బెంజమిను ఫ్రాంక్లిను జీవితచరిత్రము/మొదటి ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

బెంజమిను ఫ్రాంక్లిను జీవన చరిత్రము

మొదటి ప్రకరణము

బాల్యదశ

అమెరికాదేశమునందు బ్రసిద్ధికెక్కిన కార్యనిర్వాహకుడును, దేశాభిమానియు, తత్వ-------- బెంజమిను ఫ్రాంక్లినుగారి జీవితచరిత్రమును ఇందు పొందుపఱచుచున్నారము. ఇంగ్లాండు 'నా---------- నందలి 'ఎక్టమ పట్టణమందు క్రీ. శ. 1655 - వ సంవత్సరమున, అతని తండ్రి, జోషయాఫ్రాంక్లిను జనన మొందెను. తన యౌవన కాలములో నితడు బట్టలకు రంగువేయు వ్యాపారము నవలంబించి, క్రమముగా దానియందే స్థిరపడి, 'ఆక్సుఫర్డ్ షియరు' (Oxford Shire) నందలి 'బాన్ బరి' (Bunbury) పట్టణములో నివసించి యుండగా, 21 - వ సంవత్సరమున ఇతని కాగ్రామముననే వివాహ మాయెను. ఈయన తమ్ముడు బెంజమిను ఆగ్రామము నందలి పాదిరియొక్క కుమార్తెను వివాహమాడెను. బాన్ బరి పట్టణమందె సంబంధము జేసికొని, అక్కడనే వ్యాపా రము జేయుచున్న యీయిరువురుసోదరులు, సోదరులకు సహజమగు వైరములేక, దేశకాలభేదములను గమనింపక, తమ యన్యోన్యాను రాగమును వృద్ధిపొందించు కొనుచు వచ్చిరి. బాన్ బరిపట్టణమందు జోషయాకు ముగ్గురు పిల్లలు గలిగిరి.

ఆకాలమం దింగ్లాండు దేశపు రాజు రెండవ ఛార్లెసు. ఈయన విషయాసక్తుడై రాష్ట్రమును బాడుచేసి, దాంభిక దైవజ్ఞులను జేరదీసి, నిష్కపటు లైన వారిని బారదోలుచు వచ్చెను. జోషయా ఫ్రాంక్లిను, వీరి సోదరుడు బెంజమిన్, - వీరి కుటుంబములో వీరిరువురే యని తోచుచున్నది. - పారదోలబడిన పాదరీల పక్షము నవలంబించి, దైవజ్ఞుల సమాజములకు (Conventicles) వెళ్లుచు వచ్చిరి. ఈ సమాజములు నిషేధింపబడినవి యైనందున, ఎప్పుడును స్వాస్ధ్యము లేనివియై యుండె. ఎవరి కృపాకటాక్షము వర్తకునికి శ్రేయస్కరమో యట్టివారి యాగ్రహ మీ సమాజములకు వెళ్లువారియందు బ్రసరించుచుండెను. 1685 సం. రపు ప్రాంతమున జోషయా ఫ్రాంక్లిను, తన సోదరుడు బెంజమినుకును నింగ్లాండునకును స్వస్తి జెప్పి భార్యను మువ్వురు పిల్లలను దీసికొని, తన యిరుగుపొరుగువారును, సమాజమువారును వెంబడిరాగా, బోస్టను పట్టణమునకు గాపుర మెత్తివేసెను. 36-సంవత్సరములకు బూర్వము కట్టబడి, అప్పటికి అయిదాఱు వేల ప్రజాసంఖ్య గల 'బోస్టను' పట్టణము బ్రవేశించి, రంగు లద్దువ్యాపారమునకు దగిన ప్రోత్సాహము లేనందున, 'జోషయాఫ్రాంక్లిను' క్రొవ్వు కఱగించి, సబ్బు తయారుచేయు వ్యాపారమునందు బ్రవేశించెను.

