Jump to content

భారతం-ఆరణ్యం/ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

గణేశశారదాగురుభ్యో నమః

శ్రీమదాంధ్రమహాభారతము

ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము



కీర్తిశ్రీ[1]వల్లభ
లోకజనస్తుత్య సర్వలోకాశ్రయ ర
త్నాకరపరివృతసకలధ
రాకాంత జితారి రాజరాజనరేంద్రా.

1

పాండవుల వనగమనము

వ.

అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె; నట్లు పాండవులు నిజాయుధం
బులు ధరియించి కృష్ణాసహితులై [2]యుత్తరము మించి యరిగిన నింద్రసేనా
దులైన మూలభృత్యులు పదునాలుగువేల రథంబులతోడ సుభద్రాభిమన్యు ప్రతి
వింధ్యాదులం దోడ్కొని వారిపిఱుందన యరిగి; రంత నప్పాండవులం జూచి
పౌరులెల్లఁ బరమదుఃఖితులై.

2


క.

చనునె [3]యధర్మద్యూతం
బున నిట్టుల పాండురాజపుత్త్రులఁ బ్రభులన్
వనగతులఁ జేయ దుర్యో
ధనధృతరాష్ట్రులకు విగతహృదయులకున్?

3


క.

క్రూరతరధార్తరాష్ట్రు ని
కారము వారింప రైరి గాంగేయుఁడు న
బ్భారద్వాజుఁడుఁ గృపుఁడు ను
దారుఁడు విదురుండు; నేమి దలఁచిరొ బుద్ధిన్?

4


సీ.

కర్ణ జయద్రథ గాంధారు లాప్తులై
                 యుండంగ లోభి దుర్యోధనుండు
రాజు గా నీతని రాజ్యంబునం దెట్టు
                 లుండగ నేర్తు? మీ [4]యుర్వి నింక
నేది ధర్మువు? ప్రజ నెవ్వరు గాతురు?
                 పరమధార్మికులైన పాండుసుతుల
యరిగిన చోటిక యరుగుద” మని వారి
                 పిఱుఁదన చని పాప భీతమతులు


ఆ.

“వీరులార! మమ్ము విడిచి మీ కరుగంగఁ
జనునె? మాకు నొండు శరణ మెద్ది?
సాధులకు నసాధుసహవాసమునఁ బాప
సంప్రయోగ మగుట సందియంబె?

5


క.

తిలలును నీళ్ళును వస్త్రం
బులుఁ బుష్పసుగంధ వాసమున సౌరభముం

బొలు పెసఁగఁ దాల్చుఁ గావున
నలయక సత్సంగమమున నగు సద్గుణముల్.

6


వ.

సాధుసమ్మతంబు లైన గుణంబుల నొప్పి జన్మవిద్యాకర్మంబులం బ్రశస్తుల
రై యార్యవృత్తుల రైన మీసహవాసంబున నుండి ధర్మపరులమై [5]కృతార్థుల
మగుదుము; దుష్కృత్యంబులయం దనారంభు లయ్యును జనులు దుర్జన
దర్శనస్పర్శనసంభాషణసహాసనంబులం జేసి ధర్మవిహీను లగుదురు;
గావున నేము దుర్యోధను రాజ్యంబున నుండ నోపము; మాయనుగమం
బున కొడంబడవలయు” నని కృతాంజలులైన నప్పౌరులం జూచి ధర్మ
తనయుం డి ట్లనియె.

7


క.

“మాయందు లేని గుణములు
మీ యనురాగమునఁ జేసి మిగిలి వెలింగెన్;
మీ యనుగతి మాకు నభి
ప్రాయము; వనవాసదుఃఖభర [6]మోపుదురే?

8


తే.

వలవ దుడుగుండు మీ” రని వారినెల్లఁ
గరుణఁ బాండవజ్యేష్ఠుండు గ్రమ్మఱించెఁ;
బౌరు లట్టు నివర్తింపఁబడి నిరంత
రార్తనాదు లై యరిగిరి హస్తిపురికి.

9


వ.

ఇట్లు [7]పాండవులు గృతప్రస్థానులై గంగాతీరంబునం బ్రమణాఖ్యవటంబున
విడిసి గంగాస్నానంబు సేసి నాఁటిపగలును రాత్రియు నంద యుండి; రంతఁ
బ్రభాతసమయంబున.

10


చ.

పరువడి నగ్నిహోత్రములు, బంధులు, శిష్యులుఁ దోడ రా మహీ
సురవరు లెల్లఁ బాండునృప సూనులయొద్దకుఁ బ్రీతి నేఁగుదెం
చిరి బహువేదఘోషములఁ జేసి నిరస్తసమస్తకిల్బిషో
త్కరు లగు[8]చున్న ధన్యులు జగత్పరిపూజ్యులు బ్రహ్మసమ్మితుల్.

11


వ.

ఇట్లు దమతోడన వనవాసంబు సేయ నిశ్చయించి వచ్చిన విప్రుల [9]నతిప్రీతి
గౌరవంబున నర్చించి తదాశీర్వాదంబుల నభినందితుం డై ధర్మతనయుండు
వారల కి ట్లనియె.

12


క.

“అపహృతసర్వస్వుల మై
సపత్నుల నికారమునఁ బ్రచండాటవిలో
విపులఫలశాకమూలము
లుపయోగించుచును[10] నిష్ఠ నుండెడు మాతోన్.

13


క.

రా నేల? వచ్చి నవయం
గా నేల నివాసములకుఁ గ్రమ్మఱి చనుఁ; డు
గ్రానేకపశార్దూలభ
యానకవనవాస మర్హ మగునే మీకున్?”

14


వ.

అనిన విని బ్రాహ్మణులు పరమదుఃఖితులై “మీర కాని మాకు నొండుగతి
లేదు; మమ్ము ననన్యశరణ్యుల విడుచుట [11]ధర్మంబు గాదు.

15


ఆ.

ఆశ్రితులను, భక్తు [12]లగు వారి నన్యుల
నైన విడువఁజాల రట్టె! విప్ర
వరుల, భక్తిపరుల వసుధేశ! మీయట్టి
ధార్మికులకుఁ విడువఁ దగునె చెపుమ?

16

వ.

[13]అస్మత్పోషణోపాయచింత సేయవలదు; వన్యమూలఫలంబులు నేను తెచ్చికొని
యుపయోగించుచు జపహోమాదిపుణ్యక్రియల మీకుం బ్రియంబు సేయుచు
నుండెద; మధర్మవర్తి యయి మీ కపకారంబు సేసిన ధార్తరాష్ట్రుల రాష్ట్రంబున
నుండ నోప” మనిన వారల రాక కొడంబడి.

17


తే.

“ఇష్టమృష్టాన్నములఁ దొల్లి యెల్లప్రొద్దుఁ
దృప్తు లగుచున్న వసుమతీదేవవరులఁ
గానలందు శాకాశనుల్ గాఁగ నెట్లు
సూడనోపుదు” నని ధర్మసూనుఁ డపుడు.

18

శౌనకుఁడు ధర్మరాజునకు ధర్మంబులు సెప్పుట

వ.

శోకమూర్ఛితుం డై మహీతలంబుపయిం బడిన యాతని నాశ్వాసించి శౌనకుం
డను బ్రహ్మఋషి దొల్లి యాత్మవ్యవస్థానార్థంబు జనకకృతంబులయిన శ్లోకంబుల
యర్థంబులు యుధిష్ఠిరున కి ట్లనియె.

19


క.

“శోకభయస్థానంబు ల
నేకంబులు గలిగినను [14]విహీనవివేకుం
డాకులతఁ బొందునట్లు వి
వేకము గలవాఁడు బుద్ధివికలుం డగునే?

20


క.

శారీరమానసమహా
దారుణదుఃఖములఁ జేసి [15]తఱిఁగి శరీరుల్
క్రూరతరబాధఁ బొందుదు;
రారెంటిని జెఱుతు రార్యు లమలినబుద్ధిన్.

21


వ.

వ్యాధి శ్రమానిష్టసంస్పర్శనేష్ట [16]వివర్జనంబులను నాల్గింటం బుట్టి శారీరదుః
ఖంబు లాశుక్రియాది ప్రతియోగంబుల నుపశమిల్లు; మఱి స్నేహజంబు లయిన
మానసదుఃఖంబులు జలంబుల నగ్ని యుపశమిల్లునట్లు విమలజ్ఞానంబునం జేసి
యుపశమంబునం బొందు.

22


క.

స్నేహార్ణవమగ్నుం డయి
దేహి మహాదుఃఖముల నధృతిఁ బొందును; దుః
ఖాహతుఁడు శోకతాపవి
మోహి [17]యగున్; స్నేహమూలములు రాగాదుల్.

23


వ.

కావున బంధుమిత్రధనసంచయంబులవలని స్నేహంబు విడుచునది; పద్మపత్రంబు
[18]నీరం బొందనియ ట్లెఱుకగలవారి నెట్టియెడలను స్నేహంబు వొందదు;
స్నేహంబున రాగంబును, రాగంబునం గామంబును, గామంబునం గ్రోధంబును,
గ్రోధంబునం దృష్ణయు వర్తిల్లు.

24


క.

అది సర్వదోషముల [19]కా
స్పద; మది దురిత క్రియానుబంధంబులకున్
మొదలు; నిరంతరదుఃఖ
ప్రద మని దలఁచి తృష్ణఁ బాతురు సుమతుల్.

25


వ.

మఱియుఁ [20]దృష్ణాతురుం డర్థలోభంబునఁ గోటరస్థం బయిన యనలంబులం
జేసి దగ్ధంబగు వృక్షంబును బోలె వినాశంబునం బొందు; నర్థాసక్తుం డైన

వాఁడు శుభంబులు వడయ నోపండు; మృత్యువువలనం బ్రాణులకు భయంబు
గలుగున ట్లర్థవంతులకు రాజ చోర స్వజన జలానలంబుల వలన భయంబు
నియతంబు.

26


తే.

జలములందు మత్స్యంబులు, చదలఁ బక్షు
లామిషం బెట్లు భక్షించు నట్లు దివిరి
యెల్లవారును జేరి యనేకవిధుల
ననుదినంబును భక్షింతు రర్థవంతు.

27


క.

అర్థమ యనర్థమూలం;
బర్థమ మాయావిమోహనావహము; నరుం
డర్థార్జనదుఃఖమున న
పార్థీకృత[21]కర్ముఁ డగుట పరమార్థ మిలన్.

28


వ.

అట్టి యర్థంబువలన దర్పకార్పణ్యమానభయోద్వేగంబులు పుట్టుఁ గావున [22]నర్థో
పార్జనచింత సేయవలదు; రూపయౌవన ధనవిభవ ప్రియసంవాసంబు లనిత్యంబు
లగుట నందు బుద్ధిమంతులు విమోహింప” రనిన నమ్మునివరునకు ధర్మతనయుం
డి ట్లనియె.

29


సీ.

ఆత్మోపభోగార్థ మర్థలాభేచ్ఛ నా
                 కెన్నండు లేదు; మహీసురాగ్ర
గణ్యుల నత్యుగ్రకాననాంతరమున
                 నెవ్విధంబున భరియింతు నొక్కొ
యని యిప్డు వగచెద; ననవద్యగుణయుక్తి
                 ననఘ! మాయట్టి గృహస్థతతకిఁ
బోష్యుల [23]నెయ్యెడఁ బ్రోవక యుండను
                 విప్రుల నతిథుల వృథయ పుచ్చఁ


ఆ.

జనునె? నిజధనంబు సంవిభాగించి యీ
వలయు; సాధురక్ష వలయుఁ జేయ;
నభిమతాశ్రమంబు లందు గృహస్థాశ్ర
మంబ కాదె యుత్తమంబు వినఁగ.

30


వ.

[24]మఱి యార్తునకు శయనంబును, భీతున కభయంబును, దృషితునకు జలంబును,
బుభుక్షితునకు నన్నంబును, శ్రాంతునకు నాసనంబును నిచ్చుట సనాతనం బైన
యుత్తమగృహస్థధర్మంబు; తృణభూమ్యుదకప్రియవచనాదరదానం బెల్లవారికి
నవశ్యంబ; యాత్మార్థంబుగా నన్న పాకంబును, నసాక్షిక భోజనంబును, వృథాపశు
ఘాతంబును బాపహేతువు; లగ్నిహోత్రంబులు, ననడ్వాహంబులు, నతిథిబాంధవ
విద్వజ్జనగురుమిత్రభామినీనివహంబు లపూజితంబులై యెగ్గు సేయును; గావున
గృహస్థుండు సర్వసంతర్పకుండు గావలయుం; గావునం బ్రతిదినంబును బక్షి
శునకశ్వపచార్థంబు సాయంప్రాతస్సులయందు వైశ్వదేవంబు సేసి యమృతాశి
యు, విఘసాశియుఁ గావలయు; యజ్ఞశేషం బమృతంబు నాఁ బరగు; నతిథిభుక్త
శేషంబు విఘసంబు నాఁబడు; నట్టి వృత్తి వర్తిల్లువాఁ డుత్తమగృహస్థుం” డనిన
ధర్మరాజునకు శౌనకుం డి ట్లనియె.

31


క.

“హారివిషయాభిలాషము
గారణముగ నెంత యెఱుక గలవారును దు
ర్వారవికారముఁ బొందెడు
వారు నిజేంద్రియము లవి యవశ్యము లగుటన్.

32

వ.

సంకల్పజంబైన కామంబున దగిలిన మనస్సుచేతం [25]బ్రేరితంబై శ్రోత్రాదీంద్రి
యంబులు శబ్దాదివిషయంబులుం బరిభ్రమించుటం జేసి విషయాభిలాషవిశిఖవిద్
ధులై దేహులు తేజోలుబ్ధంబులైన శలభంబులుంబోలె శోకానలంబునం బడి త
మ్మెఱుంగక యవిద్యాకర్మతృష్ణలం జేసి సంసారచక్రంబునందుఁ బ్రవర్తిలుదు;
రట్టి బ్రహ్మాది తృణపర్యంత భూతప్రవృత్తియందు రాగద్వేషవిముక్తులై యభిమాన
మత్సరంబులు విడిచి వేదచోదితంబైన సమ్యక్సంకల్పసంబంధం, బింద్రియ
నిగ్రహంబు, వ్రతవిశేషంబు, గురుసేవనం, బాహారయోగం, బధ్యయనాగమంబు,
కర్మసన్న్యాసంబు, చిత్తనిరోధం బను నెనిమిదింటను గర్మానుష్ఠానంబు సేసిన
మహాత్ములు దమ తమ తపోమహత్త్వంబునం జేసి సంసారంబు జయింతురు;
నీవును శుశ్రూషా శ్రవణగ్రహణ ధారణోహాపోహార్థవిజ్ఞాన తత్త్వజ్ఞాన సమన్వితుం
డవు; నీచేతం బ్రారబ్ధంబు లైన యవి సర్వంబులును సంపన్నంబు లగు.

33


క.

వసురుద్రాదిత్యాదులు
వసుధేశ! [26]తపంబు గౌరవంబున నైశ్వ
ర్యసమృద్ధు లైరి; తపమునఁ
బ్రసిద్ధముగ నిష్టసిద్ధి వడయుము నీవున్.

34


వ.

తపస్సిద్ధు లైనవారు దమ తలంచినదానిన క్రమంబునం బడయుదురు; గావున నీవు
నుపశమవంతుండవై తపంబు సేసి [27]యోగార్థసిద్ధి వడసి బ్రాహ్మణుల ననుచ
రించుచు నీమనోరథంబు సఫలంబు సేయు” మనిన శౌనకు వచనంబు సేకొని భ్రాతృ
మధ్యగతుం డైన ధర్మతనయుండు ధౌమ్యునకు నమస్కరించి యి ట్లనియె.

35


తే.

“వనమునకు వచ్చి నవయంగ [28]వలవ దుడుగుఁ
డనిన నుడుగక మీతోన యరుగుదెంతు
మనిరి బ్రాహ్మణుల్; వీరి కాహార మేయు
పాయమున నుగ్రవనమునఁ బడయనేర్తు?

36


వ.

వీరల విడువ నోప; నేమి సేయుదు? ననిన విని ధౌమ్యుండు పెద్దయుం బ్రొద్దు [29]చిం
తించి ధర్మరాజున కి ట్లనియె.

37


ఆ.

“భూతరాశి దొల్లి పుట్టి బుభుక్షాభి
తప్త మయినఁ జూచి తద్భయంబు
నపనయింపఁ [30]గడఁగి యదితిసుతాగ్రణి
గమలబాంధవుండు గరుణతోడ.

38


వ.

ఉత్తరాయణగతుం డై యుర్వీరసంబు పరిగ్రహించి. దక్షిణాయనగతిం బర్జన్య
భూతుం డై యోషధులం బడసి. రాత్రులయందుఁ జంద్రకిరణామృతంబునం జేసి
వానిం దడుపుచు [31]వర్ధించి యం దన్నంబు వుట్టించి ప్రజారక్షణంబు సేయుటం
జేసి యన్నం బాదిత్యమయం బని యెఱింగి తొల్లి భీమవైన్యకార్తవీర్యనహు
షాదులు యోగసమాధిష్ఠితులై సూర్యభజనంబున నన్నంబుఁ బడసి యాపదల
వలనం బ్రజల సముద్ధరించిరి గావున.

39

లయగ్రాహి.

వారిరుహమిత్త్రు, నమరోరగమునిద్యుచర
                 చారణగణప్రణుతచారుగుణు, [32]లోకా
ధారు, నఖిలశ్రుతిశరీరు, హరిశంకరస
                 రోరుహభవప్రతిము, దారుణతమిస్రా
వారణమరీచిపరిపూరితదిగంతరుని,
                 భూరికరుణానిరతు, సూరుఁ, ద్రిజగద్ర
క్షారతు, సహస్రకరుఁ గోరి భజియింపుము మ
                 నోరథఫలంబు లగు భూరమణ నీకున్.”

40


వ.

అని ధౌమ్యుండు విశుద్ధాత్ముం డైనధర్మరాజునకు సూర్యుం డర్యముండు భగుం
డను నివి మొదలుగాఁగల నామంబుల యష్టోత్తరశతంబు నభీష్టసిద్ధిప్రదం బయిన
దాని విస్పష్టార్థవర్ణోచ్చారణంబును విధియుక్తంబునుగా నుపదేశించి “దీనిం దొల్లి
యింద్రువలన నారదుండు వడసె; [33]నారదువలన వసువను రాజు వడసె; నాతనివలన
నేను బడసితి; నేను నీ కిచ్చితి; నిది దేవనిర్మితంబు; దీన నాదిత్యు నతిభక్తి నారా
ధింపు” మనిన.

41

ధర్మరాజు సూర్యు నారాధించి వరంబు గొనుట

సీ.

హితుఁ డైన తనపురో[34]హితు నుపదేశంబు
                 పేర్మితోఁ జేసికొని, ధర్మసుతుఁడు
నెమ్మిఁ బుష్పోపహారమ్ముల నాదిత్యుఁ
                 బూజించి, భాగీరథీజలంబు
లందుండి విషయంబులం దింద్రియంబుల
                 నమలవ్రతానుభావమున నొడిచి,
వాయుభోజనుఁడు బ్రాణాయామపరుఁడునై
                 సూర్యాదినామముల్ సూర్యుఁ గొలిచి


జపము సేయుచున్నఁ దపనుఁ డాతనికిఁ బ్ర
త్యక్ష మయి త్రిలోకచక్షుఁ డమర
వరుఁడు దురితహరుఁడు తరణి త్రయీమూర్తి
వనజమిత్రుఁ డిట్టు లనియెఁ గరుణ.

42


వ.

“నీ తపమునకు మెచ్చితి; నీ పండ్రెండేండ్లును వన్యఫలమూలశాకంబులు నీమహా
నసంబున ద్రుపదరాజపుత్త్రిచేత సాధితంబులై యక్షయంబు లైన చతుర్విధాహా
రంబు లగు” నని యొక్క తామ్రస్థాలి యిచ్చి వరం బిచ్చి వనజహితుం డంతర్హితుం డైన.

43


చ.

అడరఁగ ధర్మనందనుఁ డహర్పతిచేత వరంబు [35]పేర్మితోఁ
బడసి మహీసురోత్తముల భవ్యులఁ బల్వుర నిర్వహించె న
ప్పుడు ద్రుపదాధిరాజసుత పొల్పుగ వండినశాకమూలముల్
గడురుచి నిష్టభోజనసుఖంబులఁ దృప్తులఁ జేయుచుండఁగన్.

44


వ.

ఇ ట్లనేకసహస్రమహీసురవరుల ననుదినంబును నభిమతభోజనంబులం దనిపి
విఘసామృతభోజనంబులం దృప్తులైన [36]తనపతుల భుక్తశేషంబు ద్రుపదపుత్త్రిక
యుపయోగించుచుండం గొన్నిదినంబు లంద యుండి పాండవులు బ్రాహ్మణుల
చేతం గృతస్వస్త్యయనులై బ్రహ్మర్షి సంఘంబులతోఁ గామ్యకవనంబున కరిగి;
రంత నిట ధృతరాష్ట్రుండు విదురుం బిలిపించి “నీవు భార్గవు కంటె బుద్ధిమంతుఁడవు;

పాండవకౌరవులకు సమ్మతుండవు; చెప్పు మింక నప్పాండవు లేమి సేయువా”
రనిన విదురుం డి ట్లనియె.

45


మత్తకోకిలము.

“దేవమూర్తులు పాండుపుత్త్రులు ధీరచిత్తులు; వారి పెం
పీ వెఱుంగనివాఁడవే? ధరణీశ! వాయుసుతుండు గాం
డీవియున్ భుజవిక్రమప్రకటీకృతుల్, వివిధాస్త్రవి
ద్యావిశేషులు; వైరివీరులఁ దక్కనిత్తురె పోరులన్?

46


క.

మొనసి యధర్మద్యూతం
బున భేదము వుట్టుఁ బాండుపుత్త్రులకును నీ
తనయుల కని మును చెప్పిన
విన నొల్లక కొడుకుపలుకు వింటివి కడఁకన్.

47


వ.

ఇఁక నయినను వారి రావించి, తొల్లి నీచేతం బడయం బడిన రాజ్యంబునందుఁ
బ్రతిష్ఠించి, కీర్తియు ధర్మంబును నిలుపుము; రాజ్యంబును ద్రివర్గంబును ధర్మ
మూలంబులు; గావున నంద వర్తిల్లు; ధర్మువు విడిచి యధర్మవర్తి యయి కర్ణశకుని
దుశ్శాసనశిక్షితుం డైన దుర్యోధను దుశ్చేష్టితంబుల కొడంబడ వలవదు.

48


తే.

వీడు పుట్టిన పాపంపువేళఁ బెక్కు
దుర్నిమిత్తముల్ వుట్టిన నిర్ణయించి
యేను జెప్పితిఁ దొల్లియు [37]వీనిచేత
నెట్టుఁ గౌరవులకు నెగ్గు వుట్టు ననియు.

49


వ.

కులదూషకు దూషించి కులంబు రక్షించుట ధర్మువు; ధర్మరాజు నఖిలమహీ
రాజ్యరక్షకుం జేసి పుత్త్రపౌత్త్రమిత్రామాత్యబంధువర్గంబుల నెల్ల రక్షింపుము;
సభామధ్యంబునందు ద్రౌపదీభీమసేనులం బ్రార్థింప దుశ్శాసనుం బంపుము.

50


చ.

[38]అతిశయితామరోత్తముఁ, డహర్పతితేజుఁ, డజాతశత్రుఁ, డూ
ర్జితుఁ, డజితుండు నీసుతుల్ సేసిన యెగ్గు దలంపఁ; డాతనిన్
ధృతి నభిషిక్తుఁ జేయుము ప్రతీపకులోద్వహ! యిట్ల యైన నీ
కృతమునఁ గౌరవాన్వయ మకిల్బిషకీర్తిఁ బ్రకాశితం బగున్.”

51


వ.

అని పలికిన విదురు పలుకులు విని కడు నలిగి ధృతరాష్ట్రుం డి ట్లనియె.

52


క.

నాదేహంబునఁ బుట్టిన
యాదిసుతున్ విడువ నెట్టు లగు? నాత్మజులం
[39]గాదనక విఘాతించు ద
యాదూరులు గలరె? యిట్టు లన నీ కగునే?

53

విదురుఁడు ధృతరాష్ట్రుని విడిచి పాండవులయొద్దకుఁ బోవుట

వ.

నీవు నాకొడుకులయున్నతి కెన్నండు సహింపవు; నీసహాయత్వంబు నేనొల్లఁ; బాండ
వులకడకేనియు, నొండుగడకేనియు [40]నీకిష్టంబైన చోటికి నరుగు” మనిన నాక్షణం
బ విదురుండు మనోజవైకరథారూఢుం డై పాండవులకడకుం గామ్యకవనంబున
కరిగె; నంత నతనిరాక దవ్వులం గని ధర్మరాజు భీమసేనున కి ట్లనియె.

54


సీ.

“గాండీవ మాదిగాఁ గల యాయుధావలు
                 లుక్కివంబున నప్పు [41]డొడిచికొనఁగ
మఱచినవాఁ డయ్యు మందాత్ముఁ డాధార్త
                 రాష్ట్రుండు గాంధారరాజతనయు

వచనముల్ విని యక్షవతి నెపంబున వానిఁ
                 గష్టుఁ డై కొన సమకట్టి మనల
మగుడింపఁగా దుష్టమతిఁ జేసి విదురుఁ బు
                 త్తెంచెఁ గాకున్న నేతేరఁ డితఁడు;


ఆ.

