బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తిరుమలపై వెలసిన శ్రీనివాసునిగా, ఏడుకొండల వేంకటేశ్వరునిగా ప్రసిధ్ధి పొందిన మహావిష్ణువు అర్చావతారానికి మరో పేరు, ‘బాలాజీ’ . నిజానికి ఈ పేరే తొలిసారి స్మరింపబడినది. దురదృష్ట వశాత్తు ఈ పేరుతో కేవలం ఔత్తరాహికులే ఆ స్వామిని పిలిచి, కొలిచి లాభ పడుతున్నారు. మన తెలుగు వారికి ఈ పేరుతో గాని, బాలాజీ సమగ్ర చరిత్ర గాని పూర్తి పరిచయం లేదు ! స్వామి తిరుమలపై వెలసినది కేవలం, ‘ పద్మావతీ దేవిని ’ పరిణయం చేసుకోవడానికే అన్నట్లు మన పౌరాణికులు శ్రీ వేంకటేశ్వరుని చరిత్రని తీర్చి దిద్దారు. అందుకే , ‘ బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన’ అనే పేరుతో అతని కథని అర్థవంతంగా, సమగ్రంగా, అర్చావతారం ఎత్తేందుకు కారణాలు, ప్రయోజనాలు, నెలకొల్పిన ఆదర్శాలు పూసగ్రుచ్చినట్లు వ్రాయాలని సంకల్పించి, నేను ( అయల సోమయాజుల శ్రీధర్ ) నా బ్లాగు, ‘ క్షీరగంగ’ లో ఆ కథని దృశ్య రూపంలో మలిచి పాఠకుల ముందు పెట్టాను. నా పాఠకుల కోరిక మీద ఈ చరిత్రని ,‘గూగుల్ .నాల్’ లో ప్రచురిస్తున్నాను. అలా చేస్తే ఎక్కువమంది చదివే అవకాశం ఉంటుండని నా ఊహ, ఆశ, ఆశయం.

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన - 1[మార్చు]

( బాలాజీ అర్చావతార వైశిష్ట్యాన్ని , కథలనీ, క్రమానుగతంగా దృశ్య రూపంలో వ్రాసిన కదంబ మాలిక )

(దృశ్యము-----1 నైమిషారణ్యం )

( పాత్రలు--- సూత పౌరాణికుడు, శౌనకాది ఋషుల గుంపు )

శౌనకుడు_____ సూత మహర్షీ ! ‘వరాహ, భవిష్యోత్తర, స్కాంధ, లింగ ‘ పురాణాల లోని ‘శ్రీ వేంకటేశ్వర’ అర్చావతార విశేషాలను మాకు చెప్పి, మమ్ములను ధన్యులను చెయ్యండి.

సూతుడు _____ శౌనకమునీ ! పురాణములన్నియు మనుజుల మనుగడను, సుఖమయ మొనర్చుటకే వ్రాయబడినవి. పునీత భారత దేశము ప్రసిద్ధి నిలుపుటకు, ఉపయుక్తములయిన సంస్కారముల దెల్పు, నిర్మల దర్పణములు యీ పురాణములు !

1 ఋషి ____ సూత మహర్షీ ! ‘శ్రీ వేంకటేశ్వరుడు’ అనగా ఎవరు ?

2 ఋషి____ శ్రీ రామ చంద్రుడు, శ్రీ కృష్ణుడు, వంటి మహా విభూతిలె గాక, అర్చావతారము నెత్తుటకు కారణ మేమి ?

సూతుడు _____ మునులారా ! ‘శ్రీ వేంకటేశ్వరుడు, ‘వేం’ అనగా పాపములను, ‘ కట ‘ అనగా నశింప జేయు ఈశ్వరుడు. పేరులో ఈశ్వర శబ్దం, వచ్చినంత మాత్రమున యీతఢు ‘శివుని’ మూర్తియని భావించుట తగదు . ఇతడు సాక్షాత్తు ‘వైకుంఠము ’ నుండి విచ్చేసిన ‘ శ్రీ మన్నారాయణుడు’ !

3 ఋషి ______ భగవత్తత్వము ఎన్ని రూపాలుగా ఉంటుంది ?

