
దాత కొసఁగు నమరపూజితసుఖత్వంబున్.

⁠ 23


క.⁠

దేవతలకు నగ్రపుసం
భానన నుపహార మిచ్చి పదపడి కుడువం
గా వలయు నట్టు సేయని
ధీవిరహితుఁ డసుర యగుట దెల్లం బధిపా.

⁠ 24


వ.⁠

కావున.

⁠ 25


క.⁠

తనయింటఁ గలుగునన్నము
మును దేవతలకు నివేద్యముగఁ జేసి ప్రణా
మనియమసహితసమర్పణ
మునఁ గృతకృత్యుఁడుగ వలయుఁ బురుషుం డనఘా.

⁠ 26


వ.⁠

పూజకుండు శక్తిసంపన్నుం డయి యొనర్చిన.

⁠ 27


క.⁠

తిలపిష్టము దధిదుగ్ధం
బులు మఱియును ధూపములును బుణ్యపరిమళం
బులు నగుపదార్థములు విబు
ధులకుం బ్రియ మొసఁగు బలివిధులఁ గురుముఖ్యా.

⁠ 28


క.⁠

ఉపహారసమర్చకుఁ డగు
సుపురుషు గృహదైవతమలు శుభములఁ గూర్చున్
నృపవర తత్కర్మరహితుఁ
గృపలేక నితాంతవిఫలకృత్యుం జేయున్.

⁠ 29


ఆ.⁠

రక్తమాంససహితభక్తపిండముల ను
ల్లసితలోహితాక్తలాజములను
సురను బలి యెనర్ప నురగయక్షాసుర
ప్రముఖభూతములు శుభంబు లొసఁగు.

⁠ 30


క.⁠

సౌమ్యాసౌమ్యబలులు విను
సౌమ్యాసౌమ్యప్రకారజనకృత్యంబుల్
సౌమ్యనృపోత్తమ యయ్యై
కామ్యముఁ దత్ప్రపూజ్యకరణిం జేయున్.

⁠ 31


క.⁠

అగ్రప్రదాయి వర్ణస
మగ్రుఁడు బలయుతుఁడు బుద్ధిమతుండు లోకా
నుగ్రహపాత్రము శాత్రవ
నిగ్రహశక్తుండుఁ దత్వతిష్ఠుండు నగున్.

⁠ 32


వ.⁠

అనిన విని యజాతశత్రుండు గంగాపుత్త్రుతో సుమనోధూపదీపబలిప్రదానం
బులఫలవిశేషంబు లింకను విన వలతుం జెప్పవే యనుటయు నప్పురుషవరుం

⁠

​

⁠

డాకురువంశవరున కి ట్లను నహుషువృత్తాంతంబున నది విస్పష్టం బగు వినుము
చెప్పెద.

⁠

భీష్ముఁడు ధర్మజునకు నహుషునిధూపదీపదానవిశేషంబు చెప్పుట

సీ.⁠

నహుషుఁడు భూపాలనము సేయుచుండి రా
                  జమస మించుకయు లేక సత్త్వనిష్ఠఁ
బుష్పంబులను ధూపముల దీపముల నివే
                  ద్యంబుల నమరుల కర్చ లిచ్చుఁ
బితృసంతతికి దీనఁ బ్రీతి యొనర్చు రా
                  క్షసయక్షభూతభుజంగమాది
తర్పణంబులు నర్హతానిరూఢములుగా
                  నివి గొని యునరించు నిట్లు నిత్య

⁠


తే.⁠

నిరతిఁ జెల్లించి తత్ఫల[4]పరిణతి ప్ర
దీప్తతేజోవిశేషసంప్రాప్తదేవ
రాజ్యుఁడై సురమునిగణపూజ్యభావ
మహిమఁ బొందియు దీనిఁ దా మఱవఁ డధిప.

⁠ 34


క.⁠

సురలఁ బితృదేవతలఁ ద
త్పరతను మున్నెట్టులట్ల పన్నుగ సమ్య
క్పరితృప్తులఁ గాఁ జేయుం
బరమకుసుమధూపదీపబలిదానములన్.

⁠ 35


తే.⁠

దానఁ జేసి తదీయమహానుభావ
మంతకంతకు నగ్గల మగుట కతనఁ
దగియె మునివరవాహనత్వంబు నమ్మ
హాద్యుతికి వేయు నేల యవద్యరహిత.

⁠ 36


క.⁠

విను మనుజేంద్రుల కెవ్వరి
కిని లేని విశేష మతనికిం గలుగుట గ
ర్వనిరూఢి నొంది దుర్వ
ర్తనపరుఁడై యాతఁ డజగరత్వముఁ బొందెన్.

⁠ 37


వ.⁠

అట్టియెడఁ బూర్వంబునం జేసిన పుష్పాదిదానపుణ్యవిశేషంబుల మహానుభా
వంబు వలన నవ్వసుమతీశ్వరు శపించిన మునీశ్వరుండు సదయుండయి శాపమో
క్షంబు నిర్దేశించెఁ దత్ఫలవిశేషంబునన యశేషదోషనిరసననిపుణుండ వగు నీ
వప్పుణ్యానుష్ఠానంబున కొదవి తని చెప్పి వెండియు.

⁠ 38


తే.⁠

పాండవాగ్రజ నహుషుండు బ్రహ్మసభకు
నాత్మగృహమున కరిగినయట్ల యరిగె
నట్టిపెంపును జనవిభుం డవ్విశిష్ట
దానఫలమునఁ జూవె పొందంగఁ బడసె.

⁠ 39


క.⁠

అని పలికి భీష్ముఁ డి ట్లను
విను మెందును దీపదానవిధి మే లనిశం
బును జేయ నూర్ధ్వలోకం
బను గర్తకుఁ బరమదివ్యబోధము నిచ్చున్.

⁠ 40


క.⁠

ఎన్నినిమిషములు దైవత
సన్నిధి వెలుఁగంగఁ జేయు జనుఁడు ప్రదీపం
బన్ని సురవత్సరములు సు
ఖోన్నతి సన్నుతుల నాతఁ డొప్పు దివమునన్.

⁠ 41


క.⁠

అనిన విని ధర్మజుఁడు శం
తను తనయునితోడ విప్రధనము నపహరిం
చిన యాతఁ డైగతిం జను
ననుటయు నతఁ డిట్టు లనియె నన్నరపతికిన్.

⁠ 42


క.⁠

దురితము లనేకములు గల
వరయఁగ లోకము వానియన్నిటికంటెన్
ధరణిసురధనము పాపపుఁ
దెరువునఁ గొను టధిక మండ్రు ధీరవిచారా.

⁠ 43

​

క.⁠

భూసురధనాపహరణము
చేసినఁ గులనాశ మగుట సిద్ధము దానం
జేసి యగును జండాల
త్వాసంగము నపరభవము నందు నరేంద్రా.

⁠ 44


వ.⁠

ఒక్కయితిహాసంబు సెప్పెద నాకర్ణింపుము.

⁠ 45

క్షత్రభందూపాఖ్యానము

ఆ.⁠

క్షత్రబంధుఁ డనఁగఁ గల డొక్కనరపతి
యతఁడు మాలవాని నధికదుఃఖ
భాగిఁ గాంచె గాలిఁ బఱచువిప్రక్షేత్ర
తలము రేణువునకుఁ దలఁగి చనఁగ.

⁠ 46


క.⁠

కని యీధూళికిఁ గడు రో
సినకారణ మేమి యనుఁడుఁ జెప్పె నతని కి
ట్లని యమ్మాలఁడు దొలుబా
మున నే నొకవిప్రుకొడుక మునులు నుతింపన్.

⁠ 47


ఆ.⁠

పరమనిష్ఠతోడ బ్రహ్మచర్యవ్రత
మాచరింతు భిక్షితాన్న మొక్క
నాఁడు వేడ్కఁ బుణ్యనదితీరమున భుజిం
పంగఁ దలఁచి చనఁగఁ బాప మడరి.

⁠ 48


క.⁠

ధరణీదేవక్షేత్రము
పరాగపటలంబు బహుళపవనంబుగతిం
బరగి నరనాథ నా దగు
కరంబు నన్నమునఁ బట్టెఁ గడుసాంద్రముగన్.

⁠ 49


క.⁠

ఆధూళితోడఁ గుడిచిన
నీదుర్జన్మంబు వచ్చె నిది యెఱిఁగెడు సం
వేదనము పూర్వపుణ్యఫ
లోదయమునఁ గలిగె నిన్న నొకకల గంటిన్.

⁠ 50


వ.⁠

దానిం జెప్పెద నవధరింపుము.

⁠ 51


క.⁠

ఒకవిప్రవరుఁడు ననుఁ గని
యకటకటా యనుచు నిలిచి యడలకు మీదుః
ఖకలాప మెల్ల వాయును
సకలంబును క్షత్రబంధుసంవాదమునన్.

⁠ 52


క.⁠

అనియె నని చెప్పి వీడ్కొని
చని మృతుఁడై తొంటి బహుళసత్కర్మంబుల్
దను నుత్తమపదమునకుం
గొనిపోయిన నిత్యసౌఖ్యకుండై యుండెన్.

⁠ 53


వ.⁠

అనిన విని యజాతశత్రుండు గంగాపుత్త్రుతో నాగలోకం బేకప్రకారమనోహా
రియై యుండునో బహుప్రకారప్రమోదియై వెలుంగునో యెఱింగింపవే య
నుటయు నతండు పుణ్యకర్మంబు లనేకవిధంబులు గావే కావునం దత్తదను
రూపానేకస్థానంబై నాకంబు నిశ్శోకంబును నస్తోకసుఖకరంబును నై కరం
బొప్పుచుండు గౌతమశతక్రతుసంవాదం బను నితిహాసంబు విను మది భవదీయ
ప్రశ్నంబునకుఁ బ్రాదేశవిశదీకరణం బగు నుత్తరం బై యుండెడు గౌతముం
డనుమహాద్విజుండు వనంబునం దపంబు సేయుచుండి శుండాలశిశువుం దల్లి
లేనిదాని నొక్కెడం గని కారుణ్యంబు వొడమి పుత్త్రునిం బోరెఁ బెనిచె నయ్యే
నిక కొదమకాలక్రమంబున మేటియేనుంగయి మెలంగుచుండె నక్కాలం
బున భూపాలనంబు సేయుధృతరాష్ట్రుం డనురాజునాకారంబు దాల్చి నాకపతి
యయ్యెడకు వచ్చి యవ్వారణపతిం బట్టి తనకుం గొని పోవువాఁడై దీని నా
కిమ్మని యమ్మునిపతి నడుగుటయు నతండు.

⁠ 54


తే.⁠

ఇధ్మములు దెచ్చి యిచ్చు నే నిచట లేని
సమయమునఁ గాఁచు నీపర్ణశాల మర్త్య
బుద్ధియుత మిది యీదంతిఁ బుత్త్రుఁబోలెఁ
బెనిచినాఁడ నీ కీఁజాల మనుజనాథ.

⁠ 55
​

ఇంద్రునకు మతంగమహామునితో నైనసంవాదము

వ.⁠

అనుటయు నాకృత్రిమజనవిభుండు.

⁠ 56


చ.⁠

మునులకు నేనుఁ గేటికి నమూల్యపుగోవులఁ బుచ్చికొమ్ము వే
యనఘ పసిండి నీవలసినంతయు నిచ్చెద నన్న శైశవం
బున నిది తల్లిలేకునికిఁ బుట్టిన యక్కటికంబు పెంపునం
బెనుచుటఁ జేసి దీనిపయిఁ బ్రేమము నామదిఁ గల్గు భూవరా.

⁠ 57


క.⁠

కావున నొల్లను బదివే
ల్గోవుల నిచ్చినను నిష్కకోటి యొసఁగినం
బోవయ్య యేను మొఱ యిడఁ
గా వావిరిఁ గొనఁగఁ దగునె కరిపతి నీకున్.

⁠ 58


క.⁠

అని మునిపతి వలికిన న
జ్జనపతి వాహనము గాఁగ సామజముం గై
కొనఁ దగదె రాజునకు ని
ట్లనఁ దగునే నీకు విడువు హస్తిఁ బ్రియమునన్.

⁠ 59


వ.⁠

అని రాజసంబు దోఁపం బలుకుటయు నప్పరమద్విజుండు పుయిలోట దక్కి
యి ట్లనియె.

⁠ 60


తే.⁠

పుణ్యకర్ములు హర్షంబుఁ బొందఁ గనుట
పాపకర్ములు శోకార్తిపాలు వడుట
యెచటఁ గల్గు నజ్జముసభ కేఁగుదెమ్ము
దంతి నచ్చట నిచ్చెద ధరణినాథ.

⁠ 61


వ.⁠

అనుటయు నతండు.

⁠ 62


సీ.⁠

వినుము నాస్తికు లగుజనులుఁ బాపాత్మకు
                  లును గాక యేను వత్తునె మునీంద్ర
యచటికి నన్న నయ్యముఁడు పుణ్యుఁడు తదీ
                  యాదరం బొప్పదే యనియె విప్రుఁ
డమ్మాట కవ్విభుం డప్పఁ బ్రోచునతండుఁ
                  దల్లికిఁ దండ్రి కత్యంతభక్తి
గలవాఁడు నమ్మేలు గను నందు రానొల్ల
                  నని పల్కెఁ బల్కిన నత్తపస్వి

⁠


తే.⁠

రమ్ము మందాకినికిఁ దత్తటమ్ముపొంత
హస్తి విడిచెద ననుమాట యాడ నాతఁ
డతిథి శిష్టాన్నభోజులు నప్రతిగ్ర
హులును గం డ్రది సరకు సేయుదునె యచటు.

⁠ 63


క.⁠

అనినను ముని మేరువనం
బున నీ కొప్పింతు గజముఁ బోద మనుడు న
జ్జననాథవరేణ్యుం డా
తని మోమునఁ జూడ్కి నిగుడ దరహాసముతోన్.

⁠ 64


క.⁠

మృదువులు సత్యోపేతులు
సదయులు భూతహితులందుఁ జను జనములు నా
కది యేల వేడ్క నిదె వ
చ్చెద నొండొక మంచిచోటు సెప్పు మనవుడున్.

⁠ 65


క.⁠

నారదమునినాయకుని వి
హారస్థల మైన వనమునం దిచ్చెద నీ
వారణము నచటు కిన్నర
ధీరమ్యం బప్సరోమతిప్రియ మనఘా.

⁠ 66


సీ.⁠

అనిన గౌతముపల్కు విని గీతనృత్యాది
                  చతురులై దేవతాసన్మునీంద్ర
హర్షంబు గావించునట్టివా రచ్చటి
                  కరుగుదు రేనొల్ల నచ్చ టనియె
నరపతి యుత్తరకురుభూము లనిమిష
                  కమనీయములు సర్వకామ్యవర్షి
యగు నందు వాసవుఁ డట వచ్చి కరి నొప్పఁ
                  గొను మని పలికె నమ్మునివరుండు

⁠

​

తే.⁠

గామహింసారహితులకుఁ గాక నాకుఁ
దరమె తత్ప్రదేశం బని దర్పఫణితి
నాడెఁ బతి దాని కాభూసురాగ్రగణ్యుఁ
డిందుగృహమున నిత్తు ర మ్మిభము ననుడు.

⁠ 67


క.⁠

దానరతులు నక్షము లా
దానవిముఖు లందుఁ బోవుతరముజనులు నా
కానెలవు సెలవు లే దని
మానవపతి పలుక ముని సమధురవచనుఁడై.

⁠ 68


వ.⁠

అన్నరనాథుతోడ.

⁠ 69


సీ.⁠

రవిపాల నిచ్చెద రమ్ము కుంజరముఁ జే
                  కొనుటకు ననిన నజ్జనవిభుండు
నుతతపస్స్వాధ్యాయరతులకు గంతవ్య
                  మచ్చోటు నా కేల యనుడు వరుణు
పురిఁ గుంభిఁ గైకొను పొద మన్న మునిఁ జూచి
                  యగ్నిహోత్రము నిష్టి యజనములును
గలవా రరుగుదరు గాక యన్నెల వొల్ల
                  నని యాడె భూపతి యతని కాతఁ

⁠


తే.⁠

డింద్రుకడ మర్త్యకోటికి నిష్ట మచట
గౌరు నీ కిత్తు నని చెప్పె శూరయాజి
వేదిశతవర్షపురుషులు వోదు రందు
దాని నేఁ గోర నని పల్కె ధరణివిభుఁడు.

⁠ 70


వ.⁠

పలికిన నప్పరమతపోధనుండు.

⁠ 71


క.⁠

రదిఁ గొను మచ్చోటను వే
పొద ప్రాజాపత్యలోకమున కనవుడు నా
కది యేల యశ్వమేధుల
పద మనియెం బతి తపస్విపతి యాతనితోన్.

⁠ 72


చ.⁠

అపగతమోహశోక మగునట్టిది గోగణలోక మిత్తు మ
ద్ద్విపవరు నందు నీ కనిన దీర్థనిషేవులు గోప్రదానపు
ణ్యపరులు బ్రహ్మచర్యనియమాఢ్యులు నచ్చటి కేఁగువారు దా
నిపయిఁ బ్రియంబు నాదు మది నెక్కొన దక్కడ కేల వచ్చెదన్.

⁠ 73


సీ.⁠

అని ధృతరాష్ట్రుఁ డాడిన ముని శీతోష్ణ
                  సుఖదుఃఖమిత్రారిముఖములైన
బహువిధద్వంద్వముల్ పరఁగవు బ్రహ్మలో
                  కమున నయ్యెడ సామజము హరింతు
గాని ర మ్మనుడు నమ్మానవపతి యసం
                  గులుఁ గృతాత్ములు వ్రతాచలితమతులు
నధ్యాత్మనిరతులు నందుఁ బోదురు గాక
                  యచ్చటు గాన శక్యంబె నాకు

⁠


తే.⁠

నవనిసురవర్య యన రాజు నతఁడు సూచి
మునిమహత్తరుఁ డే నిన్ను ననిమిషేంద్రుఁ
గా నెఱింగితి నెల్లలోకములఁ దిరుగు
దెచట నైనఁ బొందదు గదా యెగ్గు నిన్ను.

⁠ 74

​

చ.⁠

అనవుడు మ్రొక్కి యింద్రుఁడు మహాత్మ మతంగజహేతువాదవ
ర్తన ననుఁ బంపు నీవనుపు దక్కొని చేసెద నన్నఁ బుత్త్రుఁ డీ
వనకరి నాకు సాధుజనవత్సల యిమ్ము కరంబు నెమ్మి దీ
నీ ననియె సాంత్వనంబుగ మునిప్రవరుండు గులప్రదీపకా.

