Jump to content

భారతం-ఆరణ్యం/ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

గణేశశారదాగురుభ్యో నమః

శ్రీమదాంధ్రమహాభారతము

ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము



రమ్యధర్మనిత్య
ప్రారంభవిభాసి! రాజపరమేశ్వర! ఘో
రారిమదకుంభికుంభవి
దారణ[1]దారుణకృపాణదక్షిణహస్తా!

1


వ.

అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె; నట్లు [2]సాంత్వనవచనంబుల భీమ
సేనునకుం గోపాటోపోపశమనంబు సేయుచున్న ధర్మరాజునొద్దకు బృహదశ్వుం
డను మహాముని వచ్చి విధిదృష్టవిధానంబునం బూజితుండయి విశ్రమించి
యున్న నమ్మునివరునకు ధర్మతనయుం డధర్మపరులయిన పరులచేతం దమ
పడిన నికారప్రకారం బంతయు నెఱింగించి యి ట్లనియె.

2


క.

 “పుడమియు రాజ్యము బంధుల
విడిచిమృగావలులఁ గలసి, విపినంబులలోఁ
గడుకొని మాయ ట్లిడుమలఁ
బడిన [3]నరులు గలరె యొరులు? పరమమునీంద్రా!”

3


వ.

అనిన నయ్యుధిష్ఠిరునకు బృహదశ్వుం డి ట్లనియె.

4


క.

“దేవసములైన యనుజుల
తో, విప్రులతో, రథాలితో వచ్చి యర
ణ్యావాసము సేసెదు [4]ధర
ణీవల్లభ! నీవు ధర్మనిష్ఠితబుద్ధి.

5


క.

నరనుతుఁడు దొల్లి నలుఁ డను
ధరణీశుఁడు జూదమాడి తన విభవము పు
ష్కరుచేత నోటువడి యొ
క్కరుఁడ కరం బిడుమఁ బడఁడె? [5]కాననసీమన్.”

6

ధర్మరాజునకు బృహదశ్వుండు నలోపాఖ్యానంబు సెప్పుట

వ.

అనిన నది యెట్లని ధర్మనందనుం డడిగిన బృహదశ్వుం డి ట్లనియె; “నిషధేశ్వరుం
డయిన వీరసేనుని కొడుకు నలుం డనువాఁ డనేకాక్షౌహిణీపతి యనవరతాక్ష
ప్రియుం డజేయంబైన తన తేజంబున నెల్లరాజుల జయించి బ్రహ్మణ్యుండయి
బ్రహ్మోత్తరంబుగాఁ బ్రజాపాలనంబు సేయుచుండ.

7

సీ.

అట విదర్భాధిపుఁ డైన భీముం డను
                 వాఁ డనపత్యుఁ డై, వ్రతము లోలి
సలుపుచు, దమనుఁ డ న్సన్మునిఁ బత్నియుఁ
                 దాను నుపాసించి, తద్వరమున
దమయంతి యనుకూఁతు, [6]దమదాంతదమను ల
                 న్సుతులను బడసె విశ్రుతగుణాఢ్యుఁ;
డందుఁ గన్యారత్న మగు దమయంతి దా
                 నత్యంతకాంతిరూపాభిజాత్య


ఆ.

విమలగుణసమృద్ధి వెలుఁగుచు సురసిద్ధ
సాధ్యకన్య లట్టిసఖులు నూర్వు
రొలసి తన్నుఁ గొలుచుచుండఁగ మహి నొప్పు
చుండె నధికవిభవయుక్తి[7]తోడ.

8


వ.

అంత.

9


క.

నలుగుణములు దమయంతికి
నలునకు దమయంతిగుణగణంబులు జను లి
మ్ములఁ బొగడుట నిరువురకును
వెలసె మనోభవవికారవిభ్రమ [8]మెదలన్.

10


వ.

ఒక్కనాఁడు నలుఁడు దమయంతీగుణబద్ధచేతస్కుం డై మదనానలంబు [9]సహింప
నోపక, ప్రమదవనంబున నుండునంత నంతరిక్షకాంతాహారావళియుంబోలె
హంసావళి యవనీతలంబున కవతరించిన.

11


ఆ.

వీరసేనసుతుఁడు [10]వీరుండు హంసల
నడబెడంగుఁ జూచి, నగుచు, వాని
నెగచి యెగచి యందు నెగయకుండఁగ నొక్క
హంసఁ బట్టుకొనియె నతిరయమున.

12


ఆ.

దాని విడిచి పోవఁ[11]గా నోప కఱచుచు
నంతరిక్షమునను హంసలెల్లఁ
బిండుగట్టి తిరుగుచుండె వాతోద్ధూత
శారదాభ్రశకలచయముఁబోలె.

13


వ.

అదియును దన కమ్మనుజేశ్వరుఁ డపాయంబు [12]సేయుంగా వగచి, మనుష్యవాక్యం
బుల ని ట్లనియె: “నయ్యా! యేను నీకుం బ్రియంబు సేసెద; నీహృదయేశ్వరియైన
దమయంతిపాలికిం బోయి నీగుణంబులు దానికి వర్ణించి, యక్కన్య యన్యుల
నపేక్షింపక నీయంద బద్దానురాగ యగునట్లుగాఁ జేసెద.”

14


క.

అనిన విని హంస పలుకులు
దన హృదయంబునకు [13]నమృతధారాపాతం
బునుబోలెనైన నృపనం
దనుఁ డనురక్తుఁ డయి విడిచెఁ దడయక దానిన్.

15


వ.

హంసపిండుతో నదియును విదర్భాపురంబునకుం బఱచి యం దుపవనంబున సఖీజన
పరివృతయై యున్న దమయంతి యంతికంబునకు వచ్చి విహరించుచుండె నంత
[14]వానిం జూచి పరమకౌతుకమ్మున.

16


తే.

ఒండొరులఁ గడవంగ నయ్యువిదలెల్లఁ
బఱచి యొక్కొక్క[15]కలహంసఁ బట్టికొనఁగఁ
జెలువముగ నందు దమయంతిచేతఁ బట్టు
వడియె నలుచేత విడువంగఁ బడిన హంస.

17


క.

దమయంతికి నలునకు సం
గమకారణదూతయైన కలహంస మనో

జ్ఞమనుష్యవాక్యముల న
ద్దమయంతికి హర్ష మెసఁగఁ దా ని ట్లనియెన్.

18


వ.

“నీ హృదయేశ్వరుం డైన నలునొద్దనుండి వచ్చితి; నపారపారావార[16]పర్యంతా
నంతమహీతలంబునందు నా చూడనిరాజు లెవ్వరు లేరు; సర్వగుణసౌందర్యం
బుల నెవ్వరు నలుం బోలరు.

19


తే.

నీవు నలునకుఁ బేర్మితో దేవివైనఁ
[17]గాక నీసముజ్జ్వలరూపకాంతివిభవ
నిత్యసౌభాగ్యభాగ్యాభిజాత్యభద్ర
లక్షణావలు లవి సఫలంబు లగునె.

20


వ.

నీవు నారీరత్నంబ; వాతండు పురుషరత్నంబు; గావున మీ యిద్దఱ సమాగమం
[18]బన్యోన్యశోభాకరం బగు” ననిన విని సంప్రాప్త హృదయసమ్మదయై దమయంతి
దాని కి ట్లనియె.

21


మధ్యాక్కర.

“ఆ రాజు గుణములు నా కెఱింగించినట్టులు నన్ను
నా రాజునకు నెఱింగించి కరుణ నాయందుఁ గావింపు
మారంగ” ననుడు నిషధవిషయమున కరిగి యా హంస
వీరసేనజునకు దాని గుణరూప[19]విభవముల్ సెప్పె.

22


వ.

అంత.

23


చ.

నలదమయంతు లిద్దఱు మనఃప్రభవానలబాధ్య[20]మాన లై
సలిపిరి దీర్ఘవాసరనిశల్ విలసన్నవనందనంబులన్,
నలినదళంబులన్, మృదుమృణాళములన్, ఘలసారపాంసులన్
దలిరులశయ్యలన్, సలిలధారలఁ, జందనచారుచర్చలన్.

24


వ.

ఇట్లిద్దఱు నన్యోన్యరూపగుణశ్రవణసంజాతప్రీతులై యుండునంత నంతఃకర
ణసంతతమనోజాతసంతాపవివర్ణవదనయైన యా దమయంతిం జూచి భయ
సంభ్రమాక్రాంతులై సఖీజను లెల్ల నక్కోమలివృత్తాంతం బంతయు భీమున
కెఱింగించి యి ట్లనిరి.

25


సీ.

“కలహంస పలికిన పలుకులు [21]గణియించు;
                 వడి దాని పోయిన వలను చూచుఁ;
బలుకదు సఖులతో లలితాంగి; మిన్నక
                 యలయుచు నుండుఁ దా ననుదినంబుఁ;
జారువిభూషణాహారవిహార
                 శయ్యాసనభోగంబు లందు విముఖి
యయి, రేయుఁ బగలు నిద్రయు నెప్పు డెఱుఁగక
                 దమయంతి నలుఁడను ధరణినాథు


ఆ.

నంద బుద్ధి నిలిపి కందర్పబాధిత
యగుచు నున్నయది ధరాధినాథ!
ధరణిపతుల నొరుల నురుగుణాఢ్యుల విన
నొల్ల దెంత విభవయుక్తు లయిన.”

26


వ.

అనిన విని భీముం “డేమి సేయుదు? నెవ్విధంబున నమ్మహీపతి నిట రావింప నగు
నో” యని చింతించుచు సంప్రాప్తయౌవన యైనకూఁతుం జూచి యప్పుడు.

27

క.

ఆ వైదర్భుఁడు నిఖిలధ
రావలయములోనఁ [22]గలుగు రాజన్యుల నా
నా విషయాధీశ్వరులను
రావించెం దత్స్వయంవరవ్యాజమునన్.

28


క.

మనుజేశ్వరు లెల్లను బో
రన దమయంతీస్వయంవరమునకు నొప్పం
జనుదెంచిరి సైన్యస్యం
దనఘట్టన నవనితలము దల్లడపడఁగన్.

29


వ.

ఆసమయంబునఁ బర్వతనారదు లను పురాణమునులు భూలోకం బెల్లం గ్రుమ్మరి
యింద్రలోకంబునకు బోయిన, నింద్రుండు వారిం బుజించి భూలోకంబునం
కుశలవార్త యడిగి “యిది యెట్లు? ధర్మపరిపాలనపరు లై వీరు లై రణనిహతు
లై రాజు లక్షయలోకసుఖంబు లనుభవింప నతిథు లై యిందులకు నింతకాలం
బయ్యె రాని కారణం బేమి?” యని యడిగిన నారదుం డి ట్లనియె.

30


క.

“నరసిద్ధసాధ్యవిద్యా
ధరసురకన్యకలకంటె దమయంతియ సుం
దరి; దాని సుస్వయంవర
మరు దై వర్తిల్లుచున్నయది యిప్డు మహిన్.

31


క.

అందులకు ధరణిఁ గల నృప
[23]నందను లెల్లను ముదంబునం బోయెడు వే
డ్కం దములోఁ గలహంబును
గ్రందును లే కున్న వారు గడు నెయ్యమునన్.”

32


వ.

[24]అనిన నింద్రుండును లోకపాలవరులును దదాలోకనకౌతుకంబునం గనక
రత్నరమ్యదివ్యవిమానారూఢు లయి భూలోకంబునకు వచ్చి దమయంతీస్వయం
వరంబునకుం బోయెడువాని, నాదిత్యులలోన విష్ణుండునుంబోలెఁ దేజోధికుం డైన
వాని, ననన్యసాధారణరూపవిభవంబున రెండవ మన్మథుండునుంబోనివాని, నలుం
గని యంతరిక్షంబున విమానంబులు నిలిపి భూతలంబునకు వచ్చి వాని కి ట్లనిరి.

33


సీ.

“నిత్యసత్యవ్రత! నిషధేశ! నీవు
                 మా కమరంగ దూతవై యభిమతంబు
సేయుము” నావుడుఁ “జెచ్చెర నట్టుల
                 చేయుదు; మఱి నాకుఁ జెపుఁడు మీర
లెవ్వార? లేను మీకిష్టంబుగా దూత
                 నై యేమి సేయుదు?” ననిన నతని
కమరేశ్వరుం డిట్టు లనియె “నే నింద్రుండ
                 వీరు దిక్పాలురు విదితయశులు;


ఆ.

ధరణి నొప్పుచున్న దమయంతి సుస్వయం
వరముఁ జూచు వేడ్క వచ్చియున్న
వార మీవు మమ్ము వారిజాక్షికి నెఱిం
గింపు [25]నామధేయకీర్తనముల.

34


వ.

అట్లయిన నక్కోమలి మాయందుఁ దన వలచినవాని వరియించు” ననిన నింద్రు
నకుఁ గృతాంజలి యై నలుం డి ట్లనియె.

35


ఆ.

”ఎఱిఁగి యెఱిఁగి నన్ను [26]నేకార్థసముపేతుఁ
బాడి యయ్య యిట్టి పనికిఁ బనుప?”
ననిన “నుత్సకుండ వై యేల చేసెద
నంటి? చేయకుండ నగునె యింక?

36


ఆ.

నిన్ను నిత్యసత్యనిరతుఁగా నెఱిఁగి,యి
క్కార్యమునకు వలను గలుగు టెఱిఁగి
పనుప వలసే దూతభావ మపేక్షించి;
దేవహితము [27]దీనిఁ దీర్పవలయు.

37

వ.

ఆయుధీయసురక్షితం బయిన రాజగృహం బెట్లు సొర నగు నని శంకింపవలవదు;
దమయంతీనివేశంబు ప్రవేశించునపుడు ని న్నెవ్వరు వారింపనోడుదు” రనిన
శక్రువచనంబుల నశంకింతుండయి నలుం డప్పుడ విదర్భాపురంబునకుఁ బోయి
యొక్కరుండ దమయంతీగృహంబు సొచ్చి.

38

నలుఁడు దమయంతియొద్దకు దేవదూత యై పోవుట

సీ.

హంసచేఁ దన వినినంతకంటెను రూప
                 విభవాతిశయమున [28]వెలయుదాని,
సురకన్యకలయట్టి సురుచిరశతకన్య
                 కాళిచేఁ బరివృత యైన దాని,
హృదయేశుఁ డైన త న్నెప్పుడు వినుచున్కి
                 నలయ కాశ్వాసిత యైన దాని,
దమయంతిఁ జూచి కందర్పశరావిద్ధుఁ
                 డయ్యె నలుం; డంత నతనిఁ జూచి


ఆ.

[29]యితఁ డపూర్వమనుజుఁ డెందుండి వచ్చెనో
యనుచు నుదరిపడి లతాంగు లెల్ల
నాసనములు డిగ్గి యప్పు డభ్యుద్గత
లైరి మనములందు హర్ష మెసఁగ.

39


వ.

అంత.

40


క.

దమయంతి మనోభవనిభు
నమరేంద్రప్రతిము, దినకరాభు, [30]సుధారుక్
సము, వరుణసదృశు, ధనదో
పము, నశ్విసమాను, నిషధపతిఁ జూచి నలున్.

41


క.

వారిరుహనేత్ర మదన
ప్రేరిత యై లజ్జ యుడిగి భీతిల్లక బృం
దారకమూర్తికి రాజకు
మారున కి ట్లనియె మందమందమృదూక్తిన్.

42


వ.

“నీవు మహానుభావుండ వెవ్వండ? విందుల కేమి కారణంబున నేకతంబ వచ్చితి? విది
యత్యుగ్రశాసనుం డైన మదీయ జనకుచేత సురక్షితం బగుట నెవ్వరికిఁ జొర నశ
క్యంబు; దీని నెవ్వరు నెఱుంగకుండ నెవ్విధంబునం జొచ్చితివి? నాకు మనోజవేద
నావివర్ధనుండ వైన నీ తెఱం గెఱింగింపు” మనిన దానికి నలుం డి ట్లనియె.

43


ఆ.

“ఏను దేవదూత; [31]నింతి! నలుండను
వాఁడ; నింద్రదహనవరుణయములు
నీ స్వయంవరంబు నెమ్మితోఁ జూడంగ
నరుగుదెంచి నన్ను నబల! మున్న.

44


క.

నీ యొద్దకుఁ బుత్తెంచిరి
“మాయం దొక్కరు నభీష్టమతి వరియింపం
దోయజముఖిఁ బ్రార్థింపుము;
మాయందఱకును [32]బ్రియం బమర్పుము ప్రీతిన్.”

45


వ.

అనిపంచినఁ దత్ప్రసాదంబున నన్యులచేత నలక్షితుండనై వచ్చితి నింద్రాదు
లకుఁ బ్రియంబు సేయు” మనిన నవనతవదనయై దమయంతి దొల్లి హంసచేత
నలు విని వానియందు బద్ధానురాగయై నవయుచున్న యది యపు డతని నలుం
గా నెఱింగి తద్వచనశ్రవణదుఃఖాయమానమానస యగుచు ని ట్లనియె.

46


తరువోజ.

[33]ఏనేడ? నింద్రాదు లేడ? వారలకు
                 నెప్పుడు మ్రొక్కుదు; నేను నీధనమ;

భూనాథ! నీ గుణంబులు హంసచేతఁ
                 బొలుపుగా విని మనంబున నిల్పియున్న
దాన; భవన్నిమిత్తమున ని ట్లఖిల
                 ధారుణీనాథసార్థంబు [34]రావింపఁ
గా నిప్డు వలసె; లోకఖ్యాతకీర్తి!
                 కరుణించి పతిబుద్ధి గావింపు మిందు.

47


వ.

నీవు దీని కొడంబడనినాఁడు రజ్జువిషాగ్నిజలంబుల బ్రాణపరిత్యాగంబు సేసి
కొందు” ననిన దానిం జూచి నలుం డి ట్లనియె.

48


మత్తకోకిలము.

భూరిసత్త్వులు, సర్వలోకవిభుల్, విభూతిసమృద్ధు, లి
ద్దోరుతేజులు నిన్నుఁ గోరుచు నున్న [35]వా రమరోత్తముల్;
వారి పాదరజంబుఁ బోలని వాని నన్ను మనుష్యుం సం
సారిఁ గోరఁగఁ జన్నె నీకుఁ బ్రసన్నులై సుర లుండఁగాన్?

49


క.

దేవతల కప్రియంబులు
గావించు మనుష్యు లధమగతు లగుదు రిలం;
గావున వారి కభీష్టము
గావింపుము; నన్నుఁ బ్రీతిఁ గావుము తరుణీ!”

50


వ.

అనిన దమయంతి నయనాంతర్గళితబాష్పధారాకలతకపోలయుగళ యగుచుం
బెద్దయుం బ్రొద్దు చింతించి “నీ యభిప్రాయంబునకు నిరపాయంబయిన యుపాయంబు
గంటి; నింద్రాదులు నా స్వయంవరంబునకు వచ్చెదరేని వారిసన్నిధిన నిన్ను వరి
యించెద; నట్లయిన నీకు నిర్దోషం బగు” ననిన నలుండు లోకపాలురపాలికిం బోయి
దమయంతికిం దనపలికినవిధంబును, దనకు దమయంతి పలికినవిధంబును జెప్పె;
నంతఁ బుణ్యతిథినక్షత్రశుభముహూర్తంబున దమయంతీస్వయంవరంబు ప్రవర్తిల్లిన.

51


ఆ.

“నలున కాని నలినదళనేత్ర వరియింప
దట్టె! చూత” మనుచు నమరవరులు
నలువురును గడంగి నలరూపమున వచ్చి
రాస్వయంవరమున కతిరయమున.

52


వ.

అంత.

53


సీ.

దమయంతి సితపుష్పదామాభిశోభిత
                 హస్తయై చనుదెంచి, యంబుజాక్షి
యమ్మహోత్సవదర్శనాగతరాజన్య
                 నివహంబు నీక్షించి, నెమ్మితోడ
నలువురు వేల్పులు నలుఁ దొట్టి యప్పుడే
                 కాకారులై యున్న నందు నలుని
నేర్పరింపఁగ నేర, “కింద్రాదులను, నలు
                 నెఱుఁగు నుపాయ మింకెద్ది యొక్కొ!”


ఆ.

యనుచు సంశయాకులాత్మయై “సురలార!
నలు నెఱుంగు విధము నాకుఁ జేఁయు;
డాత్మ రూపధరుల రగుఁ”డని [36]పరిదేవ
నంబు సేసెఁ దనమనంబులోన.

54


వ.

దేవతలు దాని పరిదేవనంబు విని కరుణించి యనిమిషలోచనంబులు నస్వేదగా
త్రంబులు నొప్ప నవనీతలంబు ముట్టక యాసన్నులై నిలిచి; రంత లోకపాలురు
ను, భూలోకంబునఁ గల రాజలోకంబు నవలోకించుచుండఁ బుణ్యశ్లోకుం డయిన
నలు ధర్మవిధానంబున వరియించి దమయంతి తదీయస్కంధంబున [37]సుగంధి
కుసుమదామకంబు వెట్టిన.

55

క.

దేవతల సాధువాదము
తో, [38]విప్రాశీరవంబుతో, బహుతూర్యా
రావంబులు సెలఁగెను బా
రావారరవంబుఁ బోలె ననివార్యము లై.

56

నలుండు స్వయంవర లబ్ధయైన దమయంతిం బెండ్లియగుట

వ.

ఇ ట్లపూర్వస్వయంవరలబ్ధ యైన దమయంతి నత్యంతవిలాసంబుతో వివాహం
బైన యా నలునకు నింద్రుండు వాని యజ్ఞంబులయందు నిజరూపంబుఁ జూపను,
నగ్నియు వరుణుండును వాని వలచినచోటన యగ్నిజలంబు లుత్పాదింపను,
ధర్ముండు ధర్మువునంద [39]వానిబుద్ధి వర్తిల్లను వరంబు లిచ్చి దేవలోకంబున కరు
గువా రెదుర ద్వాపరంబుతో వచ్చు కలిం గని ”యెందురకుం బోయెద?”వని య
డిగిన నింద్రాదులకుఁ గని యి ట్లనియె.

57


తే.

”అవనిలో దమయంతీస్వయంవరంబు
[40]విస్తరిల్లుట విని కడు వేడ్కతోడ
నేను దమయంతిచే వరియింపఁబడుదు
నని తదర్థినై యరిగెద నాసఁ జేసి.”

58


వ.

అనిన నందఱు నగి నీవందుల కేల పోయె? దది ముందర నిర్వృత్తం బయ్యె; నక్కో
మలి యొరుల నెవ్వరి మెచ్చక నలుం డను వాని వరియించె” ననినం గలి కరం
బలిగి ”యన్నలునకు దమయంతికి రాజ్యవిభవపరిత్యాగంబును, [41]బరస్పరవియో
గంబునుం జేసెద” నని నిశ్చయించి వాని నక్షరతుంగా నెఱింగి, యక్షంబులం జొచ్చి
యుండ ద్వాపరంబుం బనిచి, నలుండు సేయుచున్న యశ్వమేధాదికానేకభూరి
దక్షిణమహాక్రతువులయు, జపహోమదానాది వివిధపుణ్యకర్మంబులయుఁ గార
ణంబునం జొర నవసరంబు గానక యంతరం బన్వేషించుచుఁ బెద్దకాలం బుం
డి, యొక్కనాఁ డతండు కృతమూత్రుండయి జలోపస్పర్శనానంతరంబునం
బాదశౌచంబు సేయ మఱచి సంధ్యోపాసనంబు సేసిన నుపలబ్ధావసరుం డయి
కలి నలునందుఁ బ్రవేశించి, పుష్కరుం డనువానిపాలికిం బోయి తన్నెఱింగించి
“నీవు నలునితో జూదంబాడి వాని రాజ్యంబును సర్వస్వంబును నొడిచికొ” మ్మని
చెప్పి తానును వానికి విప్రవేషంబున సహాయుండయి యక్షంబులు గొని పు
ష్కరుతో నొక్కటం జని నలుం గాంచి “నీవు మారాజుతోఁ జూదం బాడు” మనిన.