బోస్టనుపట్టణమునం దిటుల తన శాయశక్తుల వ్యాపారమును నడిపించుచు, నాలుగు డబ్బు లితడు సేకరించెను. ఇతని కుటుంబము సయితము నానాటికి వృద్ధిబొందెను. 1685 సంవత్సరం ఆగస్టు తే-23 దిని, ఇతనికొక కుమారుడు గలిగెను. వానికి జోషయా యని నామకరణ మొనర్చిరి. సముద్ర మార్గమున పారిపోయి, చాలకాలము వఱకు దన క్షేమసమాచారముల దెలియ జేయనందున వీరు తల్లి దండ్రులకు దు:ఖము గలుగజేసినవా డయ్యెను. ఇతనిపోలిక ననుసరించి యితని కనిష్ఠభ్రాత, బెంజమిను అనువాడు గూడ నటులనే చేసెను. 1687 సంవత్సరము జనవరి 5 తేదిని, జోషయా ఫ్రాంక్లినునకు 'ఆని' యనుకూతురు పుట్టెను. 1688 సంవత్సరము ఫిబ్రవరి 6 తేదిని జోసెఫనువాడు పుట్టి, శైశవదశయందే స్వర్గస్థుడాయెను. తరువాత 1689 సంవత్సరము జూన్ 30 తేదిని మఱియొక జోసెఫను కుమారుడు గలిగెను. ఏడుగురు బిడ్డలనుకని తనకు 35 సంవత్సరముల వయస్సున, జోషయా ఫ్రాంక్లిను గారి భార్య స్వర్గస్థురాలాయెను. అప్పటికి పెద్దవాడు 16 సంవత్సరముల ప్రాయమువాడు - చేతివాడు నెలలకందువ - కడమవారులే బ్రాయపువారలు - వీరలను బెంచి పెద్దవారిని జేయుభారము తండ్రిపై బడెను. ఇట్టి యవస్థలో మఱియొక యాధారము లేనివాడై, తాను చెమట నూడ్చి కష్టార్జితముగ సంసారము గడపవలసినందున, తన పిల్లల సంరక్షాణార్థమై, అతడు తిరుగ వివాహ మాడవలసి వచ్చెను. సంవత్సరము వెళ్లుపర్యంత మాపుచేయవలసిన యాచార మున్నను, నట్లు చేయక, వెంటనే అతడు ద్వితీయ కళత్రమును స్వీకరించెను. ఈ కళత్రమునకు గలిగిన ప్రధమసంతానమునకును ప్రధమకళత్రమునకు గలిగిన కడపటి సంతానమునకును పదునెనిమిది మాసములే వ్యత్యాసము. 'నాన్టుకెటు' దీవిలో బ్రధమవాసులలో నొకడైన 'పీటరుపోల్‌జరు' గారి చిన్నకూతురు 'ఆబయా' యను నామెయే ఈ రెండవభార్య. ఈమెను వివాహ మాడుసరికి నీమె 22 సంవత్సరముల ప్రాయముగలది.

'పీటరుపోల్‌జరు' విషయమైమనము చెప్పవలసినదెమనగా, బెంజమిను ఫ్రాంక్లినున కీయనతగిన మాతామహుడు; 'లెస్సగ చదువుకొని దైవభక్తిగలవా'డని నితని సమకాలికు డొకడు ఇతనిని స్తోత్రము జేసెను; 'పశ్చిమయిండియా' భాషలను నేర్చుకొని, యా దేశపుబాలురకు జదువను వ్రాయను ఈయన నేర్పు చుండెను. 'పరిమాణశాస్త్రము' (Survey) నందు బ్రవీణుడు గాన, నూతనవాసుల యాశ్రమములను వేర్వేరుగ స్థిరపఱచుటయం దితడు ప్రయాసపడుచు వచ్చెను.