⁠ 75


వ.⁠

అనిన విని యింద్రుం డి ట్లనియె.

⁠ 76


తే.⁠

కరి చెలంగి నీమీఁదఁ బుష్కరము సాఁచి
మూరుకొనియెడు నడుగులమ్రోల నిల్చి
ముద్దు [5]గురియుచుఁ బలుమఱు మ్రొక్కు నిట్టి
దాని ని న్నేల పాపుదు మాననీయ.

⁠ 77


మ.⁠

నను నే డాఁచెద నన్న నేబుధులఁ గానం జాల రక్షీణబో
ధనసంపత్తి నెఱింగి తేర్పడ మునీంద్రా రండు నీవున్ భవ
త్తనయుం డీకరియున్ నియంతసుఖనిత్యం బైన నాకంబునం
దనపాయస్థితి మత్సఖత్వమునఁ బెంపారం బ్రవర్తింపఁగన్.

⁠ 78


ఆ.⁠

అనుడు సంతసిల్లు యట్ల కా కనిన న
మ్మునివరుండుఁ గరియు మున్ను గాఁగ
నేఁగె దివమునకు మహేంద్రుండు సమ్మోద
భరితుఁ డగుచుఁ గురునృపాలవర్య.

⁠ 79


క.⁠

అనిన విని భీష్ముతో న
జ్జనపతి యి ట్లనియెఁ దపము సారపుధర్మం
బని యూఁది మీరు సెప్పుదు
రలఘా లే కుండునే తదధికం బొకఁడున్.

⁠ 80


వ.⁠

అనుటయు నాదేవవ్రతుం డానరదేవోత్తము నర్మలి నాలోకించి.

⁠ 81

భగీరథునకు బ్రహ్మతో నైనసంవాదప్రకారము

సీ.⁠

వినుము ధర్మము లెల్ల వినుతకృత్యంబుల
                  తప మెన్ని యెన్నఁగా ధర్మ మెందుఁ
గలదు తపం బనఁగా నియతాశన
                  త్వము భగీరథుఁడు పద్మజునిసభకు
నరిగిన నతనితో నద్దేవుఁ డిందుల
                  కతులనిర్మలతప మాచరింప
కరుగుదేరంగ నెవ్వరికిని రా దెట్లు
                  వచ్చితో యనిన నవ్వసుమతీశుఁ

⁠


తే.⁠

డేను గోదానములును భూదానములును
గన్యకాదానములుఁ దీర్థకలనములును
రాజసూయాశ్వమేధాధ్వరములుఁ బెక్కు
సేసినాఁడ వచ్చుట దానఁ జేసి కాదు.

⁠ 82


మ.⁠

అవనీదేవత లొక్కెడం గ్రతువిభివ్యాసక్తులై యుండఁ ద
త్ప్రవిఘాతంబులు దోఁచె నేను రణసంరంభమునన్ వారి కు
త్సవ మొందించితి వానిఁ బాపి ముద మందన్ వారు నన్ బ్రహ్మపా
ల వరిష్ఠావ్యయసౌఖ్య మొందు మని లీలం జెప్పినన్ వచ్చితిన్.

⁠ 83

​

తే.⁠

ఆఁకలియు నీరువట్టును నాదరింప
కేను విప్రులపని సేసి యిట్టిమహిమ
గంటి సియతాశనత్వమ కాక తప మ
నంగ వే ఱొండె ధర్మాభినంద్యహృదయ.

⁠ 84


చ.⁠

అనుటయు బ్రహ్మ యవ్విభున కర్చన లిచ్చి తగంగ గారవిం
చె నధిప నీవు విప్రుల భజింపుము సంయమితాశనుండవై
యని దివిజాపగాసుతుఁడు సాదరభాషణవృత్తిఁ జెప్పిన
న్విని ముద మంది ధర్మజుఁడు నెమ్మి దలిర్పఁగ నమ్మహాత్ముతోన్.

⁠ 85


క.⁠

పురుషుఁడు శతాయు వనుశ్రుతి
పురుషవరా బాలురైనఁ బొందుదురు మృతిం
జిర మగు నేమిట నాయు వ
చిరమగు నెద్దానఁ దెలియఁ జెప్పుము కరుణన్.

⁠ 86


వ.⁠

అనుటయు నయ్యఖిలధర్మవేది యవ్విభున కి ట్లనియె.

⁠ 87


తే.⁠

అనఘ యాచార మాయువుఁ బెనుచు నదియ
కాదు శ్రీయును గీర్తియుం గలుగఁ జేయు
విను దురాచారుఁ డాయువు పెనుపుఁ బొందఁ
డతని సర్వభూతంబులు నభిభవించు.

⁠ 88


క.⁠

కావున నాచారపరత
భూవర మేల్ సాధుజనులు వోవుతెరువు సం
భావించుట యాచారము
దా వర్ణాశ్రమ సమర్హతం బరఁగు నృపా.

⁠ 89


ఆ.⁠

గురునిమాట సరకు గొనమి దుశ్శీలత
పిట్ట పుడుక గోరు పిసుకఁ ద్రుంపఁ
గఱవ మరుగు టుదయకాలాస్తమయసమ
యముల భానుఁ జూచు టాయు వడఁచు.

⁠ 90


క.⁠

విను క్రోధంబును హింసయు
ననృతంబును లేమి సంధ్యలైనం దదుపా
సనము సురపూజనము రే
పొనరించుట చిరతరాయు వొనరించు నృపా.

⁠ 91


క.⁠

పరదారగమన మొప్పదు
పురుషున కది యెల్ల పాపములకంటె నరే
[6]శ్వరవర యాయుస్సంక్షయ
కరంబు దద్వర్జనంబు గడుమే లరయన్.

⁠ 92


క.⁠

[7]పరదారలయందును సఖి
గురువృద్ధనృపాల బాలకుల బాంధవ భూ
సురవైద్యభృత్యబుధనా
గరికులసతు లాయువునకుఁ గడుఁ జే టనఘా.

⁠ 93


వ.⁠

అని చెప్పి.

⁠ 94


క.⁠

మే లివి కీ డివి యని భూ
పాలక యేఁ జెప్పినట్టిపను లెఱుఁగుము నీ
వోలిన యాయువుఁ బెనుపం
జాలు ననియు నపహరింప శక్తము లనియున్.

⁠ 95


తే.⁠

తగనియది యెద్ది యైన వ్రతంబు పూని
మాన నోచిన నాయువు మాల్పకుండు

⁠

​

⁠

నంతటన పోవ దాయువత్యంతవృద్ధిఁ
జేయుఁ దగినది సేసినఁ జెప్ప నేల.

⁠ 96


వ.⁠

అని పరిభాషించి.

⁠ 97


క.⁠

దేవగృహముకడ వీథిని
గోవాటమునందు రచ్చకొట్టముపొంతన్
భూవర సస్యములను వి
ష్ఠావిసృజన మొప్ప దండ్రు చారిత్రవిదుల్.

⁠ 98


ఆ.⁠

ప్రాఙ్ముఖుండు నార్ద్రపాదుండు నై భోజ
నంబుసేఁత మే లనంగ విందు
నిలిచి యుండి కుడుపు మమ్మెయి మూత్ర
సర్జనంబుఁ బాపసరణి యండ్రు.

⁠ 99


క.⁠

అనలము గోవును బ్రాహ్మణుఁ
జన దెంగిలితోడ ముట్టఁ జంద్రార్కులఁ జూ
డను నమ్మెయిఁ దగ దాసన
మును గాంస్యము ననఘ భిన్నములు వర్జ్యంబుల్.

⁠ 100


ఆ.⁠

వృద్ధు వచ్చునపుడు విను బాలుప్రాణంబు
లెగయఁ జూచి యతని కెదురు లేచి
ప్రణతిఁ జేసెనేనిఁ బాదునఁ బడి యవి
దొంటియట్ల నిలుచు దురితదూర.

⁠ 101


తే.⁠

అధ్యయనమున మస్తకం బంటుటయును
నిద్రయును నశుచితతోడ నింద్యకోటి
శిరముఁ గ్రోఁకంగఁ దగ దిరుచేత మస్త
కంబు తైలంబు బూయఁగాఁ గాదు మేన.

⁠ 102


సీ.⁠

వైరనిర్బంధంబు వలవదు గురునితో
                  నతఁడు కోపించిన ననుసరించి
తీర్చుట మేలు నిందించుట గురునెడ
                  ననృత మాడుట యాయు వపహరించు
విప్రగోక్షత్రియవృద్ధదుర్బలభార
                  వహగర్భిణులకు నీ వలయుఁ దెరువు
మాన్యభూదేవుని మంగళంబుల వన
                  స్పతులను వలగొని చనఁగ వలయుఁ

⁠


తే.⁠

బంచదశిని జతుర్దశిఁ బద్మమిత్ర
వసుతిథుల జన్మతిథులందు వలయు బ్రహ్మ
చర్య మడుగు లొండొంటితోఁ జనదు తోమ
దోషములు గొండియముఁ గ్రూరభాషణంబు.

⁠ 103


తే.⁠

అంగవిహీను దరిద్రు విద్యావిహీను
రూపహీనునిఁ దెగడుట పాప మండ్రు
వేదదేవతానిందలు వేతనార్థ
కముగ జోస్యంబు నడపుట కల్మషములు.

⁠ 104


సీ.⁠

దంతధావనము మూత్రపురీషసర్జనం
                  బులు మౌనియై చేయవలయు నుభయ
సంధ్యల నిద్రింపఁ జనదు తండ్రికి రేపు
                  మ్రొక్కి యాచార్యవిప్రులకు వరుస
మఱి మ్రొక్కునది వీరి కెఱఁగుట దక్క దే
                  వార్చనంబునకు ము న్నన్యుకడకుఁ
జనఁ గాదు గర్భిణీసంయోగ మొప్పదు
                  పరిణయమునకు మున్ సురతసుఖము

⁠

​

తే.⁠

దనుభవించిన నవకీర్ణయందు రట్టి
యఘము వోవుఁ బ్రాయశ్చిత్త మాచరింప
నుత్తరము పడమర దలయుఁగ శయింపఁ
దగదు శీర్ణతల్పంబు నిద్రయును గీడు.

⁠ 105


క.⁠

సితపీతంబులు ధార్యము
లతులమతీ కుసుమకోటియందుఁ గృతస్నా
నత రే పాపము శుచిత
చ్యుతుఁ డగు సుస్నాతుఁడేని నొడలు దొడసినన్.

⁠ 106


తే.⁠

నీళ్ళ నాడక మును పూఁత నిందింతంబు
చీర తడితో విదిర్చుట సెట్ట యొరులు
గట్టి విడిచిన వస్త్రంబు గట్టఁ గాదు
మడతమార్చు టొప్పదు [8]కడుమాపు డైన.

⁠ 107


క.⁠

వలవదు వటపిప్పలముల
ఫలములు నమలంగ మేడిపండ్లును దగ దా
వుల మేఁకల నెమిళుల యెఱ
చులుఁ గానివు యవిహితంపుఁజోటుల నధిపా.

⁠ 108


క.⁠

విను [9]మొరుచూచిన మూచూ
చినభోజ్యము నింద్య మన్యచిత్తముతోడం
గొనఁ దగ దాహారము పొ
త్తునఁ గుడుచుట యఘము గూడు దూషించుటయున్.

⁠ 109


క.⁠

చేతఁ గొని యుప్పు [10]నమలుట
రాతిపయిని నుప్పుగొనుట రాత్రి దధిమధూ
పేతంబుగఁ గుడుచుట ధ
ర్మేతరములు రేయి సక్తు వెగ్గు నరేంద్రా.

⁠ 110


క.⁠

ఒకళులు సూచినయది వా
రికిఁ బెట్టక నమలుటయును బ్రీతిం దనపం
క్తికిఁ దెచ్చినచుట్టలు వే
ఱొకభంగిం గుడువఁ గుడుపు నుఱు విషభుక్తిన్.

⁠ 111


క.⁠

నేయి మధువు సక్తువు దధి
పాయసము జలంబు భుక్తపరిశిష్టము భూ
నాయక యేరికి నిడఁ దగ
దాయువు పెంపారఁ గోరు టాత్మఁ గలిగినన్.

⁠ 112


తే.⁠

అంగుళాగ్రముల్ చిటికెనలందు మొదళు
లనఘ దేవర్షి తీర్థము లనఁగఁ బరఁగు
వరుస వరకేలియుప్పలవాయి పైతృ
కంపుఁదీర్థంబు తర్పణకార్యమునకు.

⁠ 113


క.⁠

ఆచమనపూర్వకంబుగ
నాచరణీయంబు సర్వ మగు తర్పణమున్
వాచఃపరుషత క్రోధం
బాచారవిధిజ్ఞు లఘము లండ్రు కుమారా.

⁠ 114


క.⁠

దినమున సురతం బెయ్యెడఁ
జనదు చెడిపఁ గన్యఁ గవయ కనదు పతిత నం
టనిదాని నగ్నఁ జూడం
జన దుమిసిన వార్పకునికి సక్షుతుఁ డైనన్.

⁠ 115


ఆ.⁠

అట్టియెడలఁ దనకు నాచమనము దొర
కొనక యున్న సూర్యుఁ గనుచుఁ బ్రణవ
కలనతోడఁ గూడ వలచెవి ముట్టుట
శుచిత నిచ్చు నండ్రు సూరిజనులు.

⁠ 116


ఆ.⁠

భగిని గురుని మిత్రుఁ బండితు వంశజుఁ
బేద వడినఁ దెచ్చి ప్రియముతోడఁ
దనగృహమునకల్మి కనురూపముగఁ బ్రోపు
పెనుపు సేయు నాయువునకు సిరికి.

⁠ 117


క.⁠

పారావతములు శుకములు
శారికలును బుష్పలతలు జనవర పసిఁడిం
దారమున నైనముట్టులు
నారయ గృహమంగళంబు లాదర్శములున్.

⁠ 118

​

తే.⁠

గ్రువ్వ గ్రద్ద దివ్యారుపుఁబ్రువ్వు గూబ
యిల్లు సొచ్చిన శాంతి సేయింపవలయుఁ
జదువుఁ గుడుపును సందెలఁ జనదు రాత్రి
యైనఁ బితృకార్యములు సేయు టఘముఁ జేయు.

⁠ 119


క.⁠

కులమును రూపము శీలముఁ
గలకన్య వరించి యందుఁ గనిన యపత్యం
బులకుఁ దగ నడపునది మం
గళములు గృతదైవపైతృకక్రియుఁ డగుచున్.

⁠ 120


తే.⁠

వలయుఁ బ్రాఙ్ముఖోదఙ్ముఖత్వముల నొకటి
తారకంబులుఁ దిథులును వారములును
జోస్యు లెఱిఁగించినవి మేలు సువ్రతైక
లోల మంగలిపనికిని దైలమునకు.

⁠ 121


క.⁠

వినుము సపిండీకరణ
మ్మున నేకొద్దిష్టమునను భోజనవిధి వ
ర్జన మొప్పు నామతింపక
చన దామెతఁ గుడువఁ బోవ సజ్జనవినుతా.

⁠ 122


క.⁠

తల్లికిఁ దండ్రికి సుతులకు
నెల్లవిధంబులను వలయు హితముల్ సెప్పన్
మల్లకుఁడు గాక కర్జము
[11]సల్లభ్యము గాఁగఁ జూచి సౌజన్యనిధీ.

⁠ 123


సీ.⁠

క్షత్రియుం డశ్వంబు గజమును రథమును
                  నెక్కునేర్పులు గడుఁ బెక్కు గఱచి
నానాయుధాభ్యాసనైపుణంబునఁ బొల్చి
                  యుద్ధతంత్రములకు నోహటింప
కుండెడుమది బేర్పి దండనీతికి బోధ
                  కం బగునట్టిశాస్త్రంబు మొదలు
గాఁగ గాంధర్వంబుఁ గామతంత్రంబు లో
                  నుగ శాస్త్రముల నెల్లఁ దగినభంగి

⁠


ఆ.⁠

నలవరించి మున్న యధ్యయనంబునఁ
జొరవ గలిగి ధర్మచరణవేది
యై ప్రజాభిరక్ష యధ్వరకరణంబు
వలను మెఱసి నడవవలయు నధిప.

⁠ 124


క.⁠

విను వర్ణాచారంబుల
ననఘ యిచటఁ దెలుపఁ దొడఁగ నైనను మును లీ
పను లాయుర్వృద్ధికరము
లనుట కతన వలసె నీకు నై చెప్పంగన్.

⁠ 125


సీ.⁠

అధిప రజస్వల నంటుట కల్మష
                  మాచరితస్నాన యైనసతిఁ జ
తుర్థదినంబున దోషాసమయమునఁ
                  జెందంగఁ దగు నండ్రు గొంద ఱార్యు
లేనవునాఁ డొంద నింతియు షష్ఠాహ
                  ముఁ బొంద మగవాఁడు బుట్టు వినుము
మఱియును సమవిషయము లగుదివసంబు
                  లం దోలిఁ బురుషుండు నంగనయును

⁠


తే.⁠

సంభవింతు రిట్టులు షోడశంబు దాఁక
నెల్లనాఁడును ఋతుశక్తి యెడలకుండ
నెట్టికార్యము గల్గిన ఋతుమతీస
మాగమము దప్ప నీ కున్న నాయు వెక్కు.

⁠ 126


క.⁠

విను మాచార మవశ్యం
బును నడపఁగ వలయు ధర్మమున కది మూలం
బనఘా ధర్మం బాయువుఁ
బెనుచును లక్ష్మిని యశంబుఁ బెం పొందించున్.

⁠ 127


తే.⁠

ఇన్నియాచారములలోన నెక్కు డండ్రు
సకలభూతంబులందును సదయుఁ డగుట

⁠

​

⁠

యాదిమును లట్లు గావున నఖిలవర్ణ
ములకు దయ కల్మి పెద్దయు వలయు గుణము.

⁠ 128


క.⁠

ఈయాచారాధ్యాయం
బాయుశ్శ్రీకీర్తికారి యగుఁ బాపంబుల్
వాయం జేయును బృథివీ
నాయక సద్భక్తిఁ జదివినను దగ వినినన్.

⁠ 129


తే.⁠

అనినఁ బ్రీతుఁ డై పాండునృపాగ్రతనయుఁ
డమరతటినీతనూజుతో నన్నదమ్ము
లేమివిధమునఁ దమలోన నెనసి నడచు
వార లెఱిఁగింపు మనుటయు గారవమున.

⁠ 130


వ.⁠

అతం డతని కి ట్లనియె.

