భక్తిరసశతకసంపుటము/మూఁడవసంపుటము/యాదగిరీంద్రశతకము

వికీసోర్స్ నుండి


పీఠిక

.

ఈశతకము రచించినది తిరువాయిపాటి వెంకటకవి. పరాంకుశునికుమారుఁడు. ఇతఁడు రచించిన శతకము యాదగిరినృసింహ యనుమకుటము గల కందశతక మింకను ముద్రితము కాలేదు. కవికులస్థలము లీశతకమునందు లేకున్నను బ్రవాదములనుబట్టి యెఱుంగవచ్చును. కవి నిజామురాష్ట్రములోని నల్లగొండమండలమునకు జెందిన కొలనుపాకలోఁ గొంతకాలము నివసించెననియు సాతానివైప్ణవుఁడనియు ఎనుబదిసంవత్సరములక్రిందట నుండియుండెననియుఁ గొందఱు చెప్పిరి. ఇత రాధారములు లభించువఱకీ ప్రవాదమును విశ్వసింపక తప్పదు.

మేము శతకసంపుటములోనికి అముద్రితశతకములను సేకరించుట విన్నంతమాత్రమున తమ చెంతగల యీశతకమాతృకను మఱియొక (యాదగిరినృసింహ)శతకమును మాకొసంగి మ-రా- శ్రీ గంగరాజు రఘునాథరావుగారు తోడ్పడుటచే శుద్ధప్రతివ్రాసి ప్రథమముద్రణము గావింప నవకాశము చిక్కినది. రఘునాథరావుగారివలె నాంధ్రభాషాభిమాను లెవరేని నిజామురాష్ట్రకవుల యముద్రితశతకము లొసంగిరేని ప్రత్యంతరము వ్రాసి కొని వారిప్రతి వారి కొసంగి కృతజ్ఞులము కానున్నారము. ఈయవకాశమును బోనీకుండుటకు రాష్ట్రీయసోదరాంధ్రులు ప్రార్థితులు.

ఈశతకమకుటమునందలి యాదగిరి నృసింహక్షేత్రము. ఇది నిజామురాష్ట్రమునందు సుప్రసిద్ధదుర్గమగు భువనగిరికి ఆరుకోసుల దూరమునను వంగపల్లి స్టేషనుకు మూఁడునాలుగుమైళ్ల దూరమునను గల గుట్టపై నున్నది. మార్గశిర శుద్దమునం దిచట గొప్పయుత్సవములు జరుగుచున్నవి. యాదగిరినే కృష్ణామండలమునందలి వేదగిరిగాఁ గొందఱు భావించిరిగాని యది ప్రమాదము, యాదగిరి నరసింహునిగూర్చి వాయఁబడినశతకములు యక్షగానములు గేయములు పెక్కులు గలవు. నిజామురాష్ట్రీయసోదరులతోడ్పాటుతో నవి యన్నియు నార్జించిన వాఙ్మయమున కెంతయో సేవగావించినటు లగును. ఈ యముద్రితశతకమును ముద్రణమున కొసంగిన రఘునాథరావుగారియెడలఁ గృతజ్ఞులము.

ఇట్లు భాషాసేవకులు

నందిగామ

శేషాద్రిరమణకవులు

1-6-26

శతావధానులు

శ్రీరస్తు

యాదగిరీంద్రశతకము

ఉ.

శ్రీనరసింహ దోషగజసింహ రమేశ మహానుభావ యో
భానుసహస్రతేజ భవబంధవిమోచన భక్తరక్షణా
దీనదయాపరా సుగుణదీపిత తావకపాదపద్మముల్
ధ్యానము జేసి నిన్ను మది దల్చెద యాదగిరీంద్ర మ్రొక్కెదన్.

1


చ.

యతిగణప్రాసలక్షణరహస్య మెఱుంగను బద్యశైలియున్
మితముగ శబ్దసంతతులు మేలుగఁ గూర్పు రహస్య మింతయున్
మతిని గ్రహింపకే తమను మానసమందున సంతతంబు నీ
క్షితి గడునమ్మియుంటిగద శ్రీహరి యా...

2


ఉ.

నీదుబలంబుఁ జూచుకొని నిక్కముగా రచియింపఁ బూనితిన్
మేదిని నాదుజిహ్వపయి మీకృపతోడ సుశబ్దసంగతుల్
మోదముతోడ గూర్చి యిఁక ముందు జను ల్గని మెచ్చునట్లుగాఁ
బాదుగఁ జేయ నీదె సుమి భారము యా...

3

ఉ.

సంశయ మేల నీకు సురసన్నుతగాత్ర రమాకళత్ర నే
వింశతు లైదుపద్యములు వేగమె కూర్పఁ దలంచినాఁడ నీ
యంశను దప్పు లొప్పులను హానియు వృత్తులు దొర్లలేవుగా
సంశయ మింతలేదు గుణసాగర యా...

4


ఉ.

శ్రీతరుణీసమేత మునిసేవిత భక్తజనాళిపోష పా
పాత్ముల పాపసంఘములఁ బారఁగఁదోలెడివాఁడ వంచుఁ బ్ర
ఖ్యాతిగ నమ్మితిన్ జగతికర్తవు మన్మథకోటితేజ స
త్ప్రీతిగ మమ్ము బ్రోవు భవభేదన యా...

5


ఉ.

నమ్ముకయున్నవాఁడ సుమి నారదసన్నుత లక్ష్మినాథ నీ
సమ్మతితోడఁ గూపమునఁ జక్కఁగ నుంచిన మేలు మేలెకా
సమ్మతిలేక మోక్షసుఖసంపద లిచ్చిన మేలె నేను నీ
సొమ్మని నమ్ముకొంటి మురసూదన యా...

6


ఉ.

