భక్తిరసశతకసంపుటము/మొదటిసంపుటము/చెన్నమల్లుసీసములు

వికీసోర్స్ నుండి

పీఠిక

చెన్నమల్లుసీసములను సుప్రసిద్ధకవియగు పాలకురికి సోమనాథమహాకవి రచించెను. ఈకవి సంస్కృతాంధ్రములలో నిరర్గళముగాఁ గవితజెప్పుటలో నేర్పరియేగాక శైవమత మాంధ్రదేశములో వ్యాప్తికి దెచ్చిన వారిలో నొకఁడు. తొలుత సోమనాథుఁడు, ఉత్తమరాజు వారను కౌండిన్యసగోత్రులగు నియోగులశాఖలోనివాఁడై వేదవేదాంగాదులు సమస్తశాస్త్రములు నభ్యసించి మతావేశపరవశుఁడై వీరశైవమునఁ బ్రవేశించి దీక్షధరించెను.

సోమనాథుఁడు బసవేశ్వరునకుఁ గొంచెమావల కాకతీయరాజ్యమును రుద్రదేవచక్రవర్తి పరిపాలించుకాలమున సుప్రసిద్ధుడై యుండెను. బసవేశ్వరుని దైవముగా భావించి యాతనిమహత్వమునకు ముగ్ధుఁడై బ్రాహ్మ్యమును వదలి శైవజంగమైనవారిలో బసవనిగుణకీర్తనలచేఁ గవితను బునీతము గావించినవారిలో సోమనాథుఁడే యాద్యుఁడు. బసవేశ్వరునిలీలలను వృషాధిపశతకమునందును బసవపురాణమునందును సోమనాథుఁడు ప్రశంసించియున్నాఁడు. ఇతఁడు పశ్చిమచాళుక్యులకడ సేనానిగా నుండి యంత్యమున శ్రీశైలముఁ జేరి గురుమల్లికార్జునపండితారాధ్యులవారిని బసవేశ్వరుని మేనల్లుఁడగు చెన్నబసవని స్తుతించుచు చెన్నమల్లు సీసపద్యములు గావించెనని ప్రజాముఖమున వినుచున్నారము.

సోమనాథుఁడు జీవసమాధి కేగుచు భూబిలమున కేర్పఱచిన ముప్పదిరెండుమెట్లను దిగనెంచి యొక్కమెట్టు దిగునపు డొకపద్యము చొప్పున ముప్పదిరెండుపద్యములు రచించినటుల శైవులుకొందఱు చెప్పుచున్నారు. సోమనాథకవి సిద్ధిపొందినస్థలము పాలకురికి నిజామురాష్ట్రమున ఒరంగల్లునకు మూఁడామడలదూరములో నున్నది. సిద్ధిపొందినచోట నొకశివాలయము గట్టి శివభక్తులు పూజాదికములు ఉత్సవములు సలుపుచున్నారు. సోమనాథుని చెన్నమల్లుసీసము లచటియుత్సవాదులలో నేఁటికిఁ బ్రచారములో నున్నవి.

ఈకవిజీవితము వృషాధిపశతకపీఠికలో వ్రాసితిమి. కవికాలము క్రీ. శ. ఇతనిశైలి పాండిత్యము ధారాశుద్ధి ప్రశంసనీయములు. చెన్నమల్లుసీసములు పూర్వముద్రితప్రతిలో దుష్టముగానుంటచే లిఖితప్రతుల సహాయమున సంస్కరించి నూతనపద్యములు చేర్చి సాధ్యమగునంతవజకు నిర్దుష్టము గావించితిమి. ఫలశ్రుతినిగూర్చియుఁ బద్యానుక్రమణికను గూర్చియుఁ గలవద్యము లిందుఁ జేర్చితిమి.

నందిగామఇట్లు భాషాసేవకులు,
1-1-25శేషాద్రి రమణకవులు, శతావధానులు.