నింక జూద మాడ నేనోప నిది పని
గాఁగ [42]వచ్చు నొక్కొ కడఁగి విదురుఁ!
డేమిసేయువార? మితని నియోగంబు
మనకుఁ జేయ కునికి మానుషంబె?

55


వ.

అని తమలోఁ బలుకుచున్న సమయంబున విదురుం డేతెంచిన నతనికిఁ బ్రత్యు
ద్గతు లై వినయప్రియసత్కారంబుల సంతుష్టుంజేసి తదాగమననిమిత్తం బడిగిన
వారికి విదురుం డి ట్లనియె.

56


క.

“మతి వారికి మాకును గడు
హితుఁడవు; చెపు మయ్య యింక నెయ్యది కార్య
స్ధితి? యని ధృతరాష్ట్రుం డే
కత మిష్టం బైన కార్యగతి న న్నడుగన్.

57


వ.

ఏ నుభయపక్షంబుల వారికి, జగంబునకు లగ్గుగ హితం బైన విధంబు సెప్పిన నది
సర్వజనరుచికరం బైన యాహారంబు రోగాతురునకు నరుచికరం బైన యట్ల య
తనికి రుచియింప దయ్యె.

58


ఆ.

కార్యగతులతెఱఁగు కలరూపు సెప్పిన
నధికమతులు దాని [43]నాదరింతు;
రల్ప కార్యబుద్ధు లగువారలకు నది
విరసకారణంబు విషమపోలె.

59


వ.

దాననచేసి ధృతరాష్ట్రుండు న న్నొల్లక యెగ్గులు పలికి నీవు విపరీతచేతస్కుండ;
విందుండ వలవదు; పాండవులకడకుం బొ మ్మనిన వచ్చితి; రూపలావణ్యవతి
యై వృద్ధశ్రోత్రియునిచేతం బరిణీతయైన తరుణియుంబోలె రాజ్యలక్ష్మి యద్దు
రాత్మునందు విరక్తయ కాని ప్రీతి పుట్ట దండ్రు.

60


ఆ.

ధర్మరహితు లైన ధార్తరాష్ట్రులకు భూ
రాజ్యలక్ష్మి సుస్థిరంబు గాదు;
ధర్మతనయ! నిన్నుఁ దద్రాజ్య సంపదల్
వలచి [44]తమకుఁ దామ వచ్చి పొందు.

61


వ.

నా వచనంబున నెగడునది” యనిన ధర్మరాజు ‘నట్ల చేయుదు’ నని యున్నంత
నిట ధృతరాష్ట్రుండు పాండవులయొద్ద విదురు నునికి యెఱింగి ధృతిహీనుం డై
తన హృదయంబును దృష్టియుం బోని విదురుం బాసి నిమిషం బేని నిర్వ
హింప [45]నోపక సంజయున కి ట్లనియె.

62


క.

“నెమ్మిగలవాని, నా చి
త్త మ్మెఱిఁగెడువాని, [46]విదురు, ధర్మప్రియు, నా
తమ్ము నిట వేగ తోడ్కొని
ర మ్మరుగుము కామ్యకాఖ్య రమ్యాటవికిన్.”

63


వ.

అని పంచిన నప్పుడ సంజయుం డతిత్వరితగతిం గామ్యకవనంబున కరిగి.

64


మ.

ధరణీదేవ[47]సహస్రసంఘములతో ధౌమ్యుండు ధర్మక్షమా
భరణుల్ నల్వురు దమ్ములున్, విదురుఁడుం, బాంచాలియుం, బ్రీతిబం
ధురు లై కొల్వఁగ నొప్పుచున్న బుధబంధున్, ధర్మరాజుం, బ్రభా

[48]స్కరతేజుం బ్రభుఁ గాంచి సంజయుఁడు సంజాతప్రమోదాత్ముఁ డై.

65


క.

వనవాస[49]ము సేసియుఁ ద్రిభు
వనరాజ్యము సేయునట్టి వడువున సంతో
షనిబద్ధబుద్ధి యగు యమ
తనూజులకు భక్తి నెఱఁగి తా ని ట్లనియెన్.

66


వ.

“మిమ్మును, ధర్మార్థవిదుం డైన విదురునిం గౌరవేంద్రుం డెప్పుడుం దలంచుచుండు;
మీ యనుమతంబునఁ దనయనుజుం దోడ్కొని తేర నన్నుఁ బుత్తెంచె” ననిన విని
ధర్మరాజు విదురున కి ట్లనియె.

67


తే.

[50]సర్వజనులును ధృతరాష్ట్రు శాసనంబు
సేయుచున్నచో మనకు విశేష భక్తిఁ
జేయవలయుఁ; గావున నెడసేయ కరుగు”
మనిన విదురుండు గజపురి కరిగె నంత.

68


వ.

ధృతరాష్ట్రుండును వినయవినమితోత్తమాంగు డైన విదురు నతిస్నేహంబునం
గౌఁగిలించుకొని [51]మూర్ధాఘ్రాణంబు సేసి “నీవు నిత్యక్షమానిరతుండవు; నా బుద్ధి
లేమికి క్షమియింపు” మనిన విదురుం డి ట్లనియె.

69


ఆ.

“నీవు, నీ సుతుండు నెఱిఁ దప్పి [52]పలికినఁ
బథ్య మయిన పలుక పలుకవలయు;
వీరు లయిన పాండవేయులతో నిగ్ర
హంబు సేయు టిది నయంబు గాదు.”

70


వ.

అనుచు నెప్పటియట్ల కార్యసహాయుం డై విదురుండు ధృతరాష్ట్రు నొద్ద యున్న
నయ్యిద్దఱ సంగమంబునకు శంకించి దుర్యోధనుండు కర్ణశకునిదుశ్శాసనులతో
ని ట్లనియె.

71


క.

“పాండవహితుఁ డగు విదురుఁడు
వెండియుఁ జనుదెంచి కార్యవిధులందు సహా
యుం డయ్యె; నతనితోడ హి
తుండయి మంతనము సేయఁ దొడఁగెన్ విభుఁడున్.

72


వ.

వీర లింకఁ బాండవుల నిందులకు రావించువార లయిన నగ్నివిషజలంబులు ప్ర
యోగించి వారల కపాయంబు సేయుద” మనిన విని శకుని దుర్యోధనుం జూచి “యి
ట్లేల బాలిశం బైనమతిఁ దలంచితివి; విదురధృతరాష్ట్రులు విపరీతమతులై రా
వించినను నిత్యసత్యనిరతులైన యప్పాండవులు దమ చేసినసమయంబు
సలుపక యేల వచ్చువా రగుదు” రనిన శకుని దుర్యోధనులకుఁ గర్ణుం డి ట్లనియె.

73


ఉ.

“ఇత్తఱిఁ బన్నిపోయి, పయి నెత్తి, రణం బొనరించి, వారలన్
మిత్తికి నంపి, ధాత్రి నిరమిత్రముఁ జేయుద; మిట్టులైనఁ ద
ద్వృత్తులు నీక దక్కుఁ; గురువీర కడంగుము” నావుడున్ మదో
న్మత్తుఁడు గౌరవుం డతని మాటకు సంతస మంది చెచ్చెరన్.

74


వ.

సమరసన్నద్ధుఁ డై సమస్తబలంబును సమకట్టి వెలువడినం దన దివ్యదృష్టి నం
తయు నెఱింగి కృష్ణద్వైపాయనుండు వచ్చి “యిది [53]ధర్మంబు గా; దుడుగు” మని
దుర్యోధనుని వారించి ధృతరాష్ట్రున కి ట్లనియె.

75


క.

“పుడమియు రాజ్యముఁ గోల్పడి
యడవుల నేకతను యున్న యప్పాండవులం

గడగి [54]వధియింతు నని నీ
కొడు కరిగెడు; నిట్లు తలఁపఁ గూడునె బుద్ధిన్?

76


క.

[55]ధృతియుతులై సత్యవ్రత
రతులయి పదుమూఁడువత్సరంబులు ధర్మ
స్థితి సలిపి వార కడఁగెద
రతులపరాక్రములు మీఁద నాహవమునకున్.

77


క.

వనగతు లని వారలపైఁ
జని భంగముఁ బొంది రాఁగ సమకట్టెడు నీ
తనయుఁడు; గావున నీ వా
తని వారింపు మది యనుచితం బని నెమ్మిన్.

78


క.

విను మేనును, నీవును, శాం
తనవుఁడు, విదురుండు నుండి తగునె యధర్మం
[56]బున నీయుపేక్ష? ననయం
బును బాండవవిగ్రహంబు పుట్టుట లగ్గే?”

79


వ.

అనిన విని ధృతరాష్ట్రుండు దుఃఖితుం డై “నాకును, గాంధారికిని, భీష్మవిదుర
కృపద్రోణులకు ననిష్టంబైన దుష్టద్యూతంబు [57]ప్రవర్తించి దుర్బుద్ధియైన
దుర్యోధనుం బుత్త్రస్నేహంబున విడువ నోప” [58]ననిన ధృతరాష్ట్రునకుఁ గృష్ణద్వై
పాయనుం డి ట్లనియె.

80

ధృతరాష్ట్రునకు వ్యాసుఁ డింద్రసురభిసంవాదంబు సెప్పుట

ఆ.

“ఎల్ల నెయ్యములకుఁ దల్లిదండ్రులయందు
సుతులవలని నెయ్య మతిశయంబు;
ధనము లెంత గలిగినను సుతరహితుల
కెమ్మెయిని మనఃప్రియమ్ము లేదు.

81


వ.

తొల్లి సకలగోమాత యయిన సురభి [59]సురరాజు కడకుం బోయి కరుణంబుగా
నేడ్చిన దానిం జూచి సురపతి విస్మితుం డై “యి ట్లేల రోదనాకులితలోచన వయి
యున్నదాన; వెల్లవారికి లగ్గ కదా” యనిన నింద్రునకు సురభి యి ట్లనియె.

82


క.

నీ వజ్రము [60]రక్షింపఁగ
నా వారికి దక్కఁ ద్రిభువనంబులఁ గల భూ
తావలి కెల్లను గుశలమ;
దేవేంద్ర! జగత్త్రయప్రదీప! మహాత్మా!

83


వ.

దీనిం జిత్తగింపుము; బలంబు గల బలీవర్దంబులతో బలహీనంబు లయినవానిం
బూన్చిన నవి దుర్వహభారవహనమహాలాంగలాకర్షణంబులయం దసమర్థంబు
లైన నడిచియుం, బొడిచియు, [61]ములుకోలలం గుట్టియు దుర్బలబలీవర్దంబుల జను
లు బాధింపం జూచి యేను దానికి దుఃఖించెద” ననిన సురభికి సురపతి యి ట్లనియె.

84


క.

“నీకు నపత్యశతంబు ల
నేకంబులు గలవు; వాని కేకాకృతి దుః
ఖాకులత సంభవింపదు;
శోకింపకు” మనిన సురభి సురపతి కనియెన్.

85


వ.

“దేవా! దీనాననంబు లయి దుర్బలంబు లయిన యపత్యంబుల దుఃఖం బే నెట్లు
సూడ నోపుదు” ననిన నగి యింద్రుండు దానికిం గరుణించి వర్షంబునఁ దృణవర్థ
నంబు సేసి దుర్బలబలీవర్దనంబులకు బలంబు గావించె నని యింద్రసురభిసంవా
దంబు వేదంబుల యందు వినంబడుఁ గావున నీకు బుత్త్రస్నేహంబు సామా

న్యంబు గా; దైనను దీనులై వనంబు నవయుచున్న యప్పాండవులకు దయా
ళుండ వగుము.

86


తే.

నీవుఁ బాండుండు విదురుండు నెమ్మి నాకు
నొక్కరూ పైనయట్లు, నీ కుదితయశులు
నీ సుతులు నూర్వరును, బాండునృపతనూజు
లేవురును నొక్కరూప కా నెఱుఁగ వలయు.

87


క.

సుజనుల సహవాసంబునఁ
గుజనులు సద్ధర్మమతు లగుట నిక్కము ధ
ర్మజునొద్దనుండి నీయా
త్మజూఁడు ప్రశాంతుండు ధర్మమార్గుండు నగున్.

88


వ.

రాజర్షి యైన ధర్మరాజుతోడి సహవాసంబు సర్వజనహితంబు; గావున నాతని
నుపాసించి దుర్యోధనుండు గొండొకకాలం బుండునట్లుగాఁ బనుపు; మ ట్లయిన
నుభయపక్షంబులకు ల గ్గగు” ననిన ధృతరాష్ట్రుండు గృతాంజలి యయి “మునీం
ద్రా! దుర్యోధనుండు నాపలుకులు వినండు; కురుకులంబు రక్షించునట్టి బుద్ధి గల
దేని వాని మీర శిక్షింపుం” డని మ్రొక్కిన.

89


క.

“అనఘుఁడు మైత్రేయుం డను
మునినాథుఁడు వచ్చి ధర్మమున నాతనిఁ దా
ననుశాసించుఁ దిరంబుగ”
నని చెప్పుచు నప్పరాశరాత్మజుఁ డరిగెన్.

90


వ.

అంత.

91


ఉ.

న్యాయవిదుండు గామ్యకవనంబున ధర్మరాజు నొద్దనుండి మై
త్రేయుఁడు ధీయుతుం డరుగుదెంచిన నప్పుడ యమ్మునీంద్రు నిం
ద్రాయితుఁ డాంబికేయుఁ డుచితస్థితిఁ బూజితుఁ జేసె నాత్మని
శ్శ్రేయసలాలసుం డయి విశేషసపర్యలఁ జేసి భక్తితోన్.

92


వ.

ఇట్లు దనచేతం బూజితుం డై సుఖవిశ్రాంతుం డైన మునివరునకు ధృతరాష్ట్రుండు
ముకుళితహస్తుం డై “భట్టారకా! యెందుండి వచ్చితి” రని యడిగిన నతనికి మైత్రే
యుం డి ట్లనియె.

93


చ.

“అలఘు[62]తపోభరంబున జటాజినముల్ ధరియించి రూక్షవ
ల్కలములు గట్టి, కూరలును గాయలుఁ బండులు భోజనంబుగా
నలయక కామ్యకం బను మహావిపినంబున నున్న పాండవే
యులకడ నుండి వచ్చితిఁ గురూత్తమ! నీసుతు, నిన్నుఁ జూడఁగన్.

94


వ.

ఏ నఖిలతీర్థదర్శనార్థంబు పరిభ్రమించుచుఁ గురుజాంగలంబున కరిగి యందు
గురుకులోత్తము లైన పాండుపుత్త్రులం జూచితి.”

95


ఆ.

అనిన నవనతాస్యుఁ డయి ధృతరాష్ట్రుఁ డి
ట్లనియె “నెట్లు సెప్పుఁ [63]డయ్య! యందుఁ
బాండవులకు సత్యభాషణులకుఁ గుశ
లంబె? వార లిట దలంతురొక్కొ!

96


క.

అమితభుజశక్తి నంతక
సము లప్పాండుసుతు లిందు సౌభ్రాత్రస్నే

97

హమునకు విచ్ఛేదముగా
సమయాతిక్రమము సేయ [64]సమకట్టరుగా?”

97


వ.

అనిన మైత్రేయుం డి ట్లనియె.

98


క.

“చనుదెంచి మహామునివరు
లనవతరము వారలకుఁ బ్రియం బొనరఁగ దీ
వన లీగిఁ జేసి కుశలమ
మనుజేశ్వర వారు ధర్మమతియుతు లగుటన్.

99


క.

వారలు సమయము దప్పిన
వారిజరిపుహితులగతు లవశ్యముఁ దప్పున్;
వారికి నకారణంబ ని
కారము నీ కొడుకు సేసెఁ గడు నహితుం డై.”

100


వ.

అని దుర్యోధనుం జూచి “యయ్యా నీవు బుద్ధిగల వేనిఁ బాండవులతో విరోధం
బుడుగు; మట్లయిన నీకును వారికిం గురుకులంబునకు లగ్గగు; నా పలుకుఁ జేకొనుము.

101


సీ.

వజ్రసంహనను, లవార్యపరాక్రముల్,
                 పాండుకుమారు, లాఖండలాభు;
లందఱు నాగశతాయుత [65]ప్రాణు, లు
                 గ్రాహవకాంక్షు, లుత్సాహపరులు;
వారలలో బలవంతుండు, బక హిడిం
                 బాసురు లనువారి నాసురమునఁ
జంపి, నాగాయుతసత్త్వు జరాసంధు
                 నెక్కటి యోర్చిన యక్కజుండు;


తే.

ఘోరవనమున వీరుఁ గిమ్మీరుఁ డను సు
రారి, నిశ్చలభీకరాకారుఁ బట్టి
పోర వధియించినట్టి సమీరజునకు
భూరిభుజునకు మార్కొనువారుఁ గలరె?

102

మైత్రేయుఁడు దుర్యోధనుని శపించుట

వ.

వారికి వాసుదేవధృష్టద్యుమ్నులు సంబంధ[66]సహాయులు; జరామరణవంతు లైన
మనుజులు వారిం జెనకి యెట్లు జీవింతురు? నీవు వారితో నొడంబడియుండు; మిది
కార్యం” బనిన మైత్రేయు పలుకు లాదరింపక పాదాంగుష్ఠంబున నేల వ్రాయుచు
బాహువెత్తి దొడలు సఱచి నగుచున్న యా దుర్యోధనుం జూచి మైత్రేయుం డలిగి
“యీ యపరాధంబున నావహంబగు; నందు భీముగదాఘాతంబున నీ యూరుయుగ
ళంబు భగ్నం బయ్యెడు” మని శాపం బిచ్చిన వెఱచి ధృతరాష్ట్రుండు “మునీంద్రా!
యట్లు గాకుండం బ్రసాదింపు” మనిన నమ్మునివరుం డి ట్లనియె.

103


తే.

“కడఁగి సమబుద్ధి వీనికిఁ గలిగెనేనిఁ
గాదు శాపఫలం; బట్లు గాక బుద్ధి
హీనుఁ డై గర్వితుం డగు నేని శాప
హవ్యవాహఫలంబు వీఁ డనుభవించు,”

104


వ.

అని ప్రసన్నుం డైన మైత్రేయునకు నాంబికేయుం డి ట్లనియె.

105


క.

“కిమ్మీరుం డను రక్కసుఁ
డమ్మారుతతనయుచేత నత్యుగ్ర[67]వనాం
తమ్మున నిహతుం డయిన వి
ధ మ్మెట్టులు? సెప్పు మద్భుతం బిది” యనినన్.

106


వ.

“నా పలుకులు నీ కొడుకు వినం డయ్యె; నే నేల చెప్పెద? దీనిం బాండవసహాయులైన
విప్రులచేత విదురుం డిమ్ముగా నెఱింగినవాఁ; డతనివలన విను” మని చెప్పి మైత్రే
యుం డరిగినం గిమ్మీరవధకథాశ్రవణ[68]పరుం డై తన్నడిగిన ధృతరాష్ట్రునకు

విదురుం డి ట్లనియె “నిం దుండి చని పాండవులు మూఁ డహోరాత్రంబులు
నిరంతరప్రయాణంబు సేసి కామ్యకవనంబుఁ జొచ్చువా రొక్కనాటి యర్ధరాత్రం
బున రాక్షసప్రచారవేళయందుఁ బరిభ్రమించుచు రాక్షసమాయ గావించు
చున్నవాని, నతినిశితదంష్ట్రాకరాళం బైన తన వదనగహ్వరంబుఁ దెఱచి గ్రుడ్లు
మెఱవ, బభ్రుకేశంబులు దూల, బాలార్కరశ్మియుతం బయిన బలాహకంబునుం
బోలె సకలప్రాణిభయజననంబుగా గర్జిల్లుచున్న వాని [69]నిజపాదఘట్టితమహీతల
ప్రచలనవేగవేతవల్లీపల్లవబాహుపరిరంభణసుఖంబుఁ బాదపంబుల కాపా
దించుచున్నవాని, నెదుర నొక్కరక్కసుం గని; రంత వాఁడును బ్రాహ్మణసం
ఘంబు ముందటఁ గృష్ణాజినావృతు లై వచ్చు పాండవుల దవ్వులం గని మార్గ
నిరోధియై మహాపర్వతంబును బోలె నున్న నదృష్టపూర్వప్రమాణం బైనవాని
దేహంబుఁ జూచి నిమీలితనయన యయి దుశ్శాసనకరాకృష్టవికీర్ణవేణీభరంబు
వెనువెంట నొలయం బాంచాలి పంచపర్వతంబులనడిమి నదియుంబోలెఁ బతుల
నడుమ భయవ్యాకులచిత్తయైన, నింద్రియంబులు విషయరతిం బరిగ్రహింబు
నట్టు లేవురు నక్కోమలిం బట్టకొని భయపడకుండ నాశ్వాసించుచున్నంత.


క.

రక్షోఘ్నమంత్రముల నా
రాక్షసమాయా[70]పరిస్ఫురణఁ జెఱిచెఁ గ్రియా
దక్షుఁడు ధౌమ్యుఁడు పాండవు
లీక్షించుచు నుండఁగా నహీనప్రతిభన్.

108


వ.

అంత.

109


క.

ప్రతివిహితమాయు, నత్యా
యతభుజయుతుఁ, గోపఘూర్ణితారుణ[71]విస్ఫా
రితనేత్రు, నసురఁ జూచి భ
రతకులవర్ధనుఁడు ధర్మరా జి ట్లనియెన్.

110


వ.

“నీ వెవ్వరివాఁడ? వెవ్వండ? వివ్వనంబున నేల యున్నవాఁడ?” వనిన వాఁ డి ట్లనియె.

111


క.

“ఏను బకాసురు ననుజుఁడఁ;
గీనాశుఁడ; మానవులకుఁ గిమ్మీరుఁ డనం
గా నెగడుదు; నీ కామ్యక
కాననమున సర్వసత్త్వఖాదనబుద్ధిన్.

112


క.

పాయక యుండుదు; రాక్షస
మాయల సమరంబు సేసి మనుజుల విగతో
పాయులఁ జంపుచు భక్షణ
సేయుదు; నమరాదులకు నజేయుఁడఁ [72]బోరన్.

113


వ.

నాకు వెఱచి యెల్లవారును దూరంబున దీనిం బరిహరింతురు; మీ రెవ్వ?
రిందుల కేల వచ్చితిరి? మిమ్ము వధియించి యిపుడు భక్షించెద” ననిన వానికి
యుధిష్ఠిరుం డి ట్లనియె.

114


ఆ.

“ఏను ధర్మసుతుఁడ; నీతఁడు భీముండు;
వాఁడు విజయుఁ; డల్లవారు గవలు;
పాండవులము సమయపడి వనవాసంబు
సేయ వచ్చితిమి విశేష యుక్తి.”

115


సీ.

అనవుడు రాక్షసుం డట్టహాసంబుతో
                 “నెట్టెట్టు! భీముండె యీతఁ? డేమి
పుణ్యమో! వీని నెప్పుడు సంపఁగాంతునో
                 యని యున్నచోఁ, దాన యరుగుదెంచె;

నధికు మాయన్న బకాసురు, నా
                 యిష్టసఖు హిడింబాసురుఁ జంపి యున్న
ఖలు మ్రింగి జీర్ణంబు గావింతు వాతాపిఁ
                 దడయక మ్రింగిన తపసి యట్ల”


ఆ.

యనిన [73]రక్కసునకు నలిగిన యగ్రజు
నలుక యెఱిఁగి వీరుఁ డర్జునుండు
మొనసి గాండివంబు మోపెట్టె సునిశిత
ఖడ్గపాణు లైరి కవలు నంత.

116

కిమ్మీరుఁ డను రాక్షసుఁడు భీముచేఁ జచ్చుట

ఉ.

ఘోరపరాక్రముల్, ప్రబలకోపపరుల్, పృథుసారభూరిభూ
మీరుహపాణు, లుద్ధతు, లమిత్రవిఘాతులు, వీరబృందబృం
దారకు లార్చు చొండొరులఁ దాఁకిరి దారుణభంగిఁ బొంగి కి
మ్మీరసమీరసూనులు సమీరవిధూతపయోధు లట్లయై.

117


తరలము.

పొరిని వారలచేతి యున్నత[74]భూరుహాయుధముల్ పర
స్పరకఠోరశిరస్స్థలంబులపై వడిం బడి మత్తకుం
జరశిరఃపతితంబు లైన లసన్మృణాళము లట్ల జ
ర్జరిత మయ్యెఁ దదారవప్రతిశబ్ద మొప్ప నగంబులన్.

118


వ.

ఇ ట్లొక్కముహూర్తంబు వృక్షయుద్ధంబు సేసి యాసన్నమహీరుహంబులు
సమసిన, నయ్యిద్దఱు శిలాయుద్ధంబునకుఁ దొడంగి చేయునెడం బవనజనిక్షిప్త
నిష్ఠురశిలాహతహృదయుం డై భానుం బట్టుకొను స్వర్భానుండునుం బోలెఁ
గిమ్మీరుండు భీముం బట్టుకొనిన, భీముండును వాని హీనంబలుం గా నెఱింగి;
కృతాంతదండానుకారంబు లయిన తనబాహుదండంబుల నమ్మనుజకంటకు కటి
కంఠప్రదేశంబులు పట్టుకొని, నేలం బెట్టి, దేహయష్టి విఱిచి, బకుం జంపిన విధం
బునఁ గిమ్మీరు విగతప్రాణుం జేసి.