⁠ 131


క.⁠

విను భక్తియు వెఱపుఁ గలిగి
యనుజన్ములు పెద్దవాని నారాధింపన్
జనవర యతండుఁ దమ్ములఁ
గొనియాడన్ సిరికిఁ బ ట్టగుదురు రుజ్జ్వలు లై.

⁠ 132


క.⁠

అనుజుఁ డొకఁడు వెంగలియై
నను దప్పెడుఁ గాని పెద్దనకుఁ గార్యజ్ఞా
ననిరూఢి లేక తక్కిన
ననుజన్ములు సిక్కు వడుదు రవనీనాథా.

⁠ 133


చ.⁠

జనవర యన్నదమ్ములు ప్రసన్నమతిం గలకల్మి పంచి కు
డ్చిన వినుతించు లోకములు శ్రీయుఁ బొరింబొరిఁ బెంపు నొందు లో
భనిరతిఁ బెద్ద కాసపడి పాడి దొఱఁగినఁ బ్రాణగొడ్డపుం
బను లగు నవ్విధంబు మనపడ్డది గాదె జగం బెఱుంగఁగన్.

⁠ 134


తే.⁠

తండ్రి పిమ్మట నన్నయ తండ్రి పిన్న
వారలకు నెల్ల నాతనివనిత తల్లి
తల్లి కడచన్న నని చెప్పి తాత మఱియు
మనుమనికి నిట్టు లను నభిమన్యుపౌత్త్ర.

⁠ 135


క.⁠

మానవనాయక యగ్రజుఁ
డైనను ననుజన్ముఁ డేని నన్యాయంబుం
బూని సహోదరులకుఁ గీ
డైన నతఁడు దండ్యుఁ డందు రవనీపతికిన్.

⁠ 136


వ.⁠

అని సహోదరప్రకారంబు సెప్పి వెండియు.

⁠ 137


క.⁠

విను మప్పఁ దల్లియట్లుగఁ
గొని నడపఁగ వలయుఁ జన్ను గుడిపి పెనిచె నె
వ్వనిత యదియు నాతనికిని
జననీసమ యండ్రు బుధులు సౌజన్యనిధీ.

⁠ 138


క.⁠

జనకుం డధికుఁ డుపాధ్యా
యునకుఁ బదిమడుంగు లెక్కు డుర్వీనాథా
జనకునకు దశగుణంబులు
జననిగురుత్వమున నిది ప్రశస్తము శ్రుతులన్.

⁠ 139


క.⁠

జననీజనకులచే నగు
జననం బాగమము దను విషయ మని చెప్పన్
విను మాచార్యువలన నొం
దిన పుట్ట జరామరంబు దివ్యంబు నగున్.

⁠ 140


వ.⁠

కావున గౌరవంబున నాచార్యుండు సర్వాధికుండు.

⁠ 141


క.⁠

అని యిట్లు సుప్రసంగం
బున గురుజనతారతమ్యములు సెప్పినఁ దా
విని శంతనతనయున కి
ట్లనుఁ బాండునృపాగ్రతనయుఁ డతులితభక్తిన్.

⁠ 142


క.⁠

భూసురులకు నృపులకు నుప
వాసము దగుఁ గని యన్యవర్ణులకుఁ దదీ
యాసక్తి గలిమి పెద్దయు
దోసం బని విందు ధర్మధుర్యస్వాంతా.

⁠ 143
​

భీష్ముఁడు ధర్మరాజున కుపవాసవిధివిశేషంబు సెప్పుట

వ.⁠

ఉపవాసవిధియోగ్యతయును దత్ఫలవిశేషంబును విన వలతుం జెప్పవే యనుట
యు నప్పురుషవరుం డప్పుడమిఱేనితో దీని నీవు న న్నడిగినట్లు యే నంగిరసు
నడిగిన నమ్మునిపతి నాకుం జెప్పె నత్తెఱంగుఁ జెప్పెద నాకర్ణింపు మని పలికి
యి ట్లనియె.

⁠ 144


క.⁠

రాత్రిత్రయంబు బ్రహ్మ
[12]క్షత్రియులకు నుపసింపఁ జనుఁ దదధికమున్
గాత్రస్థితిఁ దప్పింపని
మాత్ర [13]నయిన మేలు కురుసమాజవరేణ్యా.

⁠ 145


క.⁠

విను వైశ్యులకును శూద్రుల
కును నాలుగు గుడుపు లుడుగు కొలఁదికి మిగులం
జన దుపసింప నుపవా
సనిరూఢత పెంపు కల్మషము వారలకున్.

⁠ 146


ఆ.⁠

పౌర్ణమాసిఁ బూర్వపక్షాష్టమీచతు
ర్దశుల నుభయపక్షవశత వచ్చు
షష్ఠిఁ బంచమిని సునిష్ఠమై నుపవాస
మున్న వివిధశుభము లొలయు నండ్రు.

⁠ 147


సీ.⁠

ఏకభుక్తవ్రత మెంతయు నిష్ఠ మా
                  సం బెల్ల నడపిన సద్ద్విజుండు
సుభగాకృతియు రూపశోభితాంగనయు స
                  త్సతులును ధనధాన్యతతుల భోగ
ములు సద్గుణంబులు భూరియశంబును
                  మొదలైన బహుశుభంబులకుఁ బాత్ర
మగు నేఁడుకాల మయ్యతులవ్రతము సల్పి
                  యఖిలభూలోకసౌఖ్యములుఁ ద్రిదివ

⁠


తే.⁠

మోదమును గండ్రు రెండును మూఁడు నాల్గు
నీక్రమంబున నోపిన ట్లెక్కి నట్టి
దిసము లెడ పెట్టి కుడుచుచు దృతి నొకేఁడు
నడపువాఱలతెఱఁగు లేర్పడఁగ వినుము.

⁠ 148


క.⁠

ఎక్కుడు దినముల శుభములు
నెక్కు నఖిలవైభవముల నెక్కుదినమునం
దక్కక యుండెడుకాలము
నెక్కు మహాత్మతయు నెక్కు నిభపురనాథా.

⁠ 149


తే.⁠

వత్సరంబెల్లఁ బక్షోపవాసనియతిఁ
గడపునతనికిఁ బుణ్యలోకంబు లెల్ల
వాసభూములు మాసౌపవాసవృత్తి
యైన బ్రహ్మలోకంబు సౌఖ్యంబు గలుగు.

⁠ 150


ఆ.⁠

ఎంతనిష్ఠ గలిగె నేనియు మాసంబు
లోనియంద యెక్కుడైనదినము
లధిప యుపవసింప నగుఁ గాని మాసాధి
కోపవాసవృత్తి పాప మండ్రు.

⁠ 151


వ.⁠

యుగసామర్థ్యంబుననుం బురుషుమహానుభావవిశేషంబుననుం జేసి యుపవాస
వ్రతంబు మహాధికకాలకృతం బయినను గీడుం జేయక యత్యంతఫలప్రదం బై
యుండు.

⁠ 152


తే.⁠

మాతకును వేదమునకు ధర్మంబునకును
బరము లగుగురుశాస్త్రలాభములు లేవు
తపము లే దుపవాసవ్రతంబుకంటె
నధిక మైనది యండ్రు మహాత్ము లనఘ.

⁠ 153

​

తే.⁠

పావనంబులలోనెల్ల బ్రాహ్మణుండు
పరమపావన మను శ్రుతి పౌరవేంద్ర
యట్లు గావున భూదేవతార్చనంబు
భక్తిసంభృతముగ నడపంగ వలయు.

⁠ 154


వ.⁠

అప్రసక్తం బైనను నీయర్థంబు విన వలయు నట్టిది గావునం జెప్పితి నని పలికి
వెండియు.

⁠ 155


చ.⁠

అనశననిష్ఠఁ జేసి సుర లాదిమునుల్ మహితానుభావు లై
రనఘ సహస్రవర్షసమనంతరకల్పిత యైనయేకభు
క్తనియమతంత్రమున్ నడపి గాధితనూజుఁడు బ్రాహ్మణత్వముం
గనియె మహోపవాసముల [14]గానిఫలంబులు లేవు భూవరా.

⁠ 156


క.⁠

కావున నుపవాసవ్రత
సేవనము శరీరమునకుఁ జిత్తంబునకుం
బావన మైహికమహిమయు
దేవనిలయసుఖము నివ్విధిన్ సమకూరున్.

⁠ 157


క.⁠

పరమ నగునీవ్రతమున కం
గిరసుఁడు దర్శకుఁడు దత్సుగీతవిధమునన్
నరు లెవ్వరు దర్శకు లగు
దురు వారిల బొరయ వేమి దుఃఖములు నృపా.

⁠ 158


క.⁠

ఈతంత్రంబు పఠించినఁ
బ్రీతి వినినఁ బాయు బహుదురితములు తిర్య
గ్జాతులభాష లెఱింగెడు
నాతెలి వగు నపరభవమునందు నరులకున్.

⁠ 159


వ.⁠

అనిన విని ధర్మజుండు సర్వజ్ఞానమాననీయునితో యజ్ఞకర్త యగుట మే
లని మీరు పెక్కెడలం జెప్పితిరి యజ్ఞంబు ధనధాన్యవిభవసహాయసంపన్ను
లకుం దక్కం దక్కటివారలకుం జేయ శక్యంబు గామి దెల్ల బెల్లవారికి నను
ష్ఠింప నయ్యెడునట్టిపుణ్యకర్మం బెయ్యది యుపదేశింపవే యనుటయు నమ్మహీ
పతికి నమ్మహితాత్ముం డి ట్లనియె.

⁠ 160


క.⁠

నరవర యర్థంబులునుం
బరివారము లేకయును శుభస్థితిఁ జేయన్
దొరకొని యుండుట గని యం
గిరసుం డుపవాసముం బ్రకీర్తించెఁ దగన్.

⁠ 161


క.⁠

ఉపవాసాయాసంబును
నృపముఖ్యా దుస్సహముగ నీవు దలఁచి య
జ్ఞపరత్వము దుర్ఘట మను
నెప మిడి యి ట్లడిగి దని మనీషం గంటిన్.

⁠ 162


వ.⁠

అనశనవ్రతంబులందును జులుగనితెఱం గెఱింగించెద.

⁠ 163


చ.⁠

పగలును రేయుఁ గుడ్చి జలపానము లోనుగఁ గుడ్చునప్డు తు
ష్టిక నొనకింటి మర్త్యుఁ డొకటిన్ నడుమన్ మఱి యెప్డు నంట కే
మిగతిని బాపముం బొరయమిం దలకొల్పుచు హోమకార్యముం
దగుమెయిఁ జేయుచున్న విను తంగెటిజు న్నగు నూర్థ్వలోకముల్.

⁠ 164


వ.⁠

ఇది మేలితెఱంగు గొందఱు దుష్కరంబుగాఁ దలంతు రట్టివారలు దమ
యోపినభంగుల నంగిరసుం డుపదేశించిన యుపవాసవ్రతవిశేషంబు లనుష్ఠిం
చువా రని చెప్పిన నప్పౌరవోత్తముం డయ్యుత్తమబోధనిధికి నమస్కరించి

⁠

​

⁠

యధ్యాత్మకవిద్యాబోధకప్రకారంబు లగువాక్యసంచయంబులు పెక్కెడలం
గృష్ణద్వైపాయనాదిమునీంద్రులును గృష్ణుండును నాకర్ణింప నుపన్యసించితిరి
కృష్ణశ్రోతృత్వంబు మహార్హతమంబు గృష్ణునియున్నరూ పెఱుంగుటయు
నత్యంతసంభావనీయంబు.

⁠ 165


ఆ.⁠

ఎవ్వఁ డెఱుఁగఁ బడిన నెఱుఁగంగఁ బాలివి
యైన యెల్ల యవియు నవగతంబు
లగుట యీపరాశరాత్మజుఁ డాశ్రిత
కోటి కర్థిఁ గృష్ణుఁ గుఱిచి చెప్పె.

⁠ 166


క.⁠

కావున నధ్యాత్మకవా
క్యావలికిం జేరుగడ మహామహిమపదం
బై విలసిల్లెడుఁ గృష్ణుఁడ
యే వినఁగా వలతు నమ్మహితవాక్యంబుల్.

⁠ 167


వ.⁠

అని పలికి యింకను నధ్యాత్మవిద్యావివరణంబు లగువాక్యంబు లనుగ్రహింప
వలయు నని సంప్రార్థనంబు సేసిన నప్పార్థివాగ్రగణ్యుతో నక్కురువరేణ్యుండు
హరసనత్కుమారసంవాదంబు సెప్పెద నది యధ్యాత్మవిద్యోపపకారప్రసురంబు
లైనయుపన్యాసంబుల నొప్పియుండు విను మని యి ట్లనియె.

⁠ 168

హరసనత్కుమారసంవాదప్రకారము

చ.⁠

హరుఁడు సనత్కుమారుకడ కర్థిమెయిం జనుదేర నమ్మునీ
శ్వరుఁ డుచితాసనాదు లుపచారవిధిజ్ఞతఁ దా నొనర్చి యా
దరభరితాత్ముఁడై యభిమతం బగుకార్య మనుగ్రహింపు త
త్పరమతి నిర్వహింతుఁ దగ దానిఁ ద్రిలోచన మృత్యుమోచనా.

⁠ 169


తే.⁠

అనిన నీతోడిగోష్ఠికి నర్థి పుట్టి
యరుగుదెంచితిఁ దమ్ముఁడ యని ప్రమోద
మెసఁగఁ బల్కి యప్పరమేశ్వరుఁ డి ట్టు లనియె
నఖిలలోకార్చితుం డగునతనితోడ.

⁠ 170


క.⁠

ధ్యానమున దర్శనీయం
బైనది యేవస్తు వెన్ని యనఘచరిత స
మ్మానితతత్త్వంబులు సం
ఖ్యానము యోగంబు నెట్టిగతులం జెల్లున్.

⁠ 171


వ.⁠

చెప్పుము మఱియు నధ్యాత్మవిషయంబు లగువిశేషంబులు వివరింపు మనుట
యు నయ్యంభోజసంభవుం డయ్యభవున కి ట్లనియె.

⁠ 172


క.⁠

అరయఁగఁ దత్త్వము లనునవి
యిరువదినా ల్గండ్రు గొంద ఱిభదనుజహరా
యిరువదిమూఁ డనుటయుఁ గల
దిరువదియే నండ్రు వానినే యె ట్లనినన్.

⁠ 173


క.⁠

ఇరువదిమూఁ డనువార
ల్గిరిజేశ్వర ప్రాకృతుల్ మలీమసవిధ మ
త్తెరువు మనోబుద్ధులు వా
రరయఁగ నొక్కండ యండు రది య ట్లుండెన్.

⁠ 174


క.⁠

ఇరువదినా ల్గనువారలు
నరసి మనశ్శుద్ధి బుద్ధి యనుకాన్పున న
ప్పరుసునఁ బలికెద రేఁ గను
తెరువున వినుతత్త్వవిధము దేవస్తుత్యా.

⁠ 175


తే.⁠

పంచవిశ మధిష్ఠానభావ మొంది
విలసనము నిచ్చుఁ దగఁ జతుర్వింశతికిని
దన్న కని తనయంద డిందంగ జేయు
దాన నప్పిండుగలయది లేని యదియు.

⁠ 176

​

వ.⁠

చతుర్వింశతితత్త్వంబులు వివరించెద.

⁠ 177


తే.⁠

అవధరింపుము భూతంబు లయిదుఁ దద్గు
ణములుఁ బది యింద్రియములు మనంబు బుద్ధి
యును మహేశ యహంకారమును బ్రకృతియు
నాఁగఁ దత్త్వంబు లిరువదినాల్గు వొలుచు.

⁠ 178


వ.⁠

ఆచతుర్వింశతితత్త్వంబుల నధిష్ఠించి యుండుతత్త్వంబు నిర్దేశించెద.

⁠ 179


క.⁠

[15]దేహం బని యెడ నెరవున
నూహించును బుధుఁడు దాన నుండుం గాష్ఠ
స్వాహాప్రియుక్రియఁ బురుషుఁడు
సో౽హమనినకాన్పు రుద్ర యతనిఁ గను టగున్.

⁠ 180


క.⁠

ఈనెఱి నిలుచుట గలుగదు
మానార్ష్యావంతు లైనమానవులకు ని
ష్ఠానూనతపోవర్తను
లైనను గార్హస్థ్యబహుముఖాత్మకు లగుటన్.

⁠ 181


వ.⁠

శ్రుతి పురుషు నమృతార్థతత్తవం బనియు బ్రహ్మం బనియు నిర్దేశించి.

⁠ 182


తే.⁠

అన్ని తత్త్వంబులకు నమృతార్థతత్త్వ
మెక్కు డది యీశ్వరంబు ననీశ్వరంబు
సత్యపాకంబు నతిరహస్యంబు దానిఁ
గనిన మృత్యుజాలము చిక్కు గడవవచ్చు.

⁠ 183


క.⁠

అనఘ యలులోమమునఁ దోఁ
పును బ్రతిలోమమున లయము వొందుటయును గ
ల్గును సర్వతత్త్వముల కవి
యొనయిక బ్రహ్మమును గలయు టేకత్వ మగున్.

⁠ 184


తే.⁠

ఉత్తమశ్రద్ధ లేకున్నఁ జిత్త మేక
ముఖము గాకున్న నింద్రియముల జయింప
కున్న వేదంబు చదువకయున్న నతిని
కీపరిజ్ఞాన మీఁదగ దిద్ధచరిత.

⁠ 185


వ.⁠

అని చెప్పి తదనంతరంబ యధ్యాత్మంబుల నధిభూతంబుల నధిదైవతంబుల ను
పన్యసించె నాసనత్కుమారుండు తత్ప్రపంచంబు నారదునకుం జెప్పుట యేను
నీ కెఱింగించి యప్పరిపాటి నిన్ను మున్న వినిపించితి ధర్మనందనా యమ్మునిపతి
మఱియు నప్పశుపతితో ని ట్లనియె.

⁠ 186


ఆ.⁠

సకలజంతువులకు సామాన్య మధ్యాత్మ
మాది గాఁగఁ గల్గు నంతవట్టు
నిట్లు గాఁగ నెఱుఁగు టెఱుఁగుట యొండుమైఁ
గనుట యెఱుక గాదు కామదమన.

⁠ 187


క.⁠

విను మధ్యాత్మప్రభృతులు
గనిరే ము న్నమరదనుజగంధర్వులునుం
గనుటయుఁ గల్గునె బ్రహ్మం
బున యున్న నిజంబు తత్ప్రబోధం బసదే.