దుష్టజనంబులం దొడరి త్రుంచిన దివ్యపరాక్రమాఢ్య నీ
చేష్టల నెంచ రుద్రసరసీరుహసంభవశక్యమే ననున్
శిష్టులలోనఁ జేర్చి దయజేసెడిదాతవుగాన నిన్ను వి
స్పష్టము నమ్మినాఁడ భవబంధన ధర్మపురీనృకేసరీ.

7


ఉ.

భావములోన నిన్నుఁ గడుభక్తి దలంచుచు నున్నవాఁడ నన్

గావవె సర్వలోకజనకర్తవు భర్తవు దాత దైవమున్
నీవె యితఃపరం బెఱుఁగ నీరజలోచన పాపలోకసం
జీవము పాదసేవ దయ చేయవె యా...

8


ఉ.

ధారుణి నెట్టివాని సతతంబును నమ్ముక యున్నమానవున్
గూరిమితోడఁ జూచి కులగోత్రము లెంచక మాసగుప్తమున్
ధీరత యిచ్చినట్టు లిఁక దీనునియం దదెరీతిఁ జూడుమీ
కోరితి నీపదాబ్జములఁ గొల్వఁగ యా...

9


ఉ.

నిన్ను మదిం దలంచితిని నీరజలోచన నీమహత్వమున్
ఎన్నతరంబుగాదు నను నేమరకన్ దరి జేర్చు శౌరి యా
పన్నశరణ్య భక్తజనపాల సుశీల గుణాలవాల నిన్
సన్నుతి జేసితిన్ సుగుణసాగర యా...

10


ఉ.

కంటిని పాదపద్మములు కంటిని జంఘలు మధ్యదేశముం
గంటిని శంఖచక్రములఁ గంటిని నీకనుదోయి కర్ణముల్
గంటిని నీదుపల్వరుసఁ గంటిని నీముఖతేజమున్ మదిన్
గంటి కిరీటమస్తకము గావవె యా...

11


ఉ.

చూచెద ఫాలమందుఁ దిరుచూర్ణపురేఖలు కోరమీసముల్
చూచెద నీదునాసికము సొంపగు శ్రీపతకంబు హారమున్

జూచెద హాటకాంబరము చోద్యపుగంటలు గజ్జె లందెలున్
జూచెద నీదువైభవముఁ జూపవె యా...

12


ఉ.

ఎంతని వేఁడుకొందు నిఁక నేమని కోరుదు నిందిరేశ నీ
కెంతకు రాకయుండె దయ హీనుఁడు వీఁడని యెంచినావ నీ
చెంతకు రాక యన్యులను జేరను నీ విఁకఁ ద్రోవఁజూపుమా
సంతతభోగితల్పగుణసాగర యా...

13


ఉ.

పిల్లకుఁ దల్లిచందమునఁ బ్రేమను నుగ్గును బోసినట్లు ని
న్నుల్లములోనఁ జాల దయయుంచియు సాకెడిభారమంటి బ
ల్చల్లనిసామి వంటి నిను సన్నుతిఁ జేయుచు నుంటి నయ్య యు
త్ఫుల్లసరోజనేత్ర నను బ్రోవవె యా...

14


ఉ.

ఏ రిఁక వేల్పు నీకు సరి యెందును గాంచినఁ గానరారు నీ
వూఱకయుండఁ జెల్ల దిఁక నుర్విని నెవ్వఁడు సంస్మరించినన్
వారిని గాచి బ్రోచి మది వాంఛలు దీర్చితివేని గల్గు నీ
ధారుణి కీర్తియంచు మది దల్చవె యా...

15


ఉ.

చక్కనివాఁడ వంటి సరసంబు లెఱింగినసామి వంటి నీ
వెక్కడ నుంటి వంటి నిను నెప్పుడు కన్నులఁ గాంతు నంటి నే

నిక్కము నమ్మియుంటి నిఁక నేర్పునఁ బ్రోవుమి యంటి నీసుతుల్
మ్రొక్కినఁ జేతులన్ దునుమ ముద్దటె యా...

16


ఉ.

కంజదళాక్ష నిన్ను నవకంజదళాక్షిని కండ్లగాంచెదన్
రంజితమైనకంఠమున రత్నసరు ల్గని సంతసించి నే
నంజలి జేసి నీదుచరణాంబుజముల్ తలపైని దాల్చెదన్
మంజులభాష సత్సుగుణమానస యా...

17


ఉ.

భూమిని దుష్టచిత్తమున భూరిగఁ జేసితి పాపసంఘముల్
ఏమని విన్నవింతు మఱి యేవిధ మియ్యది నిర్వహింతు శ్రీ
స్వామి పరాత్సరా యనుచు సన్నుతిఁజేయక మోసపోయితిన్
బ్రేమదలంచి కావు మిక వేగమె యా...

18


ఉ.

రోగము రాఁగ మీపదసరోరుహతీర్థము లిచ్చి కావవే
బాగుగ క్షుత్తుబాధకును భారము దీర్చి ప్రసాద మిచ్చియున్
రాగము నిల్పి సౌఖ్య మిడరాద మురారి సురారిభంజనా
యేగతి నిన్ను వీడునెడ నీశ్వర యా...

19


ఉ.

నిక్కము నీదుదాసులను నిందలు జేయుచు నుంటి దాతలున్
జక్కఁగ దానమీయగను జయ్యన వద్దని సంతసించితిన్
గ్రక్కున దేవబ్రాహ్మణులకార్యము లన్నిటి నెత్తి గొట్టితిన్
ఎక్కువ పాపి వీఁ డనక యేలవె యా...

20

చ.

