భక్తిరసశతకసంపుటము/మొదటిసంపుటము/దేవకీనందనశతకము

వికీసోర్స్ నుండి

పీఠిక

దేవకీనందనశతకము రచనాక్రమము కవితాధారఁ బట్టి చూడఁ బూర్వకవికృతమని తోఁచును. ఇందలి పద్యములు శ్రీకృష్ణభగవానుని లీలావిహారాదికములను గొండాడుచు విష్ణుమహిమాదికములఁ బ్రశంసించుచు మృదుమధురపదగుంఫనములతో సుకుమారములగు సమాసములతో నలరారుచున్నవి. ఇందలి కృష్ణలీలావర్ణనములలోని పద్యములు శ్రీకృష్ణకర్ణామృతము ననుసరించి వ్రాయఁబడినవి విశ్లేషించి కలవు. దృష్టాంతమున కొకదానిని జూపుచున్నారము.

ఉర్వ్యాంకోపి మహీధరో లఘుతరోదోర్భ్యాంధృతో లీలయా
తేన త్వం దివి భూతలేచ సతతం గోవర్ధనోద్ధారకః
త్వాం త్రైలోక్యధరం వహామి కుచయో రగ్రే న తద్గణ్యతే
కింవా కేశవ భాషణేన బహునా! పుణ్యైర్యశో లభ్యతే.

ఈశ్లోకము ననుసరించి వ్రాయఁబడిన పద్య మీశతకమున 15-వ సంఖ్యలో నున్నది. ఇటులె కొన్నిపద్యములు భక్తిరసప్రతిపాదకములగు శ్లోకములకు ఛాయలుగా గానుపించుచున్నవి. ఇందలి ప్రతిపద్యము కదళీపాకములో సుకుమార సమాసకల్పితమై యుంటచేఁ బఠనయోగ్యముగ నున్నది. శతకమున 100 పద్యములు మాత్రమె కలవు. ఫలశ్రుతి తెలుపుపద్యము కందపద్యముగ నున్నది. కవిచరిత్రముగల పద్యము స్తుతివిషయికపద్యములు లోపించి యుండునని తోచుచున్నది. శతకమువలన మాత్రము గ్రంథకర్తను నిరూపింప వీలు చిక్కదు గాన, సాధనాంతరము లన్వేషించి గ్రంథకర్తృనామము కాలము తెలిసికొనఁ బ్రయత్నింపుదము.

జక్కనకవి విక్రమార్కచరిత్రమునఁ గృతిపతివంశావతారముఁ జెప్పుకొనుచుఁ గృతిపతితండ్రి యగు జన్నమంత్రి నీవిధముగాఁ బ్రశంసించి యున్నాడు.

సీ. పరమహృద్యంబైన పద్యశతంబున
     దేవకీతనయు విధేయుఁ జేసె
     ... ... ... ... ... ... ... ...
     హరితమునివంశరత్నరత్నాకరేంద్ర
     చంద్రుఁడై యొప్పు సిద్ధయజన్నమం త్రి.

దీనివలన దేవకీతనయశతకము రచించినది హరితసగోత్రుడగు జన్నమంత్రియనియు నతఁడు దేవరాయ మహారాయల యాస్థానమున మంత్రిగ నున్నటులఁ దెలియుటచే క్రీ. శ. 1422-1440లోగనుండియుండుననియుఁ దలంప వీలుకలుగుచున్నది. ఇతరాధారములు లభించువఱకు దేవకీనందనశతకము రచనాకాలము గ్రంథకర్తృనామము పైనిర్ణయముతో సరిపుచ్చుకొనవచ్చును. ఈశతకమున వ్యాకరణదోషములు గనుపట్టుచున్నవి.

అయినను అప్పకవివంటి లాక్షణికుఁడు ఇందలి పద్యములు ఉదాహరణమునకుఁ దీసికొనుటవలన నీశతకప్రశస్తి యప్పకవి కాలమునకే సుప్రసిద్ధముగా నుండె ననుటకు సంశయము లేదు. లిఖితప్రతి యొకదానిలో నీశతకము కవిరాక్షసుఁడు వ్రాసినటులఁగలదు. కవిరాక్షసుఁడే జన్నయ్యకవియో యాబిరుదనామ మెవరిదో యెఱుంగ వీలుకాదు. మఱియు నాపద్య మొకప్రతియందే గానవచ్చుట వలన నెంతవఱకు విశ్వసనీయమో యెఱుంగనయితి గాదు.

ఈ శతకమును నిర్దుష్టముగా ముద్రించి యాంధ్రదేశీయుల కందించిన వావిళ్లవారి ప్రయత్నము ప్రశంసాపాత్రము.

నందిగామశేషాద్రిరమణకవులు,
1-1-25శతావధానులు.

శ్రీ కృష్ణాయ నమః

వెన్నెలకంటి జన్నయ్యమంత్రికృత

దేవకీనందనశతకము

శా. శ్రీకైవల్యరమాధినాథ నిను నర్థిం గీర్తనల్‌జేసి కా
     దా కంజాతభవేంద్ర నారద శుకవ్యాసాంబరీషార్జునుల్‌
     నీకారుణ్యముఁ గాంచుటల్‌ ననుమతిన్‌ నేనెంతధన్యుండనో
     నాకుఁ జేకురె నట్టిభాగ్యములు కృష్ణా! దేవకీనందనా!1
శా. శ్రీవైకుంఠనివాసగోత్రధర లక్ష్మీనాథ గోపాల లీ
     లావిర్భావ పతంగవాహ యదువంశాంభోధిచంద్రోదయా
     నీవే దిక్కని యున్నవాఁడను దయన్‌ వీక్షించి రక్షించవే
     నావిజ్ఞాపన మాలకించు మది కృష్ణా! దేవకీనందనా!2
శా. శ్రీరామావసుధాకళత్రములపైఁ జెన్నొందు పాదాబ్జముల్‌
     గారామారఁగఁ జూచి శేషఫణి దాఁ గౌతూహలంబొప్పఁగా
     క్షీరాంభోనిధిఁ బవ్వళించి యమరుల్‌ సేవింపఁగా నొప్పుని
     న్నారాధింతు మదీయచిత్తమునఁ గృష్ణా! దేవకీనందనా!3

