భర్గశతకము/పద్యాలు 30-41

వికీసోర్స్ నుండి
శా..

నీలాంభోధరమధ్యసంస్థితతటిన్నీకాశమై విస్ఫుర
ల్లీల న్నివ్వరిముంటిచందమున నెంతే సూక్ష్మమై పచ్చనై
చాలన్భాసిలుతేజమీవయనుచు న్స్వాంతంబునందెన్నుదుర్
వాలెంబున్ ఘనులైన తాపసులు భర్గా! పార్వతీవల్లభా!

30


మ.

గొనబార న్విటజంగమాకృతినిమున్ గొంకేది భల్లాణరా
యనిసద్మంబున కేఁగి యాతనిసతి న్బ్రార్థించి యాలేమయ
క్కునఁ జక్క న్నెలనాళ్ళబాలకుఁడవై గోమొప్పఁగన్పట్టితౌఁ
గన నబ్రంబులు నీవిహారములు భర్గా! పార్వతీవల్లభా!

31


మ.

యమరాడ్భీకరకాలపాశమథితుండై శ్వేతకేతుండు దు
ర్దమశోకాకులచిత్తవృత్తిమెయిని న్బ్రార్థింప వైళంబ యా
శమనుం గ్రొవ్వఱఁ దన్ని మౌనితనయున్ శశ్వద్గతిన్బ్రోవవే
కమలేశార్చితపాదపంకరుహ! భర్గా! పార్వతీవల్లభా!

32


మ.

త్రిజగద్రక్షణశక్తిఁ గోరి కమలాధీశుండు నిన్వేయి పం
కజపత్రంబులఁ బూజసేయునెడనొక్కం డందులేకుండినన్
నిజనేత్రాబ్జ మతం డొసంగినఁ గృపన్వీక్షించితౌఁ జక్ర మ
క్కజ మొప్పారఁగ నిచ్చి యేలుకొని భర్గా! పార్వతీవల్లభా!

33


మ.

చిరుతొండం డను భక్తునింటికిహొయల్ చెన్నారవేంచేసి త
ద్వరపుత్రున్ దునిమించి నంజుడుతునెల్వండించి భక్షించుచో
సిరియొప్ప న్నిజమూర్తిఁ జూపి యతనిన్ జేపట్టి రక్షింపవే
కరిదైత్యాధమగర్వనిర్మథన! భర్గా! పార్వతీవల్లభా!

34


మ.

విజయుం డుగ్రవిపక్షశిక్షణకళావృత్తి న్మిముం గోరి య
క్కజమొప్పన్ దప మింద్రకీలశిఖరిన్ గావించుచో బోయవై
విజయఖ్యాతిగఁ బోరి పాశుపత మీవే వాని కిష్టంబుగా
రజతక్షోణిధరాగ్రసద్భవన! భర్గా! పార్వతీవల్లభా!

35


మ.

తనకున్ మిక్కిలి ముజ్జగంబుల కిఁకన్ దైవంబులేఁడంచుఁబా
యనిదర్పంబున దైత్యదానవమునీంద్రామర్త్యసంసత్పదం
బున వాదించు విరించి పంచమమహామూర్థంబు ఖండింపవే
కన నత్యుద్ధతభైరవాకృతిని భర్గా! పార్వతీవల్లభా!

36


మ.

సకలాధీశుఁడ వెన్న నీవొకఁడవే సత్యంబు సత్యంబు కొం
చక యంతర్బహిరుజ్జ్వలద్భువనరక్షాదీక్షఁ గాకోల ము
త్సుకతం గంఠమునందుఁదాల్చితివిమెచ్చుల్మీఱఁ గ్రూరాత్ములై
యకటా! మూఢు లెఱుంగఁజాలరిది భర్గా! పార్వతీవల్లభా!

37


శా.

ఏరి నీ కెనయైన దైవతములీ యీరేడులోకంబులన్
గారామారమృకండుసూనుఁడు మహోగ్రక్రూరమృత్యువ్యథా
భీరుండై శరణన్న మిత్తి నపుడే పెంపార్చి రక్షించి త
య్యారే! శాశ్వతజీవిగా నతని భర్గా! పార్వతీవల్లభా!

38


శా.

లోకశ్రేణికి నీవె కర్త వను టాలోకింప నిక్కంబెపో
వైకుంఠాధిపుఁడైన శౌరి దినరాడ్వంశంబునన్ రాఘవుం
డై కన్పట్టి జగద్ధితంబుగ నసంఖ్యన్ శంభులింగంబులన్
వ్యాకీర్ణేచ్ఛఁ బ్రతిష్ఠ చేసెఁగద భర్గా! పార్వతీవల్లభా!

39


మ.

శిలలం జొన్పియుఁజెప్పుఁగాలను గడున్జిత్రంబుగాఁద్రొక్కియున్
వెలివెట్టించియుఁ గుంటెనల్నడపియు న్వేరోఁకటం గ్రుమ్మియు
న్నిలయద్వారమునందుఁగాఁపునిచియున్ నీవారలైనారు వా
రలభాగ్యం బిఁక నేమిచెప్పనగు? భర్గా! పార్వతీవల్లభా!

40


శా.

డాయన్రాదయటండ్రు మాదృశులు చండాలాదులన్డాసినన్
బాయుంబుణ్యచయంబులంచుఁ జదువుల్పల్కంగనీవయ్యయో
బోయం డెంగిలిమాంసమిచ్చుటకులో బుల్పూనిచేకొంటి వే
ప్రాయశ్చిత్తము కద్దుదీని కిఁక? భర్గా! పార్వతీవల్లభా!

41