అడవి జరించుపక్షులకు నన్నిటి కెవ్వఁడు మేఁత యిచ్చెనో
పుడమిని వృక్షసంతతికిఁ బూర్తిగ నెవ్వఁడు నీరుబోసెనో
పడఁతుల గర్భపిండములఁ బాలన యెవ్వరు చేసి రీవ కా
తడయక నన్ను బ్రోచుటకు దాతవు యా...

21


ఉ.

శ్రీశ పరాశరాదిమునిసేవిత భాస్కరవంశభూషణా
కేశవ వాసుదేవ సురభేదనివారణ వీరశూరలో
కేశ రమేశ దివ్యతరకీర్తి వహించిన శౌరి నీకృపన్
దాసునిఁ జేసికోవె నను ధారుణి యా...

22


ఉ.

శ్రీధర మేరుధీర మునిసేవిత కౌస్తుభవక్ష దుష్టదు
ర్యోధనవంశనాశనుత యోగి మురాంతక మాధవాచ్యుతా
భూధరధారి భక్తకులపోష సురార్చితతార్క్ష్యవాహనా
ఈధర ప్రేమతోడ నను నేలవె యా...

23


ఉ.

వాదము చేయఁగా నరులు వాక్యపరుండని యెగ్గు చేతురున్
మోదముతో భుజించునెడ ముందుగఁ బిల్తురు తిండిపోతుగా
ఏదియుఁ బల్కకున్నయెడ నీతఁడు మూగని యెంచుచుంద్రుగా
నీదయ గల్గఁగా సుఖము నేర్పును యా...

24


ఉ.

తల్లియుఁ దండ్రియున్ మఱియుఁ దమ్ముల నన్నల మేనమామలన్
గొల్లగ బంధువర్గములఁ గూరిమిభార్యను మేనబావలన్

ఉల్లములోన నమ్ముకొనియున్ జెడిపోయితి నిన్ను గానకే
కల్లలు గావు నీకృపను గావవె యా...

25


ఉ.

చేతులతోడ నీదుపదసేవ యొనర్చెద నెల్లకాలముం
బ్రీతిని నీదుసత్కథలు వీనులవిందుగ విందు లోకవి
ఖ్యాతిని నిన్ను నాకనులఁ గాంచియు సంతస మందుచుందు నీ
భూతలమందు నీదుదయ ముఖ్యము యా...

26


ఉ.

మందరధీర విద్య గలమానవు లందఱు నీకు భక్తులే
సుందరగాత్రసద్గుణులు సూరిజనంబులు చేరియుందు రే
యిందఱిలోన ద్రవ్యపరు లెందఱికైనను దాన మిత్తురే
యెందును గానివాఁడ నను నేలవె యా...

27


ఉ.

కాలము రాఁగ నిన్ను మది గ్రక్కున నెంచినవాఁడె ముక్తుఁడౌ
కాలుని బాధలం బడఁడు గాన నుతించెద నంటినా స్మృతిన్
జాలదు నీయనుగ్రహవశంబునఁ గొల్చితి నింతలోనిదే
మేలని నన్నుఁ బ్రోవఁగదె మేకొని యా...

28


చ.

దురమున శత్రులన్ దొలఁగఁ ద్రోయఁగవచ్చు మహాబలంబుమై
కరమునఁ బాము నుంచికొని కంఠమునందునఁ దాల్చవచ్చుఁ బెం

జెఱువుల నున్ననక్రములఁ జెందఁగవచ్చు ఫలం బదేమి నీ
స్మరణము జేయఁగా దొరకు సద్గతి యా...

29


ఉ.

ధారుణిలోన దుష్టు లగుతాటక పూతన దుష్టకంసునిన్
భూరిబలాఢ్యు రావణుని పృథ్విభయంకరుఁ గాంచనాక్షునిన్
శూరుఁడు హేమకశ్యపుని సోమకదైత్యులనెల్లఁ ద్రుంచియున్
గారణ మెంచి శిష్టులను గాచిన యా...

30


ఉ.

ధాత మహేశ్వరున్ నరుని దంతిపతిన్ విదురార్కసూనులన్
బ్రీతిని వాయుపుత్రకు విభీషణు వాయసదానవాధమున్
నాతి యహల్య ద్రౌపది జనంబుల సద్దయఁ జూచినట్లు నన్
బ్రీతి మెయిన్ గణించఁ గదవే హరి యా...

31


ఉ.

శ్రీహరి యంచుఁ బిల్చితిని శీఘ్రమ పల్క వదేమి పాపమో
ద్రోహములం గలంతు వని తొల్తనె వేఁడితి కూర్మితి లేదొకో
సాహసశౌర్యధైర్యగుణసంయుతుఁ డీతఁడు గాఁ డటంచు సం
దేహము నొందెదేని యిఁక దిక్కెది యా...

32


ఉ.

భక్తి మనంబునన్ నిలుప భాగవతుండ ధ్రువుండ నౌదునా
రక్తిని గీర్తనల్ సలుప రమ్యగుణుం డగునారదుండనా
యుక్తిని శాస్త్రసంతతుల నొప్పుగఁ జేయఁగ వ్యాసమౌనినా
శక్తివిహీనమానవుఁడ సాకవె యాదగిరీంద్ర మ్రొక్కెదన్.

33

ఉ.

కుండలిశాయి సద్విమలకోమలపాద మురారి మాధవా
ఖండలమండితాసురవిఖండనసూరిజనాళిసేవితా
చండిమనోహరాది విధిసన్మునిమిత్ర రమాకళత్ర వే
దండసురక్ష భూరిజనదాతవు యాదగిరీంద్ర మ్రొక్కెదన్.

34


ఉ.

కారణపుణ్యమూర్తి యగుకాముని గన్న మహానుభావ బృం
దారకమౌనిపోష సముదారమనోహరచంద్రచంద్రికా
స్మేరముఖాంబుజాత రిపుశిక్షణదక్షిణహస్త భక్తహృ
ద్వారవిహార నాయఘము బాపవె యా...