శ్రీరస్తు

సాంబశివాయ నమః

పాలకుఱికి సోమనాథమహాకవిప్రణీత

చెన్నమల్లుసీసములు

భక్తస్థలము

సీ. శ్రీ గురులింగ సంచిత కృపోన్నతిఁ జేసి
                     కంటి జంగమ పాదకమలసేవ
     జంగమలింగ ప్రసన్నత్వమునఁ జేసి
                     కంటిఁ బ్రసాదసుఖంబు నొందఁ
     దత్ప్రసాద ప్రబోధస్థైర్యమునఁ జేసి
                     కంటి సర్వాంగప్రకాశభక్తి
     భక్తిసౌభాగ్యానుభవ పూర్తిమైఁ జేసి
                     కంటి జీవన్ముక్తి కడమలేక
ఆ. యింక నేమికొఱఁత యేల నీకాశింపఁ
     బాడి యాడి దైన్యపడి భజించి
     మెచ్చి పొగడిరేని మీఁద నొందెడిఫలం
     బెన్న నున్న దెట్లు చెన్నమల్లు.1
సీ. [1]అకట ప్రమథుల రాయం డనియే గాక
                     నీ వున్న చోటు మున్నెవ్వఁ డెఱుఁగుఁ

     బాటిగా నన్నేలు చోటు భక్తరక్షకుఁ డని
                     కాక యెవ్వండు నీఘనత నెఱుఁగుఁ
     దెలుపుమా శ్రీగురుదేవుఁడా యనికాక
                     యిచట నీపేరు దా నెవ్వఁ డెఱుఁగు
     లెస్సపోనా చరలింగమా యనికాక
                     యిట్టివాఁ డనుచు ని న్నెవ్వఁ డెఱుఁగు
ఆ. వారినగరి లెంకవాఁడ నేఁ గలిగితిఁ
     గాన నీకుఁ బ్రాపు గలిగెఁ గాక
     యితరు లెవ్వ లెఱుఁగ రి ట్లెఱింగియుఁ బెద్దఁ
     జేయ వేల నన్నుఁ జెన్నమల్లు.2
సీ. ఆనంద మలర లింగార్చన చేయక
                     గుడుచుట పాపంబు గుడుచునట్లు
     అర్చకుండయ్యు లింగానర్పితము గోరి
                     ముట్టుట యవ్యంబు ముట్టినట్లు
     లింగ ప్రసాదంబు జంగమవిముఖుఁడై
                     కొనుట యేమేనియుఁ గొనినయట్లు
     జంగమహితుఁడయ్యు సరిపాకభేదంబు
                     సేయుట ద్రోహంబు సేసినట్లు
ఆ. అనుపురాతనోక్తి కావంతయును దొట్రు
     పడనిశుద్ధభక్తి, పదము ప్రాణ

     పదముగాఁ జరించు భక్తలింగంబులఁ
     జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.3
సీ. మేరువు సోఁకుచో భేరుండ మని వాయ
                     సము పూనియే తనుచ్ఛాయ చేయు
     రసము సంధిల్లుచో రజతాదిలోహ ప్ర
                     భావంబు లరసియే పసిఁడి చేయు
     సూర్యుండు వ్యాపించుచో నగ్రజాంత్యజా
                     తుల నేరుపఱచియే వెలుఁగుఁ జేయుఁ
     సురపతి వర్షంబు గురియుచో సస్యతృ
                     ణాంతరం బరసియే యలరఁజేయుఁ
ఆ. బ్రాణనాథ నాదుభక్తి విశేషంబు
     పట్టిచూడ నీకుఁ బాడియగునె
     యిన్ని యేల నీమహేశ్వరత్వము వెల్తి
     చేసికొనఁగ నేల చెన్నమల్లు.4
సీ. కాలఁ దన్నిన నోర్తు కడగి యేనడుగులఁ
                     బడిన నెత్తవు పక్షపాతి దగునె
     ఱాలపూజలు గొందు మేలిపుష్పంబులఁ
                     బూజింప నన్నవబోధ తగునె
     కోరి ప్రసాదంబు గొందు నే ముట్ట క
                     ర్పించినఁ గొనవిట్టి కించ తగునె
     మేలపుఁగబ్బముల్‌ మెత్తునా సంస్తుతుల్‌
                     వినియును విన వవివేకి తగునె