119


తే.

“బకహిడింబులు హతులైన బనివిపనివి
యఱచి [75]శోకింపఁ గానక యమపురమున
కరిగి తక్కట రాక్షస” యనుచుఁ దెరువు
వాయఁ బావని దత్కళేబరము వైచె.

120


వ.

ఇట్లు ధర్మరాజూ వచనంబునఁ గిమ్మీరు నశ్రమంబున వధియించి తద్వనవాసు
లకు రాక్షసభయం బుడుపిన మహావీరు నమ్మారుతాత్మజు ధర్మార్జుననకులసహ
దేవులును ధౌమ్యాదిమహీసురవరులు బ్రశంసించి” రని విదురుండు [76]గిమ్మీరు
వధ సెప్పిన విని ధృతరాష్ట్రునకు హృదయదళనం బయ్యె; నిట పాండవులు
గామ్యకవనంబున నుండునంత.

121

యాదవపాంచాలాదులు పాండవులకడ కేతెంచుట

సీ.

వసుమతీ రాజ్యంబువలన నిరస్తులై
                 మునివృత్తి నత్యుగ్రవనములోన
నవయుచుఁ బాండుభూనాథనందను లున్న
                 వారని విని యతిక్రూరమతుల

ధృతరాష్ట్రసుతుల నిందించుచుఁ బాంచాల
                 యాదవ వృష్ణిభోజాధు లెల్ల
నచ్యుత ప్రముఖు లై యప్పాండవులకడ
                 కేతెంచి శోకపరీతు లగుచు


ఆ.

నున్న నధికధర్మయుక్తుఁ డుపేంద్రుండు
నికృతిఁ జేసి పాపనియతబుద్ధిఁ
బాండవులకు నట్లపాయంబు సేసిన
ధార్తరాష్ట్రులకును దద్ద యలిగి.

122


క.

“అనిఁ గర్ణశకుని దుర్యో
ధన దుశ్శాసన నవాస్రధారాపాతం
బునఁ దృప్తివొందు వసుధాం
గన రాక్షసకాకగృధ్రగణముల తోడన్.

123


క.

అవినీతుల, వధ్యులఁ, గౌ
రవపాంసులఁ జంపి ధర్మరాజునకుఁ గురు
[77]ప్రవరున కొనరింతమ యీ
యవనీరాజ్యాభిషేక మవిజితశక్తిన్.”

124


వ.

అని యుగాంతకాలకుపితకృతాంతాకృతి నున్న జగన్నాథు జనార్దనుం బ్రశాం
తచిత్తుం జేసి యర్జునుం డతని ని ట్లని కీర్తించె.

125


ఆ.

“పూజ్యుఁడవు, పురాణపురుషుండ, వీశుండ,
వప్రమేయుఁడవు; చరాచరంబు
లయిన భూతరాసు లచ్యుత! నీయంద
పుట్టు, నిలుచు, లయముఁ బొందు[78]చుండు.

126


వ.

నీవు దొల్లి గంధమాదనంబునం గందమూలఫలాశనుండవై పదివేలేండ్లు తపంబు
సేసి, పుష్కరంబున నేకాదశసహస్రవర్షంబులు జలంబుల యాహారంబుగా నుండి,
ప్రభాసం బను తీర్థంబున దివ్యసహస్రవర్షంబు లేకపాతస్థితుండవయి యుండి, బద
రీవనంబునం [79]బవనంబు భక్షించుచు నూర్ధ్వబాహుండవయి యేకపాదంబున
ననేకసహస్రవర్షంబులు నిలిచి, సరస్వతీసత్త్రంబున నవకృష్ణోత్తరాసంగుండవై
నియమకృశీకృతశరీరంబుతోఁ బండ్రెండువర్షంబు లశేషవ్రతంబులు సలిపిన తపో
నిధానంబవు; నిఖిలలోకజైత్రుండ వయి చైత్రరథంబున నుత్తమక్రతువు లనేకం
బులు సేసి, యొక్కొక్క క్రతువునకు నూఱేసి లక్షలు సువర్ణంబులు దక్షిణ లిచ్చిన
యజ్ఞపురుషుండవు, తపోయజ్ఞంబులు రెంటను సమృద్ధతేజుండవయి దైత్య
దానవేంద్రుల వధియించి యింద్రున కింద్రత్వం బేకాధిష్ఠితంబు సేసిన లోకప్ర
భుండ; వదితికిం గశ్యపునకు నుదయించి యింద్రానుజుండ వై త్రివిక్రమంబునం
ద్రిజగంబుల నభివ్యాపించిన విశ్వరూపధరుండవు.

127


క.

నరకశిశుపాలు రాదిగ
ధరణీకంటకుల నధికతరదర్పులఁ బ
ల్వుర వధియింపఁగ మహి నవ
తరించిన మహాత్ముఁడవు [80]నుతస్థిరశక్తిన్.

128


క.

అనృతము, మదమును ,మత్సర
మును, గ్రోధము [81]నను వికారములు వొరయునె ని
న్ననుపమగుణముల నీ కొరు
లెన పోల్పఁగఁ గలరె? సురమునీంద్రప్రణుతా.”

129


వ.

అని కృతాంజలి యయిన ధనంజయుం జూచి దనుజభంజనుం డి ట్లనియె.

130


తే.

“నరుఁడు నారాయణుండు నాఁ బరఁగు నాది
మునుల మిద్దఱ; మందు నీ వనఘ! నరుఁడ;

నేను నారాయణుండ; ననూనశక్తి
యుతులమై మర్త్యయోనిఁ బుట్టితిమి [82]పేర్మి.

131


తరువోజ.

నిరతంబుగా నేను నీ వను భేద
                 నియమంబు లే; దైక్యనిష్ఠయ మనకు
నిరువురకును; నీకు నిష్టుండ నాకు
                 నిష్టుండు; మఱి నీకనిష్టుండ నాకుఁ
గర మనిష్టుం; డట్లు గా నమ్ము” మనుచు
                 ఘనభుజుల్ భువనోపకారైకమతులు
హరియు నర్జునుఁడుఁ బ్రియంబుతోఁ దగిలి
                 యన్యోన్యహితభాషు లగుచుండునంత.

132

ద్రౌపది శ్రీకృష్ణునితోఁ దనపరిభవంబు సెప్పి దుఃఖించుట

వ.

అఖిలరాజలోకపరివృతుండయి యున్న నారాయణు నొద్దకు వచ్చి ద్రుపదరాజ
పుత్త్రి ముకుళితకరాంబుజ యయి యి ట్లనియె దేవా “నిన్ను నాదిప్రజావర్గంబునఁ
బ్రజాపతివని యసితుం డయిన దేవలుండును, సత్యంబువలన యజ్ఞం బుద్ధరిం
చుటం జేసి నిత్యసత్యమయుండ వయిన యజ్ఞపురుషుండ వని కశ్యపుండును,
శిరంబున దివంబును, బాదంబుల మేదినియును, లోచనంబుల సూర్యుండును,
నవయంబుల లోకంబులు నభివ్యాపించుట జేసి సర్వమయుండ వని నారదుం
డును, నక్షయజ్ఞాననిధి వని సర్వమునిముఖ్యులును జెప్పిరి.

133


మధ్యాక్కర.

అని ననివృత్తులై పుణ్యచరితు లై, యాత్మప్రబోధ
వినిహితచిత్తులై, సర్వధర్మార్థవిదులయి తృప్తిఁ
దనరెడు రాజర్షి వరులకును, యోగధరులకు సాధు
జనులకు గతి నీవ నిత్యకారుణ్య! సర్వశరణ్య!

134


వ.

నీయంతఃకరణ ప్రవృత్తి కగోచరం బెద్దియు లే; దయినను నా పడిన పరాభవం
బెఱింగించెద.

135


సీ.

పార్థివప్రభుఁ డైన పాండుమహీపతి
                 కోడల నయి, యుద్ధకుశలు లయిన
[83]పాండుతనూజుల భార్యనై పూజ్యుఁడ
                 వైన నీ యనుజనై, యధికశక్తిఁ
బరఁగు ధృష్టద్యుమ్ను భగినినై, ధృతరాష్ట్రు
                 పట్టిచే సభఁ దల పట్టి యీడ్వఁ
బడి పాపకర్ముచేఁ బరిధాన మొలువంగఁ
                 బడి, దారుణంబైన పరిభవంబు


ఆ.

పడితి; నట్టి నన్నుఁ బాండవుల్ సూచుచు
నుండి రొరులువోలె నుక్కుదక్కి;
యాపగాతనూజుఁ డాదిగాఁ గల వృద్ధ
బంధుజనులు సూచి పలుక రయిరి.

136


క.

శరణనినవారిఁ గరుణా
కరు లయి రక్షించు పురుషకారాన్వితు లే
శరణని యఱచిన [84]నాలిం
పర భీమార్జునుల బాహుబల మేమిటికిన్?

137


వ.

భ్రాతృపుత్త్రబంధుజనంబులు నాకుం గలిగియు లేనివా రయి; రట్టి యెడం గర్ణుం
డు నన్నుం జూచి నగియె.

138


ఆ.

కర్ణునగవు లోక గర్హితుండగు దుస్స
సేను [85]చెయిదికంటె శిఖియపోలె

నడరి నామనంబు నతి దారు[86]ణక్రియ
నేర్చు చున్న యది మహీధరుండ!


వ.

తొల్లి వేదాధ్యయనంబు సేయుచు బాలకేళీవినోదంబున నున్న కాలంబునఁ
బ్రమాణకోటియందు సుప్తుం డయిన భీమసేను నంటఁ గట్టి గంగమడువునం
ద్రోపించియు, విషంబుఁ బెట్టియు, విషసర్పంబులం [87]గఱపించియు, జననీసహితు
లైన యేవురను వారణావతంబున లక్కయిల్లు సొనిపి యందు దహనంబుఁ
బ్రయోగింపం బంచియు, ననేకంబు లైన యపకారంబులు సేసి, యిప్పుడు
దుర్యోధనుం డధర్మద్యూతంబున రాజ్యంబు నపహరించి, రాజలోకసమక్షంబు
నం దమ్ము నిరాకృతులంజేసినను బరాక్రమపరాఙ్ముఖులైన పాండవులు
నా పరిభవంబు లెట్లు దలఁగెద” రని బాష్పధారాస్నపితపయోధర యయి
పాణిపల్లవంబున నయనసమ్మార్జనంబు సేయుచున్న పాంచాలిం జూచి
వాసుదేవుం డి ట్లనియె.

140


చ.

[88]తనుకుచు నున్న నీ హృదయతాపనిమిత్తమునన్ సురేంద్రనం
దను పటుబాణపాతహతిఁ దద్ధృతరాష్ట్రబలంబు మృత్యుసా
దనమున కేఁగుఁ జు; మ్మిదియ తథ్యము; నా వచనంబు దప్ప ది
వ్వననిధు లేడు నింకిన, దివంబును రాత్రియు సంచలించినన్.

141


వ.

అనిన నర్జునుండు ద్రౌపదిం జూచి యి ట్లనియె.

142


ఉ.

“ఈ పురుషోత్తముండు మన కిందఱకుం గుశలంబు సేయుచుం
బాపకలంకపంకములఁ [89]బాయఁగఁ జేయుటఁ జేసి దుర్మదో
ద్దీపితశత్రుసంహతి హతిం బరమార్థమ పొందు; నేల సం
తాపము నీకుఁ జేయఁగఁ ద్రిధామజయోన్నతి గల్గి యుండఁగన్?”

143


వ.

అనిన సక్రోధుం డయి ధృష్టద్యుమ్నుం డి ట్లనియె.

144


క.

[90]వినయవిహీనుల దుర్యో
ధనదుశ్శాసనులఁ బవనతనయుఁడు, రాధా
తనయుని నరుఁ, డేఁ గుంభజు
ననిఁ జంపుదు మేల వగవ నంబుజనేత్రా.”

145


వ.

అని యందఱు ద్రుపదరాజపుత్త్రి నాశ్వాసించి రంత నచ్యుతుండు ధర్మరాజున
కి ట్లనియె.

146


తే.

“ద్వారవతినుండియే యుయుధానువలన
ధారుణీశ! యింతయు విని తత్క్షణంబ
యరుగుదెంచి యాపన్నుఁడ వైన నిన్నుఁ
జూచి దుఃఖోపహత[91]మనస్కుండ నైతి.

147

వ.

అయ్యవసరంబున నేను మీ యొద్దనుండమిం జేసి యిట్టి దుర్వ్యసనంబు సంభవి
ల్లెం; గామజంబు లైన స్త్రీద్యూతమృగయాపానంబు లను నాలుగు దుర్వ్యసనం
బులం బ్రవర్తిల్లకుండఁ బ్రతిషేధింపవలయు; నందును విశేషంబుగా [92]ననర్థ
మూలం బయిన ద్యూతంబుఁ బరిహరింపనినాఁడు పాపం బగు నని హేతుదృష్టాం
తంబులు సూపి కృపద్రోణవిదురగాంగేయులం దోడు సేసికొని యాంబికేయు
నొడం బఱిచి దుష్టద్యూతంబు సర్వ ప్రకారంబుల వారింతు.

148


క.

[93]వలచి హితంబునఁ బథ్యముఁ
బలికినఁ జేకొనని ధర్మబాహ్యుల నవివే
కుల నిగ్రహింతు; మీ కె
గ్గులు మత్సాన్నిధ్యమున నగునె యెయ్యెడలన్?

149

కృష్ణుఁడు ధర్మరాజునకు సౌంభకాఖ్యానంబు సెప్పుట

వ.

ఏను సముద్రతీరంబున సాల్వుతోడం బదినెలలు యుద్ధంబు సేసి వాని వధియించు
పొంటె నక్కడ మసలితి; నది గారణంబుగా మీకు దుర్వ్యసనావసరంబున నల
బ్ధసన్నిధానుండ నయితి” ననిన నది యె ట్లని యుధిష్టిరుం డడిగిన నాతనికి
సౌంభకాఖ్యానంబు సవిస్తరంబుగాఁ గృష్ణుం డి ట్లని చెప్పె; “నీ యజ్ఞంబున
నర్ఘ్యనిమిత్తంబున నసహిష్ణుండయిన శిశుపాలుండు నాచేత నిహతుండగుట
విని, వాని తమ్ముండు సాల్వుం డనువాఁడు తద్వధప్రవర్తితక్రోధుం డయి కామ
గమనం బయిన తన సౌంభకం బను నగరంబుతో సన్నద్ధుం డయి వచ్చి ద్వార
వతీపురంబు నవరోధించి.

150


చ.

“ప్రతివరపాలకాలు, శిశుపాలు, బలాధికుఁ జంపి దర్పసం
హితుఁ డగుచున్న [94]వృష్ణిఖలుఁ డెక్కడ నెక్కడ? నాతనిం జయో
న్నతి వెలయంగఁ జంపెద రణంబున” నంచు నలంఘ్యవిక్రమో
ర్జితుఁ డయి దాని చుట్టు విడిసెం జతురంగమహాబలంబుతోన్.

151


క.

మే లగు తత్పుర[95]బాహ్యవి
శాలోద్యానముల తాల సాల సరళ హిం
తాల తమాలావలి ని
ర్మూలితముగఁ జేసెఁ దచ్చమూసామజముల్.

152


వ.

మఱి తృణజలధాన్యసమిత్సమృద్ధంబయి [96]శతఘ్నీప్రముఖానేకయంత్రంబుల న
లంఘ్యపరిఘాప్రాకారంబులను, నపారబలరక్షితఘనకవాటచతుర్గోపురంబులను,
లబ్ధప్రభూతవేతనప్రహృష్టపుష్టధృష్టవీరసుభటసంకులంబులను, నపరిమితగజ
తురంగశతాంగంబులను, బ్రదీప్తాలాతశాతశరచక్రతోమరపరశుపాశాంకుశ
కూటంబులను, వీరయోధారూఢవిశాలాట్టాలకంబులను నొప్పి పరుల కసాధ్యం
బయిన ద్వారవతి భేదింప నేరక దానివెలిం బ్రపాచైత్యదేవాయతనవల్మీకం

బులు వర్జించి, సమతలప్రదేశంబున నిబిడంబుగా శిబిరసన్నివేశంబు సేసి, నిత్యం
బు నుపద్రవంబు సేయుచున్న సౌంభవిజృంభణంబునకు [97]సహింపక సమర
సంరంభంబున సర్వాయుధసన్నద్ధు లయి.

153


క.

ఉద్యద్బలులు గుమారులు
విద్యాధరసములు పురము వెలువడిరి రణై
కోద్యములు చారుదేష్ణుఁడు,
బ్రద్యుమ్నుఁడు, సాంబుఁడును విపక్ష[98]జిఘాంసన్.

154


[99]మణిభూషణము.

రామవిక్రముఁ డజేయుఁ, డరాతిగజావలీ
సామజహితుఁడు, సాంబుఁడు సాల్వచమూపతిన్
క్షేమవృద్ధి యనువాని నకృత్రిమసాహసో
ద్దాముఁ దాఁకె శరధారల [100]ధారుణిఁ గప్పుచున్.

155


క.

జాంబవతేయు బృహద్విశి
ఖంబులకున్ [101]బెదర కెదిరి ఘనుఁ డేసె రణా
గ్రంబున నాతనిపై నవి
లంబితుఁ డై క్షేమవృద్ధి లక్షశరంబుల్.

156


వ.

వాని యేయు [102]నేర్పునకు సహింపక సాంబుండు జాంబూనదపుంఖంబు లయిన
విశిఖంబులం దదీయరథాశ్వమర్మంబుల నేసిన నవి మర్మభేదవేదనలం దలరి
యతివేగంబున రణంబు వెలువడ రథం బీడ్చుకొని సారథికి వశంబు గాక పఱచె
నట్లు సాల్వచమూపతి సమరవిముఖుం డయిన.

157


స్వాగతము.

వేగవంతుఁ డను వీరుఁడు సాంబున్
వేగవంతుఁ డయి [103]వీఁకను దాఁకెన్
వేగబాణపదవీతతులన్ ది
గ్భాగముల్ విశిఖపంజరముల్ గాన్.

158


ఆ.

సాంబుఁ బాయు మనుచుఁ జారుదేష్ణుం డల్గి
వేగవంతుఁ దాఁకి వీఁకతోడ
వాని మస్తకంబు వ్రయ్యంగ వడి గదం
బొడిచె రుధిరవారిపూర మొలుక.

159


వ.

ఇట్లు చారుదేష్ణునిష్ఠురగదాఘాతంబున వేగవంతుండు విగతజీవుం డయి నిర్ఘాత
పాతభిన్నోన్నతగిరిశిఖరంబునుంబోలె నేలఁ ద్రెళ్ళినం జూచి విచింత్యుం డను
వాఁ డవిచింత్యవిక్రముం డయి.

160


తే.

చారుదేష్ణుపైఁ గడువాఁడిశరము లేసె;
లతఁడు కార్ముకహస్తుఁ డై యాక్షణంబ
వానిపై నభిమంత్రించి వహ్నిబాణ
మేసె [104]నుగ్రస్ఫులింగంబు లెసఁగం జదల.

161


క.

అనలాస్త్ర మట్లు వక్షముఁ
గొనిన విచింత్యుండు గూలెఁ గుతలం బద్రువన్;
ఘను వానిఁ జూచి హాహా
స్వనము లెసఁగ సాల్వుసేన సంక్షోభించెన్.

162


వ.

సాల్వుండు నిజసేనాసంక్షోభం బుడిచి, సర్వాయుధసనాథం బయిన రథం బెక్కి;
యాదవకుమారవాహినిపయి నెత్తి, యేయుచు వ్రేయుచుం బొడుచుచుఁ బ్రతి

బలంబు నెల్ల నాయుధమయంబుగాఁ జేయుచున్న వాని కలిగి.

163


సీ.

హంసవర్ణోత్తమహయములఁ బూనిన
                 రథమెక్కి, కాంచనరమ్యయష్టి
సంభృతమకరధ్వజం బొప్ప బద్ధ గో
                 థాంగుళిత్రాణుఁ డై, యతులశాత
సాయకావళిఁ జేసి సాల్వుఁ బిల్చుచు వాని
                 మీఁదఁ బ్రద్యుమ్నుఁ డమేయబాణ
వర్షంబు గురిసిన, వాఁడును వానిపైఁ
                 గడువాఁడిబాణముల్ గడఁగి యేసె;


ఆ.

నధికవీరు లయిన యయ్యిద్దఱకు నస్త్ర
కోవిదులకు బోరు ఘోరమయ్యెఁ;
[105]దద్ద భయము వొంది తద్ద్వారకాపురి
సౌంభకమున జనులు సంభ్రమింప.

164


క.

అనిమొన సాల్వుఁడు ప్రద్యు
మ్ననిశాతశరాలివిద్ధమర్ముం డయి పె
ల్చన మూర్ఛవోయి పడియెం
దనరథముపయిన్ ధరిత్రి దల్లడపడఁగన్.

165


ఉ.

అంతన మూర్ఛదేఱి కలుషానలదీప్తముఖుండు సౌంభకుం
డంతకదండదారుణము లైన శరంబుల రౌక్మణేయు ది
గ్దంతిబలాఢ్యు నేయుడు నతండును మూర్ఛితుఁ డయ్యె; వాని సం
భ్రాంతిఁ దదీయసారథి యపాస్తరణాంతరుఁ జేసెఁ జెచ్చెరన్.

166


వ.

ఇట్లు మూర్ఛితుం డయున ప్రద్యుమ్నుం దోడ్కొని చని రణంబునకు దూరం
బుగా నరదంబు నిలిపికొని దారుకసుతుం డున్నంత నొక్కింత ప్రొద్దునకు మూర్ఛ
దేఱి ప్రద్యుమ్నుండు సూతున కి ట్లనియె.

167


క.

“ఘోరాహవరంగమునకు
దూరముగా నన్ను నిట్లు దోడ్కొని తేరన్
దారుకసుత! నీ కుచితమె?
వీరారంభంబు సూచి వెఱచితె? చెపుమా.”

168


వ.

మరియు సారథిం జూచి విహ్వల[106]మానసుం డయి యి ట్లనియె.

169


క.

“సమరవిముఖత్వమును రణ
విముఖులఁ జంపుటయు, శరణు వేఁడిన రక్షిం
పమియును, యాదవవంశో
త్తము[107]లం దివి గలవె చెపుమ దారకతనయా!

170


క.

విక్రమము విడిచి సమరా
పక్రాంతుఁడ నయిన నన్ను బలదేవుఁడునుం
జక్రధరుండు కుమారులు
నక్రూరాదులును నేమియని నగరె సభన్.”

171


వ.

చెట్ట సేసి; తింక నయినఁ జెచ్చెర సాంబచారుదేష్ణు లున్నచోటికి సాల్వాభి
ముఖంబుగా రథంబు వఱపు” మనిన సారథి యి ట్లనియె.

172


క.

“రథి కిమ్ము గానియెడ సా
రథి [108]ధృతి మెయిఁ గావవలయు, రథియును దత్సా
రథిఁ గావవలయు; రథిసా
రథులు పరస్పరశరీరరక్షకు లగుటన్.

173


ఆ.

సాల్వబాణవిగత[109]సంజ్ఞుఁడ వైన ని
న్నిట్లు దెచ్చితిని సహింపవలయు;
నా రథాశ్వముల, ఘనస్యందనము నిదె
చూడు మనుచు సూతసూనుఁ డపుడు.

174


వ.

సవ్యాపసవ్యచిత్రమండలగతుల నాక్షణంబ సాల్వునకు నప్రదక్షిణంబుగా
రథంబు వఱపిన, దాని సహింపక సాల్వుండు మూఁడమ్ముల సారథి నేసి మఱియు

రాక్షసమాయ ననేకశరంబులు ప్రద్యుమ్న పై నేసిన.

175


క.

అమ్మాయాశరములు భ
గ్నమ్ములుగాఁ జేసి, తన్ముఖమ్మునఁ, దద్వ
క్షమ్మున నొక్కట [110]బ్రహ్మా
స్త్రమ్మును బ్రద్యుమ్నుఁ డేసె దారుణభంగిన్.

176


వ.

ఇట్లు బ్రహ్మాస్త్రపీడితుం డయి సాల్వుండు మూర్ఛవోయి రథంబుపయిం బడిన,
వాని వెండియు నొక్కదివ్యబాణంబు నేయ సమకట్టిన, నంతరిక్షంబున హాహా
రవంబు లెసఁగె; నంత దేవగణప్రేరితు లయిన నారద[111]మారుతులు ప్రద్యుమ్ను
పాలికి వచ్చి యి ట్లనిరి.

177


తే.

“వీఁడు నీచేత వధ్యుండుఁ గాఁడు; మిన్న
కేయ కుండుము; వీని నారాయణుఁడు
మొనసి వధియించు నని పల్కె వనజగర్భుఁ”
డనినఁ బ్రద్యుమ్నుఁ డేయక యనఘుఁ డుండె.

