Jump to content

బ్రహ్మ సూత్ర రహస్యము-వచన కావ్యము

వికీసోర్స్ నుండి

ఓమ్‌.

శ్రీ పర బ్రహ్మణే నమః

శ్రీకృష్ణద్వైపాయన మహాముని ప్రణీతము.

రాజయోగ అష్టాంగ యోగాధ్యాయ సహిత

బ్రహ సూత్ర రహస్యము - వచన కావ్యము.


ఈ గ్రంథము,

సంస్కృత ప్రాకృత వైకృతా ద్యనేకభాషా నిపుణులగు

బ్రహ్మశ్రీ, వెన్నెలకంటి - సుందరరామ శర్మగారిచే

విరచితము.

బరూరు, త్యాగరాయ శాస్తులు అండ్ సన్ గారిచే

స్వకీయ

గీర్వాణ భాషా రత్నాకర ముద్రాక్షర శాలయము

ముద్రితము.

చేన్నపురి,

1920

[ క్రయం 0-5-0 తపాల్ ఖర్చులు 0-4-0 ]

All Rights Reserved

ఓమ్‌.

బరూరు. త్యాగరాయ శాస్త్రీతి

పూ ర్వా శ్ర మ ప్ర సి ద్ధా భి ధా న

రాజయోగి - శ్రీవాసుదేవానంద సరస్వతీస్వామీ.

కలియుగ గతాబ్దా 5017 నళ సంవత్సరే తులామాసే

షష్ట్యబ్దిపూర్తి - రాజయోగాశ్రమ ప్రవేశః

ఓమ్

శ్రీ ప ర బ్ర హ్మ ణే న మః .

విజ్ఞాన నౌకాస్తోత్రమ్.

తపోయజ్ఞ దానాదిభి శ్శుద్ధబుద్ధి
ర్విరక్తో నృపాదౌపదే తచ్ఛబుద్ధ్యా :
పరిత్యజ్య సర్వం యదాప్నోతితత్వం
పరబ్రహ్మనిత్యంతదేవాహమన్మీ ॥ 1


దయాళుంగురుం బ్రహ్మనిష్ఠం ప్రశాంతం
సమారాధ్యభక్త్యా విచార్యస్వరూపమ్ |
యదాప్నోతితత్వం నిదిధ్యాస్యవిద్వాన్
పరబ్రహ్మనిత్యం తదేవాహమస్మి ॥ 2
 

యదానంద రూపం ప్రకాశస్వరూపం
నిరస్తప్రపంచం పరిచ్ఛేదశూన్యమ్ |
అహం బ్రహ్మవృత్త్యైక గమ్యం తురీయం
పరబ్రహ్మనిత్యం తదేవాహమస్మి ॥ 3


యదజ్ఞానతో భాతీ విశ్వం సమస్తం
వినష్టంచసద్యో యదాత్మ ప్రబోధః |
మనోవాగతీతం విశుద్ధం విముక్తం
పరబ్రహ్మనిత్యం తదేవాహమస్మి ॥ 4


నిషేధే కృతే నేతినేతీహావాక్యై
స్సమాధిస్ధితానాం యదాభాతిపూర్ణమ్ |
అవస్థాత్రయాతీత మద్వైతమేకం
పరబ్రహ్మనిత్యం తదేవాహమస్మి ॥ 5


యదానంద లేశై స్సమానందవిశ్వం
యదాభాతిసత్వైస్తదాభాతిసర్వమ్ |
యదాలోచనే హేయమన్యత్సమస్తం ప
రబ్రహ్మనిత్యం తదేవాహమస్మి ॥ 6


అనంతంవిభుం విశ్వయోనింనిరీహం
శివం సంగహీనం యదోంకార గమ్యమ్ |
నిరాకార మృత్యుజ్వలం మృత్యుహీనం
పరబ్రహ్మనిత్యం తదేవాహమస్మి ॥ 7


యదానందసింధౌనిమగ్నః
పుమాన్ స్యాదవిద్యావిలాసస్సమస్తప్రపంచః |
యదానస్ఫుర త్యద్భుతం యన్నిమిత్తం
పరబ్రహ్మనిత్యం తదేవాహమస్మి ॥ 8

స్వరూప్తానుసంధాన రూపః స్తుతీం యః
పఠేదాదరాద్భక్తి భావో మనుష్యః |
శ్రుణోతీహవా నిత్యముద్యుక్త చిత్తో
భవేద్విష్ణురత్రైవ వేదప్రమాణాత్ 9

విజ్ఞాననామ పరిగృహ్యకశ్చి
త్తరేద్యదజ్ఞానమయం భవాబ్ధిమ్ |
జ్ఞానాసి నాయోహి విఛిద్య తృష్ణాం
విష్ణోఃపదంయాతి సఏవధన్యః 10

ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య


శ్రీమచ్ఛంకరాచార్య విరచితం


విజ్ఞాననౌకాస్తోత్రం - సంపూర్ణమ్

—♦♦♦♦§§♦♦♦♦—




శ్రీ పరబ్రహ్మణేనమః

బ్ర హ్మ సూ త్ర ర హ స్య ము

వ చ న కా వ్య ము.


శ్లో ॥ ఓంకారశ్చాథశబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణఃపురా!
     కంఠంభిత్వా వినిర్యాతౌ తస్మాన్మాంగళి కావుభౌ

మానవుడు శాస్త్రి క్తములగు నిత్య నైమిత్తిక సకల కర్మలను ఆచరించెనేని చిత్తశుద్ధి కలుగును. దానిచే ఈ ప్రపంచమంతయును అనిత్వమనియును, ఈ ప్రపంచమును నియమించుచున్న పరమేశ్వరుడు నిత్యుఁడనియును, తెలిసికొనదగిన జ్ఞానము కలుగును. దీనికే నిత్యానిత్య వస్తు వివేకమని పేరు, ఆజ్ఞానము అభివృద్ధియగు కొలది అనిత్యమగు ప్రపంచమునందు అనగా మనము అనుభవించుచున్న శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, అను విషయముల యందు ఇచ్చ తొలఁగును.

ఆశబ్దాదివిషయమును అనుభవించుట అవివేకి యగువానికి ఆనందకరముగ నుండును గాని, పైన 'జెప్పబడిన నిత్యానిత్య వస్తువివేకము గలవానికి ఆట్టుండదు. ఆ శబ్దాది విషయములను సంపాదించునప్పుడు జనించు ఆయాసమును గూర్చియును, అనుభవ కాలము మిక్కిలి స్వల్పమై యుండుటనుఁ గూర్చియుసు, అనుభవానంతరమున దుఃఖము కలుగుటను గూర్చియును, ఆయనుభవమువలన ఇంద్రియముల శక్తి నశించుటను గూర్చియును, దలంచినప్పుదు వాని యొక్క మనస్సు మిక్కిలీ సంక్షోభించును.

ఈవిషయములు రెండువిధములై ఉన్నవి. ఈ లోకమునందు సామాన్యముగా అనుభవింపఁబడుచు గొన్నియు, పరలోకముల యందు విశేషముగ అనుభవింపఁబడుచు మఱికొన్నియు అవివేకుల మనస్సును కలవర పెట్టుచున్నవి. వివేకియుగు వానికి ఈరెండువిధములగు విషయములందును సంపూర్ణముగ ఇచ్చనశించును, ఇదియే వైరాగ్యము . లేక ఇహాముత్రార్థ ఫల భోగ విరాగము.

ఈ వైరాగ్యమువలన మనస్సు పూర్వమువలె నిటునటు చలింపక నిశ్చలమై నిలుచును. ఇదియే శమము. సకలేంద్రియములును మనస్సున కధీనములై యుండును. కావున ఆమనస్సు నిశ్చలము కాగానే అవియు దమతమ విషయములను ఆశ్రయింపక స్థిరములై యుండును. ఇదియే దమము అనఁబడును.

ఇట్లు ఇంద్రియ చిత్తములు శాంతములయ్యెనేని వికారము లేవియును గలుఁగవు. స్వస్తత జనించును. దీనికి ఉపరతి యని పేరు. ఈయుపరతిగలవాఁడు శీతోష్ణము వలనఁగాని, సుఖదుఃఖముల వల నఁగాని, బాధ నొందఁడు. వాని నెల్లను ఓర్చుకొనును. ఏదివచ్చినను, ఏదిపోయినను, రాగ ద్వేషములను బొందఁడు, ఈ ఓర్పునకు తితీక్ష యనిపేరు. ఇట్టి స్థితి గలవానికి పరమేశ్వరని యథార్థ స్వరూప స్వభావములను ఎఱుగవలయునని సంకల్పము జనించును. దానిచేత వాఁడు భక్తియుక్తుఁడె సద్గురువులను వెదుకనారంభించును. వేదాం తవాక్యములను వినుటకు ఉపక్రమించును. శ్రవణము ( వేదాంతవా క్యముల వినుట) తప్ప వానికి రెండవపనితోపదు. దీనికే శ్రద్ద యని పేరు.

ఇట్లు శ్రద్దావంతుఁడగు పురుషుఁడు శ్రవణము జేయునప్పుడు మనస్సును మఱియొక స్థలమునకు బోనీక తాను వినిన విషయములను మననము జేయుచుండును. ఇదియే సమాధానమనఁబడును. శమము మొదలగు ఈయాఱు గుణములను కలిగియుండుటయే శమాది షట్క సంపత్తి . ఈశమాది షట్క సంపత్తి గల పురుషుఁడు మనన పూర్వకముగా వేదాంత వాక్య శ్రవణము జీయుటచేత , బ్రహ్మము సకును, జీవునకును, భేదములేదు, అట్టిభేదము కలదని తలంచుట భాంతి, అట్లు దలంచునానికి ఎప్పటికిని సంసార బంధము తొలఁగనే రదు " అని సామాన్యముగా తెలియవచ్చును. ఈ విషయము స్పష్ట మగుటకు అధికమగు విచారము అవశ్యముకదా. కావున ఆపురు షుఁడు మోక్షమును జెందవలయునను కోరికతోను, తానే పర బ్రహ్మము అగుటయందలి సంశయముతోను, బాధపడును. ఇదియే ముముక్షుత్వము.