ఆ. వారు నడిచినట్లు వచ్చునే నడువ నీ
     వునిచినట్లు తప్పకుండఁ జూచి
     కొందుగాని నాదు గుణవిశేషత కల్మి
     యెన్నఁగలదె నీకుఁ జెన్నమల్లు.5
సీ. [2]పూజింప నలయింపఁ బుణ్యపాపంబులు
                     వివరించిచూడ నీయవియె కావె
     తలఁపింప మఱపింపఁ దద్గుణ దోషంబు
                     లరసిచూడంగ నీయవియె కావె
     యాడింప నోడింప నా హెచ్చుకుందులు
                     ఠవణించిచూడ నీయవియె కావె
     వలపింప సొలపింప నిలసుఖదుఃఖంబు
                     లవి యెన్నిచూడ నీయవియె కావె
ఆ. నామనోవిభుండ నాస్వామి సకలచై
     తన్యకర్త సూత్రధారిచేతి
     బొమ్మ కున్నదయ్య యిమ్మహి నీయిచ్చ
     చెప్ప వేల వేయి చెన్నమల్లు.6
సీ. నిలుపవే ప్రాణంబు నీయందుఁ బెరసి సం
                     పూర్ణమై దేహంబు పొందు విడువ
     సలుపవే మది నిచ్చ నిరతంబు నీభక్త
                     చిద్గోష్ఠి దవిలి దుశ్చింత లుడుగఁ

     గొలుపవే సర్వాంగ గుణములు నీభక్త
                     పదమందు లీనమై భ్రాంతి దక్క
     మెలుపవే యింద్రియంబులుగూడ నీ ప్రసా
                     దంబును దవిలి [3]తత్పరత నిలువఁ
ఆ. బ్రాణనాథ భక్త పరతంత్ర మత్కాయ
     సన్నిహితమహాప్రసాదమూర్తి
     యిండు లేల నీకు నుండ నాయం దిమ్ము
     చేసికొనవె చాలుఁ జెన్నమల్లు.7
సీ. భజియించు కేవలభక్తి ముక్తికిఁ దాన
                     యునికియు మనికినై తనరెనేని
     చను శీలసంబంధసంపన్నతకుఁ దాన
                     గతియును మతియునై క్రాలెనేని
     సంగతంబుగఁ బ్రాణలింగంబునకుఁ దాన
                     యొడలు ప్రాణంబునై యుండెనేని
     సంతతబాహ్య ప్రసాదంబునకుఁ దాన
                     రూపును రుచియునై చూపునేని
ఆ. వేయి యేల యతని విమలానుభవసౌఖ్య
     మున్నఁ జాల దెట్టు లెన్న ఫలము
     నట్లుగాన నీ మహాభక్తి యుక్తులఁ
     జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.8

సీ. నెపమునఁ బ్రాణంబు నీయందుఁ బ్రిదిలిన
                     యప్పుడె మృతినొందఁ డయ్యెడేని
     కలనైన నిలిచిన నిలుకడ చలియింప
                     నప్పుడ రూపకుం డయ్యెనేని
     యించుకంతయు మతి నితరభావము సోఁక
                     నప్పుడు కని వ్రాలఁ డయ్యెనేని
     అణుమాత్ర మైన లింగానర్పితము సోఁక
                     నచ్చోటఁ దెగఁజూడఁ డయ్యెనేని
ఆ. భక్తిమాట లాడ ఫలమేమి వెండియు
     మజ్జనంబు చేయ లజ్జగాదె
     యట్లుగాన నీ మహాప్రసాదానూన
     సిద్ధి కేవలంబె చెన్నమల్లు.9
సీ. లింగ నీభక్తులలీల వీక్షింపుచో
                     నొడలెల్ల కన్నులై యుండెనేని
     దేవ నీభక్తులఁ దివిరి కీర్తించుచో
                     నొడలెల్ల జిహ్వలై యుండెనేని
     జియ్య నీభక్తాంఘ్రిసేవ యొనర్చుచో
                     నొడలెల్ల చేతులై యుండెనేని
     అయ్య నీభక్తమహాత్మ్య మాలించుచో
                     నొడలెల్ల వీనులై యుండెనేని
ఆ. స్వామి భవదీయభక్తి ప్రసాదముక్తి
     యుక్తి కొడలెల్ల నోళ్లునై యుండెనేని