178

సాల్వుఁడు ప్రద్యుమ్నునిచే బాధితుం డై మరలిపోవుట

వ.

అంత సాల్వుండును నివృత్తుం డయి ద్వారకాపురియవరోధం బుడిగి తన సౌంభకం
బెక్కి క్రమ్మఱి చనియె; నంత నీ యజ్ఞంబు నిర్వృత్తం బయిన నే నరిగి బలభగ్నీ
కృతపాదపవనంబులదాని, ననభిజ్ఞాతద్వారదేశంబులదాని, నస్వాధ్యాయస్వాహా
కారమహీసురాగారంబయినదాని, నపేతభూషణయోషిజ్జనంబుల
దాని ద్వారవతిం జూచి యాహుకాత్మజు వలన నంతవృత్తాంతంబును నెఱింగి,
సాల్వుం జంపి కాని యిప్పురంబు సొర నొల్లనని నిశ్చయించి, దీని నప్రమాదు
లరై రక్షించుకొని యుండుండని బలదేవాదులం బంచి, యప్పుడ ప్రయాణభేరి
సఱవం బంచి కృతస్వస్తివచనపురోహితప్రముఖబ్రాహ్మణవరులకు నమస్కరించి
శైబ్యసుగ్రీవంబు లను వాహనంబులం బూనిన దివ్యరథం బెక్కిన.

179


ఆ.

పాంచజన్యరవముఁ, బంచమహాశబ్ద
రవముఁ జెలఁగె దిశలు సెవుడువడఁగ;
నొలసి జనుల దీవనలు మించె; రమ్మమై
గరుడకేతనంబు గ్రాలెఁ జదల.

180


వ.

అ ట్లసంఖ్యాత చతురంగ సైన్యంబులతో నరిగి గిరివనసరోవరసరిద్దేశంబులు
గడచి [112]మూర్తికావతదేశంబున కరుగునంతకు ముందర సాల్వుండు సౌంభకా
రూఢుం డయి సముద్రకుక్షిదేశంబునకుం బోయిన.

181


క.

ఏనును వానిపిఱుందన
మానక చని తచ్చమూసమాజముతోడన్
భూనాథ! రణము సేసితి
నానానిశితాస్త్రవర్షణ[113]వ్యాప్తముగన్.

182


క.

వీరు లగు సాల్వయోధుల
నారాచావళులు గప్పె నారథముపయిన్
[114]సారథిఁ దురంగములపయి,
చారుధ్వజయష్టిపయి నసంఖ్యాతముగన్.

183


వ.

వాని నెల్ల నస్మదీయగోచరంబులు గాకుండ ననేకాయుతశరంబు లేసి సాల్వు

సైన్యంబుతో మహాయుద్ధంబు సేసిన.

184


మ.

అవనీనాథ! తదాహవాంతరమునం దస్మత్కరాకృష్టశార్
ఙ్గవినిర్ముక్తనిశాతసాయకశతాగ్రచ్ఛిన్న మై దైత్యదా
నవదేహప్రకరంబు వాత[115]విధుతార్ణఃపూర్ణసంఘూర్ణితా
ర్ణవకుక్షిం బడియెం గపిప్రవరసైన్యక్షిప్తశైలాకృతిన్.

185


చ.

ఘనతరదైత్యదానవనికాయకళేబరపాతఘట్టనం
దనరి యుగాంత్యకాలచలితంబును బోలెఁ బయోధి మ్రోసె; న
వ్వనధిరవంబుకంటె ననివారిత మై చెలఁగెన్ మదీయవా
హిని భటసింహనాద హయహేషితసింధురబృంహితధ్వనుల్.

186


వ.

అట్టి మదీయ సేనోత్సాహంబును నిజసేనాక్షీణతయుం జూచి సహింపక సాల్వుండు
వెండియు సౌంభకారూఢుం డయి నాతో మాయాయుద్ధంబు సేయ సమకట్టి.

187


సీ.

పరశు పాశాంకుశ కరవాలశూల ము
                 ద్గరములు నామీఁదఁ దెరలఁ [116]గురిసె;
నేనును గడఁగి యద్దానవుశస్త్రముల్
                 వాయంగఁ జేసితి; మాయఁ జేసి
వెఱవక సాల్వుండు వెండియు నామీఁదఁ
                 బరుషశిలావృష్టిఁ గురిసె; వరుస
నమరఁ దమః ప్రకాశములతో దుర్దిన
                 సుదినశీతోష్ణముల్ గదియఁ జేసి;


ఆ.

దితిసుతాధముండు శతసూర్య శతచంద్ర
శతసహస్రవిష్ణుతతులు వెలుఁగ
గగనతలము సేసెఁ బగ లిది రే యిది
యని యెఱుంగనయితి మనములోన.

188


క.

మనుజేంద్ర! సర్వమాయా
పనోదనం బయిన యగ్ని బాణంబున న
[117]ద్దనుజవినిర్మితమాయా
వినివర్తనఁ జేసితిని నవిస్మయమతినై.

189


వ.

అట్టి యవసరంబున ద్వారవతినుండి యాహుకప్రేషితుం డయి యొక్కరుం డతి
త్వరితగతిం బఱతెంచి “సాల్వుచేత నక్కడ వసుదేవుండు పట్టువడియె; నీ వెవ్వని
తోడం గయ్యంబు సేసెదు? క్రమ్మఱి చని పురంబు రక్షించుకొను” మనిన విని
యదరిపడి “మహాబలపరాక్రము లయిన బలదేవాదులు రక్షించుకొని యుండ
వసుదేవుఁ డేల పట్టువడు? నిది పోల” దని సంశయించుచు విమనస్కుండ నయి
యుండునంత.

190


సీ.

పుణ్యకర్మంబులు వొలిసిన నుర్వికి
                 నేతెంచునట్టి యయాతివోలె
భూణషదీప్తులు వొలియంగ వివృతకే
                 శాంబరు డయి సౌంభకంబువలనఁ
బఱదెంచు వనుదేవుఁ బాపనిశాచర
                 బలపీడ్యమాను దవ్వులన కాంచి
యత్యంతమోహశోకాంధుండ నయిన నా
                 హస్తంబు వలన విస్రస్తమయ్యె


ఆ.

శార్జ్గ; మప్రియావసన్న దేహుండ నై
యుడిగి రథముమీఁదఁ బడితి నేను;
దానిఁ జూచి భయము దగిలి మత్సైన్యంబు
దల్లడిల్లి [118]యులిసెఁ బెల్లురేఁగి.

191

వ.

అంత నెంతయుం బ్రొద్దునకుఁ దెలిసి సాల్వుసౌంభకంబున వసుదేవుం గానక,
దాని మాయఁగా నెఱింగి పదంపడి మాయావి యయిన సాల్వుం జూచి, వాని
పయి నలిగి యే సేసిన నయ్యసురయు సౌంభకంబు నదృశ్యం బగుటయు.

192


క.

అసురుల యాక్రోశధ్వను
లెసఁగెం బదిదిశల; నంత నేనును దద్రా
క్షసులఁ గతాసులఁ జేసితిఁ
బ్రసభంబున శబ్దభేదిబాణప్రతతిన్.

193


వ.

అంత సాల్వుండును దన సౌంభకంబుఁ బ్రాగ్జోతిషంబుఁ జేసి తానును [119]దానవుం
డయి పర్వతవర్షంబు నాపయిం గురిసిన.

194


ఆ.

పరుషవిషమభూరిపాషాణభీషణ
గిరులు వచ్చి నన్నుఁ దెరలఁ గప్ప
వజ్రబాణమేసి వాని నన్నింటిని
బాచి యున్న నన్నుఁ జూచి యపుడు.

195


క.

దారుకుఁ డి ట్లనియె “మహా
వీరు ను పేక్షింపఁ దగునె వీనిని మాయా
ప్రారంభు? నుపేక్షింప ర
పారపరాక్రములు పోర; [120]బలియుఁడు వీనిన్.”

196


వ.

అనిన వానిపలుకులు విని యలిగి యనలజ్వాలాకరాళం బయి, ప్రతికూలరాక్షస
యక్షగంధర్వదైత్యదానవభస్మసాత్కరణదారుణం బయిన చక్రంబు నభి
మంత్రించి సౌంభకంబు పయి వైచిన నది యుగాంతకాలపరివేషభీషణం బయిన
రవిమండలంబునుంబోలె గగనంబునం బఱచి సౌంభకమధ్యంబునం బడిన.

197


చ.

తడయక ఘోరదర్శనసుదర్శనపావకుచే దహింపఁగాఁ
బడి పరమేశ్వరోగ్రశరపావకదగ్ధపురత్రయాభ మై
యెడరి ధరిత్రిమీఁదఁ బడియెం జెడి సౌంభక, మంత సాల్వుఁడుం
బడియె మదీయచక్రపటుపాతరయంబున రెండు వ్రయ్యలై.”

198

పాండవులు ద్వైతవనంబునకు వచ్చి యుండుట

వ.

అని యిట్లు సాల్వుం దన చంపిన విధంబు సెప్పి చక్రధరుండు పాండవుల వీ
డ్కొని సుభద్రాభిమన్యులం గాంచనరథం బెక్కించుకొని తోడ్కొని ద్వారవతి
కరిగె; ధృష్టద్యుమ్నుండును బ్రతివింధ్యాతులయిన ద్రౌపదేయులం దోడ్కొని
ద్రుపదుపురంబునకుం జనియె; నిట పాండవులును రథంబు లెక్కి యాయుధం
బులు ధరియించి యింద్రసేనాది మూలభృత్యు లిరువదుండ్రు ముందట రా, ననేకస
హస్రబ్రాహ్మణవరులతో ద్వైతవనంబున కరిగి; రంత ధర్మరాజు తమ్ముల కి ట్లనియె.

199


మధ్యాక్కర.

 “ఇది మహోగ్రాటవి; సింహశరభోరగేంద్రశార్దూల
మదగజాకీర్ణంబు; దీనిలోన నేమఱ కుండవలయు;
నదియునుంగాక పరప్రయోగమాయలు గల; వెఱిఁగి
మది నుండునది” యన్న నన్న కి ట్లను మఘవనందనుఁడు.

200

వ.

బ్రహ్మవిదులును, దపోవృద్ధులైన బ్రాహ్మణులును, నఖిలలోకద్వారంబుల
నప్రతిహతు లయిన నారదద్వైపాయనాది మునివరులును నీచేత నుపాసితులయి
నీ కుశలంబు కోరుచుండుదురు; భవత్ప్రతాపం బెల్ల వారిని రక్షించు; నివ్వనంబు
సకలకాలకుసుమఫలభరితవనస్పతిశాఖాశిఖారూఢ మయూరకీరకోకిలాప
మధురంబును, బకబలాకకోకకారండవసారసరమ్యమధుకరసౌమ్యసరో
వరసంకులంబును, విమలశీతలజలప్రవాహనదీశోభితంబును, మహర్షి గణసేవితం
బును నై యొప్పుచున్నయది; యిందుం డుద” మని లలిత[121]లతావితానాది రమణీ
యంబు లయిన వృక్షమూలంబుల నేవురు వేఱువేఱ నివాసంబులు సేసి నియ
తాత్ము లయి యిష్టంబున దేవపితృకార్యంబులు సేయుచుం దమ్ముఁ జూడ వచ్చిన
మహామునులకు బ్రాహ్మణులకు మనఃప్రియంబు లయిన యాహారంబులు వెట్టుచు
ద్వైతవనంబున నుండు నంత.

201


క.

పాండవుల కడకు ధర్మవి
దుండు తపోదహనదగ్ధదురితౌఘుఁడు మా
ర్కండేయుం డను మునినా
థుం డంతేవాసిగణముతోఁ జనుదెంచెన్.

202


వ.

ఇట్లు వచ్చి వారలచేత నర్చితుండయు వనవాసక్లేశదుఃఖితు లయిన పాండవు
లను ద్రౌపదిం జూచి యమ్మార్కండేయుం డి ట్లనియె.

203


సీ.

“పిత్రునిదేశమ్మునఁ బృథివీశ్వరత్వంబు
                 విడిచి సానుజుఁ డై పవిత్రచరిత
జానకిఁ దోడ్కొని చని వనంబున నున్న
                 రఘుకులనందను రాముఁ దొల్లి
జూచితి; నిపుడు భూసురవంశపోషకు
                 సాధుజనస్తుత్య సత్యధర్మ
నిత్యు ధర్మజు రమణీయకీర్తి ప్రియు
                 శమవంతుఁ జూచితి; సగరభరత


ఆ.

నల యయాతి వైవ్య నాభాగు లాదిగ
నాదిరాజు లెల్ల నధికధర్మ
సత్యయుక్తిఁ జేసి సకలలోకంబులు
వడసి భాగధేయభాగు లయిరి.

204


వ.

పాపసౌబలప్రయుక్తుం డయిన ధార్తరాష్ట్రు నట్లు ధర్మువు దప్పిన వా రెవ్వరును
లేరు; మీరు ధర్మనిత్యులగు సత్యవ్రతులరు గావున మీకిష్టసిద్ధి యగు” నని
మార్కండేయుం డరిగిన నవరసంధ్యోపాసనాసీనుం డయిన ధర్మరాజును, సా
యంహోమార్థప్రజ్వనితజ్వలనంబు లయిన యనేకసహస్రబ్రాహ్మణాగ్నిహోత్రం
బులం జూచి బకదాల్భ్యుం డను మహాముని యి ట్లనియె.

205


ఉ.

“భూమిసురోత్తముల్, ప్రకృతి పుణ్య[122]విధాయులు, వీరు ఋగ్యజు
స్సామపరాయణుల్, పరమసాధుచరిత్రులు మీకు సంతత
ప్రేమమునన్ శుభోన్నతులు వెంచుచు నుండుటఁ జేసి సద్గుణో
ద్దామ యరణ్యవాన మిది దద్దయి నొప్పెడు మాకుఁ జూడఁగన్.

206


వ.

బ్రాహ్మణానుగ్రహంబునం జేసి తొల్లి వైరోచనాదు లనేకకాలంబు లక్షయలక్ష్మీ
విభవు లయి సముద్రనేమిభూచక్రంబు రక్షించిరి; యనిలసహాయుం డయినయగ్ని
దేవుం డరణ్యంబులు దహించునట్లు బ్రాహ్మణసహాయుం డయిన మహీశుండు

శత్రువర్గంబు నిశ్శేషంబు సేయు; వినీతుండయి విప్రులచేత [123]ననుశాసితుం డయిన
రాజునకు నలబ్దలాభాదిత్రితయంబు సంపన్నం బగు; బ్రాహ్మణరహితుం డయి
ధర్మహీనుం డయిన రాజును బ్రజ వలవలదు; ప్రజానురాగంబు లేనివానికి రా
జ్యంబు సుస్థిరంబు గానేరదు; మీరు బ్రాహ్మణప్రియులరు; ధర్మనిత్యుల; రెప్పుడు
ను మీ కభ్యుదయం బగు” నని బకదాల్భ్యుం డరిగినఁ బాండవులుం దమయి
ష్టంబున నుండి దుఃఖోపశమనంబు లయిన కథలు సెప్పుకొనుచున్న యవసరం
బున ద్రౌపది ధర్మరాజున కి ట్లనియె.

207

ద్రౌపదీధర్మరాజుల సంవాదము

ఆ.

“వృద్ధు గొడుకుపలుకు విని [124]క్రూరుఁ డై పాప
బుద్ధిఁ జేసి మిమ్ము భూతలంబు
వెలువరించి రాజ్యవిభవంబు గొని యిప్పు
డలుక సెడి సుచిత్తుఁ డయ్యె నొక్కొ!

208


ఆ.

అద్దరాత్ముహృదయ మది యయఃపాషాణ
నిష్ఠురంబు; ధర్మనిధుల మిమ్ము
నట్లు గొడుకు లెగ్గు లాడంగఁ బోయిన
[125]వల దనండ కలహవాంఛఁ జేసి.

209


సీ.

విమలహర్మ్యంబుల విహరించువారలఁ
                 బ్రియ[126]మహార్హాసనశయనరతులఁ
జందనాగురులిప్తచారుసర్వాంగుల
                 నతవరనాథసేవితుల; మిమ్ము
వనమునఁ గ్రుమ్మరు వారిఁ గాఁ; గుశబృసీ
                 శయనాభిరతులఁ గా; నియతరూక్ష
భూరేణుధూసరీభూతవిగ్రహులఁ గా
                 ద్రుతవన్యమృగనిషేవితులఁ గాఁగ.


ఆ.

నిట్లు సూచి చూచి యే నెట్లు చిత్తోప
శాంతి సేయుదాన? సకలభోగ
విషయవిరతిఁ జేసి విధియును ధృతరాష్ట్రు
నట్లు మీకు నహితుఁ డయ్యె నొక్కొ!

210


క.

భవదాజ్ఞానిగళంబునఁ
దవిలి పరాక్రమము విడిచి ధరణీశ్వర! నీ
యవరజు లిడుములఁ బడి కడుఁ
జివికిరి చెఱఁబడిన సింహశిశువులభంగిన్.

211


ఆ.

పరనరేంద్రమకుటపద్మరాగద్యుతి
నరుణ మగు భవత్పదాబ్జయుగము
[127]పరుషధారుశిలలపై నిప్పు డరుగుట
నరుణ మయ్యెఁ బర్వతాంతరముల.

212


క.

అనవరతసౌఖ్యసంపదఁ
బెనుపొందుచు నుండు మీకు భీకరకాంతా
రనివాసాయాసంబుల
ననఘా! యిబ్భంగి నవయ నలమట వొడమెన్.

213


వ.

నిత్యంబునుం బదివేవురు బ్రాహ్మణులు బ్రాహ్మవిదులు [128]బసిండితళిగల నిష్టాన్నం
బులు గుడిచి తృప్తు లయినం దద్భుక్తశేషం బుపయోగించుచుండు నీకు
వన్యమూలఫలాశనంబు లుపయోగించుచు నన్యులయందుఁ గ్రోధంబు విడిచి
యునికి యుచితంబు గాదు.

214


సీ.

పదివేల గజముల బలమున విలసిల్లు
                 ననిలసుతుండు గాఱడవిలోనఁ

గ్రుమ్మరి, కాయలుఁ గూరలు దిని పేద
                 వడినఁ జూచియు, దీర్ఘబాహుయుగళుఁ
డయ్యును బాహుసహస్రంబు గలిగిన
                 యర్జునుకంటె బలాఢ్యుఁ డగుచు
నేకవేగంబున నేనమ్ము లొక్కయ
                 మ్మేసినవిధమున నేయ నేర్చు


ఆ.

నర్జునుండు వనమృగావలిఁ గలిసి యి
ట్లున్నఁ జూచియును, సుఖోచితాత్ము
లైన కవలు దీను లై యున్నఁ జూచియు
నుపశమంబుఁ దాల్చి యుండఁదగునె?

215


వ.

క్షమయును దేజంబును నయ్యయికాలంబులఁ బ్రయోగింప నేరని రాజునకుం
బ్రజానురాగప్రతాపంబులు లేవను నీయర్థం బితిహాసంబున వినంబడు; క్షమాతే
జంబులలోన నెయ్యది విశేషంబు దానిన నిర్ణయించి చెప్పు మని బలీంద్రుండు దొ
ల్లి తన పితామహుం డయిన ప్రహ్లాదు నడిగిన నాతండు బలీంద్రున కి ట్లనియె.

216


ఆ.

[129]క్షమయ తాల్చి యుండఁ జన దెల్లప్రొద్దుఁ; దే
జంబ తాల్చి యుండఁ జనదు పతికి;
సంతతక్షముండు, సంతతతేజుండు
నగుట దోష మందు రనఘమతులు.

217


వ.

అది యెట్లనిన నిత్యక్షమాన్వితుం డయిన వానికి భృత్యులు వెఱవక యవమానంబు
సేయుదు; రర్థంబులయం దధికృతు లయిన వారలు ధనంబు లపహరించి దర్పంబు
సూపుదురు; మఱి నిత్యతేజోధికుం డైనవాఁ డతిక్రూరదండంబున సర్వజనసంతాపం
బు సేయుచు గృహగతం బైన సర్పంబును బోలె నెప్పుడు నుద్వేగకరుం డగుం; గా
వునఁ గాలోచితంబులుగా క్షమాతేజంబులు గల్పించునది; యథాకాలకల్పితక్షమాతే
జుం డైన వానికి నుభయలోకసిద్ధి యగు; నని బలీంద్రప్రహ్లాదసంవాదంబు సెప్పి
వెండియు ద్రౌపది యి ట్లనియె.

218


తే.

[130]ఆది నపరాధ మొక్కటి యైన నదియు
నల్ప మైనను క్షమియించు నదియుఁ గాక;
చెనసి యుపరాధములు పెక్కు సేయుచున్న
పాపకౌరవ్యులకు సహింపంగ నేల?

219


క.

ఇది తేజంబున కవసర
ముదితక్రోధుండ వగుమ యొక్కించుక; దు
ర్మదు లగు సుయోధనాదుల
నదయుల వధియింతు రుగ్రులై [131]నీ తమ్ముల్.”

220


వ.

అనిన ధర్మరా జిట్లనియె.

221


సీ.

“క్రోధంబు పాపంబు; గ్రోధంబుననచేసి
                 యగుఁ జువ్వె ధర్మకామార్థ హాని;
గడుఁ గ్రోధి గర్జంబు గానండు; క్రుద్ధుండు
                 గురునైన నిందించుఁ; గ్రుద్ధుఁ డైన
వాఁ డవధ్యులనైన వధియించు; మఱి యాత్మ
                 ఘాతంబు సేయంగఁ గడఁగుఁ గ్రుద్ధుఁ;
డస్మాదృశులకు ధర్మానుబంధుల కిట్టి
                 క్రోధంబు దాల్చుట గుణమె చెపుమ?

ఆ.

యెఱుక గల మహాత్ముఁ డెఱుక యన్జలముల
నార్చుఁ గ్రోధ మను మహానలంబు;
గ్రోధవర్జితుండు గుఱుకొని తేజంబు
దాల్చు దేశకాలతత్త్వ మెఱిఁగి.

222


క.

క్షమ గలవానికిఁ బృథ్వీ
సమునకు నిత్యంబు [132]విజయసంసిద్ధి యగున్;
క్షమియైన వాని భుజవి
క్రమము గడున్ వెలయు సర్వకార్యక్షమ మై.

223


వ.

తేజఃప్రభవంబు లైన యమర్ష దాక్షిణ్య శౌర్య శీఘ్రత్వంబు లను నాలుగు
గుణంబులు క్షమావంతునంద వీర్యవంతంబు లగుఁ; దొల్లి కశ్యపగీత లైన
గాథలయం దీయర్థంబు వినంబడు; వినుము; వేదంబులు, యజ్ఞంబులు,
శౌచంబును, సత్యంబును, విద్యయు, ధర్మువు సచరాచరం బయిన జగ
మంతయు క్షమయంద నిలిచినవి; తపస్స్వాధ్యాయయజ్ఞకర్తలయు, బ్రహ్మ
విదులయుం బడయు పుణ్యగతులు క్షమావంతులు వడయుదు; రదియు
నుం గాక కృష్ణద్వైపాయన బీష్మ విదుర కృప ద్రోణ సంజయ ప్రభృతులు నా
యుపశమంబ కీర్తింతు; రుపశమహీనుం డయిన దుర్యోధనుకారణంబున
ధార్తరాష్ట్రుల కెల్లం బ్రళయం బగు” ననిన ద్రౌపది వెండియు ని ట్లనియె.

224


మధ్యాక్కర.

క్షమయంద చిత్తంబు నిల్పి నిర్గతకల్మషబుద్ధిఁ
గ్రమమున ధర్మువునంద వర్తిల్లు కరుణాత్ము నిన్ను
నమరధర్మంబు [133]రక్షించుఁ బ్రీతితో నని శత్రులందు
సమబుద్ధి సేయంగఁ జనునె? నీకు నజాతశత్రుండ!

225


ఆ.

ధర్మదూరు లైన ధార్తరాష్ట్రులయందు
ధర్ము వేమి సేయు? ధరణినాథ!
నికృతిపరులయందు నికృతి సేయనివారు
వారి నికృతిఁ జేసి వధ్యు లండ్రు.

226


క.

ఆర్యులకు విహీనతయు, న
నార్యుల కున్నతియుఁ జేసి యవినీతుఁడ వై
కార్యము దప్పితి; నీకు న
నార్యులు చుట్టములె? యార్యు [134]లరులె? విధాతా!

227


వ.

అని విధాతృని ధర్మువు నాపేక్షించు ద్రౌపదిం జూచి ధర్మరా జిట్లనియె; నాస్తి
కుల యట్లు ధర్మాభిశంకినివై దైవదూషణంబు సేసెదు; శిష్టచరితం బయిన
ధర్మంబు [135]నధిక్షేపించుచున్న దుర్మతికిం బ్రాయశ్చత్తంబు లేదు; ధర్మువు
దప్పక నిత్యులై జీవించుచున్న మైత్రేయ మార్కండేయ వ్యాస వసిష్ఠ నార
ద ప్రభృతులం బరమ యోగధరులం బ్రత్యక్షంబ చూచెదము; వీరెల్ల నన్ను
ధర్మపరుం డని మన్నింతు; రన్యు లన్యాయంబు సేసి రనియు నే నేల
ధర్మువు దప్పుదు?