సూతుడు _____ ఆగమాలు భగవత్తత్వము అయిదు రూపాయని ఘోషిస్తున్నాయి ! అవి, “ పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా రూపాలు “ సత్య, జ్ఞాన, ఆనంద రూపమై, సమస్త కారణ భూతమైన ‘ ‘శ్రీమన్నారయణుడే; పరతత్వము ! ఆ పరతత్వమే సృష్టి,, స్థితి, లయాలను, మోక్ష ప్రదానాదులను చేయడానికి వ్యూహాలుగా, భాసిస్తుంది !! ఈ వ్యూహాలు ‘ వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ’ నామాలతో ప్రకాశిస్తున్నాయి.

4 ఋషి______ ఈ వ్యూహాలు ఏ విధంగా పని చేస్తున్నాయి ?

సూతుడు _____ పర తత్వం, పరిపూర్ణ గుణ భరితమైనది . ఇది వైకుంఠంలో జీవన్ముక్తులయిన వారిచేత, పూజింప బడుతుంది. తక్కిన మూడు వ్యూహాలలో ఒకటి క్షీర సాగరంలో ఉంఢి, జగద్రక్షణ అవసరమయి నప్పుడు అవతార రూపం పొందుతుంది. అలా వచ్చినవే మన శ్రీరామాద్యవతారాలు !! వీటినే ‘ విభవాతారాలంటారు’ అవి ఆ యా కాలంలోని వారికి తప్ప తరువాతి కాలం వారికి అందుబాటులో ఉండవు.

1 ఋషి _____ అంతర్యామి వ్యూహం ఎలా క్రియాన్విత మవుతుంది?

సూతుఢు____ ఈ వ్యూహం జీవునిలో అణువై, అంతర్యామిగా ఉంటుంది. హృదయంలో ఉన్న దైవాన్ని దర్శించడం అంత సులభం కాదు !!

2 ఋషి_____ మరి అర్చా వ్యూహం సంగతేమిటి ?

సూతుఢు ____ ఇంత వరకు చెప్పిన ‘ పర, విభవ, అంతర్యామి’ వ్యూహాలు అనుభవ సులభాలు కావు ! అందుకే శ్రీ కృష్ణభగవానుడు భగవద్గీతలో, ‘ఆర్తులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు, అర్ధార్థులు, అనే నాలుగు రకాల భక్తులు, ఏ రూపాన తనను సేవిస్తారో, ఆ రూపంలోనే పరిపూర్ణ ఫలాన్ని ఇస్తానని చెప్పాడు.

3 ఋషి ______ సూత మహర్షీ ! మీ దయ వలన అర్చామూర్తి యొక్క వ్యూహరచన తెలిసింది.

4 ఋషి____ అర్చామూర్తిని ఆరాధించిన వారు, పరతత్వ స్వరూపాన్ని సేవించేవారి ఫలాన్ని అందుకో గలరా ?

సూతుడు ____ అందుకు సందేహం లేదు. అందుకే శ్రీమన్నారాయణుడు కలియుగంలో భక్తులను ఉద్ధరించేటందుకు, శ్రీ వేంకటేశ్వరునుగా అర్చావతారం ఎత్తాడు.

శౌనకుడు _____ సూతమహర్షీ ! మన భాగ్యవశమున అవతరించిన ఆ మహావిష్ణువు కథ మాకు తెలియ జేయండి.

అందరూ ____ అవును, సూతమహర్షీ ! కథా ప్రారంభం చెయ్యండి.

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన - 2[మార్చు]

( దృశ్యము 2----- వైకుంఠంలో శ్రీమహావిష్ణువు , తన దేవేరులతో సేవ లందుతూ ఉంటాడు)

( పాత్రలు----- శ్రీ మహావిష్ణువు, శ్రీదేవి , భూదేవి, ఆదిశేషుడు )

( అదే సమయంలో ఒక శ్లోకం వినిపిస్తుంది. )

శ్లోకం _____” శాంతాకారం, భుజగ శయనం, పద్మనయనం, సురేశం విశ్వాకారం, భువన సదృశం, మేఘవర్ణం, శుభాంగం లక్ష్మీ కాంతం, కమల నయనం, యోగిహృద్యాన గమ్యం, వందే విష్ణుం, భవ భయహరం, సర్వ లోకైక నాథం.

( శ్రీ మహావిష్ణువు, శ్లోకం విని దిగ్గున లేస్తాడు. అతని పాదాలని ఒత్తుతున్న శ్రీదేవి అలుగుతుంది.)