59


క.

“ద్యూతార్థము తత్కితవా
హూతుఁడనై జూద మాడకుండుట ధర్మా
పేతం” బని యభిముఖుఁ డై
యాతనితో నలుఁడు జూద మాడఁ [42]గడంగెన్.

60


క.

కలధనము లెల్ల నొడ్డుచు
నలయక జూదమున విజితుఁ డగుచుండె నిజా
ప్తులు వారించిన నుడుగక
నలుఁడు కలిప్రేరణంబునను హతమతియై.

61

వ.

ఇ ట్లనేకమాసంబులు దుర్వ్యసనాసక్తుం డయిన యన్నలుండు వివిధవస్తువాహ
ననివహంబు లొడ్డి, పుష్కరున కోటు వడంబోయిన నెఱింగి, పౌరబ్రాహ్మణప్రధాన
వరులు దమయంతీపురస్కృతు లయి వచ్చి వారించి కలిసమావేశపరవశుం డైన
యన్నలుచేతం బ్రతిహతు లయి పలుకకుండి; రంత దమయంతి చింతాక్రాంతా
చిత్త యై.

62


ఆ.

“ఎంతయోటు వడిన నంతియ జూదంబు
నందుఁ దగులుఁ, జలము నతిశయిల్లు;
నేమి సేయుదాన? నిది యెగ్గునకు మూల”
మని లతాంగి దుఃఖితాత్మ యగుచు.

63


సీ.

అక్షముల్ పుష్కరునందు వశ్యంబులై
                 యునికియు, నలునియం [43]దొండువిధము
లగుటయు నెఱిఁగి నిజాధీశ్వరున కప
                 జయము కా లక్షించి, సరసిజాక్షి
భర్త యనుజ్ఞమున్ బడసి, వార్ష్ణేయుఁడన్
                 సారథిఁ బిలిచి, “యీస్యందనమున
నింద్రసేనుం డను నిక్కుమారకు, నింద్ర
                 సేన యన్కూఁతుఁ జెచ్చెరను దోడు


ఆ.

కొని విదర్భ కరిగి, గుఱుగొని మద్బంధు
జనులయొద్దఁ బెట్టి [44]చట్ట రమ్మ
యంచు నెమ్మిఁ బుచ్చె నాప్తపురోహిత
మంత్రి బాంధవాభిమతము గాఁగ.

64


క.

నలుఁడును ధరణీరాజ్యము
[45]దలఁగఁగ, సర్వంబు నపహృతంబైనఁ, గడుం
దలరి దమయంతిఁ దోడ్కొని
వెలువడియె నశేష రాజ్యవిభవచ్యుతుఁ డై.

65


తే.

పురము వెలి మూఁడహోరాత్రములు వసించి
యున్న నలుపాలి కెవ్వరు నోడి రరుగ
జనవిభుం డైన పుష్కరు శాసనమున
గలికృతద్యూతవిద్వేష కారణమున.

66


వ.

ఇట్లు సర్వజనసత్కారార్హుం డయ్యును నలుండు విధికృతంబున నెవ్వరివలనను
సత్కారంబు గానక జలంబు లాహారంబుగాఁ దత్పురసమీపంబున దమయంతీ
ద్వితీయుం డై యుండి బుభుక్షాపీడ సహింపనోపక హిరణ్యపక్షంబులతోఁ దమ
ముందటఁ దిరుగుచున్న పక్షులంగని యవి భక్ష్యంబు లగునని, యప్పక్షులం
బట్టికౌన సమకట్టి తనకట్టిన పుట్టంబు వానిపై వైచిన నవి పుట్టంబుతోన గగ
నంబున కెగసి నగుచు విగతవస్త్రుం డైన నలునకి ట్లనియె.

67

నలుండు దమయంతీసహితుం డై యడవికిఁ బోవుట

తే.

“నీ ధనంబును రాజ్యంబు నికృతిఁ గొన్న
యక్షముల మేము; నీ వస్త్ర మపహరింపఁ
బక్షిరూపుల మై వచ్చి పార్థివేంద్ర!
యపహరించితి” మని చెప్పి యరిగెఁ జదల.

68


వ.

నలుండును వానిం జూచి విస్మయం బంది “యీ[46]యక్షంబుల దోషంబునం
గాకేమి నా కిట్టి దయ్యె” ననుచు దమయంతి కట్టిన పుట్టంబు చెఱంగు గట్టికొని
యె; నట్లిద్దఱు నేకవస్త్రులయి యొండొరులమొగంబులు సూచి దుఃఖించుచో
నలుండు దమయంతి కి ట్లనియె.

69


క.

“ఇది దక్షిణాపథంబున
కిదియు విధర్భాపురమున, కిది కోసల, కి

య్యది యుజ్జయినికిఁ దెరువులు;
[47]మది నిన్నిటిలోన నరుగ మన కెద్ది యగున్.


క.

[48]అడవులలో నాతోఁ గడు
నిడుమలు వడనోప; వరుగు మిందుముఖీ! యి
ప్పుడు నీ బంధుజనంబుల
కడ” కనవుడుఁ దరుణి శోకగద్గద యగుచున్.

71


ఆ.

అతని కిట్టులనియె “నవనీశ! నీవును
నేనుఁ జని విదర్భ నిష్టలీల
నుండుదము మృగాకులోగ్రవనంబుల
కరుగ నేల? యిడుమ లందనేల?”

72


వ.

అనిన విని నలుం డవనతాననుం డై “నీ చెప్పినట్లు విదర్భేశ్వరు రాజ్యంబును మన
రాజ్యంబ; యేను దొల్లి యధికైశ్వర్యయుతుండనై యందులకుం బోయి బంధు
జనులకు హృదయానందంబు సేసి, యిప్పు డివ్విధంబున సర్వస్వహీనుండ నై
యెట్లు పోవనేర్తు” ననిన దమయంతి యి ట్లనియె.

73


తే.

“అధికదుఃఖరోగార్తున కౌషధంబు
సురుచిరంబుగ భార్యయ చూవె; యెందు
నొనర భార్యాసమేతుఁ డై యున్నవాని
[49]కెంత లయ్యును నాపద లెఱుకపడవు.

74


క.

అలసి నెడ, డస్సి నెడ, నాఁ
కలి దప్పియు నైన యెడలఁ, గడుకొని ధరణీ
తలనాథ! పురుషునకు ని
మ్ముల భార్యయు పాచుఁ జిత్తమున దుఃఖంబుల్.

75


వ.

కావున నిది “[50]మదనుజీవిత యనియును, ననువ్రత యనియు, ననుకంపనీయ యనియు
నన్ను విడువక, నాయనుగమంబున ననుమతుండవు గ” మ్మనిన “నట్ల చేయుదుఁ;
బ్రాణసమాన వైన ని న్నేల విడుతు? నోడకుండు” మని నలుండు దనదేవి నా
శ్వాసించుచు నొక్కటఁ జని, విజనంబైన విపినంబున నొక్కసభం గని, యందు
విశ్రమించి, పరుషధూళిధూసరస్థలంబున శయనించి మార్గశ్రమనిమీలితనయ
నుం డై దుఃఖమునఁ గన్ను మొగుడకున్న లేచి, తనపాదంబులయంతికంబునఁ
గ్లేశపరవశ యై నిద్రవోయెడు దమయంతిం జూచి.

76


సీ.

“ధరణిరాజ్యంబుతో ధనమెల్లఁ బరులచే
                 నపహృతం బగుటయు, నాప్తమిత్ర
బంధుజనంబులుఁ, బ్రకృతిజనంబులు
                 విడుచుటయును, మహావిపినభూమిఁ
బత్నితోఁ దన పరిభ్రమియించుటయు, నప్డు
                 దలఁచి శోకించి, యిత్తరుణి దొల్లి
మృదుశయనంబున మెలఁతలు మెలపుతో
                 నడుగు లొత్తఁగ నిద్ర యనుభవించు


ఆ.

కోమలాంగి; యిపుడు గుఱుకొని పాంసుల
స్థలమునందు నిద్ర దగిలినదియుఁ
బంకజాక్షి నాకు భార్యయై యిట్టిదుః
ఖంబు వొందె దైవఘటనఁ జేసి.

77


వ.

ఏను దీనిదుఃఖంబు జూడనోప; నెటయేనియుం బోయెద; నిది నన్నుం గానక తన
బంధువులయొద్దకుం బోయి దుఃఖంబులం బొరయకుండు” నని విచారించి పోవ
సమకట్టి యక్కోమలి మేలుకొనకుండ మెల్లన దానివస్త్రంబునం దర్ధంబు సించి;
తనకుం బరిధానంబు నేసికొని, వెలువడి కొండొకనేల పోయి, దమయంతియందు

[51]ఘనంబైన తన నెయ్యం బనుతీఁగం ద్రెంపనేరక క్రమ్మఱి వచ్చి.

78


చ.

కలి దమయం బాప సమకట్టు; [52]సతిం బతి వాయ నోపఁ డా
లలన నుదీర్ణసౌహృదబలంబున; నిట్టులు రెంటఁ జేసి య
న్నలుఁడు విమోహరజ్జులఁ బెనంగి గతాగతకారి యైన యు
య్యెలయునుబోలె నూఱడక యెంతయుఁ బ్రొద్దు వినిశ్చితాత్ముఁ డై.

79


తే.

“బాల నొక్కర్తు నిక్కానపాలు సేసి
[53]నిష్ఠురుండ నై యే నెట్లు నేర్తుఁబోవ?”
ననక కలిచేత నాకృష్టుఁ డైన నలుఁడు
విగతకరుణుఁ డై దమయంతి విడిచి చనియె.

80


వ.

అంత దమయంతి మేలు కని పతిం గానక [54]తనవస్త్రార్ధనికృంతనంబును జూచి
లేచి నలుగడం బరికించి భయశోకవ్యాకులచిత్త యయి.

81


సీ.

“హా మహారాజ! మహామహీరక్షణ
                 దక్షదక్షిణబాహుదండ! దండి
తారాతి! నిషధరాజాగ్రణి! న న్నిట్లు
                 వీతదయుండవై విడిచి చనఁగఁ
దగునె? నీ వెన్నఁడు ధర్మువు దప్పని
                 వాఁడవు; సూనృతవ్రతరతుండ;
వోడకు మని నన్ను నూఱడఁ బలికిన
                 పలు కిట్లు మఱవంగఁ బాడి యగునె


ఆ.

పొదలలోన డాఁగి [55]పొడసూప కి ట్లేల
యున్నవాఁడ? విట్టి యుగ్రభావ
మేల నీకు వలసె? నెట వోదు? నిం కెట్లు
గాంతు నిన్ను నుగ్రకాననమున?

82


క.

వగవఁగ సాంగోపాంగము
లగు నాలుగు వేదములయు నధ్యయనము పొ
ల్పుగ నొకసత్యముతో నెన
[56]యగునే? యెవ్వియును బోలవయె సత్యంబున్!

83


వ.

ప్రాణసమానరాల వయినని న్నవశ్యంబును విడువ నని పలికితి; సత్యప్రతిపాల
నంబు సేయు” మని ప్రలాపించుచుం దనయేకాకిత్వంబునకు, [57]నబలాభావంబున
కుఁ, బ్రతిపదన్యాసజాయమానకంటకమృగపన్నగభయంబునకు వగవక నిజనా
థునసహాయత్వంబునకు, దుస్సహక్షుత్పిపాసాశ్రమాకులత్వంబునకు వగచుచు.

84


క.

అలయుచుఁ, బులుఁగుల యెలుఁగుల
కులుకుచు, నుగ్రాతపమున కోపక వృక్షం
బుల నీడల నిలుచుచు, [58]నెలుఁ
గులఁ బులులం జూచి భయము గొని వగ వగచున్.

85


క.

ఏచిన [59]పొదలఁ బొరల్పడఁ
ద్రోచుచు, ముండ్లకు నల్లఁ దొలఁగుచు, దిక్కుల్
సూచుచుఁ, దొడరుచుఁ, ద్రెళ్లుచు,
లేచుచు, లలితాంగి సంచలించుచు నరిగెన్.

86


వ.

ఇ ట్లరుగుచున్న దమయంతి నంతికన్యస్తచరణ యైనదాని నాహారార్థి యయి
యొక్కయజగరంబు వట్టికొనిన [60]నక్కోమలి మెదల నేరక.

87

ఆ.

“ఇంక నైన నన్ను నేల యాలింపవు?
నాకు శరణ మగుము నాథ!” యనుచు
నఱచుచున్న దాని యాక్రందనధ్వని
వినుచు నొక్క యెఱుకు వేగ వచ్చి.

88


వ.

తన[61]పట్టినసురియ న ప్పెనుఁబామువదనంబు వ్రయ్యం దఱిగిన రాహుముఖవిము
క్తయైన చంద్రరేఖయుబోలె నజగరముఖంబువలన వెలువడిన యాదమయంతి
నాశ్వాసించి తత్సమీపసరోవరస్నాతను, వన్యస్వాదుఫలాహారనుంగాఁ జేసి విగత
శ్రమం గావించి “నీవెవ్వరిదాన? విట్లేల యేకతంబ యివ్వనంబునకు వచ్చి?” తని
యడిగి మధురభాషిణి యైన యమ్మగువవలన నంతవృత్తాంతంబు నెఱింగి.

89


కవిరాజవిరాజితము.

రజనికరాననఁ, బీనపయోధర, రజితరాజసుతన్ విలస
ద్గజపతిగామినిఁ, జందనగంధిఁ, బ్రకాశితకాంతిసమన్వితఁ, బం
కజదళలోచనఁ జూచి కిరాతుఁడు కామనిశాతశరాహతుఁ డై
నిజహృదయం బెఱిగించె లతాంగి కనింద్యచరిత్రకు వేడుకతోన్.

90


ఆ.

అగ్నిశిఖయుఁబోలె నంటను, డాయను,
[62]జూడ రానియట్టి శుభచరిత్ర
నెఱుక లేనికఱకుటెఱు కపేక్షించెఁ గా
దనక తనకు నాయు వల్పమైన.

91

దమయంతి శాపంబునం గిరాతుండు చచ్చుట

వ.

దమయంతి వాని నలిగి చూచి “యేను పతివ్రత నైతినేని, యిద్దురాత్ముం
డైన కిరాతుం డిప్పుడ మృతుం డయ్యెడు” మని శాపం బిచ్చిన వాఁ డప్పుడ యగ్ని
దగ్ధం బైన వృక్షంబునుంబోలె విగతజీవుం డై పడియె నట్లు పరమపతివ్రతా
గుణప్రభావంబున.

92


క.

[63]బాల హృదయమున నృపశా
ర్దూలు నిజాధీశు నిలిపి దుష్టోరగశా
ర్దూలాభీలమృగావలి
కోలిన భయ మంద కరిగె నుగ్రాటవిలోన్.

93


వ.

మఱియును.

94


సీ.

సహకార! మత్ప్రియసహకారుఁ, బున్నాగ!
                 పున్నాగుఁ, దిలక! భూభువనతిలకుఁ,
జందన! బుధహరిచందనుఁ, బుష్పితా
                 శోక! సుహృజ్జనశోకదమను,
వకుళ! కులైకదీపకు, విభీతక! భయో
                 పేతార్తిహరు; నలుఁ బ్రీతితోడఁ
గానరే కానలలోన లోకోత్తరు”
                 నని మ్రానిమ్రానికి నరిగి యరిగి


ఆ.

యడుగు; నడుగు లెండ [64]బొడవొడఁ బొక్కిన
నిర్ఝరాంతరముల నిలుచుఁ; బిలుచు
గిరుల దరుల యెడల; నురుగుహాగృహములఁ
దొంగితొంగి చూచుఁ దోయజాక్షి.

95


వ.

ఇట్లు దమయంతి నిజనాథు నన్వేషించుచు భీషణారణ్యంబునం దిరుగునది ముందట.

96


మత్తకోకిలము.

వారిభక్షులు, పర్ణభక్షులు, వాయుభక్షులు, శాకనీ
వారభక్షులు, వృక్షమూలనివాస[65]యుక్తులునై తపం

97

బారఁ జేయు మహామునీంద్రుల యాశ్రమం [66]బెడఁ గాంచె నం
భోరుహాక్షి పురాసమార్జితపుణ్యకర్మఫలంబునన్.

97


వ.

ఇట్లు మృగవ్యాళతస్కరకిరాతనిరంతరం బయిన కాంతారంబునం బుణ్యనదీతీరం
బున నొక్కమునిపల్లియం గని, యందు వసిష్ఠవామదేవవాలఖిల్యభృగు[67]నారద
సదృశు లైన మహామునులం గని నమస్కరించి యున్న, నమ్మునులు దమయంతి
జూచి యచ్చెరువడి “యవ్వా నీ వెవ్వరిదాన? వివ్వనదేవతవొ? దేవభామినివొ?
దివ్యంబైన తేజంబుతో నేకతంబ యేల క్రుమ్మరియెద?” వనిన వారలకు దమ
యంతి యి ట్లనియె.

98


క.

“వినుఁ డేఁ బుణ్యశ్లోకుం
డనఁగ, [68]సదాయజ్ఞనిరతుఁ డనఁగఁ, ధరిత్రిం
దనరిన నలుభార్యను; స
జ్జననుత దమయంతి యన నెసంగినదానన్.

99


వ.

విధివశంబున నన్నుం బాసి నా హృదయేశ్వరుం డెట యేనియుం బోయినఁ దదన్వేష
ణాసక్తచిత్తనై విపినపరిభ్రమణంబు సేసెద; మీ తపోవనంబునకు వచ్చి నలుండు
భవత్పాదాభివందనకృతార్థుం డయి యెక్కడికిం బోయె? నతని పోయినవల
నెఱుంగుదు రేని నానతిండు; కొన్నిదినంబులలోనఁ దద్దర్శనంబు సంభవిల్లని
నాఁడు దేహంబు విడుతు” నని యేడ్చుచున్నదానిం జూచి కరుణించి మును
లి ట్లనిరి.

100


క.

“వనజాయతాక్షి! కతిపయ
[69]దినములలోఁ జూడఁ గాంతు తివిరి నలుని, భూ
జననుతు, నెప్పటియట్టుల
తనపురమున రాజ్యలీలఁ, దనరెడివానిన్.

101


వ.

ఏము తపోదృష్టిం జూచితిమి దుఃఖింపకుండు” మని తాపసులు దమ యగ్ని
హోత్రంబులయు, నపారఫలపుష్పతరునదీరమ్యతపోవనంబులయుఁ దోడ నదృ
శ్యులైనం జూచి దమయంతి “యిది కలయో నిక్కువంబో” యని విస్మయం
బందుచుం జని ముందట నొక్కచనుపం గని దానిం జొచ్చునపు డందలిజనంబులు.

102


సీ.

పాంసుజాలములు పైఁ బ్రాకిన గరము రూ
                 క్షము లగు [70]నూర్థ్వాలకముల దాని,
నతిమలినం బైన యర్ధ వస్త్రంబుచే
                 నావృతం బగు దేహయష్టి దాని,
నాఁకని తృష నిద్ర యను వీని నెఱుఁగక
                 యున్మాదినియుఁ బోలె నున్నదాని;
దమయంతిఁ జూచి కొందఱు పిశాచం బని
                 పఱచిరి; కొందఱు భయము వొంది;


ఆ.

రందుఁ గొంద ఱధికహాస్యంబు సేసిరి
యడవి నేమి రోసె? దనిరి కొంద;
ఱవ్వ! నీవు వేల్ప వగు దని కొందఱు
మొగినకేలు మొగిచి మ్రొక్కిరంత.

103


వ.

దమయంతియు సార్థవాహులం జూచి యిమ్మహాగహనంబున నిట్టి జనసంకులం బైన

సార్థంబు గానంబడియెడు; నెట్టిపుణ్యంబో! యని పల్కి మఱియు ని ట్లనియె.

104


క.

“ఏను నలు భార్యఁ; బుణ్యవి
హీనతఁ [71]బతిఁ బాసి నవసి యేకాంతమ యీ
కానలఁ బరిభ్రమించెదఁ;
గానరె మీ రమృతసదృశుఁ గరుణాత్ము నలున్?”

105


వ.

అనిన దానికి సార్థవాహుండు శుచి యనువాఁ డి ట్లనియె.

106


క.

“నలుఁ గాన; మివ్వనంబునఁ
గల వెప్పుడుఁ గాంతు ముగ్రకరులను, సింహం
బుల, ఋక్షంబుల; నిది మ
ర్త్యుల కవిషయ; [72]మాతపంబు దూఱదు దీనన్.”

107


వ.

అనిన “నిచ్చనుప యెట వోయెడు?” నని యడిగినఁ “జేదిపతి యైన సుబాహుపురంబు
నకుం బోయెడు” నని చెప్పిన “నట్లేని మీతోడ వచ్చెద” నని యప్పరమపతివ్రత
పతిదర్శనలాలస యై మునుల పలుకులు తలఁచుచు సార్థంబుతో నరిగిన.

108


క.

కడు నెండ యెక్కు నంతకు
నుడుగక యచ్చనుప నడచి యుగ్రాటవిలో
విడిసె బహుశీతజలముల
బెడఁగగు నొకచెఱువునొద్దఁ బెద్దయు డస్సిన్.

109


వ.

అంత.

110


సీ.

అర్థరాత్రము నప్పు డందుల కేతెంచె
                 గజయూథములు జలకాంక్షఁ జేసి
యంబుధివిమలతోయంబు లాస్వాదింపఁ
                 జనుదెంచు [73]జలధరసమితి యట్ల;
యచ్చన్పలోన నిద్రాసక్తులైనవా
                 రున్నతద్విపముల యుగ్రపాద
హతిఁ జేసి మర్దితు లైరి కొందఱు; దంత
                 హతిఁ జేసి భిన్నాంగు లైరి కొంద;


ఆ.

ఱఱచి ప్రాణభీతిఁ బఱచి మహీజంబు
లెక్కి రందుఁ గొంద ఱుక్కడంగి;
చనుప యిట్టిపాటఁ బెనుపఱి, యవినీతు
సిరియుఁబోలె నడఁగి విరిసి చనియె.

111


వ.

అట్టి సంక్షోభంబున మరణంబునకుఁ దప్పి దమయంతి యాత్మగతంబున.

112


ఆ.

[74]జీవితార్థులైన జీవుల సుఖసుప్తు
లైన వారిఁ జంపె నఱవ నఱవ;
మరణకాంక్ష నున్న మగువఁ జంపక నను
మఱచె విధికరంబు మందబుద్ధి.

113


సీ.

ఇచ్చన్పతోఁ జని యివ్వనక్లేశంబు
                 దలుగుదు నని బుద్ధిఁ దలఁచి యున్న,
నురుతరసార్థపయోరాశి హస్తియూ
                 థాగస్త్యుచేఁ బీత మయ్యె నదియుఁ;
దొలుమేనఁ జేసిన దుష్కృతశక్తియో
                 వగవక నా స్వయంవరము నాఁడు
సురవరు లర్థులై చూచుచు నుండఁగ
                 నలు వరియించిన నాఁటి యెగ్గు


ఆ.