35


ఉ.

శ్రీరమణీకళత్ర బుధసేవిత భూరిభవాబ్ధినావ స
చ్ఛీలగుణాలవాల యదుశేఖర సంతతదాసపోష నీ
లాలకకాంచనాంబరసులాలితనీరదగాత్ర నీకృపన్
బాలన చేయవే పతితపావన యా...

36


ఉ.

నీరజనేత్ర నామనవి నీచెవి సోకఁగ విన్నవించెదన్
జారుఁడఁ బాపసంచయుఁడ చాలదురాత్మదురంతకర్ముఁడన్
గ్రూరుఁడఁ జోరుఁడ గఠినకుత్సితుఁడన్ దొసఁ గెంచఁబోక నన్
నేరుపుతోడఁ జూచి కరుణింపవె యా...

37


ఉ.

మందరగోత్రధారి వనమాలి మదాసురజాలహంత గో
వింద ముకుంద భక్తజనవిశ్రుతనామ యశోదనందనా

పండితమౌనిబృందసురవాసవసన్నుతపంకజాననా
సుందరపాదపద్మములఁ జూపవె యా...

38


ఉ.

మానము నేల ద్రౌపదికి మన్ననఁ గోకలఁ బెక్కు లిచ్చితౌ
ధ్యానము చేయఁగాఁ గరికి తత్వపదం బగుమోక్ష మిచ్చితో
పూని దరిద్రవిప్రునకు భూరిపదార్థము లిచ్చినాడ వ
ట్లే నను నేల భారమొ కడిందిగ యా...

39


చ.

గిరిభరణప్రవీణ నవకీర్తిసమంచిత దిద్దిగంతరా
కరిదురితౌఘదూర ఖరఖండనసాగరకన్యకావనా
కురుకులవంశనాశ గుణకోటిసమన్విత పుణ్యవిగ్రహా
తరణికులాబ్ధిచంద్ర పరదాయక యా...

40


చ.

తిరుమల వేంకటేశుఁడవు ధీయుతకాంచిపురీనివాసుఁడున్
ధరణిని యాదవాద్రిపురధాముఁడ వైతివి భద్రశైల సు
స్థిరరఘురాముఁడున్ మఱియు శ్రీపురుషోత్తమపౌరధాముఁడున్
నిరతము నీవె గానఁ గరుణింపుమి యా...

41


చ.

కురుకులవంశనాశ యదుగోత్రవిభూష మురారి మాధవా
స్మరశతకోటితేజ సురశత్రువిదారణ మిత్రపోషణా
సరసిరుహాక్ష పాపచయసంహర నీరదనీలగాత్ర మం
దరధరధీర పాహినుతతాపస యా...

42

చ.

నిరతము నిన్ను నమ్మితిని నీరజలోచన నామనంబునన్
దురితములం గనుంగొనెడి తోయజనాభుఁడ వంచు వేఁడితిన్
పరమదయాళు భజనపాలక నీరదనీలసుందరా
ధరధర నీవు నాకు గతి ధారుణి యా...

43


చ.

సునయముతోడ నన్నుఁ బరిశుద్ధుని జేసియు నేలరాదె స
ద్వినయవిధేయ నాదుభవవేదన మాన్పఁగలేవ యింక నీ
మనసుకు రాదె వీఁడు చెడుమానిసి యంచుఁ దలంప నాయమా
నెన రిసుమంత వద్దె నుతనిర్జర యా...

44


ఉ.

సత్యము బల్క కెల్లపు డసత్యము లాడుచుఁ బ్రొద్దువుచ్చితిన్
నిత్యము నిన్ స్మరిఁపకయె నే భవసాగరమందుఁ గ్రుంకి దు
ష్కృత్యుఁడ నైతిఁగాదె మృదుకోమలదేహ సరోరుహాక్ష యీ
భృత్యుని గావరాదె యిఁకఁ బొంగుచు యా...

45


ఉ.

వక్షమునందు లక్ష్మి గలవాఁడ వటంచుఁ దలంచుచుంటి నీ
కుక్షిని సర్వలోకములఁ గూర్చుకయున్న మహాత్మ వేగఁ బ్ర
త్యక్షపురూపుఁ జూపి నను నారసి బ్రోవఁగ వేఁడితిన్ జగ
ద్రక్షక పక్షివాహ గుణరాజిత యా...

46


చ.

భువిఁ గమలాప్తవంశమునఁ బుట్టినసద్గుణుఁ డంబరీషభూ
ధవునికుమారిక న్గనియుఁ దప్పక నారదపర్వతుండు నా

యువిదను మా కొసంగుమన నొప్పునె యిద్దఱ కీయ నంచనన్
వివరముతో గ్రహించితివి వేగమె యా...

47


ఉ.

సూరకులాబ్ధిచంద్ర భవశోషణ కాంచనచేలధారి స
ద్భూరిభుజాపరాక్రమ విభూషితహేమకురంగహంత శృం
గారకిరీట నీలనిభగాత్ర ముకుంద మురారి రత్నశృం
గారమనోజ్ఞహార బుధకల్పక యా...

48


ఉ.

దుష్టుఁడు పాపకర్ముఁ డని దూరము చేయక వేగ బ్రేమచే
శిష్టులలోన నిల్చి దరిజేర్పఁగ నిన్నెద నాశ్రయించితిన్
సృష్టిని మున్ను దోసములఁ జేసినవారల నేలలేవె నీ
యిష్టము రాద నాపయి హరీ హరి యా...

49


ఉ.