228


క.

ధీరమతియుక్తిఁ జేసి వి
చారింపఁగ నిక్కువంబు సర్వజనస్వ
ర్గారోహణసోపానం
బారఁగ ధర్మంబ చూవె యతిరమ్యం బై.

229


వ.

తపస్స్వాధ్యా బ్రహ్మచర్యదానధర్మయజ్ఞంబు లను పుణ్యకర్మంబు లఫలంబు
లగునేని వీని నేల [136]ఋషిగణంబులు సేవింతురు? నీ జన్మంబును, ధృష్టద్యమ్ను

జన్మంబును బుణ్యకర్మఫలసద్భావంబునకు నిదర్శంనంబులు గావె? మఱి పుణ్య
కర్మఫలంబులు గలయట్ల పాపఫలంబులును గలవు; తొల్లి బ్రహ్మ దన పుత్రుల
కుం గర్మఫలసద్భావంబు సెప్పె; నందుఁ గశ్యపుండు ధర్మప్రబోధనంబునం
జేసి పుణ్యఫలప్రాప్తుం డయ్యె; విధాతృనియోగంబునం బుణ్యపాపఫలంబు సంప్రా
ప్తం బ;గు విధాతృ ననుగ్రహంబునన కాదె పుణ్యకర్మంబులు ప్రవర్తించి [137]మర్త్యు
లమర్త్యత్వంబును బొందుదు” రనిన విని ద్రౌపది యి ట్లనియె.

230


ఆ.

[138]కర్మఫలము లేదు; కర్మఫలాప్తికిఁ
గారణంబు విధియుఁ గా దనంగ
నంత యెఱుక లేనె? యార్తనై విధి చెయ్ది
కలసి పలికితిం బ్రియంబుదప్పి.

231


ఆ.

వేదశాస్త్రములును విధివిధానములును
నప్రమాణ మను దురాత్మకులకుఁ
బుణ్యగతులు లేమి భూనాథ! యెఱుఁగని
దానఁ గాను ధర్మతత్త్వయుక్తి.

232


వ.

తొల్లి నీతిమంతు లయిన బ్రాహ్మణులు మదీయజనకునకుం జెప్పంగ వింటి; నెఱు
క గలవారికిం గర్మంబు గర్తవ్యంబు; గర్మరహితు లయి స్థావరంబుల యట్లు జను
లు జీవింప నేర; రల్పఫలంబు నైనను గర్మంబుఁ బ్రవర్తించుచున్నవారిం
జూచెదము; దైవమానుషంబులు గర్మఫలప్రాప్తికి నిమిత్తంబులు; పురుషుం
డు మనంబున నర్థసిద్ధి నిశ్చయించి కర్మంబునందుఁ గృతోత్సాహుండు గా
వలయు; నట్టివారికి దైవంబు సహాయం బయి కర్మసిద్ధి గావించు.

233


మధ్యాక్కర.

తిలలందుఁ దైలంబు, గాష్ఠములయందుఁ దిరముగా నగ్ని
గలుగు టెఱింగి యుపాయపూర్వము గడఁగి తత్సిద్ధి
యలయక యుత్సాహవంతుఁడు వడయు న ట్లనుత్సాహ
మొలసి దైవపరుఁ డిది వడయంగను నోపునె యెందు!

234


మధ్యాక్కర.

కడు నిమ్ముగా దున్ని బీజములు సల్లి కర్షకుం డున్నఁ
దడయక వర్షంబు గురిసి కావించుఁ దత్ఫలసిద్ధి;
నడుమఁ బర్జన్యుఁ డనుగ్రహింపనినాఁ డేమి సేయుఁ?
గడఁగి చేయం గలవానిఁ జేయును గాక కర్షకుఁడు.

235


వ.

కర్మఫలంబులు దైవమానుషసిద్ధంబు లయిననుం బురుషోత్సాహసముపార్జితం
బు లయిన నవి సుస్థిరంబు లయి సురక్షితంబు లయి వర్తిల్లు; [139]ననీహమానుం డయు
దైవపరుం డయినవాఁడు నీరిలోని యానపాత్రంబునుబోలె నవసన్నుండగుం;
గావునఁ గర్మఫలసిద్ధి నిశ్చయించి యుత్సాహవంతుండ వయి నీ యనుజుల పరా
క్రమంబునం బరుల జయించి మనయందలి యర్థకృశత్వం బపనయింపు” మనిన
యాజ్ఞసేని వచనంబుల కనుగుణంబుగా భీమసేనుండు ధర్మరాజున కి ట్లనియె.

236

భీమసేనధర్మరాజుల సంవాదము

మ.

పితృపైతామహ మైన రాజ్య [140]మరినిర్భేద్యంబు, గాండీవిచే
నతిగుప్తంబు బలారి కైనను నహార్యం; బిట్టిదానిన్ సుదు
ర్మతి నన్యార్థము సేసి నీకుఁ జనునే మర్త్యేశ! యుగ్రాటవిన్
వ్రతముల్ సల్పుచు ధర్మలేశచరణవ్యాసక్తి నిట్లుండఁగన్?

237


క.

ఆమిషము సింహములచే
గోమాయువు గొన్నయట్లు కువలయరాజ్య
శ్రీ మనచేఁ గొని కౌరవుఁ
డే మని తలఁచు నొకొ బుద్ధి నిష్టులుఁ దానున్.

238


క.

దుర్మతులను దుర్జనులను
ధర్మస్థితి నోర్వఁ దగునె? ధరణీశ్వర! దు
ష్కర్ము లగు ధార్తరాష్ట్రుల
పేర్మి [141]యడంగింపఁ గడఁగు పృథుభుజశక్తిన్.

239


వ.

ధర్మకామప్రభవం బయి సర్వార్థసాధనం బయిన యర్థంబు విడిచి మిత్త్రుల కప్రి
యంబు, నమిత్త్రులకు హర్షంబునుంగా మునివృత్తిం జేకొని ధర్మువు ధర్ము వనుచు
[142]ధర్మువునందు చిత్తంబు నిలిపి దుర్బలునట్లు నిర్వేదింపఁ దగునె?

240


ఆ.

బాహుబలము మెఱసి పరుల సంపదలు సే
కొనఁగ లావు లేని కుత్సితుండు
నియతదుఃఖవృత్తి [143]నిర్వేదపరుఁ డగుఁ
గాక! నీకుఁ దగునె? కౌరవేంద్ర!

241


చ.

నరసుత! నీ యనుజ్ఞఁ గొని, నాఁడ విరోధుల నెల్ల బోరిలో
సరభసవృత్తి నుక్కడఁగఁ జంపితిమేని మహోగ్రకాననాం
తరముల నుండకుండ, నతిదారుణదుర్మృగసంగమంబునం
[144]బొరయక యుండఁగా మనకుఁ బోలు నమందమనఃప్రియంబుగన్.

242


క.

సమయాతిక్రమభీతిని
క్షమాయుతుల మైన మనలఁ గౌరవులు పరా
క్రమహీనులుగాఁ దలఁతురు
సమరోత్సాహంబు విడిచి [145]జడమతి నున్నన్.

243


తే.

తగిలి నిత్యంబు నేకాంతధర్మనిరతుఁ
డగుట యుక్తమె పురుషున? కట్టివాని
వెలయ నర్థకామంబులు విడుచుఁ బ్రాణ
విగతు సుఖదుఃఖములు రెండు విడుచునట్లు.

244


సీ.

ధర్మకామంబులు దఱుగంగ నర్థార్థి
                 యగువాఁడు పతితుఁడౌ, [146]నర్థసేవ
నర్థార్థముగఁ జేయు నతఁ డుగ్రవనములో
                 గోరక్ష సేయు నక్కుమతిఁ బోలు;
నర్థధర్మములకు హానిగాఁ గామార్థి
                 యగునాతఁ డల్పజలాశయమున
జలచరం బెట్టు లజ్జలములతోఁ జెడు
                 నట్లు కామంబుతో హానిఁ బొందు;


ఆ.

నర్థధర్మములు మహాబ్ధిమేఘములట్టు
లుభయమును బరస్పరోదయమ్ము;
లిట్లుఁ గాఁ ద్రివర్గ మెఱిఁగి సామ్యమున సే
వించువాఁడు సర్వవిత్తముండు.

245


వ.

భవదాచరితం బైన యీ ధర్మం బర్థకామంబులక కాదు, నీకును, నీ బాంధవుల

కును [147]బాధాకరంబు; దానయజ్ఞసత్పూజలు గావింప నర్థహీనున కశక్యంబు;
జగంబులు ధర్మమయంబులు; ధర్మువునకు మిక్కిలి యొం డెద్దియు లే; దయినను
నర్థార్థంబు గాని ధర్మువు క్షత్త్రియుల కయుక్తంబు.

246


ఉ.

శత్త్రుల నాజి నోర్చుటయు, సర్వభయంబులఁ బొంద కుండఁగా
ధాత్త్రిఁ బరిగ్రహించి యుచితస్థితిఁ గాంచుటయుం, బ్రియంబుతోఁ
బాత్త్రుల కర్థ మీగియును, బ్రాహ్మణపూజయుఁ జువ్వె యుత్తమ
క్షత్త్రియధర్మముల్, సుగతికారణముల్, విపులార్థమూలముల్.

247


వ.

కేవల ధర్మాచరణంబు శత్రుజయంబునకు సాధనంబు గాదు; [148]నికృతి వలయుఁ;
బూర్వభ్రాతలైన యసురుల నమరులు నికృతిన కాదె నిర్జించిరి; కావున నీవు
సమయధర్మరక్షణవ్రతం బుడిగి శత్రువుల జయింప నుద్యోగింపుము.

248


క.

జయశీలి వైన నీకుం
బ్రియ మొనరింపంగ నున్న పృథుయశులు ముదా
శ్రయు లగుదురు సృంజయ కే
కయ యదు పాంచాలురాదిగాఁ గల సుహృదుల్.

249


తే.

మిత్రసంపన్నుఁ డైన నమిత్త్రు మిత్త్ర
బలముతోడ భేదించి, దోర్బలముఁ జలముఁ
గలిగి దేశబలంబును గాలబలముఁ
గలుగువాని కసాధ్యంబు గలదె? యెందు.

250


తే.

బలము గలవానిఁ బలువురు బలవిహీను
లొక్కటై కూడి నిర్జింతు రుత్సహించి;
మధువుఁ గొన నుత్సహించిన మనుజుఁ బట్టి
కుట్టి నిర్జించు మధుకరకులము నట్లు.

251


వ.

[149]శ్వదృతియందలి దుగ్ధంబునుం బోలె దుర్యోధను రాజ్యంబు దూష్యం బగుటఁ
బౌరజానపదబ్రాహ్మణవరులు నీ కనురక్తు లయి భవద్రాజ్యంబ వలచి యుండు
దురు; దీని నేల యెడ సేసెదు? సర్వాయుధసనాథం బైన రథం బెక్కి గజపురం
బున కభిముఖుండ వై విజయప్రయాణంబు సేయుము[150].

252


మ.

ప్రణుతక్షాత్త్రగుణంబు, విక్రమము, దర్పం బేర్పడన్ విక్రమ
క్షణదానం బొనరింపు మీక్షణమ; విఖ్యాతంబుగా సంగరాం
గణమధ్యంబునఁ జేయు మర్జునబృహద్గాండీవనిర్ముక్తమా
ర్గణధారావళి ధార్తరాష్ట్రకదళీకాంతారవిచ్ఛేదమున్.

253


క.

[151]బహురథగజవాహనభట
సహితులు బలవంతు లని విచారింపకు నీ
యహితులు; మద్బాహుగదా
నిహతికి మార్కొనఁగఁ బోర నిలువంగలరే?

254


క.

అరివరుల నోర్చి సాగర
పరివృతభూచక్ర మెల్లఁ బాలింపు; ప్రజా
పరిపాలనంబు కంటెను
ధరణీశ! విశేష మొండు ధర్మువు గలదే.

255


వ.

రాజ్యపదస్థుం డైన క్షత్త్రియుండు భూరిదక్షిణంబు లైన యజ్ఞంబుల [152]దేవబ్రాహ్మ
ణులం దృప్తులం జేసి, బ్రాహ్మణులకు నగ్రహారంబులు గోసహస్రంబులు నిచ్చి,

దురితంబు వలనం బాసి, తమోవిముక్తుం డైన చంద్రుండునుబోలె వెలుంగు”
ననిన భీమసేనునకు ధర్మరా జి ట్లనియె.

256


ఉ.

“నీ వచనంబు ధర్మ్యము, వినీతము [153]నీతియుతంబు నిష్టసి
ద్ధ్యావహ, మత్యుదార మిది; యైనను నిప్డు దలంపఁగా విచి
రావసరాప్తికిన్ విషయ మైనది; కార్యఫలంబు లెల్ల స
ద్భావమునన్ విచారసులభంబుల యండ్రు విచారపారగుల్.

257


క.

వనమునఁ బండ్రెం డేండ్లును
జనపదమున నెఱుఁగ కుండ సరి నొక వర్షం
బును [154]జలుపఁ బూని సత్యము
దనరఁగఁ జేసితిఁ బ్రతిజ్ఞ దగ వృద్ధసభన్.

258


చ.

అలఘుగుణంబులం దధికుఁ డైన మహాత్ముఁడు [155]రాగకోపమా
యలఁ బడి, యక్షమావివశుఁ డై, యచిరాంశులతావిలాసచం
చల మగు లక్ష్మి కాసపడి, సత్యము ధర్మువుఁ దప్పి, సత్సభా
వలిఁ దగువారియొద్దఁ దగువాఁ డయి సద్విధి నుండ నేర్చునే?

259


వ.

ఏ నెట్లును సత్యసమయం బతిక్రమింప నోప; [156]శుభోదయకాలంబుఁ బ్రతీక్షించి
యుండుము; రాజ్యంబులుఁ, బుత్త్రులును, ధనంబును, యశంబును, సత్యంబునకు
సమంబులు గా” వనిన భీమసేనుం డి ట్లనియె.

260


ఆ.

అంతకుండు జనుల కాసన్నుఁ డై యుండ
నిమిష మాత్రమేనని నిశ్చయింపఁ
దగని జీవనంబు దద్ద సుస్థిరముగాఁ
జేసి కార్య మెడయుఁ జేయఁ దగునె?

261


వ.

శరీరికి మరణంబు నియతంబు; మరణంబునకు ముందర వైరంబు దీర్పనివాని
జన్మంబు నిరర్థకంబు; సకలరాజసమక్షంబునం బరులచేత నట్లు మన పడిన పరి
భవంబునకుం బ్రతీకారంబు సేయునంతకు రేయునుం బగలును నా హృద
యంబు దపించుచుండు; నాకంటె నర్జున నకుల సహదేవులుం, గుంతీదేవియు
నంతస్తాపంబున నెంతయు సంతప్తు లగుచున్నవారు.

262


క.

వీరల దుఃఖము దీర్పక
[157]క్రూరనికారులగు రిపులకును ముదముగ ను
గ్రారణ్యములో ధర్మువుఁ
గారుణ్యముఁ దాల్చి యునికి కార్యమె నీకున్!

263


వ.

ఇది బ్రాహ్మణధర్మంబు గాని క్షత్త్రియధర్మంబు గాదు; మనుప్రణీతంబులైన రాజ
ధర్మంబులు నీ యెఱుంగనియవి లేవు; [158]శత్రుసంహారంబు సేయనినాఁ డత్యంత
హాని యగు; నట్లుం గాక.

264


తే.

వనమునందుఁ బండ్రెండుసంవత్సరంబు
లుండ నేర్చితిమేనియు, నొరు లెఱుంగ
[159]కుండ నజ్ఞాతచర్యయం దొక్కదివస
మైన నుండఁగ నేర; మె ట్లనిన వినుము.

265

వ.

ఆబాలవృద్ధప్రసిద్ధుండ వై పార్థివసూర్యుండ వైన నిన్నును, సిహసదృశులైన
నీ తమ్ములను నెఱుఁగని వారు లేరు; మన గూఢభావంబు మేరువు నిగూఢభావంబు
నుం బోలె నఘటమానం; బిట్లేని నివ్వనవాసక్లేశం బెన్నఁడును మనకుఁ బాయ నేరదు;
మన మిప్పు డివ్వనమునఁ బదుమూఁడుమాసంబులు సలిపితిమి; సంవత్సరప్రతినిధిగా
మాసంబులు సేసికొనుట యెందునుం గలయదియ; దీన ధర్మవిరోధంబు లేదు; విజ
యారంభంబున కిది యవసరం” బనిన భీమసేను పలుకులు విని [160]నిశ్వాసవ్యాకులిత
ముఖుం డై పెద్దయుం బ్రొద్దు చింతించి ధర్మరా జి ట్లనియె.

266


క.

“క్రమమునఁ బాండిత్యపరా
క్రమ[161]గర్వములందుఁ గడుఁ బ్రగల్భుండవు; మ
ధ్యమ! నీ చెప్పినయది కా
ర్యమ యయినను ధీరబుద్ధివై విను మనఘా!

267


వ.

[162]అల్పీయం బైన కార్యంబు సాహసారబ్ధం బైనను దోషంబు లే; దిది మహా
కార్యంబు; సాహసక్రియాసాధ్యంబు గాదు; సువిచారితం బై సిద్ధిం బొందు;
విచారపూర్వారబ్ధకార్యంబునకు దైవంబులు ననుకూలం బగుం; గావున
నిమ్ముగా విచారింపవలయును.

268


సీ.

శూరులు [163]ధృతరాష్ట్రుసుతులు దుర్యోధనా
                 దులు దురాధర్షు లందొఱును మనకు
నాతతాయులు; మఱి యంగభూభుఁడును
                 భూరిశ్రవుఁడు శలభూమిపతియు
నాదిగాఁ గలవీరు లవిజేయవిక్రము
                 లొలసి తత్సుహృదులై యున్నవారు;
మనచేత జితు లైన మనుజేశు
                 లెల్లను జని సుయోధని చేత సత్కరింపఁ


ఆ.

బడి, కడంగి వాని ప్రస్తవంబున నాజి
వేచి ప్రాణములను విడువ నున్న
వారు; వార లెల్ల వసుధఁ బ్రసిద్ధులు
వినఁగ నస్త్రశస్త్రవిద్యలందు.

269


క.

వినవయ్య కర్ణుగర్వం
బని నాతఁ డభేద్యకవచుఁ డగుటయు విలునే
ర్పును, నతని బాహువిక్రమ
మును దలఁచిననాఁడు గన్ను మూయదు నాకున్.

270


వ.

మఱియు భీష్మద్రోణకృపాచార్యులు సము లయ్యును వారియొద్దన యున్నవారు;
వార లపారదివ్యాస్త్రవిశారదులు; వారల నోర్చి కాని దుర్యోధను నిర్జింపం
బోల” దని విచారించు సమయంబున.

271

కృష్ణద్వైపాయనుఁడు ధర్మరాజునొద్దకు వచ్చుట

క.

వారలపుణ్యోదయమున
వారిజభవనిభుఁడు లోకవంద్యుఁడు వచ్చెం
బారాశర్యుఁడు, ధర్మశ
రీరుఁడు [164]గృష్ణాజినోత్తరీయుఁడు ప్రీతిన్.

272


వ.

ఇట్లు వచ్చి పరమభక్తిపరులైన పాండవులచేతం బూజితుం డై కృష్ణద్వైపాయ
నుండు ధర్మరాజున కి ట్లనియె.

273

క.

“వీరు లగు భీష్మకుంభజ
శారద్వతకర్ణు లమితసత్త్వులు; వారిం
బోర వధియుంచు టెంతయు
భారం బని యున్న నీదు [165]భర మెఱిఁగి మదిన్.

274


ఆ.

దాని నపనయింపగా [166]నిప్డు వచ్చితి;
నధికయోగలబ్ధ మతిరహస్య
మీవిశేషవిద్య సేవింపఁగాఁ బార్థుఁ
బనుపు; మితఁడు దీనఁ బడయు సిద్ధి.”

275


వ.

అని ధర్మతనయు నేకాంతప్రదేశంబునకుం దోడ్కొని చని సత్యవతీసుతుండు
విధిదృష్టవిధానమునం బ్రతిస్మృతి యను విద్య నుపదేశించి “దీనిశక్తి నర్జునుం డధిక
తపోవీర్యవిభవుం డై యింద్రయమవరుణకుబేరాదిదేవతలను, నీశ్వరునిఁ బ్రత్య
క్షంబు సేసికొని, వారలవలన దివ్యాస్త్రంబులు వడసి శత్రువుల జయించు; మఱి
యివ్వనంబు భవచ్చిరనివాసనంబునం చేసి విరళఫలకుసుమపాదపంబై మృగకు
లోపరోధియై యొప్పకున్నయది; యొక్కచోటన పెద్దకాలం బునికి యెవ్వరికిం
బ్రీతిజనకంబు గాదు; కావున నొండువనంబున కరుగునది” యని చెప్పి యమ్ముని
వరుం డరిగినఁ దద్వాక్యముదితు లై ద్వైతవనంబుఁ బాసి పాండవులు బ్రాహ్మణ
వరులతోన కామ్యకవనంబున కరిగి సరస్వతీతీరంబునందు నివాసంబు సేసి కొం
డొకకాలం బుండ నొక్కనాఁ డజాతశత్రుం డర్జునుఁ జూచి యి ట్లనియె.

276


క.

“సాదితశాత్రవు లగు భీ
ష్మాదులయం దధిగతాశ్రయం బయ్యె [167]జతుః
పాదం బగు చున్న ధను
ర్వేదము; బ్రాహ్మణులయందు వేదమపోలెన్.

277


వ.

[168]అయ్యది మహనీయం బయి, దివ్యమంత్రకలితం బయి, వారలకు సన్నిహితం
బగుఁ గావున.

278


క.

వారలు దుర్యోధనుచే
నారాధితు [169]లిష్టసత్క్రియల; నగుట రణ
ప్రారంభ మయిన నెదిరెడు
వార పరాక్రాంతు లై యవశ్యము మనతోన్.

279


వ.

దివ్యాస్త్రవిదులైనవారల నోర్చునట్టి యుపాయంబు గృష్ణద్వైపాయనుండు ప్రసా
దించె; నీవిద్య నీవు ప్రతిగ్రహించి కవచకార్ముకప్రాసఖడ్గధరుండవై య
న్యుల కజేయుండవై, యుత్తరదిక్కున కరిగి తపోయోగబలంబున నింద్రుఁ
బ్రత్యక్షంబు సేయుము; తొల్లి వృత్తునకు వెఱచి వేల్పులు తమ యాయుధం
బులు, బలంబులు నింద్రునకు సమర్పించి; రవి యెల్ల నీకుఁ దత్ప్రసాదంబున
నగు; మఱి యింద్రు నుపదేశంబున నీశ్వరు నారాధించి తదనుగ్రహంబున నిష్ట
సిద్ధి వడయు; మిది వేదవ్యాసు నుపదేశం” బని.

280


క.

[170]ధృతినియమవ్రతునకు, దీ
క్షితునకుఁ బార్థునకు విగతకిల్బిషునకు ధ
ర్మతనూజుఁడు ప్రీతిఁ బ్రతి
స్మృతి నుపదేశించెఁ దా నమిత్రజగీషన్.

281


వ.

అర్జునుండును నయ్యోగవిద్యాగ్రహణప్రభావంబున నధికతేజోమూర్తియై

దివ్యాస్త్రలాభార్థం బగ్రజుచేత ననుజ్ఞాతుం డై విధివిహితహోమసంతర్పితవీతి
హోత్రుండును బ్రాహ్మణకృతస్వస్త్యయనుండును నై ధౌమ్యాదిమహీసురవరు
లను భ్రాతృవరులను వీడ్కొని తపంబున కరుగ సమకట్టిన.

282


సీ.

అతని గాండీవహస్తు నక్షయబాణ
                 తూణీరయుగళు నుత్తుంగభుజునిఁ
[171]గనకవర్మావృతఘనతరతనుఁ జూచి
                 పొంగి యంతర్హితభూతములును
బ్రాహ్మణప్రవరులుఁ బార్థుని మనమునఁ
                 దలఁచిన యర్థంబు దడయ కిష్ట
సంసిద్ధి యయ్యెడు; సర్వవిఘ్నములును
                 శాంతిఁ బొందెడు; మని సంతసమునఁ


ఆ.

బలికి; రంతఁ దరుణి పాంచాలి బీభత్సు
కడకు నరుగుదెంచి; కమలనేత్ర
యరిజయార్థ మరుగు నాతని యుత్సాహ
మెఱిఁగి యిట్టు లనియె నిందువదన.

283


క.

[172]అవమానాసహ మగు నీ
యవమక్షత్త్రియకులంబునం దిం కిట పు
ట్టువు గా కుండెడు; సత్క్షమ
మవు బ్రాహ్మణకులమునంద యయ్యెడు నాకున్.

284


చ.

అరికృతదుష్పరాభవమహార్ణవమగ్నుల మమ్ము నందఱం
గరుణ సముద్ధరింపుము; జగన్నుత! యన్యులు పూనఁ గాని యీ
భరము వహింపఁ బూనిన యపార[173]గుణాన్వితు నిన్ను దిక్కులన్
ధరణియు, సోముఁడున్, నభము, ధాత్రియు, గాడ్పును గాచుచుండెడున్.

285


వ.