దలఁచి యిట్టి యాపదలు సేసిరో వేల్పు!
లమరకోపమునన యయ్యె నాకు
నివ్వియోగదుఃఖ; మింకేమి సేయుదు?”
ననుచు వగచుచుండె నంబుజాక్షి.

114

దమయంతి సుబాహుపురంబు ప్రవేశించుట

వ.

ఇట్లు దుఃఖించుచు దమయంతి ప్రభాతంబ [75]హతశేషులైన యచ్చనుపలోని
బ్రాహ్మణవరులతో ననవరతప్రయాణంబులం జేదిపతిపురంబు సొచ్చి జనసంకులం

బైన రాజమార్గంబు దఱియవచ్చుచున్న దాని [76]దినకరప్రభాపటలధూసరితప్రభా
తచంద్రరేఖయుం బోలె దీప్తివిహీన యై, డస్సియు రమ్యాకృతి యైనదానిఁ,
దమయంతిం బ్రాసాదగత యైనరాజమాత దవ్వులం గని తనదాది కి ట్లనియె.

115


తే.

“జీర్ణమై కడుమాసిన చీరగట్టి
ధూళిసరాలకములు దూలుచుండ
నబల యున్మత్తవేషిణియైన లచ్చి
కరణి నిట వచ్చుచున్నది కంటె దాని!

116


వ.

అక్కోమలియందు నా కతిస్నేహం బై యున్నయది; దానిం దోడ్కొని ర” మ్మనిన
నదియు దమయంతిం దోడ్కొని రాజమాతయొద్దకుం జనిన, నారాజమాతయు
దానిం జూచి “నీవెవ్వరిదాన? విట్లేల దుఃఖావేశవివశు వై యున్నదానవు? చెప్పు”
మనిన దమయంతి యి ట్లనియె.

117


మధ్యాక్కర.

“జితవైరి, మత్పతి జూదమాడి నిర్జితుఁ డయి చనినఁ
బతితోడ నీడయుఁ బోలె నేనును బాయక యరిగి
యతిబుభుక్షాతురుం డైన పతిచేత [77]నవ్వ! దైవాను
మతిఁ జేసి వంచిత నైతి నొక్కచో మఱచి నిద్రించి.

118


వ.

అంతనుండియు నమ్మహానుభావు, నేకవస్త్రు, ననికేతను నన్వేషించుచు సైరంధ్రీ
వృత్తంబు సేకొని, వియోగానలంబునం గంది, కందమూలఫలంబుల యాహారం
బుగాఁ, బ్రొద్దువడినచోట నివాసంబుగా, [78]మృగకులంబ సహవాసంబుగా, వనం
బులం బరిభ్రమించితి” నని బాష్పజలంబులం బయోధరస్థలపరాగంబు పంకంబు
సేయుచుఁ బలుక నేరకున్న యా దమయంతికి రాజమాత యి ట్లనియె.

119


క.

[79]నీ వుండుము నాకడ; నిం
దీవరదళనేత్ర! నీపతిని రోయఁగ భూ
దేవోత్తములం బంచెద”
నావుడు ని ట్లనియె భీమనందన నెమ్మిన్.

120


వ.

“ఏను సైరంధ్రి నయి యుండియు నుచ్ఛిష్టంబు ముట్టను; బదధావనంబు సేయను;
బరపురుషులతోఁ బలుక నోపఁ; బతి నన్వేషించుపొంటె నరిగెడు బ్రాహ్మణులతోఁ
బలుకుదు; నట్లయిన నీయొద్ద నుండుదు; నొండువిధంబైన నుండనేర” ననిన “నీ
కిష్టంబైన విధంబున నాయొద్దన యుండు” మని దాని నతిగౌరవంబునం జేకొని
యుండఁ దనకూఁతు సునంద యనుదాని సమర్పించిన.

121


క.

అలయక పుణ్యవ్రతములు
సలుపుచు, సైరంధ్రి యనఁగఁ జేదీశుపురిన్
నలుదేవి యుండె [80]నెదఁ బతిఁ
దలఁచుచు దుస్సహవియోగతాపార్ధిత యై.

122


వ.

అట నలుండు దమయంతిం బాసి దారుణారణ్యంబుతో నరుగువాఁడు ముందట.

123


చ.

అవిరళవిస్ఫులింగనివహంబుల [81]నభ్రపథంబు నంటుచున్

దవదహనం [82]బుదగ్రతరుదాహము సేయుచు నున్నఁ జూచి మా
నవపతి దాని యంతరమునన్ వినియెన్ “నరనాథ! నన్ను గా
రవమునఁ గావ వేగ యిట ర” మ్మను నార్తమహానినాదమున్.

124


క.

విని శంకింపక చెచ్చెర
ననఘుం డత్యుగ్రతరదవానలమధ్యం
బున కరిగి కనియె దీనా
నను [83]మండలితాంగు నొక్కనాగకుమారున్.

125


వ.

అన్నాగకుమారుండును నలునకుం గృతాంజలియై “యేను గర్కోటకుం డను
వాఁడఁ; [84]గర్మవశంబున నొక్కబ్రహ్మఋషి నుపాలంభించి తచ్ఛాపంబున నెక్క
డం గదల నేర కున్నవాఁడ

126


క.

[85]నాలుగుదిశలను దావ
జ్వాలావలి గవిసె; మ్రంది చా నోప; మహీ
పాలక! న న్నొకసరసీ
కూలముఁ జేరంగ నెత్తికొని పొమ్ము దయన్.

127

నలుఁడు గర్కోటకునిచేత దష్టుం డగుట

వ.

నన్ను రక్షించిన నీకుం బ్రియంబు సేయ నోపుదు” [86]ననిన వాని నెత్తికొని పోవం
జులుకనై యంగుష్ఠప్రమాణదేహుం డై యున్న నెత్తికొని నలుం డతిత్వరితగతి
నరిగి, తాపవర్జితంబైన యొక్క సరోవరసమీపంబున విడువం బోయిన, “నింకను
బదియడుగు లరుగుము నీకు శ్రేయఃప్రాప్తిఁ జేసెద” ననిన నడుగు లెన్నికొనుచు
నరిగి పది యగు నడుగునప్పు డప్పాముచేత దష్టుం డై తన రూపంబు విడిచి వికృ
తరూపంబుతో నున్న; నన్నలులకుం గర్కోటకుం డాత్మరూపంబు సూపి యి
ట్లనియె “నయ్యా! నీవు నాచేత విషపీడితుండ వైతినని దుఃఖింపవలదు; ని న్నొరు
లెఱింగిన నెగ్గగుం గావున వికృతశరీరుం జేసితి; నెంతకాలంబు నీశరీరంబున
నావిషం బుండు నంతకాలంబునకు నీకు విషోరగరాక్షసపిశాచశత్రునివహంబు
వలని భయంబు లేదు; సర్వసంగ్రామజయంబును, భార్యాసంగమంబును, నెప్పటి
రాజ్యవిభవంబును నగు; నీ కెప్పుడేని నిజరూపంబు సేకొన నిష్టంబయ్యె నప్పుడ
నన్నుం దలంపు; మీ వస్త్రంబు నీయొద్దకు వచ్చు; దీని ధరియించుడు నిజరూప
ప్రాప్తి యగు” నని వరం బిచ్చి వెండియు ని ట్లనియె.

128


మధ్యాక్కర.

“ఇలఁ బ్రసిద్ధుఁడు ఋతుపర్ణుఁ డనెడు మహీశుఁ డిక్ష్వాకు
కులజుండు నీకు సేవ్యుం డగు; నతనిఁ గొలిచి యం దుండు

[87]నెలకొని; యతనికి నశ్వహృదయ మనెడి విద్య యిచ్చి
వెలయ నతనిచేత నక్షహృదయ మన్విద్యఁ జేకొనుము.

129


వ.

మఱియు బాహుకుం డను నామంబుతో [88]సూతవృత్తి నుండు” మని హితోపదే
శంబు సేసి కర్కోటకుం డదృశ్యుం డైనఁ, దద్వచనంబున నలుఁ డయోధ్యా
పురంబునకుం జని ఋతుపర్ణుం గని “యేను బాహుకుం డనువాఁడ; నశ్వ
శిక్షయందుఁ గుశలుండ; నన్నసంస్కారంబుల శిల్పంబులఁ బెక్కువిధంబు
ల రచియింప నేర్తు; భవత్సేవార్థి నై వచ్చితి” ననిన ఋతుపర్ణుం డి ట్లనియె.

130


క.

“నాయొద్ద నుండుదేని మ
దీయరథాశ్వములకును ద్రుతిని శీఘ్రముగాఁ
జేయుము” నావుడు “నట్టుల
చేయుదు” నని నలుఁడు వాని సేవించెఁ దగన్.

131


వ.

ఇట్లు ఋతుపర్ణునొద్ద నశ్వాధ్యక్షుం డయి [89]దుష్టాశ్వంబుల వశంబుఁ జేయుచు,
నశ్వారోహకుల నారోహణంబుల శిక్షించుచు, రసవంతంబులుగ నన్నసంస్కా
రంబు సేయుచు, ఋతుపర్ణుచేత నియుక్తు లయిన వార్ష్ణేయజీవలులు దనకు
సహాయులుగాఁ బ్రచ్ఛన్నుం డై యుండి యొక్కనాఁడు.

132


సీ.

“ఇభరాజగమన! నీ వెందుల కరిగి? త
                 త్యురుకుచభార! యెం దున్నదాన?
వబల! యెవ్వరిచేత నడవులలోఁ [90]బట్టు
                 వడి? తశనాపేక్షఁ బఱచుచున్న
యుగ్రమృగంబుల యుదరంబులో నున్న
                 దానవే? నీతల్లిదండ్రులొద్ద
ధృతి నున్నదానవే? దేశాంతరంబుల
                 నున్నదానవె?” యంచు నుదితమదన


ఆ.

హతి విమోహితాత్ముఁ డై హృదయేశ్వరిఁ
దలఁచి రాత్రులెల్లఁ దాపమునను
నిద్ర లేక వంది నిట్టూర్పు లూర్పుచు
నుండె నలుఁడు శోక ముత్కటముగ.

133


వ.

అతనిప్రలాపంబు విని యొక్కనాఁడు జీవలుం డాత్మగతంబున.

134


క.

[91]అఱపొఱడుకుఱుచచేతులు
నొఱవశరీరంబుఁ గలిగి యొరులకుఁ జూడం
గొఱగా కుండియు మన్మథు
నొఱపులఁ బడియెడు నితండు యువతీప్రియుఁ డై.

135


వ.

వీనిచేతఁ దలంపంబడియెడువనిత వీనికంటె లెస్స కాకున్నె?” యనుచు బాహు
కునొద్దకు వచ్చి “నీ తలంచుచున్నభార్యకు నీకు నేల వియోగం బయ్యె” నని
యడిగిన బాహుకుం డి ట్లనియె.

136


ఆ.

“నన్నుఁ జూచి నగరె? [92]నలినాక్షి నాకేల?
విప్రయోగమేల? వినవె తొల్లి

యేలయో యెఱుంగ నేను, మందప్రజ్ఞుఁ
డను భటుండు దనలతాంగిఁ బాసి.

137


వ.

దాని నన్వేషించి యెందునుం గానక దుఃఖితుం డై ప్రలాపించినం దత్ప్రలాపం బేను ననుకరించి
తి” నని చెప్పి యి ట్లయోధ్యాపురంబునఁ బ్రచ్ఛన్నుఁ డై బాహుకనామంబుతో నలుం డుండె;
నంత నిట విదర్భేశ్వరుండు నలురాజ్యభ్రంశంబు విని కూఁతురు నల్లుఁడు నెటవోయిరో, యెం
దున్న వారో యని శోకించి.

138


క.

వారల [93]రోయఁగఁ బంచె న
పారబలుం డిష్టులైన బ్రాహ్మణుల, సదా
చారుల, విద్వాంసుల స
త్కారంబులఁ దనిపి వారిఁ గడునెయ్యమునన్.

139


వ.

మఱియు నలదమయంతు లున్నచో టెఱించి వచ్చినవారికి [94]వేయిగద్యాణంబు
లిత్తు ననియు, వారలం దోడ్కొని వచ్చినవారికి గోసహస్రంబులు నగ్రహారం
బులు నిత్తు ననియుఁ బలికి పంచిన.

140

చేదిపురంబున సుదేవుఁ డను బ్రాహ్మణుఁడు దమయంతి నెఱుంగుట

{{Telugu poem|type=క.|lines=

[95]జగతీచక్రమునంగల
నగరమహాగ్రామపక్కణంబులు కలయన్
జగతీదేవోత్తము లి
మ్ముగ రోసిరి నిఖిలదేశముల కరిగి వడిన్.

|ref=}141}
వ.

అందు సుదేవుం డను బ్రాహ్మణుండు చేదిపతి యైన సుబాహుపురంబునకుం జని
పుణ్యాహంబు సేయింపం బోవు బ్రాహ్మణులతో రాజగృహంబు సొచ్చి, యంతః
పురంబున సునందాసహితయై [96]యున్నదాని ధూమజాలనిబద్ధం బైన యగ్నిప్రభ
యునుం బోలె, నీలాభ్రసంవృతంబైన చంద్రరేఖయుంబోలె, బహుపంకనిమగ్నం
బైన మృణాళియుంబోలె, నేర్పడ కున్ననుం దదీయభ్రూయుగమధ్యగతం బైన
సూక్ష్మలక్షణం బిమ్ముగా నిరీక్షించి దాని దమయంతిఁగా నెఱింగి యాత్మగతం
బున “నిది పతివిముక్తయై శుష్కప్రవాహ యైన నదియునుం బోలె, శూన్యకమల
యైన నళినియుం బోలె, నపేతచూతం బైన వనభూమియుం బోలె నొప్పకుండియుఁ
దనపతివ్రతాగుణంబునం జేసి యొప్పుచున్నయది.

142


తే.

అనపహార్యంబు, తేజోమయంబు, సర్వ
గుణములకు నలంకారంబు, గురుతరంబు
భామలకుఁ బతిభక్తియ పరమమైన
భూషణం; బిట్టివే పెఱభూషణములు?

143


వ.

రోహిణికిఁ జంద్రసమాగమంబునుం బోలె దీనికి భర్తృసమాగమం బెన్నం డ
య్యెడునో! తుల్యశీలవయోరూపాభిజాత్యు లైన నలదమయంతు లొక్కట నుం
డం జూచి విదర్భేశ్వరుం డెన్నఁడు కృతార్థుం డయ్యెడునో!” యంచు నల్లనల్లన
డాయవచ్చి దమయంతి కి ట్లనియె.

144

తే.

“అవ్వ! నీ తల్లిదండ్రుల, కాత్మజులకు
బంధుజనులకుఁ గుశలంబు; భామ నీదు
[97]కుశల మెఱుఁగునంతకు వంతగూరి వగచు
చున్నవారు వారికి వంత యుడుగు నింక.

145


వ.

దేవీ! యేను భవద్భ్రాతృసఖుండ సుదేవుం డను బ్రాహ్మణుండ; విదర్భేశ్వరుండు
నీ యున్నచో టెఱుంగం బెక్కండ్రుబ్రాహ్మణులం బుచ్చిన నిందులకు వచ్చి నా
పుణ్యంబున నిన్నుం గంటి” ననిన దమయంతి వాని నెఱింగి తన పుత్త్రులఁ, దల్లి
దండ్రుల, బాంధవుల బ్రత్యేకంబ యడిగి, యశ్రుజలంబు లురుల నేడ్చుచు
న్నంజూచి “యేలకో యిప్పుడు [98]సైరంధ్రి యేడ్చుచున్న యది” యని సునంద
తనజననికిం జెప్పి పుచ్చిన.

146


క.

చనుదెంచె నంతిపురమున
వనితానివహంబుతోడ వారిజదళలో
చన రాజమాత నృపనం
దన యగు దమయంతికడకుఁ [99]దద్దయు వేడ్కన్.

147


వ.

ఇట్లు వచ్చి తమలో మాటలాడుచున్న బ్రాహ్మణుని దమయంతిం జూచి రాజ
మాత బ్రాహ్మణున కి ట్లనియె “నయ్యా! యిది యెవ్వని కూఁతు? రెవ్వని భార్య? యేమి
కారణంబునం దనభర్తను బాంధవులనుం బాసి పుణ్యవ్రంతబులు సలుపు
చున్నయది? నీ వె ట్లెఱింగి? తిక్కోమలి నామం బేమి?” యని యడిగిన సుదేవుం
డి ట్లనియె.

148


మధ్యాక్కర.

“నలినాక్షి యిది విదర్భేశుతనయ; పుణ్యశ్లోకుఁ డైన
నలుదేవి దమయంతి సుమ్ము; విధికారణమ్మున రాజ్య
చలితుఁ డై నిజనాథుఁ డరిగిన దోన చనియె; నవ్వార్త
వెలయంగ విని [100]వీరి రోయఁ బంచె భూవిభుండు బ్రాహ్మణుల.

149


వ.

ఏ నిందులకు వచ్చి మీచేత సురక్షితయై యున్న యిక్కోమలిం జూచి దీని
భ్రూమధ్యంబునం బద్మప్రభం బై విభూత్యర్థంబుగా విధాతనిర్మితం బైన పుణ్య
లక్ష్మంబు పాంసుపటలచ్ఛన్నం బై యున్న నుపలక్షించి మా రాజపుత్త్రింగా నెఱిం
గితి” ననిన సునంద శుద్ధోదకంబుల దానిభ్రూమధ్యంబు గడిగిన నది విస్పష్టం
బగుడు నందఱు నాశ్చర్యం బంది [101]రంత.

150


సీ.

ఆనందభరితాత్మ యై రాజమాత య
                 క్కమలాక్షిఁ బ్రీతితోఁ గౌఁగిలించి
కొని “తల్లి! నీవు నా కూఁతుర; నేను నీ
                 జననియుఁ బేర్మి దశార్ణరాజ
తనయల; మదియు విదర్భేశుపతి యయ్యె;
                 నే వీరబాహున కింతి నైతి;”
ననిన నయ్యవ్వకు నతివినయంబుతో
                 నలుదేవి మ్రొక్కి సునంద నెత్తి


ఆ.

కొని, కరంబు నెమ్మిఁ గొన్నిదినంబు లం
దుండి యిట్టు లనియె నొక్కనాఁడు
“దేవి! యిదియు నదియు ధృతి నాకుఁ బుట్టిన
యిండ్ల; కడుసుఖంబ యిందు నందు.

151

వ.

అయినను దల్లిదండ్రుల, ననుజుల, నాత్మజులం జూడ వేడుక యైనది; విదర్భకుం
బోయెద; నాన తిమ్మని” కృతాంజలి యైన దమయంతి నతిస్నేహంబున సుబాహు
జనని సుతప్రేషితజలంబుతో సువర్ణమణిమయవిమానోపమానయానంబున
నునిచి పుచ్చిన.

152

దమయంతి నలు నెడఁబాసి విదర్భాపురంబు సేరుట

ఉ.

భామ విదర్భ కేఁగి తనబంధుజనంబులయొద్ద నుండియుం
గోమలి దేహసౌఖ్యములకున్ వెలియై మలినార్ధవస్త్రమున్
భూమిరజంబు, నంగమునఁ బొల్పగుచుండఁగ నుండె జీవిత
స్వామి [102]నిజేశుఁ జూచు దివసంబుల కోరుచు సువ్రతంబుతోన్.

153


వ.

ఇట్లు భర్తృవియోగాతురయై దమయంతి ప్రాణంబు భరియింపనోపక యొక్క
నాఁ డేకాంతంబునఁ దనజనని కి ట్లనియె.

154


క.

[103]శోకాపనోదిఁ బుణ్య
శ్లోకుని నలు రోయఁ బనుపు శుభచరితుఁ; దదా
లోకనవిహీననై పర
లోకకృతావాస నగుదు లోకం బెఱుఁగన్.”

155


వ.

అనిన నదియును గూఁతునభిప్రాయంబు భీమున కెఱింగించిన నాతండు నలు
మార్గణంబున ఋజుమార్గు లయినబ్రాహ్మణుల నియోగించినం దనపతి నన్వే
షింప నరుగుబ్రాహ్మణులకు దమయంతి యి ట్లనియె.

156


ఆ.

“నైషధేశ్వరుండు నలుఁ డిప్పు డసమర్థుఁ
డగుటఁ జేసి తన్ను నన్యు లెఱుఁగ
కుండ నుండుఁ గాన [104]యురుసభాంతరముల
కరిగి యిట్టు లనుఁడు మీరు.

157


సీ.

[105]సత్యనిత్యుండవు; సతి నిట్లు వంచించి
                 దాని వస్త్రార్ధంబు దఱిగి నీకుఁ
బరిధానముగఁ జేసి పాడియే పోవంగ?
                 భార్య భర్తవ్య నాఁ బరగు ధర్మ;
మది మిథ్య యయ్యె నీ యందు నీ కిట్టి ని
                 ర్దయబుద్ధిఁ జేకొనఁదగునె? యట్టి
సాధ్వికిఁ గరుణఁ బ్రసన్నుండ వగు” మని
                 యెల్లచోఁ బనికిన నెవ్వఁడేనిఁ


ఆ.

బలుకు వడఁగ నోడి ప్రతివచనం బిచ్చు
నతఁడు నలుఁడుగాఁ బ్రియంబుతోడ
నెఱిఁగి నన్ను నతని కెఱిఁగించి తోడ్కొని
రండు రానినాఁడు రం డెఱింగి.”

158


వ.

అని బంచిన బని పూని బ్రాహ్మణులు దమయంతి కఱపినపలుకులెల్ల సభలం
బలికి యెందునుం గానక వచ్చి; రందుఁ బర్ణాదుం డనుబ్రాహ్మణుండు దమయంతి
కి ట్లనియె “నే నయోధ్య కరిగి నీ కఱపినపలుకు లెల్ల ఋతుపర్ణుసభం బలికిన
నొక్కపురుషుండు, కుఱుచచేతులవాఁడు, ఋతుపర్ణునొద్ద [106]నూఱుగద్యాణంబుల
జీవితంబువాఁడు, శీఘ్రయానకుశలుండు, సూదక్రియానిపుణుండు, విరూపాంగుం

డు, బాహుకుం డను నశ్వశిక్షకుండు విని, నేకతంబ కనుంగొని వెలువె
ల నగుచు దీర్ఘనిశ్వాసపురస్సరుం డై యి ట్లనియె.

159


ఆ.

“పురుషునందు దోషపుంజంబు గలిగిన
నెఱిఁగి [107]యెద సహించునేని భార్య,
పురుషునం దభీష్టభోగంబు దేహాంత
రంబునందు ధర్మరతియుఁ బడయు.”

160


వ.

అని యొండెద్దియుం బలుకక తన నివాసంబునకు బోయె” నని చెప్పిన విని ద
మయంతి పెద్దయుం బ్రొద్దు చింతించి, “నలుండు [108]గానివాఁడు ప్రతివచనం బేల యి
చ్చు? నింకను వలనుగలవారలం బంచి యాతని నిమ్ముగా నెఱుంగ వలయు”
నని నిజ జనని యనుమతంబున సుదేవు రావించి వాని కి ట్లనియె.

161


క.

“నన్నెఱిఁగి తెచ్చినట్లు జ
గన్నుతు నలు నెఱిఁగి తెమ్ము కౌశలమున వి
[109]ద్వన్నాథ! సర్వగుణసం
పన్నుండవు నీవ బుద్ధిఁ బరికింపంగన్.

162


క.

అరుగు మయోధ్యన్ దేశాం
తరవిప్రుఁడవై; రవి ప్రతాపోన్నతు, ను
త్తర[110]కోసలేశు, భాంగా
సరినిం గను మనఘు, నమరసము, ఋతుపర్ణున్.