ఇట్లు నిత్యానిత్య వస్తువివేకము ఇహముత్రార్థఫలభోగ విరా గము, శమాది షట్క సంపత్తి , ముముక్షత్వము, అను నాలుగుసా ధనములను సంపాదించిన అధికారి పరమేశ్వరుని స్వరూప స్వభావ ములను విచారించుటకు ఉపక్రమింప వలయుకు. ఈసాధనములు. లేకపోయినయెడల అబ్రహ్మవిచారము నిష్ప్రయోజనమగును.

ఒకపక్షమున బ్రహ్మస్వరూపము వానికి తెలియవచ్చుటయే అబద్ధము. కొంత సూక్ష్మబుద్ధిగలవానికి దెలిసినను దెలియవచ్చి నను, తగిన చిత్తశుద్ధి లేకపోవుటచేత నిస్సంశయముగ అనుభవసి ద్ధమై నిలచుట అబద్ధము. రెండవపక్షమున కానిమనస్సు బ్రహ్మస్వరూ పమును ఎఱుగునంతటి సామర్థ్యము లేనిదగుటచేత పైకీ అందుకొన నేరక, పరోక్ష జ్ఞానము ( బ్రహ్మమునకును జీవునకును భేదము లేదు అను సామాన్య జ్ఞానము) కలది యగుటచేత క్రింద (జీవుఁడు వేఱు, బ్రహ్మ వేఱు, అను భేద భావన ఉన్నప్పుడు చేయఁదగిన కర్మోపాస నాదులయందు) నిలువనొల్లక ఉభయ భష్టమై చెడిపోవును, బ్రహ్మ జ్ఞానము ఒక్కటియే కాదు (ఏవిషయమైనను సరియే తగిన అధికార ము లేనివానికి ఉపదేశింపఁబడినచో లాభమునకు మారుగా నష్టమును గలిగించును. దానిని దీర్చుటకు నాలుగు ముఖములు గల బ్రహ్మ దేవుని కైన తరము కాదు.) కావున ఏవిషయమునైనను గ్రహింపదలచువాఁడు మొట్టమొదట తనకు దగిన అధికారము కలదా? లేదా ? అని విచా రించుకొన వలయును. ఆచార్యుండును తన్ను ఆశ్రయింపవచ్చిన శిష్యుఁడు ఉపదేశమునకు తగునా? తగడా? అని పరీక్షించి బోధించ వలయును. కావున ఈబ్రహ్మవిద్యయొక్క ఉపదేశమునకు బైఁజెప్పఁ బడిన నిత్యానిత్య వస్తువివేకము మొదలగు నాలుగు సాధనములను సంపాదించినవాఁడే తగిన అధికారి, వానికి యజ్ఞాది కర్మలతోఁగాని, వానిసాధనములతోఁగాని, పనిలేదు. భేదజ్ఞానముకల సమయమునందు గాని, కర్మలను జేయుటకు వీలు లేదు. ఈ అధికారియనిననో, జీవ బ్రహ్మైక్యమును సామాన్యముగ విని దానిని నిశ్చయించుకొన వచ్చి నవాఁడు. కావున వీనికి కర్మములతో పనిలేదనుట స్పష్టము.

ఇదియునుఁగాక వేదము కర్మకాండయందు కర్మలను విధించి యుండియు జ్ఞానకాండమునందు వానిని నిషేధించుచు బ్రహ్మవిద్యాధి కారియగువానికి కర్మలు అనావశ్యము లను విషయమును స్పష్టము చేయుచున్నది. ఈ కారణమువలన పైఁ జెప్పఁబడిన అధికారి కర్మలను వదలి పరమేశ్వరుని యొక్క యథార్థస్వరూప స్వభావములను విచా రింపవలయును. ఆ బ్రహ్మము యథార్టస్థితిలో జీవునికంటె వేఱుకాఁ డు. అయినను, ఈవిషయము కొంత అనుభవ విరుద్ధముగా ఉన్నట్లు గానవచ్చుట చేత ఇందుకలుఁగు సంశయములకు మితిలేదు. కావున పరమాత్మునియొక్క యథార్థస్వరూపమును అట్లే యుపదేశింప వల యుననిన అది సంభవింపనేరదు. ( స్వరూప లక్షణముతో బ్రహ్మ మును జెప్పుట అశక్యము.) ఈ కారణమువలన బ్రత్యక్ష సిద్ధమగు బ్రపంచమును ఆశ్రయించియే మొట్టమొదట ఆపరమేశ్వరుని దెలి సికొనవలయును.

ఆచార్యుఁడును అట్లే, తెలుపవలయును. ఏసర్వజ్ఞుని నుండి ఈ ప్రపంచము పుట్టుచున్నదో, ఎవ్వనియందు ఈప్రపంచము నిలిచి యున్నదో, ఎవ్వనియందు లయమగుచున్నదో, ఎవ్వనిచేత చక్కగ నిర్వహింప బడుచున్నదో, నాతడే పరమేశ్వరుఁడని శ్రుతి చెప్పుచు న్నది, (ఇదియే తటస్థ లక్షణము.) అధ్యారోపము, ఏసర్వజ్ఞుని వలన ధర్మాధర్మముల బోధించి లోకవ్యవహారములను నడపు సర్వశా స్త్రమయములగు వేదములు ఉద్భవించెనో, అతడే పర మేశ్వరుఁడని కూడ ఘోషించుచున్నది. ( ఇదియును తటస్థ లక్షణమే ఏపరమే శ్వరునియొక్క స్వరూప స్వభావములను తెలిసికొనుటకు వేదముల కంటె ఇతర ప్రమాణములు లేవు. అబ్రహ్మము ప్రత్యక్షమునకు గోచ రము కాడనుట స్పష్టమేకదా.

హేతువు ఏదియును లేకుండుటచేత అనుమానమునకుఁ గూడ గోచరుఁడుకాఁడు. పొగయున్నచో అగ్నియుండవలయును, అను సట్లు ఏవస్తువుతోను బ్రహ్మమునకు సంబంధము చెప్పుట తటస్థింప దుకదా. ఇదియునుఁగాక ఆ ఈశ్వరునకు నామధేయము ఏదియును లేకుండుట చేతను, ఆయనతో సమానమగు రెండవ పదార్థమే లేకుం డుటచేతను, ఉపమానప్రమాణముచేత ఆయనను ఎఱుగుట సంభవిం పదు. ఇట్లే అర్థాపత్తి మొదలగు ఇతర ప్రమాణములకుఁ గూడ అమ్మ హాత్ముఁడు అగోచరుఁడు. కావున ఉపక్రమము (ఆరంభము) మొద లగు తాత్పర్య లింగముల ( తాత్పర్యములను నిర్ణయించుటకు . గురు తులు ) సహాయము చేత వేదవాక్యములను విమర్శించి వానియందు జెప్పఁబడియున్న ప్రకారము పరమేశ్వరునియొక్క స్వరూప స్వభా వములను ఎఱుంగవలయును. పిమ్మట యుక్తులచేత ఆవిషయ మును విచారించి మనస్సును దృఢము చేసికొన వలయును.

లోకమునందు రెండువిధములగు కారణములు గలవు. ఒకటి ఉపాదాన కారణము. మఱియొకటి నిమిత్త కారణము. మట్టి కుండ యైనట్లే కారణము కార్యరూపమును జెందునో అది ఉపాదాన కార ణము అనఁబడును. కార్యము జనించుటకు పూర్వమునగాని పిమ్మట గాని నశించిన తరువాత గాని ఈ కారణమునకంటె భిన్నమగు రూప ముతో నిలువ నేరదు. నిమిత్త కారణమనగా, కార్యమునకంటే వేరై దాని యుత్పత్తి కిమాత్రము సాధనమగుచు నుండునది. కుండకంటె వేరై దానిని జేయునట్టి కుమ్మరవాఁడు దానికి నిమిత్త కారణము, ఇకను ఈప్రపంచవిషయమునందు పైనవర్ణింపఁబడిన రెండు విధము లగు కారణములును పరమేశ్వరుఁడేయని వేదము చెప్పుచున్నది.

" సోకామయత ( ఆపరబ్రహ్మము జగత్తును సృష్టింప సంకల్పించెను ) అను మొదలగు వాక్యములచేత "పరబ్రహ్మము 'ప్రపంచమునకు నిమిత్త కారణము " అనియు " బహుస్యాం : (నేనే అనేక విధములు గలవాడను ప్రపంచమును అయ్యెదను,) అను 'మొదలగు వాక్యముల చేత పరబ్రహ్మము ప్రపంచమునకు ఉపాదానకారణము " అనియు బోధించు చున్నది. ఏశాఖయందు జూచినను ఇట్టి వాక్యములు లెక్కకు మిక్కిలిగ గలవు. వేదమునకు ఇట్టి అభిప్రాయము ఉండుట చేతనే " ఈ ప్రపంచము ఎచ్చట బుట్టు నో, నిలచునో, లయించునో, అదియే బ్రహ్మము అని లక్షణ మును జెప్పుటకు నవకాశము కలిగినది. ఏకార్యమైనను తన ఉపా దాన కారణముతో అభిన్నమై అందే బుట్టుచు నశించుచు నుండును గాని నిమిత్తకారణమునందు అట్లుండదుగదా. కావున ఈప్రపంచ మునకు ఉపాదాన కారణము, నిమిత్తకారణముగూడ బ్రహ్మమే అనుట వేద సిద్దాంతము.

మఱియు, ఛాందోగ్యోపనిషత్తునందు " ఉపాదాన కారణ మగు మట్టిని దెలిసికొనిన దానినుండి పుట్టు ఘటాది మృణ్మయపదా ర్థములను ఎట్లు తెలిసికొనినట్లగునో అట్లే ఉపాదాన కారణమగు బ్రహ్మమును ఒక్క దానిని ఎఱింగిన చేతనాచేతనాత్మకమగు ఈసకల ప్రపంచమును తెలిసికొనినట్లగును.' అని చెప్పఁబడి యున్నది. ఇదియు పైసిద్ధాంతమును దృఢపఱచు చున్నదిగదా, కావున ఏ పురు షుడు ఈప్రపంచమునకంటే వేరుకాకుండియును ఇందలి వికారము లతో సంబంధపడక శుద్ధుడై ఉన్నాడో అతడే పరబ్రహ్మమని తెలి సికొనవలయును.