అని దీవించి పాంచాలరాజపుత్త్రి దన స్నేహలాలసవిలోలాపాంగవిలోకనం
బులం బార్థుఁ [174]బరిగృహీతపాథేయుం జేయుచుఁ, దద్వియోగతరళం బైన హృ
దయం బెట్టకేనియు నొక్కింత సేసికొని యుండె; మఱి పార్థుఁడునుం బూర్వో
త్తరదిశాముఖుం డై యొక్కరుండ యరిగి యైంద్ర యోగశక్తి నిఖిలభూతదు
ర్నిరీక్ష్యుం డగుచు హిమశైల గంధమాదనంబుల నతిక్రమించి.

286


ఉ.

వీరుఁడు యోగవిద్యయును, విల్లును దోడుగ నింద్రకీల మన్
[175]భూరినగంబుపైఁ గడఁగి పోవఁగఁ బోయినఁ, “బోవ కుండు ము
గ్రారివిభేది నీ” వను మహామధురధ్వని వించె వానికిన్;
బోరన నంతరిక్షమునఁ బొల్చె నిరంతరపుష్పవృష్టియున్.

287


వ.

దానికి విస్మయం బంది చనువాఁడు ముందట నొక్కవృక్షమూలంబున నున్న వృ
ద్ధబ్రాహ్మణు, బ్రహ్మతేజోధికు, నవిరతయమనియమకృశీభూతశరీరుం గని నమస్క
రించి తత్సమీపంబున విశ్రమించియున్న నప్పార్థుం జూచి బ్రాహ్మణు డి ట్లనియె.

288


క.

ఎందుండి వచ్చి [176]తయ్య? య
నిందితతేజుఁడవు ధర్మనియతుండవు; నీ
కిం దుండ నేల? సిద్ధిం
బొందితి; చేకొను మభీష్టభూరిఫలంబుల్.

289


క.

ఇది శాంతతపస్వుల సా
స్పద; మిందుఁ గృపాణకవచబాణాసనసం

పద దాల్చి యుండ నేటికి?
విదితక్షత్రియకులుండవే నీ వనఘా!

290


వ.

వీతహర్షక్రోధు లైన బ్రాహ్మణు లుండెడు పుణ్యనివాసంబున నాయుధంబులు
ధరియించి యుండవలవదు! వీని విడువు” మని [177]నిషేధించిన నవ్విప్రువచనంబుల
కు సంచలింపకయున్న యాతని ధైర్యంబునకు మెచ్చి సహస్రాక్షుండు నిజరూ
పంబుఁ జూపి యతని కి ట్లనియె.

291


ఆ.

“ఇష్టమైన వరము లిచ్చెదఁ బ్రీతితో
వేఁడు“ మనిన సమరవిభున కపుడు
గరము భక్తి మ్రొక్కి కరములు మొగిచి యి
ట్లనియెఁ బురుషవృషభుఁ డర్జునుండు.

292


వ.

“దేవా! నాకిష్టంబైన వరంబు భవత్ప్రసాదంబున దివ్యాస్త్రలాభం“ బనిన “నది
యేమి గహనంబు? దానిన యిచ్చెదఁ; బుణ్యలోకంబులు, దేవత్వంబును, సర్వకా
మంబులు వేఁడు“ మనిన నర్జుడుం డి ట్లనియె.

293


సీ.

“దివిజాదినాథ! నా కవి యెల్ల నేటికిఁ?
                 బరమాస్త్రలాభంబ కర మభీష్ట;
మరులు సేసిన మహాపరిభవక్లేశంబు
                 వాపంగ నోపక యేపు టడవి
నురుదుఃఖితుల సహోదరుల నందఱఁ బెట్టి
                 చనుదెంచి, మిన్నక చనిన నన్నుఁ
దగువారు జగములోఁ దెగడరే?“ నావుడు
                 సుతునకుఁ బ్రీతుఁ డై శతమఖుండు


ఆ.

గరుణ నిట్టు లనియెఁ “బరమాస్త్రలాభంబు
నీకు నిష్టమేని లోకవంద్యు
గరళకంఠు, నీశుఁ, బరము, బ్రసన్నుఁగా
వేగ చేయు మధికయోగశక్తి.

294


వ.

అట్లేని నిఖిలలోకపాలసహితుం డై యీశ్వరుండు నీయభిమతం బొనరించు“ నని
సహస్రలోచనుండు లోచనాగోచరుం డైన నర్జునుండును దద్వచనంబున సమా
హితచిత్తుం డై హిమశైలశిఖరంబున కరిగి వివిధకుసుమఫలవృక్షంబులను, విమల
నిర్ఝరజలంబులను, గమలకుముదకల్హారకలహంససంకులపంకజాకరంబులను ర
మ్యంబైన తపోవనంబునందుఁ బరమేశ్వరు నుద్దేశించి తపంబు సేయం దొడంగిన.

295


క.

సురదుందుభినాదంబులు
సురపాదపసంభవప్రసూనసుగంధో
[178]త్కరవాహితపవనము వి
స్తరిల్లె నాతనికి హృదయసమ్మద మెసఁగన్.

296


వ.

అందు మనోవాక్కాయకర్మనియతుం డై పరమేశ్వరుం దనచిత్తంబును నిలిపి,
నిరంతరత్రిరాత్రోపవాసంబుల నొక్కమాసంబుఁ జలిపి, ద్విగుణితత్రిరాత్రోప
వాసంబుల రెండవమాసంబుఁ జలిపి, పక్షోపవాసంబుల మూడవమాసంబు
సలిపి, యూర్థ్వబాహుం డై యేకపాదాంగుష్ఠాగ్రంబున నిలిచి వాయుభోజనంబు
సేయుచు నాల్గవమాసంబు సలిపి, యి ట్లతిఘోరతపంబు సేయుచున్న యర్జు
నుం జూచి యందలిఋషులు విస్మయం బంది యీశ్వరుపాలికిం జని యి ట్లనిరి.

297


ఉ.

“భూరిబలుండు పాండవుఁ డపూర్వతపం బొనరించుట దదీ
యోరుతపఃప్రభావ[179]దహనోత్థితధూమచయంబు లంబుదా

కారము లై వనాంతరము గప్పె; జగత్త్రయనాథ! తత్తపో
భారము సర్వజీవుల కపారభయావహ మద్భుతం బిలన్.

298


వ.

అతని యభిమతంబుఁ బ్రసాదించి, తత్తపోభారంబు వారింపు“ మనిన వారల పలు
కులు విని పరమేశ్వరుండు దరహసితవదనుం డగుచు “వాని యభిప్రాయం బే
నెఱుంగుదు; నిష్టవరప్రసాదంబున వానికి మనఃప్రియంబుఁ జేసెద; మీరు మీ
యాశ్రమంబుల కరిగి సుఖం బుండుం“ డని యప్పుడు.

299

ఈశ్వరుండు గిరాతవేషంబున నర్జును నొద్దకు వచ్చుట

సీ.

కాంచనవర్ణాపఘనుఁ డై మహోన్నత
                 కార్ముకహస్తుఁ డై, కాలకంఠుఁ
డెఱకురా జయ్యె; నద్రీంద్రతనూజయు
                 వనచరీభావంబు వఱలఁ దాల్చెఁ;
గుఱుచచేతులు, మిడిగ్రుడ్లును, గడుకొన్న
                 [180]తఱటులు, మఱి చెంచుఁదలలు నమరఁ
దడవిండ్లు సేపట్టి తడయక యెఱుకు లై
                 యార్చుచు భూతమ్ము లాత్మసతుల


తే.

నెఱుకుసతులఁ గావించి యయ్యెఱుకురాజు
ముందటం, బక్కియల నొక్కమొగిన నిలిచి;
రంత వేఁటనెపంబున నంధకారి
గదలెఁ దద్వన మెల్ల గ్రక్కదలుచుండ.

300


చ.

అలుగుల మ్రంది యందుల మృగావలియున్ విహగంబులున్ భయా
కులగతిఁ బొంది మూఁగలును గుంటులు జీకులు నైనయట్టు లై
యులియక యున్నచో నడఁగి యుండఁ గిరాతబలంబుతోడఁ బిం
గలయనుం డుమేశ్వరుఁడు గవ్వడి డాయఁగ వచ్చెఁ జెచ్చెరన్.

301


వ.

అంత నీశ్వరచోదితుం డయి మూకుం డను దైత్యుండు సూకరం బై భీకరా
కారంబున బీభత్సు వధియింప సమకట్టి పయిం బఱతెంచిన.

302


క.

అనఘుండు దాని దవ్వులఁ
గని ఘనుఁ డయి పాండవుండు గాండీవగుణ
ధ్వని సేయుచు డాసినఁ బె
ల్చన యేయఁ గడంగి నిలిచె సంరంభమునన్.

303


వ.

అదియును నాక్షణంబ యేసిన యమ్మునుం బోలె నతివేగంబున దా నాసన్నంబైన, దా
ని నేయ కేయకు మని యెఱుకురాజు వారించినను వాని వచనం బాదరింపక.

304


చ.

పటువిశిఖంబునం ద్రిదశపాలతనూజుఁడు పంది నేసె; ము
న్నట పరమేశ్వరుండును రయంబున దానిన యేసె; నిట్టు లొ
[181]క్కొటఁ బడియెన్ హరార్జునుల ఘోరశరంబులు పందిపైఁ గుభృ
త్తటముపయిన్ వడిం బడు నుదగ్రమహాశనులట్ల మ్రోయుచున్.

305


క.

హరుశరమును, నరుశరమును
సరి నిరుపక్కియలు [182]దాఁకి జవ మఱి, శరసం
భరమునఁ దిరిగె వరాహము
శరనిధిమథనమునఁ దిరుగు శైలమపోలెన్.

306

వ.

ఇ ట్లిద్దఱచేత శరవిద్ధుం డై మూకదైత్యుండు సూకరరూపంబు విడిచి నిజరూపం
బుతోడ నదృశ్యుం డయ్యె; నంత నర్జునుండు విస్మితుం డై ముందట నత్యున్నత
చాపధరు, మేరుశిఖరాకారు, నపారకిరాతపదాతిసమేతు, నభినవయౌవనవనచరీ
సహస్రపరివృతు నొక్కపురుషుం గని “నీ వెవ్వండవు? మనుష్యగోచరంబు గాని
యివ్వనమున వనితానుగతుండ వయి యేల క్రుమ్మరియెదు? మఱి నా యే
సినమృగంబు నేసి మృగయాధర్మవిరోధం బేల చేసితి? నిన్ను నిప్పుడ నానిశిత
బాణజాలంబులపాలు సేసెద” ననిన నగుచు నాతనికి నయ్యెఱుకురా జి ట్లనియె.

307


ఆ.

“ఏను నామృగంబు నేసితి; నది మదీ
యాస్త్రనిహత మయ్యె [183]నవికలముగఁ;
జనునె నీకు లేని శౌర్యసంపదఁ జెప్పి
[184]కొనఁగ మదము వలుకఁ గుజనునట్లు?

308


క.

[185]పలుకుల నొప్పదు; బీరము
గలవేని రణంబు సేయఁ గడఁగుము; నీ దో
ర్బల మిప్పుడ యుడిపెద“ నని
తలరక యేయుచుఁ బినాకి తాఁకెఁ గిరీటున్.

309


వ.

అంత.

310


చ.

ప్రతిబలదర్పభంజనుఁడు పార్థుఁడు దారుణబాణవర్ష ము
న్నతి నతివీరుఁ డై కురిసినం, బరముండు మహాంబువృష్టిఁ బ
ర్వతము [186]గ్రహించునట్లు బలవంతుఁడు దాని గ్రహించి, పోర న
క్షతతనుఁ డయ్యె; వాని నతిగర్వితుఁ బార్థుఁడు సూచి యాత్మలోన్.

311


చ.

“ఇతఁడు సురేంద్రుఁ డొండె, బరమేశ్వరుఁ డొండె, దినేశుఁ డొండెఁగా
కతులబలప్రభావయుతుఁ డన్యుఁడు గాఁ“డొరుఁ డైన మద్భుజా
వితతధనుర్విముక్తశరవేగము పోర సహించి యిట్టు ల
క్షతుఁడు, నమూర్ఛితుండు నయి కంపముఁ బొందక యుండ నేర్చునే?

312


వ.

నా యేసిన యపారదుర్వారనారాచంబు లవివేకియందుఁ బ్రయుక్తంబు లయిన
సుభాషితంబులుంబోలె వీనియందు నిష్ఫలంబు లగుచున్నయవి.

313


ఆ.

ఎఱుకు నన్ను నుఱక యేసిన [187]శరములు
నెఱఁకు లాడి నాకు నిశితదివ్య
విశిఖతతుల యట్లు వేదన గావించు
టిది యపూర్వ; మీతఁ డెవ్వఁ డొక్కొ!

314


వ.

ఇప్పర్వతంబు దైవనివాసంబు గావున నితండు కిరాతరూపప్రచ్ఛన్నుం డైన యె
య్యేని యొక్కదివ్యపురుషుండు గావలయు“ నని యశనికల్పంబు లయినదివ్యశరం
బు లయ్యెఱుకుపయి వేసి, యర్జునుం డక్షయబాణంబు లైన తన తూణీరమ్ములయం
దమ్ములు గానక “ఖాండవదహనంబునాఁ డగ్నిదేవుండు నా కిచ్చిన యక్షయ
శరధు లిప్పుడు యుగాంతకాలరిక్తంబు లైన శరధులుంబోలె నున్నయవి; యిది
యేమి యద్భుతంబో!“ యనుచు నలిగి గాండీవం బెత్తికొని యెఱుకుపయిం బఱచి.

315

క.

అపహృతగాండీవుఁడు నై
యపరిమితక్రోధహృదయుఁ డన్నరుఁడు పరం
తపుఁ డెఱుకు మస్తకంబునఁ
గృపాణపాతంబుఁ జేసెఁ [188]గిట్టి కడంకన్.

316


క.

అదియు వృథ యైనఁ బార్థుఁడు
వదలక వృక్షముల, రాల, వైచెను రణదు
ర్మదు వనచరు; నవి యెల్లం
దదంగముల నడఁగె నద్భుతంబుగ నంతన్.

317


క.

హరుఁ బెనఁగి పట్టుకొని భీ
కరబలుఁ డర్జునుఁడు ముష్టిఘాతంబుల సం
గర మొనరించెను; వనచర
వరు లాతని శౌర్యగౌరవముఁ [189]బొగడి రెదన్.

318


క.

తనదివ్యగాత్రమున న
ర్జును గాత్రనిపీడఁ జేసె శూలధరుం డం
తన మూర్ఛవోయి పీడిత
తనుఁ డై పార్థుండు ధరణితలమునఁ బడియెన్.

319


వ.

అంత.

320


చ.

వరదుఁడు పార్థుశౌర్యవిభవంబున, కాతని[190]ధైర్యవృత్తి క
ప్డరుదుగ మెచ్చి సన్నిహితుఁ డయ్యె జటామకుటేందు రేఖయుం,
గరమున శూలమున్, గరళకాలగళంబు, బృహద్గజాజినా
బరముఁ, దృతీయలోచనముఁ, బన్నగహారము నొప్పుచుండఁగన్.

321


వ.

ఇట్లు విరూపాక్షుండు నిజరూపంబుతో నర్జునునకు సన్నిహితుం డై “యర్జునా!
క్షత్రియు లొరు లెవ్వరు నీయట్టి శౌర్యధైర్యవంతు లెందును లేరు; నీతపఃక్షాత్త్రగు
ణంబులకు మెచ్చితి; నీకోర్కి సఫలంబు సేసెద; దేవాసురమానుషం బైన జగం
బంతయు నీవ జయింతు; నాస్వరూపంబు సూడు“ మని దివ్యదృష్టి యిచ్చినం
జూచి పార్థుండు గృతార్థుం డయి దండప్రణామంబు సేసి.

322


క.

వరదు, సురాసురవందితఁ
గరుణాకరు, హరుఁ, బినాకకరుఁ, గరిచర్మాం
[191]బరు, శంకరు, గిరిజాసుం
దరు నిట్లని సంస్తుతించెఁ దద్దయు భక్తిన్.

323

అర్జునుఁడు పరమేశ్వరుని స్తోత్రము సేయుట

దండకము.

“శ్రీకంఠ! లోకేశ! లోకోద్భవస్థానసంహారకారీ! పురారీ! మురారిప్రియా! చంద్ర
ధారీ! మహేంద్రాదిబృందారకానందసందోహసంధాయిపుణ్యస్వరూపా! విరూపాక్షా!
దక్షాధ్వరధ్వంసకా! దేవ! నీదైన తత్త్వంబు భేదించి, బుద్ధిం బ్రధానంబు, గర్మంబు,
విజ్ఞాన, మధ్యాత్మయోగంబు, సర్వక్రియాకారణం బంచు నానాప్రకారంబులన్
బుద్ధిమంతుల్ విచారించుచున్ నిన్ను భావింతు; రీశాన! సర్వేశ్వరా! శర్వ!
సర్వజ్ఞ! సర్వాత్మకా! నిర్వికల్పప్రభావా! భవానీపతీ! నీవు లోకత్రయీవర్త
నంబునన్ మహీవాయుఖాత్మాగ్నిసోమార్కతోయంబులం జేసి కావించి; సంసార
చక్రక్రియాయంత్రవాహుండవై; తాదిదేవా! మహాదేవ! నిత్యంబు నత్యంత
యోగస్థితిన్ నిర్మలజ్ఞానదీపప్రభాజాలవిధ్వన్తనిస్సారసంసారమాయాంధకారుల్

జితక్రోధరాగాదిదోషుల్, యతాత్ముల్, యతీంద్రుల్ భవత్పాదపంకేరుహ
ధ్యానపీయూషధారానుభూతిన్ సదాతృప్తులై, నిత్యులై; రవ్యయా! భవ్యసేవ్యా!
భవా! భర్గ! భట్టారకా! భార్గవాగస్త్యకుత్సాది నానామునిస్తోత్రదత్తావధానా! లలాటే
క్షణోగ్రాగ్నిభస్మీకృతానంగభస్మానులిప్తాంగ! గంగాధరా! నీ ప్రసాదంబునన్ సర్వ
గీర్వాణగంధర్వులున్ సిద్ధసాధ్యోరగేంద్రాసురేంద్రాదులును శాశ్వతైశ్వర్య
సంప్రాప్తులై; రీశ్వరా! విశ్వకర్తా! సురాభ్యర్చితా! నాకు నభ్యర్థితంబుల్ ప్రసా
దింపు; కారుణ్యమూర్తీ! త్రిలోకైకనాథా! నమస్తే! నమస్తే! నమః!“

324


వ.

అని యిట్లు స్తుతియించి కృతాంజలి యై కిరీటి వెండియు ని ట్లనియె.

325


క.

[192]ఎఱుకని యెఱుఁగక నీకున్
మఱకువ నెదిరితిని; దీని మఱవుము; నన్నుం
గఱకంఠా! క్షమియింపుము;
నెఱి నెవ్వరి కెఱుఁగ నగునె నీచరితంబుల్?”

326


వ.

అనిన నప్పార్థుం గరుణారసప్రీతివిస్తారితవిలోకనామృతమ్మున సంతర్పితుం జేసి,
నగుచు నీశ్వరుండు వానిచేయి పట్టుకొని “ధనంజయా! నీ చేసిన వ్యతిక్రమంబు
క్షమియించితి; నతిమానుషంబైన నీపరాక్రమంబునకు మెచ్చితిఁ; బూర్వజన్మం
బున నీవు నరుం డను దేవర్షివి; నారాయణసఖుండవు; నరనారాయణు లనంగా
మీరిద్దఱు బదరీవనంబున ననేకాయుతవర్షమ్ములు తపమ్ముఁ జేసిన మహావీర్యవం
తులరు; మీతేజంబున జగమ్ములు రక్షితమ్ము లగుచున్నయవి; యిగ్గాండీవమ్ము
దొల్లియు నీయదియ; దీననచేసి శక్రాభిషేకమ్మునాఁ డసురుల జయించి; తది
యిప్పు డక్షయశరదులతోడ మదీయమాయాగ్రస్తం బయ్యె నీ గాండీవమ్మును,
నక్షయశరధులు, నీ కిచ్చితిం గొను; మింక నీ కిష్టం బైన వరమ్ము వేఁడు; మిచ్చెద“
ననిన నర్జునుం డి ట్లనియె.

327


క.

“త్ర్యంబక! నాకు నభీష్టవ
రంబుఁ బ్రసాదించెదేని రౌద్రము, దివ్యా
స్త్రం బనఁ బరఁగిన పాశుప
తంబు బ్రసాదింపు మిందుధర! దయతోడన్.

328


వ.

ఇదియును బ్రహ్మశిరం బను నస్త్రంబును యుగాంతకాలంబునందుఁ బ్రయుక్త
మ్ములై జగత్సంహారమ్ము సేయు; దీనివలన నభిమంత్రమ్ములై యనేక శతసహస్ర
సంఖ్యల శూలంబులు, గదలు, నాశీవిషంబుల యట్టి యమ్ములు, నుద్భవిల్లు నని విందు;
నీ కారుణ్యమ్మున దీనిం బడసి దైత్యదానవయక్షరాక్షసపిశాచోరగమ్ముల జయింతు;
నతివీరులైన భీష్మద్రోణాదులను జయింతు; సహజకుండలుం డైన కర్ణుని వధింతు;“
ననిన నీశ్వరుండునుం గరుణించి విశుద్ధాత్ముం డైన పార్థునకు మంత్రధ్యానజపహో
మపూర్వకంబుగా, సంధానమోక్షణసంహారసహితంబుగాఁ బాశుపతాస్త్రం బిచ్చి, “దీ
నికి నసాధ్యం బెద్దియును లే; దల్పులయందుఁ బ్రయుక్తం బైన జగత్సంహారము సేయు.

329


క.

దీని విధానం బెఱుఁగం
గా నింద్రకుబేరవరుణకాలాదులకుం

దా నతిగహనం బనినను
మానవులకు నెఱుఁగు టఘటమానము గాదే.

330


వ.

ఈ దివ్యబాణమ్మున నీ వఖిలలోకమ్ములు జయింతు“ వని కౌంతేయునకు వరం
బిచ్చి పురాంతకుం డంతర్హితుం డయ్యె; నంత.

331


చ.

అవిరళసూర్యమండలసహస్రసమప్రభ మై, ధనంజయ
ప్రవరు కరమ్మునన్ వెలుఁగు పాశుపతాస్త్రముఁ జూచి దైత్యదా
నవసురయక్షరాజసగణమ్ము గరమ్ము భయమ్ముఁ బొందె; నం
దవనియు దిర్దిరం దిరిగె నబ్ధిశిలోచ్చయ [193]సంచయంబుతోన్.

332


క.

త్రిణయనగాత్రస్పర్శం
బున నిజగాత్రము పవిత్రమును ముక్తాఘం
బును నతితేజోవీర్యం
బును నైనఁ బృథాసుతుండు ముదితుం డగుచున్.

333


క.

“మంటి; హరుదేహ మంటం
గంటి; నుమాధీశు [194]నసురకంటకహను, ము
క్కంటిఁ; గఱకంఠుఁ జూడం
గంటిఁ; గృతార్థుండ నైతిఁ గడుఁ బుణ్యమునన్.

334


క.

ఇమ్ముల ధర్మజునకు జన
సమ్మతునకు రిపుజయంబు, సకలమహీ రా
జ్యమ్ము సమకూరె నేఁడు ఘ
నమ్ముగ సర్వప్రయోజనమ్ములతోడన్.“

335

ఇంద్రుఁడు దేవగణంబులతో నర్జునునకుఁ బ్రత్యక్షం బగుట

వ.

అని సంతుష్టహృదయుం డై యున్నంత.

336


సీ.

హరుచేత సంప్రాప్తవరుఁ డయ్యెనరుఁడని
                 యెఱిఁగి యింద్రుండు ధనేశధర్మ
వరుణేశ్వరులతోడ సురగణసహితుఁ డై
                 దివ్యవిమానముల్ [195]దివమునందు
వెలుఁగంగఁ గౌరవకులవీరుపాలికి
                 వరదుఁ డై గరుణతో వచ్చె; నట్టి
యవసరమ్మున ఘనరవగభీరం బైన
                 మధురవాక్యమున ధర్మప్రభుండు


ఆ.

ప్రీతి నిట్టు లనియె బీభత్సునకు “ధర్మ
నిత్య! పాండుపుత్త్ర! నీకు మెచ్చి
వరము లిచ్చు వేడ్క వచ్చిరి నెయ్యురై
యమరనాథుఁ దొట్టి యమరు లెల్ల.

337


వ.

వీరలం జూడు“ మని దివ్యదృష్టి యిచ్చి “నీవు నరుం డను పూర్వఋషివి; బ్రహ్మని
యోగంబున మనుష్యుండవై యుత్తమక్షత్త్రియకులంబున నుద్భవిల్లితి;
మఱి సూర్యాంశజుం డైన కర్ణుని, దేవదైత్యదానవగంధర్వయక్షరాక్షసాంశజు
లైన రాజులను వధియింతు; నీ కక్షయకీర్తి యగు” నని దండధరుం డప్రతివార
ణం బైన దండంబు విధియుక్తంబుగా నిచ్చిన.

338


క.