శా. నీడల్‌ దేఱెడు చెక్కుటద్దములతో నిద్దంపుఁగెమ్మోవితో
     కూడీకూడని చిన్నికూకటులతో గోపార్భకశ్రేణితో
     వ్రీడాశూన్య కటీరమండలముతో వేడ్కన్‌ వినోదించుచు
     న్నాఁ డా శైశవమూర్తి నేఁ దలఁతుఁ గృష్ణా! దేవకీనందనా!4
శా. అందెల్‌ చిన్నిపసిండిగజ్జియలు మ్రోయన్‌ మేఖలాఘంటికల్‌
     క్రందై మ్రోయఁగ రావిరేకనుదుటన్‌ గంపింప గోపార్భకుల్‌
     వందారుల్‌ గన వెన్నముద్దలకు నై వర్తించు మీబాల్యపుం
     జందం బాదివిజుల్‌ నుతించుటలు కృష్ణా! దేవకీనందనా!5
శా. వేదోద్ధారకుఁగా సుధాప్రభువుఁగా విశ్వంభరావాహుఁగా
     వాదావిర్భవుఁగా త్రయీవటువుఁగా వర్ధిష్ణుతాయుష్యుఁగా
     కోదండాశుగపాణిఁగా బలునిఁగా ఘోరవ్రతచ్ఛేదిఁగా
     నాదిబ్రహ్మముఁగాఁ దలంతు మదిఁ గృష్ణా! దేవకీనందనా!6
మ. అమరుల్మ్రొక్కులచే మునుల్‌ నుతులచే నార్యుల్మహానిష్ఠచే
     సమరోత్సాహజనుల్‌ పునశ్చరణచే సాధుల్‌ దయాబోధచే
     నమితోదారకళాఢ్యు లర్పణలచే నధ్యాత్ము లైక్యంబుచే
     సమతం గాంచిరి మీపదాబ్జములు కృష్ణా! దేవకీనందనా!7

మ. జపముల్‌ సేయఁగ నేర నీమమున నిచ్చ ల్పూజ సేయంగలే
     నుపవాస వ్రతభక్తి చొప్పెఱుఁగ వేదోక్తక్రమస్థుండఁగా
     నపరాధంబులు నాయెడం దఱచు నే నజ్ఞాని నెబ్భంగులన్‌
     జపలుం డంచు నుపేక్ష సేయకుము కృష్ణా! దేవకీనందనా!8
మ. సుకరంబై సురసేవ్యమై సులభమై సువ్యక్తమై యుక్తమై
     ప్రకటంబై పరమార్థమై ప్రమదమై ప్రద్యోతమై పథ్యమై
     యకలంకామృతమై యమోఘతరమై యానందమై యందమై
     సకలంబున్‌ భరియించు మీమహిమ కృష్ణా! దేవకీనందనా!9
శా. కొండల్వంటి కవీశ్వరుల్‌ శతకము ల్గూర్పంగఁ గోటానకో
     ట్లుండన్‌ నీవును జెప్పఁబూనితి వదేమో యంటివా వింటివా
     వండేనేర్పులఁ బెక్కురీతుల రుచుల్‌ వర్తింపవే శాకముల్‌
     దండిన్‌ నామన వాలకింపు మదిఁ గృష్ణా! దేవకీనందనా!10
శా. చన్నే నిన్నును బాలుఁగాఁ దలఁచి యిచ్చం బూతనాకాంత దాఁ
     జన్నుల్నిండఁగఁ జేఁదుఁ బూసికొని యా చన్బాలు నీకిచ్చినం
     జన్నుంబాలకు లోనుగాక యసురన్‌ సాధించి యాయింతికిన్‌
     సన్నన్‌ ముక్తి యొసంగితీవు భళి కృష్ణా! దేవకీనందనా!11
మ. విలసిల్లన్‌ పదియాఱువేలసతులన్‌ వీక్షించి వారిండ్ల లో

     పల వర్తించుచునుండి వీటఁ గల గోపస్త్రీలనెల్లన్‌ గడుం
     బలిమిన్‌ బట్టి రమించినాఁడవు భళీ ప్రాజ్ఞుండ వీవౌదు భూ
     స్థలి నీవేకద కొంటెదేవరవు కృష్ణా! దేవకీనందనా!12
మ. పొలుపొందన్‌ నడిరేయిఁ గుక్కుట రవంబుల్‌ చూపి గోపాలకా
     వళి విభ్రాంతులఁ జేసి మందలకునై వారేఁగఁ దత్కామినీ
     కలనాయత్నము తామ్రచూడగతులన్‌ గావించి నీకీర్తి ర
     చ్చల కెక్కెం గడుగొయ్యదేవరవు కృష్ణా! దేవకీనందనా!13
మ. అనిరుద్ధాచ్యుత యీశకేశవ ముకుందాధోక్షజోపేంద్రవా
     మన దామోదర చక్రపాణి హలి రామా శౌరి శార్ఙ్గీ జనా
     ర్దన పీతాంబర భక్తవత్సల నమో దైత్యారి వైకుంఠవా
     స నృసింహాంబుజనాభ ప్రోవు ననుఁ గృష్ణా! దేవకీనందనా!14
మ. ఇల గోవర్ధన మెత్తితీ వనుచు బ్రహ్మేంద్రాదు లెంతో నినుం
     బలుమారున్నుతులొప్పఁ జేసెదరు పద్మాక్షా కుచాగ్రంబునం
     జులకన్నెత్తిన రాధనెన్న రిదిగో సొంపొంద సత్కీర్తి ని
     శ్చలపుణ్యంబునఁ గాక చొప్పడునె కృష్ణా! దేవకీనందనా!15
శా. మౌళిం బింఛపుదండ యొప్పుగ నటింపంగౌను శృంగారపున్‌
     శ్రీ లెంచంగను పిల్లఁగ్రోవి రవమున్‌ జేకోలమున్‌ జెక్కుచున్‌

     గేలన్‌ మెచ్చొనరింపఁ గోపకులతోఁ గ్రీడారసస్ఫూర్తి నీ
     వాలం గాచువిధంబు నేఁ దలఁతుఁ గృష్ణా! దేవకీనందనా!16
శా. పెచ్చుల్‌ ప్రేలుచుఁ బిల్లఁగ్రోవి రవమున్‌ బెంపొందఁగాఁ జొక్కుచున్‌
     నిచ్చల్‌ నిన్ను భజింప గోపగణమున్‌ నిత్యోత్సవక్రీడమై
     నెచ్చల్‌ మచ్చిక ముచ్చటచ్చుపడఁగా హెచ్చించి కీర్తించి నీ
     సచ్చారిత్రము విన్నఁ బుణ్యమగుఁ గృష్ణా! దేవకీనందనా!17
మ. లలనాకుంచితవేణియుం దడవ మొల్లల్‌ జాఱ కస్తూరికా
     తిలకంబుం గఱఁగంగ లేఁతనగవున్‌ దీపింప నెమ్మోమునన్‌
     దళుకుల్‌ చూపెడిచూపు లుల్లసిల నానారీతులన్‌ వేణుపు
     ష్కలనాదంబులపెంపుఁ జూపుదువు కృష్ణా! దేవకీనందనా!18
మ. కలకాంచీమణికింకిణీమధురనిక్వాణంబు మంజీరమం
     జులరావంబును గొంతకొంత వినవచ్చెన్‌ బట్ట లేనైతి నం
     కిలి నిద్రించుట మోసపుచ్చె హితవాగ్గేయుండు నేఁడంచు ని
     చ్చలు మీశౌర్యము లెంచు గోపతతి కృష్ణా! దేవకీనందనా!19
మ. కలనైనన్‌ నగియైనఁ గోప మెసఁగంగా నైన మీనామ ని
     ర్మలవర్ణద్వయ మెవ్వరేఁదలఁచినం బాపౌఘముల్వాయును