విష్ణు _____ శ్రీ దేవీ ! ఎవరో భక్తుఢు----

శ్రీదేవి ______ అవున్లెండి ! శ్రీవారి శ్రోత్రాలకి, అప్పుడే స్తోత్ర పాఠాలు వినిపించాయి ! ఇక యీ శ్రీదేవి, ఆ భూదేవి, మేమెందుకు లెండి.

విష్ణు ______ అది కాదు దేవీ ! ఇతడెవరో సామాన్యుడు కాదు -----

శ్రీదేవి _______ సామాన్యుడో, మహామాన్యుడో, ఎవరయితేనేం !! ఏకాంత సేవకి అంతరాయం కలిగించాక ?

భూదేవి _______ అక్కా ! అతడెవరో కాదు, సాక్షాత్తు వాయుదేవుఢు !! శ్రీవారి దర్శనార్థం, వైకుంఠానికి తన అసామాన్య వేగంతో వేంచేస్తున్నాఢు !

విష్ణు _____ వాయుదేవుల వారు వస్తున్నారా ! వారి రాకకు కారణ మేమిటో ?

శ్రీదేవి _______ వచ్చిన తరువాత ఎలాగూ తప్పదు ! ఇప్పటి నుంచీ కార్యకారణాల చర్చ దేనికి ? నువ్వేమంటావు, చెల్లీ ?

భూదేవి _____ అక్కా ! విషయం ముందుగా తెలుస్తే, సత్వరం చక్కబెట్టి, పంపించెయ్య వచ్చు !

విష్ణు ( భూదేవితో )___ వాయుదేవుని రాకకు కారణము నీకు తెలియునా దేవీ ?

భూదేవి _____ ప్రభూ ! కృతయుగంలో మీ వైకుంఠ విహారానికి, ఇక్కడ ఒక క్రీడాద్రి ఉంఢేది కదా ?

శ్రీదేవి _____ అవును, స్వామివారు భూలోక విహారానికి బాగుంటుందని, దానిని వైకుంఠం నుండి భూలోకానికి తరలించారు.

భూదేవి _______ అవునక్కా ! భూలోక వాసులు, ప్రభువుల వారి వినోద చిహ్నంగా దానిని ఆనంద గిరి అని పిలుస్తున్నారు. మేరు పర్వతుని కుమారుడైన ‘క్రీడాద్రి,’ భువికి చేరి, ‘ఆనందాద్రి అయింది. ఇప్పుడా ఆనందాద్రి సమీపంలో, అంజనాదేవి తపస్సు చేసిన ఆశ్రమ ప్రాంతంలో--- ప్రకృతి వైపరీత్యం ఎక్కువయింది !

విష్ణు _____ ప్రకృతి వైపరీత్యమా దేవీ ?

భూదేవి ______ అవును ప్రభూ ! ధూళితో కూడిన తుఫానులు, రాళ్ల వర్షాలు పడి, సంక్షోభం చెలరేగుతోంది. నీటి కొరత ఏర్పడి సెలయేర్లు కాలువల లాగ, చెరువుల గోతుల్లాగ మారిపోయాయి. రాళ్ల తాకిఢికి, నిప్పురవ్వలు చెలరేగి, అడవుల దగ్ధమవుతున్నాయి. దీనికి కారణం తెలియని ప్రజలు ఈ దుర్గతికి, వాయుదేవున్ని దుయ్యబఢుతున్నారు.

విష్ణు _____ భూదేవీ ! నీ అభిప్రాయం ఏమిటి , కారణం వాయువు కాదంటావా ?

భూదేవి _____ ప్రభూ ! సర్వజ్ఞులయిన మీకు చెప్పాల్సిన పని ఏముంది ! అల్ప పీడనం కల చోట వాయుగుండం లేవక తప్పదు ! ప్రళయకాల ఝంఝూమారుతమే, అక్కఢి ప్రజల సమస్య !

విష్ణు _____ గరుత్మంతుడు, నా క్రీడాద్రిని సరియైన స్థలంలో, తూర్పు సముద్రానికి మరికాస్త పడమటిగా, సువర్ణముఖరీ నదికి ఉత్తరంగా మరో క్రోసుడు దూరంలో నిలిపి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు !

శ్రీదేవి _____ చెల్లీ ! కాల విశేషాలకి తగ్గ పవనాలు అక్కడ వీచాలంటే, అల్ప పీడనం నశించాలంటావా ?

భూదేవి ____ అవునక్కా ! దానికి శ్రీవారు చెప్పినది, అదే ---- ఆనందాద్రిని మరో క్రోశెడు దూరంలో నిలపడమే సరియైన మార్గము.