ముప్పదియయిదు సంవత్సరములవయస్సు, పెరిగిన యారుగురు పిల్లలు, క్రొవ్వు వ్యాపారము - ఇట్టి సంపత్తితో, పండితుని మర్యాదగ కాలము పుచ్చుచున్న వాని కూతురును 22 సంవత్సరముల వయస్సుగల స్త్రీని, జోషయా ఫ్రాంక్లిను వివాహమాడి, యామెకు దన పిల్లల నప్పగించి, వారి విషయమై యామె పాటుపడునట్లు చేసెను. అట్లు చేయకపోయిన పక్షమున వీరిదాంపత్య మనుకూలము లేక యుండియుండును. ఇంపైన విగ్రహమును, సరసపు మాటలును, లౌకిక బుద్ధియునై కేవలము కుఱుచగాక, కేవలము పొడవుగాక, పటుత్వము, దార్డ్యము, బలముగలిగి జోషయా ఫ్రాంక్లిను పనులును నేర్పుగ నెరవేర్చుచుండెను. ఆయన "యవయవములు" అతని పూర్వుల జన్మభూమి ఇంగ్లాండని తోపజేయుచుండెను. నీటుగ, తేటుగ, బొమ్మలను వ్రాయుటయందును, వీణెను జక్కగ మీటుటయందును అతడు నేర్పు గలవాడు. అతని కంఠము శ్రావ్యముగనున్నను, గొంచెము బొంగుగ నుండును; సాయంసమయమున, తన నిత్యకృత్యములను ముగించుకొని, వీణెవాయించి పాడుచు, తన జన్మదేశము నందు రచింపబడిన పాటలను, కీర్తనలను గానము జేయుచు, దనవారి నందఱను ఉల్లసింప జేయుచుండును. అతనికి కంఠస్వర-వీణెస్వరములు, పూర్ణాయుర్దాయుడై మనిన అతని కుమారునకు యావజ్జీవము వినబడుచు వచ్చి, తండ్రిగారితో నాట పాటలయందు గడపిన సాయం సమయములు జన్మాంతము వఱకు జ్ఞప్తికి వచ్చుచుండెను. జాగరూకత, నూతన విషయములను దెలిసికొనుటయందాసక్తి, స్వచ్ఛమైన మనస్సు, వీనిని గలిగి, బుద్ధిమంతులును తెలివిగల వారును నగు స్నేహితులతో మెలగుచు, వారితో గోష్ఠిచేయుటయం దిచ్ఛగలవాడై యుండెను. యుక్తాయుక్త విచక్షత, నిర్మలత్వము, సౌహార్దముకలవాడని మెప్పువడసినందున, నిరుగు పొరుగువారేమి, పౌరవ్యాపారములలోను, దేవస్థానవిషయములలోను దిరుగుచున్న పెద్దలేమి ఇతని సలహాను గోరి వచ్చుచుందురు. శుద్ధుడు, శాంతుడు, దాంతుడునై, కార్యములను పూనికతోను, నేర్పుతోను, చాక చక్యముతోను ఇతడు నెఱవేర్చుచుండెను. కావుననే 'ఆబియాఫోల్జరీ' యీయనను జేబట్టి, యీయన కార్య నిర్వాహక భారమునుగొంత తాను శ్రద్ధాభక్తులతో వహించెను.

ఈ దంపతులకు పదుగురు బిడ్డలైరి. 1690 సంవత్సరము డిశంబరున, జాను; 1692 సంవత్సరము నవంబరు 22 తేదిని, పీటరు; 1694 సంవత్సరము సెప్టెంబరు 22 తేదిని, మేరీ యను కూతురు, 1697 సంవత్సరము ఫిబ్రవరి 4 తేదిని, జేమ్సు; 1699 సంవత్సరము జూలై 9 తేదిని, సారా యనుకొమార్తె; 1703 సంవత్సరము డిశంబరు 7 తేదిని, తామసు, 1706 సంవత్సరము జనవరి 6 తేదిని, బెంజమిను ఫ్రాంక్లిను; 1712 సంవత్సరము మార్చి 27 తేదిని, జేను యను కొమార్తెయు బుట్టిరి. 'జేను' అందఱిలోను చాల చక్కనిది. అందఱికి ముద్దు బిడ్డ. బెంజమినునకు ముద్దు చెల్లెలు. వీరిరువురు అఱువది వత్సరములవఱ కుత్తర ప్రత్యుత్తరములను జఱపుచుండిరి.