ఘోరారి[196]దారుణము లగు
వారుణపాశంబు లిచ్చె వరుణుఁడు; మఱి కౌ
బేరాస్త్ర మిచ్చె నపుడు కు
బేరుఁడు విజయునకు నహితభేదికిఁ బ్రీతిన్.

339


వ.

ఇట్లు దివ్యపురుషుం డైనపార్థుండు లబ్ధదివ్యదృష్టియై యమర్త్యరూపధరు
లైన పితృదేవతలతోడం దనముందట నిలిచిన మహానీలవర్ణుం డైన వైవస్వతుని,
వైడూర్యవర్ణుం డై యర్ణవనదీశైలసేవితుం డైన వరుణేశ్వరుం, జాంబూనదవర్ణుం

డై యక్షరాక్షసగణంబుతో నున్నకుబేరునిం జూచి, వారివలన దివ్యాస్త్రం
బులు వడసి [197]వాక్పుష్పఫలజలంబుల నందఱం దృప్తులం జేసి వెండియు.

340


ఆ.

అమరగణసమేతు, [198]నైరావణారూఢు,
వజ్రధరుఁ, ద్రిలోకవంద్యు, నింద్రు,
వృత్రశత్రు, నమరవిభుఁ జూచి యెద నాది
మునివరుండు నరుఁడు ముదము నొందె.

341


ఉ.

ఇందుధరప్రసాదమున నిష్టవరంబులు గాంచి [199]బాంధవా
నందవిధాయి యైన నిజనందను దండితశత్రు సద్గుణా
నందితుఁ జూచి వేడ్క నయనంబులు వేయును గన్న తత్ఫలం
బందెఁ బురందరుండు పరమాద్భుతసమ్మదపూరితాత్ముఁ డై.

342


వ.

ఇట్లు దేవేంద్రుండు ధనంజయుం జూచి సంతసిల్లి “నీవు పరమేశ్వరువలనఁ బరమ
సిద్ధితో దేవత్వంబు వడసితివి; దేవకార్యంబు దీర్ప నర్హుండవు; గాన నారథంబుఁ
బుత్తెంచెద; నమరావతికి రమ్ము; నీకు దివ్యాస్త్రంబు లంద యిచ్చెద” నని దేవేం
ద్రుండు దేవగణంబులతో నమరావతికి నరిగె; నర్జునుండును దద్రథాగమనంబు
ప్రతీక్షించుచుండు నంత.

343


సీ.

[200]వారిదమార్గంబువలన మహానీల
                 వైజయంతీవిభవంబు వెలయ,
నాబద్ధవివిధరత్నావళిప్రభఁ జేసి
                 రమ్యమై రోదోంతరంబు వెలుఁగ,
నురునేమిరవమున నుర్వరాధరదరీ
                 ముఖములు ప్రతిశబ్దముఖరితంబు
లగుచుండ, నానావిధాయుధంబులు దాల్చి
                 యశనివిద్యుత్సహస్రాభిశోభి


ఆ.

తాభ్రసదృశ మై, మహాజవాశ్వాయుత
వాహ్యమాన మైన వరరథంబు
మఘవునాజ్ఞ జేసి మాతలియుక్తమై
యింద్రతనయుఁ డున్నయెడకు వచ్చె.

344


వ.

మాతలియు నర్జునుఁ జూచి “సురాసురకిరీటతటఘటితరత్నప్రభాభాసురపదుం డైన
మహేంద్రుండు మీయయ్య భవద్దర్శనం బపేక్షించి నిన్ను నమరావతికి రాఁ
బనిచె; రాజసూయాశ్వమేధశతంబులం జేసినవారికైనను దుర్లభం బీరథంబు;
దీని నెక్కు” మనిన నర్జునుండును గంగాస్నానపవిత్రీకృతగాత్రుం డై దేవఋషి
పితృతర్పణంబులు చేసి మాతలిప్రయుక్తం బైన యాదివ్యరథం బెక్కి.

345

అర్జునుఁ డమరావతికిఁ బోవుట

చ.

అలఘుతపస్సమాధినియతాత్ములకున్, బహుపుణ్యలోకకాం
క్షులకు, విశుద్ధమానసులకున్ సతతంబును [201]నాశ్రయంబ వై
లలితనిలింపదంపతివిలాసవిహారమహోత్సవంబులుం
గలిగి వెలుంగు రత్నమయకందరసుందర! మందరాచలా!

346

వ.

నీయందలి పుణ్యతీర్థంబులు సేవించుచు, గంగాంబు[202]ధ్యౌతస్థలరుహవనస్పతిఫలం
బు లుపయోగించుచు సుఖం బుండితి; నమరావతికిం బోయి వచ్చెద” నని మందర
నగంబు వీడ్కొని పురందరనందనుండు దేవపథంబున కరిగి.

347


సీ.

పరమధర్మస్థితిఁ బ్రజఁ బ్రీతిఁ గాంచిన
                 రాజులకు నుదగ్రరణమునందుఁ
బతుల ప్రస్తవమునఁ బ్రాణముల్ విడిచిన
                 వీరులకును, యజ్ఞవిధులఁ జేసి
సురలను వసుమతీసురులను దనిపిన
                 ధర్మాత్ములకు, మహాతాపసులకు,
నిలయంబు లై రమణీయంబు లగు[203]రమ్య
                 హర్మ్యవిమానసంహతులదాని


తే.

సకలభువనంబులం గలసత్పురముల
కెల్ల [204]నుపమాన మై దహనేందురవుల
దీప్తి లే కున్నఁ దన దైన దివ్యదీప్తి
విస్తరంబున నెప్పుడు వెలుఁగుదాని.

348


వ.

మఱియు ననాహితాగ్నులకు, నతీర్థసేవకులకు, ననృతవాదులకు, వేదవిరుద్ధా
చారులకు, మాంసాహారులకు, రణపరాఙ్ముఖులకుఁ జొర నవిషయంబును నతి
గహ్వరంబును నైనదాని నమరావతిఁ జొచ్చి, తద్గోపురసమీపంబున ననవరత
గండస్థలగళదవిరళమదజలకుల్యాభిరామం బై నిరంతరనిర్ఝరనీహారనగంబునుం
బోలె నొప్పుచున్న నైరావతంబుఁ జూచుచు సురసిద్ధసాధ్యగణంబుతో విద్యాధరా
ప్సరోగంధర్వకిన్నరజేగీయమానుం డగుచు జను నప్పుడు.

349


క.

[205]సకలర్తుకుసుమసౌరభ
సుకుమారోద్యానతరుల సుడియుచుఁ బ్రణయో
త్సుకుఁ డై పవనుఁడు పాండవు
నకు నభిముఖుఁ డయ్యెఁ దన్మనఃప్రియ మెసఁగన్.

350


క.

నరుఁ డైన యాదిముని యని,
హరిసుతుఁ డని, హరిసహాయుఁ డని, హరుచేతన్
వరములు వడసినవాఁ డని
సుర లెల్లను వచ్చి పార్ధుఁ జూచిరి ప్రీతిన్.

351


వ.

అర్జునుండు నయ్యమరావతివిభవంబు చూచి హర్షించుచు నప్సరోగీయమాన
[206]మంగళహితగీతావహితమానసుం డగుచు, సిద్ధమునిగణాశీర్వాదంబులు సేకొ
నుచుం జని మాతలి నిర్దేశంబున దివ్యరథావతీర్ణుం డై.

352


క.

శతమఖునకు, భువనావన
రతశీలున, కఖిల దేవరాజర్షి సమ
న్వితునకు, [207]వజ్రాభిహితో
న్నతపృథుభుజునకుఁ గృతప్రణాముం డయ్యెన్.

353


చ.

అనిమిషనాథుఁడుం బ్రచలితాంగదతుంగభుజాయుగంబునం
దనయునిఁ గౌఁగిలించుకొని, తత్క్షణజాతనితాంతసమ్మదం
బునఁ బులకాంకితాంగుఁ డయి, మున్ను నిజాంకతలస్థుఁ జేసి య
త్యనఘు నిజాసనార్థమున [208]నాదట నుంచెఁ గరంబు నెమ్మితోన్.

354


క.

లీలైరావతకుంభా
స్ఫాలనకర్కశకరములఁ బలుమరును మరు

త్పాలకుఁ డంటుచు నుండె గు
ణాలంకృతుఁ డైన పార్థు నంగముఁ బ్రీతిన్.

355


వ.

ఇ ట్లధికవిలాసంబుతో సురవిలాసినీకరకలితచారుచామీకరదండచామరసమీ
రాలోలకుంతలుం డగుచు సురరాజుతో నేకాసనంబున నున్న యప్పార్థుం బాక
శాసనుశాసనంబున దేవగంధర్వసిద్ధవిద్యాధరు లతిప్రీతి [209]నర్చించి రంత.

356


[210]తే.

పాకశాసనుపనుపునఁ బార్థుఁ డొక్క
మణిమయం బైన మహనీయమందిరమున
నెలమి గంధర్వసంగీతహృద్యగోష్ఠి
నుండెఁ జెవులకు నుత్సవం బొందుచుండ.

357


వ.

అంత సూర్యాస్తమయసమయంబునఁ జంద్రుఁ డుదయించి సాంద్రచంద్రికా
విలాసంబున దిగ్వనితల నలంకరించుచుండ, నిలింపపతి పంపున సొంపార నూర్వశి
[211]యర్జునసంగమకాంక్షం జేసి, చంద్రికాధవళదుకూలంబు గట్టి, మృగమదకర్పూర
కుంకుమోన్మిశ్రితసుగంధం బలఁది, వివిధసురభికుసుమవిసరంబులు ముడిచి, మణి
మయభూషణాలంకృతయై నిలుకడ వడసిన క్రొమ్మెఱుంగుఁదీఁగయుంబోలె మణి
మయమంజీరఝళంఝళనినాదంబును, గంకణఝణఝణత్కారంబును, గటిక
లాపకింకిణీక్రేంకారంబును, మదనాజ్ఞావాద్యఘోషంబునుం బోలె మ్రోయు
చుండ మందగమనంబునఁ బురందరనందను మందిరంబున కరుగుదెంచిన నప్పు
రుషసత్తముండు భయభక్తిసంభ్రమంబులతోఁ బ్రత్యుత్థానంబును దండ
ప్రణామంబునుం జేసి కరకమలంబులు మొగిచి యి ట్లనియె.

358


క.

“ననుఁ బుత్త్రస్నేహంబున
మనమున మన్నించి శుభసమగ్రునిఁ జేయం
జనుదెంచి తీవు ముదమున
జనయిత్రీ! యేఁ గృతార్థజన్ముఁడ నైతిన్.”

359


తే.

అనిన నూర్వశి యిట్లను [212]నాత్మనేత్ర
మధుపము లతని సౌందర్యమధువు గ్రోలు
చుండఁ దమకంబు మీఱి యనూనధర్మ
నిపుణుఁ డగు నర్జునునితోడ నెయ్య మొనర.

360


చ.

“అనుపమశౌర్య! నీదు సముదగ్రగుణంబులు నారదాదిస
న్మునివరు లెల్లఁ జెప్పఁగఁ బ్రమోదమునన్ భవదీయసంగమం
బనిశముఁ గోరుచుం దగఁ బ్రియంబున వచ్చితి; నేను గోరఁగా
నను [213]జనయిత్రి వంచు నొకనాయము బల్కెద వక్రభాషలన్.

361


తే.

నీకు నేనాఁటి తల్లిని? నిజము సెపుమ;
యమరలోకంబు వేశ్యలమైన మాకు
నిట్టి తగవులు నడవ; వహీనబాహు
వీర్య! యిచ్చట [214]వావియే వెదకఁ జనునె.

362


వ.

ఈలోకంబున వనితలుఁ, బురుషులు విచ్చలవిడిఁ గ్రీడింతు; రిచ్చటి కిది యనిందితం
బైన యాచారంబు; నీవును ద్రిదివంబునకు వచ్చిన యప్పుడ దివ్యపురుషుండవు;
గావున నా మనోరథంబు సఫలంబుగా మందార[215]మంజులమంజరీమకరందపాన

మత్తమధుకరగానమనోహరస్థలంబులను, మేరుశైలకందరంబులను, మందపవ
నంబులు గల నందనాదివనంబులయందును, నితాంతకాంతవికసితకనకారవింద
సమధికసౌరభసంవాసితమహానందకందంబు లైన మందాకినీతీరమణిమయవేది
కలయందును, జంద్రికాసుందరంబు లైన సికతాతలంబులను, మఱియు నిర్జర
విహారస్థానంబుల ననవరతసురతకేళీసౌఖ్యాంబుధి నన్ను నోలలార్పు” మనిన
[216]నిర్వికారధైర్యధుర్యుం డై యర్జునుం డి ట్లనియె.

363


క.

“ఓహో! యిమ్మెయి ధర్మ
ద్రోహోక్తులు పలుకఁ దగునె? దోసం బదిగా
దే? హరి హరి; మనమునఁ దగ
వూహింపక నన్నుఁ బలుకు టుచితమె నీకున్.

364

ఊర్వశి యర్జును నపుంసకునిఁగా శపించుట

వ.

జగంబులు వుట్టింపను మనుపను సమయింపను గర్తలైన దేవతలకు నెట్లు నడచిన
నెగ్గు లేదు; నేను గర్మభూమిని జనియించి [217]కర్మఠుండ నైతి; నాకు [218]నిచ్చటి యాచా
రం బుచితంబు గాదు; మదీయవంశకర్తయైన పురూరవునకుఁ బత్నివైన కార
ణంబునను, బురందరునకుఁ బరిచర్య యొనర్చుటను నాకు జనని వగుట సంది
యంబు లేదు; తల్లీ! నన్నుం బుత్త్రవాత్సల్యంబునం జూడు” మనిన మదనబాణ
పీడితయై కోపారుణితనయనంబుల నర్జునుం జూచి యూర్వశి “యేను గామించి
వచ్చిన నామనోరథంబు విఫలంబుఁ జేసినవాఁడవు, నీవు మర్త్యలోకంబున
మానవర్జితుండవై, మానినీమధ్యంబున నపుంసకుండవై యుండు” మని శాపం
బిచ్చి నిజగృహంబు నకుఁ జనియె; నంతఁ బ్రభాతసమయంబునఁ దద్వృత్తాంతం
బంతయు విని సురపతి కొడుకున కి ట్లనియె.

365


క.

“నీయట్టి ధైర్యవంతుని
నేయుగములనైనఁ గాన మెన్నండును; ధ
ర్మాయత్తమతివి; మునులకు
నీయింద్రియజయము గీర్తనీయము తండ్రీ!

366


తే.

అనఘ! యూర్వశి యిచ్చిన యట్టిశాప
మనుభవింపంగవలయు నీకవనియందు;
నింక మీ పదుమూఁడవయేఁడు సత్య
సరణి నజ్ఞాతవాసంబు సలుపవలయు.

367


వ.

అక్కాలంబున నీవు షండరూపంబునఁ బ్రచ్ఛన్నుండవై రాజకన్యకలకు నృ
త్యంబు గఱపుచుండి తదంత్యంబున శాపమోక్షంబు వడయు” మని యనుగ్రహిం
చె; నీయాఖ్యానంబు విన్న పుణ్యపురుషులు సకలదురితవిముక్తు లగుదు రని చెప్పి
వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె.

368


సీ.

వజ్రాస్త్ర మాదిగా [219]వరదుఁ డై వివిధది
                 వ్యాస్త్రముల్ పార్థున కమర నిచ్చి
తత్ప్రయోగంబులుఁ దద్రహస్యంబులుఁ
                 దన్నివర్తములుఁ దడయ కపుడు
దయ నుపదేశించి, “దారుణాహవములం
                 దవిజేయవీర్యుండ వగుము పేర్మి”
నని మహాసౌహార్దుఁ డై చిత్రసేనుఁ డ
                 న్గంధర్వపతితోడ గారవమున

ఆ.

వజ్రధరుఁడు గీతవాద్యనృత్యంబులు
గఱవఁ బంచెఁ బార్ధుఁ గడఁగి; యిట్టు
లమరనాథునొద్ద నర్జునుం డుండ నే
డేఁడు లరిగె నిట మహీతలమున.

369


వ.

అంత నొక్కనాఁడు రోమశుం డను మహాముని యింద్రునొద్దకు వచ్చి సురగణ
పూజితుం డై సురేంద్రుతో నేకాసనంబున నున్న యర్జునుం జూచి యాశ్చర్యం
బంది యింద్రున కి ట్లనియె.

370


క.

“కోరి యనేకయుగంబు ల
పారతపోయుక్తులైన వారికి బడయన్
దూరము నీసభ మఱి నీ
కారుణ్యం బింతకంటె గడు దవ్వెందున్.

371


వ.

[220]అట్టియందు నీతో నొక్కట నేకాసనం బెక్కి నీరెండవమూర్తియుం బోలె నున్న
యిమ్మనుజుం డెందులవాఁ? డెవ్వఁ” డనిన నమ్మునీంద్రునకు దేవేంద్రుం డి ట్లనియె.

372


క.

“నరుఁ డను మహర్షి యీతఁడు
నరలోకమునందుఁ బుట్టె నాయంశమునన్;
[221]గురుమతిఁ గౌంతేయుఁడు భా
సురతేజుఁ డుపేంద్రసఖుఁడు సువ్వె మునీంద్రా!

373


తరలము.

శివుఁడు వీనికిఁ బ్రీతుఁ డై దయ సేసెఁ బాశుపతాస్త్ర; మా
దివిజముఖ్యులతోడ నేనును దివ్యబాణము లిచ్చితిం;
దివిరి యీతఁడు మత్చ్రియంబుగ దేవకార్యము దీర్పఁగా
సవినయస్థితి నున్నవాఁడు [222]నిజప్రతాపబలోన్నతిన్.

374


వ.

మఱియు [223]వసుమతీఖాతగర్వితులైన సగరసుతులం దనదృష్టి తీవ్రదహనంబునం
జేసి దహించిన కపిలుం డను మహాముని నారాయణుం డయ్యె; నట్టి నరనారాయణు
లాదిమునులు, జగదుపకారులు; జగతీభారావతరణకారణు లై దైత్యదానవ
వధార్థంబు మర్త్యంబునం బుట్టినవారు గావున.

375


క.

దేవతలకు నపకారము
గావించిన యన్నివాతకవచులఁ బాతా
ళావాసుల దావవుల మ
హావీరుఁడు వీఁ డభేద్యుఁ డై వధియించున్.”

376


వ.

అని తత్ప్రభావంబు సెప్పి యింద్రుండు రోమశున కి ట్లనియె “మునీంద్రా! నీవు మర్త్య
లోకంబునకుం బోయి, ధర్మజుం గని, యతనికిం దత్సహోదరులకు సంతోషంబు
గా నాయొద్దం బార్థుం డున్నకుశలవార్త యెఱింగించి, “భీష్మద్రోణకర్ణాదివీరుల
నోర్చునట్టి దివ్యాస్త్రంబులు వడసె; నతండు మీయొద్దకు వేగంబ వచ్చు; వగవ
కుండుం” డని చెప్పి, నావచనంబున ధర్మజు నఖిలతీర్థసేవ సేయం బంపు; మట్లయి
న నపేతదురితుం డై యఖిలమహీరాజ్యంబు వడయు; నతండు తీర్థాభిగమనంబు
సేయునపుడు నీ వాతనికి సహాయుండవు గ” మ్మని యింద్రుండు రోమశుం బనిచె;
నిట ధృతరాష్ట్రుం డర్జున దివ్యాస్త్రలాభంబుఁ బారాశర్యువలన నెఱింగి పరమ
వ్యాకులహృదయుం డై సంజయున కి ట్లనియె.

377

సీ.

“సురసమూహంబుతో సురరాజు నోడించి
                 ఖాండవం బెక్కటి కాల్చియున్న
వీరున, [224]కఖిలాబ్ధివృతవసుంధర గల
                 రాజుల నోర్చి పరాక్రమమున
నగ్రజ రాజసూయాధ్వర మనిచిన
                 యధికసమర్థున, కర్జునునకుఁ,
[225]బార్థసింహమునకుఁ బక్కెర వెట్టిన
                 యట్లు దేవతలు నెయ్యంబుతోడఁ


ఆ.

బరముఁ దొట్టి పాశుపత మాదిగా దివ్య
శరము లిచ్చి రట్టె శౌర్య మెసఁగ;
నట్టినరుఁడు యోధుఁ డై యున్నపాండవ
వరుల జెనయు నంతవారుఁ గలరె?

378


క.

వారికి, ధర్మువు దప్పని
వారికి [226]దృఢవచను లైన వారికి, విమలా
చారుల కెద్దియుఁ బడయఁగ
దూరమె? పాండవులఁ బోలుదురె వీరు లొరుల్?

379


వ.

వారలతో విగ్రహించి దుర్యోధనుండు దనకుఁ, దన బాంధవులకు, సుహృజ్జనం
బులకు హాని సేసికొనియె.

380


ఆ.

పర్వతములు వజ్ర[227]పాతాహతిని బోక
తక్కు నేని నింద్రతనయు దివ్య
నిశితబాణతతుల నిశ్శేష మగుననఁ
బరులసైన్య మెట్లు బ్రదుక నేర్చు?

381


వ.

లయకాలోదితసహస్రకరుకిరణంబులం జరాచరంబులు దప్తంబు లగునట్లు పార్థు
బాణంబులం జేసి దుర్యోధనాదులు దుస్సహతాపంబుఁ బొందుదు” రని దుఃఖి
తుం డైన ధృతరాష్ట్రునకు సంజయుం డి ట్లనియె.

382


క.

“ఈసున దుర్యోధన [228]దు
శ్శాసను లొగిఁ బాండవులకు సభలో నెగ్గుల్
సేసిన విని వారల నను
శాసింపఁగ, వలవ దనఁగ, జనదే నీకున్.

383


వ.

నీ యుపేక్షం జేసి దుర్యోధనుచేత దుర్ద్యూతపరాజితు లై రాజ్యంబు విడిచి పాండవు
లరిగి కామ్యకవనంబున నున్నఁ గృష్ణుం డనేకరాజసమన్వితుం డై వారియొద్దకు
వచ్చి నీ కొడుకులు [229]సేసిన నికారంబునకుం గృష్ణాపరిభవంబునకు దుఃఖితుం డై క
డు నలిగి, “మీకు [230]నిట్లు సేసిన దుర్యోధనాదుల దూషించి గజపురంబున ధర్మరాజు
రాజ్యాభిషిక్తుం జేయుదు” ననియు “రాజసూయంబు సేయునాఁ డింద్రప్రస్థంబు
న నైన విభూతికంటె విశేషవిభూతి గావింతు” ననియు ద్రుపదసృంజయకేకయ
ధృష్టద్యుమ్నబలదేవసాంబసాత్యకిప్రభృతులసమక్షంబునం బలికి సత్యసమయు
లైన పాండవులచేత సంరంభనివారితుం డై పార్థుసారథ్యంబునకుఁ బ్రార్థితుం
డయ్యెనని వింటిమి.

384


క.

పదుమూడేండ్లుం బోయినఁ
బదునా ల్గగునేఁడు ఘనులు పాండవులు జగ
ద్విదితముగ నుత్సహింతురు
వదలక రణమునకుఁ గేశవపురస్కృతు లై.

385


క.

[231]వరములు వేల్పులచే దు
ష్కరతపమునఁ బడయుదురు జగంబున నొరు లీ

శ్వరుచే వరములు వడసెం
గరుణ ధనంజయుండు దనదుకార్ముకశక్తిన్.

386


వ.

అయ్యర్జును దివ్యశరసంఘాతంబును, భీమసేను చిత్రగదాఘాతంబును, నీ యుపేక్షా
నిర్ఘాతంబును, గౌరవపరిక్షయంబునకుఁ గారణభూతంబు” లనిన సంజయునకు
ధృతరాష్ట్రుం డి ట్లనియె.

387


క.

“వృద్ధని, జాత్యంధుం డని
బుద్ధివిహీనుఁ డని నన్నుఁ బుత్త్రుఁడు బలద
ర్పోద్దతుఁ డై మెచ్చఁ డసం
బద్ధంబులె కాని వినఁడు పలికిన పలుకుల్.

388


వ.

దుర్యోధనుండు దుర్బుద్ధి యని యేమి సెప్పవలయు? భీష్మద్రోణవిదురాదుల నాద
రింపక కర్ణశకునుల నాప్తులం జేసికొని వారివచనంబుల నెగడు; నేనేమిసేయుదు?”
నని ధృతరాష్ట్రుఁడు మిన్నకుండె; నిట పాండవులు పార్థు మసలుటకు దుఃఖితులై.

389


ఉ.

“పాండవసింహ మర్జునుఁడు పాండుయశంబు వెలుంగుచుండ నా
ఖండలు దొట్టి నిర్జరనికాయముచేత వరంబు గాంచి యె
న్నం డిట వచ్చునొక్కొ! సుజనస్తుతు నాతనిఁ బ్రీతిఁ జూడ నె
న్నం డొకొ కాంతు!” మంచును మనంబునఁ గోరుచు నుండి రెంతయున్.

390


వ.

అట్టి యవసరంబున యుధిష్ఠిరునకు భీముం డి ట్లనియె.

391


మధ్యాక్కర.