అండజవాహ మంగళగిరచ్యుత కూర్మగిరీశవాడప
ల్లండఁగఁ జేసికొన్నహరి వైతి వహోబలనాథ ధర్మపు
ర్యండమహానుభావ విమలార్వపలీశ్వర నీపదంబులన్
దండిగ నామనంబునను దాల్చెద యా...

50

దశావతారములు

ఉ.

ఆదియుగంబునందు నిగమాదులకైవడి మీనరూపమున్
మోదముతోడఁ దాల్చి సురముఖ్యులు గొల్వఁగ సోమకాసురున్

బాదుగఁ బట్టి త్రుంచితివి పద్మదళాక్ష జగత్ప్రకాశ నీ
పాదయుగంబు నెంతు గుణవన్మణి యా...

51


ఉ.

భీకరమైన కూర్మమున బింకముతో వడి కొండ నెత్తి ల
క్ష్మీకర దేవసంఘముల క్షేమము గోరియు నాతిరూపమై
చేకొనియున్ సుధారసము సేవకులందఱి కిచ్చినట్టి సు
శ్లోకరమేశ దైత్యగణసూదన యా...

52


ఉ.

ఆదివరాహరూపమున నాకనకాక్షుని బట్టి త్రుంచియున్
మోదముతోడ భూమి భయముం దొలఁగించిన జాణవయ్య దు
ర్వాదులయందు నిగ్రహము వారక చూపియుఁ బ్రేమ మీఱఁగాఁ
బేదల గాచి బ్రోచితివి వేడ్కను యా...

58


ఉ.

ఆకనకాక్షు నగ్రజునికై మును స్తంభమునందు బుట్టి యా
లోకము చూడఁగాఁ గడుపులోని నరంబుల దీసి చంపితే
భీకరనారసింహ జగదీశ్వర పుణ్యపురాణమూర్తి సు
శ్లోక భవత్పదద్వయముఁ జూపవె యా...

54


ఉ.

వామనరూపి వయ్యు బలివద్దకుఁ జేరియు మూఁడుపాదముల్
భూమిని దానముం గొనియు భూగగనంబులఁ గొల్చి గర్వమున్

జామున వంచి వేసితివి సామజరక్షక నీప్రతాపసు
శ్రీమహిమంబు నెమ్మది స్మరించెద యా...

55


ఉ.

భార్గవరామమూర్తివయి పట్టి వధించి తనేకరాజులన్
స్వర్గముదాక వారల విశాలశిరంబులు మెట్లుగట్టియున్
మార్గములన్ సృజించితివి మన్మథకోటిసమానరూప యా
మార్గముఁ జూపరాదె హరి మాధవ యా...

56


ఉ.

తాటకఁ ద్రుంచి యాగమును దత్క్షణమే మును గాచి ఱాతినిన్
బోటిగ వేగఁ జేసి చని భూమిసుతం దగఁ బెండ్లియాడి బ
ల్కాటకుఁడైన రావణుని గ్రక్కునఁ ద్రుంచి యయోధ్యఁ జేరు నీ
సాటియుదారు లేరి బుధసన్నుత యా...

57


ఉ.

యాదవవంశమం దుదయమై బలరామసమాఖ్య నొప్పియున్
మేదినియంతయుం దిరిగి మేటి వటంచును బేరుపొందితౌ
నీదుపరాక్రమక్రమము నేరను వాకొన రేవతీశ నీ
పాదయుగంబు నెంతు బలభద్రుఁడ యా...

58


ఉ.

భూవర భక్తరక్ష పరిపూర్ణదయాకర లోకపాలకై
రావతరూఢవంద్య త్రిపురాసురభార్యలసద్వ్రతంబులన్
భావజరూప బౌద్ధమున భంగముజేసిన లోకరక్ష నీ
సేవ యొనర్తు సంతతము శ్రీహరి యా...

59

ఉ.

ఏకులముందుఁ గాంచినను నింత సుశీలము జ్ఞానభక్తులున్
లేక చరింపఁ జూచి యటులే యవతారము లెత్తి నిల్చియున్
లోకములోని దుష్టజనలోకము దున్మిన కల్కిరూపమున్
మాకడఁ జూపరాదె గుణమండన యా...

60

రామచరితము

చ.

దశరథరాజుగర్భమున ధారుణియందు జనించి మించి యా
కుశికజు వెంబడించియును గుత్సితరాక్షసు నట్టె గూల్చియున్
విశదముగాను జన్నమును వేగమ కాచినవాఁడవౌ భళీ
రసికతతోడ నీ విటుల రాఁగదె యా...

61


చ.

జనకునియాజ్ఞఁ బుచ్చుకొని జానకి లక్ష్మణమూర్తి నీవు స
య్యన విపినంబు జేరి మునులంద ఱొసంగినవిందులన్ భుజిం
చిన పిదపన్ ముదంబునను జిత్రకుటీరము జేరి యావలన్
దనుజువిరాధునిన్ దునుము ధన్యుఁడ యా...

62


ఉ.

తాపసవర్యులందఱ కుదారతతో నభయంబు లిచ్చి య
ప్పాపపుఁజుప్పనాతి విషభావముతో నిను డాయవచ్చి నీ
రూపును జూచి మోహపడి రూఢిగ నన్ను రమింపుమన్న బ
ల్కోపముజేసి ముక్కు చెవి గోసిన యా...

63

ఉ.

ధీరుఁడవై యరణ్యమునఁ దేజముమై నిలుచుండియుండ బల్
శూరుఁడు దైత్యుఁడౌ ఖరుఁడు సూర్యసముద్భవురీతి వచ్చి తా
భోరున బొబ్బఁ బెట్టి నిను భూమిని గూల్చెద నన్న యాతనిన్
మీఱి వధించి తీవెగద మేకొని యా...

64


చ.

