Jump to content

భక్తిరసశతకసంపుటము/మూఁడవసంపుటము/రామరామశతకము

వికీసోర్స్ నుండి

పీఠిక

ఈ రామరామశతకము నూటాఱు చరణములు గల యొక గేయము. ఇది నారాయణశతకమువలెఁ బాడుట కనుకూలముగ సులభశైలిలో మనోహరముగా రచింపఁబడియున్నది. శతకరచయిత తోట నరసింహదాసు విఱుకలాంబలకుఁ గుమారుఁడగు వేంకటనరసింహకవి ఇతనివాసము కుల్లూరనియు చిన్ననాగయ్యదాసుగారి శిష్యుడనియు నంత్యము గల చరణములవలనఁ దెలియును, కుల్లూ రెటఁగలదో చిననాగయ్యదాసునిప్రశస్తి యెట్టిదో తెలిసికొనవలసియున్నది.

కవి యీశతకమును శుక్లసంవత్సరము మార్లశిర బహుళ గురువారమున వ్రాసితినని చెప్పికొనెను. శతాబ్దము తెలుపుకొనకపోవుటచే నే శుక్లయో గుఱుతింప వీలు గాకున్నది. తిథియు వారమును జెప్పికొనిన కవికాలము గ్రహింపఁ గొంతవఱకు వీలయ్యెడిది. ఎటులఁ జూచినను కవి అఱువదిసంవత్సరములకుఁ బైవాఁడనియు శతకగద్యమువలన మనము స్థూలదృష్టితో నిరూపింపవచ్చును. ఇందలి శైలి మిగుల మృదుమధురముగా నుంటచే నిందుఁ బ్రతిపాదింపఁబడిన బశ్చాత్తాపవిషయములు పిండోత్పత్తివిధము పంచీకరణము ముద్రాదికములు యోగములు సామాన్యజనములకు సైతము సుబోధముగా నున్నది.

ఈ శతకమున నారాయణశతకమునఁ జెప్పఁబడనియంశములు పెక్కులు సాంఖ్యశాస్త్రము ననుసరించి కవి తెలిపెను. తోఁట వేంకటనరసింహకవి యితర గ్రంథములు కానరావు. ఉత్తమోత్తమమగు నీశతకరాజమును పఠించి యాంధ్రులు పరమార్థము నొందుదురేని శతకకర్త సిద్ధసంకల్పుఁడగును.

ఇట్లు
వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్

శ్రీరస్తు

శ్రీరామరామశతకము

క.

శ్రీరామా సీతాహృ
త్సారసరవి భానువంశసాగరచంద్రా
భూరిదయారససాంద్రా
సారసపత్రాక్ష రామచంద్రనరేంద్రా!


శ్రీలక్ష్మిప్రాణలోలా
       మౌనిజనచిత్తతామరసఖేలా
ఫాలాక్షవినుతశీలా
       దయజూడు పరమాత్మ రామరామ.

1


నిక్కమని సంసారము
       మదినమ్మి నీస్మరణ చేయలేక
అక్కటా యమునికిపుడు
       పిట్టవలెఁ జిక్కితిని...

2


తల్లిదండ్రాదులనియు
       మఱి యన్నదమ్ములని నమ్ముకొనుచు
ఎల్లకాలంబు మదిని
       నీభక్తి నేమఱితి...

3

మోసపోతినిగదయ్యా
       ఇకముందు దోఁచ దేమదు
నీచాత్ముఁడను గావున
       లోనైతి నాసలకు...

4


పాపకర్ముండ నేను
       అతిఘోరపాపములు జేసినాను
ఈపట్ల నీకన్నను
       గృపజూడ నిఁక నెవరు...

5


మాయ చీఁకటి కోనలోఁ
       గొన్నాళ్లు మార్గంబు గానరాక
యేయుపాయము గానక
       జన్మముల నెత్తితిని...

6


ధనము సంపాదించుచు
       నొకకాసు దానంబు సేయలేక
తినుటకును మనసోర్వక
       తుదఁ జచ్చు దీనుఁడై...