విష్ణు ____ మార్గములు, మార్గాంతరములతో నాకేమి సంబంధము ? నా దేవేరులతో లభ్యమయిన ఏకాంతాన్ని భంగం చేయడానికి వస్తున్న యీ వాయువును రానివ్వకూఢదు. ఏమందువు శ్రీదేవీ ?!

శ్రీదేవి _____ శ్రీవారికి ఇంతకాలానికి, చక్కని ఆలోచన వచ్చిందంటాను. ( నవ్వుతుంది )

విష్ణు _ ( చిరునవ్వుతో ) దేవీ ! నీ అభిమతము నా కెప్పుడూ శిరోధార్యమే ! ( అని ప్రక్కనే పాన్పులా పడిఉన్న ‘ ఆదిశేషుని ‘ తట్టి పిలుస్తాడు ) ఆదిశేషా !!

( ఆది శేషుఢు మానవ రూపంలో ప్రవేశిస్తాడు )

ఆదిశైష ____ ప్రభూ ! ఆజ్ఞ !!

విష్ణు ____ ఆదిశేషా ! వైకుంఠానికి దూసుకు వస్తున్న వాయువుని అడ్డగించే సామర్థ్యము నీకే కలదు.

ఆదిశేష ____ ఆజ్ఞాపించండి ప్రభూ ! నా కర్తవ్యమేమిటి ?

విష్ణు _____ మేము మా కాంతులతో ఏకాంతాన్ని కోరుతున్నాం. నీవు సింహద్వారము దగ్గర కాపలా ఉండి, వాయువును లోనికి రానియ్యక నిరోధించవలె !

ఆదిశేష ____ ప్రభూ ! ఆజ్ఞా ప్రకారము అటులనే చేసెదను. --- కాని మీ పాన్పు----

విష్ణు _____ (విసుగుతో ) మేము మరో పాన్పుపై విశ్రమించెదము అనంతా ! ఇది కూడ సందేహమేనా ?

ఆదిశేష _____ చిత్తం ప్రభూ ! అటులనే చేసెదను. ( ఆదిశేషుడు వెళ్లిపోతాడు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన - 3[మార్చు]

( దృశ్యము--- 3 )

(వైకుంఠానికి బహిద్వారము. ‘ జయ_ విజయు’లనే కాపలా భటులు కాపలా కాస్తూ ఉంటారు. )

( పాత్రలు--- జయ, విజయులు, వాయువు )

( వాయువు ప్రవేశానికి సంకేతంగా గాలి బలంగా వీస్తుంది. జయ,విజయులు ఆ వేగానికి ఇటూ అటూ ఒరుగుతారు. దావారం తలుపులు ఇంకా తేలికైన వస్తువులు కంపిస్తాయి. కాసేపటికి వాయువు మానవ రూపంలో ప్రవేశిస్తాడు )

వాయువు ------ జయ- విజయులారా ! నేను వాయువును !!

జయుడు ----- ఆర్యా ! మీ రాకయే మీ పరిచయాన్ని-----

విజయుడు ---- డంకా మీద దెబ్బలా చాటి చెప్పింది.

వాయువు ----- ( సంతోషంతో మీసం మెలివేసి, నవ్వుతూ ) మేము ప్రభువుల వారి దర్శనానికి విచ్చేసినారము. మా రాకను తెలియజేసి----

జయుడు --- ఆర్యా ! క్షమించండి, మేము ఈ వీధి వాకిలికి కాపలా దార్లము.

విజయుడు ---- లోపలి వాకిలికి, ఆదిశేషుడు స్వయముగా కాపలాకు నియమింప బడినాఢు !

జయుడు ---- అనంతుడైన ఆ ఆదిశేషుని కాదని-----

విజయుఢు ---- అణువు కూడ శ్రీవారి దర్శనానికి పోజాలరు.

ఇద్దరూ ---- కావున , తమరు  తిరుగుదారి  పట్టి, సమయాంతరమున విచ్చేసిన  బాగుండును 

వాయువు ---- హు ! కాపలాదార్లు ఎవరయితేనేం గాక !! మేము అశేష బల సంపన్నుల మయిన వాయు దేవులము !! అణువు కన్న సూక్ష్మము , మేరువు కన్న ఉన్నతము, అయిన రూపము పోందగల వారము. మమ్ములను ----(నవ్వి)--- ఎవరు అడ్డగించ గలరు ?