163


వ.

మఱి “విదర్భావిభుం డగు భీముండు నలు రోయం బంచి యెందునుం గానక యిం
కను దమయంతికిఁ బునస్స్వయంవరంబు రచియింపంబోయిన నందులకు భూ
వలయంబునం గల రాజు లెల్లను బోయెద” రని యతిత్వరితంబుగా ఋతుపర్ణునకుం
జెప్పు మని పంచిన సుదేవుం డయోధ్యానగరంబునకుం బోయి ఋతుపర్ణుం
గాంచి “విదర్భాపురంబున [111]దమయంతీద్వితీయస్వయంవరం బెల్లియె యయ్యెడు”
నని చెప్పిన విని ఋతుపర్ణుండు బాహుకుం జూచి “నాకు దమయంతీస్వయంవరంబుఁ
జూడ నొక్కనాఁటన విదర్భకుం బోవలయు నీ యశ్వశిక్షానైపుణ్యంబుఁ బ్రకాశింపు”
మనిన నట్ల చేయుదు నని నలుండు దనమనంబున దుఃఖించి.

164


ఆ.

“అడవిఁ దన్నుఁ బాసి [112]యరిగిన నలిగి కా
కున్నె యిట్లు సేయ నువిద గడఁగె
నెట్లయేనిఁ గూర్తు రింతులు మా కని
విశ్వసించువారు వెడఁగు లెందు.

165


ఆ.

సాధ్వి నాకుఁ గూర్చు; సంతతి గలయది;
చెలువ యిట్టు లేల చేయు? నైన
నెఱుఁగ వలయు దీని; [113]నే ఋతుపర్ణుతోఁ
బోదు” నని నలుండు బుద్ధిఁ దలంచి.

166


వ.

తొల్లి వార్ష్ణేయుండు దెచ్చిన తన రథంబునందు నిజహయంబుల నాలక్ష్యమాన
శుభలక్షణంబులు మనోవాయువేగంబులు నైనవానిం బూన్చికొని వచ్చిన
ఋతుపర్ణుం డారథం బెక్కునప్పుడు హయంబులు మ్రొగ్గినం జూచి “యిప్పేద
గుఱ్ఱంబు లతిదూరం బెట్లు పోవ నోపు? నొండు గుఱ్ఱంబులం బూన్పు” మనిన
బాహుకుం డి ట్లనియె.

167

క.

“అవనీశ! యీహయంబులు
పవనగతిం బఱచుఁ బ్రొద్దు వడకుండఁగ [114]నేఁ
డ విదర్భకు” ననవుడు విని
కువలయపతి మెచ్చి బాహుకున కి ట్లనియె.

168


వ.

“అట్లయిన నీ హయతత్త్వకౌశలం బెఱింగి నీకు నభిమతం బొనరింతు” నని రథం
బెక్కి బాహుక వార్ష్ణేయసహితుం డయి యరుగువాఁడు.

169


మధ్యాక్కర.

ఎదురను దవ్వులఁ జూచిన పొడవులెల్లఁ దత్క్షణమ
కదియఁగా, నవ్వి యెంతయును దవ్వయి కనఁబడఁ బిఱుఁద,
“నిది దినేశ్వరు రథమో! యనూరుఁడో యితఁ!” డంచు నపుడు
హృదయమునను గడు విస్మయం బందె నిక్ష్వాకుకులుఁడు.

170


వ.

వార్ష్ణేయుండును బాహుకురథంబు గడుపు నేర్పున కచ్చెరువడి యాత్మగతంబున.

171


క.

“ఈతండు శాలిహోత్రుఁడొ!
మాతలియో! నలుఁడొ! యొరులు మానవులు జవో
పేతముగ [115]నిట్లు హయముల
నీతి యెఱుంగుదురె ధారుణీవలయమునన్.

172


వ.

వయోవిద్యావైభవంబుల నతండు నలుం బోలియు, వికృతరూపధరుం డయిన
కారణం బేమియొ? మహాపురుషులు [116]దైవనియుక్తులై ప్రచ్ఛన్నవృత్తి నుండుదు
రు; వారి నెఱుంగం బోలునె యనుచుఁ” జనునప్పుడు ఋతుపర్ణుండు దనయుత్తరీయం
బు జారి భూతలంబుపయిం బడిన మలంగి చూచి “బాహుకా! వార్ష్ణేయుండు వోయి
యుత్తరీయంబు దెచ్చునంతకు రథగమనం బించుక మందంబు సేయు” మనిన
బాహుకుండును “నయ్యా! నీయుత్తరీయంబు వడినయెడ యిచ్చోటికి నొక్కయోజనం
బుగలదు దాని వార్ష్ణేయుం డెట్లు దే నేర్చు” నని రథగమనవేగమహాత్మ్యంబు
సెప్పుచు ననేకదేశంబులు గడచి చని యొక్కయెడ నగణ్యపర్ణఫలాశాఖాలంకృ
తంబయిన విభీతకవృక్షంబు గని రంత ఋతుపర్ణుండు బాహుకున కి ట్లనియె.

173


ఆ.

“ఎల్లవారు నెఱుఁగ రెల్లవానిని; భిన్న
విషయు లెల్లవారు విద్యలందుఁ
[117]దొలఁగ కే నెఱుంగుదును దృష్టిమాత్రన
సకల మైన వస్తుచయము సంఖ్య.

174


వ.

ఇవ్విభీతకంబున ఫలపర్ణసముదాయసంఖ్యఁ జెప్పెద విను; మీ రెండుశాఖలం
గల పర్ణఫలంబులు పదివేలు నొక్కండు; దక్కినశాఖలం గలయవి రెండువేలుం
దొంబదే” ననిన బాహుకుండు విని “వీని నెన్నికాని నిశ్చయింప నేర” నని
తనరథంబు నిలిపి యావృక్షం బాక్షణంబ యురులం ద్రోచి యయ్యైశాఖలం
గల యాకులుం బండులు నెన్నిన, ఋతుపర్ణుండు సెప్పినయన్నియయిన, నచ్చెరు
వడి “యివ్విద్య నాకు నుపదేశింపవలయు” నని యడిగిన ఋతుపర్ణుం డి ట్లనియె.

175


క.

“ఇది యక్షహృదయ మనఁగా
విదితం బగు విద్య” దీని విద్యుక్తముగా

మది [118]నెఱుఁగు నరుఁడు సంఖ్యా
విదుఁ డగు, దుష్కృతకళంకవిషముక్తుఁ డగున్.

176


చ.

సకలగుణప్రసిద్ధుఁ డగు [119]సర్వహితుం డగుఁ జూవె” యంచు బా
హుకునకుఁ బ్రీతితోడ విధియుక్తముగా నుపదేశ మిచ్చె న
త్యకుటిలబుద్ధి నక్షహృదయంబుఁ, గరంబు రయంబుతో విద
ర్భకుఁ జనువేడ్కఁ జేసి ఋతుపర్ణుఁడు పూర్ణమనఃప్రసన్నుఁ డై.

177


వ.

ఇట్లు నలుండు ఋతుపర్ణువలన నక్షహృదయంబు వడసి, సంతుష్టుం డై “నీకు నశ్వ
హృదయం బిచ్చెదఁ బరిగ్రహింపు” మనిన ఋతుపర్ణుం “డట్ల చేయుదు నది యం
తకు నీయంద యుండనిమ్ము; నావలసినప్పుడు గొందు” ననియె నంత నయ్యక్ష
హృదయసామర్ధ్యంబున నప్పుడు.

178

నలుండు గలిచేత విముక్తుండయి విదర్భకుఁ బోవుట

క.

నలుఁ దొల్లి [120]యాక్రమించిన
కలి గర్కోటకవిషంబు గ్రక్కుచు నొడలన్
వెలువడి, నలునకు విహితాం
జలియై, తన్నెఱుఁగఁ జెప్పెఁ జంచలుఁ డగుచున్.

179


ఆ.

వానిఁ జూచి నలుఁడు దానల్గి శాపమీ
నున్నఁ, గలి యెఱింగి “నిన్నుఁ బొంది
యహివిషంబుచేత ననిశంబు [121]దగ్ధుండ
నైతి; నింక నాకు నలుగ వలదు.

180


వ.

నిన్నుం గీర్తించినజనంబులు నావలని భయంబుఁ బొరయరు; నాకుం గరుణింపు” మనిన
నలుండు గోపం బుడిగెఁ; గలియు నవ్విభీతకవృక్షంబు నాశ్రయించె నది
మొదలుగా విభీతకం బప్రశస్తం బయ్యె; నట్లు నలుండు వికృతరూపమాత్రంబు
దక్కఁ దక్కినదుష్కృతంబులవలన విముక్తుం డై రథం బెక్కి యతివేగంబున
ఋతుపర్ణవార్ష్ణేయసహితుం డై విదర్భకుం జనియె; నంత సాయాహ్నంబున.

181


క.

మానుగ ఋతుపర్ణుఁడు భీ
మానుఙ్ఞాతుఁ డయి చొచ్చె నాప్రోలు రథ
ధ్వానంబు [122]మ్రోయుచుండఁగ
నానాదిఙ్ముఖములను ఘనధ్వనివోలెన్.

182


సీ.

దమయంతి యారథధ్వని విని ఠయిది నలు
                 రథఘోషమని యనురాగ మొంది,
నలు, నిషధేశుఁ, బుణ్యశ్లోకు, లోకోప
                 కారకుఁ [123]జూడంగఁ గాంతు నేఁడు;
ఘనభుజుఁ జూడంగఁ గాననినాఁడుఁ, దద్భు
                 జపరిరంభణోద్భూతసుఖముఁ
బడయనినాఁడును బ్రాణముల్ విడుతు నే
                 నని తలంచుచుఁ గమలాయతాక్షి


ఆ.

యారథాధిరూఢుఁ డై వచ్చు ఋతుపర్ణుఁ
జూచి యప్పు డధికశోకతప్త
యగుచు నుండె; నంత నాఋతుపర్ణుండు
భీముఁ గానవచ్చెఁ బ్రియముతోడ.

183


వ.

భీముండును వానిం బూజించి యొక్క[124]రమ్యహర్మ్యంబున విడియించిన ఋతు
పర్ణుం డప్పురంబున స్వయంవరం బను శబ్దంబు మొదలుగా వినం గానక యాత్మ
గతంబున.

184

క.

“ధరణిఁ గల రాజు లిట యె
వ్వరు వచ్చినవారు లేరు; వైదర్భి యొరున్
వరియింప నంత ధర్మే
తరచరితయె?” యనుచు నుండెఁ దద్దయు లజ్జన్.

185


వ.

బాహుకుండును [125]రథశాల రథాశ్వంబుల బంధించి, రథసమీపంబున విశ్రమిం
చియుండె; నంత దమయంతి బాహుకవార్ష్ణేయులతోడ వచ్చిన ఋతుపర్ణుం
జూచి విఫలమనోరథయై యుండనోపక కేశిని యనుదానిం బిలిచి “ఋతుపర్ణు
నయోధ్యాపతింగా వార్ష్ణేయు సూతపుత్రుంగా నెఱింగితి; బాహుకుం డను
వాఁ డెవ్వండో? వానియందు నాహృదయంబు ముదితం బగుచున్నయది; మన
పర్ణాదునకుఁ బ్రతివచనం బిచ్చినవాఁడు వాఁడ కావలయు; వాని కడకుం బోయి
యెఱింగి ర” మ్మని పంచిన నదియును బోయి బాహుకుం గని, “దమయంతి నీకుశలం
బడుగఁ బుత్తెంచె; నిందుల కేమికారణంబున వచ్చి?” తనిన దానికి బాహుకుం
డి ట్లనియె.

186


క.

“ప్రియమున దమయంతిపున
స్స్వయంవరము సేయఁ గడగి [126]సకలక్షత్త్రా
న్వయవీరుల రావించిన
నయనిధి ఋతుపర్ణుఁ డొక్కనాఁటన వేడ్కన్.

187


క.

వినవె శతయోజనంబులు
సనుదెంచె నయోధ్యనుండి సరి నిందుల; కా
తని రథసారథి నై యే
నును వచ్చితి నతనితో మనోవేగమునన్.”

188


వ.

అనిన “మూఁడవవాఁ డెవ్వఁ?” డని యడిగిన నక్కేశినికి బాహుకుం డి ట్లనియె.

189


క.

“నలు రథచోదకుఁ డతఁ డ
త్యలఘుఁడు వార్ష్ణేయనాముఁ” డనవుడు “వాఁ డ
న్నలభూపాలకు పోయిన
[127]వల నొం డెఱుఁగునొకొ?” యనిన వాఁ డి ట్లనియెన్.

190


వ.

“వార్ష్ణేయుండును నలుపుత్త్రుల విదర్భేశ్వరునొద్దఁ బెట్టిపోయి, నడుమ [128]నలురా
జ్యభ్రంశంబు విని ఋతుపర్ణుం గొలిచియుండె; నాతండును నలు నెఱుంగఁడు.

191


క.

నలుతో [129]నొక్కట నరిగిన
నలినాయతనేత్ర భీమనందన యొండెన్,
నలుఁడొండె నెఱుఁగుఁగా క
న్నలు నొరులకు నెఱుఁగఁ గారణము గలదె మహిన్.”

192


వ.

అనిన విని కేశిని యి ట్లనియె.

193


సీ.

“అడవిలో వస్త్రార్ధహారి యై [130]దయ లేక
                 ప్రాణేశ్వరుఁడు దనుఁ బాసి చనిన
నాటివస్త్రార్ధంబు నలినాక్షి యిప్పుడు
                 బరిధానముగఁ బాంసుపటలమలిన
మగుచున్న తనువుతో, ననయంబు జడగొన్న
                 యలకావలులతోడ, నవనితలము
శయనంబుగా, ధర్మచారిణి దమయంతి
                 యనఘ! వ్రతం బిట్టు లాచరించు


ఆ.

చున్న” దనిన నవిరళోద్గతబాష్పపూ
ర్ణంబులైన లోచనంబు లెఱుక
వడకయుండ వదనపద్మంబు వాంచి, తా
నొండువలను సూచుచుండె నలుఁడు.

194

వ.

కేశినియును బాహుకుపలుకులు నాకారంబును దమయంతి కెఱింగించిన నది
యాతని నలుంగా శంకించి “యింకను వాని కడ కేఁగుము; వాఁడు ఋతుపర్ణు
వంటలవాఁడటె! పచనసమయంబున వానిచరితం బిమ్ముగా నెఱింగి ర” మ్మని
పంచిన నప్పుడ చని కేశినియు బాహుకునందు దైవమానుషనిమిత్తాద్భుత
క్రియలు సూచి వచ్చి దమయంతి కి ట్లనియె.

195

కేశిని యను దూతి దమయంతితో నలుని గుణంబులు సెప్పుట

క.

“అతని చరితంబు సెప్పఁగ
నతిమానుష, మపగతప్రయాస, మదృష్ట
శ్రుతపూర్వము; పరమార్థమ
[131]యతనిని వే ల్పనఁగ వలయు నంబుజనేత్రా!

196


సీ.

వినవమ్మ! తృణముష్టిఁ గొని వాఁడు వీచుడు
                 నం దగ్ని యుదయించి యతని వంట
లమరు నంతకు నింధనము లపేక్షింపక
                 యుడుగక మండుచు నుండు; మఱియుఁ
గడఁకతో నంజుళ్ళు గడుగంగ సమకట్టి
                 జల మపేక్షించుడు సంభవిల్లి
కుంభముల్ నిండి దివ్యాంభః ప్రవాహ మ
                 క్షయ మగుచుండుఁ దత్క్షణమ చూడ;


ఆ.

[132]నతని కరతలద్వయావమర్దితము లై
కందియును, మహాసుగంధకుసుమ
తతులు దొంటియట్ల తమ కంపు విడువక
యుండు, నతని తేజ మున్నతంబు.”

197


వ.

అనిన విని దమయంతి వెండియుఁ గేశినిం బంచి, బాహుకువండిన నంజుళ్ళు దెప్పిం
చి, యాస్వాదించి, బాహుకునందు నలులక్షణంబులు గలుగు టెఱింగియు
నూఱడ నోపక వానిపాలికిం గొడుకునుం గూఁతునుం గేశినితోడం బుచ్చిన న
క్కుమారులం జూచి.

198


ఆ.

వశము గాక బాష్పవారి యొల్కుచునుండఁ
గొడుకుఁ గూఁతు నెత్తికొని నలుండు
హర్షపులకితంబు లయిన నిజాంకంబు
లందు వారి నునిచి యాదరమున.

199


వ.

అక్కేశినిం జూచి “యిక్కుమారు లిద్దఱు నాకొడునుం గూఁతునుం బోలిన
వీరి నెత్తికొని దుఃఖించితి” నని తన్నేర్పడకుండం బలికి దానికి ట్లనియె.

200


క.

“నీవిట పలుమఱు వచ్చుచుఁ
బోవుచు నున్కి గని చిత్తములనొండుగ సం
భావింతు రితరజనములు;
గావున [133]రావలవ దింకఁ గార్యార్థినివై.

201


వ.

ఏము దేశాంతరంబుననుండి వచ్చిన యతిథులము; నీకు మాతోడి దేమి?” యనినఁ
గేశిని గ్రమ్మఱి వచ్చి బాహుకుమార్గం బంతయు దమయంతికిం జెప్పిన [134]నది
సంతసించి నిజజనని కి ట్లనియె.

202


ఉ.

“సందియమేల? సర్వగుణసంపదఁ జూడఁగ బాహూకుండు భూ
వందితుఁ డైన నైషధుఁ డవశ్యముఁ దా నగు; నామనంబు నా
నందముఁ బొందుచున్నది ఘనంబుగ; వాఁడిట వచ్చువాఁడొ, యే
నందుల కేఁగుదాననొ [135]రయంబున నాతని నిశ్చయింపగన్.”

203

వ.

అనిన నది యప్పుడ భీము ననుమతంబున దమయంతియొద్దకు బాహుకు రావించిన.

204


క.

చనుదెంచి, యందు దీనా
నన, నవిరళపంకమలిన[136]నతగాత్రఁ, దప
స్విని, నతికృశ దమయంతిం
గనియె నలుం డుదితబాష్పకణకలితముఖిన్.

205


క.

దమయంతి నలుని వికృతాం
గముఁ జూచియు నతని నన్యుఁగా వగవక, [137]నె
య్యమునను, లజ్జను, నతసం
భ్రమమున వివశాత్మ యగుచుఁ బతి కి ట్లనియెన్.

206


వ.

“విజనంబైన విపినంబునందు నలసి నిద్రవోయినదాని, నబల, నతిసాధ్వి, ననువ్రత
నగ్నిసన్నిధిఁ బాణిగ్రహణవిధిలబ్ధ యైనదానిం బాసి నలున ట్లొరులు నిర్దయులై
యరిగినవారు లేరు.

207


క.

సురవరులఁ దొఱఁగి తన్నున్
వరియించితి; నన్నుఁ బుత్రవతి నేలొకొ చె
చ్చెర విడిచె; నాతనికి ని
ష్కరుణున కే నేమి యెగ్గు గావించితినో?

208


వ.

నిన్ను విడువ; నోడకుండు మని పలికిన యప్పలుకు లేల మఱచెనో” యని శోక
తప్తంబైన తనహృదయంబు దడుపుచున్నదియునుంబోలె బాష్పధారలం గుచ
మండలంబు దడుపుచు నున్నదమయంతిం జూచి శోకాకులుం డై నలుం డి ట్లనియె.

209


తే.

[138]కలిసమావిష్టమతి నయి కష్టవృత్తి
నట్టి యిడుమలఁ బడితి నే; నవి మదీయ
తపము బలమున, నీదుఃఖదాహమునను
నష్టమై పోయెఁ; గలి యిప్డు నన్ను విడిచె.

210


వ.

ఏ నిందులకు నీతదర్థంబు వచ్చితి; నది యట్లుండె; నన్ను ననురక్తు, ననువ్రతుఁ, దలం
పక యన్యాపేక్షం బునస్స్వయంవరంబు రచియించుట యిది కులస్త్రీధర్మంబు
గాదు; రాజుల నెల్ల నీస్వయంవరంబునకు రావించుటం జేసి కాదె ఋతుపర్ణుండు
వచ్చె” ననిన వెఱచి కృతాంజలియై దమయంతి యి ట్లనియె.

211


తే.

“నిన్ను రోయంగ విప్రులు నెమ్మి నరిగి
పలికి రెల్లచో నాచేతఁ బలుకఁబడియ;
యందుఁ బర్ణాదుఁ డను విప్రుఁ డయ్యయోధ్య
కేఁగి ప్రతివచవంబుల నెఱిఁగె నిన్ను.

212


వ.

ఆపర్ణాదువలన ని న్నెఱింగినదాననై ని న్నిట రావించునుపాయంబు దలంచి యెల్లి
దమయంతీద్వితీయస్వయంవరం బగు నని ఋతుపర్ణునందుఁ బ్రకాశింప సుదేవుం
డను బ్రాహ్మణుం బుత్తెంచితి.

213


క.

నరవరుఁడు నలుఁడు గా కె
వ్వరు శతయోజనము లొక్కవాసరమున వ
త్తురు నరు లొరు; లని దీనిం
[139]బరికింపఁగఁ గడఁగి యిట్లు వంచితి నధిపా!

214


ఉ.

ఏ నతిపాపభావమును నెగ్గుఁ దలంపక యుండునట్లుగా
నానతవైరి! నీయడుగు లంటఁగ నోపుదు; నట్టిదైన న
న్నీనలినాప్తుఁ, డీయనలుఁ, డీమృగలాంఛనుఁ, డీసురోత్తముల్,

జానుసెడంగ నీక్షణమ చంపరె కోపపరీతచిత్తులై?”

215


వ.

అనుచున్నయవసరంబున నఖిలభూతాంతర్గగతుఁడయిన వాయుభట్టారకుం డెల్ల
వారలు విన నాకాశంబుననుండి నలున కి ట్లనియె.

216


చ.

“అమలచరిత్ర నిట్లు దమయంతిఁ బతివ్రతఁ బల్కుదే? నృపో
త్తమ! విను; దీనియందు విదితం బగుశీలవిధిన్ సుధాంశుఁడుం,
గమలహితుండు, నేను నయి కాచితి మొక్కట మూఁడువర్షముల్,
గొమరుగఁ దీనిఁ జేకొనుము; కోమలి నీకనురక్త” నావుడున్.

217


క.

కురిసె మరుద్వచనానం
తరమున సురపుష్పవృష్టి; దడయక మ్రోసెన్
సురదుందుభినాదంబులు;
గరము [140]ప్రసన్నుఁ డయి వీఁచె గంధవహుండున్.

218


వ.

ఇ ట్లెల్లవారికి నాశ్చర్యంబుగా వాయుదేవుండు ద న్నెఱింగించి దమయంతిపతి
వ్రతాగుణంబులును, బతియందుల యకృత్రిమానురాగంబునుం జెప్పిన విని న
లుండు పరమప్రమోదపరిపూర్ణహృదయుం డై తత్క్షణంబ కర్కోటకుం దలంచి
వాని యిచ్చిన [141]పుట్టంబు పైఁ బెట్టికొని నిజరూపంబు దాల్చిన.

219

నలుండు నిజరూపంబుతో దమయంతిం గూడుట

ఉ.