     అట్టిభక్తుల [4]లింగదివ్యాంఘ్రియుగళ
     శేఖరులఁ [5]జేర్చి రక్షించు చెన్నమల్లు.10
సీ. నీరూపు నీరేఖ నీయన్ను నీచెన్ను
                     నీపెంపు నీసొంపు నీచలంబు
     నీమూర్తి నీస్ఫూర్తి నీశాంతి నీకాంతి
                     నీలాగు నీబాగు నీవిధంబు
     నీబల్మి నీకల్మి నీయురుల్‌ నీసిరుల్‌
                     నీనెఱి నీగుఱి నీమెఱుంగు
     నీనల్వు నీచెల్వు నీలలి నీలులి
                     నీరీతి నీభాతి నీస్థిరంబు
ఆ. తనువునందుఁ గుదురుకొని కనుఁగవ వెళ్లఁ
     బారి మదిఁ బెనంగి ప్రాణముగను
     నీవయై చరించు నీమహాభక్తులఁ
     జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.11
సీ. అతులిత పరమశివాచార సార స
                     న్మార్గంబు గతియును మతియునేని
     రాజిత గురులింగ పూజనోత్సవ మేళ
                     నంబు పదము పదార్థంబునేని
     సంతత సముచిత సత్కాయజంగమ
                     భక్తియు శ్రీయు సంపదయునేని

     బాహ్యాంతరార్పిత గ్రాహ్యప్రసాదంబు
                     లాయుష్యమును భవిష్యంబునేని
ఆ. భక్త సద్గోష్ఠిముదిత విస్ఫార సుఖము
     భుక్తియును ముక్తియును నేని భక్తుఁ డతఁడు
     అట్టి భక్తులమహితదివ్యాంఘ్రియుగళ
     శేఖరుం జేర్పవే నన్నుఁ జెన్నమల్లు.12
సీ. అవగుణంబులు తనయందుఁ బరీక్షించుఁ
                     గావనిపుచ్చు సద్భావకులను
     సద్గుణంబులు భక్తజనులం దనుష్ఠించి
                     శరణని మ్రొక్కెడు సజ్జనులను
     దొరకినయట్లు సంతోషించి విగతాంగ
                     భోగులై చను మహాపురుషులను
     సకలసుఖంబులు జంగమార్పణఁ జేసి
                     వెండియుఁ దనియని పండితులను
ఆ. దన్నుమఱచి భక్తతతిఁ గొనియాడు ని
     గర్వులను గుణోపకారమతుల
     శుద్ధభక్తిరతుల సిద్ధప్రసాదులఁ
     జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.13

మాహేశ్వరస్థలము

సీ. సర్వేశుఁ డనఁజాల సర్వాత్ముఁ డనఁజాల
                     సర్వగతుం డనఁ జాలఁ జాల

     హరుఁ డనఁజాల మూర్ధాంగుఁ డనంజాల
                     జర్మాస్థిధరుఁ డనఁజాలఁ జాల
     శశిమౌళి యనఁజాల సర్పాంగుఁ డనఁజాల
                     నీలగళుం డనఁజాలఁ జాల
     మూర్తి నాఁజాల నమూర్తియు ననఁజాల
                     సాధ్యాదం బనఁజాలఁ జాలఁ
ఆ. బ్రాణనాథునందు భక్తైక్యతనునందు
     లింగమందు గురువుజంగమందుఁ
     గందునట్ల వినుతి గావింతు సేవింతు
     నిన్నుఁ మదిఁ దలంతుఁ జెన్నమల్లు.14
సీ. కరమర్థి నీకు శృంగారంబుగాఁ బూజ
                     సేయుదుఁగాని యాశింప ఫలము
     వేడుకతోడుత విభవార్థముగ నుతుల్‌
                     సేయుదుఁగాని యాశింప మెప్పు
     తగిలి నీకు సుఖార్థముగఁ బదార్థార్పణ
                     సేయుదుఁగాని యాశింప రుచుల
     లాలితంబుగ నీకు లీలార్థముగ భక్తి
                     సేయుదుఁగాని యాశింప ముక్తి
ఆ. నీవు పూజాఫలార్థివే నిష్ఫలార్థి
     నీవు కీర్తి ప్రియుండవే నిష్క్రియుండ
     సకలసుఖభోగి వీవె ప్రసాదముక్తి
     సన్నిహితుఁడను నీబంటఁ జెన్నమల్లు.15