     జ్జ్వలభాన్వప్రతిమానచండకిరణవ్రాతాహతిం జీఁకటుల్‌
     చలనం బంది తొలంగుచందమునఁ గృష్ణా! దేవకీనందనా!20
మ. నినునెవ్వాఁడు దలంచు నీమహిమ వర్ణింపంగ నెవ్వాఁడు నే
     ర్పునఁబూనున్‌ నినుగొల్చునట్టిఘనుఁ డాపుణ్యాత్ములోకైకమా
     న్యునిఁగా ధన్యునిఁగా వివేకనిధిఁగా నుద్యద్గుణాంభోధిఁగా
     ననిశంబుం గొనియాడఁ గోరుదురు కృష్ణా! దేవకీనందనా!21
శా. శీలంబున్‌ గులమున్‌ వివేకనిధి లక్ష్మీకాంతవక్షస్స్థలిన్‌
     హాళింబాయకయుండు కాముకుఁడవై హంకారవృత్తిన్‌ సదా
     స్త్రీలోలుండన రాధతోఁ బెనఁగుట ల్చిత్రంబులు న్నౌర నీ
     జాలం బే మని సన్నుతించెదను కృష్ణా! దేవకీనందనా!22
శా. శ్రీలక్ష్మీధవ రుక్మిణిం గలసి కూర్మిన్‌ మిత్రవందా సుదం
     తాలోలాక్షులఁ గూడి జాంబవతి సత్యాలక్ష్మణాభద్రలన్‌
     కాళిందిన్‌ మరుకేళిఁ దేల్చితివి శృంగారాంగగోపాంగనా
     జాలంబున్‌ దనియింతు నౌర తుదఁ గృష్ణా! దేవకీనందనా!23
శా. మద్దు ల్గూల్చినలాగొ వేగ మనిలో మన్నించి గాండీవికిన్‌
     బుద్దుల్‌ సెప్పినలాగొ మోదరసముప్పొంగన్‌ యశోదమ్మకున్‌

     ముద్దుల్గా నటియించులాగొ వరుసన్‌ మువ్వేళలన్‌ వేడుకన్‌
     చద్దు ల్మెక్కి రహించులాగొ ధరఁ గృష్ణా! దేవకీనందనా!24
మ. చరణాబ్జంబులు వీడ్వడన్‌ నిలచి యోజన్‌ దట్టిలో పిల్లఁగ్రోల్‌
     కర మొప్పారఁగ నుంచి యింపొందవఁ జంకన్‌ గోలనందిచ్చి బ
     ల్వురుగోపాలురు జుట్టునుంగొలువ వేల్పుల్‌ గ్రుక్కిళుల్మ్రింగఁగా
     నరయం జల్ది భుజింపవే యడవిఁ గృష్ణా! దేవకీనందనా!25
మ. మెఱుఁగుల్దేఱు మహేంద్రనీలనిభమౌ మేనన్‌ సమీపాటగో
     ఖుర నిర్ధూత ధరాపరాగలవ పంక్తుల్గప్పఁగా నొక్కచేఁ
     బురిగోలొక్కటఁ బాలకుండఁ గొనుచుం బొల్పొంగ గోధుగ్జనాం
     తర వర్ధిష్ణుఁడవైన నిన్‌ గొలుతుఁ గృష్ణా! దేవకీనందనా!26
శా. అధివ్యాధిహరంబు జన్మమరణవ్యాపారదుష్కర్మ దు
     ర్బోధావ్యాప్తినివారణంబు సతతస్ఫూర్జ జ్జగద్రక్షణో
     న్మేధాయుక్తము భక్తవాంఛితఫలానీకప్రధానైక దీ
     క్షాధౌరేయము నీమహామహిమ కృష్ణా! దేవకీనందనా!27
శా. హాలాహాలశిరోధిమౌళి నయనోద్యద్భీమ ధూమధ్వజ
     జ్వాలాభీలకరాళరూక్ష విషనిశ్వాసోష్ణకృష్ణానదాం
     భోలీలాస్పద కాళియస్ఫుటనటద్భోగాగ్ర మధ్యంబునన్‌
     హాళిన్‌ దాండవమాడు నిన్‌ దలఁతుఁ గృష్ణా! దేవకీనందనా!28

మ. తినదేచెట్టున నాకు మేఁక గుహ గొందిం బాము నిద్రింపదే
     వనవాసంబునఁ బక్షులున్‌ మృగములున్‌ వర్తింపవే నీటిలో
     మునుకల్‌ వేయవె మత్స్యకచ్ఛపములు న్మోక్షార్థమౌ ముక్తికిన్‌
     మనసే మూలము నీదుభక్తులకు కృష్ణా! దేవకీనందనా!23
శా. వింటిం గొంతగ మీమహత్వమును నుర్విన్‌ దర్శనప్రాప్తిచే
     ఘంటాకర్ణుని నుగ్రసేనతనయుం గైవల్యతేజంబు ని
     న్నంటంజేయవె మాటమాత్రమున నిట్లాశ్చర్యమున్‌ బొందఁగా
     నంటం బొందనివేల్పు నిన్‌ గొలుతుఁ గృష్ణా! దేవకీనందనా!24
మ. విలసత్కావ్యకళాధురీణతలు తద్విజ్ఞానులైనట్టి వే
     త్తలకుం గాకవి యేల మూర్ఖులకు గాధల్‌ జెందు భాగీరథీ
     దళితాంభోరుహ షండమండిత మరందగ్రాస మాధుర్యవాం
     ఛలు జోరీఁగల కేల తేంట్లగతి కృష్ణా! దేవకీనందనా!25
మ. చతురంభోధిపరీత భూవలయరాజానేకకోటీర రం
     జితమాణిక్యవిరాజమానపద రాజీవుండు ధర్మాత్మజుం
     డతికారుణ్యముచేత మత్స్యపతికొ ల్వాసింపఁడే నీదు శా
     శ్వత కారుణ్యము గల్గునంతకును కృష్ణా! దేవకీనందనా!26
మ. శుకమద్గౌతమ కణ్వ కుత్స జమదగ్న్యోదంక శాండిల్య శౌ