7


గోఁచిమాత్రం బైనను
       నొకగంత కొంచుబోవుటయు లేదు
నీచుఁడై యమునిపురికిఁ
       బోవు తుద నిక్క మిది...

8


సంసారసాగరమున
       ఎన్నాళ్లు జాలి జెందినను గాని

హింస నిశ్చయమె కానీ
       కడతేరు హితవౌనె...

9


కులనింద జేసినాఁడ
       బహుదోషకులుఁడనై బుట్టినాఁడ
ఇలను నావంటివాని
       కృపజూడవలెనయ్య...

10


ఎండమావులయందున
       నుదకంబు నిండుగా నిలుచుండునే
బండసంసార మటుల
       భ్రాంతియై యుండుగద...

11


దారువందున పురుషుఁడు
       కనఁబడిన తీరుగా భ్రాంతివలన
గారడీసంసారము
       నిజముగాఁ గనఁబడును...

12


జీవుఁడే యీశ్వరుండు
       తలపోయ జీవుఁడే పరమాత్మయు
జీవుఁ డనుభ్రాంతి విడువ
       యఖిలంబు జీవుఁడౌ...

13


కుక్కనక్కలయందున
       నేను బహుపెక్కుజీవులయందును
అక్కటా బుట్టిగిట్టి
       యీజన్మ మెత్తితిని...

14

ఈజన్మమం దైనను
       నీపాదపూజ సేయకయుండిన
సహజముగ ముందువలెనే
       బహుజన్మసంభవము...

15


జలముపై బుద్బుదంబు
       దేహంబు కలరీతి యిది నిజంబు
నిలువ దిది నిశ్చయంబు
       ప్రారబ్ధఫలముగద...

16


గాలిలోపల దీపము
       ఈమట్టికాయంబు నేవేళనో
కీలులూడిన బొమ్మయుఁ
       బడునట్లు నేలఁబడు...

17


కాశితీర్థాలు మోసి
       నీపాదకంజములు గానలేక
మోసపోవుటయే గాక
       యెటువలెను ముక్తుఁడౌ...

18


పంచతత్వంబులందు
       భ్రాంతి నిర్జించి యా రెంటియందుఁ
బంచాక్షరీమంత్రము
       ధ్యానింప పరుఁడౌను...

19


ఏరూపు జూచినాను
       నిక్కముగ నారూపు తానె యాను

ధీరుఁడై యిటు దలఁచిన
       మోక్షాధికారుఁడౌ...

20


పూర్వజన్మంబునందు
       తాఁ జేయు పుణ్యపాపంబువలన
ఉర్విపై జననమునకు
       వచ్చుచునె యుండు శ్రీ...

21


సతిపతులు గూడినపుడు
       శుక్లంబు ఋతువైన కమలమందు
అతిశోణితమున గలసి
       బుద్బుదం బవును గద...

22


పదునైదు దినములకును
       నది గట్టిపడి పిండరూపమౌను
కదిసి యొకనెలకు శిరము
       ఏర్పడును గాదె శ్రీ...

23


రెండుమాసములలోను
       హస్తములు రెండు పూర్ణముగనుండు
దండిగా మూణ్ణెలలకు
       సుందరంబై యుండు...

24


తలఁప నాలుగు నెలలకు
       పాదములు గలుగు మఱి యైదునెలలు
నిలిచినను నవయవములు
       సమముగాఁ గలుగు శ్రీరామరామ.

25

ఆఱునెలలైనయంత
       నాళ్లన్ని జేరు మఱి యేడునెలలు
కూరిమిగ నిండగానె
       జీవుండు కుదురుపడు...

26


ఎనిమిదవమాసమందుఁ
       దెలివొంది మనసులోఁ జింతజెందు
తనపూర్వకర్మఫలము
       తలపోసి నిను దలఁచు...

27


మఱి తొమ్మిదవమాసము
       రాఁగానె మురికియౌగర్భమందు
హరిహరీ నిలచియుండ
       లేనంచు వెఱపొందు...