⁠ 188


క.⁠

ఓంకారవాచ్య మది యన
హంకారనిరూఢభావనారాధ్యము ని
ష్పంక మశీత మనుష్ణము
శంకర మఖిలంబునకుఁ దృషాహరము శివా.

⁠ 189


తే.⁠

అప్రమేయ మవిజ్ఞేయ మచల మాది
విరహితంబు నితాంతంబు విమల మవ్య
యంబు పుండరీకాక్ష మనక్షవిషయ
మచ్యుతము నదసత్పరమైక్యభాసి.

⁠ 190


క.⁠

ఆదినారాయణుఁ డొకనికి
విదిత మతని నలన సురలు వివిధమునులు ని
ర్మదసిద్ధసాధ్యగణములు
మొదలగునర్హుల సుబోధములపొల మయ్యెన్.

⁠ 191

​

వ.⁠

అ ట్లయిన నాతత్త్వంబు దృశ్యత్వంబు నిరూఢంబుగా దెట్లనిన వినుము బంధ
విముక్తుండు గదా కనువాఁడు.

⁠ 192


చ.⁠

స్మరహర పొందు నింద్రియసమాజయుగంబు మనంబు బుద్ధియుం
బరువడిమై నహంకరణబంధము వాసినజీవుఁ దత్సము
త్కరసహితంబుగా నతఁడు దాఁ బరతత్త్వమునందు లీనతం
బొరయును దాని నెవ్వరు ప్రబోధముగాఁ గనువారు సెప్పుమా.

⁠ 193


క.⁠

భూతము లన్నియు నడఁగిన
యాతఱిఁ దనుఁ దాన కనుచు నంజనరహిత
త్వాతిశయ మెసఁగ వెలిఁగెడు
నాతెలి వాతత్త్వమునకు నమరు మహేశా.

⁠ 194


ఆ.⁠

అని సనత్కుమారుఁ డభవునితో మఱియు ని
ట్లనియె దేహవల్తులైన దైవ
తముల నెల్ల నాదరమున నాకర్ణింపు
మేర్పరింతు యోగహితము గోరి.

⁠ 195

సనత్కుమారుఁడు శివునకు దేహాంతర్గతదైవతములం దెలుపుట

సీ.⁠

జిహ్వ సోముఁడు వాణి శిఖి ప్రాణమున గాడ్పు
                  దానంబునందు శతహ్రదాలి
వ్యావస్తనాంతరవర్తులై సరన్య
                  గగనముల్ బలమునఁ గౌశికుండు
మతి నపానమున సమానంబునందు నీ
                  శానమిత్రాస్సరస్సమితు లక్షు
లందు సూర్యుఁడు మేన నంఘ్రులఁ జెవి భూమి
                  ధరణిధరుండు దిక్తతియుపస్థ

⁠


తే.⁠

మునఁ బ్రజాపతి బుద్ధియం దనఘ బ్రహ్మ
యుండు నింతకు బుధ్యమానుం డనంగ
వెలుఁగునాత్మ యధిష్ఠాత విను ప్రబుద్ధుఁ
డన నబుద్ధుండు నా నొప్పు నతఁడు మఱియు.

⁠ 196


క.⁠

ఈదైవతముల నన్నిఁటి
నాదరమునఁ గనుచు యోగి యచలితనిష్ఠన్
[16]వేదమయా మూర్ధగతుం
డై దక్షతపేర్మి నిలుపుఁ బ్రాణము లచటన్.

⁠ 197


తే.⁠

అపుడు బుధ్యమానునిఁ గనునవ్వరిష్ఠ
తత్త్వ మవ్యక్త మండ్రు తద్దర్శియగు బ్ర
బుద్ధుఁ డాతని నతని నబుద్ధుఁ డెఱుఁగు
చుండు నివి యాత్మదశ లతఁ డొకఁడ యనఘ.

⁠ 198


క.⁠

ఇవ్విధము గాంచుయోగికి
నెవ్వరు సరి గారు యతు లనేకు లచలులై
యవ్వస్తువు గోరుదు రది
ద వ్వొరులకు యోగితతికిఁ దక్క మహేశా.

⁠ 199


ఆ.⁠

క్షరుఁడు నక్షరుండుఁ బరుఁడును నందు ర
వ్వినుతదశలఁ బంచవిశకుఁడు ప్ర
బుద్ధనాముఁ డతఁ డబుద్ధునిఁ [17]గనుఁబురు
షవిధముగను బ్రకృతిసంగ మెఱుఁగు.

⁠ 200


క.⁠

విను షడ్వింశుఁ డబుద్ధుం
డనఁ జను వాఙ్మనసములకు నందక యునికిం
దనుఁ గా నాతత్త్వంబుం
గనిన ప్రబుద్ధుండ యతఁడు కామధ్వంసీ.

⁠ 201

​

క.⁠

వేఱుగఁ గనినం బ్రకృతికిఁ
జూఱ విడిచినట్ల తనదు సుజ్ఞానము న
క్కాఱు విడిచి తనకంటెను
మీఱ నొకటి లేమి గాన్పు మెయికొనవలయున్.

⁠ 202


వ.⁠

అని చెప్పి.

⁠ 203


తే.⁠

తత్త్వమునఁ గల్గు మూఁడవస్థలను దెల్ల
ముగ భవద్భవ్యసన్నిధి నిగదనమునఁ
గూర్చు టఖిలేశ నీ వెఱుంగుటయు నాకు
నెల్ల యోగి జనంబులు నెఱుఁగుటయ్య.

⁠ 204


వ.⁠

అని పలికి మునిజనకృత్యంబులు వివరించెద నవధరింపు మనుమాటయు సువ్య
క్తంబుగా నాడి యాక్రీడాతపస్వికి నప్పరమయశస్వి యి ట్లనియె.

⁠ 205


క.⁠

ముని వనమున శూన్యాలయ
మున నైన గుహానికేతముననేనిని నా
సనబంధధీరుఁడై మన
మునఁ గొని యింద్రియము విషయమునఁ బెడఁబాపున్.

⁠ 206


క.⁠

గురునుపదేశము నడపుం
బురహర విణ్మూత్రవేగముల నాఁకలితోఁ
బొరయం డయ్యభ్యసనము
గురువుగ నాహార మెపుడుఁ గొనఁ డేచరువుసన్.

⁠ 207


క.⁠

కుడిచిన యప్పుడు యోగము
దొడఁగుటయును వలదు మనసు దూలక యుండన్
మృడ వినుము బుద్ధిఁ గొని యె
క్కుడునిష్ఠను వలయు దానిఁ గుదియింపంగన్.

⁠ 208


క.⁠

అది గుదిసిన విజ్ఞానము
గదలక నిర్వాతదీపకాంతియుఁ బోలెం
బొదలును జిత్తంబును నుప
లదశాసంప్రాప్తి నిశ్చలం బగు దానన్.

⁠ 209


తే.⁠

అనఘ నిర్జననిశ్శబ్దమైనయట్టి
చోట హృదయస్థుఁ డగుదేపుఁ జూచుపనికి
వలయు లేకున్న శబ్దసంకలిత మేని
సజ్జనాన్వితస్థల మార్యసమ్మతంబు.

⁠ 210


క.⁠

విను తమము నిస్తమముఁ జే
తనారహితచేతనాసుధామయతాస్థా
ననిరూఢము నగుతత్త్వము
గద నిన్నియుఁ గలుగు యోగి కరుణామూర్తీ.

⁠ 211


క.⁠

మదనహరా యోగనిరతు
లది గని దుఃఖములఁ దొఱఁగి యజరామరతా
స్పద మగునెలపుల నిలుతురు
పొదలుదు రణిమాదిచయవిభూతి పదమునన్.

⁠ 212


వ.⁠

అని మఱియును.

⁠ 213


తే.⁠

యక్షగంధర్వసిద్ధసాధ్యాదిభూత
కోటికంటెను మిగిలి యోగులు నిజేచ్ఛఁ
బరఁగుదురు భవ్యయోగతత్పరుల మేము
నిట్లు లగుట యోగీశ నీయెఱుఁగుపనియ.

⁠ 214


వ.⁠

అని నిజసహజన్ము లయినసనకసనందునసనత్సుజాతులం దలంపించినాఁ డయి
వెండియు.

⁠ 215

​

తే.⁠

యోగధర్మంబుకంటెను నుత్తమంబు
గలుగ నేరదు ధర్మ మొక్కటియు నపున
రాగమం బగుపదమున కరయ నిదియ
మేటినిచ్చెన సంయమకోటి కెల్ల.

⁠ 216


క.⁠

యోగంబుతెఱఁగు సెప్పితి
భోగివరాభరణ సాంఖ్యమును జెప్పెదఁ ద
ద్భాగు లగునైష్ఠికులు భవ
సాగరముం గడతు రైక్యసంబోధమునన్.

⁠ 217

సనత్కుమారుఁడు రుద్రునకు సాంఖ్యయోగంబుతెఱం గెఱింగించుట

వ.⁠

కావున నత్యాదరంబున నాకర్ణింపు మని పలికి యి ట్లనియె.

⁠ 218


ఆ.⁠

ఇంద్రియములకంటె నీశాన మన మహం
కారతత్త్వమంతకంటె దాని
కంటె బుద్ధి బుద్ధికంటెఁ బ్రకృతి యెక్కు
డిన్నిటికిని బురుషుఁ డెక్కు డరయ.

⁠ 219


తే.⁠

అంబరాదిభూతములు శబ్దాదిగుణము
లింద్రియము లిరుదెఱఁదు బాలేందుమౌళి
మన మహంకారబుద్ధు లి ట్లొనరి ప్రకృతిఁ
గలయఁ దత్త్వచతుర్వింశకత్వ మొందు.

⁠ 220


క.⁠

చేతనుఁ డగుపురుషుని ని
శ్చేతన యగుప్రకృతి వొంది చేతనాప్ర
స్ఫీత యగుం బెఱతత్త్వము
లాతత్త్వం బనుమహాబ్దియందలితరంగల్.

⁠ 221


క.⁠

గుణములఁ బొందఁడు పురుషుఁడు
గుణమహితాప్రకృతి యిచ్చు గుణముల కేమే
గుణములు దానను గుణులై
గుణిత్వ మానిర్గుణాత్మకున కొలయించున్.

⁠ 222


తే.⁠

వీని నెల్ల నసత్కోటిఁగా నెఱింగి
కొనుచుఁ బ్రకృతి నుపేక్షించి తనకుఁ దాన
కాని యొం డెద్దియును లేమి గాంచినపుడు
పురుషుఁ డపగతధూమాగ్నిఁ బోలి వెలుఁగు.

⁠ 223


తే.⁠

అట్లు గాక యహంకార మావహిల్లి
ప్రకృతి దా నని సృష్టికిఁ బ్రళయమునకుఁ
గర్తయైన వికారాత్మకత్వ మొందుఁ
బ్రకృతివికృతులు గాని యాప్రభువు [18]నపుడు.

⁠ 224


క.⁠

ధృతి పూనమిఁ బ్రకృతికి వశ
గతుఁ డగుచుఁ దమోమయత్వకలితం బగున
వ్వితతాసుఖితత్వము సుఖ
మతిఁ బురుషుం డనుభవించు మదనధ్వంసీ.

⁠ 225


క.⁠

నేరిమి దాని నుపేక్షం
జేరుప షడ్వింశభావసిద్ధిఁ బొరయు గౌ
రీరమణ పంచవింశుఁడు
సారామలనిపుణమతిఁ బ్రసనాత్మకుఁ డై.

⁠ 226


క.⁠

[19]సత్త్వాశ్రయమునఁ బురుషుఁడు
దత్త్వాశ్రయమునను సత్త్వతత్త్వములవివే
కిత్త్వాలేపత్వము లన
విత్త్వము జిత్త్వంబు నొందు విశ్వాధారా.

⁠ 227

​

క.⁠

నానాత్త్వైకత్వముల
జ్ఞానజ్ఞానజము లనపజయ కండ్రు బుధుల్
వాని నవిద్యయుఁ విద్యయుఁ
గా నివి విను పంచవింశకస్థావస్థల్.

⁠ 228


క.⁠

విద్యామయషడ్వింశుఁడు
విద్యావిద్యావిభేదవిరహితుఁ డజరుం
డాద్యుఁ డనంతుం డచ్యుతుఁ
డద్యతనుఁ డనాది గేవలాత్మకుఁ డరయన్.

⁠ 229


ఆ.⁠

అని యుపన్యసించి యమ్మునిపతి యను
శంభుతోడ మఱియు సాంఖ్యయోగ
శిష్టమానసుల కరిష్టపరిజ్ఞాన
వైభవాతిశయము వలసి యుండు.

⁠ 230


వ.⁠

ఎ ట్లనిన దృష్టారిష్టవికృతు లయి యాసుకృతు లవిచ్ఛిన్నాత్మానుసంధానంబు
నం దదీయదురవస్థం ద్రోవం జాలదు రరిష్టంబు లవధరింపు మను పలుకు వలికి వా
నినెల్లను వివరించెద నని పరాశరసంయమీశ్వరుఁడు శిష్యుల కుపదేశించిన
విధంబు లై యుండు నంతవట్టును మును నీ వాకర్ణించి తని యమ్మునివరుండు
మఱియు నమ్మహాదేవుతో నరిష్టంబులం గాంచి యోగిజనంబులు సర్వాంగ
ధారణసహితంబును బరమహితంబును నగు ననేకత్వాకలనకృత్యంబున మృత్యు
వు జయింతు రని నిర్దేశించి.

⁠ 231


క.⁠

జలమున మీను నుదుంబర
ఫలమున మశకములుఁ బోలెఁ బ్రకృతింగా ని
మ్ముల నునికి దెలిసి వేర్పా
టలవఱిచినపురుషుఁ డవ్యయత్వముఁ బొందున్.

⁠ 232


తే.⁠

కమలదళమున నున్నజలమువిధమునఁ
బ్రకృతినుండి తదీయసంబంధవికృతి
లేనితనుఁ గని వెలుఁగు నిర్లేపనిశ్చ
లాజరామరపదవి జీవాహ్వయుండు.

⁠ 233


ఆ.⁠

ప్రకృతి నిట్లు వ్రాసి పంచవింశుండు ష
డ్వింశభావ మొంది విమలశివని
రంజనస్వరూపుఁ డై వెలుఁ గొందు న
త్తెఱఁగు ముక్తి యండ్రు దేవదేవ.

⁠ 234


క.⁠

ఈపరిబోధం బభవా
కాపిల మస్మద్గురుండు గపిలుఁ డతని శి
క్షాపరిణితి బహుశిష్యులు
దీపితవిజ్ఞాను లైరి దృఢనిశ్చయతన్.

⁠ 235


క.⁠

ఏనును శిష్యుల కీవి
జ్ఞానము పెక్కండ్రకుం బ్రసన్నమతిని గా
ఢానూనంబుగఁ దెలిపితి
మానిత మది దివ్యమునిసమాజముచేతన్.

⁠ 236


వ.⁠

గార్గ్యగౌతమకాత్యాయనాదులు దీవనచేసి దీప్తబోధు లయి వీతాతంకులును
విజ్వరులును నిర్లేపులును నిర్భరానందులు నైరని చెప్పి వెండియు ని ట్లనియె.

⁠ 237


క.⁠

సంగము బంధ మఖలని
స్సంగతమోక్షంబు బహువిచారము లేలా
పింగజటాజూటకలిత
గంగాబాలేందుమహిత గౌరిసహితా.

⁠ 238


క.⁠

అని యిట్లు శివునకును న
మ్ముని విజ్ఞాపించి గగనమున కెగసి వెసం
జనియె శివుండును నిజది
వ్యనిరర్గళచిత్తపథవిహారుం డయ్యెన్.

⁠ 239


క.⁠

అని చెప్పిన భీష్మున కి
ట్లను ధర్మతనూజుఁ డెక్కుడైనశుచిత్యం
బొనరింపఁ జాలు తీర్థం
బనఘా యెఱింగింపవే దయఁ దెల్లముగన్.

⁠ 240

​

సీ.⁠

అనవుడు నాతఁ డమ్మనుజవల్లభుతోడ
                  వినుము తీర్థము లెల్లవియును మేల
సత్యాభిధానమై శౌచాతిశయముఁ జే
                  యఁగఁ జాలు మానసం బైనతీర్థ
మది ధృతి యను మహాహ్రదమున శోభిల్లు
                  ధనము రజస్సును దఱియ ద్రోచి
కొనుచు సత్యము నూఁత గొని చొచ్చి యాచరి
                  తస్నానుఁడై శుచిత్వమున వెలుఁగు

⁠


ఆ.⁠

నరుఁడు వీతరాగపరిహృతేంద్రియదృఢ
[20]వ్రతలసద్వివేకు లతిశయిల్లు
విమలతీర్థములు సవినయత వారలఁ
జెలగుటయును దీర్థసిద్ధి యధిప.

⁠ 241


క.⁠

దమమును దపము నహింసయు
శమమును దీర్థములు వాన శౌచాతిశయం
బమలగుణ కలుగు రిత్తజ
లములం దోఁగిన శుచిత్వలాభము గలదే.

⁠ 242


వ.⁠

అని వెండియు.

⁠ 243


క.⁠

దొరకొననివానిఁ గోరక
దొరకొనినందును మమత్వతుష్టహృదయతం
బొరయక విగతస్పృహు లగు
పురుషులు శుచు లేల తీర్థములు వారలకున్.

⁠ 244


క.⁠

అనినఁ బ్రియ మంది తాతకు
మనుమఁడు బ్రణమిల్లి బోధనుహితా యేవ
ర్తనమున నుత్తమపదముం
గను నం డ్రది యెఱుఁగఁ జెప్పు కరుణ దలిర్పన్.

⁠ 245


వ.⁠

మృతుండు మేను విడిచి యెయ్యది సహాయంబుగాఁ జను నదియును విన వలతు
నని యడిగిన నమ్మహానుభావుం డాభూవల్లభున కి ట్లనియె.

⁠ 246


క.⁠

[21]నీయడిగినగూఢము లగు
నీయర్థము లెఱుఁగఁ జెప్ప నింద్రగురుఁడు గా
కేయెడల నొరుఁడు గలఁడే
యాయన యిట వచ్చు నిపుడు యడుగుము ప్రీతిన్.

⁠ 247


క.⁠

అనుసమయంబున నయ్యెడ
కనిమిషగురుఁ డరుగుదెంచె నతనికిఁ గుంతీ
తనయాగ్రజుండుఁ దమ్ములు
జనపతులును గేశవుండు సద్భక్తిమెయిన్.

⁠ 248


వ.⁠

ఎదుర్కొని ప్రణామపూర్వకంబుగా సముచితోపచారంబులం బ్రీతాత్ముం జేసి
యాసీనుం డై యున్నెడం గురుపతి యద్గురునిం గురుపితామహు వడిగిన యట్ల
యడిగిన నతం డతని కి ట్లనియె.