     నక పారాశర కశ్యపాత్రి ఘటజాహ్నేంద్ర ప్రభూత త్రియం
     బక కంజోద్భవ నారదాదిమునిహృత్పంకేజ సౌమ్యత్పిపా
     సకృపాసాగర నీకు మ్రొక్కెదను కృష్ణా! దేవకీనందనా!33
మ. వివిధోగ్రస్థవన ప్రచండబలవిద్వేషావనీనాయకో
     త్సవభంజీకృతశాలి యర్జునుఁడు దోస్సత్వుండు మత్స్యావనీ
     ధవుగేహంబున నాట్యతాళధరియై తా నిల్వఁడే సన్ముని
     స్తవ నీసత్కృప గల్గునంతకును కృష్ణా! దేవకీనందనా!34
మ. బలభేది న్నలయించి ఖాండవవనిన్‌ భస్మంబు గావించి ము
     న్నెలమిన్‌ దైత్యులఁద్రుంచి యొక్కటి శివున్నిర్జించి కౌరవ్యులన్‌
     బలి గావించి కిరీటి బోయలకు గోపస్త్రీల నొప్పింపఁడే
     యల నీతేజము నీవు గైకొనినఁ గృష్ణా! దేవకీనందనా!35
మ. ఇలఁ దద్వైరి నృపాల ఫాలఫలక ప్రత్యగ్ర రక్తచ్ఛటా
     కలితోదార గదావిజృంభణ భుజాగర్వుండు భీముండు కు
     క్కలకుం జాపఁడె యేకచక్రపురి భిక్షావేళ యుష్మత్సము
     జ్జ్వలకారుణ్యము గల్గునంతకును కృష్ణా! దేవకీనందనా!36
మ. అతిసౌందర్యసమగ్రధైర్యఘనశౌర్యస్ఫూర్తియున్‌ గీర్తియు
     న్నతులప్రాభవరేఖయున్‌ గలిగి చోద్యంబెన్నఁగా ఘోటక

     ప్రతతిం దిద్దఁడె నిత్యమున్‌ నకులుఁ డేపారంగ నీసత్కృపన్‌
     సతమై రాజ్యము గల్గునంతకును కృష్ణా! దేవకీనందనా!37
మ. బక దైతేయమహాబలున్‌ సమరభూభాగంబునన్‌ వాయుపు
     త్రకుఁ డీల్గించిన నేకచక్రపురివారల్‌ మెచ్చి యింటింట వం
     టకము ల్బెట్టిరిగాని భిక్షయనుమాటన్‌ మాన్పలేరైరి యం
     తకు వారల్‌ గొఱఁతేమి చాలుటకుఁ గృష్ణా! దేవకీనందనా!38
మ. గహనావాసములోన నన్నలకుఁ దా గారాబుతమ్ముండునై
     విహరించేతఱి భావికాలగతి నన్వేషించుచున్‌ శౌర్యసం
     గ్రహుఁడై యావులఁగాచె మత్స్యపురిలోఁ గర్మానుగుణ్యక్రియ
     స్సహదేవుం డతిధైర్యమార్గమునఁ గృష్ణా! దేవకీనందనా!39
మ. వినుతానేకతురంగవారణ రథోర్వీనాథదీవ్యన్నికే
     తన చక్రధ్వజచామరద్రఢిమతోఁ దథ్యాత్ముఁడౌ నాసుయో
     ధనుఁ డేకాకియుఁ బాదచారియునునై దర్పంబువోనాడి పో
     యెను మిమ్మెట్టుఁ దలంచి చూడకయ కృష్ణా! దేవకీనందనా!40
శా. రక్షింపం దగువీరుఁ డెవ్వఁ డననీరాజుల్‌ వృథాతేజులే
     మోక్షశ్రీయొసఁగున్‌ విభుండెవఁడు శ్రీమోహాకృతి న్దేవతల్‌

     రక్షోజాక్ష శుభప్రధానగరిమన్‌ రాజిల్లురాజేంద్రులన్‌
     సాక్షాద్బ్రహ్మము నీవె ధన్యులకుఁ గృష్ణా! దేవకీనందనా!41
మ. కొలిచేదిన్‌ వగలేకనే నడిగితే కోపించు టీలేకనే
     చెలువం బెచ్చుటకోటనేవిభవముల్‌ చేకూరుటల్‌ రూకనే
     బలవంతుం డగుమూకనే సతిచెడున్‌ ప్రాణేశుపైఁ గోపనే
     జలదశ్యామల శంఖచక్రధర కృష్ణా! దేవకీనందనా!42
మ. బలశౌర్యోన్నతి శత్రులం గెలిచి సప్తద్వీపవిశ్వంభరా
     స్థలి నేలించి సమస్తవైభవములన్‌ దీపించి దిక్పాలకా
     వళి కీర్తింప మెలంగునైషధుఁడు దా వర్తింపఁడే తొల్లి వం
     టలవాఁడై ఋతుపర్ణుచెంగటను కృష్ణా! దేవకీనందనా!43
మ. ధరలో గోళకుఁ డైనపాండునికళత్రం బందు వేర్వేఱనే
     వురకున్‌ బుట్టినపాండునందనులు దివ్యుల్మెచ్చ వర్తింపఁ ద
     చ్చరితం బంతయు భారతంబని ప్రశస్తంబయ్యె నీనామసం
     స్మరణప్రౌఢిమఁ గాదె యీఘనత కృష్ణా! దేవకీనందనా!44
మ. క్రతువుల్‌ నూఱొనరించి యింద్రపదవిన్గర్వించియింద్రాణికై
     ధృతిఁదూలన్‌ మరుఁడేచఁగా నహుషుఁడద్దేవేంద్రుభోగానుసం
     గతిగాఁ గోరినకుంభసంభవుఁడు గిన్కన్‌ దిట్టినన్‌ జెందఁడే
     సతతంబున్‌ పెనుబాముచందమును కృష్ణా! దేవకీనందనా!45