వేదము ఇట్టి అభిప్రాయము కలిగియున్నను అందలి వాక్య సందర్భములను బాగుగ సమన్వయించుకొన నేరక సాంఖ్యాది మత కర్తలు బహువిధములగు పోకల బోయియున్నారు. చేతన పదా ర్థము ఈ ప్రపంచమునకు ఉపాదాన కారణమైనచో ఇదికూడ చేత నమై యుండవలయును. జీవుడు ఒక్క_డుతప్ప తక్కిన పదార్థములు అన్నియును అచేతనములుగా నున్నవికదా. ఇది ఎట్లు సంభవిం చును ” అనునది వారలకుగల ప్రధాన సంశయము. ఈ సంశయమును తొలగించుకోన నేరక వారలు వేదవాక్యములకు గొన్నిటికి అపార్థము చేసి తమతమ పక్షములనే వేదము వచించెనని చెప్పుచున్నారు.

"అణ్వ ఇమేధాన్యాః ” (ఈవిత్తనములు మిక్కిలి సూక్ష్మ ములై ఉన్నవికదా)" ఆను మొదలగు వాక్యములందలి అణు శబ్దములను జూచి అచ్చటి సందర్భములను విచారింపక “ పరమా ణువులు ప్రపంచమునకు ఉపాదానకారణము"అని వేదము అభి ప్రాయ పడుచున్నట్లు తార్కికులు తలంచుచున్నారు.

"అసద్వా ఇదమగ్ర ఆసీత్ (ఈ ప్రపంచము మొదట అసత్తుగా నుండెను ) " అను మొదలగు శ్రుతులను అనుసరించి అచ్చటి సంద ర్భములను విచారింప నేరక అసత్తనగా నామరూపములు ప్రకాశిం పని స్థితియే యని ఎఱుంగనేరక " శూన్యమే ప్రపంచకారణము” అని శూన్యవాదులు అనుచున్నారు.

"స్వభావమేకే ( కొందరు ప్రపంచమునకు స్వభానమే కార ణము అని అందురు. ) " అను పూర్వపక్ష శ్రుతిని ఆశ్రయించియే స్వభావవాదులు తమ మతమే వేదమతమని వక్కాణించు చున్నారు.

వీరందఱికంటె ప్రబలులై సాంఖ్యలు బ్రహ్మ ప్రతిపాదకము లగు వేదవాక్యములను గూడ తమమతమునకు అనఁగా " ప్రధానమే జగత్కారణము " అను మతమునకును అనుకూలములనుగా జేయు చున్నారు. అది ఎట్లనిన, ఛాందోగ్యోపనిషత్తునందు "స దేవ సోమ్యేద మగ్ర ఆసీత్ (" ఓశాంతుడా, మొట్టమొదట ఈ ప్రపంచము సద్రూపముతో నుండెను ) " అని ఉపదేశించుటకు ఆరంభించి తత్తేజోసృజత (ఆసత్పదార్ధమే తేజో భూతమును పుట్టించెను)" అను మొదలగు వాక్యముల చేత అసత్పదార్థమే సర్వ భూతములకును గారణము అని చెప్పి " సఆత్మా తత్వమసి (ఆసత్పదార్థమే ఆత్మ అదియే నీవు (జీవుడు)" అనిఉపదేశ సమాప్తి చేయబడి యున్నది. ఇట్లు ఈవాక్యము స్పష్టముగ చేతన పదార్థమునుగూర్చి చెప్పుచు న్నను సాంఖ్యులు విచారశూన్యులై "ఈసందర్భమునందు ప్రధాన మునుగూర్చియే చెప్పబడియున్నది". అని చెప్పుదురు. సచ్ఛబ్దమునకు ప్రధానమే అర్థమనియు, నిర్వికారుడగు పరబ్రహ్మము కార్యములను జేయనేరడు, కావున సత్వ రజస్తమోగుణ రూపిణయగు ప్రధా నమే జగత్కారణము గావలయుననియు, వారి అభిప్రాయము. ఇం తయేకాని " తత్త్వమసి" అను వాక్యమునందు ఉన్న తచ్ఛబ్దము సకుగూడ సచ్ఛబ్దముతో జెప్పబడిన పదార్థమే అర్థముకదా యనియు, అచేతనమగు ప్రథానమే సచ్ఛబ్దముచే జెప్పబడెను అనినయెడల దాని కిని చేతనుడగు జీవునకును ఐక్యము సంభవింపదనియు, కావున ఇది వాక్యసందర్భమునకు విరుద్ధమనియు, వారు కొంచెమైననూ దలంపరు.

కావున వివేకియగు అధికారి విరుద్ధ మార్గములను అవలంబిం పక శాంతచిత్తుడై వేదవాక్యములను బాగుగ సమన్వయింపవలయు ను, ఒక ప్రకరణమును విచారింప నారంభించినప్పుడు “దీనిని ఎట్లు ఆరంభించిరి? ( ఉపక్రమము ) ఎట్లు ముగించిరి (ఉపసంహారము) పూర్వము జెప్ప బడియున్న విషయములకును ప్రస్తుత విషయమున కునూ భేదమేమి? ( అపూర్వత ) ఈవిషయమును గ్రహించిన ఏ ఫల ము కలుగును అని చెప్పియున్నారు? (ఫలము) దీనిని ఎఱింగిన ఇదియే ఫలము కలుగుననుటకు ప్రమాణమేమి? ( ఉపపత్తి.) ఈవిషయమును గూర్చి ఆచరింపబడిన స్తోత్రము ఏయభిప్రాయము నిచ్చుచున్నది? (అర్థవాదము) ఈప్రకరణమునందు దేనినిగూర్చి పలుమారు చెప్పబ డియున్నది? ( అభ్యాసము) అను విషయములను గూర్చి మిక్కిలి సూక్ష్మముగ విచారింపవలయును. అట్లు విచారించిన ఆప్రకరణము నందలి తాత్పర్యము స్పష్టముగ గోచరమగును. (ఇట్లు ప్రమాదము లేక ఉపనిషత్తుల నెల్ల పరిశోధించినచో నిశ్చయముగ పరబ్రహ్మమే ప్రపంచమునకు అభిన్న నిమిత్తోపాదాన కారణమని స్పష్టమగును. ఇదియే సిద్దాంతము. దీనికి ఎట్లును లోపము లేదు.

ఇట్లు చేతన పదార్థమే జగత్తునకు ఉపాదానము అనినయెడల విరోధము వచ్చుట తప్పదు. కార్యమునకు కారణగుణములు అవశ్య ముగ నుండవలయును గదా. అని ఆక్షేపింప నవసరము లేదు. లోక మునందు చేతనుడగు మనుష్యునినుండి గోళ్లు వెంట్రుకలు మొద లగు అచేతన పదార్థములు జనించుటయును, అచేతనములగు పేడమొ దలగు వానినుండి చేతనములగు పురుగులు జనించుటయు మనము చూచుచున్నాము. కావున ఇది యొకదోషము కాదు. బ్రహ్మము అద్వితీయుడు కదా, ఆయన ఉపాదాన కారణముగా నున్నప్పుడు ఈప్రపంచమంతయు నొకటిగనే ఉండవలయునుగాని అనుభవించు వాడు, అనుభవింపబడునది, అను మొదలగు భేదములు ఉండకూడ దుకదా, అనియెదవేమో అందేమియు విరోధము లేదు. లోకము నందు మట్టి యొక్కటియే ఉపాదాన కారణముగా గలవియైనను కుండ, చట్టి, ముంత, మొదలగునవి పరస్పర భిన్నములైనట్లు ఈప్ర పంచమునందలి సర్వ వ్యక్తులకును పరబ్రహ్మము ఒక్కడే కారణమై నను వానికి భేదము కలుగవచ్చును. కావున పైసిద్ధాంతము ప్రత్యక్ష మునకు విరుద్ధమని సంశయింప నక్కఱలేదు. ఇట్టి కల్పిత భేదము ఉండుటచేతనే జీవబ్రహ్మలు పరమార్థస్థితిలో ఒక్కటియే అయినను ప్రపంచమునకు పరబ్రహ్మము ఉపాదానకారణమని చెప్పిన జీవుడు ఉపాదాన కారణమని చెప్పినట్లే అయినను దోషము ఏమియును రాదు. “జీవుడే ప్రపంచమునకు కారణమైన యెడల తనకు అనిష్ట మగు జరా మరణాదులను దానే సృజించుకోనునా " అనునది ఒక గొప్ప సంశయము కదా. పైన జెప్పిన హేతువువలన నీ సంశయము కలుగ కూడదు, భూమినుండియే జనించినవైనను కెంపు, పగడ ము, ముత్యము, మొదలగునవి నానావిధములగు వైచిత్య్రములు కలిగియుండునట్లు జీవబ్రహ్మలుగూడ అభిన్నులయ్యును ఉపాధి భేద మువలన అనేక వైచిత్య్రములు కలవారలై ఉండవచ్చుసుకదా ??

మఱియును ఈ పరబ్రహ్మము స్వయముగానే ప్రపంచరూప మును జెందునేగాని సాధనాంతరములను అపేక్షింపడు. లోకము నందు పురుషుడు ఏదియైన నొక కార్యమును సాధింప వలయుననిన వానికి బాహ్య సాధనములు కావలయును గాని పాలు పెరుగుగ మా రవలయుననిన, అవి అక్కఱలేదనుట ప్రత్యక్ష సిద్దమేకదా.

ఇచ్చట ఒక విషయమును బాగుగ తెలిసికొన వలయును. ఏదియైనను ఒక వస్తువు. పుట్టవలయుననిన దాని జన్మమునకు ఆరంభ మనియు, పరిణామ మనియు, రెండు కారణములు గలవని తార్కి కులు జెప్పుదురు. నూలు గుడ్డయైనట్లు కొన్ని పదార్దముల చేరిక ఒక పదార్థమును బుట్టించినయెడల నది ఆరంభము. పాలు పెరుగై నట్లు ఒక వస్తువు స్వయముగా మార్పు చెందీ మఱియొక వస్తువును కలిగించుట పరిణామము, ఈతార్కిక మతమును అనుసరించి చూ చిన బ్రహ్మ జగద్రూపముతో పరిణమించునని చెప్పవలసి వచ్చును.