ఆయతబాహుఁ, [142]దప్తకనకాంచితవర్ణు, మనోజరూపు, నిం
ద్రాయితు, సూర్యతేజు, నిషధప్రభు, నన్నలుఁ జూచి పద్మప
త్రాయతనేత్ర యప్డు దమయంతి గరంబు ముదంబు నొంది ల
క్ష్మీయుత యయ్యె బంధులకు మిత్త్రులకున్ హృదయప్రియంబుగన్.

220


వ.

ఇట్లు సంగతు లైనయయ్యిరువురకు విరహపరితాపంబుతోడన శరీరమలినత్వంబు
వాసెఁ; బరస్పరానురాగంబుతోడన విభూషణశ్రీవిశేషవిలేపనయోగంబులు
విస్తరిల్లె; నంత నంతయు విని భీముండు జాతసస్య యైనవసుధతోయసంప్రాప్తి
నాప్యాయిత యైన [143]ట్లజ్ఞాతచర్యుం డైనతనపతిం బడసి పరమసంతుష్టహృదయ
యై చంద్రుతోఁ గూడిన రాత్రియుంబోలెఁ బతింగూడి యొప్పుచున్న దమ
యంతిం జూచి సంతసిల్లి తనపురంబునం దష్టశోభనంబులు, దేవగృహంబుల
యందు విశేషపూజలు సేయించె; నట్టిమహోత్సవం బెఱింగి ఋతువర్ణుండు నలు
నొద్దకు వచ్చి “నీవు నిఖిలలోకపూజ్యుండ వయ్యును నాయొద్ద బాహుకుండనం
గాఁ బ్రచ్ఛన్నవృత్తి నున్న నిన్ను నెఱుంగక నీచకర్మంబులయందు నియోగించితి;
దీని క్షమియించునది” యని నలుచేత సత్కృతుం డై, యశ్వహృదయోపదేశంబు
గొని, యయోధ్యకుం జనియె; నిట నలుండును విదర్భాపురంబున నొక్కమా
సంబు నివాసంబు సేసి, విదర్భేశ్వరు వీడ్కొని, దమయంతి నంద పెట్టి, యొక్కరథం
బును, బదియాఱేనుంగులును, నేఁబదిగుఱ్ఱంబులు, నాఱునూఱుకాల్బలంబులుఁ

దనకుఁ దోడుగా నిషధపురంబున కరిగి పుష్కరుం గని యి ట్లనియె.

221


క.

దమయంతి రోయిగా జూ
దము నీతో నాడఁ గడఁగెదను; ధరణీరా
జ్యము నీవు నాకు రో యిడు;
మమరఁగ జూదంబు నీకు [144]నభిమతమేనిన్.

222


మత్తకోకిలము.

వీరభోజ్యము [145]సుమ్ము రాజ్యము; వింటె? నీవును, నేను దు
ర్వారవృత్తి రథంబు లెక్కి యవంధ్యవిక్రమ మేర్పడన్
భూరివీరరణం బొనర్తము; పోర నోర్చినవాఁడ యి
ద్ధారుణీతలరాజ్యసంపదఁ దాల్చు వీరగుణోన్నతిన్.

223


వ.

ఈరెంటిలో నీకెయ్యది యిష్టంబు? దానిన కడంగు” మనినం బుష్కరుండు రణం
బునందుఁ బరాజితుండు గావున, నలుం దొల్లియు జూదంబున నొడిచినవాఁ డై,
యింకను నొడిచి దమయంతిం జేకొని కృతార్థుండ నగుదు నని సంతసిల్లి, “యే
నోటు వడితి నేని నఖిలమహీరాజ్యంబు నీయది; నీ వోటు వడితేని దమయంతి
నాయది” యని పలికి యొడ్డి నలుతో జూద మాడి యోటు వడిన.

224


క.

[146]ఘనముగ జంబూద్వీపం
బునఁ గలవారెల్ల నెఱుఁగఁ బుష్కరుచేతం
గొనియెఁ బునర్ద్యూతంబున
ననఘుఁడు నలుఁ డఖిలరాజ్య మత్యున్నతితోన్.

225


వ.

ఇట్లు జూదంబునఁ బుష్కరు నొడిచి సకలమహీరాజ్యంబును జేకొని నలుండు
వాని కి ట్లనియె.

226


క.

“కలిసంప్రాప్తుఁడనై కడు
బల మఱి నీచేతఁ దొల్లి బలవద్ద్యూత
చ్ఛలజితుఁడ నైతి; నది నీ
బల మని గర్వింపవలదు బలవంతుడ వై.

227


వ.

నీవు నాపితృవ్యపుత్త్రుండవు ని న్నెద్దియుం జేయనోపఁ బొ” మ్మని పుష్కరు
విడిచి పుచ్చి పుష్కలం బైనరాజ్యంబుతో నలుం డున్నంత.

228


క.

భీమప్రస్థాపిత యయి
కోమలి దమయంతి పుత్త్రకులుఁ దానును ల
క్ష్మీమహిమ వెలుఁగుచుండఁగఁ
దామరసదళాక్షి వచ్చెఁ దన[147]పతికడకున్.

229


వ.

అట్లు దనమనోవల్లభ యైనదమయంతిం గూడి నలుండు విధివిహితానేకాచ
రితముఖుం డై శతమఖువిలాసంబుతో సకలరత్నయుతంబైన రత్నగర్భాదిరాజ్యం
బు సేసెఁ; గావున నక్షజితుండ నైతి నని వగవవలదు; నీవును దైవమానుషసం
పన్నుండవయి శత్రువుల జయించి సకలమహీసామ్రాజ్యంబు వడయుదు” వని
బృహదశ్వుండు ధర్మరాజునకు నక్షహృదయం బుపదేశించి.

230


సీ.

“ఇన్నలోపాఖ్యాన మెప్పుడు దత్తావ
                 ధాను లై వినువారుఁ దవిలి సభలఁ
జదివెడువారును జగదీశ! కలిదోష
                 నిర్ముక్తు లగుదురు; నిఖిలపుణ్య
ఫలభాగు లగుదురు; బహుపుత్త్రపౌత్త్రాయు
                 రారోగ్యధనయుక్తు లగుదు; రెల్ల
విషములకును, దుష్టవిషయంబులకు దూరు
                 లగుదురు; ధర్మాత్ము లగుదు రుర్విఁ

ఆ.

గడుఁబ్రసిద్ధ మిదియుఁ గర్కోటకుని, దమ
యంతిఁ, బుణ్యమూర్తి యైన నలుని,
[148]నుతచరిత్రుఁ డైన ఋతుపర్ణుఁ గీర్తింప
గలిభయంబు లెల్లఁ గ్రాఁగు నధిప!”

231

ధర్మరాజునొద్దకు నారదమహాముని వచ్చుట

వ.

అని చెప్పి బృహదశ్వుం డరిగినం బాండవులు గాండీవిరాకయ కోరుచుఁ దదా
లోకనప్రీతి నుండునంత నంతరిక్షం బెల్లఁ దనతేజంబున వెలుంగుచుండ నార
దుండు వచ్చి యనుజసహితుం డైనధర్మరాజుచేతం బూజితుం డై యి ట్లనియె.

232


ఆ.

[149]ధర్మపుత్త్ర! నీయుదారచరిత్రకు
ధర్మమతికిఁ దృప్తతముఁడ నైతి;
నడుగు మిష్ట మెద్ది” యనినఁ గృతాంజలి
యై మహీశుఁ డిట్టు లనియె భక్తి.

233


వ.

“మునీంద్రా! నీవు తృప్తుండ వైనం ద్రిజగంబులకుం దృప్తి యగు; నిన్ను జూ
చి కృతార్థుండ నైతి; నా కెప్పుడు నొక్కధర్మసందేహంబు గలదు; దాని నిర్ణ
యించి యానతీయవలయు.

234


చ.

ధరణిఁ బ్రదక్షిణంబుగ ముదంబునఁ గ్రుమ్మరి, తీర్థసేవనా
పరు లగుచున్న ధన్యులు శుభస్థితి నెట్టిఫలంబు నొందఁ గాం
తురు? బహుతీర్థకీర్తనముతే నెఱిఁగింపుము దీని” నావుడున్
నరవరుఁ డైనపార్థునకు నారదుఁ డిట్లని చెప్పెఁ బ్రీతితోన్.

235


క.

[150]ధీరుఁడు భీష్ముఁడు గంగా
ద్వారమునం దొల్లి పితృహితంబుగ [151]శుభక
ర్మారంభుఁ డగుచు నుండె ను
దారుం డధ్యయనసంతతవ్రతపరుఁ డై.

236


వ.

అతని పితృదేవతాభక్తికిఁ, బరమధర్మచరితంబునకు మెచ్చి తద్దర్శనాపేక్షం బుల
స్త్యుం డను మహాముని వచ్చిన నతిభక్తుం డయి యాభీష్ముం డమ్మునిఁ గుశపీఠం
బున నునిచి, యర్ఘ్యపాద్యాదివిధులం బూజించి, యతని యడుగులు తల నిడు
కొని, దక్షిణజానుస్పృష్టమహీతలుం డయి “యేను భీష్ముండ; భవద్దాసుండ”
నని ముకుళితహస్తుం డయి యున్న వానికిఁ బులస్త్యుం డి ట్లనియె.

237


క.

“పితృదేవభక్తిఁ బుణ్య
వ్రతచర్యను నీవ యెల్లవారికి నత్యు
న్నతుఁడవు; గావున నీచె
ధృతిఁ గానఁగఁబడితి నేఁ బ్రతీపకులేశా!

238


వ.

నీయిష్టంబు సెప్పు; మే నమోఘదర్శనుండ” ననిన భీష్ముండు ముదితహృదయుం
డై “మునీంద్రా! నాయందు నీకుఁ బ్రసాదబుద్ధి గలదేనిఁ జెప్పు”మని.

239


క.

మనుజేంద్ర! నన్ను నీ యడి
గినయట్ల పులస్త్యుఁ బుణ్యకీర్తను గంగా
తనయుం డడిగిన, నతనికి
ననఘచరిత్రునకు నిట్టు లని ముని సెప్పెన్.

240

సీ.

“కడఁగి బుద్ధీంద్రియ[152]కర్మేంద్రియముల
                 యందు సంయతచిత్తు లైనవారు,
దృతి నహంకారప్రతిగ్రహాపేక్షల
                 యందు నివృత్తాత్ము లైనవారు,
నల్పభోజనులు, ననారంభకులు నయ్యు
                 నత్యంతసంతోష లైనవారు,
సత్యవ్రతులు, శుభాచారు, లక్రోధను
                 లగుచు ధర్మాన్వితు లైనవారు,


ఆ.

నఖిలతీర్థశతము లాడినఫలములు,
నఖిలయజ్ఞవిధుల నైన ఫలముఁ
బడయుదురు; విహీనభాగ్యదుష్కృతులకుఁ
బరమతీర్థనేవఁ బడయ నగునె?

241


క.

తిలగోసువర్ణదానం
బులు, నుపవాసములు, దీర్థములసేవయు ని
మ్ములఁ జేయనివారు దరి
ద్రులు [153]రోగులు నగుదు రాత్మదోషముపేర్మిన్.

242


క.

క్రతుఫలములు వడయఁగ దు
ర్గతులకు దొరకొనదు; తీర్థగమనంబునఁ ద
త్క్రతుఫలము లందుదురు దు
ర్గతులును; నిది మునులమతము గౌరవ[154]వృషభా!

243


వ.

[155]తీర్థగమనఫలం బెల్లపుణ్యంబులకు విశేషంబు; దీని వినుము.

244


చ.

నమితవిరోధి! పుష్కర మనంగ జగద్విదితంబు పుణ్యతీ
ర్థము మునిసిద్ధసేవ్యము; ముదంబున నందుఁ బయోజసంభవుం
డమరులతోడ సన్నిహితుఁ డై వసియించుఁ; ద్రిపుష్కరంబులున్
సమములు; వాని నెప్పుడును [156]సంస్కృతి సేసినఁ బాయుఁ బాపముల్.

245


క.

పదివేలకోట్లతీర్థము
లుదితము లై పుష్కరముల నుండు; మునీంద్ర
త్రిదశవరు లందుఁ జేసిరి
మదిఁ గృతకృత్యు లయి తపము మఖములుఁ బ్రీతిన్.

246


వ.

అందు గృతస్నాను లై దేవర్షిపితృతర్పణంబులు సేసినవారు దశాశ్వమేధఫలం
బులు వడయుదురు; [157]మాఘమాసంబున నొక్కదివసంబు పుష్కరసేవ సేయుట
యు నొకయేఁ డగ్నిహోత్రంబు వేల్చుటయు సమంబు.

247


క.

అమరవరులందు; బురుషో
త్తముఁ డెట్లు [158]విశేషుఁ, డట్ల దరణిం గల తీ
ర్థములందుఁ బుష్కరత్రిత
యము గరము విశేష మభిమతార్థప్రదమై.

248


వ.

పుష్కరంబునఁ బదియేండ్లు వసియించినవారికి సర్వక్రతుఫలంబును, బ్రహ్మలోక
ప్రాప్తియు నగు; మఱియు జంబూమార్గంబు, దండకాశ్రమంబున నగస్త్యవటం
బను తీర్థంబు లాడి యశ్వమేధఫలంబు వడయుదురు; కణ్వాశ్రమంబును, ధర్మార
ణ్యంబును, యయాతిపతనంబునుం జూచిన సర్వపాపక్షయం బగు; మహాకాళం
బును, గోటితీర్థంబును నశ్వమేధఫలప్రదంబులు; రుద్రవటం బనురుద్రస్థానంబున
రుద్రుం బూజ సేసి గణపతిత్వంబు వడయుదురు; నర్మదాస్నానంబున, దక్షిణ

సింధుస్నానంబునఁ, జర్మణ్వతీతీర్థస్నానంబున నగ్నిష్టోమఫలంబు లగు.

249


క.

అనవద్య వసిష్ఠాశ్రమ
మున నొకదివసంబు శాకమూలాశను లై
జను లుండి పడయుదురు బహు
ధనసంపద, గోసహస్రదానఫలంబుల్.

250


వ.

మఱి పింగం బను తీర్థంబు సేవించి శతకపిలగోదానఫలంబు వడయుదు; రెందేని
నగ్నిదేవుండు ప్రత్యక్షం బై యుండు, నట్టి ప్రభాసతీర్థం బాడి యగ్నిష్టోమాతిరా
త్రఫలంబు పడయుదురు; దుర్వాసునకు విష్ణుదేవుండు వరం బిచ్చుటం జేసి వర
దానం బరంగిన తీర్థం బాడియు, సరస్వతీసాగరసంగమం బాడియు [159]గోస
హస్రదానఫలంబు వడయుదురు.

251


క.

[160]ద్వారవతీపురమునఁ బిం
డారక మను తీర్థమున బెడం గై ముద్రా
కారంబు లై త్రిశూలా
కారము లై పంకజములు గానంగఁబడున్.

252


వ.

అందుఁ బరమేశ్వరుం బూజించి పాపవిముక్తు లగుదురు; సాగరసింధుసంగమస్నా
తు లైనవారు వరుణలోకగతు లగుదురు; శంకుకర్ణేశ్వరంబున నీశ్వరుం బూజించి
దశాశ్వమేధఫలప్రాప్తు లగుదురు; వసుధారయును, వసుసరంబు నను తీర్థంబు లాడి
వసుప్రాప్తు లగుదురు; సింధూత్తమస్నానంబున బహుసువర్ణదానఫలం బగు; భద్ర
తుంగసేవనంబున బ్రహ్మలోకప్రాప్తి యగు; శక్రకుమారీవిలోకనంబున శక్రలోక
గతి యగు; శ్రీకుండంబునఁ బితామహునకు నమస్కరించియు, సౌవర్ణరాజతం
బు లైనమత్స్యంబులు గలవిమలం బనుతీర్థం బాడియు వాసవసాయుజ్యంబు
వడయుదురు; [161]బడబ యను తీర్థంబున నగ్నిదేవునకు నైవేద్యం బిచ్చిన నది
యక్షయం బై పితృదేవతలకుఁ దృప్తిఁ జేయు; గోసహస్రదానంబునకు నశ్వమే
ధసహస్రంబునకు విశేషంబు.

253


క.

దేవిక యనుతీర్థంబునఁ
దేవసమూహంబుతోడఁ ద్రినయనుఁ డుండున్;
సేవిత మై [162]జనులకు నది
గావించు ననూనధర్మకామార్థంబుల్.

254


వ.

అర్ధయోజనవిస్తృతం బై, పంచయోజనాయామం బైన యద్ధేవికానదియును, గా
మాఖ్యంబును, రుద్రతీర్థంబును, యజనయాజనబ్రహ్మవాలుకంబులును, బ్రహ్మాదిదేవ
తల దీర్ఘసత్రస్థానం బైనదీర్ఘసత్రస్థానంబును, సేవించినవారికి నిష్టసిద్ధి యగు; విన
శనం బనుతీర్థంబున నదృశ్యం బై, మేరువునకుం బోవునెడ నాగోద్భేదశివోద్భేద
చమసోద్భేదంబుల నెందేని సరస్వతి గానంబడియె నట్టి సరస్వతియందు నభిషి
క్తులైన వారు [163]నాగలోకంబు వడయుదురు; శశరూపపుష్కరంబులు గల శశయా
నం బను తీర్థంబున స్నానంబును గోసహస్రదానంబునకు సమంబు.

255


మధ్యాక్కర.

ఏ మేమ మున్ను పూజింపుదుము రుద్రు నిం దని వేడ్క
తో మునికోటి దా రున్న నీశుఁ డందొఱకును బ్రీతి

256

గా మతిలోఁ గోటిరుద్రరూపముల్ గావించె; నదియు
భూమిఁ బ్రసిద్ధ మై రుద్రకోటి నాఁ బొలిచి వెలింగె.

256


వ.

అందు రుద్రుఁ బూజ సేసి రుద్రలోకప్రాప్తు లగుదురు.

257


క.

నరనుత! నైమిశమునఁ బు
ష్కరముల మూఁటను జగత్ప్రకాశిత మై యి
ద్ధరణిఁ గురుక్షేత్రము [164]దు
స్తరదురితౌఘముల కెల్ల ద వ్వగుచుండున్.

258


తే.

అమరలోకనివాసుల యండ్రు విబుధు
లా కురుక్షేత్రవాసుల; నదియు వినఁగ
నుత్తమంబు దృషద్వతి యుత్తరమున,
దపనతేజ! సరస్వతి దక్షిణమున.

259


వ.

అక్కురుక్షేత్రశమంతపంచకంబుల నడుమ రామహ్రదంబు నడుమఁ బితామహు
నుత్తరవేది యనంబడు నట్టి కురుక్షేత్రంబు ముట్టినవారికిఁ, గురుక్షేత్రంబునకుం
బోయెద మనినవారికిఁ, గురుక్షేత్రంబున వసియించెద మని తలంచినవారికి
సర్వపాపక్షయం బగుఁ; దదనంతరంబున విష్ణుస్థానంబున విష్ణువు నర్చించి
న నశ్వమేథఫలం బగుఁ; బారిప్లవం బను తీర్థ మాడి యగ్నిష్టోమఫలంబు వడ
యుదురు; పృథివీతీర్థం బాడిన గోసహస్రదానఫలం బగు; శాలూకిని యను తీర్థం
బాడిన దశాశ్వమేథఫలం బగు; సర్పతీర్థం బాడి, యందుఁ దరండకుం డను
ద్వారపాలకునిం జూచినవారి కిష్టసిద్ధి యగు; నెందేని విష్ణుం డాదివరాహం
బయ్యె, నట్టి వరాహతీర్థం బాడినవారికి నగ్నిష్టోమఫలం బగు; నశ్వీనీతీర్థం
బాడిన రూపవంతు లగుదురు; జయంతియందు సోమతీర్థస్నానంబును,
గృతశౌచతీర్థస్నానంబును, రాజసూయ పౌండరీకసమంబు; లగ్నివటంబున,
ముంజవటంబున నీశ్వరు బూజించి [165]గాణపత్యంబు వడయుదురు; యక్షిణీ
తీర్థ మాడి యిష్టఫలంబులు వడయుదురు; కురుక్షేత్రద్వారంబుఁ బ్రదక్షిణం
బు సేసినం బాపక్షయం బగు.

260


క.

వీరుండు క్షత్రియులఁ దన
దారుణపరశువున జామదగ్న్యుఁడు రౌద్రా
కారుఁడు వధియించి తదీ
యారుణమున నేనుమడువు లాపాదించెన్.

261


వ.

అందుఁ బితృతర్పణంబు సేసినం బితృదేవత లాతనికిం బ్రత్యక్షం బయి, నీ కిష్టం
బైన వరంబు వేఁడు మనినఁ, బరశురాముండు వారల కి ట్లనియె.

262


తే.

“క్షత్రవధ నైనపాపంబు గ్రాఁగవలయుఁ;
గడఁగి [166]నాకును సద్గతి గలుగవలయు;
నివియుఁ బుణ్యతీర్థంబు లై యిద్ధరిత్రి;
బరగుచుండంగ వలయు మీకరుణఁ జేసి.”

263


వ.