28


దిక్కు నా కెవ్వరనుచు
       నీరోఁతదేహమున నుండననుచు
అక్కటా మున్ను జేయు
       కర్మ మిది యని యేడ్చు...

29


కులము నిందించునపుడు
       పరసతులఁ గలసి భోగించునపుడు
తెలియలేనైతి ననుచు
       బహుదుఃఖములఁ బొందు రామరామ.

30


తప్పుసాక్ష్యము బల్కితి
       పెద్దలను నొప్పుగా దూషించితి

అప్పుడే తెలియనైతి
       యాఫలం బనియేడ్చు...

31


ఈమురికిగర్భ మిపుడు
       దాఁటినను నిఁక కర్మములు జేయను
స్వామి కడతేర్చు మనుచు
       సుజ్ఞానివలె వేఁడు...

32


దశమమాసము వచ్చిన
       సమయమునఁ దగ నధోముఖముగాను
వసుధపై జన్మించియు
       మాయచే వర్ధిల్లు...

33


ముసరులును గింకరులును
       కిసరులును ముట్టుదోషంబులును
పొసఁగ నెలదోషములను
       ఏవేళ బొందుచును...

34


మలమూత్రముల మునుఁగుచుఁ
       బలుమాఱు మంచమందునఁ బొర్లుచుఁ
దెలియరాని యవస్థను
       గొన్నాళ్లు దీనుఁడై...

35


బాలుఁడై కొన్నినాళ్లు
       యౌవనప్రాయమునఁ గొన్నినాళ్లు
బాలకౌమారమునను
       నీభక్తి జేయకయె రామరామ.

36

మగని పలుకులకు నెదురు
       బలుకుచును మగనితోఁ గలహించెడి
మగువ పెండ్లాడి భ్రమలఁ
       దగులుకొని మఱచితిని...

37


కామాతురుం డగుచును
       నీభక్తి గానకను రతుల మరగి
ప్రేమతోడను బిడ్డలఁ
       గని వారిఁ బెంచుచును...

38


కాల దన్నిననుగాని
       బిడ్డలను జాలఁగా దీవించుచు
బాళిమీఱంగ మదిని
       ఆనందపడుచుండు...

39


ఈరీతి కొన్నినాళ్లు
       జరిగినను ఘోరదురవస్థయైన
మీఱి వృద్ధాప్యదశను
       మంచమునఁ జేరు శ్రీ...

40


కన్నులును గానలేక
       వీనులను మున్నువలెఁ దెలియక
తన్నుఁ దా నెఱుఁగలేక
       మేనెల్ల తడబడుచు రామరామ.

41


బహుదుఃఖములఁ బొందుచు
       మంచమునఁ బడి మలంబున దొర్లుచు

సహజ మగురోగములను
       బడి కష్టశాలియగు...

42


కఫవాతపైత్యములును
       శ్లేష్మములు విపరీతముగ నప్పుడు
అపరిమితమై కప్పఁగ
       జిహ్వయును నాడకను...

43


కింకరు ల్వచ్చి నిలచి
       రమ్మంచు జంకించి పిలువఁగానె
యింక నె ట్లనుచు నేడ్చి
       ప్రాణము ల్విడుచుఁగద...

44


పెండ్లామునున్ బిడ్డలున్
       ఆమీఁదఁ బీనుఁగని యేడ్చుచుంద్రు
కండ్ల జూచెదరుగాని
       బ్రతికింపఁగా లేరు...

45


కాటిలోఁ గాల్చివేయ
       వలెఁగాని పాటించి నిలుపరయ్యా
యేటి కీపోరాటము
       సంసారబూటకము...

46


మాయలోకం బంచును
       మదినొచ్చి మాయకార్యములు రోసి
నీయెడను మదినిల్పినఁ
       గడతేరు నెవఁడైన...

47

ధనము నిత్యంబుగాదు
       తా నెంత దాఁచినను కూడరాదు
మనసు భ్రాంతియును బోదు
       ఘనమాయ మహిమలను...

48


తిరుపతులు మొదలుగాను
       యాత్రలను దిరిగి సేవించినాను
పరమాత్మ నెఱుఁగరాదు
       గురుకృను బడయకను...