దురమున దూషణుండు మఱి ద్రోహి త్రిశీర్షుఁడు సేన గొల్వఁగా
సురువడి రాఁగఁ జూచి తమరొక్కరె నిల్చియు వారి నందఱన్
శరముల వేసి త్రుంచితివి శంకరముఖ్యులు సన్నుతింపఁగా
మఱి నిను గొల్వ నాకు వశమా హరి యా...

65


చ.

కపటముతోడ దానవుఁడు గ్రక్కునఁ దాను కురంగరూపుఁడై
విపినమునన్ జరించునెడ వేగమె జానకి జూచి సుందరం
బపరిమితం బటంచు హృదయంబున మెచ్చియు మీకు దెల్పఁగా
నపుడె వధించినాఁడవు రయంబున యా...

66


ఉ.

సీతను దేరిపైన నిడి శీఘ్రంబుగాఁ జను రావణాసురున్
ఆతఱి జూచి పక్షివిభుఁ డాతనితో నని చేసి చావఁగా
భూతలమందునన్ యశము పుణ్యము స్వర్గమునందుఁ గూర్చు నీ
ఖ్యాతిఁ బ్రశంసజేయ తరమా హరి యా...

67

చ.

ఇభపరిరక్షకా శబరి యిష్టఫలంబులఁ దెచ్చి యీయఁగా
రభసముతోడఁ బుచ్చుకొని రక్షణజేసినవాఁడ వీవెగా
శుభకరసౌఖ్యసంపదలు సుస్థిరత గృపజేయఁబూని నా
కభయము లీయరాదె కరుణాకర యా...

68


చ.

వనచరుఁ డైనవాయుసుతువాక్యములన్ విని భానుసూను స
ద్వినయముతోడ మిమ్ముఁ గని వేఁడుచు దండముఁ బెట్టినంతటన్
మనమున సంతసించి కడుమక్కువతో నభయంబు లిచ్చితౌ
పనుపడి మమ్ము నేలు నెడబాయక యా...

69


ఉ.

భక్తునిమాట మీఱకయె భారము దాలిచి కాననుండ నా
సక్తిని నింద్రనందనుఁడు సాయము గోర ననుగ్రహించియున్
యుక్తిగ నొక్కబాణమున నొయ్యన వాలిని సంహరించి స
న్ముక్తి యొసంగితౌర రఘుపుంగవ యా...

70


చ.

అనిలజుఁ జేరఁ బిల్చుకొని యంబుధి దాఁటియు లంక కేఁగి సీ
తను గని ముద్దుటుంగరము దత్తము జేసి మదీయవృత్తమున్
వినయము మీఱఁ దెల్చి కడువేగముగా నొగి నానవాలు తె
మ్మనిన మహానుభావ పరమాత్ముఁడ యా...

71


చ.

పరువడి లంక కేఁగి యలపావని జానకిజాడ దీసి బల్

గరిమ శిరోమణిం గొనియుఁ గాలునివీటికి నక్షయాసురున్
బరపియు వీతిహోత్రునకుఁ బట్టణ మాహుతి చేసివచ్చి నీ
శరణము గొన్న వాయుజుని సాకిన యా...

72


చ.

వనచరసేనతోడఁ జని వార్ధిసమీపముఁ జేరియున్న మి
మ్మును గని యాత్మలోన బహుమోదమునందియు వేగ నంతటన్
వననిధి పొంగఁగా శరము వైవఁగఁబూని తదీయగర్వభం
జన మొనరించినట్టి గుణసాగర యా...

73


ఉ.

వారిధి దాఁటి లంకకును వానరసైన్యముతోడఁ జేరఁగా
ధీరుఁడు రావణానుజుఁడు దీనతతో వినుతించుచుండఁగాఁ
గూరిమిచేఁ గనుంగొనియుఁ గోర్కులఁ దీరిచి యాదరించి తీ
ధారిణి నేది నీకు సరిదైవము యా...

74


ఉ.

రావణివచ్చి నాగప్రదరంబును వేయఁ బ్లవంగసంచయం
బావసుధం బడంగఁ గని యంతటఁ దార్క్ష్యుని బిల్చి వారలన్
లేవఁగఁజేసినట్టి తమలీలల నెన్నఁగ నాకు శక్యమా
శ్రీవర నీవె నాకు గతి సృష్టిని యా...

75


చ.

అసురవరుండు రావణున కాత్మజుఁడై తగునింద్రజిత్తుఁడున్
వసుధ చలింప నీపయికి వచ్చిన గన్గొని తమ్ము నంపి ర

క్కసునిశిరంబు వేగ శితకాండముతో వధియింపఁజేసితౌ
కుసుమశరారిసేవ్యపదకోమల యా...

76


ఉ.

కాటకుఁ డైనదైత్యుఁ డతికాయుఁడు దివ్యరథంబు నెక్కి నీ
తోటి రణంబుఁ జేసి నిను ద్రుంచెదనంచని వెంబడింపఁగా
సూటిగ నొక్కబాణమున స్రుక్కఁగ జేసినవాఁడ వౌర నీ
సాటిబలాఢ్యు లేరి రఘుసత్తమ యా...

77


ఉ.

రాక్షసరాజు నీవు రణరంగమునన్ దురమాడ లక్ష్మణుం
డాక్షణమందు రావణశితాశుగసంహతి మూర్ఛనొందఁగా
దీక్ష దలిర్ప వానిఁ గని దీనత నొంది సమీరపుత్రు నీ
వాక్షణమందు మందుకొఱ కంపవె యా...

78


ఉ.

శ్రీరఘురామమూర్తి వయి శ్రీశితికంఠుని సూనుఁ బిల్చి బ
ల్నేరుపుతోడ శల్యకరణిన్ గొని తెమ్మని తెల్పి పంపఁగా
ధీరత తత్సహాయమునఁ దేకువ నీయనుజుండు పొందఁగా
నారసి సంతసించిన మహామహ యా...