'బెంజమిను ఫ్రాంక్లిను' ఆదివారమున బుట్టెను. క్రైస్త్వాలయమున కిరువది గజముల దూరములో వీరి గృహ ముండెను. తండ్రి ఈ శిశువును జేతులలోనుంచుకొని, ఆసమీపమున నున్న యాలయమునకు దీసికొని వెళ్లి, ఆలయాధికారియైన 'డాక్టరు విలార్డు'చే, శిశువునకు జ్ఞానస్నానము జేయించి 'బెంజమిన్‌' అని తన తమ్ముని పేరిడెను.

పెద్దకుటుంబములో జన్మించి పెఱుగుట శిశువుయొక్క పురాకృత పుణ్యఫలమేగాని మఱియొకటికాదు. చెడుమార్గముల యందు బ్రవర్తించుటకు శిశువున కవకాశములు తక్కువగ నుండును. తన్ను బ్రేమించువారు చాలమంది యనియు, తాను చాలమందిని బ్రేమించవలె ననియు తెలియును. పదిమందిలో తానొక్క డనే భావమును బొంది, వారలకు గూడ తనవలె చైతన్యము, స్వభావము, మమకారములు గలవని తెలిసికొన మార్గముండును.

ఈడు వచ్చి సంతానవంతుడైన పిదప, తండ్రితో సహ పంక్తిని కూర్చుండెడు పన్నెండుగురు సోదర సోదరీలను బెంజమిను ఫ్రాంక్లిను జ్ఞప్తికి దెచ్చుకొనుచుండును. బాల్యావస్థలో తమ గృహమందు బొందిన సౌఖ్యమునకు, నితడును, ఇతని చెల్లెలు జేనును, నిదర్శనులయి యున్నారు. "సంసార పక్షముగనున్న మన గృహములో బెరిగితిమి. లెస్సగ దిండితిని, కోరిన వస్త్రములను గట్టుకొని, చలి కాచుకొనుచు, మనలో నేవిధమైన యంకిలిలేక, కలసి మెలసి యుండెడి వారము. పెద్ద లంద అనుకూలముగ నుండెడివారు. సర్వత్ర, వారు గౌరవమును బొందుచు వచ్చిరి" అని ఈమె వ్రాయుచున్నది.

బోస్టను పట్టణమందు నానాటికి వృద్ధిబొంది, జోషయా ఫ్రాంక్లిను ధనికుడాయెను. ఇంగ్లాండు దేశమం దుండిన నితని తమ్ముడు, బెంజమిను, ధనికుడు గా లేదు. బంధువులకు స్నేహితులకు వాత్సల్యమును గనబఱచి, అతడు సుగుణ సంపత్తులను గలవా డయ్యెను కాని సర్వకాల సర్వావస్థలయందు నుండవలసిన కొన్ని గుణములు అందు ముఖ్యముగ రాజ్యక్రాంతి క్షోభలు సంభవించునెడ తాను స్థానభ్రంశ మంద కుండుటకు వలసినవి ఈతని యందు లేకుండెను. దీనింబట్టియే "తన మేలుకు మించిన లౌకికుడు" అని ఇతని యన్న కుమారు డితని విషయమై వ్రాసెను. దీనికి తోడుగ, సంసారదు:ఖము లితనిని బొందసాగెను. క్రమముగ, భార్య తొమ్మండుగురు పిల్లలు వియోగమంద, నితని లౌకిక వ్యాపారము లన్నియు నానాటికి క్షీణించెను. కాని, యెన్ని కష్టములు వచ్చినను, మనస్సును దృడముగ నిలుపుకొని, చిదానంద స్వరూపుడై, తనకు లభించిన గ్రంధములను జదువుచు, కాలయాపనము జేసెను. వ్యాసములు, మతబోధకవచములు, మొదలగువానికితడు సంపాదకుడుగ నుండెను. తనకాలమునందలి రాచకీయ విషయముల కనుగుణ్యముగ తానుచేసిన స్వరలయ రాహిత్యమైన పాటల బాడుటయం దత్యధికాసక్తి జూపుచు వచ్చెను. భార్యాపుత్రాదుల వియోగముబొంది, స్నేహితులచే విడనాడబడి సహించి, తన యన్న కుమారుడు తన పేరుకలవా డనివిని సంతసించి, వానియోగక్షేమము లఱయుచు వచ్చెను.