సీ. చూడ్కి నీలోఁ జూచి చూడంగవలవదే
                     వినికి నీవినికిగా వినఁగవలదె
     నెఱిదాఁకకటమున్న గుఱిచేయవలవదే
                     నడుపు నీ వెంబడి నడువవలదె
     రుచులు నీజిహ్వను రుచియింపవలవదే
                     చేత నేచేయిగాఁ జేయవలదె
     తలఁపు నీలో నుండి తలఁపంగవలవదే
                     పలుకు నీముఖమందుఁ బలుకవలదె
ఆ. యంత్రధారిచేతి జంత్ర మున్నటులు నీ
     వాడినట్లు దేహ మాడవలదె
     యట్లుగాన నీమహాప్రసాదానూన
     సిద్ధి కేవలంబె చెన్నమల్లు.16
సీ. జైమినికృతపూర్వమీమాంసకులు చతు
                     ర్థ్యంతంబు దా దైవ మని గుఱించి
     కర్తలేఁడని కర్తకర్మంబె యని 'స్వర్గ
                     కామో యజే' త్తను కర్మకాండ
     భాట్టశాస్త్రంబను భాష్యంబుసేయు భ
                     ట్టాచార్యలింగమ ట్లంతరింపఁ
     బొరి మహిమ్నమున 'ముఖరయతి మోహాయ
                     జగతా' మనుచు నున్న శాస్త్రమతము
ఆ. నడఁచె గావునఁ దత్త్వ మహత్త్వశక్తిఁ
     దగిలి మీమాంసకుల ముక్కుఁ బగులఁగోసి

     నట్టిభక్తుల వేదవేదాంతసార
     శేఖరులఁ జేర్పవే నన్నుఁ జెన్నమల్లు.17
సీ. సంకీర్ణలౌకికాచారవర్జితుఁడేని
                     విధినిషేధక్రియావివశుఁ డెట్లు
     విధినిషేధక్రియావిరహితవర్తులే
                     నుభయకర్మఫలప్రయుక్తు లెట్టు
     లుభయకర్మఫలోత్త రోద్యుక్తు లేనియు
                     స్వరాదిలోకప్రచారు లెట్లు
     స్వర్గాదిలోక ప్రచార దూరగులేని
                     స్తన్యపానక్రియాసక్తు లెట్లు
ఆ. అట్లుగాన లౌకికాచారదూరులఁ
     బరమభక్తి రతులఁ బాత్రయుతుల
     నతుల తత్త్వయుతుల నట్టిమహాత్ములఁ
     జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.18

ప్రసాదస్థలము

సీ. కాయంబు నింద్రియోత్కరమును నర్పించి
                     సంధిల్లు కాయప్రసాది యేని
     ప్రాణంబు సత్క్రియాపదమును నర్పించి
                     సాధించు ప్రాణప్రసాది యేని
     శబ్దంబుఁ దచ్ఛబ్దసౌఖ్యంబు నర్పించి
                     శబ్దించు వచనప్రసాది యేని

     గమనంబు గమనసంగతియును నర్పించి
                     చననేర్చు గమనప్రసాది యేని
ఆ. తలఁపులను జేష్టలను నర్పితంబుఁ జేసి
     సంచరించు వ్యాపారప్రసాది యేని
     అట్టి సర్వసంపూర్ణ మహాప్రసాద
     సన్నిహితులను జేర్పుమీ చెన్నమల్లు.19
సీ. సన్మనోభావంబు సంధిల్లు టరిదియే
                     తగిలి ప్రసాదమై తలఁపు లడర
     భక్తిసుభాషల భాసిల్లు టరిదియే
                     కలయఁ బ్రసాదమై పలుకు లడర
     విమలభక్త క్రియాంగము చెల్లు టరిదియె
                     వఱలు ప్రసాదమై వ్యాప్తి దనర
     చిరారాంతశ్శుద్ధి దొరకొను టరిదియే
                     గూఢప్రసాదమై కోర్కు లడర
ఆ. నింద్రియముల గెల్చుటె ట్లరిదియే సమ
     స్తాంగములు ప్రసాదమై చెలంగ
     నట్లుగాన నీమహాప్రసాదానూన
     సిద్ధి కేవలంబె చెన్నమల్లు.20
సీ. తఱి తఱి దలఁచుచో మఱలి యైనను బ్రబు
                     ద్ధతఁ బ్రసాదమె గాని తలఁపఁడేని
     గడగడ వణఁకుచోఁ దడఁబడియైనఁ జొ
                     ప్పడఁ బ్రసాదమెగాని పలుకఁడేని