⁠ 249


ఆ.⁠

తనకుఁ దాన కలఁడు జననంబునప్పుడు
మరణమునను సుగతినరకములను
దల్లి దండ్రి దక్కు నెల్లబంధులు శరీ
రంబు ననుగమించి క్రమ్మఱుదురు.

⁠ 250


క.⁠

ఉత్తమపథంబు ధర్మా
యత్తము ధర్మంబు మృతుల కధిప సహాయం
బెత్తెఱఁగున ధర్మక్రియఁ
జిత్తంబునఁ జేర్పవలయు జీవించుతఱిన్.

⁠ 251


క.⁠

అది లేనివాఁడు నరకా
స్పదుఁ డగు నటు గాన ధర్మపరుఁ డగుటయ యొ
ప్పిదము మనుజునకు నేఁ జె
ప్పెద మఱియును వలయువానిఁ బ్రీతి నడుగుమీ.

⁠ 252


వ.⁠

అనిన నజ్జనపతి శరీరంబు విడిచి చనియెడుజీవుని ధర్మం బె ట్లనుగమించు నను
టయు నయ్యాంగిరసుండు.

⁠ 253


తే.⁠

భూతపంచకశక్తులు బుద్ధియును న
ధర్మకంబుగ జీవుతోఁ దగిలి యరుగు

⁠

​

⁠

ననుఁడు రేతఃప్రకార మె ట్లనియె నృపతి
యతని కి ట్లని చెప్పె నయ్యమరమంత్రి.

⁠ 254


తే.⁠

దేహగతభూప్రభృతిపంచదేవతలును
మనసు నన్నసంతృప్తిఁ బొందిన నృపాల
కల్గు రేతస్సు పురుషుండుఁ గామినియును
బొందఁగా నది గర్భత్వ మొందుఁ జువ్వె.

⁠ 255


వ.⁠

అని చెప్పి మఱియును.

⁠ 256


తే.⁠

పుణ్యపాపానుగుణభంగిఁ బుట్టి సౌఖ్య
దుఃఖమయసంసరణమునఁ దొడరునరుఁడు
వినుము కేవలధర్మవర్తనసుఖైక
భావనత నొందు ధర్మైకపరత మేలు.

⁠ 257


క.⁠

జనవర కృమిగరభముఖ
జననంబులఁ బొంగి నరకసంవాసముఁ జెం
దు నధికపాపాత్ముం డగు
మనుజుఁడు కర్మసవిశేషమహిమఁ దెలిపెదన్.

⁠ 258


.క⁠

జననీజనకగురులయెడ
నొనరించినమేలుఁగీడు నొదవించు సుఖం
బునకును దుఃఖమునకు నిం
తని కొలఁది యిడన్ వశంబె యజునకు నైనన్.

⁠ 259


క.⁠

మాతృపితృగురులు దక్కఁగ
నేతెరువునఁ బాప మొలసె నేనియు దానిం
బాతురు ప్రాయశ్చిత్త
స్ఫీతులు దద్విషయమైనఁ జెడ దల్పములన్.

⁠ 260


క.⁠

కొలు దపహరించు నన్నరుఁ
డెలుకయుఁ బందియును నైన యీదుర్జననం
బులఁ బొందునంతఁ బాపము
వొలియక యాతనికిఁ గుక్కపుట్టువుఁ గల్గున్.

⁠ 261


క.⁠

పరదారగమనదోషము
వరుసన వృకకంకగృధ్రవలిముఖశవభు
క్తితరంబు లైన భవములుఁ
బొరయించుం గృమియుఁ గాఁగఁ బుట్టించుఁ దుదిన్.

⁠ 262


సీ.⁠

తనయ నొక్కని కిచ్చి మనసు మరలఁబడి
                  యన్యున కిచ్చినయట్టివాఁడు
కృమియగు దేవకార్యము సేసి మఱి పైతృ
                  కంబు సేయక భోజనంబు సేయు
నతఁడు కాకం బగు నన్నఁ దిట్టినఁ గ్రౌంచ
                  మై పుట్టు బ్రహ్మకులాభిజాతఁ
గవసి శూద్రుఁడు నరకపుగుంటపు ర్వగు
                  నంతకుకింకరు లండఁ బట్టి

⁠


తే.⁠

కట్టికొని పోయి కోసియుఁ గాల్చియును గృ
తఘ్ను నుగ్రకంటకసముదయముమీఁదఁ
గ్రంద నదిమియు మఱియు దుఃఖములఁ బెట్టు
తెఱఁగు లెన్ని యన్నింటను బఱతు రధిప.

⁠ 263


క.⁠

ధనవాంఛ నిరాయుధుఁ జం
పిన గాడిద మొదలు గాఁగఁ బెక్కులు తిర్య
గంజననంబులఁ బొందును శ
స్త్రనిహతిఁ దోడ్తోడ మరణదశ వాటిల్లున్.

⁠ 264


ఆ.⁠

ఆఁడుదానిఁ జంపినతఁ డేకవింశతి
దూష్యనరకవాసదుఃఖ మొందు
నన్నదధిపయోఘృతాపూపహరణముల్
మక్షికాదికీటమయత సేర్చు.

⁠ 265


ఆ.⁠

ఫలము నినుము వెండిఁ బసిఁడి మ్రుచ్చిలికొన్నఁ
గ్రోఁతి వాయసంబు గ్రువ్వ నీచ
కృమియు నగు సదంబరము హరించిన శశ
జనన మొందు నరుఁడు మనుజనాథ.

⁠ 266

​

తే.⁠

నమ్మి యిల్లడ వెట్టిసొమ్ముఁ గొనిన
మీను లోనగునీచపు యోనులందుఁ
బుట్టు గంధపస్తువులు గొన్నట్టివాఁడు
వినుము మఱువుట్టువునఁ జుంచుతనము నొందు.

⁠ 267


తే.⁠

వనిత లీపాపములు సేసి వానివాని
పత్నులై జనియింతురు పాపభీతిఁ
దెరువు దప్పక నడచిననరులు సౌఖ్య
మందుదురు రెండులోకంబులందు నధిప.

⁠ 268


వ.⁠

అని చెప్పి యి ట్లనియె నేనుం గొన్ని దెఱంగు లెఱింగించితి మఱియు ననేక
పదార్థాపహరణంబులకు బహువిధంబు లగుఫలంబులు వాటిల్లు వాని నెల్లను
శాస్త్రాంతరశ్రవణంబున నెఱింగెదుగాక యనిన విని యక్కురుపతి బృహస్పతితోఁ
బాపంబులం బాపికొనుతెఱం గెఱింగింపవే యనుటయు నతం డతని కి ట్లనియె.

⁠ 269


క.⁠

విను నానంబులఁ బాపము
లనఘా చెడు దానములకు పన్నటికిని స
సజ్జనసేవ్య యన్నదానము
మును లధికం బండ్రు పాపములఁ బాపునెడన్.

⁠ 270


క.⁠

న్యాయార్జిత మగునన్నము
వేయింటికిఁ బెట్టవలయు విప్రజనము హ
రాయత్తంబుగ దానం
బాయనిపాపములుఁ గలవె పౌరవముఖ్యా.

⁠ 271


తే.⁠

తిరిసియేనియు నన్నంబు దెచ్చి శిథిలు
లైన విప్రులయాఁకలి నపహరించు
పురుషుఁ డూర్ధ్వలోకంబుల పురుషవరుల
కర్చనీయుఁ డై వెలుగుచు నంద యుండు.

⁠ 272


క.⁠

వేదాధ్యయనార్థప్రతి
పాదనమున విప్రవరుఁడు బ్రహ్మవిషయస
ద్భూదానంబుల నరపతి
యేదురితములైనఁ గౌరవేశ్వర పాచున్.

⁠ 273


తే.⁠

నేర్చి యలజడిఁ బడిన వాణిజ్యనిధులఁ
బడసి వైశ్యుఁ డన్నం బిడి పడయు సుగతి
చచ్చునంతలు పడి సిరి దెచ్చికొని చ
తుర్థు లన్నంబు వెట్టి గాంతురు దినంబు.

⁠ 274


తే.⁠

దినము వంధ్యంబు గాకుండఁ దివిరి యన్న
పానదానంబు లొదవినభంగిఁ జేసి
మఱి భుజించుటఁ బోలెడు మహితధర్మ
కార్య మొండొకఁ డెందును గలదె యరయ.

⁠ 275


తే.⁠

అన్నదానంబు ధర్మంబు లన్నటికిని
ముఖ్య మింత యెఱుఁగు కురుముఖ్య యనుఁడు
ననిమిషాధిపమంత్రికి నమ్మహీశుఁ
డి ట్లనియె భక్తివినయంబు లెసక మెసఁగ.

⁠ 276


క.⁠

ధ్యానం బింద్రియవృత్తుల
మానించు టహింస గురుసమర్చనవిధి ని
త్యానుష్ఠానము దప మను
వీనఁ పరమసేవ్య మెద్ది వినఁగా వలతున్.

⁠ 277


వ.⁠

వినిపింపు మనిన నమ్మహాత్ముండు.

⁠ 278

​

క.⁠

ఈయాఱును మంచితెరువు
లైయుండు నహింస యున్నయైదిటికిఁ బవి
త్రాయతన మట్లు గాకయ
నేయుత్తమధర్మములను నిది వెలిగించున్.

⁠ 279


వ.⁠

అని పలికి యామంత్రణంబు సేసి వాసవమంత్రి యమరనగరంబునకుం జనియెఁ
దదనంతరంబ.

⁠ 280


ఆ.⁠

ధర్మనందనుఁడు పితామహుతో సర్వ
దేవతలును భూమిదేవతలును
మునివరులు నహింస గొనియాడుదురు దాని
తెఱఁగు సెప్పు నాకుఁ చేటపడఁగ.

⁠ 281


వ.⁠

అనుటయు నమ్మహనీయుం డమ్మనుజపతిం బరమాదరంబున నాలోకించి.

⁠ 282

భీష్ముఁడు ధర్మజునకు నహింసాస్వరూపనిరూపణంబు సేయుట

ఆ.⁠

గంతియడుగులోనఁ దక్కినజంతుచ
యంబు నడుగులెల్ల నడఁగియుండు
నట్ల ధర్మకోటు లన్నియు లో నగు
నిద్ధగుణ యహింస కింత నిజము.

⁠ 283


వ.⁠

అదియును.

⁠ 284


క.⁠

అరయఁగ నాలుగువిధములఁ
బరఁగుఁ జతుష్పాదవృత్తిఁ బరఁగిన గోవున్
దొరయుచు నం దొకఁ డెడలిన
నరవర సద్ధర్మవర్తనము గుంటు పడున్.

⁠ 285


తే.⁠

మనసునను వాక్కునను గాయమునను హింస
నడపు మాంసంబు దినుటతో నాలు గయ్యెఁ
దెఱఁగు లవి సువ్వె హింస వర్తింపఁ జేయుఁ
గాన కడుఁ గీడు మాంసభక్షణము దలఁప.

⁠ 286


క.⁠

ఈనాలుగుదెఱఁగులఁ దగ
నూనుట యేఁ జెప్పినట్టి మహితాహింసా
నూనచతుర్విధములు మాం
సానేకరుచిప్రమగ్నుఁ డది యె ట్లుడుగున్.

⁠ 287


క.⁠

కావున మాంసముపైఁ దగు
లేవిధమున నుడుగుటయ యహింసారూపం
బై వఱలుఁ జుమీ భూవర
నావుడు నక్కురువిభుఁడు వినయమయుఁ డగుచున్.

⁠ 288


వ.⁠

మాంసంబు పితృదేవతలకుం బ్రియంబు శ్రాద్ధంబు మాంసముఖ్యంబుగా నడ
పవలయు నని చెప్పుదురు వధింపక మాంసలాభం బెట్లు గలుగు ననుటయు
ననిమిషనదీనందనుం డానరనాథున కి ట్లనియె.

⁠ 289


తే.⁠

వాజిమేధంబుకంటెను బూజనీయ
కర్మ మందురు మాంసభక్షణము విడుపు
వినుము చంపుటయును జంపఁ బనుచుటయును
గల్మషంబుల కెల్ల నగ్గలము నధిప.

⁠ 290


క.⁠

పితృకార్యయజ్ఞముఖముల
శ్రుతచోదితహింసఁ గీడు సొర నేరదు వి
శ్రుతగుణ మాంసముచవి గో
రి తినం బ్రాణిఁ దెగటార్చుక్రియఁ బాప మగున్.

⁠ 291


క.⁠

తను నమలినవాని నమలు
నని మాంసముతెఱఁగు సెప్పు నాగమములు గా
వునఁ దద్భక్షణ ముడిగిన
ననఘ తపంబునకుఁ జాలు నది యొక్కండున్.

⁠ 292


క.⁠

జనవర మాంసముచవిఁ గడ
చినచవు లరయంగ లేమిఁ జేసి చవి యుఱిం
గినవాఁ డది యుడిగిన నా
తని దేవసమానుఁ డండ్రు ధర్మవిధిజ్ఞుల్.

⁠ 293

​

ఉ.⁠

మ్రానను ఱాతనుం గలదె మాంసము ప్రాణులమేనఁ గాగ య
మ్మేనుల నొంచునప్డు తమమేనులు సోఁకిన మాత్ర నె ట్లగున్
దానిఁ దలంపఁగా వలదె తా నది మానిన హింస లన్నియున్
మానవె యంచు నుత్తముఁడు మాంసము మాను దయార్ద్రచిత్తుఁ డై.

⁠ 294


ఆ.⁠

మాంస మాన మునికి మనుజేశ ప్రాణివ
ధాభిరతి దొఱంగు టగుటఁ జేసి
యట్టివాని కభయ మఖిలభూతంబుల
వలన నెపుడు నెందుఁ గలిమి నిజము.

⁠ 295


క.⁠

స్వాయంభువుఁ డనుమనువును
నీయర్థము సెప్పె లోకహితముగ మార్కం
డేయాదులు మాంస ముడుగు
టాయుశ్శ్రీరూపకారి యగు నని రధిపా.

⁠ 296


క.⁠

విను మాంసము గోరునరుఁడు
దనుజుఁడ చూవె మును దేవతలు మాంసంబుం
దిను టుడిగి కాదె దానవ
జనితభయముఁ బోవఁ ద్రోవఁ జాలిరి వత్సా.

⁠ 297


క.⁠

దానము ధర్మము దప మి
జ్యానిష్ఠ యనంగఁ గల్గు సత్క్రియ లెల్లన్
మానవనాథ యహింసా
నూనాకృతు లండ్రు శ్రుతుల నూనిన పెద్దల్.

⁠ 298


క.⁠

శతవర్షదుష్కరతపః
కృతి నంజుడు దినము నగు సుకృత మివి రెండున్
మతిఁ దలఁప నొక్కరూ పని
శ్రుతివేదులు సెప్పుదురు కురక్షితినాథా.

⁠ 299


క.⁠

తపముల దానంబుల బ్ర
హ్మపురినివాసంబు దప్ప దన రాదు జనా
ధిప మాంసము నమలని పు
ణ్యపురుషునకు సులభ మందు రానెల వార్యుల్.

⁠ 300


తే.⁠

అధిప యాషాఢముఖ్యంబు లైననెలలు
నాలుగింటను మాంసంబు నమల కుడుగు
టాయురారోగ్యబలకీర్తు లనుఫలమును
నాలుగింటిని నిచ్చు నన్నరున కండ్రు.

⁠ 301


ఆ.⁠

సగరనలదిలీపనృగభగీరథముఖ్య
నృపులు వార్షికంపునెలలు నాల్గు
మాంసభక్షణంబు మానుట నుభయలో
కంబులందుఁ బెంపుఁ గాంచి రండ్రు.

⁠ 302


వ.⁠

అనిన విని యజాతశత్రుండు శంతనుపుత్త్రుతో నిమ్మెయి మహనీయం బయిన
మాంసవర్జనంబు వాటించి తక్కినయపూపాదులు ఫలప్రభృతులు నగు
భక్ష్యంబు లాచరించి యేల వర్తింప రెల్లజనంబులు ననుటయు.

⁠ 303

మాంసభక్షణమందలి రుచివిశేషంబు మానుట దుష్కరం బని చెప్పుట

సీ.⁠

అతనికి నతఁ డిట్టు లను మాంసముల చవి
                  మరగినవారికి మాన వశమె
యట్లు గాకయు సురతాసక్తునకు బల
                  మొలయు నధ్వశ్రాంతుఁ డుల్లసిల్లు
క్షతము శీఘ్రమునలోపిత మగుఁ గృశునకుఁ
                  బుష్టి వేగమ వచ్చు భూపవర్య
విను మాంసభక్షణంబున నపూపఫలాదు
                  లం దవ్విశేషంబు లరయఁ గలవె

⁠


తే.⁠

మాంస మానినదోషంబు మహితదాన
విధులఁ బాయు దివిజపితృవిధివిశిష్ట

⁠

​

⁠

మైన యెఱచి గీ డొలయదు యజ్ఞములకుఁ
బశువిధానంబు వేదంబుపనుపు గాన.

⁠ 304


వ.⁠

ఇట్లు గాన నంజుడు నమలుటయు నధికదోషంబులు గానియడలునుం గలిగి
యుండు నగస్త్యుండు రాజులకు వేఁట విధించెం గావునం గుతూహలంబుఁ
గోపంబ ననియెడు భావంబులం బొరయక లోకరక్షణార్థంబుగాఁ గ్రూరమృగ
వధంబును స్వహస్తవిక్రమార్జితమాంసంబున దేవపితృప్రీణనం బొనర్చుటకుం
గాఁ బక్షిమృగమారణంబును జేయుభూనాయకుండు దురితలం బొరయ
కుండు విశేషంబు వినుము.

⁠ 305


ఆ.⁠

అన్యమాంసంబున నిజాంగమాంసంబుఁ బో
షింతు ననుటకంటెఁ జెట్ట లేదు
మాంసభక్షణంబు మానుటకంటెను
మేలు లేదు కర్మజాలకమున.

⁠ 306


తే.⁠

మాంసభక్షణదోషంబు మాను దాన
మహిమ ననుటయు మాంసంబు మఱి భుజింప
కున్నఁ జూవె ధర్మము లెవ్వియును దలంప
దయకు సదృశంబులే కురుధరణినాథ.

⁠ 307


తే.⁠

ఆత్మసదృశత ప్రాణభయంబునందుఁ
బ్రాణులకు నెల్లఁ గని మాంసభక్షణంబు
మాను దయ నార్ద్రమానసుం డైనపురుషుఁ
డాతనికి బ్రహ్మలోకాదు లాటపట్టు.