వేదాంతి మతము మాత్రము ఇట్టిది కాదు. వానికి వివర్త మను మఱియొక కారణముకూడ గలదు. తాడును జూచి భ్రాంతి చేత పామని తలంచునట్లు ఒక వస్తువును మఱియొక వస్తువుగా జూచు టవలనగూడ ఒక పదార్ధము- పుట్టవచ్చును. తాడును పామని భ్రమిం చినప్పుడు అచ్చట పాము ప్రత్యక్షముగనే పుట్టును. అట్లు భ్రమించి నవాడు ప్రత్యక్ష సర్పమును జూచినవానివలె భయమును జెందుట యు, వణకుటయు, దానిం గొట్ట ప్రయత్నించుటయు అది తన్ను కరచినట్లు భ్రమించినవాడు ప్రత్యక్ష విషవేగమువలన గలుగు వికా రములను చెందుటయు కూడ కలదు. ఇదియే వివర్తము “పాదోస్య విశ్వా భూతా'ని త్రిపాదస్యా౽ మృతందివి" ( ఈ పరబ్రహ్మములోని ఒక భాగము ప్రపంచము. మూడు భాగములు ప్రపంచమునకు అతీ తము అగు తత్వము ) అనిచెప్పుచు శ్రుతియే పరబ్రహ్మవివర్తమే ప్రపంచము ” అని బోధించు చున్నది.పరిణామమైనచో పాలు నిశ్శేషముగ పెరుగగునట్లు బ్రహ్మము నిశ్శేషముగ ప్రపంచరూపుడు కావలయునుగాని కొంత ప్రపంచరూపముతోను మఱికొంత శుద్ధ ముగాను నిలచుటకు వీలులేదు. వివర్తమైనచో ఇట్లు కానక్కఱ లేదు. రజ్జువు మిక్కిలి పొడవైయుండెనేని విమర్శాశూన్యు డగువా నికి ఒక అంశమునందుమాత్రమే సర్పభ్రాంతి కలిగినను కలుగవ చ్చునుగదా. కావున వేదవాక్యానుసారముగా నీ ప్రపంచము బ్రహ్మ వివర్తమే అని సిద్ధాంతము చేయబడి ఉన్నది.

పరబ్రహ్మమును తెలిసికొనుటకు వేదము తప్ప మఱియొక ఆధారము లేదని ఇదివరకే చెప్పియున్నాముగదా. ఈ కారణమువలన బ్రహ్మ ప్రపంచరూపుడుగా పరిణమించుననిగాని ఆయనకు అవయ వములు కలవనిగాని చెప్పకూడదు. పరబ్రహ్మమునకు అవయవ ములు లేవని చెప్పు వేదము అప్పుడు నిరర్థకము అగును. సర్వశ్రు తులను సమన్వయింప వలయునుగాని కొన్ని శ్రుతులను నిరర్ధకము చేసిన ఆసిద్దాంతము అప్రమాణము అగునుకదా. ఇట్లే "సర్వకర్మ సర్వకామ" ( సర్వకార్యములను చేయునట్టి శక్తికలవాడు ) అని శ్రుతియందు చెప్పబడియుండుట చేత మాయాశక్తి ఆ బ్రహ్మమును ఆశ్రయించి ఉన్నదనినను దోషములేదు. ఆయన అద్వితీయుడైనను అగ్నియందలి ఉష్ణశ క్తివలె ఆమాయాశ క్తియును ఆయనకంటె వేరై నదికాదు. కావున విరోధము ఏమియును ఉండదు.

ఇట్లు ప్రపంచమును సృజించుటవలన ఆ పరబ్రహ్మమునకు ప్రయోజనము ఏమియును లేదు క దా. ఇట్టి పనియందు ఆయన ఏల ప్రవర్తించెను " అనరాదు. లోకములో ప్రభువులగువారు ప్రయో జనమును గోరకయే విలాసార్థమై అనేక కార్యములను చేయుట చూ చుచున్నాము. ఉచ్ఛ్వాసము, నిశ్వాసము, 'మొదలగునవి తమకు ఏమి యు బ్రయోజనము లేకున్నను స్వభావముగా కొన్ని కార్యములను ఆచ రించు చుండుటను చూచుచున్నాము. ఇట్లే పర బ్రహ్మముకూడ తనకు ఏమియు ప్రయోజనము లేకున్నను ప్రపంచమును సృజించుననిన విరో ధము ఏమికాదు.

ఇదియును"గాక సృష్టిలో ఎన్ని భేదములు కనబడుచున్నను కొం దఱు సుఖులుగాను మఱికొందఱు దుఃఖులుగా ఉన్నను, పరమేశ్వ రునకు విషమత్వము సిద్ధింపదు. జీవ పరమాత్మలకు కల్పిత భేదము కలదని ఇదివరకే చెప్పియున్నాముకదా. కర్మ అనాది కావున, అనాదికర్మను ఆశ్రయించి ఈశ్వరుడు బహు విధములగు విచిత్ర ఫల ములను ఇచ్చుచుండును. తప్పులు లేకుండినను, ఒకరిని శిక్షించుచు, మఱియొకరిని రక్షించుచును ఉండినకదా పక్షపాత మగును. గుణము లేకుండుటచేత పరమేశ్వరుడు పక్షపాతి కానేరడు. కర్మ లను ఆశ్రయించినంతమాత్రమున పరబ్రహ్మమునకు స్వతంత్రత్వము పోదు. అనేక సేవకులుగల ప్రభువు తన్ను ఏయే సేవకుడు ఎట్లెట్లు సేవించునో ఆయా సేవను బట్టి వారలకు ధనమును ఇచ్చును. ఇప్పు డు ఆరాజు జీతములను ఏర్పఱచు విషయములో సేవకులు చేసిన కర్మలను ఆధారముగా జేసికొనియే ఉన్నాడుకదా. ఇంతమాత్రము చేత ఆప్రభువుయొక్క ప్రభుత్వమునకు భంగము కలిగెనా ? కావున పరబ్రహ్మ విషయమునుకూడ ఇట్లే గ్రహింపవలయును. ఈవిధ ముగా ఎన్నియుక్తులతో విమర్శించి చూచినను పరబ్రహ్మము ఒక్కడే ప్రపంచమునకు ఉపాదాన నిమిత్త కారణములుగా ఉన్నాడనుటలో విరోధము ఏమియును లేడు.

సాంఖ్యయోగాది మతములలో వేద విరుద్ధములగు "అచేతనమగు ప్రధానమే జగత్తునకు ఉపాదాన కారణము. పరమేశ్వరుడు నిమిత్త కారణము. జీవుడు అణు స్వరూపుడు, లేక, శరీరమంత పరి మాణము గలవాడు, లేక, సర్వవ్యాపకుడైనను, ప్రతి శరీరమునం దును వేరువేరుగా ఉన్నాడు. పరబ్రహ్మమునకంటె వేరు” మొదలగు భాగములు తప్ప తక్కిన భాగములను అంగీకరింపవచ్చును. అందు ఉపదేశింపబడిన విధానములను అనుష్ఠింప వచ్చును. చార్వా కాది మతములను గొన్నిటిని ఆస్తికులగు వారు సంపూర్ణముగ బరిత్య జంప వలయును గాని ఆయా మతస్థులు మాత్రము తగినంత విశ్వాసము లేనిది పరుల బోధలచే బలాత్కారముగ విడువరాదు. ఏమతమును ఆశ్రయించియున్నను అండలి ధర్మములయందు మిక్కిలి శ్రద్ధాళువై యుండెనేని క్రమక్రమముగ తగినంత చిత్తశుద్ధిని జెంది వేదనిష్ఠను ఆశ్రయించి ముక్తుడగును. సందియము లేదు.. ప్రకృతము చేతనాచేతన రూపమగు ఈ సకల ప్రపంచముల కును పరబ్రహ్మమే ఉపాదాన కారణమని చెప్పబడి ఉండుట చేత అజ్ఞాన కల్పితములగు భేదములు ఎన్నియున్నను ప్రపంచ బ్రహ్మము నకు భేదము లేదు. మట్టి ఉపాదాన కారణముగాగల ఘటాదులలో గల్పిత భేదములు ఎన్ని యున్నను, అవి మట్టికంటె వేరుకావుగదా. ఇదియునుగాక బ్రహ్మవివర్తమే ప్రపంచమని చెప్పుట చేత రజ్జుసర్పము.. లకు పరస్పర భేదము లేనట్లు ప్రపంచ బ్రహ్మలకు బొత్తిగనే భేదము కలుగనేరదు. ఇట్లగుటచేత చేతన ప్రపంచమని వ్యవహరింపబడు జీవునకును, బ్రహ్మమునకును, భేదములేదని మఱియొకమారు చెప్ప నక్కరలేదు గదా, ఎన్నిమతస్థులు ఎన్ని విధములుగా ఆక్షేపించినను, వేదాంత సిద్ధాంతమునకు లేక, వేదసిద్ధాంతమునకు అనగా బ్రహ్మమే జగత్తునకు కారణమను సిద్ధాంతమునకు ఏ విధమగు భంగమును రాలే దని ఇదివరకే తెలిసికొని ఉన్నారు. ఒక్కడు ఒక్క విధముగా యుక్తు లను జూపి సిద్ధాంతము జేసినా, మఱియొకడు మఱియొక విధముగా యుక్తులను జూపి దానిని ఖండించు చుండును. కావున 'వేదమును ఆశ్రయింపక కేవల యుక్తి సిద్ధములగు సిద్ధాంతములు ఎప్పటికిని స్థిరములు కానేరవు. గనుక వేదమును ఆధారముగా జేసికొని ఒనర్ప బడిన వేదాంత సిద్ధాంతమే ముముకువుల చేత ఆదరణీయమైనది. కర్మ ఫలములు నశ్వరములు. వానిని ఆశ్రయించిన ముక్తి దొరుకదు. కావున వివేకముకలిగి ఇహ, పర, భోగముల యందలి ఆశ వదలి మోక్షమును గూర్చి ప్రయత్నింప వలయును.

ఆ మోక్షము స్వభావసిద్ధమేకాని, స్వర్గాదులవలె కర్మల సహాయముచేత సంపాదింప వలసినది కాదు. పైన నిరూపించినట్లు గా జీవునికంటే వేరుకాదని చెప్పబడిన పరబ్రహ్మమే మోక్షము, ఇట్లు స్వస్వరూపమైయున్న మోక్షరూప శాశ్వత ఆనందమును విడచి బహు ప్రయాస సాధ్యములగు కర్మలచేత సంపాదింప తగిన క్షణిక మగు స్వర్గ సౌఖ్యము గోరుట ఎంత వెఱ్ఱితనము.