"జోషయా", "బెంజమిను" లిరువురును, తమ యోగ క్షేమములను నుత్తర ప్రత్యుత్తరములచే తెలిసికొనుచుండిరి. అవి వీరి వంశచారిత్రయందిమిడి యున్నవి. నానాడు తనయన్న కుమారునికి బెంజమిను బంపిన పద్యము లీ బాలుని జీవనము విషయమై తెలియదగిన ప్రధమాంశముల కాధారములు. ఇతడు పాఠశాలలో తగుమాత్రము విద్యనభ్యసించెను. పూజ నీయుడైన తండ్రి, ప్రేమాస్పదయైన తల్లి వీరిరుగురు పురుషార్థములకయి జఱపిన గృహస్థాశ్రమము, ప్రత్యక్షకాలవి స్ఫారితవిషయావలోకనము, తండ్రిగారి పుస్తకములు, స్నేహితులు, వీనిని మించి పినతండ్రి బెంజమిను పంపిన యమూల్యనీతి బోధక లేఖలు, చిన్ని బెంజమినునకు మార్గసూచకము లయ్యె.

బుద్ధిని వికసింపజేయు నీ విషయములు, బెంజమినునకు 9 సంవత్సరములు ప్రాయము వచ్చువఱకు బ్రసరించెను. బాలుడు మందబుద్ధియైన పక్షమున నివి శ్రేయోదాయకము లయినవో, కానివో, విమర్శించుటకు ఎడ ముండియుండును. కాని సహజముగ సూక్ష్మబుద్ధిగలవాడై, నూతనవిషయ పరిగ్రహణేచ్ఛ గలిగి, మేధావియైన బెంజమిను విషయమై, యివి శ్రేయోదాయకము లని వేరుగ చెప్ప నేల?

ఈయన బాల్యావస్థలో జఱిగిన ఒక్క యంశము సర్వజన సామాన్యముగ తెలిసినదే. "నే నేడు సంవత్సరములు ప్రాయముగల వానిగ నున్నప్పు" డొక పండుగ రోజున నా స్నేహితులు నా జేబునిండ డబ్బులు వోసిరి. వెంటనే, నేను పిల్లలాడుకొను వస్తువులు దొరకు దుకాణమునకుబోయి, యక్కడ యాకస్మికముగ నొక బాలుని చేతిలోనున్న యీలనుజూచి, దాని ధ్వనిని విని సంతసించి, నా జేబులోని డబ్బులన్నియు ఆ బాలుని కిచ్చివేసి, యాయీలను బుచ్చుకొంటిని. దానిని బట్టుకొని, యింటికివచ్చి, మహోల్లాసముగ నీలగొట్టుచు, నింటినాలుగు వైపులు తిరిగి నందున, నింటి వారందఱు చికాకుపడిరి. నాయన్న దమ్ములు, చెల్లెండ్రు, నేను గొన్నవస్తువును జూచి నవ్వి, దాని ఖరీదు కంటె నాలుగు రెట్లు హెచ్చుసొమ్ము నిచ్చినా నని చెప్పి, పరిహాసము జేసినందున, నాకు విచారము గలిగి, యీలకొనిన సంతోషము లేక పోయెను. హెచ్చుగనిచ్చినసొమ్ముతో దీనికంటె మంచివస్తువులను గొనుటకు వీలుపడియుండు ననుట నా మనస్సును సదా నొప్పించుచున్నందున, నుత్తరోత్తర మిది నాకు మేలును గలుగ జేసెను. ఎన్నడైన, ననుపయోగమైన వస్తువును గొనుటకు నుద్యుక్తుడ నైనప్పుడు, ఈలకు వలె హెచ్చు సొమ్ము నిచ్చి వేయుదు నేమోయని జ్ఞప్తికి దెచ్చుకొనుచు, ధనమును వృధావ్యయముజేయుట మానివేసితిని" అని ఫ్రాంక్లిను తన స్వీయ చరిత్రయందు వ్రాసియున్నాడు.