అని పితృదేవతల వరంబునం బుణ్యతీర్థంబులఁ జేసె; నట్టి రామహ్రదంబు లాడినవా
రికి నశ్వమేధఫలం బగుఁ; గాయశోధనం బను తీర్థం బాడి కాయశుద్ధు లగుదు; రెం
దేని విష్ణుదేవుండు లోకంబుల నుద్ధరించె నట్టి లోకోద్ధారం బను తీర్థ మాడి కులం

బుద్ధరింతురు; శ్రీతీర్థం బాడి శ్రీమంతు లగుదురు; కపిలతీర్థం బాడి కపిలగోస
హస్రదానఫలంబుఁ బడయుదురు; సూర్యతీర్థం బాడి యం దుపవసించిన సూర్య
లోకప్రాప్తు లగుదురు; గోభవనం బను తీర్థం బాడి గోసహస్రసమృద్ధు లగుదురు;
శంఖినీతీర్థం బాడి యుత్తమరూపంబు వడయుదురు; యక్షేంద్రతీర్థం బాడి తరండ
కుం డను ద్వారపాలకుం జూచిన వారు, సరస్వతీస్నాతు లైన వారు నగ్నిష్టోమ
ఫలంబు వడయుదురు; మాతృతీర్థదర్శనంబునం బ్రజావృద్ధి యగు; [167]బ్రహ్మావర్తం
బును, శరవణంబునుం జూచిన సర్వవ్యాధివిముక్తు లగుదురు; శ్వావిల్లోమాపహం
బను తీర్థంబునం దేకాదశదీర్థంబులు గల; వందుఁ బ్రాణాయామంబు సేసిన విప్రు
లకు స్వలోమాపనయనం బగు; నెఱకుచేత సేయంబడి కృష్ణమృగంబు లెందేని
నొక్కతీర్థంబు సొచ్చి మానుషత్వంబు వడిసె, నట్టి మానుషతీర్థం బాడి సర్వదురిత
విముక్తులై దైవత్వంబు వడయుదురు; దాని తూర్పున నొక్కయిరవున నాపగ
యను మహానదిం బితృతర్పణంబు సేసి పితృదేవోద్దేశంబున నొక్క బ్రాహ్మణు
నకుం గుడువబెట్టినఁ గోటి బ్రాహ్మణులు గుడిచిన ఫలం బగుఁ; బితృదేవతలు
దృప్తియు నొందుదురు; బ్రహ్మోదుంబరంబు, సప్తర్షికుండంబుఁ, గేదారంబును
జూచి బ్రహ్మలోకంబు వడయుదురు; కపిలకేదారంబుఁ జూచి పాపవిముక్తులై య
దృశ్యు లగుదురు; నరకం బను తీర్థం బాడి కృష్ణచతుర్దశి నాఁ డీశ్వరుం బూజించి
యెల్ల కోర్కులం బడయుదురు; మూఁడు కోట్ల కూపహ్రదంబులు గల యిలాస్పదం
బను తీర్థం బాడి పితృతర్పణంబులు సేసినవారికి వాజపేయఫలం బగుఁ; గిందాన
కింజప్యంబు లను తీర్థంబులందుఁ జేసిన దానజపంబు లక్షయంబు లగు; నారదతీర్థం
బైన యంబాజన్మంబునందుఁ బ్రాణత్యాగంబు సేసిన వారు సర్వలోకంబులం బడ
యుదురు; శుక్లదశమిం బుండరీకం బను తీర్థం బాడి పౌండరీక ఫలంబు వడయుదు
రు; రందు వైతరణిస్నాతులై రుద్రునకు నమస్కరించి సర్వపాపవిముక్తు లగుదు;
రెందేని దేవత లనేకసహస్రవర్షంబులు దపంబు సేసి రట్టి ఫలకీవనంబను తీర్థం బాడి
యగ్నిష్టోమాతిరాత్రఫలంబులు వడయుదురు; ద్వైపాయనుం డనేక తీర్థంబులు
మిశ్రీకరించుటం జేసి మిశ్రకం బనం బరగిన తీర్థం బాడిన వారికి సర్వతీర్థస్నానఫ
లం బగు; వ్యాసవనంబును, మనోజవంబును మధువటియు ననుతీర్థంబుల నా
డిన గోసహస్రదానఫలంబు వడయుదురు; కౌశికీదృషద్వతీసంగమంబున స్నాతులై
సర్వపాపవిముక్తు లగుదురు; కిందత్తంబునఁ దిలప్రస్థదానంబు సేసి పితరుల ఋ
ణంబు నీఁగుదు; రహస్సుదినతీర్థంబుల నాడి సూర్యలోకప్రాప్తు లగుదురు; మృగ
ధూమంబున గంగాస్నాతులై మహాదేవు నర్చించిన మహాత్ము లశ్వమేధఫలంబు
వడయుదురు; వామనం బను తీర్థం బాడి, వామను నర్చించినవారు విష్ణులోకప్రా
ప్తు లగుదురు; పావనం బనుతీర్థం బాడి కులంబు పవిత్రంబు సేయుదురు; శ్రీకుం

జంబున సరస్వతీస్నాతు లై యగ్నిష్టోమఫలంబు వడయుదురు; ఋషు లెందే
నుండి యాత్రాపరులై కురుక్షేత్రంబునకుం బోదు, రట్టి నైమిశకుంజం బాడి
ఋషితృప్తి సేయుదురు; బ్రహ్మతీర్థం బాడి వర్ణాంతరులు బ్రాహ్మణు లగుదురు;
బ్రాహ్మణులు బ్రహ్మలోకప్రాప్తు లగుదురు.

264


సీ.

అనఘుఁడు [168]మంకణుం డను నొక్కబ్రహ్మర్షి
                 తనచేయి వ్రయ్యంగ దర్భఁ గొనిన
సాంద్రమై శాకరసం బందు నిర్గతం
                 బగుడును హర్షించి యాడుచున్నఁ
జూచి, సహింపక సురలును మునులును
                 హరుపాలి కరిగి “దేవాదిదేవ!
మునివృత్త మేవిధంబున నివృత్తం
                 బగునట్లుగాఁ జేయవే” యనిన హరుఁడు


ఆ.

దపసిరూప మపుడు ధరియించి, యమ్ముని
కడకు వచ్చి “యేమి కారణమున
నాడె? దేమి విస్మయం బిందుఁ జూచితి?
చెప్ప నుచిత మేనిఁ జెప్పు” మనిన.

265


వ.

“నా కరంబున శాకరసంబు వెలువడిన విస్మితుండనయి హర్షించి యాడెద” ననిన
“నిది యేమి విస్మయంబు? దీని జూడు” మని హరుండు తన యంగుష్ఠంబున నంగుళీ
తాడనంబు చేసిన, నందు హిమసన్నిభం బయిన భస్మంబు వెలువడినం జూచి, లజ్జి
తుండయి, “నీవు పరమేశ్వరుండ” వని నమస్కరించి, వేదమంత్రంబుల స్తుతియించి,
“దేవా! నీప్రసాదంబున నాకుఁ దపోవర్థనంబు గావలయు” ననిన నమ్మునివరునకు
నీశ్వరుండు గరుణించి “నీకుఁ దపోవర్ధనమగు; నేను నీయాశ్రమంబున నుండుదు”
ననియె; నట్టి సప్తసారస్వతతీర్థంబు లాడినవారికి సారస్వతసిద్ధి యగు; బ్రహ్మాది
దేవతలచే నధిష్టితంబు లయిన యౌశనసతీర్థంబును, గపాలమోచనంబు, విశ్వా
మిత్రంబుఁ, గార్తికేయంబు ననియెడుతీర్థంబుల నాడి పాపవిముక్తు లయి బ్రహ్మ
లోకంబు వడయుదురు.

266


క.

వేదములయందు వినఁగఁ బృ
థూదకతీర్థంబ యుత్తమోత్తమము సురేం
ద్రాదిసురవరులకును వ్యా
సాది మహాయోగివరుల కాస్పద మగుటన్.

267


వ.

అందు శరీరత్యాగంబు [169]సేసినవార లపారపాపవిముక్తులై ముక్తు లగుదురు; సుర
కన్యాసరస్వతీసంగమస్నాతు లయినవారు బ్రహ్మహత్యాదిపాతకంబువలనఁ
బాయుదురు; దర్భినిర్మితం బయిన యర్థకీలతీర్థం బాడిన శూద్రులు బ్రాహ్మణు లగు
దురు; బ్రాహ్మణులు పరమసిద్ధు లగుదురు; శతంబును, సహస్రంబు ననుతీర్థం
బులందుఁ జేసిన జపదానోపవాసంబులు శతసహస్రగుణంబు లగు; వేల్పులెల్లం
గుమారు సేనాపతింగా నెందే నభిషేకించి, రట్టితైజసం బనుతీర్థంబును, దాని
తూర్పున నుండు కురుతీర్థంబును, స్వర్గద్వారం బనుతీర్థంబును, జూచినవారికి స్వర్గ
ద్వారంబు వివృతంబగు; రుద్రపత్ని యనుతీర్థంబున శంకరనారాయణుల నర్చించి

సర్వదుఃఖవిముక్తు లగుదురు; స్వస్తిపురంబుఁ బ్రదక్షిణంబు సేసి గోసహస్ర
దానఫలంబు వడయుదురు; గంగమడువున నొక్కకూపంబున మూఁడుకోట్ల
తీర్థంబులు సన్నిహితంబు లయి యుండు; నందుఁ గృతస్నాను లయినవారికి సర్వ
తీర్థస్నానఫలం బగు; బదరీవనంబునందు, వసిష్ఠాశ్రమంబునం ద్రిరాత్రంబులు
బదరీఫలభక్షణంబు సేసి పాపవిముక్తు లగుదు; రేకరాత్రం బను తీర్థంబున నేకరా
త్రోపవాసంబు సేసి బ్రహ్మలోకంబు వడయుదు; రాదిత్యాశ్రమం బను వనం
బున నాదిత్యుం బూజించి యాదిత్యలోకగతు లగుదురు; దధీచతీర్థంబునం గన్యా
శ్రమంబునందుఁ ద్రిరాత్రంబు వసియించిన వారికి స్వర్గఫలం బగు.

268


క.

జలరుహసంభవుఁ డాదిగ
గలవేల్పులు, ఋషులు, సిద్ధగరుడోరగులున్
నెలనెల సేవింతురు భూ
తలమున [170]సన్నిహతి యనఁగఁ దగు తీర్థంబున్.

269


వ.

సూర్యగ్రహణంబున దాని నాడినవారు శతాశ్వమేధఫలంబు వడయుదురు;
ధర్ముఁడు దపంబు చేసిన ధర్మతీర్థం బాడి ధర్మశీలు రగుదురు; జ్ఞానపావనంబును,
సౌగంధికంబు ననుతీర్థంబుల నాడినం, జూచిన సర్వపాపవిముక్తు లగుదురు; దేవ
శ్రవ యను సరస్వతీహ్రదంబు నందు వల్మీకంబున వెలువడు జలధార లాడి పితృతర్ప
ణంబు సేసిన వా రశ్వమేధఫలంబు వడయుదురు; సుగంధయు, శతకుంభయు, బంచ
యక్షయుఁ, ద్రిశూలఖాతయు ననుతీర్థంబు లాడి దుర్గతులవలనం బాయుదురు;
తొల్లి పార్వతి యెందేని శాకాహారిణియై దివ్యసహస్రవర్షంబులు తపంబు సేసె,
నట్టి శాకంభరీతీర్థం బాడి యొక్కదివసంబు శాకాహారు లయినవారు పండ్రెండేండ్లు
శాకాహారతపంబు సలిపినవారిఫలంబు వడయుదురు; సువర్ణాఖ్యం బనుతీర్థంబున
రుద్రుం బూజించి, రుద్రలోకగతు లగుదురు; ధూమావతి యనుతీర్థంబును, రథా
వర్తం బనుతీర్థంబును, ధార యన తీర్థంబు నాడి శోకవిముక్తు లగుదురు.

270


క.

ధారుణి [171]లోపల స్వర్గ
ద్వారం బయి ఋషినిషేవితం బగు గంగా
ద్వారం బాడిన ధన్యులఁ
జేరును శతకోటి తీర్థసేవాఫలముల్.

271


వ.

మరియు సప్తగంగాసంగమంబును, ద్రిగంగాసంగమంబును, శక్రావర్తంబును, గన
స్వలంబును, గంగాసరస్వతీసంగమంబు నాదిగాఁ గల పుణ్యతీర్థంబుల నాడి పుణ్య
లోకంబులు వడయుదురు; భద్రకర్ణేశ్వరంబున రుద్రపూజయు; నరుంధతీవటంబును;
సింధుప్రభవంబును; యమునాప్రభవంబు నను పుణ్యతీర్థంబుల సేవయు, సర్వసిద్ధిక
రంబులు; వేదిక యను తీర్థంబును, ఋషికుల్యయను తీర్థంబును, గృత్తికామఘతీర్థం
బులును, విద్యాతీర్థంబును, వేతసికయను తీర్థంబునుం జూచి దురితంబులవలనం
దొలంగుదురు; బ్రహ్మతీర్థం బాడి పద్మవర్ణయానంబుల బ్రహ్మలోకగతు లగుదురు.

272


చ.

సురుచిరకీర్తి! నైమిశముఁ జూచిన మాత్రన పాయుఁ బాప మ
చ్చెరువుగ; నందు మాసము వసించి యనంతఫలంబు లొందఁ గాం

తురు; బహుతీర్థసేవనముతోడ సమానము నైమిశంబు నం
దరుదుగ నొక్కనాఁడు శుచియై యుపవాసము సేయఁ గాంచినన్.

273


వ.

మఱియు నందోద్భవతీర్థంబు, నిందీవరతీర్థంబు, గంగాద్వారంబు, దిశాపతితీర్థంబు
లనియెడుతీర్థంబుల నాడి వాజపేయఫలంబుఁ బడయుదురు; బాహుద యనుతీర్థం
బాడిన ననేకసత్రయాగఫలం బగు; నెందేని రాముండు స్వర్గగతుం డయ్యె నట్టి
సరయూప్రదేశంబున గోప్రదానం బాడియు, దేవతలకు, ఋషులకు యజ్ఞభూమి
యయినతీరంబులు గల గోమతి నాడియు, నశ్వమేధఫలంబు వడయుదురు; కోటి
తీర్థంబునం గుమారు నర్చించియు, వారణాసియందు రుద్రు నర్చించియుఁ, గపి
లాహ్రదం బాడియు రాజసూయఫలప్రాప్తు లగుదురు; మార్కండేయతీర్థం బయి
న గంగాగోమతీసంగమం బాడియు, బ్రహ్మకల్పితం బయిన యూపంబుఁ బ్రద
క్షిణంబు సేసియు వాజపేయఫలంబు వడయుదురు.

274


సీ.

పలువురఁ గొడుకులఁ బడయంగవలయు; నం
                 దొక్కరుండయినను నోపి గయకు
నరుగునో యనియును, నశ్వమేధం బొప్ప
                 జేయునో యనియును, శ్వేతమైన
యాఁబోతు విడుచునో యనియును, గోరుదు
                 [172]రనవద్యులైన గృహస్థు; లట్టి
గయకేఁగి యుభయపక్షములు వసించినఁ
                 గడుఁ బుణ్యు లుభయపక్షముల వారి


ఆ.

నుద్ధరింతు; రంద యొగిఁ బిండ మిడిన వా
రనఘ! పితృదయను గృతార్థు లగుదు
రందు ఫల్గుతీర్థ మాడినవారికిఁ
బరమసిద్ధితో శుభంబు పెరుఁగు.

275


వ.

మఱి యక్షిణీతీర్థంబునందు జలపానంబు సేసి బ్రహ్మహత్యాదిదోషవిముక్తు లగు
దురు; మణినాగం బనుతీర్థం బాడినవారికి నాశీవిషవిషంబు లొందవు; గౌతమవనం
బునం దహల్యహ్రదం బాడి, యుదపానం బనుతీర్థం బాడియు నశ్వమేధఫలంబుఁ
బడయుదురు; రాజర్షిజనకకూపం బాడి విష్ణులోకప్రాప్తు లగుదురు; కంపనయు, మ
హానదియు ననుతీర్థంబుల నాడినవారు పౌండరీకఫలంబు నొందుదురు; దేవపుష్క
రిణిని, మహేశ్వరధారను, మహేశ్వరపదంబున నాడిన నశ్వమేధఫలంబు వడ
యుదురు; తొల్లి కూర్మరూపుం డయిన యసురచేతం గోటితీర్థంబు లపహృతంబు
లయిన వానిఁ దెచ్చి విష్ణుం డెందేని నిలిపె నట్టి మహేశ్వరపథం బనుతీర్థం బాడి
యు, విష్ణుస్థానంబున సాలగ్రామం బనుతీర్థం బాడి, విష్ణు నర్చించియు, నందు
సన్నిహితచతుస్సముద్రం బయినకూపంబు నాడియు విష్ణులోకగతు లగుదురు;
భరతాశ్రమంబునఁ జంపకారణ్యంబున దేవిసహితు నీశ్వరుం బూజించి మిత్రా
వరుణలోకంబు వడయుదురు; కన్యాసంవేద్యం బనుతీర్థంబునఁ గన్యాదానంబు
సేసి యక్షయఫలప్రాప్తు లగుదురు; దేవకూటం బనుతీర్థం బాడి బ్రహ్మలోకం
బుఁ బడయుదు; రెందేని విశ్వామిత్రుండు సిద్ధిం బొందె, నట్టి కౌశికహ్రదం బాడి
యుఁ, గుమారవీరాశ్రమంబున నొక్కమాసంబు వసియించియు, నశ్వమేధఫలం

బు వడయుదు; రగ్నిధారయుఁ, బితామహసరంబునం బుట్టిన కుమారధారయు
నాడి త్రిరాత్రోపవాసంబు సేసినవారు బ్రహ్మహత్యాది[173]దోషవిముక్తు లగుదురు;
గౌరీశిఖరకుండం బాడిన, నందినీకూపం బాడిన, నశ్వమేధఫలం బగుఁ గాళికా
కౌశికాసంగమంబునందుఁ ద్రిరాత్రోపవాసంబు సేసినవారు సర్వపాపవిముక్తు
లగుదు; రూర్వశీతీర్థం బాడిన సర్వపూజార్హు లగుదురు; గోకర్ణంబను తీర్థం బా
డి జాతిస్మరణంబు వడయుదురు; సరస్వతీతీర్థస్నాతు లయి వృషభద్వీపంబునం
గుమారుఁ బూజించి దేవవిమానగతు లగుదురు; నందయు, నందాలకయుఁ, గర
తోయంబును, గంగాసాగరసంగమంబు ననుతీర్థంబుల నాడి శతాశ్వమేధఫలంబు
వడయుదురు; శోణానర్మదాప్రభవంబును, బదరీతీర్థంబును నాడి యాయుష్మంతు
లగుదురు; మహేంద్రంబు, రామతీర్థంబును, మతంగకేదారంబును, వంశగు
ల్మంబు ననుతీర్థంబుల నాడి యశ్వమేధఫలంబుఁ బడయుదురు.

276


తే.

పరమ మైనతీర్థంబు శ్రీపర్వతంబు
నందు దేవహ్రదం బాడి, యాదిదేవు
నీశు నర్చించి, వడయుదు రిష్టఫలము
నశ్వమేధఫలంబును నవనిజనులు.

277


వ.

తొల్లి శతక్రతుండు నూఱుక్రతువులు సేయుటం జేసి పవిత్రం బయినకృష్ణవేణి
యందు దేవహ్రదం బాడిన సర్వపాపవినాశనం బగుఁ; బాండ్యపర్వతంబునం గా
వేరీతీర్థంబును, దుంగభద్రయు, సముద్రతీర్థంబును, గన్యాతీర్థంబును నాడి యశ్వ
మేధఫలంబు వడయుదురు; గాయత్రీస్థానంబునం ద్రిరాత్రంబు గాయత్రీజపంబుఁ
జేసినవారికి జన్మదుఃఖంబులు లేవు; పెన్న యనుమహానది నాడిన మయూర
హంసవిమానగతు లగుదురు; గోదావరీస్నానంబు సేసిన దశాశ్వమేధఫలంబు
వడయుదురు; పయోష్ణియు, దండకారణ్యంబును, శరభంగాశ్రమంబును, శుక్రా
శ్రమంబును, జమదగ్ని సేవితంబయిన శూర్పూరకంబును, సప్తగోదావరీతీర్థంబు
ను నాడినపుణ్యులు పుణ్యలోకప్రాప్తు లగుదురు.

278


సీ.

అసురులభయమున నడఁగినవేదంబు
                 లోంకారపూర్వ మై యుండ నాంగి
రసుఁ డుద్ధరించి, సారస్వతప్రముఖులఁ
                 జదివించె నెందేని శాశ్వతముగ,
నమరనియక్తుఁ డై యజియించె నెందేని
                 భృగుఁ డెల్లవారికిఁ బేర్మి; నట్టి
రమణీయతుంగకారణ్యంబు సూచిన
                 మాత్రన దురితకర్మంబు లెల్లఁ


తే.

బాయుఁ; గాలరథం బనుపర్వతంబు
నందు దేవహ్రదం బాడి యభిమతములు
వడయుదురు; మేధికంబు నాఁ బరఁగుతీర్థ
మాడి మేధాసమన్వితు లగుదు రెందు.

279

వ.

మఱి చిత్రకూటంబున మందాకిని సేవించి పితృస్థానంబునం గుమారుం బూ
జించి జ్యేష్ఠస్థానంబున జంద్రస్థానంబున రుద్రు నర్చించి రామనివాసం బైన
శృంగిబేరపురంబున గంగాస్నాతులయి గంగాధరు నర్చించియు సర్వపాప
విముక్తు లగుదురు.

280


క.

యాగశతంబులకంటెఁ బ్ర
యాగనివాసము విశేష మని మునులు, మహా
యోగులు, సిద్ధులు, సాధ్యులు,
నాగులు నం దుండుదురు మనఃప్రియ మొసఁగన్.

281


వ.

అది ప్రజాపతి యజ్ఞవేది గావున నందు మూఁ డగ్నికుండంబు లెప్పుడుఁ గానం
బడు; మఱి వేదంబులు, యజ్ఞంబులు మూర్తిమంతంబులై యఱువదికోట్ల పది
వేలుతీర్థంబులు సన్నిహితంబులై, గంగాయమునాసంగమంబు సేవించియుండు;
నందుఁ గృతస్నానులైనవారు రాజసూయాశ్వమేధులయు, సత్యవాదులయుఁ,
జతుర్వేదాధ్యయనులయుఁ, బుణ్యలోకంబులు వడయుదురు; భోగవతియు, వాసుకి
యు, హంసవ్రతంబు ననుతీర్థంబుల నాడి దశాశ్వమేధఫలంబు వడయుదురు.

282


క.

విదితముగఁ దీర్థకీర్తనఁ
జదివిన ధన్యులకు వినిన సజ్జనులకు న
భ్యుదయ మగు, సర్వతీర్థ[174]
ముదయస్నాన బహుయాగముల ఫలము లగున్.

283


క.

ఇది నిక్కువ మని మనములఁ
బదిలంబుగఁ దీర్థసేవ భక్తిఁ దలఁచినన్
విదితముగ దురితహర మగు
సదమలసుజ్ఞాను లగుట సత్యము ధరణిన్.

284


క.

సకలదురితములఁ బాయుదు;
రకలంకమనస్కు లగుదు; రార్యోత్తమవ
ర్తకు లగుదురు; సజ్జనగుణ
నికరంబుల వెలయుదురు సునిశ్చితమతులై.

285


చ.

వ్రతములు లేనివారు, నుపవాసపరాఙ్ముఖు లైనవారు, దు
ర్మతులు, విహీనశౌచులుఁ గ్రమంబునఁ దీర్థము లాడ నోప రా
తతగుణశాలి వీ వఖిలధర్మవిధుండవు గావునన్ శుభ
స్థితిఁ జని [175]తీర్థసేవనము సేయుము నీకు నభీష్టసిద్ధిగన్.”

286


వ.

అని సకలతీర్థకథనంబు సెప్పిన పులస్త్యువచనంబున భీష్ముండు దొల్లి యెల్ల
తీర్థంబులు సేవించి కృతార్థుం డయ్యెఁ; గావున నీవును దీర్థసేవ సేసి.

287


క.

పూరు పురూరవు లట్లు, భ
గీరథ రఘుపతుల యట్లు, [176]కృతకృత్యుఁడవై
ధారుణి రక్షింపుము వి
స్తారగుణాధార! ధీర! ధర్మతనూజా!

288


వ.

రోమశుం డనుదేవర్షి దేవలోకంబునుండి నీకడకు వచ్చుఁ; దదుపదేశంబున
ధౌమ్యానుమతుండ వయి తీర్థసేవనఁ జేయు” మని చెప్పి నారదుం డరిగిన నజాత
శత్రుండు ధౌమ్యుం జూచి యి ట్లనియె.

289


చ.

“అలయక మాకు నందఱ కహర్నిశముం బ్రియకారి యైనయ

290

త్యలఘు[177]పరాక్రమాన్వితు, మహాభుజు, నర్జును దివ్యసాయకం
బులు వడయంగ నొక్కరున పుచ్చితిఁ దద్దయు వేడ్క; నెద్దియుం
దలఁపక యిప్డు తద్విరహిత మ్మగు కామ్యక మొప్ప దయ్యెడిన్.

290


వ.

అంబుదాగమనం బపేక్షించు చాతకంబు లట్లు మన మందఱ మర్జునాగమనం
బు ప్రతీక్షించుచున్నవారము; వాఁడునుం దనపూనినకార్యంబు నిర్వహించి
కాని నివృత్తుండు గాఁ; డవశ్యంబును దివ్యాస్త్రంబులు వడసి యాతని వచ్చు
నంతకుఁ దీర్థసేవ సేయుద” మనినఁ “గరంబు లగ్గగు; నట్ల చేయుద”మని.

291

రోమశమహాముని ధర్మరాజునొద్దకు వచ్చుట

ఉ.