మ. ఘనులన్‌ నీచుల నీచులన్‌ ఘనుల సత్కారాఢ్యులన్‌ దుష్క్రియా
     జనితోద్యోగుల నర్థవంతులను భిక్షాయుక్తులన్‌ భిక్షులన్‌
     ధనికవ్రాతముగా నొనర్చుచును నిత్యంబున్‌ మహాగారడం
     బని నందించు వినోదరాయ హరి కృష్ణా! దేవకీనందనా!46
శా. శ్రీలక్ష్మీధవ వాసుదేవ వరదా రాజీవపద్మాసనా
     వ్యాళాధీశ్వర శర్వ షణ్ముఖ శుకాద్యస్తోత్ర సత్పాత్ర గో
     పాలానీక ముఖాబ్జభాస్కర కృపాపాథోధి నన్‌ గావు మూ
     ర్ధాలంకార మయూర పింఛధర కృష్ణా! దేవకీనందనా!47
మ. పతులున్నేవురునెన్నఁగాఁగలిగి భూపాలాంగనానీకముల్‌
     సతతంబున్‌ గనుసన్నలన్‌ మెలఁగుచైశ్వర్యంబుతోనుండి తా
     నతిభక్తిం జని యాసుధేష్ణకును జేయం బూనదే ద్రౌపదీ
     సతి యాశ్చర్యము నీవిలాసములు కృష్ణా! దేవకీనందనా!48
శా. మీసామర్థ్యము గల్గునంతకును నెమ్మిన్‌ బాండుసూనుండు నా
     యాసం బొంద మహాద్భుతంబుగ విరాటాధీశుపట్ణంబులో
     గ్రాసోపాయము లేక భిక్ష మడుగన్‌ గాషాయముంబూని స
     న్యాసంబున్‌ ధరియింపఁడే యచటఁ గృష్ణా! దేవకీనందనా!49
మ. విరటుం గొల్చినవాఁడు నొక్కఁడిలఁ బృథ్వీనాథులన్‌ గూల్చి సం

     గరభూమిన్‌ ఘనవైరివీరతతులన్గారించుచున్‌ ద్రుంచి యి
     ద్ధరకు న్నగ్రజు రాజుఁ జేసియు తుదిన్‌ దా నీకృపంబాయఁడే
     సరిపోదే భువి నింద్రసూనుధృతి కృష్ణా! దేవకీనందనా!50
మ. అమరు ల్పద్మజువ్రాతఁదాఁటి యిపుడొక్కబ్దంబు పెద్దయ్య దు
     ర్దమ దోర్దండపటుప్రతాప నిజసంరంభామరానీక వి
     క్రమ దుర్వారగజాసురప్రళయ మింకం జేయ ఫాలాక్షునిన్‌
     సమరక్షోణి జయించె నర్జునుఁడు కృష్ణా! దేవకీనందనా!51
శా. అక్రూరాత్మకు లైన పాండవుల బాహశక్తియున్‌ ధాత్రి ని
     ర్వక్రంబయ్యెడునట్లు జేతు ననుచున్‌ వాత్సల్య మింపొంద నా
     శక్రాత్మోద్భవు తేరిపై దురమునన్‌ సారథ్యముం జేసితౌ
     చక్రీ నీమునికోలకున్‌ జయము కృష్ణా! దేవకీనందనా!52
శా. గంభీరంబుగ రాయభారగరిమన్‌ గౌంతేయుకార్యార్థమై
     శుంభల్లీలల ధార్తరాష్ట్రుసభఁ దామూహించి తద్వాక్యము
     ల్సంభాషింపఁగ వా రవజ్ఞ దలఁపన్‌ సర్వంబు నీవైనచో
     శంభుండేయెఱుఁగున్‌ భవన్మహిమ కృష్ణా! దేవకీనందనా!53
శా. ఏలావిద్యలు సొంపు రూపవిభవం బేలా కులీనత్వమున్‌
     శీలత్వంబును నేల యేటికి వచశ్శ్రీ యేల బాహాబలం

     బేలా చాతురి మీకృపాగరిమ నిక్షేపంబు లేకుండినన్‌
     జాలిం బొందినఁ గల్గునే సిరులు కృష్ణా! దేవకీనందనా!54
శా. సర్వజ్ఞుండును సర్వలోకగురుఁడున్‌ సర్వంసహానాథుఁడున్‌
     సర్వేశుండును సర్వసాధకుఁడునౌ సర్వేశ నీమూర్తి దా
     సర్వంబు న్గలిగించు పెంచునణఁచున్‌ సందేహమేలా స్మృతుల్‌
     'సర్వం విష్ణుమయం జగ'త్తనఁగ కృష్ణా! దేవకీనందనా!55
మ. పుడమిన్‌ బెద్దలబోటివారి నడుగం బోరాదె చోద్యంబు పా
     ల్కడలిన్‌ గల్గినముద్దరాలు గలుగంగా పూర్వకాలంబునన్‌
     పొడవెల్లన్‌ గడుతగ్గి దానవునితో బొంకైనమాటాడి మూఁ56
     డడుగు ల్నేలను వేఁడఁగాఁ జనవు కృష్ణా! దేవకీనందనా!
శా. రంగప్రౌఢిమ భార్గవుం గెలిచి కౌరవ్యుల్‌ భయం బంది వీ
     రాగంబుం ధరియించి జీవము సతంబై యుండ వర్తించునా
     గాంగేయుండు శిఖండిచేతఁ దెగె నీ కారుణ్యముం దప్పియుం
     డంగా మృత్యువుధాటి కోపుదురె కృష్ణా! దేవకీనందనా!57
శా. అక్రూరస్థితి నుండఁగా వలయు రాజాస్థానమధ్యంబునన్‌
     వక్రింపం బనిలేదు ధర్మమునకై వర్తింపఁగాఁ బోయినన్‌