49


వైరాగ్యభావమునను
       గురుపాదవనజములు జేరి తాను
గురుఁడె దైవం బంచును
       మది నిల్పి గుఱిమీఱ...

50


తలిదండ్రి గురుఁ డంచును
       నమ్ముకొని తప్పకను బూజసేసి
తెలియవలె సుజ్ఞానము
       ఘనమైన తెలివిచే...

51


పంచభూతంబులాను
       నొకటొకటి పంచవలె వేఱుగాను
పంచీకరణము దెలిసి
       తెలియవలె భావంబు రామరామ.

52


ఆదికాలంబునందు
       బ్రహ్మంబు అంబరాకారముగను

నేదియును నంటలేక
       నిర్గుణంబై యుండు...

53


ఆనిర్గుణంబందున
       జనియించె నవ్యక్త మనుమాయయుఁ
బూని యవ్యక్తమందు
       మహాతత్త్వభూతంబు...

54


ఆమహాతత్త్వంబున
       నుదయించె హంకారమును దానిచే
వేమఱును గలిగె మూఁడు
       గుణములును వేడ్కతో...

55


మఱియు నీమూఁటియందుఁ
       బంచతన్మాత్రలును బుట్టెననియు
నెఱుఁగంగ భూతసంజ్ఞ
       ప్రఖ్యాతి నెగడె శ్రీ...

56


గగనంబులో సగంబు
       జ్ఞాతయై కరమొప్పఁ దగ సగంబు
అగణితంబును నాలుగై
       భూతముల యంశమున...

57


వాయువునఁ గలసి మనసు
       నాయె ఘనవహ్నిలోఁ గలసి బుద్ధి
శ్రీయుతంబుగ నీటను
       గలసియును చిత్తమౌ రామరామ

58

ముదమొప్ప ధరణి గలసి
       అహంకారమును నయ్యె నివి యైదును
పదిలమౌ నాకాశము
       పంచకము పరగ శ్రీ....

59


గాలిలోపల సగంబు
       ఉదానంబు గానయ్యె మఱిసగంబు
బాళి మీఱఁగ నాలుగై
       సంతతము భాసిల్లె...

60


నాకాశమునఁ గూడియు
       సమానంబు నాయె మఱి నగ్ని యొకటి
ప్రాకటంబుగఁ గూడియు
       వ్యాసమై బరగె శ్రీ...

61


జలములో నొకభాగము
       గూడుకొని యిల నపానంబాయెను
తలకంగఁ బృథివి గూడి
       ప్రాణమై దనరు శ్రీ...

62


ఇది వాయుపంచకంబు
       ఇఁకా నగ్ని యింపుతోడుత సగంబు
ముదమొప్పఁ జక్షువగుచుఁ
       జెలువొందె ముఖ్యముగ రామరామ

63


చక్కఁగా సగభాగము
       నాలుగై చక్కఁగా నొకయంశము

మిక్కిలి మంటఁ గలసి
       శ్రోత్రమై మెలఁగె శ్రీ...

64


మారుతంబందు నొకటి
       గూడుకొని మఱిత్వక్కు యయ్యె నొకటి
భూరియుదకమునఁ గలసి
       జిహ్వయై పొసఁగె శ్రీ...

65


వసుధలో నొకటి గలసి
       ఘ్రాణమై వర్ధిల్లె నీయైదును
వెస నగ్నిపంచకంబు
       మును లెన్న వేడుకను...

66


జలములో సగభాగము
       రసమగుచు జెలఁగె నాసగము నాల్గు
తలఁప భాగంబు లగుచు
       భూతలము గలసె శ్రీ...

67


నాకసంబందు నొకటి
       జేరియును నయ్యె శబ్దంబుగాను
ప్రాకటంబుగ నొక్కటి
       గాలిలోపలఁ జేరి...

68


స్పర్శంబు నయ్యె నొకటి
       జలములోఁ జొచ్చి రూపంబు నయ్యె
గరిమ నొక్కటి భూమిలోఁ
       గలసియును గంధమౌ రామరామ.