నాలుగు దిక్కులందును వినన్ విదితం బగుచున్న పుణ్యతీ
ర్థాలి తెఱం గెఱుంగఁగ మహాత్ముఁడు ధౌమ్యుఁ డజాతవైరి కం
దోలిన చెప్పుచున్న తఱి [178]నొప్పుగ రోమశుఁ డేఁగుదెంచెఁ దే
జోలలితుండు, నిర్మలయశుం డగు ధర్మతనూజుపాలికిన్.

292


వ.

ఇట్లు వచ్చిన మహాముని నతిభక్తి ననుజబ్రాహ్మణసహితుం డై ధర్మజుండు పూజిం
చి “మునీంద్రా! యెందుండి వచ్చితి” రని యడిగిన నాతనికి రోమశుం డి ట్లనియె.

293


తే.

“ఎల్లలోకంబులును జూచి, యింద్రలోక
లోకనార్థినై యే నింద్రలోకమునకుఁ
బోయి, [179]సురరాజుచేఁ బ్రీతిఁ బూజితుండ
నై మహీనాథ! యందు నీయనుజు ననఘు.

294


ఉ.

ఈసున నీశుఁ దొట్టి సుర లెల్ల నభీష్టవరంబు లిచ్చుటం
జేసి కృతార్థుఁ డైన కురుసింహము నూర్జితశౌర్యు, నర్జునున్,
భాసురతేజు విశ్వపరిపాలకుఁ డైన మహేంద్రుతోడ నే
కాసన మెక్కి యున్న మహిమాస్పదు, [180]నింద్రతనూజుఁ జూచితిన్.

295


క.

బలవంతు లైనభీష్మా
దుల నర్జునుఁ డోర్చు [181]నూర్జితుం డై; మఱి పో
రులఁ గర్ణుండు పదాఱవ
కళకు సమానుండు గాఁడు గవ్వడితోడన్.

296


వ.

అతని యున్నవిలాసంబు సూచి విస్మితుండ నయిననాకు నింద్రుండు తత్ప్రభా
వంబు సెప్పి “వీఁ డమృతసంభవం బయిన పాశుపతం బను దివ్యాస్త్రంబుఁ బరమేశ్వ
రు చేతను, నాచేతను, యమవరుణకుబేరాదులచేతను దివ్యాయుధంబులఁ బడసె;
నితండు మనుష్యుండు గాఁడు దివ్యపురుషుం; డన్యుల కశక్యం బయిన దేవకా
ర్యంబు దీర్చి మసలక వచ్చునని మర్త్యలోకంబునకుం బోయి [182]భ్రాతృసహితుం
డయిన ధర్మరాజునకుం జెప్పు” మనిన వచ్చితి” నని వెండియు ని ట్లనియె.

297


క.

“నిరతముగఁ దీర్థసేవా
పరులగు శాంతాత్ములకు దపస్వులకును దు
ష్కర మెద్దియులేదని చె
చ్చెర ధర్మజుఁ దీర్థసేవ [183]సేయింపు మొగిన్.”

298

క.

అని పనిచిన నమరేశ్వరు
పనిఁ దత్పార్శ్వమున నుండి పన్నుగ నిట యేఁ
జనుదెంచితి; నీకార్యము
ధనంజయున కభిమతంబు ధరణీనాథా!

299


క.

అనవద్యతీర్థసేవన
మును, గపిలాస్వర్ణదానములు, నుగ్రతపం
బులు జేయనివారికిఁ బో
లునె పడయఁగఁ బేర్మి నుభయలోకసుఖంబుల్.

300


వ.

ఏను దొల్లి భూమింగల తీర్థంబు లెల్ల నినుమాఱు సూచితి; నిప్పు డింద్రునియో
గంబున నీతోడన వచ్చి యఖిలతీర్థసేవ సేసెద” ననిన ధర్మజుం డతని కి ట్లనియె.

301


ఉ.

“నన్నుఁ దలంచి తీర్థగమనం బొనరింపఁగఁ బంచె నట్టె వి
ద్వన్నుత! దేవవల్లభుండు; దానఁ గృతార్థుఁడ నైతి; దానిపై
నిన్ను సహాయుఁగాఁ బడసి నెమ్మి నశేషవిశేషతీర్థముల్
పన్నుగఁ జూడఁ [184]గాంచితి నభాగ్యుఁడ నైతి మునీంద్ర! నీదయన్.


ఆ.

విజయుకుశలవార్త వేడుక నీచేత
వినినయంతకంటె విస్తరిల్లె
హృదయసంప్రమోద మీ రెంట నా కంచుఁ
దద్ద సంతసిల్లె ధర్మసుతుఁడు.

303


వ.

“మునీంద్రా! యేను దొల్లియు నారదధౌమ్యులవచనంబులం [185]దీర్థగమనోన్ముఖుం
డనయి యున్నవాఁడ; నిప్పుడు భవన్నిదేశంబునం దీర్థసేవ సేసి కృతార్థుండ
నగుదు” నని కృతనిశ్చయుం డై భిక్షాభుజు లయిన బ్రాహ్మణులను యతులను రో
మశువచనంబున నివర్తించి ధౌమ్యపురస్కృతకతిపయ బ్రాహ్మణులతో ననుజు
లుం దానును గృష్ణాసహితు లయి కామ్యకవనంబున మూఁడుదినంబులు వసి
యించి మార్గశీర్షమాసావసానంబునం దీర్థసేవార్థంబు గృతప్రస్థానుం డయిన
యుధిష్ఠిరునకు బ్రాహ్మణు లి ట్లనిరి.

304


ఉ.

“నీయనుజుల్ ధనుర్ధరు, లనింద్యచరిత్రులు, దీర్ఘతీక్ష్ణకౌ
క్షేయకపాణు, లత్యమలకీర్తులు గావఁగ, రోమశుండు దే
జోయుతుఁ డెల్లతీర్థములుఁ జూపఁగఁ, దీర్థము లాడువేడ్క ల
క్ష్మీయుత! యిప్డు ని న్ననుగమింపఁగఁ గంటిమి పుణ్యసంపదన్.

305


వ.

 రాక్షసపిశాచశ్వాపదంబులకారణంబున నడవులలో నేకతంబ యరిగి తీర్థసేవ
సేయ మాయట్టివారికి నశక్యంబు గావున మీతోడ వచ్చెద” మని బ్రాహ్మణులు
ధర్మరాజుచేత ననుజ్ఞాతులై; రంత.

306


క.

పారాశర్యుఁడుఁ, బర్వత
నారదులును బాండురాజనందనుల గుణో
[186]దారుల, ననఘులఁ, దీర్థ
ప్రారంభులఁ గాన వచ్చి పరమప్రీతిన్.

307


క.

వారలచేఁ బూజితులై
భూరితపోధనులు, లోకపూజ్యులు ధర్మ
ప్రారంభనిత్యమతులకు
వారల కి ట్లనిరి సత్యవచనులు గరుణన్.

308

వ.

“శారీరనియమంబులు మానుషవ్రతంబు లనంబడు; మనోబుద్ధిశౌచంబులు దేవ
వ్రతంబు లనంబడు; నట్టి సౌమ్యవ్రతవిశేషంబులు సలుపుచు ఋజుమార్గులరై
తీర్థంబులు సేవించునది; తీర్థాభిగమనంబున మహాభిషనాభాగభరతభగీరథము
చుకుందమాంధాతృసగరసార్వభౌమాష్టకరోమపాదులయట్ల శత్రుజయంబును
సర్వలోకసుఖంబులు బడయుదు” రని చెప్పి మునివరులు మువ్వు రరిగి; రంత
నజాతశత్రుండు రోమశున కి ట్లనియె.

309


క.

“ధరణి నధార్మికులగు కా
పురుషుల కభివర్ధనంబుఁ బుణ్యచరిత్రం
బరగెడు ధార్మికులకు దు
ర్ధర మగు నవివర్ధనంబుఁ దగునె? మునీంద్రా!

310


వ.

మఱియు నచేతనంబులయ్యును గిరిసరిత్సరోవరంబులు పుణ్యతీర్థంబులై జగత్పా
వనంబులై జనులకు దురితాపహరణంబు లయిన కారణం బేమి” యని యడిగిన
నతనికి రోమశుం డి ట్లనియె.

311

రోమశుండు ధర్మరాజునకు ధర్మవిశేషంబులు సెప్పుట

చ.

“వసుధ నధర్మవర్తు లగువారల[187]వర్ధన మెన్నఁడున్ సమం
జస మయి నిల్వనేరదు, భృశంబుగ నాశము వొందు; దుర్మద
వ్యసను లధర్మవర్తనఁ బ్రవర్ధితులయ్యును, నేము చూడ రా
క్షసులును, దైత్యదానవులుఁ గ్రాఁగరె తొల్లి సహస్రసంఖ్యలన్.

312


క.

దేవతలు ధర్మవర్తులు
గావున నభివృద్ధిఁ బొంది ఘనమగు నిత్య
శ్రీవిభవాన్వితు లయి ధర
ణీవల్లభ! యున్నవారు నిరుపమశక్తిన్.

313


క.

ధర్మసుత! ధార్తరాష్ట్రు ల
ధార్మికులై [188]పెఱిఁగిరేనిఁ దడయక విధిచే
నిర్మూలితులగుదురు; దు
ష్కర్మంబున నసురులట్ల కడు నస్థిరులై.

314


వ.

అది యె ట్లనిన నధర్మవర్తులయందు దర్పంబు వుట్టు; దర్పంబువలన మానంబు
వుట్టు; మానంబువలనఁ గ్రోధంబు వుట్టుఁ; గ్రోధంబువలనం జేసి లజ్జయు, వృత్తం
బునం జెడు; [189]నష్టలజ్జావృత్తు లయినవారి నుపశమనంబును, లక్ష్మియు విడుచు.

315


క.

మీ రమరసదృశులరు, ధ
ర్మారంభవిశిష్టమతుల రగుటను [190]సుచిర
క్ష్మారమ్యు లగుదు; రాజి జి
తారాతుల రగుదు రుద్ధతాహవములలోన్.

316


వ.

ధర్మవర్తులైన దేవతలు, ఋషులు నాశ్రయించుటం జేసి తీర్థంబులు పవిత్రంబు
లై సర్వకామప్రదంబులై వర్తిల్లుచుండుఁ, దీర్థసేవను, గ్రతువులను, దానంబులను,
బ్రాహ్మణుల దీవనలను జనులు సర్వదుఃఖవిముక్తులయి శ్రేయఃప్రాప్తు లగుదు”
రని చెప్పిన నమ్మునివరువలన [191]నొండుధర్మస్థితులు వించుఁ బాండవు లరిగి నైమి
శంబు, నశ్వతీర్ధంబును, గంగాఘోషంబును, గన్యాతీర్థంబును, గోమతియును, బా
హుదయును, మహానదియు, దేవయజనం బయిన ప్రయాగయు, గంగాయమునా

సంగమంబును నాడి యందు బ్రాహ్మణులకు గోహిరణ్యదానంబులు సేసి, ప్రయా
గం [192]గొన్నిదినంబు లుండి, వేదవిదులయిన బ్రాహ్మణులవలన వేదార్థంబు లెఱుం
గుచుఁ జని, యనేకపుణ్యనదీసముద్భవం బయిన గయపర్వతంబును, రామసరం
బును, బ్రహ్మసరంబును, వైవస్వతతీర్థంబునుం జూచి, గయయందు నక్షయవటం
బున నార్షేయం బైన విధానంబునం జాతుర్మాస్యక్రతువులు సేసి, ఋషులవల
నం బుణ్యకథలు వినుచున్న యవసరంబున శమఠుండను మహాముని ధర్మరాజున
కి ట్లనియె.


సీ.

“అనఘుం డమూర్తరయః ప్రియపుత్త్రుండు
                 గయుఁడను రాజర్షి క్రతువు లిందు
బ్రహ్మసరంబునఁ బరగంగ మును చేసె;
                 నాతని యజ్ఞంబులందు సకల
జనభుక్తశేషాన్నశైలంబు లిరువది
                 యే నగుసంఖ్య దానెఱుఁగ నయ్యెఁ
దత్కృతక్రతుబహుదక్షిణాసంఖ్యయు
                 నుడుసికతాసంఖ్యయును నెఱుంగఁ


ఆ.

గాదు జనుల; కట్టి గయునామమున గయ
యనఁగఁ బుణ్యతీర్థ మయ్యె నిదియుఁ;
బితృహితార్థమిందుఁ బిండప్రదానంబు
సేయఁ గనిన నిష్టసిద్ధి [193]గలుగు.”

318


వ.

అని చెప్పిన శమఠువలన గయామాహాత్మ్యంబు విని యగస్త్యాశ్రమంబున కరిగి
రంత ధర్మరాజు రోమశున కి ట్లనియె.

319


మధ్యాక్కర.

“వాతాపి యనువాని నెట్లుసంపె సద్వంద్యుఁ డగస్త్యుఁ
డాతతతేజోధికుండు నావిందు నమ్మునినాథుఁ;
బ్రీతిని దచ్చరితంబు వినఁగ నభీష్ట మిం” దనిన
నాతని కి ట్లని చెప్పె రోమశుం డన్ముని పేర్మి.

320


క.

“వీతభయుఁ డిల్వలుండును
వాతాపియు ననఁగఁ బరగు వరదైత్యులు వి
ఖ్యాతబలులు వసియింతు ర
రాతిహరుల్ మణిమతీపురంబున [194]నొప్పన్.

321


వ.

అం దగ్రజుం డయిన యిల్వలుం డొక్కబ్రాహ్మణు నతిభక్తి నర్చించి “నాకు సకల
కామసిద్ధికరం బగు మంత్రం బుపదేశింపు” మని ప్రార్థించి విఫలప్రార్థనుం డై
యరిగి తనతమ్ముఁ గామరూపధరు వాతాపి నపుడు మేషరూపంబు సేసి వధి
యించి వానిమాంసం బిమ్ముగా వండించి దాని నావిప్రునకుఁ గుడువం బెట్టించి.

322


తే.

విప్రుకడుపులోనున్న యవ్వీరు ననుజుఁ
బిలిచె వాతాపి రమ్మని ప్రియముతోడ
జీవితుండయి వాఁడు సెచ్చెరను విప్రు
కడుపు వ్రచ్చుచు వెలువడి క్రాఁచె విప్రు.

323


వ.

అది మొదలుగా నిల్వలుండు దనకడకు నతిథు లై వచ్చు విప్రుల నిప్పాట నంత
కుపురంబున కతిథులం జేయుచున్నంత నట యగస్త్యుండు బ్రహ్మచర్యాశ్ర

మంబునం బెద్దకాలం బుగ్రతపంబు సేయుచు వనంబునఁ బరిభ్రమించు వాఁ
డొక్కసల్లకీపల్లవంబున నధోముఖు లయి వ్రేలుచున్న తనపితరులం జూచి “యి
వ్విధంబున మీ రున్న కారణం బేమి?” యని యడిగినఁ బితరు లి ట్లనిరి.

324


తే.

“అయ్య! యేము నీపితరుల; మధికనిష్ఠ
బ్రహ్మచారివై నీవు తపంబు సేయు
చున్నవాఁడవు సంతతి నొల్ల; కదియ
కారణంబుగ మా కూర్ధ్వగతియు లేదు.

325


వ.

ఇంక నైనను నీవు వివాహం బై సంతానంబు వడసిన మాకుఁ బుణ్యగతి వడయ
నగు” ననిన “నట్ల చేయుదు” నని యగస్త్యుండు దనతపశ్శక్తిం జేసి పుత్త్రకాముం
డైన విదర్భరాజున కొక్కకూఁతుం బుట్టించిన నది లోపాముద్రయను నామం
బుతో జలంబులయందు నలినియుంబోలె, వినీతునందు లక్ష్మియుంబోలె,
నుద్యుక్తునందు విద్యయుంబోలెఁ బెరిఁగి యౌవనంబు దాల్చి, రూపవతి యై
వయోరూపంబుల ననురూప లయినకన్యకాశతంబుతో నొప్పుచున్నంత.

326


క.

తరుణి నగస్త్యుభయంబున
వరియింపఁగ నోడి రాజవరులు మనోజా
తురు లగుచుండిరి; తగియెడు
వరు రోయుచు నుండె సుతకు వైదర్భుండున్.

327


వ.

అంత నగస్త్యుండు విదర్భరాజుపాలికి వచ్చి “నాకు లోపాముద్ర నిచ్చునది” య
నిన [195]విదర్భేశ్వరుండు తనతనూజ నమ్ముని కీనోపక మనంబున ననుతాపించి
యక్కన్యకం జూచి యాత్మగతంబున.

328


ఉ.

“నారలు గట్టి, కూర లశనంబుగ, నుగ్రవనంబులోఁ దపో
భారమునం గృశుం డయిన బ్రాహ్మణుఁ డీలలితాంగిఁ బెండ్లి యై
నారలు గట్టి, కూర లశనంబుగ, నుగ్రవనంబులోఁ దపో
భారము దాల్చి యుండుమని పంపక మిన్నక యుండ నిచ్చునే.

329


ఆ.

ఎఱిఁగి యెఱిఁగి [196]దీని నె ట్లీఁగ నగు? భోగ
యోగ్యయైనయది పయోజనేత్ర
యీనినాఁడు శాప మిచ్చుఁ గా కిమ్ముని
యేల సైఁచు? నింక నెట్టులొక్కొ?”

330


వ.

అని వైదర్భుండు దానునుం బత్నియు వగచుచున్న వారిపాలికి వచ్చి లోపా
ముద్ర యి ట్లనియె.

331


క.

“ఇమ్మునివరునకు నన్నుఁ బ్రి
యమ్మున నిచ్చునది మీకు నతిచింతాభా
రమ్మేల” యనిన నిరువురు
[197]నమ్ముదితకు సంతసిల్లి యధిక విభూతిన్.

332

అగస్త్యుఁడు లోపాముద్రను వివాహం బగుట

వ.

విధ్యుక్తంబుగా నక్కోమలి నగస్త్యునకు వివాహంబుఁ జేసిన నగస్త్యుండు
లోపాముద్రం బరిగ్రహించి దానిదివ్యాంబరాభరణంబు లపనయించి, వల్క
లాజినధారిణిం జేసి, ధర్మచారిణిం దోడ్కొని చని, గంగాద్వారంబునం దపంబు
సేయుచు నొక్కనాఁడు.

333

క.

నీచతరనాభిఁ, జపలవి
లోచన, బృథుజఘనచక్ర, లోపాముద్రం
జూచి మునీంద్రుడు మన్మథ
గోచరుఁ డై దానిఁ బ్రీతిఁ గూడఁగఁ దివిరెన్.

334


వ.

అదియును మునివరు నభిప్రాయం బెఱింగి లజ్జించి ముకుళితకరాంబుజ యై యి
ట్లనియె.

335


క.

“పతి పత్నిఁ బ్రజార్థముగా
ధృతిఁ బడయుట [198]యెందుఁ గలయదియ; యైనను న
న్నతిరుచిరాంబరభూషా
న్వితఁ జేసి మనఃప్రియంబు నిర్మింపు దయన్.

336


క.

మునినాథ! నీవు ననులే
పనమాల్యవిభూషణప్రసన్నుఁడ వై నా
కొనరింపు మపత్యోత్పా
దన మీఋతువాసరములు దప్పక యుండన్.”

337


వ.

అనిన “నాకుఁ దపోధనంబ కాని యొండుధనంబు లేదు; నీ కోరిన విధం బెట్లు సేయ
నేర్తుఁ? దపంబునం జేసి సర్వంబునుం బడయ నగు నంటేని [199]నేను దపోవ్యయంబు
సేయ నోప” నని యగస్త్యుండు వసుభిక్షార్థియై శ్రుతర్వుండను రాజుపాలికిం బోయి
వానిచేతం బూజితుండయి “యేను ధనార్థినై వచ్చితి; నీపోష్యజనపోషణంబునకు
విఘాతంబు గాకుండ మిగులుధనంబు గలదేని నా కి” మ్మని యడిగిన నతం డాయవ్య
యంబులు సమంబు లగుటం జేసి మిగులు లేమి యెఱింగించిన, వాఁడును దానును
బ్రధ్నశ్వుండను రాజుపాలికిం బోయిన, నతండును నయ్యిరువురం బరమభక్తిం
బూజించి తదాగమనప్రయోజనం బెఱింగి, తనయందుల నాయవ్యయంబులు
సమంబు లగుట యెఱింగించిన.

338


క.

ఇరువురఁ దోడ్కొని తానును
నరిగెం ద్రసదస్యుఁ డను జనాధిపు కడకుం;
గరమర్థితోడ నందఱఁ
బురుకుత్స తనూజుఁ డతఁడు పూజించి [200]తగన్.

339


వ.

వారల చెప్పినట్ల తననిర్వాహంబు సెప్పి త్రసదస్యుం డగస్త్యున కి ట్లనియె.

340


క.

“ఇమ్మణిమతీపురంబునఁ
దమ్ముండును దాను నతిముదంబున నుండున్
నెమ్మిని నిల్వలుఁడను వాఁ
డిమ్మహి ధనవంతుఁ [201]డతఁడ యెవ్వరికంటెన్.

341


వ.

అతండు మనయభిమతంబు దీర్ప నోపు”నని రాజర్షులు మువ్వురు మహర్షిం
దోడ్కొని యిల్వలుపాలికిం జనిన నయ్యిల్వలుండును వారి నాతిథ్యవిధానం
బుల నర్చించి వాతాపి నెప్పటియట్ల సంస్కరించి యగస్త్యుని కశనంబుగా
సమర్పించిన.

342


తే.

దాని నెఱిఁగి యమ్మువ్వురు ధరణిపతులు
మునివరేణ్యున కప్పుడు మ్రొక్కి యనిరి
“విప్రవరులకు [202]భక్ష్యమై వీనితమ్ముఁ
డుదరముల నుండి విప్రులనొగిన చంపు.

343


చ.

వలవదు వీనియింటఁ గుడువన్ మనకున్; ధన [203]మిచ్చునేని ని
మ్ములఁ గొని పోద మిప్పు”డని ము న్నెఱిఁగించిన నమ్మునీంద్రుఁ డ
త్యలఘుఁడు వారిమాటకు భయంపడ కెంతయుఁ బ్రీతితోడ న

గ్గలముగఁ జేసె భోజనము గంఠముదాఁక [204]నకుంఠవీర్యుఁ డై.

344


ఆ.

ఇల్వలుండు ననుజు నెప్పటి క్రియఁ బిల్వ
నెఱిఁగి దాని నమ్మునీశ్వరుండు
గడుపుఁ [205]దడివికొనుచుఁ గఱ్ఱనఁ ద్రేఁచిన
నసుర జీర్ణ మయ్యె నాక్షణంబ.

345


వ.

ఇల్వలుండును మునివరుశక్తికి భయంపడి విషణ్ణుం డయ్యును బ్రసన్నుండపోలెఁ
దనవంచన యేర్పడకుండం గృతప్రణాముం డై దదాగమనప్రయోజనం బడిగిన
వానికి నగస్త్యుం డి ట్లనియె.

346


సీ.

“ఈ రాజవరులతో నేను ధనార్థి నై
                 వచ్చితి నీకు ద్రవ్యంబు గలుగు
టెఱిఁగి” నావుడు “నటులేని మీ
                 కభిమతమెంత యంతియ ధన మిత్తు” ననిన
“బదివేలు మొదవులు బదివేల గద్దియల్
                 పసిఁడియు నిమ్మహీపతుల కిమ్మ
యొక్కొక్కనికి; మఱి యొక్కని కిచ్చిన
                 దానికి [206]రెట్టిగోధనము నొక్క


ఆ.