     శుక్రాచార్యుని కన్నుఁ బో నడఁచవే సూటిన్‌ గుశాగ్రంబునన్‌
     జక్రీ నీకరపంకజాంతరముఁ గృష్ణా! దేవకీనందనా!58
మ. వరసౌందర్యవివేకధైర్యనయనావాత్సల్యధౌరేయుఁ డీ
     ధరణీనాయకరత్న మంచు మహితార్థంబాశ్రితశ్రేణికిన్‌
     స్థిరసామ్రాజ్యవిభుత్వ మాధ్రువునికిన్‌ దేజంబుగానిచ్చి తా
     సరణిన్‌ మీకృప గల్గువాఁ డగుట కృష్ణా! దేవకీనందనా!59
శా. ధారాపూర్వముగాఁగ సంయమికి సప్తద్వీపముల్‌ సూనృత
     ప్రారంభమున నిచ్చి చేతితడియాఱన్‌ లేక వర్తింపఁడే
     శారీరార్థ మటంచు భిక్షము హరిశ్చంద్రుండు యాగాదిసం
     చారుం డుండు మనండె తొల్లి హరి కృష్ణా! దేవకీనందనా!60
మ. పటుబాహాబలసత్త్వవైఖరుల దిక్పాలుల్‌ బ్రశంసించు నం
     తటివాఁడయ్యుఁ ద్రిశంకునన్దనుఁడు కాంతారత్నమున్‌ విక్రయిం
     చుటలున్‌ నీమహిమంబుచేతఁ గద యిట్లాశ్చర్యమేమర్త్యులెం
     తటివారైనను నేమిచేసెదరు కృష్ణా! దేవకీనందనా!61
మ. తన శౌర్యోన్నతి యుగ్రసాధనముగా తాళాయణీశున్‌ శివున్‌
     దనరన్‌ మెచ్చఁగఁజేసి లోకముజయస్తంభంబు గావించియున్‌
     మును దాఁ జేసినకర్మవార్ధిఘనమై ముంపం గడుంబాలుచేఁ
     జనఁడే దుర్మతి విక్రమార్కుఁ డిల కృష్ణా! దేవకీనందనా!62

మ. తెగువన్నిర్జరులన్‌ జయించుచు మదోద్రేకంబునన్‌ గానలో
     మృగనేత్రిన్‌ ధరణీతనూజ నసురు ల్మెచ్చంగఁ దాఁదెచ్చి నె
     వ్వగలం బెట్టి విధిప్రయత్నమున నిర్వంశంబుగా రాముచే
     జగతిం గూలఁడె యాదశాననుఁడు కృష్ణా! దేవకీనందనా!63
మ. పరనారీహరణం బొనర్చినమహాపాపాత్ముఁ డారావణుం
     డరయ న్నాతని తమ్ముఁడైన దనుజుం డత్యంతసద్భక్తితో
     శరణన్నం దయఁజూచి యగ్రజునిరాజ్యం బిచ్చి రక్షింప వా
     సరణిన్‌ నీపదభక్తియే ఘనము కృష్ణా! దేవకీనందనా!64
మ. వెఱచైనన్‌ మఱచైనఁ గార్యముతఱిన్‌ వేసారుచున్నైన యా
     దరమొప్పైనను మాయనైన నృపతుల్‌ దండింపఁగా నైననున్‌
     పరిహాసంబుననైన మిమ్మునుడువన్‌ బ్రాపించు పుణ్యాత్మకుల్‌
     నరకావాసముఁ జేరరా ఘనులు కృష్ణా! దేవకీనందనా!65
మ. నొసటన్‌ గన్నులఁగట్టి వేల్పుసతి నెంతోభక్తితోఁ జూఁడఁగా
     నిసుమంతైన భయంబులేక తలమీఁ దెక్క న్నదట్లుండనీ
     వసుధన్‌ భర్తను స్త్రీల కెవ్వరయినన్‌ వశ్యాత్ములై మట్టులే
     కస మియ్యం దల కెక్క కుండుదురె కృష్ణా! దేవకీనందనా!66

మ. కరితో దోమ మృగేంద్రుతో నరుఁడు బంగారంబుతోఁ గంచు భా
     స్కరుతో మిణ్గురుబుర్వు కల్పకముతోఁ గానుంగు రత్నాకరే
     శ్వరుతో నూషరపల్వలంబు నురుశేషస్వామితో మిడ్తయున్‌
     సరియైనన్‌ సరి మీకు దైవములు కృష్ణా! దేవకీనందనా!67
మ. నుతలోకప్రతిసృష్ట నిర్మలకళానూత్నాబ్జగర్భున్‌ మహా
     ప్రతిభున్‌ గౌశికుఁ గుక్కమాంసము భుజింపం జేసి మాలాతనిన్‌
     బతిమాలించవె చండచండతరశుంభత్వంబు పాల్మాలునా
     శతఁ బొందించవె దేవదేవమయ కృష్ణా! దేవకీనందనా!68
మ. వరభోగాధ్వరదానధర్మగుణముల్‌ వర్జించి తృష్ణారతిన్‌
     నరులత్యంతము మూఢలోభమతులై నారీరతిం గూర్పఁగాఁ
     దరముం గాని ధనంబు తస్కరవరున్‌ ధాత్రీశులుం జేకొనన్‌
     సరఘవ్రాతము జేర్చుతేనెక్రియఁ గృష్ణా! దేవకీనందనా!69
మ. ఖలవాక్యప్రతిపాలకుల్‌ పరధనాకాంక్షుల్‌ పరస్త్రీరతుల్‌
     కులధర్మౌఘనిబద్ధచిత్తులు నయాకూపారపారంగతుల్‌
     కలుషుల్‌ రాజులు వారిసేవకులకెల్లం గల్గు నత్యంతని
     శ్చలసౌఖ్యంబులు నిన్భజింపఁగను కృష్ణా! దేవకీనందనా!70
శా. బొంకు ల్లక్షలు నిత్యసంభరితసంభోగారతుల్‌ దుర్మదా

     హంకారంబులు కోట్లసంఖ్యయగు మోహంబాయనంతంబు దు
     ష్పంకాభార మపార మిన్నిగల భూపవ్రాతసర్పాళి ని
     శ్శంకం బ్రాజ్ఞులు చేర వోవుదురె కృష్ణా! దేవకీనందనా!71
శా. చీమల్‌ పుట్టలు పెట్టుచుండ నవి విస్తీర్ణంబు గావించినన్‌
     పాముల్‌ జేరినరీతి లోభిజనసంపన్నార్థరాసుల్‌ వృథా
     భూమీపాలుల పాలుగాక చనునా పుణ్యంబులే లొల్లరో
     సామాన్యంబు ధనాధినాథులకుఁ గృష్ణా! దేవకీనందనా!72
మ. అదనం బొద్దులనీడచందమున నిచ్చల్‌ సృక్కి దుష్టాత్ముసం
     పద పెంపై ధరనిల్వదించుకయు సౌభాగ్యప్రభాభాసియై
     పొదలున్‌ మాపటినీడకైవడి భవత్పూజావిధేయజ్ఞుఁడై
     సదయుం డైనను లేమి జేకురునె కృష్ణా! దేవకీనందనా!73
శా. కీడున్‌ మేలును వచ్చుఁ గర్మవశతన్‌ క్రీడాగతిన్‌ జోకలై
     వాడల్‌ వచ్చును బండ్లునొక్కెడధర న్నొక్కప్పుడున్‌ బండ్లపై
     వాడల్‌ నౌఁ గద దేశకాలగతి శీతోష్ణంబు లీరీతి నే
     జాడన్‌ వచ్చును దుఃఖసౌఖ్యములు కృష్ణా! దేవకీనందనా!74
శా. అంతశ్శత్రుల గెల్వలేరు మమతాహంకారము ల్మానలే
     రింతే మూర్ఖము వీడలేరు భవదీయాంఘ్రిద్వయీచింతనా