79


చ.

పటుతరదైత్యసంచయము బాణచయంబును బట్టి కొల్వఁగా
దిటమునఁ గుంభకర్ణుఁ డతిదివ్యశరంబులఁ జేతఁ బూనియున్

దటుకున వచ్చి సంగర ముదారతమై యొనరించునంతలో
తృటిని దదీయశీర్షమును ద్రెంచిన యా...

80


చ.

కపటపురావణాసురుఁడు కార్ముకముల్ శరముల్ రథంబుపై
నపరిమితంబు జేర్చుకొని యద్భుతసైన్యము వెంటనంటి రా
నపు డతివేగవచ్చి నిశితాస్త్రము లేయఁగఁ జూచి వానిశీ
ర్షపటలినెల్ల నేలపయి రాల్చిన యా...

81


ఉ.

లక్షణశీలి లక్ష్మణుని లంకకుఁ బంపి విభీషణాఖ్యు న
ధ్యక్షు నొనర్పఁజేసి సురలందఱి సంతసపెట్టి సర్వలో
కక్షయకారులౌ నసురకాంతుల శాంతుల సల్పి భూతలం
బక్షయభోగలీల నలరారుచు యా...

82


ఉ.

జానకి నీవు లక్ష్మణుఁడు సారసమిత్రసుతుండు పౌరులున్
వానరసైన్యమున్ దనుజవర్గము గొల్వ నయోధ్యఁ జేరఁగా
మానవనాథు లెల్ల నిను మన్ననమీఱఁగఁ గొల్చి రాష్ట్రమున్
పూనికఁ గట్టిపెట్టిరట పొందుగ యా...

83


చ.

పరగ నయోధ్యయందు నొగి బ్రాహ్మణవర్యులు క్షత్రవైశ్యులున్
సరసత శూద్రసంఘములు సామజగామిను లైనచేడియల్
వరభటసంచయంబు నిను వర్ణనజేయఁగ భక్తరాజికిన్
వరదుఁడ వైతి వీవ మునివర్ణిత యా...

84

కృష్ణచరితము

ఉ.

అందము గాఁగ నీవు మును నభ్యుదయంబయి తల్లిదండ్రులన్
సుందరదైవరూపగుణశోభితలీలల దన్ప వార లా
నందపయోధిమగ్నులయినన్ నిజమాయను వారిఁ గప్పి మే
లొందఁగఁ జేసినట్టి సుగుణోత్కర యా...

85


ఉ.

అష్టమి రోహిణీదివసమందున దేవకిదేవిగర్భమం
దిష్టముతో జనించి కలుషేంగితపూతన సంహరించియున్
దుష్టుఁడు రాక్షసుండొకఁడు తూగియు బండివిధానఁ బైఁబడన్
కష్టుని వాని గూలిచినగణ్యుఁడ యా...

86


చ.

మదవతి నిద్రవోవునెడ మాయఁగ నాయమచెంతఁ జేరి యా
సుదతి కెఱుంగకుండఁగను సుందరమన్మథగేహమం దొగిన్
గుదురుగ వృశ్చికం బొకటి కుట్టఁగఁజేసినవాఁడ వీవె నీ
పదములఁ జూపి బ్రోచుటలు భాద్యము యా...

87


ఉ.

చేడియ తీర్థమాడునెడఁ జెండును దానిగృహాన వైచి నీ
వాడుచుఁబోయి కన్గొని మహాద్భుతమంచుఁ దలంచి చీర మున్
వేడుకతోడ దీసికొని వేగమె దాఁచినవాఁడ వీవెకా
వేఁడెద భక్తితోడ గుణవిశ్రుత యా...

88

చ.

రసికుఁడు శక్రుఁ డల్గి మును ఱాళులవానల నించుచుండఁగాఁ
బసువులు యాదవుల్ మిమును బ్రస్తుతి జేయుచు నుండ నంతటన్
వసమును గాని పర్వతము వైళమ యెత్తి సముద్ధరించు నీ
యసదృశశక్తి నెన్న వశమా యిల యా...

89


ఉ.

వారిజలోచనల్ యమునవారిని దీర్థము లాడుచుండఁగాఁ
గూరిమితోడఁ జేడియలకోకలు గైకొని చెట్టుమీఁద్రికిం
గోరిక నెక్కియున్ శరణు గోరఁగ వారల గారవించుశృం
గారమనోజ్ఞవేష మముఁ గావవె యా...

90


చ.

సతిపతు లొక్కయింట సరసంబుగ నిద్దురఁబోవుచుండఁగా
హితమతితోడ వేగఁ జని యిద్దఱిమధ్య భుజంగ మేయఁగా
నతిభయ మంది వస్త్రముల నక్కడ వీడియుఁ బర్వులెత్తఁగాఁ
గుతుకమునొంది నవ్వితివె కోవిద యా...

91


చ.

అరిదరహస్తదివ్యమణిహారవిభాసిత శేషతల్ప శ్రీ
నరహరి వామదేవసఖ నారదసన్నుత నందనందనా
హరిహరినేత్ర నీదుమృదుహస్తము నాశిరమందుఁ జేర్చియున్
చిరసుఖసంపదల్ గలుగఁ జేయవె యా...

92


ఉ.

ఫుల్లసరోజనేత్ర పువుబోడి యశోదయు నాగ్రహించి నీ

యల్లరిచేత లాపుకొఱకై యొకరోటికి గట్టివేయఁగా
మెల్లన యిగ్గి వృద్దులను మేదినిపైఁబడఁ గూల్చి శాపమున్
జెల్లఁగఁ జేసి యేలితివి చేకొని యా...

93


చ.