     గ్రక్కునఁ బొందుచోఁ గలలోననైన ని
                     మ్ములఁ బ్రసాదమెగాని ముట్టఁడేని
     సరినేఁగుచోఁ గాలుజాఱియైనను లెస్స
                     మీప్రసాదమెగాని మెట్టఁడేని
ఆ. సొలసి యింద్రియముల సోగియించుచోఁ బ్రాణ
     మరుగునప్పు డైన నవికలత్వ
     సావధానియైన యాప్రసాదినిఁ గూడఁ (?)
     జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.21
సీ. సర్వగతైకభావస్వన్మహాలింగంబు
                     నిత్యసర్వాంగ సన్నిహితుఁ జేసి
     తనువునం దున్న స్వతంత్రలింగంబు నె
                     క్కొన మనోభావంబు కొనకుఁ దెచ్చి
     సన్మనోభావతఁ జను నిష్టలింగంబు
                     ప్రాణపదంబున భరితుఁ జేసి
     ప్రాణసంచితుఁ డగు ప్రాణలింగంబును
                     దనలోన నిడుకొని తాను చూచి
ఆ. బయలునొడల మనము ప్రాణభావంబున
     లోను వెలియుఁ దన్నుఁ దాను మరచి
     లింగగతిఁ జరింపు లింగలింగైక్యులఁ
     జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.22
సీ. కనువిచ్చు కనుదృష్టిఁ గనుమూయఁ గనుఁగవ
                     వెలుఁగుచు లింగంబు వేళ్లుబారఁ

     దలఁచు తలంపున నిలుచు సుఖంబునఁ
                     నెక్కొన లింగంబు పిక్కటిల్ల
     సోకుఁడు తనువున సొగయుప్రాణంబునఁ
                     బసిగొని లింగంబు ప్రజ్వరిల్లఁ
     బలుకుడుపలుకులఁ బలుక నీముఖమునఁ
                     బరిగొని లింగంబు భరితముగను
ఆ. దగిలి మిగిలి క్రియలఁ దానయై లింగంబు
     నిమ్ముకొను నిరంతరమ్ము నట్టు
     లుల్లసిల్లు లింగయోగానుభవులను
     జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.23

ప్రాణలింగస్థలము

సీ. కాయంబునందు నిన్‌ బాయకుండిన లీలఁ
                     బ్రాణంబునందునఁ బాయఁడేని
     వెలయ జాగ్రదవస్థఁ దలఁచిన యమ్మాడ్కి
                     నలరు స్వప్నావస్థఁ దలఁచెనేని
     వెలుపలి దృష్టుల వీక్షించు విధమున
                     భావంబునందునఁ బదిలుఁడేని
     బాహ్యార్పణంబునఁ బరవశుఁ డైనట్టి
                     మానసార్పితసావధాని యేని
ఆ. నతనిఁ జెప్పనొప్పు ననిశంబు నతని సాం
     గత్య మొప్పు నతనిఁ గన్న నొప్పు

     నట్లుగాన నీ మహాభక్తి యుక్తులఁ
     జేర్చి బ్రోవు నన్నుఁ జెన్నమల్లు.24

శరణస్థలము

సీ. చేసిన నుపచారి చేయమి సోమరి
                     ఫలము గోరక చేయ భక్తిపరుఁడు
     పొగడినఁ బ్రౌఢుండు పొగడమి మూఢుండు
                     నిరవెర్గి పొగడఁ గవీశ్వరుండు
     వలెనన్న సంసారి వలదన్న నిర్మోహి
                     వలదనర్పితమన్న బహుప్రసాది
     తలఁచిన సువిధాని తలఁపమి నద్వైతి
                     తన్ను మరవఁ దలఁపఁ దత్త్వవిదుఁడు
ఆ. అట్లుగాన దద్‌జ్ఞులగు మహాభక్తుల
     సరస లింగకవులసత్ప్రసాద
     రతులఁ బరమతత్త్వయుతుల మహాత్ములఁ
     జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.25
సీ. ఏదెసఁ జూచిన నాదెస లింగంబు
                     దృక్కుల వెంబడిఁ దేజరిల్లు
     నెక్కడఁ జూచిన నక్కడ లింగంబు
                     మునుఁగుచు నిలుచుచు మూర్తిఁ గొనక
     యెచ్చోటఁ జూచిన నచ్చోట లింగంబు
                     మనమునఁ జిట్టాడుచును బెనంగు

     నెమ్మెయిఁ బొందిన నమ్మెయి లింగంబు
                     దనువునందునఁ డొట్రుకొనుచుఁ దనరుఁ
ఆ. దివిరి పలుకుల లింగంబు తీఁగ సాగఁ
     దొడరి పలుకుల లింగంబు ముడివడంగ
     నతిశయిల్లెడు పరమలింగానుభవులఁ
     జేర్చి రక్షింపవే నన్నుఁ జెన్నమల్లు.26
సీ. తను వెల్ల నీ ప్రసాదమె గాని పొందదే
                     పునరాగతము మాన్పు మనఁగ నేల
     మనుచు సద్భక్తుల మఱిగాని యొల్లదే
                     బ్రతికింపు మని దైన్యపడఁగ నేల
     ప్రాణముల్‌ నినుగాని భజియింపకుండవే
                     యపవర్గ మిమ్మని యడుగ నేల
     విషయముల్‌ నినుగాని వేధింపకుండవే
                     యువగుణంబులఁ బాపు మనఁగ నేల
ఆ. యెఱుక నిన్నెగాని యెఱుఁగదే సద్భక్తి
     యొసఁగు మొసఁగు మనుచుఁ గొసర నేల
     కోర్కి నిన్నెగాని కోరదే మఱియొండు
     విన్నపంబు లేల చెన్నమల్లు.27
సీ. కనుమూయుఁ దెఱచు నీకన్నుల వెంబడి
                     వినుచుండు వినఁడు నీ వీనులందు

     స్వాదించు మోదించు నీదు నాలుకయందు
                     గంధించు సొగయు నీఘ్రాణమందు
     స్పర్శించుఁ బాయు నీసర్వాంగములయందుఁ
                     దలఁపించుఁ దలఁచు నీతలఁపులందు
     గమనించు నిలుచు నీగమనాగమములందు
                     భాషించు మాను నీభాషలందు
ఆ. నీడఁ బోలు తాను నీడ యై బాహ్యాంత
     ర ప్రవర్తనముల నీప్రసాద
     సౌఖ్యమునను బొదలు ముఖ్యప్రసాదులఁ
     జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.28
సీ. నీవె కర్త వటన్న నిక్కంబు భక్తుండు
                     తా నన్న నుభయకర్మానుగతుఁడు
     నీకె యన్నను సదా నియతప్రసాదాంగి
                     తనకన్న నింద్రియతత్పరుండు
     నిన్ను నెఱింగిన నేటైనశరణుండు
                     తన్ను నెఱింగినఁ దామసుండు
     నీవు తా నన్నను నిజము లింగైక్యుండు
                     తాని నీ వనిన నద్వైతవాది
ఆ. కాన కాయకర్మగతిమతి శబ్దచై
     తన్యభావములను దన్ను మఱచి
     లింగగతిఁ జరించు లింగలింగైక్యులఁ
     జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.29

ఐక్యస్థలము

సీ. ధర 'నవశ్య మనుభోక్తవ్యం కృతం కర్మ
                     యనుకర్మయోగంబు నపహసించి
     యేదియు లేక 'జ్ఞానాదేవ మోక్ష' మను
                     జ్ఞానయోగంబు హాస్యంబుచేసి
     వదలక 'యాత్మనా మిద మగ్రజే' త్తను
                     ధ్యానయోగంబును నాశ్రయించి
     [6]తగవెంచఁ 'బూజ్యా యథామవాయం' బను
                     భక్తి యోగంబుచే బాగుగాను
ఆ. జేవ పొదలు పరమశివయోగసుఖసుధా
     శరధి మరచి తన్ను జగము మఱచి
     లింగగతి చరించు లింగలింగైక్యులఁ
     జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.30
సీ. కరువున బోసినకరణి సమస్తాంగ
                     ములు నిండి నీలోన మూర్తి గొనఁగ
     గండరించిన భాతిఁ గలయు ప్రాణంబున
                     నెలకొని నీరూపు నిగ్గుదేఱ
     నచ్చు నొత్తినయట్టు లంతరంగంబున
                     నెలకొని శృంగార మెలమి మిగులఁ

     జిత్తరించినభాతి చేష్టలు దవిలిన
                     నాకారరేఖ సమంచితముగ
ఆ. మ్రానుచేవబలియు మాడ్కి సందడిఁ దన్ను
     నెఱుఁగఁ దెలివి వీఁక కఱకుపడక
     నీవ యై చరించు నీమహాభక్తులఁ
     జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.31
సీ. భక్తస్థలమునఁ బదుమూఁడు మాహేశ
                     పదమున నైదు నేర్పడఁ బ్రసాది
     పదమున మూఁడు దత్ప్రాణలింగికి నాల్గు
                     శరణస్థలంబున నరయ నైదు
     నైక్యస్థలంబున కలవడ రెండును
                     షట్స్థలవిజ్ఞానసరణి నొప్పి
     క్షితిని ముప్పదిరెండు సీసపద్యంబులు
                     సరసోక్తిగాఁ బాలకురికి సోమ
ఆ. నాథుఁ డన నొప్పు నారాధ్యనవ్యమూర్తి
     యఖిలవేదపురాణశాస్త్రార్థవిదుఁడు
     వీరశైవసభాయోగ్యవిదితముగను
     జెన్నమల్లేశు ప్రీతిగాఁ జెప్పె నిట్లు.32
సీ. నలి ప్రాణలింగంబునకు భూమి మోవని
                     కొలనిజలంబులు జలకమార్చి

     పుట్టనిచెట్టునఁ బుట్టిన కెందమ్మి
                     పుష్పంబుఁ గోయక పూజఁజేసి
     యడరి యుష్ణముగాని యగ్నిలోన దశాంగ
                     మిడక ధూపపుఁదాపు లిచ్చపేర్చి
     తొడరి దీపముగాని తునియలు ముడిపెట్టి
                     లీల నెత్తకయ నివాళి నిచ్చి
ఆ. రసముగాని యోగిరము గూడ వడ్డించి
     యర్పణంబు లోన నలరెనేని
     శీలవంతుఁ డతఁడు సిద్ధంబు నన్నట్టి
     శీలవంతుఁ జేర్చు చెన్నమల్లు.33
సీ. శ్రీగురు నకట వాసిగఁ గాలదన్నిన
                     మేరు వానందంబుఁ జేరుపూజ
     నిలుపవే భజియించు నెపమున లింగని
                     నీరూపు నతులితనిరవగుణము
     సర్వేశుఁ గడునర్థిఁ బర్విన చూడ్కిని
                     సంకీర్ణ జైమినిసాటికాయ
     తఱితఱి సన్మనోనిరతి కాయమునందుఁ
                     గనువిచ్చుడును సర్వగత మనంగఁ
ఆ. జెలఁగి నలి ప్రాణలింగంబుఁ జేసి యనుప
     నీవ కర్తవు తను వెల్ల నిర్మలముగ
     నేదెసను జూచి కనుమూయ మోద మొసఁగ
     ధర నవశ్యంబు కరవున వెఱపులేక.34

క. చెనమల్లేశ్వరు పేరిట
     సునిశితముగఁ బాలకుఱికి సోమేశుఁడు దా
     ఘనభక్తి వెలయఁ జెప్పెను
     జెనమలు సీసంబు లనఁగఁ జెలఁగ ధరిత్రిన్‌.35
క. ఈ సీసము లేవేళను
     భాసురముగఁ బఠనజేయు భక్తుల కిలలో
     వాసిగ భుక్తియు ముక్తియు
     నాసర్వేశ్వరుఁ డొసంగు ననవరతంబున్‌.36
క. పదుమూఁడునైదుమూఁడును
     పదపడి నాల్గైదు రెండుపద్దెంబులు గా
     నిది భక్తాదికషట్స్థల (?)
     మది వెలయఁగ వెలయుఁ జెన్నమలు సీసంబుల్‌.37

సమాప్తి

  1. అకటా ప్రమథుల
  2. పూన్పింప మాన్పింప - పా.
  3. పూర్వంబు మఱప - పా.
  4. మహిత
  5. శేఖరులఁ జేర్పవే నన్ను
  6. తగ 'సచ పూజ్యో యథావ్యూహం' బనుభక్తియోగంబు ముక్తికిఁ జేగఁగాక, తివిరి