     చింతారత్నముఁ గానలే రిలను దుశ్చిత్తు ల్వృథా వేదవే
     దాంతంబుల్‌ చదువంగ నేమి యగుఁ గృష్ణా! దేవకీనందనా!75
శా. నానావేదపురాణశాస్త్రముల నానందింపఁగా నిత్య మిం
     పౌనార్యు ల్వినుతింప ధార్మికరహస్యంబు ల్విన న్వచ్చునౌ
     మీ నామాంకభవద్వివేకులకు మున్నాశ్చర్యమే సత్వరా
     జ్ఞానాధిక్యము గానిముక్తిఁ గని కృష్ణా! దేవకీనందనా!76
శా. గట్రాలన్‌ బలుకానలన్‌ గుహల గంగాసింధుదేశంబులన్‌
     వట్రాఠావుల దేహమెల్లఁ జెదరన్‌ వర్తించినన్‌ మేరువున్‌
     చుట్రా యేఁబదిమార్లు మెట్టినమనశ్శుద్ధుండు గాకుండినన్‌
     చట్రా వాని ప్రయాస మంతయును గృష్ణా! దేవకీనందనా!77
శా. గంగాజన్మపదాబ్జమందు నభిషేకంబు ల్సదా గాంచెదన్‌
     నంగారార్చనచేసి యేరణమునన్‌ నర్పింతు నంభోధరా
     శృంగారాధిప కౌస్తుభాభరణ యేశృంగారముల్‌ జేతు మీ
     కంగీకారము గాఁగ నాతరమె కృష్ణా! దేవకీనందనా!78
మ. అతిమోహాంధులఁ బాపకర్ముల మహాహంకారులన్‌ దోషదూ
     షితులన్‌ గర్వితదుర్విచారులఁ బ్రశంసింపం [1]బ్రశంసింపఁగా

     దితిపర్యాప్తిదినంబు లొంది త్రిజగద్విఖ్యాతియుష్మత్సము
     న్నతసేవాభిముఖుండ నైతి నిట కృష్ణా! దేవకీనందనా!79
మ. పలుమాఱున్‌ ఇహభోగకాంక్షసభలన్‌ పాండిత్యముల్‌ సేయువా
     రలయజ్ఞానము మాన్పఁగాఁ గలరె యెట్లైనన్‌ బ్రకాశించు కో
     మలదీపాళిఁదొలంగఁ ద్రోయునె భవన్మాయాంధకారంబును
     జ్జ్వలితానందమయ స్వరూపయుత కృష్ణా! దేవకీనందనా!80
మ. ఉర్విం బాఱుమహానదీజలము లాయూరూరునందెల్లఁ గూ
     డురుఘోషంబున వంకలై కలియఁగా యోగ్యంబు లైనట్లు మీ
     స్మరణన్‌ నానుడువున్‌ సదాశుభములై సంపూజ్యమున్‌ గా భవ
     చ్చరణంబుల్‌ మది నిల్పి కొల్చెదను కృష్ణా! దేవకీనందనా!81
శా. బాలక్రీడలఁ గొన్నినాళ్లు పిదపన్‌ భామాకుచాలింగనా
     లోలాభ్యున్నతిఁ గొన్నినాళ్లు మఱియిల్లున్‌ ముంగిలింగొన్ని నా
     ళ్లీలీలన్‌ విహరించితిన్‌ సుఖఫలం బెందేనియున్‌ లేదుగా
     చాలన్‌ నీపదభక్తిఁ జేసెదను కృష్ణా! దేవకీనందనా!82
మ. మతిలో మిమ్ముఁదలంచు పుణ్యుఁడిలఁ దామాయన్‌ స్వదారాదుల
     న్వెతలం బొర్లఁడు భాగ్యవంతుఁడగుఠీవిన్‌ దివ్యమృష్టాన్న సం
     గతిలోనాడి మనుండు భిక్షమునొసంగన్‌ నేర్చునే శూలభృ

     చ్చతురాస్య ప్రముఖామర ప్రణుత కృష్ణా! దేవకీనందనా!83
శా. అన్నంబైనను దక్రమైనఁ దగుతోయంబైన నభ్యాగతుల్‌
     దన్నాశించిన నేమియు న్నిడక యేధర్మంబునుం జేయ కే
     మన్న న్నూరకయుండు జీవశరమర్త్యశ్రేణి జేయ కే
     చన్న న్నేమగు నేమగున్‌ గలుగఁ గృష్ణా! దేవకీనందనా!84
శా. ప్రారబ్ధానుభవంబు దీఱ కపవర్గప్రాప్తి లేదండ్రుగా
     దీరశ్రేష్ఠు లనంతకోటులిఁక నైతే వారికర్మంబులున్‌
     ప్రారబ్ధంబులు గావె ముందఱకు నోభావజ్ఞ సైరించి నా
     ప్రారబ్ధంబులఁ దీర్పవే కరుణఁ గృష్ణా! దేవకీనందనా!85
శా. శ్రీజన్మప్రభుతావిశేషుఁ డగు రాజేంద్రుండు ధీపాలనా
     జ్ఞాజాగ్రత్వనిదానకీర్తియుత రక్షాలక్షణాధీశుఁడై
     రాజిల్లుం బహుకష్టుఁడైన ధరసామ్రాజ్యంబు బాలింపుచో
     నైజంబై తగునా విశేషములు కృష్ణా! దేవకీనందనా!86
మ. సమరద్వేషుల సంగరాంగణమునన్‌ సాధించి సామ్రాజ్య సౌ
     ఖ్యముఁ దాఁగాంచి సహించి చొప్పడు వివేకప్రాజ్ఞతల్గాంచు భూ
     రమణశ్రేష్ఠుఁడు తావకానుచరుఁడై రాణించు శిక్షించు దు
     ష్టమతి భ్రష్టమదాంధ శత్రువుల కృష్ణా! దేవకీనందనా!87