జీవుడు దుఃఖియనియు, సంసారియనియు, అతనికిని బ్రహ్మ మునకును భేదము కలదనియు తలచుట భ్రాంతి. అది యెట్లనిన;లోకములో ప్రతిపురుషుడును " నేను, నేను " అని వ్యవహరించు కొనుచున్నాడు, అచేతనము లగుటచేత శరీరముమొదలు బుద్ధివరకు గల పదార్థములు ఏవియును ఈ అహంశబ్దమునకు అర్థములు కానే రవు, చేతనస్వరూపుడును, సర్వసాక్షియునగు జీవుడే దానికి అర్థమ గును, జాగ్రత స్వప్నావస్థలయందు దోచు పదార్థములు నెల్లను ఈజీవుడే చూచు చున్నాడు. సుఖ దుఃఖాదులన్నియును ఆజీవునికే గోచరములు అగుచున్నవి. ఇట్లుండగ' జ్ఞానరూపుడై సాక్షియై (తమ్ము జూచువాడై) యుండు జీవుని సాక్ష్యమగు ( చూడబడునదియగు ) దుఃఖము ఎట్లు ఆశ్రయింప గలదు, చూచువానికంట చూడబడు నది అవశ్యము వేరై యుండవలయును గదా, కావున " సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ ( పరబ్రహ్మము సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు అనగా సర్వసాక్షి, నాశరహితుడు ) అను మొదలగు శ్రుతుల యందు వర్ణింపబడియున్న బ్రహ్మమునకంటె ఈతడు వేరు కానేరదు. సాక్షి గానుండుట, జ్ఞానరూపుడైయుండుట, సుఖదుఃఖాలతో సంబంధ పడకుండుట, అను ధర్మములు సమానముగా నున్నప్పుడు వస్తువునకు మాత్రము భేదము కలదని ఏల చెప్పవలయును? ఎట్లు చెప్పవచ్చును? అది సర్వప్రమాణములకును విరుద్ధమగును కదా, కావున జీవ బ్రహ్మ లు ఒక్కటి యనుటయే (ఇదియే స్వరూపలక్షణము, అపవాదము, అనగా, ప్రపంచమును నిరాకరించుట ) వేదాభిప్రాయము, కొన్ని స్థలములయందు శిష్యులకు సుఖబోధ చేయుటకై వారికిగల భేదజ్ఞాన మును అవలంబించి భేదమును బోధించిరేగాని అవియే పరమార్థ మను ఉద్దేశముతో గాదు. అట్లే యైనచో అభేద శ్రుతులు అప్రమాణ ములు కావలసి వచ్చును. సంపూర్ణముగ వేదమును అధ్యయనము చేయవలయునని చెప్పుట చేత ఇది ( కొంతభాగము అప్రమాణముగు ననుట ) యసంభవము కదా, కావున భేదజ్ఞాన ( అజ్ఞాన) మున్నం తకాలము ఘటాకాశ మహాకాశమునకువలె జీవబ్రహ్మలకు భేదము తోచుచున్నదేకాని, వేఱేమియు లేదు.

బ్రహ్మయందు అభిన్నముగానున్నదని చెప్పబడిన ప్రకృతియే పరబ్రహ్మమును ప్రపంచముగా దోచునట్లు చేసినది, కావున నదియే వుని యుపాధి ప్రకృతి యన్నను అజ్ఞానమన్నను ఒక్కటియే. కా వున జ్ఞానముచేత ఆయుపాధి నశించిన జీవుడు స్వస్వరూపమున జేరు ను, చేరుననుట యేల? తెలిసికొనలేక పోవుట ఒక్కటియేగాని, ఎప్ప టికిని జీవుడు పరబ్రహ్మముగానే యున్నాడుకదా. త్రాటియందు భ్రాంతిచేత తోచినపాము ఆత్రాటికంటె వేరుకానట్లు చేతనాచేత నాత్మకమగు ఈ ప్రపంచమంతయును బ్రహ్మవివర్త మగుటచేత యధా ర్థస్థితిలో ఆబ్రహ్మమునకంటె వేరైయుండుటకే వీలు లేదు కదా.

కావున తగిన అధికారముగలవాడు వేదాంతములు ( ఉపని షత్తులు ) జీవబ్రహ్మైక్యమును బోధించునని ఎఱిగి చక్కగ సమన్వ యించి జ్ఞానమును సంపాదించి సర్వానర్ధ కారణమగు అవిద్యను తొ లగించి మోక్షమును జెందవలయును, మోక్షమును జెందుటకు జ్ఞానమునకంటె వేఱొక సాధనము లేదు, వేదభాగములుగు ఉపనిషత్తులను విచారము చేయవలసి యుండుట చేత వేదాధికారములేని శూద్రునికి ఇందు అధికారము లేదు. వాడు జ్ఞానసాధనములగు భక్తియోగాదు లో ప్రవర్తించి చిత్తశుద్ధిని అభివృద్ధి చేసికొనవలయును, ముము క్షువగువానికి జన్మాంతరమునందైనను ముక్తి దొఱకక మానదు. తగిన అధికారము గలిగి ముక్తిని చెందినవాడు మరల జన్మింపడు.

పైన వర్ణింపబడిన అపరోక్షజ్ఞానము కలిగినవారు సహితము దానిని దృఢము చేసికొనుటకై పలుమాఱు అహంబ్రహ్మస్మి అని ధ్యానము చేయుచుండవలయును. కావున తగినంత అధికారము' ఉండియు ఏదియో యొక ప్రతిబంధవశమున అపరోక్షజ్ఞానము కలు గనివారు పరబ్రహ్మమును ధ్యానించుట ముఖ్యమని వేఱుగా జెప్ప నక్కరలేదుకదా, పరబ్రహ్మమును ధ్యానింపవలయుననిన ఆయన నిర్గుణుడు, స్వస్వరూపమునకంటె అభిన్నుడు, కావున ఆయనను ధ్యానము చేయుట అసంభవము, ఐనను సద్గురూపదేశమువలన పర బ్రహ్మతత్త్వమును ఎఱిగినవాడు ఆయనను ఏదియో యొక ఆలంబ నముతో ( ఉపాధితో ) గూర్చి ధ్యానించినను లోపములేదు. తన కును ఆయనకును భేదము కలదని వాడు ఎప్పటికిని తలంపడు కదా. ఈ అభిప్రాయముచేత నే సగుణోపాసన అనబడు విష్వాది పూజల యందు గూడ "హృదయేచ విసర్జయేత్" తన హృదయమునందు దేవతను విగ్రహము పై ఆవాహనము జేసి పూజించి మఱల హృ దయములోనికి ఉద్వాసన చేయవలయును అని శాస్త్రమునందు చెప్పబడియున్నది. {' అధయో౽న్యాం దేవతా ముపాసతే౽న్యో సావన్యో౽ హమస్మీతినసవేదనపశుః ) ఎవడు తాను వేఱు దేవత వేఱు అను అభిప్రాయముతో ఉపాసన జేయునో వాడు పశువుతో సమా నుడు " అను మొదలగుశ్రుతులుకూడ ఈవిషయమునే నొక్కి చెప్పు చున్నవి. కావున సగుణ నిర్గుణోపాసకులను రెండు తెఱగులవారును అభిప్రాయము సమానమైనచో సమానులే అగుదురు. ఆలంబనమును గ్రహింపవలయుననిన పిమ్మట దేహాలంబనమైనను బుద్ధ్యాది రూప ఆలంబనమైనను ఒక్కటియే కదా.

శ్రద్ధాళువులైన ఉపాసకులు తమ జీవిత కాలమునందు అప రోక్ష జ్ఞానమును జెందకపోయినను అర్చిరాది మార్గమును అవలం బించి బ్రహ్మలోకమును జేరి కల్పాంతమువఱకును అచటనుండి అప రోక్ష జ్ఞానవంతులై ఆచతుర్ముఖునితోకూడ ముక్తిని చెందుదురు. హృదయమునందున్న నూఱునాడులలో ప్రధానమైయున్న బ్రహ్మ నాడీమూలమున ఆజీవులు నిర్గమింతురు. పిమ్మట వారిని అగ్ని తనలో, కమునకు గొనిపోయి అచ్చటనుండి జ్యోతిర్లోకమునందు చేర్చును. అచ్చటినుండి క్రమముగ ఆయా లోకాధిపతులచేత గొనిపోబడుచు ఉత్తరాయణాభిమాని దేవతయొక్క లేక చంద్రునియొక్క లోకమున ఆయుపాసకుడు జేరును, బ్రహ్మలోకమునుండి ఒక సిద్ధపురుషుడు వచ్చి అచ్చటనుండువారిని తనలోకమునకు గొనిపోవును. ఇట్లు ఉపాసకులు బ్రహ్మలోకమును జీరి క్రమముగ ముక్తులగుదురు. ఇదియే క్రమ ముక్తి అనబడును.

ఇట్టి ఉపాసనను ఆశ్రయింపక కర్మలను ఆచరించు వారికి ముక్తిలేదు. వారు ( కర్మలను ఆచరించునట్టి జీవులు ) ఏదియో ఒక నాడిద్వారా నిర్గమింతురు. అట్లు నిర్ణమించి ధూమలోకమునుండి రాత్రిలోకమునకును అచటినుండి కృష్ణపక్ష లోకమునకును పిమ్మట దక్షిణాయన లోకమునకును పోయి అచటినుండి చంద్రలోకమునకు బోయి కర్మఫలమును అనుభవించి మఱల భూలోకమునకు వత్తురు. అట్లు వచ్చునపుడు 'మొదట ద్యులోకమునందు ( ధూమలోకము మొ దలు దక్షిణాయన లోకమువఱకు గల లోకములయందు) ను అచ్చ టినుండి చంద్రలోకమునందును మేఘములయందును భూమియం దును ఓషధులయందును పురుషునియందును. స్త్రీయందును క్రమ ముగ నిలచి జన్మింతురు. కొన్ని జీవులు ద్యులోకాదులగు నీ సర్వస్థల ములయందును ఉండక గొన్నిటియందు మాత్రమే నిలచుటగూడ కల దు. అశుభకర్మలను ఆచరించువారలకు ఈ అవస్థయే లేదు. పుట్టుట చచ్చుట, అనునవియే వారిపని, జీవులందఱిని సామాన్యముగ స్థూల శరీర నిర్మాణ సాధనములగు పంచీకృత భూతములతోడనే కొనిపోవు దురు. అవి బ్రహ్మజ్ఞానికిని ఉపాసకునకును విదేహముక్తిపర్యంతము నిలచియుండును. కర్మఠునికి బ్రహ్మజ్ఞానము కలుగువంతవఱకును ఉండ వలసినదియే కావున ప్రతిజన్మమునందును అనువర్తించి వచ్చుచుం డును.