హేమమయరథంబు నిమ్ము నా” కనిన ని
ల్వలుఁడు దత్క్షణంబ తలఁచి యిచ్చె
నయ్యగస్త్యు చెప్పినంత ధనంబు ము
వ్వురు మహీపతులకుఁ గరము నెమ్మి.

347


వ.

మఱియు విరావ సురాపము లనునశ్వంబులం బూన్చిన సౌవర్ణరథంబును నిరువది
వేల మొదలు, నిరువదివేలగద్దెలపసిండియు మునివరున కిచ్చినం దద్రథంబున.

348


క.

మునివర నృపతులఁ, దద్గో
ధనకాంచనతతులఁ, దత్పతాకినులను నో
లిన తాల్చి యగస్త్యాశ్రమ
మునకుం దత్క్షణమ రథ్యములు వడిఁ బఱచెన్.

349


వ.

రాజర్షులు నగస్త్యు వీడ్కొని చని రంత నగస్త్యుండు లోపాముద్ర కభిమతం
బొనరించి.

350


మధ్యాక్కర.

“పదుండ్ర బోలెడుసుతుల నూర్వురఁ బడయంగ వలతొ?
పదుండ్ర నూర్వుర కెన యగుసుతులఁ బడయంగ వలతొ?
వదలక వేవురు సుతులఁ బడయఁగ వలతొ? వేవురకుఁ
గదియంగ నుత్తము నొక్కరు వలతొ? కమలాయతాక్షి!”

351


వ.

అనిన ముదితహృదయయై లోపాముద్ర మునీంద్రున కి ట్లనియె.

352


క.

[207]దేవరఁ బోలెడువాని మ
హావీర్యగుణాఢ్యు నొక్కయాత్మజుఁ బడయం
గా వలతు; నపేతగుణుల్
వేవురుసుతు లయ్యు నెందు విఫలము కాదే?”

353


వ.

అనిన “నీ కోరినట్ల గుణవంతుం డయిన కొడుకు నీకు జన్మించు” నని దానికి గర్భా
దానంబు సేసి, యగస్త్యుండు [208]దపోవనంబున కరిగె; నిట లోపాముద్రయు
నేడేండ్లు గర్భంబు దాల్చె; నంత నక్కోమలికి.

354


క.

తనయుఁడు, దృఢస్యుఁ డనఁగా
ననవద్యుఁడు, వేదములు రహస్యంబులతో
నొనరఁగ జపంబు సేయుచు
నినతేజుఁడు పుట్టె భువన మెల్ల వెలుంగన్.

355


వ.

వానికిం దేజస్వి యను ఋషి పుట్టి యపారం బైనయిధ్మభారంబు వహించుటం

జేసి యిధ్మవాహుం డనం బరగె; ని ట్లగస్త్యుండు పుత్త్రపౌత్త్రవంతుం డయి
తనపితరులం బుణ్యలోకగతులం జేసె; నని వైశంపాయనకథితకథాక్రమం బతి
రమ్యంబు గాను.

356


క.

[209]కలికాలభరత! లక్ష్మీ
లలనాస్పదవీరగుణవిలాస! విరోధి
ప్రళయాంతక! నిఖిలమహీ
వలయోద్వహబాహు! విష్ణువర్థనమూర్తీ!

357


పృథ్వి.

సమస్తభువనాశ్రయా! వినయసత్యనిత్యోదయా!
సమీహిత[210]గుణక్రియా! స్థిరవిశాలకీర్తిప్రియా!
నమన్నృపకిరీటచుంబిచరణద్వయా! సంతత
క్షమాభరణ! రాజరాజ! పరగండభేరుండకా!

358


గద్యము.

ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్టప్రణీతం బైనశ్రీమహాభారతంబునం
దారణ్యపర్వంబున బృహదశ్వుదర్శనంబును, నలోపాఖ్యానంబును, నారదాగమ
నంబును, సకలతీర్థకీర్తనంబును, రోమశుం డర్జునుకుశలవార్తఁ జెప్పుటయు, రోమశ
మహామునియుపదేశంబున ధర్మజుతీర్థాభిగమనంబును, నగస్త్యుండు లోపాము
ద్ర బరిగ్రహించుటయు, వాతాపిభక్షణంబును నన్నది ద్వితీయాశ్వాసము.

  1. సునిశితకృపాణ
  2. శాంతవచనంబుల ... కౌరవులచేతం దమపడిన
  3. నృపులు
  4. ధరణీవర నీ వధికధర్మ
  5. కారడవవులలోన్; ఘోరాటవులన్
  6. దమనాంతదమను లన్సుతు
  7. ఁజేసి
  8. మడరన్
  9. శమింపనోపక; సైరింపనోపక ... గ్రుమ్మరువాఁ డంతరిక్ష ... బోలె నత్యంతశుభ్రవర్ణశోభితం బై హంసావళి
  10. వీరుండు నలుఁ డంత, నడ బెడంగక ... యంచఁ బట్టికొనియె
  11. గా జాల కఱచు
  12. సేయునో యని వెఱచి వగచుచు మనుష్య
  13. నమృతధారాసారం ... దద్దయు దానిన్
  14. నాహంసంబులం జూచి
  15. హంసంబు బట్టికొనఁగఁ ... బడినయంచ
  16. పర్యంతానంతసకలమహీతలంబునందు
  17. రూఢి నుజ్జ్వలమైన నీరూపవిభవ ...లక్షణావళు
  18. బన్యోన్యసౌభాగ్యశోభనకరం
  19. విభవముల్ నుడివె
  20. మాను లై
  21. గుణియించు ... నొప్పు నెఱుఁగదు దమయంతి
  22. బరఁగు రాజన్యుల
  23. నందను లందఱు ... బోటెడు వే, ళం దమలో
  24. అనిన విని యింద్రుండు
  25. మామదీయకీర్తనముల
  26. నేకార్థసమచిత్తు ... వనియుఁ
  27. దీనిఁ దీర్చు మిపుడు; దీనిఁ దీర్చు మనఘ
  28. వ€లుఁగుదాని ... నలయ కుచ్ఛ్వాసిత; నలఁత కుచ్ఛ్వాసిత; నలఁతకు నాస్పద
  29. యితఁ డపూర్వమదనుఁ డెందుండి వచ్చెనో
  30. సుధాభూ; సుధాభృ
  31. నింతేల నలుఁడను; నిమ్మహి నలుఁడను
  32. బ్రియం బొనర్పుము ప్రీతిన్
  33. ఏ నేల నింద్రాదు లేల
  34. గావింపఁ
  35. వారు సురోత్తముల్ ... మనుష్యసంసారిఁ
  36. పరి, దేవనంబుఁ జేసె నాత్మ నంబుజాక్షి
  37. సౌగంధికకుసుమదామంబు వెట్టిన
  38. విప్రస్వస్తిరవము ద్రుతబహుతూర్యా, రావంబు లెసఁగఁ గడుఁ బా
  39. వానిబుద్ధి వర్తిల్లను ధనదుండు వానిధనసంచయంబు లక్షయంబుగా వరం బిచ్చి
  40. విస్తరిల్లంగ విని
  41. బరస్పరవియోగక్లేశంబును గావించెదనని ... జేర నవసరంబు ... సంధ్యౌపాసనాదిక్రియల నిర్వర్తించిన ... నొడిచికొ మ్మని పంచి ... వానికి వృషుండును సహాయుండై ... నాతో జూదం బాడు మనిన
  42. దొడంగెన్
  43. దొండుగుణము
  44. చట్ట రమ్మ, యనుచు ననిచి పుచ్చె ... మతము సేసి; చెప్పిరమ్మయంచుఁ బుచ్చిపంచె ... గూడ
  45. దలువుగ; దలుపుగ; నలుపుగ
  46. యక్షప్రకోపంబునం గా కేమి ... గప్పికొనియె
  47. దుది నిన్నిటిలోన
  48. అడవుల నాతోడుతఁ గడు, నిడుములు పడఁజాల పరుగు
  49. కెన్ని యయ్యును
  50. మదధీనజీవత; మదనుజీవిత ... ననుమతుండవు గావలయు ననిన విని ... కన్నులు నొందకున్న
  51. ఘనతరం బైననెయ్యం బనులీవెం దింపనీరక
  52. బొరిం బతివాయ ... రెంటియందు ... గతకారి యయ్యె
  53. నిర్దయుండనై
  54. తనవస్త్రార్ధనికర్తనంబునుం
  55. పొడయేల సూపకి, ట్లున్న ... నెటవోయి తిం కెట్లు, గాంతు నిన్ను
  56. యగు నెవ్వియు నొండువోలవట సత్యంబున్
  57. నబలభావంబున
  58. నెలు, వులఁ బులులను జూచి భయము నొంది కడఁకుచున్; నెలుఁగుల ... భయము గొని వడఁకునెడన్
  59. పొదలం బొడవడఁ ... ముండ్లకును నెల్లఁ దొలఁగుచు ... లలితాంగి మది జలించుచు నరిగెన్
  60. నక్కోమలి మెలఁగి మెదలనేరక; నక్కోమలి మెలుంగనేరక
  61. కట్టినసురియ
  62. జూడఁగానియట్టి
  63. బాలకి మనమున
  64. బొడవడఁ బొక్కిన ... నిలుచుఁ బిలుచు (బొగులు) ... నురుగృహాంతరములఁ
  65. సక్తులు
  66. బొగిఁ గాంచె
  67. నారదప్రభృతు లైన ... వారలకు దమయంతి యలయుచు నమస్కరించి
  68. మహాయజ్ఞనిరతుఁ డనఁగ; సదాయజ్ఞనిరతుఁడై యీజగతిన్ దనరు నలుభార్య నెంతయు, బను గొన దమయంతి; సజ్జననుత దమయంతి యనఁగఁ బరఁగినదానన్
  69. దినములఁ జూడంగఁ గాంతు
  70. మూర్ధాలకములదాని
  71. బతినోసి; బతిరోసి; బతి నొచ్చి ... యేకాంతిక నై
  72. మారుతంబు దూరదు దీనిన్(నన్)
  73. జలధరసమితి యనఁగ ... వా రురుతరద్విపముల ... ఱుఱక ప్రాణభీతిఁ ... లెక్కి రందు కొంద ఱక్కజముగ
  74. జీవితాశు లైన
  75. హతశేషు లైనవారల
  76. దినకర ... దివాతన చంద్రరేఖయుం బోలె
  77. నవ్యదైవానుమతి
  78. మృగంబుల సహాయంబుగా
  79. నీ వుండు మిక్కడన యిం, దీవరదళనేత్రి
  80. దనపతిఁ, దలఁచుచు
  81. నభ్రపథంబు నొందుచున్; నభ్రపథంబు నందుచున్
  82. బుదగ్రతరదాహము; బుదగ్రతనుదాహము ... నలనాథ
  83. కుండలితాంగు నొక్క
  84. గర్మవశంబున నొక్కబ్రహ్మవిదుం డైన బ్రహ్మర్షి నపాలంభించి ... నొక్కడలం గదలనేరకున్నవాఁడ నియ్యెరు(ర)గలి చిచ్చు సర్వజీవులకు సంహారకారణంబై పేర్చి నలుదెసలం గలయం బర్వి చనుదెంచు చున్నయది యీ యపాయంబు దలఁగునట్లుగా నుద్ధరింపవలయుఁ గరుణాత్మకుండవు కావున నిన్ను వేడెద.
  85. నాలుగుదిక్కుల దావ, జ్వాలావలి గవిసె నుండి చానోప; జ్వాలావలి గవయఁదొడఁగెఁ జననోప
  86. ననిన నట్లయినఁ గానిమ్మనుటయు వానికి నెత్తుకొనం జులకవునట్లుగా నంగుష్ఠమాత్రప్రమాణశరీరుం డైన నెత్తికొని ... నరిగి దవానలవర్జితం బైన యొక్కసరోవరతీరసమీ
  87. మలయ కతనికి నీ వశ్వహృదయ మనువిద్య నిచ్చి
  88. సూపకారవృత్తి; సూదకారవృత్తి
  89. యుండె నొక్కనాఁడు; దుష్టాశ్వంబుల ధృతి శిక్షింపుచు శ్రవంబు సేయించుచు వశంబుఁ జేయుచు
  90. బట్టువడి తశనాపేక్ష నడరుచున్న ... దామసమున; దామసమున ... వంది (వట్టి) నిట్టూర్పు (వుచ్చుచు) లార్చుచు
  91. అఱుదొడలు; అఱగొఱలు; అఱదొడలు; అఱపొడవు ... నొఱపుశరీరంబు ... నొఱుపుల; నొఱపుల; నొఱపులఁ బడి జనె నితండు యువతీప్రీతిన్
  92. నలినాక్షులేనేల, విప్రయోగ (ప్రలాప) మేల; నలినాక్షులెల్ల నీ, విప్రయోగ మెల్ల; నలినాక్షు లేనేడ, విప్రయోగమేడ
  93. రోయఁగఁ బుచ్చె
  94. వేయుగద్యాణంబు
  95. జగతీవలయములోఁ గల ... వెసన్
  96. యై యున్నదాని శుష్కధూమజాల ... సంవృతయైన ... నిమగ్నయైన ... సూక్ష్మలక్షణంబు నుపలక్షించి ... నపేతభూజం బైనవనంబునుం బోలె ... జనపతివ్రతాగుణంబునం జేసి యొప్పుచున్నయది
  97. కుశల మెఱుఁగునంతకు వగ గూరుచున్న, వాఁడు మీతండ్రికిని వగ పుడుగు నింక
  98. సైరంధ్రి యుడుగక యేడ్చుచున్నయది
  99. దడయక వేడ్కన్; దద్దయు బ్రీతిన్
  100. వారి రోయ
  101. రంత నారాజమాతయు నప్పు డక్కోమలి నెఱింగి సంభ్రమవినయసమాగమంబుల సంతసిల్లి
  102. నలేశుఁ జూచు
  103. శోకోపశమనుఁ ... లోకనవిరహితనై పర
  104. యును సభాంతరముల, కరిగి యిట్టు లనుఁడు వరున మీరు
  105. నిత్యసత్యుండవు నీసతి; సత్యసంధుండవు సతి నిట్లు ... దానివస్త్రార్ధంబు దగిలి నీకు ... యెల్లలోకంబుల నెవ్వఁడేనిఁ, బలుక వినఁగ
  106. నూరుగద్యాణంబులు జీవితంబై సెల్లెడువాఁడు ... సూపక్రియానిపుణుండు
  107. ఎడ
  108. గానినాఁడు ... నిజజనకు ననుమతంబున
  109. ద్వన్నుత సర్వసుగుణ
  110. కోసలభోగీ, శ్వరుఁ గనఁబడుమనఘు; కోసలభోగేశ్వరు, సరసగుణాతీతు దేవసము ఋతుపర్ణున్; కోసలభాగేశ్వరు, సరసగుణాతీతు
  111. దమయంతీస్వయంవరం బెల్లియో యెల్లుండియో
  112. యరిగి కాననేర, కున్న నిట్లు
  113. నీ ఋతుపర్ణుతోఁ
  114. నేఁడ విదర్భ కరుగు ననవుడు
  115. నిట్లు రథహయ, నీతి
  116. దేవయుక్తు లై ... మెలంగి (మగుడి) బాహుకా నాయుత్తరీయంబు భూమిపయిం బడియె ... వార్ష్ణేయుండు
  117. తొడరి యే నెఱుంగు
  118. నెఱిఁగి నతఁడు
  119. సర్వవిదుం డగు ... ఋతుపర్ణుఁ డపూర్వమనఃప్రసన్నుఁ డై
  120. యాశ్రయించిన
  121. దగ్ధుండ, నైతి నాకు నింక సైఁపవలయు; నాకు నై సహింపు; కనుగ్రహంబు సేయు
  122. సెలఁగుచుండఁగ
  123. జూడంగఁ గంటి ననుచు
  124. రమ్యహర్మ్యతలంబు ... శబ్దంబు వినంగానక
  125. రథశాలరథంబుతో నశ్వంబుల బంధించి ... కావలయు కావున వానికడకుం
  126. సకలక్షత్త్రా, న్వయులను రావించుట విని
  127. వల నెఱుఁగండొక్కొ యనిన వాఁ డిట్లనియెన్
  128. నలురాజ్యభ్రష్టత్వంబు
  129. నొక్కట యరిగిన
  130. దయఁ దప్పి ... నొండుగడయుఁ జూచు
  131. యతనిని బిల్వంగవలయు నంబుజనేత్రీ
  132. నతనికరతలద్వయామర్దితంబులై ... తమకంబు విడువక
  133. రా పలుప దింక
  134. నదియును జింతించి నిజజనని కిట్లనియె
  135. నయంబున ... గాన్
  136. నతగాత్రిఁ
  137. నెయ్యముఁ బెనుపుచు మదిఁ గడుసంభ్రమ; నెయ్యమునను లజ్జను భయసంభ్రమ
  138. కలిసమావేశమతిఁ గడుఁ గష్టవృత్తి ... దహనమునను ... పోయె నిప్పుడు నన్ను విడిచి; గష్టవృత్తి ... మదీయ, తపముఫలమున నీదుఃఖదహనమునను, నష్టమై పోయె నిప్పుడు నన్ను విడిచి
  139. బరికింపఁగ వేఁడి యిట్లు
  140. ప్రశస్తమయి
  141. నాగాంబరంబు పయిం బెట్టుకొని
  142. దీప్తకనకామలవర్ణు; దీప్తకనకాచలవర్ణు ... మే, ధాయతు
  143. ట్లజ్ఞాతచరితుం డైన
  144. నది ప్రియ; నెద ప్రియ
  145. సూవె ధారుణి ... దుర్వారశక్తి
  146. ఘనమగు ... నయ్యఖిల
  147. పురమునకున్
  148. ఋషిచరిత్రుఁ; ఋజుచరిత్రుఁ
  149. ధర్మనీయుదార కర్మచరిత్రకు
  150. ఈకందమునకు బూర్వము, క. "వినవయ్య నీవు నన్ వేఁ, డిన ప్రశ్నకు నుత్తరంబు డెందం బలరన్, విని(ను)పింతు నీకు నభిమత, మనఘా! యే జేయువాఁడ నవనీనాథా (నవహితబుద్ధిన్)." అని కొన్నివ్రాఁతప్రతులఁ గానిపించెడి.
  151. శుభధర్మా
  152. కర్మేంద్రియములందు నపగతచిత్తు లైనట్టివారు ... నప్రీతాత్ము లైనవారు, నాత్మీయభోజనా నారంభకులును నై యత్యంత ... దుఃఖితులకుఁ.
  153. నిరతము నగు
  154. నాథా
  155. తీర్థగమనఫలంబు యజ్ఞఫలంబులకు విశేషంబు వినుము; తీర్థగమనంబు పుణ్యంబులకు విశేషంబు
  156. సన్నుతి; సంస్తుతి
  157. కార్తికమాసంబున; మాఘదివసంబునఁ బుష్కర
  158. విశిష్టుఁ డట్లు
  159. గోదానసహస్రంబుల నైన యంత సుకృతఫలంబు
  160. ద్వారవతీపురమున బృం, దారక మనుతీర్థమున ముదంబున ముద్రా
  161. మలహరం బను
  162. యతిజనులకుఁ
  163. నాకలోకంబు
  164. దు, స్తరతరదురితౌఘమునకు
  165. యిష్టఫలంబులు వడయుదురు
  166. సద్గతియును నాకుఁ బడయ వలయు
  167. బర్హ్మావర్తం బను సరోవరంబునుం జూచిన ... గోటిబ్రాహ్మణుల గుడువంబెట్టిన ఫలం బగు ... విదర్భకూలంబున ఘృతప్రస్థదానంబు సేసి పితరులఋణంబు నీగుదురు
  168. శౌనకుం డను నొక ... జేయుమీ వనిన హరుఁడు, దపసిరూప మొప్ప ధరియించి
  169. సేసినవారు పాపవిముక్తు లగుదురు ... అత్రినిర్మితం బైన అతికర్షణం బనుతీర్థం బాడినశూద్రులు
  170. సన్నిహిత య(మ)నఁగఁ
  171. లోనను స్వర్గ
  172. రనపత్యు లైన ... నుద్ధరింతు రలై
  173. ˈపాతకవిముక్తు లగుదురుˈ అని వచనమును ముగించి తర్వాత, "క. సకలదురితములు వాయుదు, రకలంకయశస్కు లగుదు రత్యుత్తమవ, ర్తకు లగుదురు సజ్జనగుణ, నికరంబుల కెలయుదురు సునిశ్చయమతు లై." అని యొకకందము. తర్వాత, "గౌరీశంకరకుండము" అని ప్రారంభించి అంత్యమువఱకు మఱియొకవచనముగ నొకప్రతిలో వ్రాయఁబడియున్నది.
  174. సముదయస్నానముల యాగముల; సముదయంబులయంద స్నానముల
  175. తీర్థసేవఁ దగఁ జేయుము ... సిద్ధిగాన్
  176. కృతపుణ్యుఁడవై ... గుణోదార; గుణోద్ధార
  177. పరాక్రమోన్నత ... నెద్దియుం దలఁపక
  178. నొప్పఁగ
  179. సురగణనాథుచేఁ బూజితుండ
  180. నింద్రసమానుఁ
  181. నపజితుం డై; నపజితుం డై ... పదాఱగు, కళకు
  182. భ్రాతృభార్యాసహితుం డై
  183. సేయింపు మిలన్
  184. గాంచి కడుభవ్యుఁడ నైతి మహామునీశ్వరా (మునీంద్ర నీదయన్)
  185. గమనోత్సుకుండై ... మూఁడుదినంబు లుపవసించి ... మాసావసానదినంబునం
  186. ధారుల ... దీర్థకృ, తారంభులఁ ... యధికప్రీతిన్
  187. వర్తన
  188. పరగిరేనిఁ ... నీచే, నిర్మూలి
  189. లజ్జానివృత్తు లయిన
  190. సుచిర, శ్రీరమ్యుల రగుదురు విజి, తారాతుల రగుదు
  191. నొండుకథలు వినుచుఁ
  192. "గొన్నిదినంబు లుండి" అనుటకును "వేదవిదు లయిన" అనుటకును నడుమ, "క. ఎలమిసి ధర్మతనూజుఁడు, గులపావనుఁ డగుచు విప్రకోటుల కెల్లన్, వెలయఁగ నభీష్టవస్తువు, లలయక దానములు చేసె నభివాంఛితుఁడై. వ. మఱియు వేదవిదులయిన." అని యొకప్రతి.
  193. వెరుఁగు
  194. ఁబేర్మిన్
  195. వైదర్భుం డాత్మగతంబున
  196. తపసి కెట్టు లీనగు భోగ, యోగ్య యైనయిప్పయోజనేత్రి, (యీసరోజనేత్ర, నీనినాఁడు)
  197. నమ్మాటకు ... నధికప్రీతిన్
  198. కృతులయందుఁ దెల్లమ యైనన్ .. నిర్మింపు తగన్; నిండింపు దయన్
  199. నే నెట్లును నెపంబు వ్యయంబు
  200. వడిన్
  201. డాతఁ డెవ్వరి
  202. భోజ్యమై ... డుదర మగలించి
  203. మెచ్చె
  204. నకుంఠితాత్ముఁ డై
  205. నిమిరికొనుచుఁ (దడివికొనుచుఁ) గడువడిఁ
  206. రెట్టిగా
  207. వేవురఁ బోలెడు ... గుణల్ ... నతులయ్యు
  208. దనరఁగ జపంబున కరిగె
  209. కలికాలచరిత ... విష్ణువర్ధనదేవా; ... వలయాస్పదబాహు విష్ణువర్ధననృపతీ
  210. హితక్రియా శుభవిశాల