మ. విగతక్లేశులు వీతకిల్బిషమయుల్‌ విజ్ఞానవిద్యానిధుల్‌
     నిగమార్థజ్ఞులు నిశ్చలవ్రతయుతుల్‌ నిర్వ్యాజనిష్ఠాయుతుల్‌
     సుగుణుల్‌ సూనృతవర్తనుల్‌ శుభకరుల్‌ శుద్ధాంతరంగుల్‌ శుభుల్‌
     జగతీమండలి నీదుసేవకులు కృష్ణా! దేవకీనందనా!88
శా. దీనుల్గల్గిన నీదు రక్షణగుణాధిక్యంబు రాణించు నౌ
     దీనుండెవ్వఁడు లేఁడు నీదుకరుణాదృష్టిన్‌ గృతార్థుల్‌ జుమీ
     నేనే దీనుఁడ నన్నుఁ బ్రోవు శరణంటిం ద్వన్ముఖోదీర్ణ సు
     జ్ఞాన శ్రీకరమూర్తి నమ్మితిని కృష్ణా! దేవకీనందనా!89
శా. పాత్రాపాత్రవివేకము ల్సమసె పాపం బెచ్చె ధర్మంబునున్‌
     మిత్రఘ్నత్వము కల్లలాడుటయు స్వామిద్రోహముం గొండెమున్‌
     ధాత్రిం బూజ్యము లయ్యె సజ్జనులచందం బెట్లు రక్షించెదో
     సత్రాజిత్తనయా మనోరమణ కృష్ణా! దేవకీనందనా!90
మ. అరయన్ [2]శంతనుపుత్త్రుపై విదురుపై నక్రూరుపైఁ గుబ్జపై
     నరుపై ద్రౌపదిపైఁ గుచేలకునిపై నందవ్రజస్త్రీలపైఁ
     బరఁగంగల్గు భవత్కృపారసము నాపైఁ గొంతరానిమ్ము మీ
     చరణాబ్జంబుల నమ్మినాఁడ హరి కృష్ణా! దేవకీనందనా!91

మ. అనుకూలాన్వితయైన భార్యయును ధర్మార్థంబునైనట్టి నం
     దనులున్‌ సజ్జనులైన సోదరులు యెన్నంగల్గు సంపత్క్రియా
     ఘనుఁడైనట్టి మహానుభావుఁడె భవత్కారుణ్యదృగ్జాలభా
     జనుఁ డప్పుణ్యుని జూచినన్‌ శుభము కృష్ణా! దేవకీనందనా!92
మ. శరణాగత్యనురక్తి భక్తి జనరక్షాసత్కృపాసేవ్యస
     త్కరుణాపూర సుధారసంబుగల శృంగారంబు మీమూర్తియుం
     దరణోపాయ మెఱుంగలేని కలుషాధారున్‌ ననుందావక
     స్మరణాధీశునిఁ జేయు మ్రొక్కెదను కృష్ణా! దేవకీనందనా!93
మ. ప్రలయాభీల కరాళదావదహన ప్రజ్జ్వాల మబ్జోదరా
     జ్వలనాకారముదాల్పఁ దానియెదుటన్‌ సంతప్త సంతాప వాం
     ఛలు దివ్యుల్మునులుం గృశాస్యులగుచుం జల్లార్పఁగాలేక ని
     చ్చలు నీపాదములే భజించెదరు కృష్ణా! దేవకీనందనా!94
మ. మొఱయాలింపవొ మానమున్నిలుపవో ముల్లోకమేలింపవో
     మఱదీయంచును వెంటనేతిరుగవో మన్నింపవో యందుమో
     కరినో ద్రౌపదినో సురాధిపతినో గాండీవినో యెవ్వఁడన్‌
     ధర నిన్‌ గొల్చినవారిలో నొకఁడ కృష్ణా! దేవకీనందనా!95
మ. కుటిలారాతినిశాటకోటికదళీకూటాటవీభంజనో

     ద్భటమత్తద్విపకేళిలోలము సముత్ప్రావీణ్య దైత్యాంగనా
     స్ఫుట ముక్తామణిరత్నహార తిలకాపుంజాతలూనక్రియా
     చటులజ్వాలము నీసుదర్శనము కృష్ణా! దేవకీనందనా!96
మ. కులిశానేక సహస్రకోటి నిశితక్రూరోరుధారాముఖా
     కలితార్చి ప్రభవ ప్రభావ త్రిజగత్కల్యాణసంధాయియై
     విలసిల్లున్‌ భవదీయచక్రమఖిలోర్వీభారనిర్వాపణో
     జ్జ్వలనిర్వాహపరాక్రమక్రమణ కృష్ణా! దేవకీనందనా!97
మ. అతికాకోల కరాళ కాయక కఠోరాశీ విషావిర్భవ
     క్షతినోనాటిన నాఁటిపాటు తలఁపన్‌ శంకించి యుంకించె దౌ
     సతతోద్వర్తుల వర్ణ సర్వభయదాంచత్పింఛ చూడావతం
     సతతం గారుడకేతనోద్ధృతియు కృష్ణా! దేవకీనందనా!98
శా. నక్రోదగ్రతఁ బ్రాణవాయువులు మేన న్నిల్వఁగా నోప వో
     చక్రీ నన్‌ దయ గావు మన్నకరుణన్‌ జాజ్జ్వల్యచక్రంబుచే
     నక్రంబుం దెగఁ జూచి కాచితిగదా నాగంబు వేగంబునన్‌
     శక్రాద్యామరవందితాంఘ్రియుగ కృష్ణా! దేవకీనందనా!99
మ. కరి నేలింది హుళక్కి ద్రౌపదికి కోకల్‌ మెచ్చి యిచ్చింది ద
     బ్బర కాకాసురునిం గటాక్షమునఁ జేపట్టిం దబద్ధం బహో

     శరణన్న బగవానితమ్మునికి రాజ్యం బిచ్చుట ల్కల్ల యి
     త్తఱి నన్నేలిన నిక్క మీకథలు కృష్ణా! దేవకీనందనా!100
క. ఈకృష్ణశతక మెప్పుడు
     పైకొని విన్నట్టివారు వ్రాసినవారల్‌
     చేకొని పఠించువారలు
     శ్రీకృష్ణునికరుణ కలిగి చెలఁగుదు రెలమిన్‌.101
[3]మ. సదయస్ఫూర్తికళల్ ఘటించు కవిరక్షశ్శ్రేష్ఠుఁ డుత్సాహియై
     పదివేల్ పద్యములందు నూటెనిమిదౌ పద్యము లర్పింప మీ
     పదనీరేజములందు దివ్యతటినీపాథఃప్రపూర్ణాభిము
     ఖ్యదశం గాంచిన దౌట మీ కరుణ కృష్ణా! దేవకీనందనా!


దేవకీనందనశతకము
సంపూర్ణము.

  1. బ్రపంచవ్యవ, స్థితపర్యాప్తిదినంబు లేగి
  2. చందనగంధిపై
  3. అడయారు లైబ్రరీలోని పుస్తకపాఠము