కావున వివేకియగువాడు భేదబుద్ధివలన గలుగు కష్టములను ఎఱిగి ఐహిక ఆముష్మిక సుఖములయందు విరక్తుడై సద్గురువును ఆశ్రయించి తత్ప్రసాదమువలన జీవన్ముక్తిని సాధింప బ్రయత్నింప వలయును. జీవన్ముక్తి అనగా స్వస్వరూపమును దెలిసికొనుటయే. కావున కష్టసాధ్యము కాదు. తన్ను దాను తెలిసికొనుట ఏమికష్టము. కావున ఈ అభిప్రాయమును ఎఱిగి వివేకదృష్టిగలిగి శాశ్వతముగ పరమానంద సుఖమును అనుభవింతురుగాత. జన్మాంతర సుకృతవిశే షము చేత దేవజన్మము గలుగును. స్వర్గలోకమునందు పుణ్యానుభవ సుఖమే అధికముగానుండును. అట్లు సుఖము అధికముగా నుండుట వలన భగవంతుని ధ్యానించుట సంభవింపదు. " క్షీణే పుణ్యే మర్త్య లోకం విశంతి " అను శాస్త్రప్రకారము పుణ్యానుభవము ముగిసి నవెంటనే మఱల మనుష్యజన్మమే ఎత్తవలసియున్నది. జన్మము గలి గెనేని మరణము సిద్ధముగనున్నది. కావున పుట్టుచు సుఖదుఃఖము లను అనుభవించుచు చచ్చుచు నుండవలసి యున్నది.

పాపకార్యములను చేయువారు పశుపక్ష్యాది తిర్యగ్జన్మము లను ఎత్తుచున్నారు, అతిర్యగ్దన్మములలో పుణ్యకార్యములను జేసి మంచిగతిని చెందుటకు జ్ఞానము ఉండదు. కాబట్టి మనుష్యుడు ఈమ నుష్యజన్మములో సద్గతినిబొందుటకు అధికముగ బ్రయత్నమును జేయ కలయును. ఈ మనుష్య జన్మమును వ్యర్థము జేసి కష్టించి సంపాదించి ద్రవ్యమును దంభాహంకార యుక్తులై లోక సుఖములు కొఱకును, శరీరమును అలంకరించుకొనుట కొఱకును, సెలవుచేసి వ్యర్థ పరు పగూడదు, మనుష్యజన్మమును బోగొట్టుకొనిన ఇక మనకు ఏజన్మ ము గలుగునో అనుభయము గలిగి ద్రవ్యమును నిష్కాముడై భగవ దర్పణముగా ధర్మకార్యములయందు వినియోగింపవలయును. పిమ్మట అజ్ఞానము వదలి చిత్తశుద్ధి కలుగును. చిత్తశుద్ధి కలిగినతోడనే సద్గు గురువును ఆశ్రయించి బ్రహ్మసూత్రములు, జ్ఞాననాశిష్ఠము, పంచదశీ ప్రక రణము, భగవద్గీతలు) మొదలగు వేదాంత గ్రంథములను జదివి బ్రహ్మతత్వమును దెలిసికొనవలయును. అట్లు పరమాత్మ తత్వమును తెలిసికొని సర్వేశ్వరుడును, సర్వవ్యాపకుడును, సర్వాధారుడును, స్వప్రకాశుడును, సర్వపరిపూర్ణుడును, నిర్మలుడును సర్వకాలముల మందును, ఏకరూపముతో నుండువాడును, సచ్చిదానంద స్వరూపు డునునగు పరబ్రహ్మను స్వానుభవముచేత ఎఱుగ వలయును. బ్రహ్మైవేద బ్రహ్మైవ భవతి " అను వేదవాక్యప్రకారము బ్రహ్మ మును ఎఱిగినజ్ఞాని బ్రహ్మమే అగును. బ్రహ్మజ్ఞానము గలవానికి సకలపాపములు నశించును, జన్మ, జరా, మరణ, దుఃఖములు కలుగ వు. పునర్జన్మ రహితమగు మోక్షము గలుగును. ఉభేవిద్యాన్ పుణ్యపాపే విధూయ నిరంజనః పరమం సామ్యముపైతి " బ్రహ్మ వేత్త పుణ్యపాపములను రెంటిని దులిపివేసి నిరంజనుడై పరబ్రహ్మ తో ఐక్యమగును) " జ్ఞానీత్వాత్మైవ మేమతమ్ " బ్రహ్మజ్ఞానముగల ఙ్ఞానినేనే అతడు. అతడే నేను, అని భగవంతుడగు శ్రీకృష్ణమూర్తి ఆనతిచ్చెను. కావున మానవుడు బ్రహ్మజ్ఞాని అగుటకు బ్రయత్నిం చుట మిక్కిలి శ్రేయస్కరము,

ఓం త త్సత్ .

______________

శ్రీరస్తు.

అష్టాంగయోగములు.

1 యమము, 2 నియమము, 3 ఆసనము, 4 ప్రాణాయామ ము, 5 ప్రత్యాహారము, 6 ధారణము, 7 ధ్యానము, 8 సమాధీ, ఈయెనిమిది అష్టాంగ యోగములని చెప్పబడును.

(1) యమము. యమములు పదివిధములు, శ్లో!! అహింసా సత్యమస్తేయం బ్రహ్మచర్యం దయార్జవమ్ | క్షమా ధృతి ర్మితాహా రఃశౌచం చైవ యమాదశ॥ అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మ చర్యము, దయ, అర్జవము, క్షమ, ధృతి, మితాహారము, శౌచము.

(1) అహింస, అనగా: శ్లో. కాయేన మనసా వాచా హింసాహింసా నచాన్యథా!! మనోవాక్కాయములచేత సమస్తభూత ములకును అనావశ్యకముగ అపకారమును గాని, హానినిగాని, కలుగజే యకుండుట, సూ: తత్సన్నిధౌ వైరత్యాగః - ఈఅహింసను ఆచరించుట వలన క్రూర జంతువులు తమ స్వభావమగు వైరమును విడిచియుండును.

[ 2 ] సత్యము, అనగా:- శ్లో॥ చతురా దింద్రియైర్దృష్టం శ్రుతం ఘాతం మునేశ్వర | తస్యైవోక్తిర్భవేత్సత్యమ్ ॥ తాను చూచిన, వినిన, ఆఘ్రాణించిన, విషయమును ఉన్నవి ఉన్నట్లు తెలు పుట, సూ. సత్యప్రతిష్ఠాయాం క్రియాఫలాశ్రయత్వమ్ ఈ సత్యమును ఆచరించుటవలన యాగాదికర్మలు చేసినవారికి గలుగు ఫలము కలుగును.

[3] అస్తేయము, అనగా:- శ్లో ॥ అన్యదీయే తృణేరత్నే కాంచనే మౌక్తి కేపిచ ! మనసా వినివృత్తిర్యా తదస్తేయం విదుర్భు ధాః ॥ మనో వాక్కాయములచేత ఇతరుల ద్రవ్యమును తృణముగా భావించి నిస్పృహ కలిగియుండుట, సూ॥ అస్తేయ ప్రతిష్ఠాయాంసర్వ రత్నోపస్థానమ్ ) ఈ అస్తేయమును ఆచరించుటవలన లోకముల యందలి ఉత్తమవస్తుప్రాప్తి తనంతట ప్రాప్తించును.

[ 4 j బ్రహ్మచర్యము అనగా: శ్లో ॥ కాయేన మనసా వాచా స్త్రీణాంచ పరివర్జనమ్ | ఋతౌ భార్యాం తదాతస్య బ్రహ్మ చర్యం తదుచ్యతే ॥ పరస్త్రీలను విషయాసక్తితో దలంపకుండుట; ఋతుకాలములయందు స్వభార్యతో సంభోగించుట, తక్కిన కాల ములయందు నిషిద్ధము. గురువుల వద్ద బ్రహ్మ విచారణ చేయుట. సూ॥ బ్రహ్మచర్య ప్రతిష్ఠాయాం వీర్యలాభః - ఈ బ్రహ్మచర్యమును ఆచరించుటవలన శరీరేంద్రియ మనస్సులయందు సర్వకార్యకరణ సా మర్థ్యము గలుగును. నిషిద్ధమగు స్త్రీ సంభోగము చేయకుండుటయే శ్రేష్ఠమైన బ్రహ్మచర్యము.

[ 5 } దయ అనగా: సకల భూతములయందును కరుణ కలిగియుండుట.

[ 6 ] ఆర్జవము అనగా: విహితము, అవిహితములైనవా రలయందు ప్రవృత్తి నివృత్తులలో ఒకేవిధముగ నడుచుకొనుట,

[ 7 ] క్షమ. అనగా :- తన్ను బొగడెడి వారలయందును, నిందించువారలయందును, ప్రియాప్రియ వస్తువులయందును, మనో వికారము జెండకుండుట,

[ 8 ] ధృతి, అనగా :— తనకళత్ర, పుత్ర, మిత్రాదులకు వియోగము గలిగినప్పుడును, ద్రవ్యమునష్టమైనకాలమందును, దుఃఖిం చక మనోధైర్యము గలిగియుండుట.