నరహరి వాసుదేవ సురనాయకసన్నుత కృష్ణమూర్తివై
బిరబిర బిడ్డచుంచుకును బిత్తరి లేఁగమెఱుంగుతోఁకకున్
సరగునఁ గట్టి వీథికిని జయ్యనఁ దోలితి వౌర నీకథా
స్ఫురణము విన్నవారలకు మోక్షము యా...

94


చ.

తనయులఁ బూడఁ గొట్టుకొని దైన్యపువిప్రుఁడు నిన్నుఁ గొల్వఁగా
మనమున సంతసించి యనుమానము లేకయె తెచ్చి యీయఁగా
వనరుహసంభవాదిసురవర్గము నిన్ను బ్రశంపజేసి నీ
గొనముల నెన్నినారు సుమకోమల యా...

95


చ.

ఘనమధురాపురంబునకు గ్రక్కునఁ బోవఁగ మార్గమందు స
ద్వినయవిధేయతన్ విరులు వేగసమర్పణ చేయఁగానే నె
మ్మనమున సంతసించి యల మాలకరిన్ గరుణింపలేదె స
న్మునిజనపాల భక్తజనమోహన యా...

96


చ.

పుడమిని నీవు యాదవులపూరిగృహంబుల కేఁగి పాలుఁ
గడ నవనీతముం బెరుగు కమ్మనినేయియుఁ ద్రావుచుండఁగాఁ

బడఁతులు జూచి నీకు నిది భావ్యము గాదన వారిమోములం
దిడినమహేంద్రజాలకమణీ హరి యా...

97


ఉ.

గొప్పభుజంగరూపమున గొబ్బున వచ్చియుఁ ద్రోవకడ్డమై
యొప్పుగ వక్త్రగహ్వరము నొక్కట విస్తృతిజేసి రక్కసుం
డప్పుడు ధేనువత్సనిచయంబును దాఁ గబళింపనుండఁగాఁ
దప్పక వానిఁ గూల్చిన యుదారుఁడ యా...

98


ఉ.

యాదవసుందరీమణుల నందఱ గానసుధాప్తిఁ దేల్చి యా
మోదము నొందఁజేసితిని మోదము మీఱఁగఁ క్రీడఁ దేల్చి నీ
గాదిలిసంద్రమందు మునుఁగన్ గరుణించితి విట్టి నీదయా
స్వాదన మెప్డు చూరఁగొనఁజాలుదు యా...

99


ఉ.

గోపకు లెల్ల లేఁగలను గోవులఁ దోడ్కొని కాననంబునం
దేపుగ మేపుచుండునెడ నింద్రునిశత్రుఁడు వత్సరూపుఁడై
కోపున వేగరాఁగఁ గని కోపమునం దెగటార్చితౌ భళీ
తాపసవంద్య నీవు నెఱదాతవు యా...

100


ఉ.

చిన్నతనంబునన్ మడుగుఁ జేరి భుజంగమశీర్షపీఠిపై
యున్నతమైననాట్యమును నొప్పుగఁ జేసి మదం బడంచి యా

పన్నుని జేయఁగా నతనిభార్యలు నిన్ను నుతించినంతనే
పన్నుగ నేలితౌ సుగుణవైభవ యా...

101


ఉ.

ద్వారకపట్టణేశ మదదైత్యవినాశ మురారి యీశ య
క్రూరసుపోష సర్వజనగోకులవంద్య సురేశసన్నుతా
సారసపత్రనేత్ర గుణసాగర యాదవవంశభూషణా
ఘోరభవాబ్ధినావ నిను గోరితి యా...

102


చ.

నరహరి నారసింహ నిను నామదిలోపల నమ్మియుండి నీ
చరణములన్ స్మరించుచును సంతత ముత్పలచంపకంబు లే
నరుదుగ నేర్చి కూర్చి యొకహారము నీకు నొసంగ నుంటి సా
దరముగ నేలరావె గుణదామక యా...

103


ఉ.

మంగళ మాదిదేవ పరమాత్మ దయానిధి సద్గుణాకరా
మంగళ మిందిరారమణ మందరధీర మురారి కేశవా
మంగళ మాత్మరక్ష మునిమానిత భూనుత వాసవార్చితా
మంగళమయ్య యెల్లపుడు మాధవ యా...

104


ఉ.

హెచ్చరి కాదిశేషశయనేందుదివాకరచారులోచనా
హెచ్చరి కాదిదేవ హరి హేతుమయాత్మకలోకరక్షణా
హెచ్చరి కాంగజారినుత హేమపిచండముఖాఖిలార్చితా
హెచ్చరి కౌను నీకు నను నేలర యా...

105

ఉ.

లాలి ముకుంద నాగనుత లాలి శుభాకర మారసుందరా
లాలి త్రిశూలపాణినుత లాలి మునీశ్వరలోలసాధనా
లాలి సమీరపుత్రనుత లాలి పరాత్పర లాలి శ్రీధరా
లాలి ధరారిభక్తజనలాలిత యా...

106


ఉ.

జోల మురారి మౌనినుత జోల రమేశ మురారి కేశవా
జోల సురేంద్రసూనుసఖ జోల పరాత్పరభక్తరక్షణా
జోల భుజంగతల్ప హరి జోల జనార్దన నారదార్చితా
జోలలు బాడెదన్ గరుణ చూడవె యా...

107


ఉ.

శ్రీతిరువాయిపాటి కులశేఖరుఁడౌ మణవాళ జియ్యరుం
డాతనిపుత్రుఁడౌ వరపరాంకుశసూనుఁడ వేంకటాఖ్యుఁడన్
శ్రీతరుణీశ నీకథలఁ జేసి ధరాతలమందు భూజనుల్
జేతమునన్ బఠించునెడఁ జేకొన యా...

108


సమాప్తము.