“నీ నిదేశంబున నరిగి పార్థుండు నిష్థతోఁ దపము
మానుగాఁ జేయుచు నున్నవాఁ; డేల మసలెనో రాక;
వాని [232]ధర్మస్థితుఁ బాసి యున్న యివ్వర్షముల్ యుగస
మానంబులైనవి మనకు నతని సమాగమకాంక్ష.

392


వ.

మఱి పాండవపాంచాలయాదవవీరులజీవనంబు లాతనియంద నిలిచినవి; [233]తదీయ
భుజాశ్రయబలంబునం బరుల జయించి ధరణీరాజ్యంబుఁ బరిగ్రహింత మని
యున్నవారము; గావునం గాలయాపనంబు సేయక యర్జునుం దోడ్కొని తేర
జనార్దను రాఁ బనిచి నియోగింపుము.

393


మ.

సమయాబ్దంబులకంటె ముందర మహోత్సాహంబునన్ బాహువి
క్రమ మొప్పన్ విజయుండు [234]నేనుఁ దగ సంగ్రామంబులో నేకకా
లమునం దాధృతరాష్ట్రజాధముల నెల్లం జంపి భూచక్రరా
జ్యము సేకొందుము కౌరవేంద్ర! మురజిత్సఖ్యప్రసాదంబునన్.

394

వ.

సత్యభంగభీతుండవు గావున నీ వింద యుండి, పదుమూడేండ్లుం జలిపి పదంపడి
కరిపురంబునకు వచ్చి రాజ్యాభిషిక్తుండ వగుము; దుష్టద్యూతంబున మనరాజ్యం
బపహరించిన సుయోధనుండు సుచిరప్రతిష్ఠితుండు కాకుండ, నిప్పుడ యద్దురాత్ము
దూషింతుము; నికృతిపరుల నికృతినచేసి నిర్జించినఁ బాపంబు లేదు; సర్వప్రకారం
బులను శత్రువుల జయించి రాజ్యంబు సేకొనుట రాజులకు విధిచోదితం బైన
రాజధర్మంబ” యనిన భీమసేను మహాసంరంభంబునకు సంతోషించి ధర్మ
నందనుం డాతనిం దనపైకిం దిగిచికొని [235]మూర్దాఘ్రాణంబు సేసి యి ట్లనియె.

395


తే.

“అనలునకు గాడ్పు దో డైన యట్టు లింద్ర
తనయునకు నీవు దో డైనఁ దడయ కాజి
[236]బోర రిపులకు బ్రతుకంగఁ బోలదైన
ననఘ! యిది కోపమునకు ననవసరంబు.

396


క.

పదుమూఁడేండ్లుం బోయినఁ
బదపడి పార్థుండు నీవుఁ బరనృపతుల దు
ర్మదుల వధియించి విజయా
స్పదబాహుల రగుఁడు ధర్మపరిరక్షకులై.

397


వ.

ఏ నెట్లును సత్యభంగంబు సేయుట కొడంబడ నోప” నని ధర్మతనయుం డనుజు
ననునయించె; నని జనమేజయునకు వైశంపాయనకథితం బైన పుణ్యకథ యతి
రమణీయంబుగాను.

398


క.

బిరుదాంకభీమ! భీమే
శ్వర[237]కృతకృత్యప్రసాద! సౌజన్యగుణా
భరణ! పరగండభైరవ!
పరనృపమణిమకుటఘటితపద! బుధవినుతా!

399


ఉత్సాహము.

రాజవంశరత్న! రాజరాజ దేవ! నిత్యల
క్ష్మీజయాభిరామ! ధర్మమిత్ర! మిత్రవిద్వదం
భోజవనపయోజమిత్ర! భూరికీర్తికౌముదీ
రాజితత్రిలోక! నిఖలరాజలోకపూజితా!

400


గద్యము.

ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్టప్రణీతంబైన శ్రీమహాభారతంబునం
దారణ్యపర్వంబునందుఁ బాండవవనప్రవేశంబును, గిమ్మీరవధయును, గృష్ణ
పాంచాలాభిగమనంబును, సౌంభకాఖ్యానంబును నింద్రకీలాభిగమనంబును,
గైరాతంబును, నర్జునుతపశ్చరణంబును, నీశ్వరుతోడ యుద్ధంబును, బరమేశ్వ
రుచేతఁ బాశుపతాస్త్రంబు వడయుటయు, లోకపాలసందర్శనంబును, స్వర్గ
గమనంబును, నూర్వశి శాపంబును, దేవతలవలన దివ్యాస్త్రలాభంబును నన్నది
ప్రథమాశ్వాసము.

—————

  1. విభవా....సర్వలోకప్రియ
  2. యుత్తరమించి; యుత్తరించి
  3. యధర్మదురోదరమున
  4. యుర్వియందు, నెట ధర్మువు
  5. యేము కృతార్థు లగుదుము...సుజనులు
  6. మొప్పుదురే
  7. తమతోడ వనవాసంబు సేయవచ్చువారల నిలిపి పాండవులు.......యుండు నంతఁ
  8. మానధన్యులు
  9. నతిప్రియ
  10. బ్రీతి
  11. ధర్మువు
  12. లైనవారి నన్యు, లైన; లగువారి నెప్పుడు, నన్యు లైన విడువ రట్టివిప్ర, వరుల ధర్మపరుల, వసుధేశ నీయట్టి, ధార్మికునకు; లగువారి నన్యుల, నైన విడువ రనిన యట్టివిప్ర, వరుల ధర్మపరుల
  13. అస్మత్పోషణోపాయంబునకు జింత సేయ వలవదు...మధర్మవర్తులయి....రాష్ట్రులరాష్ట్రంబు
  14. వివేకవిహీనుం...బుద్ధి విరహితుఁ డగునే; బుద్ధివిరతుం డగునే; బుద్ధి విగతుం డగునే
  15. తగిలి
  16. విలోలజ్ఞానంబు లనునాలుగింటం బుట్టి
  17. యగుటఁ జేసి స్నేహముల రాగాదుల్; యగుటఁ జేసి స్నేహమున మోహితుఁడై
  18. నీరిలోఁ బొరయనియ; నీరం బొరయనియ; నీరియం దుండియు బొందనియ
  19. కా, స్పద మయి...మది నెఱిఁగి
  20. దృష్ణాపరుండై యర్థ
  21. జన్ముఁ; విభవు
  22. నర్థపరిత్యాగచింత సేయవలయు రూపయౌవనవిభయేంద్రియసంతోషంబు లనిత్యంబు లగుట నెందు; నర్థపరిత్యాగంబు సేయవలయు
  23. నేడ్తెఱఁ
  24. మఱియుఁ దృషితునకు జలంబును బుభుక్షితున కన్నంబును ... శ్రాంతునకు శయనంబును .. నట్టి యజ్ఞశేషం ... బోష్యభుక్తశేషంబు
  25. భ్రాంతంబులయి ... తేజోలుబ్ధభస్మీభూతశలభం ... ధారణరుచివిజ్ఞాన ... సంబంధితుం డ ... బ్రారంభితం బైనయవి
  26. తపోబలంబువలన నైశ్య
  27. ఆత్మార్థసిద్ధులు వడసి బ్రాహ్మణుల భరియించి వారలకు మనోరథంబు
  28. వలవదుండుఁ, డనిన నుడుగుము మీతోన ... బడయవచ్చు
  29. విచారించి
  30. గణఁగి
  31. వర్తించి ... ప్రజాప్రాణధారణంబు ... భీమసేనకార్తవీర్య
  32. భూతా, ధారు .. తమిస్రాదారణ; తమిస్రావారణు; తమిస్రాదారణు ... నఘారి నఘకారుణికు ... భూరిభుజ నీకున్
  33. నారదువలన నేను వడసితి
  34. హితువచనంబులు ... అర్థిఁ బుష్పోపహారమ్ముల ... ననవరతావధానమున నుడిచి; ననవరతానుభావమున నొడిచి ... సూర్యాదినామముల్ సూర్యుగుఱిచి
  35. నెమ్మితోఁ ... జెల్వుగ నిర్వహించె
  36. తనపతుల భుక్త
  37. వీనిచేయి, నెట్టు
  38. అతిశయతాపసోత్తముఁ ... బ్రతీపకులోత్తమ యట్టులైన నీ, కతమునఁ ...మకల్మషకీర్తిఁ
  39. గా దని విభూతి నిచ్చు
  40. నీ కిష్టం బగునెడ కరుగుమనిన
  41. డొలిచికొనఁగ
  42. వచ్చునొండె
  43. నాచరింతు, రల్పకార్యయుక్తు లగు
  44. తమకుఁ దార
  45. నేరక
  46. సకలధర్మప్రియు నా, తమ్ముని నీ విట తోడ్కొని
  47. విశిష్టసంకులముతో ... ధర్మక్రియా ... కొల్వఁగ నొప్పుచున్న బుధమిత్రున్ (బంధున్) ... బ్రభా
  48. స్వరతేజున్
  49. మయ్యు నిటఁ
  50. సకల...సేయుచోటను మనకు
  51. మూర్ధ్నఘ్రాణంబు
  52. యరిగినఁ
  53. ధర్మంబు గా దని దుర్యోధను
  54. వధియింపఁగా నీ
  55. ధృతిఁ బాండుసుతులు సత్య, వ్రతులై; యురుసత్య, వ్రతులై
  56. బు నుపేక్షింపఁగ
  57. ప్రవర్తిల్లె
  58. నేమి సేయుదు ననిన
  59. సురపతియొద్దకుం బోయి కారుణ్యంబుగా
  60. పని సేయఁగ... జీ, వావలికి నెల్లఁ గుశలమ
  61. మునికోలలం బొడిచియు దిట్టియు
  62. తపోబలంబున
  63. డయ్య మీరుఁ
  64. సమకట్టెదరో
  65. త్రాణు... లుత్సాహమతులు ... నాహవమునఁ ... ఘోరరణమున ... నిశ్చలభీకరాకారు; నిశ్చలభీకరాకరు గిట్టి
  66. కార్యసహాయులు ... నాహవంబునాఁడు
  67. రణాంతమ్మున ... బది
  68. కుతూహలపరుఁ డై
  69. నిజపాదపాతఘట్టిత; నిజపాదఘట్టనమహీతలప్రచురవేల్లితవల్లీ...వ్యాకులతచిత్త
  70. బలస్ఫురణ
  71. విస్ఫూరితనేత్రు
  72. నెందున్
  73. నగ్రజునకు నలిగినరక్కసు
  74. భూరిభూరుహముల్ ... నభంబునన్
  75. శోకించి
  76. గిమ్మీరవధ...నట
  77. ప్రవరున కొనరించెద నీ ...మవహితశక్తిన్
  78. నెందు
  79. దత్ఫలంబులు బవనంబు సరస్వతీచక్రంబున నపాకృతసంగుండవై కృష్ణాజినోత్తరీయా(సం)గుండవై నియమకృశీకృతాంగుండవై పండ్రెండువేలవర్షంబు
  80. నుతస్థితశక్తిన్
  81. నిర్వికార; దుర్వికార; నిర్విచార
  82. నెమ్మి
  83. పాండవవీర్యుల భార్యనై పూజ్యుండు నైన నీ ... నుండి రుక్కణంగి యొరుల పోలె, నాపగాతనూజుఁ
  84. వారి, పర భీమార్జునుల
  85. చెయ్వు
  86. ణాకృతి
  87. బట్టి గఱపించియు లాక్షాగృహంబున నుండఁ బనిచి యెవ్వ రెఱుంగకుండ ఘోరానలంబుఁ దతి కొలుపం బనిచియు నట్టి దుర్యోధనుం డిప్పు డధర్మద్యూతంబున
  88. తనరుచు ... లేడుఁ గ్రుంకిన
  89. బాపుచు నుండుటఁ జేసి; బాచుచు నుండుటఁ జేసి ... శత్రులోకవితతిం బరిమార్తుము పొంద నేల సం, తాపము నీకు జేయఁగఁ ద్రిధామజయోన్నతి గల్గియుండఁగన్; శత్రుసంఘము హతిం బరమార్ధముఁ బొంద నేల ... వృథావిజయోన్నతి; విధాతృనియోగము
  90. వినుమా హీనుల దుశ్శా, సనదుర్యోధనులఁ ... నంబుజనేత్రీ; నంబుజవదనా
  91. చేతసుండ నైతి
  92. నధర్మ
  93. వలచిన హితంబు పథ్యము ... కెగ్గులు సేసిన ధార్తరాష్ట్రులకు నెయ్యెడలన్
  94. వీరవరుఁ డెక్కడ బో (వో) నగు నాతని న్నయో, న్నతి ... నశక్యవిక్ర
  95. మార్గవి
  96. శతఘ్ని పరుషాగ్ని ప్రముఖానేకయంత్రఘనకవాటంబు నలంఘ్య ... ప్రతిపాలితనిశాత ... శూలంబులను విహరద్యోధారూఢ ... దేవాయతనగుల్మవల్లీ
  97. నోపక సంరంభంబున సమరసన్నద్ధులై
  98. జిగీషన్
  99. ఈమణిభూషణవృత్తము ఒకప్రతియందు యుత్పలమాలికగా యున్నది. ఉ. ˈఆహవవిక్రముండును నజేయుఁ డరాతిగదావలీసమా, జాహితుఁ డైనరాముఁడును సాల్వచమూపతి క్షేమవృద్ధియున్, ఆహకేలి దాఁకిరి మహార్ణవవీచులభంగి సద్భుజో, త్సాహసమేతు లై కడఁగి సైన్యము వెక్కసమంది చూడఁగాన్.ˈ
  100. దప్పక
  101. జెదర
  102. శరంబులనేర్పున
  103. వీక నెదిర్చెన్ ... ది, గ్భాగ మెల్ల శర
  104. ననలస్ఫులింగం
  105. తవిలిభయము
  106. వదనుండై
  107. కుఁ గలనైనఁ గలవె
  108. కెమ్మెయి గావ ... వలయు సారథి రథులు
  109. సత్త్వుండ ... సహింపు దీని
  110. బ్రహ్మాస్త్రమ్మున
  111. పర్వతులు; మాతులులు
  112. శర్కరావతదేశమున; వార్తకాదేశమున
  113. వ్యాజమునన్
  114. సారథిమీఁదఁ దురంగము, చారుధ్వజతతులపయి
  115. విహతార్ణః; నిహతార్ణః; విధురాంభః
  116. కదిసె
  117. దనుజ విని ... నవిస్తరమతి
  118. యవిసె
  119. దానవుం డయి శిలాకలాపలాసితలతాగుల్మవల్మీకమహాపాదపం బగు పర్వతవర్షంబు
  120. ఁబ్రాకృతు (వీనిన్) నైనన్
  121. లతావితానాతి
  122. విధేయులు; విధానులు
  123. నధిష్ఠితుం డయిన; ననుష్ఠితుం డయిన; వినీతుం డయిన; శిక్షితుం డయిన రాజునకు నలబ్ధలాభాదిచతుర్వర్గంబు ... ప్రజ వొందదు ... రుచిరంబు గానేరదు
  124. బాపబుద్ధియై, పొదలి యిట్లు మిమ్ము; క్రూరహృదయుఁడై, నీతి మాలి మిమ్ము
  125. వలవదనఁడ
  126. మహర్హామృదుశయన
  127. పరుషధాతు
  128. పసిండిపళ్లియల; బసిండిపళ్లెరంబుల
  129. క్షమయుఁ దేజంబును సమమైన నగు (సమమైన దగు) గాని, క్షమయ దాల్చి యుండఁ జనదు పతికి ... సంతతతేజుఁడై, యునికి పాపమందు
  130. అరయ నపకార మొక్కటి యైన సల్ప, మైన శమియించు నది గాక యలయ కిపుడు; అధిప యపరాధ మొక్కండ యైన నదియు
  131. నీ యనుజుల్
  132. ధర్మసంసిద్ధి యగున్
  133. రక్షించుచున్న ... సమబుద్ధిఁ జేకొన నగునె నీకు
  134. లన్యులె చెపుమా
  135. శంకించుచున్న; నతిక్రమించుచున్న
  136. దేవర్షిగణంబులు
  137. మహాత్ము లమర్త్యంబుఁ బొంది రనిన
  138. కర్మఫలంబునందు; కర్మఫలములందు...
  139. నమానుషుం డయి ... నాపన్నుం డగు
  140. మదినిర్భేద్యంబు
  141. యడంగింపఁ దగదె; యడంగింపఁ దగును
  142. దర్మమునంద ... బుద్ధి నిలిపి దుర్మనుజునట్లు నిర్వేదింప
  143. నిర్వేదహతుఁ డగు
  144. బొరయకయుండఁగాఁ గలుగుఁ బొందదు వైరి మనఃప్రియం బొగిన్; బొరయకయుండఁగాఁ గలుగఁ బోలునె వైరి మనఃప్రియం బొగిన్
  145. జవమరి యున్నన్
  146. ధర్మశీలు ... సేయని కుమతిఁ ... సామ్యమున
  147. బాధాకరంబు లట్లు గాకుండ దాన ... ధర్మువు క్షత్రియుల కుత్తమంబు
  148. నికృతిపరులయందు నికృతియ వలయుఁ
  149. శూద్రాన్నంబునందలి; క్షుద్రాన్నంబు నందలి
  150. ఇది విలయప్రారంభంబున కవసరంబు
  151. బహువాహసుభటహస్తిక
  152. బ్రాహ్మణవృత్తి నడిపి తృప్తి చేసి
  153. నీతియుతం బభీష్టసి, ద్ధ్యావహ ... నీవు దలంపఁగా ... రావసరోక్తికిన్ విషమమై
  154. జలుపఁ బూని
  155. రాగదోషమా ... యక్షమా విదశుఁ డై ... సంచల యగు ... సజ్జనుఁ డుండ
  156. సుఖోదయకాలంబుఁ
  157. క్రూరాకారు లగు రిపులకును ముదముగ ను...మనకున్
  158. శత్రుసంహారనిరసనంబున; శత్రువర్ధనంబున నత్యంతహాని
  159. కుండ నజ్ఞాతవత్సర మొక్కదివస ... మెట్లయిన మనము
  160. నిశ్వాసవ్యాకులితమానసుం డై ముఖంబున వివర్ణంబు దోఁపఁ జిన్నంబోయి పెద్దయుం
  161. గుణసంపదలఁ గడుఁ
  162. అల్పోపాయం
  163. ధృతరాష్ట్రసుతులు సుయోధనాదులు దద్దరిపుల యందఱును మనకు; ధృతరాష్ట్రసుతులు సుయోధనాదులు దురాధర్షు లుద్దురులు మనకు, నాపగేయుండును నంగరాజును
  164. గృష్ణాజినోత్తరీయుం డంతన్
  165. భయ మెఱిఁగి
  166. నిట వచ్చితి
  167. జతుష్పాదం
  168. అయ్యది కలితం బయి వశీకృతం బయి (ఈవచనము కొన్నిప్రతులలో కానఁబడదు.)
  169. నిష్టసత్క్రియుల సత్వరణ; లిష్టసత్క్రియల నల్పరణ, ప్రారంభు లైన నెదిరెడు, వా రపరాక్రాంతులయి యవశ్యము పోరన్
  170. ధృతినియత ... వీతకిల్బి ... దా నమిత్రజిఘాంసన్; దగ నమిత్రజిగీషన్
  171. గనకవర్మావృతు ఘనతేజుఁ గనుఁగొని ... బార్థ నీ మనమున ... సంసిద్ధిఁ బొందెడు
  172. అవమానము వొందెడినీ, యవమ
  173. గుణోన్నతు
  174. పరిగృహీత సంతోషామృతపాథేయుం
  175. భూరినగంబునన్ నడచి ... వీచె వానికిన్
  176. తన్న...పుణ్యఫలంబుల్
  177. నిషేధించిన నని నవ్విఘ్నవచనంబులకు చలింపక; బోధించిన విఘ్నవచనం
  178. త్కరవాహిపవనములు వి, స్తరిల్లె; త్తరాసితపవనము వి, స్తరిల్లె
  179. దహనోద్గతధూమచయం
  180. యుర్లును మఱి చెంచుఁ (చుంచు) (చింకి) దరదుల(తలలు) (దరడుల) జడచుచంచు (యంచు) దలలు నొప్ప, తలవళ్లు
  181. క్కట వడియెన్ ... గాఢశరంబులు
  182. గొన్న
  183. నది నెపముగఁ; నది నెపమునఁ; నడు నడుము
  184. కొనుచు
  185. పలుకుల సెప్పక బీరము, గలదేని రణ ... దాఁకెం బెలుచన్
  186. గ్రసించునట్లు ... గ్రసించి పోర ... వాని నవికంపితుఁ బార్థుఁడు
  187. ములుకులు ... వేదన గావించె, నిది యపూర్వ
  188. గినిసి కడంకన్
  189. బొగడంగన్
  190. ధైర్యవృత్తికం దరుదుగ
  191. బరు గిరిజేశ్వరుఁ బన్నగ, నరు నిట్లని; బరు నీశ్వరు గిరిజాసుం, దరు నిట్లని ప్రస్తుతించెఁ
  192. ఎఱుకని యెఱుఁగక నిన్నున్
  193. సంయుతంబుగన్
  194. నమరకంటకు హరు
  195. దివిని బెక్కు
  196. వారణము లగు
  197. వాక్పూజనల నందఱం
  198. నైరావతారూఢు ... యెడ నాది
  199. యంచితా, (పాండవా)నంద(మనోజ్ఞుఁడై)విధాయి యై ... మగ్దితశత్రు ... నప్డు చూచి నయ
  200. వరదివ్యమార్గంబు ... మెఱయ ... యశనివిద్యుత్సమూహాభిశోభి ... కరమువేడ్క నరునికడకు వచ్చె
  201. సంశ్రయంబ వై ...మందరాచలున్
  202. చ్యోతస్థలీరుహ ... చూచి
  203. రత్నహర్మ్య
  204. నెక్కు డనఁదగి శిఖీందురవుల
  205. సకలర్తుసురభికుసుమిత ... నభినుతుఁ(గతుఁ) డయ్యె
  206. మంగళగీతమహితమానసుం డగుచు
  207. వజ్రాభీలో, న్నత
  208. నప్పుడ నుంచెఁ గరంబు; నాతని నుంచెఁ గరంబు
  209. నగ్గించి
  210. 357 వ పద్యము మొదలు 368 వచనమువఱ కొక్కతాళపత్రప్రతియందును, ఒక్కకాకితపుప్రతియందుమాత్రము గలదు.
  211. సంగమాకాంక్షం జేసి
  212. దనదునేత్ర, మధుపముల నతిసౌందర్య ... యఖండధర్మ ... నెయ్య మలర
  213. జనయత్రి యంచు
  214. వావియు వెదకఁ జనునె
  215. మంజరీమంజుల
  216. నిర్వికారధైర్యధుర్యుం డైన
  217. సత్కర్మపరుండ నైన
  218. నిచ్చట నాచారం
  219. వరదుఁడు (వరదుండు) దివ్యాస్త్రములు పార్థునకు వేడ్క మొనయ నిచ్చి
  220. ఇట్టియందు నొక్కట యాసనం బెక్కి
  221. స్థిరమతిఁ; గురుపతిఁ
  222. జగత్ప్రతాపసమున్నతిన్
  223. వసుమతీఖననగర్వితు లై ... కారణావతారు లై
  224. కఖిలసద్వీపధరం గల; కఖిలాస్త్రవేదికి ధరఁ గల ... రాజసూయాధ్వర మునిచిన
  225. బ్రబలసింహమునకుఁ; బ్రౌఢిసింహమునకు .. నట్టివరుఁ డజేయుఁ డై యుండఁ బాండవ, వరులఁ బెనయునట్టివారుఁ
  226. ఋతు; మిత; హితవచను లైనవారి
  227. పాతాభిహతివెర ... గాక, పరులసైన్య మెట్లు బ్రతుకుబోర
  228. దుశ్శాసను లాపాండవులకు
  229. సేసిననిష్కారణవైరంబునకు
  230. నెగ్గు
  231. వరములు వేల్పుల
  232. ధర్మస్థిరుఁ
  233. ˈతదీయభుజాబలసంరంభంబు నాశ్రయించి బలంబునం బరుల జయించి సముద్రవేలావలయవలయితమహీచక్రంబున సకలధరణీరాజ్యంబునుˈ ఈ వచనమునకు వెనుక కొన్నిప్రతులలో, ˈచ. ఘనుఁ డగుచున్నకృష్ణుఁడును గవ్వడియున్ వడిఁ దోడ్పడంగఁ బే, ర్చినను సుయోధనాదులను డెచ్చెర సంగరభూమియందు జు, ల్కన వధియింతు నాదుభుజకల్పితఘోరగదావిభూతి (విఘాత) మ, ర్దననిజగాత్రపర్వతపరంపరలన్ గతభస్మమై జెడన్. వ. అని భీమసేనుండు విజృంభించి ధార్తరాష్ట్రులతోడి కయ్యంబునకు గలు త్రవ్వుచు నంతకాకారుండై మఱియు ధర్మతనయు నవలోకించి యసాధారణవచనంబుల ని ట్లనియె.ˈ ఈరెండుపద్యగద్యము లున్నయవి.
  234. నేను నయి సంగ్రామం
  235. మూర్థ్విఘ్రాణంబు
  236. బొనరి రిపులకుఁ బ్రదుకంగ బోల దైన, ననఘ నిది కోపమునకు ననవసరంబు
  237. కృతనిత్యప్రసాద.....పదవిబుధనుతా