⁠ 308


క.⁠

భూతముల కలుగు నతనికి
భూతము లఖిలములు నలుగు భూతహితార్థీ
భూతముల కభయ మిచ్చిన
పూతాత్మున కభయ మిచ్చు భూతావలియున్.

⁠ 309


ఆ.⁠

దానమును దపంబు ధర్మంబు యజ్ఞంబు
శౌచమంత్రతంత్రసత్యములును
బుధు లహింసరూపములు గాఁగఁ జెప్పుట
నెల్లకల్మి సు మ్మహింసకలిమి.

⁠ 310


క.⁠

నరనాథ యహింసాగుణ
పరిగణనము గొంతమాత్రఁ బలికితి ధర్మో
త్తర యగు నహింసమేలిమి
యరయం గడుఁబెద్ద దాని నలవఱపు మదిన్.

⁠ 311


ఆ.⁠

అనిన సంతసిల్లి యమ్మహీపతి తాత
కధికభక్తి మ్రొక్కి యస్మదీయ
సంగరంబునందుఁ జచ్చినవారల
కేది గతియొ నాకు నెఱుఁగఁ జెప్పు.

⁠ 312


క.⁠

బ్రదుకును జావును సుఖదుః
ఖదములుగా జంతుకోటి కరుణామూర్తీ
మదిఁ దలచుఁ బ్రాణలాభము
వదలు టరిది గాన నట్టివారి నడిగితిన్.

⁠ 313


క.⁠

అనుటయు లెస్సఁగఁ దలంచితి
విను మొకకీటంబునకును వేదరహస్యం
బున లోకహిత మొనర్చిన
మునికి నయినసత్కథనము మునినుతచరితా.

⁠ 314

​

వ.⁠

దాన నీయడిగినయర్థంబు తెల్లం బగు నని పలికి భీష్ముం డి ట్లనియె.

⁠ 315


క.⁠

శకటపథంబునఁ గీటం
బొకటి వెసం బాఱఁ గాంచె యోగీంద్రుఁడు జం
తుకలాపమానసదశా
ప్రకారసంవేది బాదరాయణుఁ డధిపా.

⁠ 316


వ.⁠

కాంచి నిరూపించి యాకృష్ణద్వైపాయనుం డక్కీటంబుతో నీవు భయంబున
రయం బెసఁగఁ బాఱెదవు కారణం బేమి యని యడిగిన నది యమ్మునీంద్రున
కి ట్లనియె.

⁠ 317


తే.⁠

తెప్ప దెరలంగ బండు లేతెంచుచున్న
యవి మహాత్మ తన్నేమిజాతారవములుఁ
గడఁగ నెడ్లను దఱిమి రొప్పెడునరాలి
యులివు విని యుల్లమునఁ గడునులకు వుట్టి.

⁠ 318


వ.⁠

బ్రతుకును జావును బరమసుఖంబును నత్యంతదుఃఖంబునుం గాదె కావున.

⁠ 319


క.⁠

క్రందున మేను సిదియు నను
కొందలపా టొంది ప్రాణగొడ్డ మగుటఁ ద
ప్పం దొలఁగఁ బాఱెదను ముని
బృందారక యసదె ప్రాణభీతి దలంపన్.

⁠ 320


చ.⁠

అన విని దాని కిట్టు లను నమ్మహితాత్మకుఁ డెంత లెస్స నీ
మనికి దలంప నింద్రియసమాజసుఖంబులఁ బొందఁ గీటము
ల్గను టది లేదు దుఃఖబహులక్షం బిది యీయొడ లేల చావు నీ
కనయము సౌఖ్యకారి యగు నత్తెఱఁ గీవు దలంచి చూడుమా.

⁠ 321


వ.⁠

అనుటయు నక్కీటంబు.

⁠ 322


తే.⁠

అనఘ కీటంబులకు విషయజము లైన
సౌఖ్యములఁ బొంద లే దను చదువు గలదె
వినుము తమతమతెరవుల ననుభవింపఁ
గలదు చావును భీతికిఁ గారణంబు.

⁠ 323


వ.⁠

నీవు నామనం బరసి తింతియ కా యింత యెఱుంగవే యది యట్లుండె నా
తెఱం గవధరింపు మేను దొలుమేన నొక్కశూద్రుండ ధనవంతుండ.

⁠ 324


సీ.⁠

ఆచారహీనత యతిలోభ మన్యధ
                  నాపేక్ష క్రూరత యవినయంబు
మొద లైనదుర్గుణంబులకు నెల్లను నెల
                  వై యుండి మాతకు నధికభక్తిఁ
బ్రీతి యెప్పుడు నొనరింతు బ్రాహ్మణమాత్రుఁ
                  డతిథి యొక్కరుఁ డొకయప్పు డరుగు
దెంచిన నతనిఁ బూజించితి నది కార
                  ణముగ జాతిస్మరణంబు గలిగె

⁠


తే.⁠

మంచికర్మము సుఖము నొందించు టిపుడు
గాన వచ్చె మునీశ్వరకరుణ నాకు
నత్తెఱం గెఱిఁగింపవే యతివిశదము
గాఁగ ననవుడు నాతండు గారవమున.

⁠ 325


వ.⁠

ఆజంతువుం గనుంగొని నీవు సెప్పవేల దుష్కర్మకోటివలనం గీటంబ వగు
టెఱింగితి భవదాచరితంబులైన సత్కర్మంబులం గాంచితి నమ్మేలునకు సంతో

⁠

​

⁠

షించి కాదె నీతో సంభాషించితి మదీయతపోవిశేషంబున నీ దయినకీటత్వం
బపనయించెద విషాదం బపనయింపుము తపోబలంబును గడచిన బలంబులుం
గలవే మనుష్యజన్మంబు నొంది మే లొనర్చెద ననుకోర్కి నీకుం బుట్టుట మేలు
మానవులకుం గర్మభూమికృతంబు లైనసదసత్కర్మంబులం జూవె దేవతలును
గీటంబులు నగుట వాటిల్లెడు నని పలికి వెండియు.

⁠ 326


క.⁠

సుకృతము లమ్మెయిఁ గల్గుట
నకట జని స్మృతియుఁ గల్గె నస్మత్సంద
ర్శకతయు నీకు నొదవె నో
డకు మున్నతపదము నిచ్చుటకు మెయికొంటిన్.

⁠ 327


వ.⁠

అత్తెఱం గాకర్ణింపుము.

⁠ 328

వేదవ్యాసుఁడు గీటగంబునకు నుత్తమజన్మములు గలుగ ననుగ్రహించుట

ఆ.⁠

నీచశూద్రవైశ్యనృపజన్మములఁ గ్రమ
వృత్తి నొందు మెపుడుఁ జిత్తమునకుఁ
బు ట్టెఱుంగునట్టిపోడిమి నొసఁగితి
ధర్మపరుఁడ వగుదు దానఁ జేసి.

⁠ 329


క.⁠

అని సాత్యవతేయుఁడు గృప
నెనసి సుధాధారఁ బోలు నీక్షణముం ద
త్తనువున నిగిడించిన న
మ్మునిపతిఁ గీర్తించె భూతములు ప్రీతములై.

⁠ 330


క.⁠

అక్కీటంబును భక్తిన్
మ్రొక్కి శిరం బతనిపాదముల మోపి మనం
బెక్కుడు ప్రమోదమునఁ గడుఁ
జొక్కఁగఁ దదనంతరమ యసువులం దొఱఁగెన్.

⁠ 331


వ.⁠

కారుణికత్వధుర్యుం డగునప్పారాశర్యుం డ ట్లవలీల మే లొనర్చి కీటంబుం గృ
తార్థంబుఁ జేసి నిజేచ్ఛం జనియె నదియు నమ్మహానుభావునిర్దేశించినతెఱంగున
జనియించుచు ననేకపుణ్యంబు లాచరించుచు నృపజన్మంబునం బూజ్యం బైన
రాజ్యంబు నొంది.

⁠ 332


సీ.⁠

ఏనుంగు లెక్కి పెక్కేనుంగు లిరుగడ
                  రాఁ దురంగంబుల [22]రమణ యొప్ప
గొడుగులుం [23]బడగలు ముడివడ గాయక
                  వందిపాఠకుల రవంబు లెసఁగ
భూషణంబుల రత్నపుంజంబుదీప్తులు
                  దిక్కుల నెల్లను దీఁటుకొనఁగ
సామంతకవిజనసీమంతినీముఖ
                  పరివారవైభవస్ఫురణ మలర

⁠


తే.⁠

దేవపతివోలె సాత్యవతేయునాశ్ర
మమున కేతెంచి తత్పాదకమల మాత్మ
ముకుటసంగతముగఁ జాఁగి మ్రొక్కఁ గరుణ
నాతఁ డెత్తి తన్మస్తక మక్కుసేర్చె.

⁠ 333


వ.⁠

ఇ ట్లత్యంతాదరంబున సంభావించి శిష్యజనంబు నియోగించి.

⁠ 334


క.⁠

రాజన్యసముచితం బగు
పూజావిధి యాచరించి పురుషోత్తమ నీ
వీజన్మంబున సన్ముని
రాజికి వెఱఁ గగుతపశ్చర్ణ మొంద వనా.

⁠ 335


క.⁠

గోవులకై యొండెను వి
ప్రావలికై యొండె నిర్భరాహవకేలీ
ప్రావీణ్యము మెఱసి విడువు
నీ వసువులు దాన నధికనిర్మలత యగున్.

⁠ 336


వ.⁠

ఇట్లు నిష్కల్మషత్వంబు సిద్ధించిన.

⁠ 337


క.⁠

ధరణీసురజననమహిమ
దొరకొను నీ కని విధించి దుర్ధాంతరిపు

⁠

​

⁠

స్ఫురణహరణపరిణతు న
న్నరపతి వీడ్కొల్పె మునిజనంబులు వొగడన్.

⁠ 338


తే.⁠

అతఁడు నానందసంభరితాంతరంగుఁ
డగుచు దండప్రణామంబు లాచరించి
యరిగి యమ్ముని చెప్పినయట్ల చేసి
భూమిసురజన్మలాభంబుఁ బొందె నధిప.

⁠ 339


వ.⁠

ఇవ్విధంబున సద్ద్విజుండై.

⁠ 340


క.⁠

పుణ్యస్థలముల నెల్లన
గణ్యము లగుయూపములు ప్రకాశములుగఁ గ
ర్మణ్యతయు వివిధరత్నహి
రణ్యాదికదానములను బ్రస్తుతి కెక్కన్.

⁠ 341


తే.⁠

అధ్వరంబు లనేకంబు లాచరించి
యతఁడు మరియును బాదరాయణునిఁ గాంచె
సదయచిత్తత నప్పరాశరసుతుండు
వీడుకొలుపంగఁ యని యశోవిభవ మెసఁగ.

⁠ 342


క.⁠

వ్రతశీలతఁ బరఁగి తుదిన్
శతముఖునకు నగ్గలంపుసఖుఁ డై యమరా
ర్చితసంస్తుతభవ్యపద
స్థితి నవ్యయపరమసౌఖ్యసిద్ధిం దనరెన్.

⁠ 343


వ.⁠

అని చెప్పి భీష్ముండు.

⁠ 344


క.⁠

మనుజేంద్ర కురుక్షేత్రం
బున నద్భుతఘోరసమరమున నమ్మాడ్కిం
దనువులు దొఱఁగిననృపులకు
ననంతసుఖతతులు గల్గు టనుమానంబే.

⁠ 345


వ.⁠

భవదీయబంధు లందఱు నూర్ధ్వలోకప్రాప్తుల నీ వేమియు ననుమానింపకు
మని పలికినం బాండవాగ్రజుండు పరమసంతోషభరితాంతఃకరణుం డై సుర
సరిత్సూనుతో విద్యాతపోదానంబులలో నెయ్యద విశేషం బెఱింగింపవే
యనుటయు నమ్మహీపతి గౌరవంబునం గనుంగొని.

⁠ 346


తే.⁠

వ్యాసమైత్రేయపుణ్యసంవాద మనఘ
వినిన నీప్రశ్నమున కది విశదమైన
యుత్తరం బగు నేకాగ్రచిత్తవృత్తి
వగుమ నీ వని పల్కి యిట్లనియె నధిప.

⁠ 347

వ్యాసమైత్రేయసంవాదము భీష్ముఁడు ధర్మరాజునకుఁ జెప్పుట

సీ.⁠

వ్యాసమునీంద్రుండు వారాణసీపురి
                  కరిగి మున్ మైత్రేయుఁ డచట నునికి
నాతనియున్నెడ ప్రకాశతఁ జన్న
                  నెఱిఁగి యమ్మహితాత్ముఁ డెఱఁగి భక్తిఁ
బూజించి యుత్కృష్టభోజనంబునఁ దృప్తి
                  సేసిన నధికవికాసరుచిర
ముఖ్యుఁ డైన యమ్మహామునిఁ జూచి మోద మ
                  గ్గల మయి మీయందుఁ గానఁ బడియెఁ

⁠


తే.⁠

గారణం బేమొకో యని గారవమున
నాతఁ డడిగిన నతఁ డధికాదరమునఁ
దపము శ్రుత మాదిగాఁ గల ధర్మకోటి
లోన నెల్లను నధికంబు దాన మనియె.

⁠ 348


వ.⁠

అని మఱియును.

⁠ 349


క.⁠

దానార్హవస్తువులలో
మానిత మన్నంబ యన్నమయము లసువులున్
మేనుఁ దదీయబలంబును
గాన బుధులు దానిఁ దద్దగైకొండ్రు మదిన్.

⁠ 350


క.⁠

తప ముల్లము కల్మషముల
నపగతములఁ జేయు విద్య కాస్పదమగు నా
తపసి మహితదానంబున
నుపచిత మగువిద్య దపము నుత్కర్షించున్.

⁠ 351

​

క.⁠

కాన తపంబును విద్యయు
దానౌదాత్త్యప్రవర్ధితంబులు విద్యా
నూనత్వం బచ్యుతుఁ గను
దానికి దీపంబు సద్వ్రతప్రవణులకున్.

⁠ 352


ఉ.⁠

కావున నన్నదానమునఁ గా కెటు లుండు మహాప్రమోద మ
త్యావిలచిత్తుఁ డైనను మహత్తరదానమునన్ విశుద్ధస
ద్భావత నొందు నిక్క మని పల్కె నరేంద్ర తపంబు విద్యయున్
దైవతపూజనీయములు దానము వానికిఁ బోషకం బగున్.

⁠ 353


క.⁠

అని శాంతనవుఁడు సెప్పిన
విని కౌంతేయాగ్రజుండు విమలమతీ యం
గనలసమాచారంబులు
వినంగ నే వలతుఁ జెప్పవే తెలియంగన్.

⁠ 354


వ.⁠

అనిన నతండు కైకేయీశాండిలీసంవాదంబున నిది దెల్లం బగుం జెప్పెద విను
మని యి ట్లనియె.

⁠ 355


తే.⁠

సుమన యనియెడు కైకేయి యమరపురము
నందు శాండిలిఁ గని భవ్యమైనదివ్య
పదవి యేవర్తనమునఁ జొప్పడియె నీకు
నతివ చెప్పుము నా కని యడిగె నధిప.

⁠ 356


వ.⁠

అని యడిగిన నాయమ కయ్యంగన యి ట్లనియె.

⁠ 357


సీ.⁠

మామకు నత్తకు మార్కల్ప దేవపి
                  త్రతిథిపూజనములయందు సొలయ
[24]నిలువడిఁ దలవాకి లెప్పుడు నెఱుఁగక
                  పెలుచ నవ్వక శుద్ధి వెలయ విప్ర
భిక్ష [25]యోపిక గల్గి పెట్టుచు వర్తింతు
                  వలయు కార్యములకు వెలఁది మగుడఁ
బతి వచ్చునప్పుడు భక్తియు వేడ్కయుఁ
                  బొదల నాసనపాద్యములను సుముఖ

⁠


ఆ.⁠

భావమునను సేవ వాటింతు బిడ్డల
శిక్ష వదలఁ దిట్టఁ జెట్టఁ గనియు
నాకు వేఱ ప్రియ మనఁగ లేదు పతి మెచ్చు
వంటకములు చవిగ వండి యిడుదు.

⁠ 358


చ.⁠

వరుఁ డొకవెంట నెన్నఁడు ప్రవాసగతుం డగు నాఁటఁ గోలె న
ప్పురుషుఁడు వచ్చునంతకును బూవులు పూఁతలు మేలిచీర లా
భరణము లెక్కుడుం జవులపాకవిశేషము లాదరింప నె
ప్పరుసునఁ [26]గొల్చుఁ గూ డురువ బంధులకుం దగ నెమ్మి సల్పుదున్.

⁠ 359


క.⁠

గోవులు మొదలగు తిర్య
గ్జీవుల సుఖవృత్తు లరసి చెల్లింతు గృహ
శ్రీవర్తనంబునకుఁ బతి
భావము సంకటపడంగఁ బలుక నొకటియున్.

⁠ 360


తే.⁠

అగ్ని యోపి రక్షింతు రహస్య మైన
దాని వెలిపుచ్చ గర్భంబు దాల్చి యున్న
యపుడు వాచవు లెల్లను నవులఁ బెట్టి
దాని కెయ్యవి పథ్యముల్ వానిఁ గొందు.

⁠ 361


క.⁠

అని చెప్పి యట్టిచందం
బున నడచిన సతికి లోకములు రెండును సౌ
ఖ్యనిరూఢి యొసఁగుఁ బొగ డొం
దు నరుంధతివోలె నవ్వధూటి నరేంద్రా.

⁠ 362


క.⁠

నృప యీయాఖ్యానము ప
ర్వపుదినమున భక్తిఁ జదువువారలు విను పు

⁠

​

⁠

ణ్యపురుషులును నాయుశ్శ్రీ
లపరిమితము లొంది యమరు లగుదురు పిదపన్.

⁠ 363


వ.⁠

అనిన విని ధర్మనందనుండు సర్వశాస్త్రసారం బై శ్రేష్ఠం బగుననుష్ఠేయం
బెయ్యది పితామహా యనుగ్రహింపు మని యభ్యర్ధించిన నాపగేయుండు
గృపావిధేయుం డై నారదపుండరీకసంవాదం బాకర్ణింపుము దాన నీయడిగిన
యర్థంబు దెలియును దీర్థపరుండును జపతత్పరుండును బుండరీకాభిధానుండును
నైనమహాద్విజుం డొక్కయెడ నారదమహామునిం గని భక్తిం బ్రణతుం డై
యిత్తెఱంగునన యడుగ నతం డతని కి ట్లనియె.