69

జలపంచకంబు నిదియు
       నిఁకమీఁద యిలలోన సగభాగము
తెలియఁగా వాయువయ్యె
       ఆసగము తేటగా...

70


నాలుగై యొకటి గగన
       మున చేరి నయమైనవాక్కు నయ్యె
చాల వాయువున నొకటీ
       గలసియును సరగునను...

71


పాణియై మఱి యొక్కటి
       అగ్నిలోఁ బడి పాదమయ్యె నొకటి
మానుగా జలము గలసి
       గుహ్యమై గానఁబడె...

72


నిది భూమిపంచకంబు
       నీయైదు ముదమొప్ప పంచకములు
పదిలముగ నిరువదైదు
       తత్త్వములు బరగె శ్రీ...

73


ఇది స్థూలదేహ మయ్యె
       సూక్ష్మంబు నిందులోఁ బదియేడును
గదిసి మూఁటిని మలినము
       చేరినను గారణము రామరామ.

74


ఈమూఁడు తనువులకును
       పై నొకటి యింపుతో చేరఁగాను

నేమఱక పరమాత్మయై
       యది యొప్పు వెలయ శ్రీ...

75


రక్తంబు శ్వేతకృష్ణ
       నీలంబు రమ్యమగు నీనాల్గును
ఉక్తవర్ణములమధ్య
       తేజమై యుండు శ్రీ...

76


కర్ణికాకార మగుచు
       వెల్లుచును వర్ణస్వరూప మగుచు
నిర్ణయంబుగఁ బురుషుఁడై
       శిఖి యగుచు నెగడు శ్రీ...

77


ఇదె సర్వసాక్షి యగును
       జ్యోతియగు నిదె నివారకశూకము
ఇది మేరుశిఖర మగుచు
       సహస్రార మిది యగును...

78


వటబీజమంత యగుచుఁ
       గైలాస వైకుంఠలోకములకు
అట సత్త్వలోకాశ్రయ
       స్థానమై యమరు శ్రీ...

79


విమలమౌ యీసాంఖ్యము
       సూత్రంబు క్రమముగా గురునివలన
భ్రమగుణంబులు రోసియు
       నెఱుఁగవలె బ్రహ్మమును రామరామ.

80

నీలమధ్యంబునందు
       బిందువే నిలచినది గంగయగును
మేలైన యానీలమే
       యమునయై మెలఁగె శ్రీ...

81


కడువేడ్కతోడ విద్యు
       ల్లేఖయును ఘనసరస్వతిరూపము
విడువకను నీమూఁడును
       నదులగుచు వెలయు శ్రీ...

82


మఱి నాద బిందు కళలు
       తలపోయు మఱి అకార ఉకారము
వరుసతోడ మకారము
       నీమూఁడు వర్ణములు...

83


రూపములు నేక మగుచు
       ఓంకారరూపమే బ్రహ్మ మనుచు
ప్రాపైన మండలమున
       పై వెల్గు బ్రహ్మమై...

84


అంగలింగాకారమై
       యేకమై సంగమై యుప్పొంగుచు
మంగళంబగుచుఁ గళలఁ
       జెలువొందు మహిమతో రామరామ.

85


పాపమై సూక్ష్మమగును
       కారణము పై వెల్గు వస్తువగును

రేపుమాపును వెల్గును
       తారకము దీపమై...

86


ఆఱుచక్రంబులందు
       మే లెఱిఁగి యభ్యాసమున హంసను
కూరిమిగ నిలిపి నిలిపి
       ప్రణవమునఁ గూడవలె...

87


ఇడ పింగ ళనునాడులన్
       నొకటిగా వేడుకను జేసి పైనఁ
జూడవలె నడిదారిలో
       మనసైన చోద్యములు...

88


గట్టిగా నాసికంబు
       నేత్రములు కరములను మూసి దృష్టి
దిట్టముగ బొమలనడుమ
       జూడవలె ధీరుఁడై ...

89


జూడజూడంగ నచట
       చోద్యములు ఆడనాడను దోఁచును
వేడుకను నాదములును
       పది తాను వినవలెను...

90


దండి ఓంకారధ్వనియు
       విని మహాపండువెన్నెలబైటను
నుండుముద్దులబాలను
       కౌఁగిటను నుంచవలె రామరామ.

91

ఘనముగా నీ షణ్ముఖి
       ముద్రలో మనసు నిల్పినయోగికి
జననమరణంబు లేని
       నీరూపు గనుఁగొనును...

92


తుద ముక్కుపై దృష్టిని
       నిలిపియును ముదముతోఁ గుంభించియు
చెదరకను సమముగాను
       జూచినను మది నిల్చు...

93


రెండైన యక్షరముల
       కీలెఱిఁగి నిండుగా రతిచేయుటే
దండిగా రేచకంబు
       పూరకము దారియగు...

94


వాసిగా నగ్నిశిఖను
       మదినిల్పి జూచునది ఖేచరి యగు
భాసురంబుగను ధార
       నరకంట పైఁ జూడ...

95


భూమధ్యమునకు దిగువఁ
       గనుఁగొన్న పున్నమయమవస చూపు
ప్రేమతోఁ జూడ నిదియు
       శాంభవికిఁ బ్రియమగును రామరామ.

96


ఎన్ని చూపులు జూచిన
       నీపాదచిన్నెలను మది నిల్పియుఁ

బన్నుగా ధ్యానించిన
       సుజ్ఞానభావుఁడౌ...

97


ఆఱుమూఁడును మూసియు
       నాదముల అంతు తా నెఱిఁగి నిన్నుఁ
జేరి సర్వంబు మఱచి
       యుండవలె దీనుఁడై...

98


ఈ రేడు లోకములను
       దా ననుచు నింపుతో నెమ్మనమున
ఆరూఢిగాఁ దలఁచిన
       పరిపూర్ణ మదియె శ్రీ...

99


సర్వభూతంబులందుఁ
       దా ననుచు సమదృష్టితోఁ జూచుచు
నిర్వికల్పసమాధిని
       నిలుపవలె నిక్కముగ...

100


పూర్వజన్మంబునందుఁ
       దాఁ జేయు పుణ్యంబు లేకయున్న
సర్వకాలంబు గుఱిని
       మది నిల్పఁజాలునే...

101


పరసతిని గన్నయపుడే
       తల్లిఁగా భావింపవలెఁ బెద్దలన్
దరిసెనము జేయునపుడే
       బ్రహ్మమని దలఁచవలె రామరామ.

102

వసుధ కుల్లూరిలోను
       శ్రీతోఁట వంశమున నరసింహుఁడు
పొసఁగ శ్రీయెఱుకలాంబ
       ప్రఖ్యాతిఁ బొంది రిల...

103


ఆయిరువురకుఁ బుట్టితి
       సుజ్ఞాన మందితిని భక్తజనుల
దయ జెలంగఁగ వేంకట
       నరసింహదాసుఁడను...

104


అందముగ చిననాగయ
       దాస సన్మందిరంబున వెలసియు
పొందుగా భక్తజనుల
       బ్రోచితిని భూరికృప...

105


ఈశతక మెవరు విన్నన్
       జదివినను నింపుతోడను వ్రాసినన్
వాసిగను భాగ్యములును
       నీదయను వర్ధిల్లు రామరామ.

106


గద్య.

ఇది శుక్లనామసంవత్సర మార్గశిరబహుళ బుధవాసరంబున
తోఁటవంశపయఃపారావారసుధాకర నరసింహపుత్త్ర సుజన
విధేయ వేంకనరసింహప్రణీతంబైన శ్రీరామరామశతకంబు
నందు నీతిసంగ్రహంబును, పిండోత్పత్తిప్రకారంబును, సంసార
పరిభ్రమణంబును, మహాభూతోత్పత్తిప్రకారంబును, పంచీ
కరణంబును, సాంఖ్య తారక అమనస్క పరిపూర్ణంబును,
ముద్రాభ్యాసంబును గల శ్రీరామరామశతకము సంపూర్ణము.