చిన్న నాటనుండి, బెంజమిను పుస్తకములు చదువుట యందాసక్తి జూపుటచే, నితనిని గ్రైస్తవధర్మమునకై నియోగింపవలె ననితండ్రి యాలోచించెను. ఈ నియోగమును పినతండ్రి బెంజమినుగూడ నంగీకరించి, తనవద్దనున్న ప్రాచీన మతోపన్యాస సంపుటముల నితని కిచ్చెను. జోషయాయను నతడు తప్ప, ఇతని యితర సహోదరులు స్వానుగుణోచితవ్యాపారములయందు ప్రవేశించిరి. బెంజమిను శిశువుగ నుండినపుడే, "జోషయా" యను యన్నగారు సముద్రముపైని దేశాంతరగతు డయ్యెను.

8 సంవత్సరములు ప్రాయ మప్పుడు, "బోస్టను వ్యాకరణ పాఠశాలలో" బెంజమిను ప్రవేశ పెట్టబడెను. మొదటి సంవత్సరమున, ఇతడు తన తరగతిబాలుర నతిక్రమించి, పైతరగతి చదువునకు యోగ్యతాపత్రికను పుచ్చుకొను సమయమున, కుటుంబ భార మత్యధికమై నందున ఇతనితండ్రి, పై చదువు చదివించుట తనస్థితికి మించిన పనియని యాలోచించి, కుమారుని చదువు మాన్పించెను. కొంతకాలమునకు పిదప బోధన, లేఖన, గణితము లందు ప్రవీణుడని పేరొందిన "జార్జిబ్రాము వేలు" పెట్టిన పాఠశాలకు బెంజమినును బంపిరి. ఒక సంవత్సర పర్యంత మా పాఠశాలలోనుండి బాగుగ వ్రాత వ్రాయుట నేర్చుకొనెను గాని, గణితము మాత్ర మతనికి బట్టువడలేదు. పదిసంవత్సరముల ప్రాయము వచ్చుసరికి, విద్యాభ్యాసము సరిపోయినది. నాటనుండి వ్యాపారములోదిగి, తండ్రికి సహాయము జేయుచు, మూసలలో కఱగిన క్రొవ్వునుపోసి వత్తులనుదింపుచు, దుకాణము వద్ద సరకులనమ్మి, జాబులను వ్రాయుచు వచ్చెను. ఈ వ్యాపార మెంత యసహ్యకరమైనను, శ్రద్ధాభక్తులతో దానిని జేయుచు, "తనయాశ్రమ ధర్మమెవడు పూనికతో నడపునో, వాడు మూర్ధాభిషిక్తుల సాన్నిధ్యమును బొందును; తుచ్ఛులను బొందడని," రాజర్షియైన సాలమను చెప్పిన నీతివాక్యమును తండ్రి తన స్ఫురణకు సదా తెచ్చుచుండెనని తన స్వీయ చరిత్రలో ఫ్రాంక్లిను వ్రాసియున్నాడు. ఏబది సంవత్సరములు గడచిన వెనుక డాక్టరు ఫ్రాంక్లినని పేరువహించి, రాజన్యుల సాన్నిధ్యముననుండి, యీ నీతివాక్య మితడు స్మరణకు దెచ్చుకొనుచుండె నట.