⁠ 364

నారదపుండరీకసంవాదం బనుపరిమేతిహాసప్రకారము

సీ.⁠

పరమేష్ఠి సెప్పిన పరమధర్మం బల్ప
                  ఫణితి మహార్థంబు భవ్యమతికి
శ్రోతవ్యమును బరిజ్ఞాతవ్యమును దాని
                  విను ప్రకృతికిఁ బర మనఁగఁబడిన
యిరువదే నగుతత్త్వ మరయంగ జీవాత్ముఁ
                  డాతండ సర్వభూతాత్మకుండు
నరుఁ డన వెలుఁగు నప్పురుషునివలన
                  కలిగి నారము లను వెలసినట్టి

⁠


తే.⁠

యన్యతత్త్వంబు లతనికి నయన మగుట
నతఁడు నారాయణుం డన నతిశయిల్లు
విశ్వమును దనయంద యావిర్భవింప
విలయ మొంద నద్దేవుండు విభుతఁ బొల్చు.

⁠ 365


క.⁠

పరమబ్రహ్మం బనఁగాఁ
బరతత్త్వం బనఁగఁ బరమపద మనఁగా ని
శ్వరుఁ డన విష్ణుఁ డన జగ
ద్భరితత నారాయణుండు దా వెలుఁ గొందున్.

⁠ 366


ఆ.⁠

ఆతఁడు వాసుదేవుఁ డన నాత్మ యనఁగ వే
దాంతవాక్యబోధ్యుఁ డై వెలుంగు
నరున కప్పదములు నామాంతరంబు ల
ర్థాంతరంబు లేనియట్టి వనఘ.

⁠ 367


ఆ.⁠

సర్వశాస్త్రవాక్యసమితి నాలోకించి
మఱియు దృఢవిచారమహిమఁ దెలిసి
నిశ్చయింపఁ బడియె నిష్ఠ నారాయణు
నెపుడుఁ దలఁపవలయు నిది యొకండ.

⁠ 368


వ.⁠

కావున.

⁠ 369


క.⁠

పరమానుష్ఠేయం బిది
నరోత్తమా నీవు నెపుడు నారాయణుఁ ద
త్పరతఁ దలఁపు చొరకు సవి
స్తరశాస్త్రార్థముల క్రందుఁ దలపోఁతలకున్.

⁠ 370


క.⁠

విను మొకయించుకసే పై
నను నారాయణునిఁ దలఁచినను సుగతిఁ గనున్
మనుజుఁ డనిన మది నెప్పుడు
నునిచినయాతనికి బ్రాఁతె యుత్తమధిషణా.

⁠ 371


క.⁠

ప్రణుత యగునమోనారా
యణాయ యనునక్షరాలి నంత్యప్రాప్తి
క్షణమున జిహ్వకుఁ దెచ్చినఁ
బ్రణవార్థం బైనపదముఁ బడయుదురు నరుల్.

⁠ 372


క.⁠

నారాయణపదవాచ్యం
బారయ బ్రహ్మంబు దాని ననిశము వినియున్
సారమతిం దలఁచియు నిం
పారఁగఁ బొగడియు రమించు టతులహిత మగున్.

⁠ 373


తే.⁠

విండు నారాయణపరాయణుండు పాత
కముల గెలిచి వెలుంగుటె కాదు తన్ను
నాశ్రయించినవారికి నతుల మైన
వెలుఁగు నొసఁగంగఁ జాలుట వేధచేత.

⁠ 374

​

క.⁠

చతురాశ్రమములలోపల
నతులమతీ యెందు నిలిచి నతనికి భక్తిన్
మతిఁ గేశవుఁ గూర్పక స
ద్గతి పెఱకర్మముల నేల కల్గఁగ నేర్చున్.

⁠ 375


క.⁠

కను టరిది యొండు మెయి వి
ష్ణుని భక్తిం గనుము నీవు సువ్రత యద్దే
వుని వినుము భక్తవత్సలుఁ
డనునామము గలిమి దృశ్యుఁ డగు భక్తులకున్.

⁠ 376


క.⁠

అని నారదుఁ డుపదేశిం
చిన నానైష్ఠికుఁడు నియతచిత్తుం డై వి
ష్ణుని నర్చించు సభక్తిక
మననవిశేషమున నెపుడు మనుజాధీశా.

⁠ 377


తే.⁠

శంఖచక్రగదాధరు శార్జ్గిఁ బుండ
రీకదళసన్నిభాక్షుఁ గిరీటకుండ
లాభిరాము శ్రీవత్ససంశోభివక్షుఁ
గౌస్తుభోజ్జ్వలుఁ గలలోనఁ గను నతండు.

⁠ 378


క.⁠

చిరకాలంబున సాక్షా
త్కరణంబును గల్గు దానఁ గాననిపదముం
బొరయనిశుభముం గలవే
కురువర నీవు నతిభక్తిఁ గొలువుము విష్ణున్.

⁠ 379


క.⁠

అనిన విని హర్షపూరం
బునఁ జిత్తము దేల ధర్మపుత్త్రుం డాశం
తనుసుతునకుఁ బ్రణమిల్లెం
దనువునఁ బులకాంకురప్రతతి జాదుకొనన్.

⁠ 380


వ.⁠

ప్రణమిల్లి యతనితో దానప్రియవచనంబుల రెంటియందును నధికరంజనం
బెయ్యది చెప్పవే యనుటయు నద్దేవవ్రతుం డన్నరదేవోత్తమున కి ట్లను
రెండును మంచితెఱంగుల యెదిరిచందం బెఱింగి నడుపునది దానంబు రంజ
కం బగుట దెలుప వలవదు సామవాదంబు గుణంబు దెల్లం బగునట్టియితిహా
సంబు వినుము చెప్పెద బుద్ధిసంపన్నుం డగునొక్కబ్రాహ్మణుండు విజనం బగువ
నంబునం గార్యవశంబున మెలంగఁ దన్మాంసం బాహారంబు గొనుట కయి దారు
ణుం డగుదానవుం డతనిం బట్టికొనిన సాంత్వనభాషణంబులు ప్రయోగించు
వాఁ డయి యవ్విప్రుండు గలంకయుఁ గొందలంబును లేనిడెందంబుతో నద్దా
నవు నాననంబు గనుంగొనిన నాధైర్యధుర్యుం గనుంగొని తదీయం బగునుదా
త్తత్వంబునం జిత్తంబు రంజిల్లి యద్దనుజుం డద్థరాదివిజునితో మదీయం బగు
ప్రశ్నంబునకు సదుత్తరం బిచ్చితేని నిన్ను విడిచెద ననుపలుకు వలికి దనశరీరం
బు డయ్యుటకు వెలుకం బాఱుటకుం గారణం బేమి యని యడిగిన నమ్మహీసు
రవరుండు వేగిరపడక కొండొకసేపు విచారించి మహాపురుషా నీయట్టికృపాప
రుం డడుగం దోఁచినతెఱంగునం జెప్పుట మేలు కాదె యాకర్ణింపు మని సౌ
ముఖ్యంబు నొంది.

⁠ 381


సీ.⁠

చుట్టాల నీ దగుచెట్టతనంబునఁ
                  బాసి పశ్చాత్తాపపరుఁడ వగుట
లేమి గల్గిన దుర్లభామేయధనములు
                  గోరుట మొగమోట గూరి యొరుని
చేఁ బడ్డనిన్ను గెల్చితి నని యాతఁ డు
                  బ్బుట కృప నుపకారమునకుఁ బాత్ర
ముగ నీవు సేసిన పురుషుఁ డామేల్ దన
                  యలఘుపౌరుషమునఁ గలిగె ననుట

⁠

​

ఆ.⁠

కుమతిజనులు నీదుగుణములు గొనియాడ
సిగ్గుపడుచు బుధులచేతఁ బొగడు
గాన మరుగు చునికి వీనిలో నొక్కటఁ
గార్శ్యపాండురతలు గలుగు ననఘ.

⁠ 382


వ.⁠

అని వెండియు.

⁠ 383


సీ.⁠

ఉచితంబుగా నెఱి నుగ్గడించినమాట
                  సభ యియ్యకొనమి వల్లభకు నీదు
తప్పు దెల్లం బయి తాపంబుఁ బొందంగఁ
                  దేర్పంగ నేరక త్రిప్పికొనుట
నీసొమ్మునకు నొరుఁ డాసించుచుండంగ
                  దానికిఁ దగరక్ష దలఁచు చునికి
దులువ పిమ్మట నిన్ను దూషించుపలుకులు
                  కులజులు నిజముగాఁ గొనుట నీవు

⁠


తే.⁠

మానుషంబుల నడపంగ మాయకానిఁ
గాఁగఁ జెలులు గాంచుట వగకలిమిపేర్మి
దాని వెలిపుచ్చ నోపమి వీన నొకటఁ
గార్శ్యపాండురత్వంబులు గలుగు ననఘ.

⁠ 384


వ.⁠

అని మఱియును.

⁠ 385


సీ.⁠

భార్య పుత్త్రకుఁ డల్లుఁ డార్యవృత్తము లేమిఁ
                  గ్రుమ్మరించుట జనకుండు దల్లి
సోదరుల్ నవయుట యుర్వీసురుని గోవుఁ
                  దొలుమేనఁ జంపుట దుష్టబుద్ధి
భూసురదేవార్థములు పుచ్చికొనుట య
                  ర్థము గోలుపోక బాంధవులచావు
బాలిశు మొగమోటఁ బనిగొనఁగాఁ దన
                  యశమున కంతరాయంబు గలిమి

⁠


తే.⁠

పెద్దకాలంబు యత్నసంపీడ నొంది
చెల్లఁజేసినపని యొక్కపొల్లపగతు
చే నసిద్ధతఁ బొందుట వీన నొకటఁ
గార్శ్యపాండురత్వంబులు గలుగు ననఘ.

⁠ 386


క.⁠

అని యి ట్లేర్పడఁ జెప్పిన
విను యద్దనుజపతి మెచ్చి విడిచెం గుంతీ
తనయాగ్రజ భూసురసాం
త్వన మిట్టిది యడుగు మింక వలసినదానిన్.

⁠ 387


వ.⁠

అనిన నజాతశత్రుండు గంగాపుత్త్రువదనంబున జూడ్కి నిలిపి మోడ్చినకరం
బులు శిరంబునం గదియించి.

⁠ 388


తే.⁠

మమ్ము సంసారవార్ధిపారమ్ముఁ జేర్చు
యానపాత్రంబు నీకరుణాతిశయము
యఖిలకల్మషములఁ బాపునట్టిదాని
వినఁగఁ గోరెద నొకపురావృత్త మనఘ.

⁠ 389


క.⁠

ముని మనుజపతులసన్నిధి
నిను నీకృష్ణుండు మాననీయచరిత వే
డ్క నుపాసించుచు నున్నాఁ
డ నుత్తమప్రీతి దాని నాకర్ణింపన్.

⁠ 390


క.⁠

సమ్మోదమ్మున నేనుం
దమ్ములునుం దేల సత్కథాకథనపర
త్వ మ్మాదరింపు మునివ
ర్గమ్ము నృపచయమ్ముఁ బులకరాజి వహింపన్.

⁠ 391


వ.⁠

అనుటయు భీష్ముండు.

⁠ 392


క.⁠

పుణ్యం బగునితిహాస మ
గణ్యగుణా నీకుఁ జెప్పఁ గను సుకృతముఁ గా
రుణ్యనిధి సర్వలోకశ
రణ్యుఁడు గృష్ణుండు వినువరంబుఁ బడసితిన్.

⁠ 393


క.⁠

పారాశర్యాదిమునులు
నీరాజన్యులును వినికి యెంతకు లే దీ
గారాము నాకుఁ బరమో
దారపదావాప్తి గాదె ధర్మతనూజా.

⁠ 394


వ.⁠

నీయడిగినయట్టిదానికి నొకయితిహాసంబు గల దది యుమామహేశ్వరసంవాదం

⁠

​

⁠

బనం బరగుఁ బౌరవోత్తమా యప్పురావృత్తంబు ప్రవర్తించుటకుం గతం
బైనకథ మున్ను సెప్పి మఱి దానిం జెప్పిన నొప్పి యుండుం గావున నప్పరి
పాటిం జెప్పెద నవధానపరుండ వయి యాకర్ణింపు మని పలికి హరికిం బరమ
భక్తిం బ్రణమిల్లి యప్పాండవముఖ్యుముఖచంద్రచంద్రికం దనవిలోచనచకోరంబు
లాన నమ్మానవపతికి నమ్మాననీయమతి యి ట్లనియె.

⁠ 395

భీష్ముఁడు ధర్మజునకు శ్రీకృష్ణునిచిత్రచరిత్రంబు చెప్పుట

క.⁠

తనయునిఁ బడయుటకై తప
మొనరింపఁగ రుక్మిణియు సముత్సుకవృత్తిం
దనతో రాఁ దుహినాద్రికిఁ
జనియెం గృష్ణుండు మునులు సంతస మందన్.

⁠ 396


వ.⁠

ఇట్లు చని ద్వాదశవార్షికవ్రత[27]క్లిష్టుం డై యున్నకృష్ణుం గాన మునీంద్రులు
నారదపర్వతవ్యాసవాల్మీకిదేవలకాశ్యపప్రభృతులు శిష్యవర్గంబుతో వచ్చిన
వారలం బాద్యాసనాదిసముచితార్చనంబుల సంభావించిన వార లద్దేవునిం బరివేష్ఠించి పుణ్యగోష్ఠి నడపుచున్న సమయంబున.

⁠ 397


తే.⁠

అతనిముఖమున వెడలి మహాగ్ని యమ్మ
హీధరము విపినంబుల నేర్చెఁ బక్షి
మృగయుతంబుగ సిద్ధసాధ్యగణములు స
మాకులత్వంబుఁ బొందఁ బె ల్లడరి యధిప.

⁠ 398


క.⁠

ఆకృష్ణుఁడు నిజసౌమ్యా
లోకనమున నాశిఖిని మలుఁగఁ జేసం బూ
ర్వాకరత నవ్వనము ని
రాకులతం బొల్చె నది మహాద్భుత మయ్యెన్.

⁠ 399


తే.⁠

దాని కమ్మునులెల్లఁ జిత్తమున భయము
విస్మయంబును బెనఁగొన వెఱఁగుపాటు
గదిరి చిత్రరూపంబులకరణి నుండ
వారిఁ గన్గొని రుక్మిణీవల్లభుండు.

⁠ 400


వ.⁠

మీ రీయనలంబుతెఱం గేమిగా నెఱింగితి రున్నరూ పెఱింగింపవలయు ననుట
యు వారలు సభక్తికంబు లగు చిత్తంబులతోడ.

⁠ 401


క.⁠

దేవా విశ్వము గలుగుట
నీవలనన యడఁగుటయును నీయంద భవ
ద్భావాధీనమ సకల
స్థావరజంగమసమాహితత్త్వం బెల్లన్.

⁠ 402


తే.⁠

నీవు మమ్ము బోధింపఁగా నేర్తు గాక
యిమ్మహానలస్ఫురణంబు నిట్టి దనఁగ
నేము నేర్తుమె యేమియో యెఱుఁగ కునికిఁ
గాదె నివ్వెఱపడితిమి కమలనాభ.

⁠ 403


వ.⁠

అనుటయు భవదీయచేతఃప్రసన్నత గాదె జగంబులవర్తనంబులకు నాధారంబు.

⁠ 404


క.⁠

కావున మీకుం బ్రియముగ
నీవహ్నితెఱంగు దెలియ నెఱిఁగించెదఁ జి
త్తావిలత విడువుఁ డని కమ
లావరుఁ డి ట్లనియె వారలకుఁ గురువర్యా.

⁠ 405


క.⁠

ఒకదానవుఁడు జగన్నా
శకుఁ డిత్తఱిఁ గలఁడు వానిఁ జంపుట కేఁ బూ
నక యునికి గిలిగె వాఁ డ
స్త్రకళావిదుఁ డగుట నాకతంబున నగుటన్.

⁠ 406


క.⁠

కడుఁ గ్రొవ్వి వాఁడు లోకము
నుడుకులఁ బెట్టంగ విసివి యుగ్రతపమునం
గొడుకుఁ బడసి యద్దనుజునిఁ
బొడవడఁగింపం దలంచి భూరివ్రతమున్.

⁠ 407


చ.⁠

నడప మదాత్మ యగ్ని యయి నావదనంబున నిర్గమించి యె
క్కుడుపడి పద్మగర్భుకడకుం జనె నమ్మహితుండు మన్మథుం

⁠

​

⁠

గొడుకుగఁ బంచి వే తను మగుడ్పఁగ వచ్చెఁ గడంగి పోవు న
ప్పుడు వన మేర్చె నేను గృపఁ బూర్వవిధం బొడఁగూడఁ జూచితిన్.

⁠ 408


వ.⁠

ఇది యద్దహనంబుతెఱం గని చెప్పి యప్పరమపురుషుం డమ్మునివరులతో
మఱియును.

⁠ 409


సీ.⁠

లోకత్రయంబున మీకు నవిదితంబు
                  లేదు త్రికాలసంవేదులార
యుత్తమం బగుపురావృత్తంబు చెప్పి కృ
                  తార్థుఁ జేయుండు న న్ననిన వారు
సవినయంబుగఁ గృతాంజలు లయి మ మ్మింత
                  పెద్ద సేయుదె నీవు పెద్దలకును
బెద్ద వయత్నసంభృతజగత్త్రయుఁడువు
                  విశ్వప్రకారసంవిదుఁడ వేము

⁠


తే.⁠

నీయెఱుంగనియితిహాస మేయుగమున
నెఱిఁగి చెప్పుదు మనవుడుఁ జిఱుతనగవు
మోమునకుఁ జెన్ను సేయ నమ్మురహరుండు
వారలకు నిట్టు లనుఁ గురువంశవర్య.

⁠ 410


క.⁠

మానుషయోని జనించితిఁ
గాన మదీయ మగుబుద్ధిగౌరవము దదీ
యానుగుణత్వోపహితము
గా నెఱుఁగుఁడు మీరు సెప్పుకత విను టసదే.

⁠ 411


చ.⁠

అనుటయు వార లందఱు బ్రియంబున దానికి నియ్యకొన్న నె
మ్మనములతోడ నీపనికి మాన్యచరిత్రుఁడు నారదుండ త
క్కినపెఱవారు చాలరు ప్రకీర్త్యవివేకుఁడు కృష్ణుఁ డర్థితో
వినఁగఁ బురాతనం బయినవృత్తము నమ్ముని సెప్పు టొ ప్పగున్.