[ 9 ) మితాహారము. అనగా: ఉప్పు, పులుసు, కారమును వర్జించి తైలసంబంధమైన మధుర రసములతో గూడిన పదార్థములను మితముగ భుజించుట,

[ 10 ] శౌచము. అనగా:- బాహ్యశౌచము, అంతశ్శౌచ ము, అని రెండువిధములు, శరీరమాలిన్యమును మృత్తిక చేతను, జలము చేతను, శుద్ధివఱచుకోనుట బాహ్య శౌచము. సద్గురువును ఆశ్రయించి వేదాంతవిద్యను అభ్యసించి ఇంద్రియ నిగ్రహము గలిగియుండుట అంతశ్శౌచము. సూ॥ శౌచాత్స్వాంగజుగుప్సాపరైరసంసర్గః | సత్వ శుధ్ధిసౌమనస్యైకాగ్రతేంద్రియ జయాత్మదర్శన యోగ్యత్వానిచ అంతర్భాహ్యశౌచములను ఆచరించుటవలన శరీరకారణమగు శుక్లశో ణితాదులను ఆలోచించును. పిమ్మట శరీరమునందు అసహ్యముగలిగి ఇతర జనసంగమును అపేక్షింపడు, అనంతరము సత్వబుద్ధితో ఏకా గ్రచిత్తముగలిగి ఆత్మస్వరూపమును దర్శించుటకు శక్తుడగును.

కొన్ని గ్రంథములలో ఈయమములు - అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, అని అయిదువిధము లని చెప్పియున్నవి, అపరిగ్రహము అనగా: భోగసాధన పదార్ధము లను స్వీకరింపకుండుట ఈ అపరిగ్రహమును ఆచరించుటవలన పూ ర్వజన్మ స్మరణమును, ఇపుడు ఈజన్మకలుగుటకు కారణమును తెలిసి కొనవచ్చును

( 2 ) నియమము. నియమములు పదివిధములు, శ్లో॥ తపస్సం తోషమా స్తిక్యం దానమీశ్వర పూజనమ్ ! సిద్ధాంతశ్రవణంచైవ హ్రీర్మతిశ్చజపోవ్రతమ్ ॥ ఏతేచనియమాః ప్రోక్తా యోగశాస్త్ర విశారదై: 8 1 తపస్సు, 2 సంతోషము, 8 ఆస్తిక్యము, 4 దానము 5. ఈశ్వర పూజనము, 6. సిద్ధాంతశ్రవణము, 7 హ్రీ , 8 మతి, 9 జప ము, 10 వ్రతము.

(1) తపస్సు. అనగా :-సూ॥ కాయేంద్రియ శుద్ధి రశుద్ధిక్ష యాత్తపస:. కృచ్ఛ్రచాంద్రాయణాది తపస్సులచేత శరీరమును గృ శింపజేయుట, తపస్సును ఆచరించుట చేత చిత్తముయొక్క అపవిత్రత నశించి దేహేంద్రియములు ఉత్కర్షతను బొంది సూక్ష్మవస్తుగ్రహణ సామర్థ్యము గలుగును.

[ 2 ] సంతోషము. అనగా: - సూ॥ సంతోషా దనుత్తమ సుఖలాభ: పేరాశపడక తనకు గలిగినదానితో తృప్తినొంది లేని దానికి దుఃఖింపకుండుట. సంతోషమును ఆచరించుట చేత ఏ సుఖము నకు విషయసుఖములు శతాంశముగానైన పోల్చదగవో అట్టి మహా సుఖము ఆవిర్భవించును. [ 3 ] ఆస్తిక్యము. అనగా: - వేదములయందు విధింపబడి యుండు ధర్మాధర్మములయందు విశ్వాసము గలిగియుండుట,

[ 4 ] దానము. అనగా ః -- న్యాయముగా దాను ఆర్జించిన ద్రవ్యమును పుణ్యకాలములయందుగాని, ఇతర కాలములయందుగాని, ప్రత్యుపకారమును అపేక్షింపక బీదలు మొదలగు వారలకు భగవద ర్పణముగా నిచ్చుట.

[ 5 | ఈశ్వరపూజనము. అనగా: సూ. సమాధిసిద్ధి రీశ్వర ప్రణిధానాత్. నిష్కళంకమగు మనస్సుతో దృఢముగ భగవంతుని పూజించుట, విష్ణుమూర్తినైనను, ఈశ్వరునినైనను, పూజించుటవలన సకలవిఘ్నములు నశించి సమాధీసిద్ధి కలుగును,

[ 6 ] సిద్ధాంతశ్రవణము, అనగా:- బ్రహ్మసూత్రములు, జ్ఞానవాశిష్ఠము, భగవద్గీతలు మొదలగు వేదాంత గ్రంథములను శ్రవ ణము జేయుట.

[ 7 ] హ్రీ అనగా: — వేదములలో జెప్పియుండు కర్మలకు విరుద్ధముగా తమకుదోచినదంతయు యుక్తమే అని చేయు కార్యముల యందు లజ్జ కలిగియుండుట.

[ 8 ] మతి, అనగా:—వేదములలో జెప్పియుండు కర్మలను శ్రద్ధతో జేయుట.

[ 9 ) జపము, అనగా : వేద విరుద్దములు కాని గాయత్రీమొ దలగు మంత్రములను సద్గురువుల చేత ఉపదేశమును బొంది జపించుట, జపమువాచికము, మానసికము, అని రెండువిధములు, మంత్రములను గట్టిగా ఇతరులు వినునట్లు ఉచ్చరించుటవలన ఫలము స్వల్పము. తిన్న గా ఉచ్చరించుట పదానికన్న వెయ్యింతలు అధికఫలము, నోటియం దే ఉచ్చరించుట పైరెంటికన్న మిక్కిలి ఫలము, మనస్సులోనే జపిం చుట ధ్యానసాధనము కావున అన్నింటికన్న మిక్కిలి శ్రేష్ఠము.

[ 10 ] వ్రతము. అనగా: వేదములలో విధింపబడియుండు కర్మానుష్ఠానములయందు నియమము గలిగియుండుట.

( 3 ) ఆసనము. అనగా :- మయూరాసనము, సింహాసనము, గోముఖాసనము, పద్మాసనము, అని ఆసనములు 84. వీటిని గురుముఖముగా దెలిసికొన వలయును. " ఆససేన రజోహంతి " ఆసనములు అభ్యసించుటవలన రాజసగుణము నశించుట, అనేకరో గములు నశించుట, మొదలగునవి కలుగును.

( 4 ) ప్రాణాయామము. అనగా:- ఉచ్ఛ్వాస నిశ్వాసము లయొక్క గమనాగమనముల నిరోధము చేయుటయే ప్రాణాయామ మనబడును. ఎడమముక్కు బిలము ద్వారా పదునారుమారులు ““ఓమ్” అను ప్రణవమును ఉచ్చరించుచు శ్వాసమును బీల్చవలయును. ఇదియే పూరకము, పిమ్మట అరువది నాలుగుమారులు " ఓమ్ " అను ప్రణ వమును ఉచ్చరించుచు అంతవరకును శ్వాసమును లోపలనే నిలపవ లయును, ఇదియే కుంభకము. తుదకు కుడి ముక్కు. బిలముద్వారా ముప్పది రెండుమారులు . ఓమ్ " అను ప్రణవమును ఉచ్చరించుచు శ్వాసము 'మెల్లగా విడువవలయును. ఇజయే రేచకము. ఇట్లు పూ రక కుంభక రేచకములను జేయుట ప్రాణాయామ మనబడును. " ప్రాణాపాన సమాయోగః ప్రాణాయామో భవతి " ప్రాణనా యువును అపానవాయువుతో గలుపుటే ప్రాణాయామ మనబడును. కావున ప్రాణాయామము గురు ముఖముగా తెలిసికొని అభ్యసించు వారలకు సర్వరోగములు నశించును. అయుక్తముగా అభ్యసించు వారలకు సకలరోగములు కలుగును.

(5) ప్రత్యాహారము, అనగా: సూ॥ విషయేషు విచరి తా మింద్రియాణాం బలాదాహరణమ్. విషయములయందు సంచ రించెడి ఇంద్రియములను బలాత్కారముగ మరలించి సద్విషయము లయందు ప్రవేశపెట్టుట, అన్నిటిని భగవత్స్వరూపముగ జూచుట, నిష్కామముగ కర్మలను జేయుట, సూ. తతః పరమావశ్యతేంద్రియా ణామ్. ప్రత్యాహరమును ఆచరించుటవలన మనోవికారము లన్నియు అణగిపోవును, కర్మేంద్రియ జ్ఞానేంద్రియములన్నియు తనకు మిక్కిలి స్వాధీనములై యుండును.

( 6 ) ధారణ అనగా: సూ॥ ఆత్మని మనోధారణమ్. మనస్సుయందు పరమాత్మను ( భగవంతుని ) ధ్యానించుట. మందలి ఆకాశమునందు ( దహరాకాశమునందు ) మహాకాశమును ( బాహ్యకాశమును ) భావించుట. సూ॥ ధారణాభి ర్మనో ధైర్యమ్ | ధారణకు ఆచరించుటవలన మనోధైర్యము గలుగును.

( 7 ) ధ్యానము. అనగా:- సగుణ ధ్యానము, నిర్గుణ ధ్యాన ము, అని రెండువిధముల సగుణ ధ్యానమనగా మూర్తి ధ్యానము. నిర్గుణధ్యానమనగా ఆత్మతో మనస్సును యాధాత్మ్యమును బొందజే యుట. ధ్యానమును ఆచరించుటవలన, సూ॥ ధ్యానం చైతన్యమద్భు తమ్॥ స్వప్రకాశము గలుగును .

( 8 ) సమాధి. అనగా:- శ్లో॥ నశ్రుణోతి యధాకించిత్ నపశ్యతి సజిఘ్రతి | నచస్పర్శవిజానాతి ససమాధిస్థ ఉచ్యతే॥ బాహ్య వార్తలను వినకుండుట, బాహ్యసంగతులకు జూడకుండుట, బాహ్య పదార్థ వాసన పట్టకుండుట, బాహ్యవస్తువులు స్పృశింపకుండుట, ఏమి యు నెఱుగకుండుట, సమాధియని చెప్పబడును. ఇట్లు మనస్సును వశపఱచుకొనిన పిమ్మట, సూ॥ జీవాత్మ పరమాత్మైక్యావస్థా త్రిపుటిరహితా పరమానంద స్వరూపా శుద్ధ చైతన్యాత్మికా భవతి. జీవాత్మ పరమాత్మలయొక్క ఐక్యమును బొంది మనస్సు జ్ఞాతృ, జ్ఞాన జ్ఞేయము లను త్రిపుటిరహితమై పరమానంద స్వరూపమైన నిత్య, బుద్ధ, శుద్ధ, ముక్త, సత్య, సచ్చిదానంద చైతన్యాత్మకమగుట సమాధియని చెప్పబడును.