పనులు పుచ్చుకొనుటయం దంతగా కాఠిన్యమును తండ్రి వహింపనందున, బాలక్రీడలయందు విహరించుటకును, పుస్తకములు చదువుటకును బెంజమినున కవకాశము దొరకుచుండెను. సముద్రతీరమున నివసించుటచే, జలక్రీడలయం దామోదము బెంజమినునకు కలుగుట సహజము. చిన్న పడవలను నడపుటయందేకాక, యీదుటయందుగూడ, ప్రావీణ్యమును ఇతడు కొద్దికాలములోనే సంపాదించెను. ఈతయందత్యధిక మోహముగలవాడై, వయస్సు ముదిరనను దానిని బ్రేమతో జూచుచుండెను. నేర్చుకొనదగిన ముఖ్యాంశములలో దీనిని నొకదానిగ నెంచి, తన యభి ప్రాయమును స్థిరపఱచుటకై యనేక వ్యాసములను వ్రాసెను.

ఒక రోజున గాలిపటమును వినోదార్థమెగరవేసి, దరిదాపుగ మైలు వెడల్పుగల యొక సరస్సు సమీపమునకు వచ్చి, యొడ్డున నొక కొయ్యకు బటముయొక్క దారమునుగట్టి, నేనీదుటకు నీటిలో దిగి, యంతరాళమున నెగురుచున్న పటమునుజూచి సంతోషించుచుంటిని. ఎగురుచున్న పటము బట్టుకొని, యీదవలెనను అభిలాషతో నొడ్డునకువచ్చి, దారమును విప్పి, చేతబట్టుకొని, నీటిలోనికి వెళ్లి, వెలికలబండుకొని, చేతులతో దారము బట్టుకొని నందున, నీటిమీద మనోహరముగ లాగబడితిని. నాదుస్తులనవతలి గట్టునకు దీసికొని రమ్మని నా స్నేహితునితోజెప్పి, సునాయాసముగను, చెప్పనలవికాని మనోల్లాసముతోను లాగబడి, సరస్సును దాటితిని" అని తన స్వీయచరిత్ర యందొకచో నీతడు లిఖించియున్నాడు.

నీటిభయము లేక పోవుటకు దోడు, తండ్రి యొక్క వ్యాపారమునందు రోతపుట్టుటచేత సముద్రముపై యాత్రజేయుట యందితని కభిలాష కలిగినందున, తండ్రికి మనోవ్యాకులము విశేషమయ్యె. దైవికముగ, 1715 సంవత్సర ప్రాంతమున, నితని పినతండ్రి బెంజమిను తన జీవిత కాలావశేషము తన యన్నగారివద్ద వ్యయపఱచుటకు నుద్దేశించి, యమెరికా దేశమునకు వచ్చెను. ఇట్లు చేరిన యన్నదమ్ముల కుటుంబములు రెంటికిని స్నేహము కుదుర, సహోదరు లిరువురును కలిసి నొక్కిచెప్పి, చిన్ని బెంజమినునకు సముద్ర ప్రయాణమందలి యుత్సాహమును విఱిచివేసిరి. అనేక కావ్యములను, సంక్షిప్తమతబోధకోప న్యాసములను ఇతని పినతండ్రి యింగ్లాండు దేశమునుండి తీసికొని వచ్చెను. అతడు సూచిభావసమన్విత విమర్శనాయత్త చిత్తంబున కపటరాహిత్య మనోవ్యాపారముల నాపాదించు సరసోల్లసిత, చతుర భాషణంబులచే యుక్తియుక్తముగ తన పేరింటిగానికి బుద్ధులు గఱపి, సంకేతలిపిని నేర్పి, తనకుంబలె సన్మార్గప్రచారణీయునిగ జేసి, యతని నీటిప్రయాణ సన్నాహమును నిషేధింపించెను. నాలుగు సంవత్సరములు దనయన్న గారి గృహమందు నివసించి, తనకుమారుడు, సామ్యూల్, వివాహమాడి, వేరు కాపురము పెట్టినందున, పినతండ్రి బెంజమి నక్కడ నివసించుటకు బోయెను. ఇతడు 77 సంవత్సరములు జీవించి, 1727 సంవత్సరమున లోకాంతర గతుడయ్యెను.