⁠ 412


చ.⁠

అని తగ నేకవాక్యతఁ బ్రియంబున నాతనితోడ నీవు మున్
కనినది విన్నయట్టిది ప్రకామకుతూహలచిత్తుఁ డైనకృ
ష్ణుని వినిపింపు నావుడు మనోజ్ఞకథాకథనంబునందు వే
డ్క నిగుడ నమ్మునీంద్రుఁడు వికాసమునన్ మొగ ముల్లసిల్లఁగన్.

⁠ 413

ఉమామహేశ్వరసంవాదం బనునితిహాసము

క.⁠

నారాయణసౌహార్దో
దారత్వవిభూతి మున్న తనకుఁ గలిమి న
న్నారాయణునిమనోరథ
మారం బూరించె శంకరాంబికలకథన్.

⁠ 414


వ.⁠

అత్తెఱంగు వివరించెద నట్లు సమస్తసంయమిసంఘంబును బ్రస్తుతిపూర్వకంబు
గా నియోగింప బ్రియంబునం బురాతనకథాకథనంబునకుం బూని యద్దేవ
ముని యద్దేవకీనందనునకు వందనం బాచరించి [28]తదభివందనంబు వడసి య
వ్విభున కి ట్లనియె.

⁠ 415


తే.⁠

తీర్థభజనంబునకు నెందుఁ దిరుగుచుండి
యిత్తుషారనగంబున కేను వచ్చి
కంటి రమణీయ మగుకేళికావనంబు
సకలతరువల్లరీగుల్మచారుతలము.

⁠ 416


క.⁠

కోకిలకులగంధర్వా
నీకధ్వను నెనసి లెనసి నిగుడఁగ నమరీ
లోకభ్రమరీమండలి
కాకలకలనాదములును గలసి చెలంగన్.

⁠ 417


వ.⁠

ఒప్పునవ్వనంబునం గనకస్థలంబున శార్దూలచర్మవసనభుజగాభరణభసితాంగ

⁠

​

⁠

రాగవిరచితాలంకారచారుదివ్యదేహుం డగుమహాదేవుండు సురసిద్ధసాధ్య
విద్యాధరమునిపుంగవభూతగణపరివృతుం డయి యున్న నప్పేరోలగంబున నే
నును సముచితప్రకారంబున నయ్యనిరూపణీయప్రకారుం గొల్చి యుండితి నట్టి
సమయంబున.

⁠ 418


సీ.⁠

పుణ్యాంగనాకారములు దాల్చి పుణ్యన
                  దీనివహంబులు దిశలు గొల్చి
చనుదేర శంకరసదృశపరిష్కార
                  కల్యాణతను వైనగౌరి వచ్చి
వెనుకదిక్కున మెలుపునఁ జేరి మోమున
                  నలఁతి నవ్వినునుడిచెలువు నొసఁగఁ
దమ్మిఱేకుల నుల్లస మ్మాడు తనమృదు
                  కరయుగ్మమునను శంకరునినేత్ర

⁠


ఆ.⁠

యుగ్మ మల్ల మూసి యున్నంత లోక మ
నర్కచంద్రతారకాగ్ని యై మ
హాంధకారమగ్న మగుటయు సంక్షోభ
మందె భూతసముదయంబు లెల్ల.

⁠ 419


ఉ.⁠

అప్పుడు ఫాలలోచనము నప్పరమేశుఁడు విచ్చె విచ్చినం
గప్పెఁ దదగ్నిజిహ్వలు నగం బఖిలంబును గౌరిదేవి య
ట్లొప్పమి తండ్రికైనఁ గని యుల్లము బెగ్గిల నీశునంఘ్రులం
గప్పఁగ మౌళిభూషణముకాంతి ప్రణామము సేసెఁ జేసినన్.

⁠ 420


ఆ.⁠

హరుఁడు కరుణఁ జూడ నాహిమవన్నగ
దాహ ముడిగి శోభితత్వ మొలసె
నార్య పరమవిస్మయముఁ బొంది యాసర్వ
భువనకర్తతోడ సవినయముగ.

⁠ 421


సీ.⁠

నిటలంబుకను దెఱచుటకుఁ గారణ మేమి
                  సర్వేశ యిది రహస్యంబు గాక
యున్నేనిఁ జెప్పవే యన్న నద్దేవుండు
                  కాంత నీ కెఱిఁగింపఁ గానియట్టి
పని యెందుఁ గల్గునే వినుము లోకాత్మక
                  త్వము నాకుఁ గల్గుటవలనఁ జేసి
న న్నేది వొందిన నన్నిలోకంబుల
                  నది వొందుఁ గాన నాయంబకములు

⁠


తే.⁠

నీవు మూయంగఁ దిమిరంబు నిఖిలలోక
చయముఁ గప్పిన భూతముల్ భయముఁ బొందె
నీకరంబులు ద్రోవక చీఁకటియును
బెఱచుటకు ఫాలనేత్రంబు దెఱవ వలసె.

⁠ 422


వ.⁠

అనిన విని యంబిక తనకు నడుగవలయునట్టివి యడుగుటకు [29]నది యవసరంబు
గాఁ గనికొని యక్కపర్ది కి ట్లనియె.

⁠ 423


క.⁠

నాలుగుముఖములు నీకు
న్ఫాలనయన కలుఁగ గారణం బేమి మధు
శ్రీలాలిత్యాస్పదవా
క్యాలీకలనమున నాకు నానతి యీవే.

⁠ 424


వ.⁠

అనిన విని యమ్మహాదేవికి నద్దేవుం డి ట్లను దైత్యులు సుందోపసుందు లన నిర్వు
రు గలరు వార లవార్యభుజవీర్యశౌర్యసంపన్నులు నస్త్రశస్త్రావధ్యులు నై యుం

⁠

​

⁠

డుదురు వారలవినాశనంబునకై మయుండు లోకంబులం గల యొప్పులం దెల్ల
నుత్తమసారంబులు దిలప్రమాణంబు లాహరించి యొక్కకామినిం గావించి
తిలోత్తమ యనుపే రిడి నాకడకుం దెచ్చిన నచ్చెలువ నాకుం బ్రదక్షిణంబుగా
వచ్చునెడ నే నిది దేవకార్యంబు సేయనోపుఁ బొమ్మను తలంపుతో నత్తరుణి
తిరిగిన దిక్కుదిక్కున కొక్కొక్కమొగంబు దాల్చి దానిం బరీక్షించితి నాఁటం
గోలెఁ జతుర్ముఖుండ నై యుండుదు.

⁠ 425


చ.⁠

అన విని గౌరి నీకు భువనాధిప కంఠమునందుఁ గప్పు గ
ల్గినకత మేమి నాకు నెఱిఁగింపుము నావుడు దేవదైత్యు లం
బునిధి సుధార్థ మై తరువఁ బుట్టి విషంబు త్రిలోకభీకరం
బనితరసాధ్యమై యొదవినత్తఱిఁ దాల్చితి దానిఁ గుత్తుకన్.

⁠ 426


తే.⁠

అట్లు కంఠంబునందు మహావిషంబుఁ
దాల్ప నీలత గల్గిన దానఁ జేసి
కమలజాదిసురులు నీలకంఠుఁ డనుచు
నన్నుఁ గొనియాడి రప్పుడు నలినవదన.

⁠ 427


వ.⁠

అని చెప్పి శంకరుం డింక నేమి యడుగ వల తడుగు మనుటయుఁ బార్వతి
పినాకం బెల్లయాయుధంబులకంటె మెచ్చి పట్టుదు దీనికి గతం బెయ్యది యని
యడిగిన నామృడుం డామృడాని కి ట్లనియె.

⁠ 428


సీ.⁠

ఆదియుగంబున నబల కణ్వుం డను
                  సంయమి తపము నిష్ఠానిరూఢి
మెయిఁ జేయఁ బెరిఁగె వల్మీకంబు తనువు [30]ము
                  నుంగ నప్పుట్ట వేణువును బుట్టె
విను లోకసామాన్యఘనత గాకుండ మ
                  హాద్భుతాయామంబు నధిక మైన
పరిణాహమును గల్గె బ్రహ్మ యమ్మునికిఁ బ్ర
                  త్యక్షమై వర మిచ్చె నతనిమీఁదఁ

⁠


ఆ.⁠

బెరిఁగి యున్నవెదురు గల మర్థిఁ దా బుచ్చి
కొని జగద్ధితంబు గోరి చేసె
నాకు విష్ణుకుఁ బినాకశార్ఙ్గము లగ్ర
ఖండమున నొలర్చె గాండివంబు.

⁠ 429


వ.⁠

ఇవ్విధంబున విండ్లు మూఁడు గావించి లోకహితం బాచరించి యవ్విరించి య
మ్మూఁడవవిల్లు దాఁ గైకొని తనలోకంబునకుం జనియె నిది పినాకంబు సంభా
వనీయంబైన తెఱం గని చెప్పిన.

⁠ 430


క.⁠

విని గిరితనూజ పెఱవా
హనముల నొల్లక వృషంబు నఖిలేశ్వర నె
మ్మనమునఁ గైకొని యెక్కుదు
వినఁగా నే వలతుఁ జెప్పవే కారణమున్.

⁠ 431


వ.⁠

అనిన నద్దేవుఁ డమ్మహాదేవి కి ట్లనియె.

⁠ 432


సీ.⁠

హిమవన్నగంబునం దేను లోకహితార్థ
                  మైన మహాతప మాచరింప
గోవులు చుట్టుఁ దేఁకువ సెడి తిరిగి నన్
                  సంకటపెట్టినఁ బంకజాక్షి
కోపించి చూడ సంతాపాకులత్వంబుఁ
                  బొందె గోకుల మరవిందభవుఁడు
నమరులుఁ జనుదెంచి ప్రార్థించి వృషముఁ గా
                  నిక యిచ్చి కరుణ జనింపఁ బలికి

⁠

​

తే.⁠

నాకు గోపతి యనియెడు నామ మిచ్చి
రపుడు గోబాధ మాన్చి రయ్యమలవృషము
వాహనముఁ గేతువును గా శివప్రచార
మాచరింతు నెల్లెడ నది యాది గాఁగ.

⁠ 433


వ.⁠

అనుటయు నంబిక యప్పరమేశుతో నీవు పరమశుచులును రమణీయంబులు
నగునివాసంబుల వసియింపక యశుచియు గేశాస్థికపాలదుర్గంధదుర్దర్శంబు
నైనశ్మశానంబున నునికిఁ గతం బేమి యనిన నతం డి ట్లనియె.

⁠ 434

శివుఁడు పార్వతికిఁ దనశ్మశానవాసతకుఁ గారణంబు చెప్పుట

ఉ.⁠

క్రూరపుభూతముల్ జనుల ఘోరవిధంబుల ముట్టి యెప్పుడున్
మారణ మాచరింపఁగ సమస్తజనంబులు నాశ మొందఁగా
వారిజసంభవుం డెఱిఁగి వచ్చి ననుం దగఁ గాంచి తత్ప్రతీ
కారము సేఁతకై వినయగౌరవ మొప్పఁగ వేఁడె వేఁడినన్.

⁠ 435


వ.⁠

నిశ్చితంబుగా నొక్కెడ నుండి లోకంబులు రక్షింపవలయు నని తలంచితి
నట్టియెడ.

⁠ 436


తే.⁠

మోక్షపరులు శుచిస్థానముగఁ బ్రశంస
సేయుదురు విజనత్వవిశేష మెఱిఁగి
కాన యింపై శ్మశానంబు మానసమున
నొలసెఁ గావున నయ్యెడ నునికి గలిగె.

⁠ 437


చ.⁠

అచటన యుండి లోకముల నన్నిటి నాత్మఁ దలంచి రక్ష సే
యుచు విహరింతు భూతచయ మొక్కటఁ గూడి చరింతుచున్కికిం
బ్రచురకుతూహలుండ నయి రాగముఁ బొందుచు నట్లు గాన నా
కచటు నివాస మయ్యె విను మన్యతలంబులు దానిఁ బోలునే.

⁠ 438


తే.⁠

అనిన భసితాంగరాగంబు నస్థఫణధ
రాభరణములుఁ బరశుశూలాయుధములు
నై మహోగ్ర భీకర మైనరూప
మభవ యేల కైకొండి వీ వనియె గిరిజ.

⁠ 439


వ.⁠

అనుటయు నమ్మహేశ్వరుం డాపరమేశ్వరితోడ.

⁠ 440


సీ.⁠

లోకస్వరూపంబు లోలాక్షి రెండు వి
                  ధమ్ములు సీత ముష్ణమ్ము నాఁగఁ
జను నివి రెంటను సకలంబు గ్రథిత మై
                  యుండు సౌమ్యాగ్నేయయోగకలిత
మఖిలజగంబు సౌమ్యము విష్ణుఁ డాగ్నేయ
                  మేను వహింతు మయ్యిరుదెఱంగు
నెనయుటఁ గొని భరియింతు నీవిశ్వంబు
                  గావున నాగ్నేయభావరూఢ

⁠


తే.⁠

యైన యాకృతి లోకహితార్థముగ వ
హించినాఁడ నిం కెయ్యది యీవు నన్ను
నడిగె దడుగుము నావుఁడు నార్య సోముఁ
దలఁ బ్రియంబున నేటికిఁ దాల్చి తనియె.

⁠ 441


చ.⁠

అనవుడు దక్షుయజ్ఞమున కల్గిననాఁడు సురాలి కేను బీ
డన మొనరించుచోట వికటంబుగ సోమునిమేను ద్రొక్కఁగా
నను శరణంబు వేఁడిన మనంబున నక్కటికంబు వుట్టి చే
సినదురితంబు సోము నిటు సేయక పో దని మౌళిఁ దాల్చితిన్.

⁠ 442

​

చ.⁠

అన విని కొల్చియున్న మును లందఱు నీసుదయావిశేషము
న్మనముల మెచ్చి పొంది యభినందనపూర్వము గాఁగ భక్తియున్
వినయము నుల్లసిల్లఁ బదివేలవిధంబులఁ బ్రస్తుతించి ర
య్యనుపమధాము గౌరి సమయం బిది నా కని మోడ్పుఁ గేలితోన్.

⁠ 443


తే.⁠

లోలలోచనదీప్తులు బాలచంద్ర
భూషణునివదనంబునఁ బొలయ మునుల
మానసంబులు సంప్రీతి నూన సాంత్వ
నస్వరంబున ని ట్లను నలిననాభ.

⁠ 444


క.⁠

వర్ణాశ్రమధర్మము లభి
వర్ణింపుము వేదనిరతవత్సల యవి నా
కర్ణములతో నఖిలజన
కర్ణంబులఁ బొంది పుణ్యకర్తృత యొసఁగున్.

⁠ 445


వ.⁠

అనియె నని యిట్లు గౌరి లోకహితారంబుగా వర్ణాశ్రమధర్మంబులు పరమేశ్వ
రు నడుగుటయు నారదముని కృష్ణునకుం జెప్పినతెఱంగు భీష్ముండు ధర్మజునకుఁ
జెప్పుట యుపన్యసించిన నాకర్ణించి.

⁠ 446


క.⁠

మునివర నాదగుచిత్తం
బునఁ గౌతూహలము చాల మొలతెంచి తలి
ర్పున నెలరారెడు నేర్పడ
వినిపింపుము మీఁదికథ సవిస్తారముగన్.

⁠ 447


వ.⁠

అని యడుగుటయు.

⁠ 448


మ.⁠

[31]స్ఫుటతత్త్వోదయసంభృత్తైకమధురాభూతైకరక్షాధురా
తటినీపింఛమనోజ్ఞమౌళిలలితాదాంతాత్మసంకీలితా
త్రుటితాపద్వసమున్నతాశ్రితజనా దూరాంజనాసువ్రతో
త్కటశీలావనలోలదివ్యహృదయా [32]ధర్మప్రసన్నోదయా.

⁠ 449


క.⁠

దేహాభిమానసంభృత
మోహతమోనిరసనాభిముఖభూరివివే
కాహీనమహాతత్త్వస
మాహితచిన్మాత్రరూపమధురిమసుభగా.

⁠ 450


మాలిని.⁠

త్వరితవిహితగాఢధ్యాయి సమ్మోదవాదా
స్ఫురదరిదృఢశూలస్ఫూర్తిసంశస్తహస్తా
తరణిశశిమయత్వోదారతాచిత్రనేత్రా
పరమయతినిష్ఠా భవ్యహృత్పద్మసద్మా.

⁠ 451


గద్యము.⁠

ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిరాజి తిక్కన
సోమయాజిప్రణీతం బైనశ్రీమహాభారతంబున నానుశాసనికపర్వంబునందుఁ
జతుర్థాశ్వాసము.

⁠
  1. ↑ గలిగి
  2. ↑ దైవతార్చ నపుడు
  3. ↑ సభ గుడిపై లోపల,గిరి
  4. ↑ పరిణతిని బ్ర, దీప్త
  5. ↑ గునియుచుఁ
  6. ↑ శ్వర పరమాయుస్సంక్షయ
  7. ↑ పరదారములందును
  8. ↑ కుఱుమాపు డైన
  9. ↑ మాచూచిన; మన్పూచిన
  10. ↑ నంజుట
  11. ↑ సల్లాపము గాఁగ
  12. ↑ క్షత్రమునకు
  13. ↑ మయిన మేలు
  14. ↑ గానిపదంబులు
  15. ↑ దేహ మని యెట్టి వెరవున; దేహం బనియెడి వెరవున
  16. ↑ వేదమయోర్ధ్వగతుండై, ప్రాదక్షత
  17. ↑ గనియెఁ బూ, ర్ష విధము
  18. ↑ నడపు
  19. ↑ సత్త్వానాశ్రయపురుషుఁడు, సత్త్వాశ్రయుఁడును నసత్త్వసత్త్వము లై క, ర్తృత్వాలేప
  20. ↑ ప్రతహసద్వివేకు
  21. ↑ నీయడిగినరూఢము లగు
  22. ↑ రవణ మొప్ప
  23. ↑ నుదరిండ్లు
  24. ↑ 'ఇలువాడి'
  25. ↑ లెక్కటి యేన పెట్టుచు
  26. ↑ గొల్చి కూడు గురుబంధు
  27. ↑ నిష్ఠుండై
  28. ↑ తదభివాదనంబున
  29. ↑ నిది సమయం బని యక్కపర్దికి
  30. ↑ మునుఁగఁ గప్పుటయును వేణువును
  31. ↑ స్ఫుటితత్త్వామలసంభృతైక్యమధురా
  32. ↑ ధర్మప్రసంపద్ధయా; ధర్మప్రతీపాలయా