శ్లో॥ సమాధౌమోక్షమాప్నోతి త్యక్త్వాకర్మ శుభాశుభమ్| శుభాశుభ కర్మలయందు ఇచ్ఛనువదలి సమాధియందుండిన మోక్షము గలుగును .

ఓం త త్స త్.

సమాప్తము.

శ్రీరస్తు.

రాజయోగాధ్యాయము.

రాజయోగ అష్టాంగయోగముల వివరము:--1 యమము, 2 నియమము, 3 ఆసనము, 4 ప్రాణాయామము, 5 ప్రత్యాహార ము, 6 ధారణము, ధ్యానము. 8 సమాధి,

( 1 ) యమమనగా:—శ్లో॥ సర్వంబ్రహ్మేతి విజ్ఞాన దింద్రి యగ్రామ సంయమః | యమోయమితి సంప్రోక్తో౽భ్యసనీయో ముహుర్మహుః

తా ॥ సర్వమును భగవంతునియొక్క ( బ్రహ్మయొక్క ) స్వరూపముగా తెలిసికొనుటవలన ఇంద్రియములను విషయములయం దుండి త్రిప్పి ఆత్మయందు నిలుపుటయే యమమని చెప్పబడును. దీనిని మోక్షమునందు అపేక్ష గలవారు మాటిమాటికి విషయముల లో ప్రవేశించు ఇంద్రియసమూహములను బ్రహ్మమునందు ( భగ వంతునియందు) నిలుపుట అగు అభ్యాసమును పదేపదే చేయవ లసినది.

( 2 ) నియమమనగా:శ్లో॥ సజాతీయ ప్రవాహశ్చ విజా తీయ తిరస్కృతిః | నియమోహిపరానందో నియమాత్క్రియతే బుధైః.

తా॥ ఆత్మకంటె (బ్రహ్మముకంటె) భిన్నముగా దోచు అవిద్య చేత గనబడు విజాతీయమైన సమస్తమును ఎడబాసి సజాతీయప్రవా హమునందే మనస్సును నియమించుట నియమమని చెప్పబడును.

( 3 ) ఆసనమనగా:- సుఖే నైవభవేద్యస్మిన్ నజస్రంబ్రహ్మ చింతనమ్ | ఆసనంతద్విజానీయాత్ నేతరత్సుఖనాశనమ్|

తా! భగవంతుని చింతన చేయుటకంటె ఇతరములైన ఎట్టివస్తు వులయందును మనస్సు సుఖమును బొందక ఎప్పుడు నిలిచిపోవునో అట్టి స్థితియే ఆసనమని చెప్పబడును, కాళ్ళను చేతులను ముడుచుకొని బంధించి శ్రమపడుట సుఖమైన ఆసనము కాదు. ( 4 ) ప్రాణాయామమనగా:- శ్లో॥ చిత్తాది సర్వభావేషు బ్రహ్మత్వేనైవభావనాత్ ! నిరోధస్సర్వవృత్తినాం ప్రాణాయామస్స ఉచ్యతే!

తా॥ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, అనెడి అంతః కరణమునందు బ్రహ్మమును ( భగవంతుని ) తప్ప వేఱే భావనయే లేకుండుటయు ఇతర భావనలును చిత్తమునకు బాహ్యవృత్తియు గలు గునప్పుడు వానిని చిత్తములోనుంచి తొలగించి బ్రహ్మ భావనయందు మనస్సును నిలుపుటయే ప్రాణాయామమని చెప్పబడును. మఱియును, రేచక, పూరక, కుంభకములనగా : - శ్లో॥ నిషేధనంప్రపంచస్య రేచ కాఖ్యస్సమీరణః | బ్రహ్మైవాస్మీతియావృత్తిః పూరకో వాయురీరి తః॥ తతః తద్వృత్తినైశ్చల్యం కుంభకః ప్రాణసంయమః. బ్రహ్మము నందు ( భగవంతునియందు ) మనస్సును చలింపక నిలుపుటకు సాధన మైన ప్రాణాయామమునందు చరాచర ప్రపంచముయొక్క తలంపు మనస్సునకురాకుండ తొలగించుటయే రేచకమని చెప్పబడును. అటు తొలగించిన పిమ్మట బ్రహ్మైవాస్మి అనెడు మనోవృత్తితో నుండు టయే పూరకమని చెప్పబడును. అట్లు బ్రహ్మైవాస్మి అనెడు చింతన ము ప్రబలమై మనస్సు ఆబ్రహ్మకారముగ నగుటయే కుంభకమని చెప్పబడును.

( 5 ) ప్రత్యాహారమనగా:—శ్లో॥ విషయేష్వాత్మతాందృ ష్ట్వామనసశ్చితి మజ్జనమ్ | ప్రత్యాహారస్సవిజ్ఞేయో౽భ్యసనీయో ముముక్షుభిః॥

తా॥ తాను ఏపదార్థమును చూచినను అది తనకు ఆత్మగా ( భగవంతునిగా ) చూచుటయును, మానావమానములు లేక ఆపర మాత్మయందే మనస్సును సమర్పించియుండుటయును అనునట్టి స్థితియే ప్రత్యాహారమని చెప్పబడును. దీనిని మోక్షాపేక్ష గలవారలు అవ శ్యముగా అభ్యసింపవలయును.

( 6 ) ధారణఅనగా: — శ్లో॥ యత్ర యత్రమనోయాతి। బ్రహ్మ ణస్తత్రదర్శనాత్ | మనసోధారణంచైవ ధారణాసా పరామతాః

తా॥ మనస్సు ఎచ్చటచ్చట నేను ఉన్నాను అని వచ్చునో, అచ్చటచ్చట అప్పుడప్పుడు అమనస్సును తొలగించి సమస్తమును బ్రహ్మ ముగాజూచు అభ్యాసమే ధారణయని చెప్పబడును. అట్లు అభ్యాస ముచేయుట చేత మనస్సు ధారణ అనే స్థితిని చెందును.

( 7 ) ధ్యానమనగా: - శ్లో ॥ బ్రహ్మైనాస్మీతి సద్వృత్త్యా నిరాలంబతయాస్థితిః | ధ్యానశబ్దేన విఖ్యాతా పరమానంద దాయినీ!

తా॥ మనస్సు ఎప్పుడు బ్రహ్మైవాస్మి అనెడు మనోవృత్తిచేత ఎడతెగక బ్రహ్మమునందునిలుచునో అప్పుడు అట్టి ఆనందమైనస్థితినే ధ్యానమని చెప్పబడును.

( 8 ) సమాధిఅనగా: = శ్లో॥ నిర్వికారతయావృత్త్యా బ్రహ్మా కారతయాపునః | వృత్తివిస్మరణం సమ్యక్ సమాధీ: జ్ఞానసంజ్ఞకః ॥

తా॥ మనస్సు నిర్వికల్పమై బ్రహ్మకారము గలది యగునో, ఎప్పుడుమనస్సు తన్ను దాను మఱచి బ్రహ్మమునందు లయించునో, అప్పుడు సమాధి అని చెప్పబడును.

శ్లో॥ జయతి జయతి దేవో దేవకీ నందనోయం
    జయతి జయతి కృష్ణోవృష్ణి వంశ ప్రదీపః |
    జయతి జయతి మేఘశ్యామల కోమలాంగో
    జయతి జయతి పృథ్వీ భారనాశో ముకుందః

ఇట్లు సంస్కృత ప్రాకృత వైకృతా ద్యనేకభాషా నిపుణు లగు బ్రహ్మశ్రీ వెన్నలకంటి - సుందర రామశర్మ గారిచే రచియింపబడిన బ్రహ్మసూత్ర రహస్యము - సమాప్తము.

ఓం త త్స త్

శ్రీకృష్ణార్పణమస్తు.

ఓమ్

శ్రీ పరబ్రహ్మణేనమః .

వేదాంత పంచరత్న మాలికా స్తోత్రమ్


వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం
తేనేశస్యవిధీయతా మసచితిః కామే మతి స్యజ్యతామ్ |
పాపౌఘః పరిధూయతాం భవసుఖీ దోషోను సంధీయతా
మాత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహా త్తూర్ణం వినిర్గమ్యతామ్ ॥ 1

సంగస్సత్సువిధీయతాం భగవతో భక్తిర్దృఢా ధీయతాం
శాంత్యాది: పరిచీయతాం దృఢతరం కర్మా సుసంత్యజ్యతామ్ |
సద్విద్యా నుపసర్పతాం ప్రతిదినం తత్పాదుకే సేవ్యతాం
బ్రహ్మైకాక్షర మర్ధ్యతాం శ్రుతిశిరో వాక్యం సమాకర్ణ్యతామ్ |2

వాక్యార్థశ్చ విచార్యతాం శ్రుతిశిరః పక్ష స్సమాశ్రీయతాం
దుస్తర్కాత్సువిరమ్యతాం శ్రుతిమత స్తర్కో౽నుసంధీయతామ్ |
బ్రహ్మైవాస్మి విభావ్యతా మహరహో గర్వ: పరిత్యజ్యతాం
దేహెూహం మతిరుజ్ఝతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతామ్ ॥ 3

క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం బిక్షౌషధం భుజ్యతాం
స్వాద్వన్నం నతుయాచ్యతాం విధివశాత్ప్రాప్తేన సంతుష్యతామ్ |
శీతోష్ణాది విషహ్యతాం నతు వృధావాక్యం సముచ్చార్యతా
మౌదాసీన్య మభీప్స్యతాం జనకృపా నైష్ఠుర్య ముత్సృజ్యతాం॥ 4

ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతస్సమాధీయతాం
పూర్ణాత్మాను సమీక్ష్యతాం జగదిదం తద్భాధితం దృశ్యతామ్ |
ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలా న్నాప్యుత్తరేశ్లిష్యతాం
ప్రారబ్ధం త్విహభుజ్యతా మథ పరబ్రహ్మాత్మనా స్థీయతామ్ | 5

యశ్లోక పంచకమిదం పఠతే మనుష్య
స్పంచితయ త్యనుదినం స్ధిరతా ముపేత్య |
తస్యాశు సంసృతి దవానల తీవ్రఘోర
తాపప్రశాంతి ముపయాతి చితిప్రసాదాత్ ॥6

ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య

శ్రీమచ్ఛంకరాచార్య విరచితం

వేదాంత పంచరత్నమాలికా స్తోత్రం సంపూర్ణమ్.