యౌవనుడైన బెంజమినుయొక్క విద్యాసక్తి, యౌవనవంతులచే బరింపదగిన గ్రంధములయందు బ్రసరించుటయే గాక, జ్ఞానోదయోద్దేశ సద్గ్రంథపారాయణమును సహితము బ్రేరేపించెను. బనియనువ్రాసిన "యాత్రికుని సంచారము" అను గ్రంధము, ప్లూటార్కు వ్రాసిన "మహనీయుల జీవనములు"ను నతనికి శ్రేయోదాయకములయినవి.

"నేను చదువుకొను దినములలో" "మీతండ్రిగారివలన వ్రాయబడినదని నే ననుకొనుచున్న 'సన్మార్గోపదిష్ట వ్యాసము' లను పేరుగల గ్రంధము నాకు దొరకినది. ఈగ్రంథమిదివఱ కెవరిదో, వారు దీనిని నిరాదరణతో జూచుచుండి రనుటకు తార్కాణముగ, దీనియందు కొన్ని పత్రములు చినిగి యున్నవి; అయినను, శేషించిన పత్రములను జదువుటవలన, నాయోచనావృత్తి నూతనపథాన్వేషణ విముఖియై, యావజ్జీవము నన్ను సన్మార్గప్రవర్తకునిగ జేసెను. కీర్తిదాయకములైన వ్యాపారము లన్నిటిలోను, సత్కర్మనిరతుల నడవడిక లమూల్యములని తోచుచున్నది. తమరనుకొనుచున్న ప్రకారము, నేనే సర్వజనోపకారియైన యెడల, నేనటు లనిపించుకొనుటకు గారణ మీ గ్రంథమేయని యూహించవలెను" అని లేఖను వ్రాసెను.

మతాచారముతోను నిష్ఠతో నితనిని బెంచిరి. విధిప్రకారము సోదర సోదరీలతో నితడు క్రైస్త్వాలయమునకు వెళ్లవలసియుండెను. అన్యోన్యానురాగముతో బిడ్డలు తలిదండ్రులయెడ శ్రద్ధాభక్తి వినయపూర్వకముగ నడచుచుండిరి. భోజనాద్యంతముల జేయుప్రార్థన చాలకాలము బట్టుచున్నందున, నది మనస్కరించక, "నాయనగారు దైవప్రార్థన నొకమాఱు సేసిన, కాలాతిక్రమణము జరుగ దని" బింజమిను నుడివెను.

మొత్తముమీద, బెంజమిను బాల్యావస్థ సౌఖ్యముగ జరుపబడెను. జీవితాంతమువఱ కే బోస్టనుపట్టణమందలి యవస్థనే నతడభిలషించుచుండెను, 82 సంవత్సరములు ప్రాయ మప్పుడు సహితము తన జన్మస్థానము నత్యాదరముతో స్మరించుచు వచ్చెను. నిర్మలహృదయముతో స్వచ్ఛందముగ క్రీడలయందు విహరించిన ప్రదేశములందు దిరుగసంచరించుట కెంతయుగోరికోరి, యలభ్యమని యెంచి, బోస్టనుపురవాసులతో సంగమించి, సావకాశమైనపు డెల్ల వారితో నత డిష్టాగోష్ఠిని కాలము జరుపుచు నామోదించు చుండెను. "బోస్టను పట్టణాచారములు, అక్కడి సమాసావృత్తులు, మాటధోరణి, కంఠ సరళత యివి యన్నియు సంతోష దాయకములై, నన్ను పునరోద్ధారణచేయునవిగా తోచెడిని" అని బెంజమిను వ్రాసెను.Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf