భక్తిరసశతకసంపుటము/నారాయణశతకము/172-173

వికీసోర్స్ నుండి

ముదిమి వచ్చిన వెనుకను -సంసారమోహంబు మానకుండఁ
దుదనేఁగుఁ గర్మగతులఁ -బొందుటకు ముదమేమి నారాయణా. 69
అజ్ఞాన లక్షణమ్ము -లిటువంటివని విచారించి నరుఁడు
సుజ్ఞానమునకుఁ -దగిన మార్గంబు చూడవలె నారాయణా. 70
వేదాంత వేదియైన -సద్గురుని పాదపద్మములు చెంది
యాదయానిధి కరుణచే -సద్బోధ మందవలె నారాయణా. 71
ఏ విద్యకైన గురువు -లేకున్న నావిద్య పట్టుపడదు
కావునను నభ్యాసము -గురుశిక్ష కావలెను నారాయణా. 72
గురుముఖంబైన విద్య -నెన్నికై కొనిన భావజ్ఞానము
చిరతరాధ్యాత్మ విద్య -నభ్యసింపఁగ లేడు నారాయణా. 73
అనపేక్షకుఁడు సదయుఁడు -వేదాంతనిపుణుఁడయ్యాచార్యు
డు దొరుకుటపురూపమపుడు -గుఱుతైన గుఱి యొప్పు నారాయణా. 74
అట్టిసద్గురుని వెదకి -దర్శించి యా మహాత్ముని పదములు
పట్టి కృతకృత్యుఁడౌను -సాధకుఁడు గట్టిగా నారాయణా. 75
మొగి సాధనములు నాల్గు -గలనరుఁడు ముఖ్యాధికారి యగును
దగిన యుపదేశమునకు -యోగసాధకులలో నారాయణా. 76
ఇది నిత్య మిదియనిత్యం -బనుచుఁ దన మది వివేకించుటొ
కటి, యెదను నిహపర సుఖములు -కోరనిది యిదియొకటి. 77
ముదముతో శమదమాది -షట్క సంపద గలిగి యుండుటొ
కటి, విదితముగ ముక్తిఁ బొందఁ -గాంక్షించు టదియొకటి. 78
ఈనాల్గు సాధనముల -నధికారియై నిజాచార్యుఁ జేరి
నానా ప్రకారములను -శుశ్రూష నడుపవలె నారాయణా. 79