విజయుడు --- అది కాదు వాయుదేవా !—

జయుడు ---- మా మాట కాస్త ఆలకించండి---

వాయువు ---- ఏది కాదో, ఏది అవునో ఆదిశేషునితోనే తేల్చుకొనెదము ! మీరు తొలగి దారి ఇవ్వండి.

ఇద్దరూ ----  చిత్తం  మహానుభావా !  అటులనే  కానివ్వండి.

( జయ- విజయు;లు తొలగి దారి ఇస్తారు. వాయువు లోపలికి వెళ్తాడు. )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన - 4[మార్చు]

( దృశ్యము-- 4 )

( వైకుంఠానికి లోపలి ద్వారము. ఆదిశేషుడు ద్వారం ముందు తిరుగుతూ కాపలా కాస్తూ ఉంటాడు )

( పాత్రలు --- వాయువు, ఆదిశేషుడు )

(( ప్రవేశం--- వాయువు )

వాయువు ---- ఆదిశేషా ! నేను వాయువును ! అయినను, నీకీ కాపలా కాయు దుర్గతి ఏమి?

ఆదిశేష ---- ప్రభువులు, ఏకాంతాన్ని అభిలషించి నన్ను కాపలాకి పంపారు. ఇక్కడ దుర్గతికి తావు లేదు వాయుదేవా ! ఏల ననగా ఇది వైకుంఠము ! గతులు తప్పిన వారికి సద్గతి కలిగించు దివ్య థామము ! నేను చేయునది స్వామి కార్యము !

వాయువు ---- అటులనా ! సరి, సరి ! నే నొక కార్యవిశేషము చేత, శ్రీవారి దర్శనమునకు వచ్చితిని. (నవ్వి) నీది స్వామి కార్యము, నాది స్వకార్యము !!

ఆదిశేష ----- వాయుదేవా ! దర్శనమునకు ఇది సమయము కాదు. ప్రభువులు ఏకాంతము కోరి, నన్ను సైతము బయటికి పంపి కాపలా కాయమన్నారు ! అర్థం చేసుకొని మరలి పోవుట మంచిది !

వాయువు ---- మరలిపోవుట, తిరుగుదారి పట్టుట, ఆగిపోవుట ---- వాయువు సహజ లక్షణములు కావని నీకు తెలియదా ఆదిశేషా ?

ఆదిశేష----- ఆగిపోవుట , తిరుగుదారి పట్టుట నీకు సహజ గుణము కాదేని, ప్రక్కదారి పట్టుము ! లేకున్న పాతాళమునకు పొమ్ము ! అంతియే గాని లోనికి పోవుట మానుకొనుము.

వాయువు ---- పుష్ప సుకుమారులైన శ్రీవారి భార్యలకు, కాంతునితో ఏకాంతమునకు, నిముష - నిముషము విషముతో బుసలు కొట్టే నీవు అక్కర లేదేమో గాని, మేము కాకపోము !! -- నందన వన కుసుమ సౌరభాలను లలిత లలితముగా తరలించి, తోడ్కొని పోయి, వారిని ఆహ్లాద పరిచెదను, నన్ను పోనిమ్ము !

ఆదిశేష ----- వాయుదేవా ! ఎవరి సహజ గుణములు, ఎవరి సామర్థ్యములు వారివి ! ఇప్పుడా ప్రసక్తి దేనికి ? శ్రీవారి ఏకాంతమునకు భంగము కలగ కూడదనేది వారి ఆజ్ఞ !!

వాయువు ---- హు ! ఆజ్ఞ అట ఆజ్ఞ !! విష పురుగువయిన నిన్ను బయటికి పంపినంత మాత్రమున, మరి వేరెవరినీ లోనికి పంపననుట--- కడుంగడు దుస్సాహసము !!

ఆదిశేష ---- ఏమంటివి ? నేను విషపురుగునా !? కావచ్చు, పురుగునే కావచ్చు ! కాని నా కొక భౌతిక కాయమనునది ఉన్నది !! అశరీరుడవైన నీకు నాతో పోలిక ఏమి ?

వాయువు ---- ఏమంటివి ? నేను అశరీరుడనా ?! శత సహస్ర శరీరధారుల కన్న మిన్నయైన బల సంపద కల వాడను !! సంకల్పమాత్ర శరీరుడను !! నా తోనా నీ ప్రగల్భములు ?!

ఆదిశేష ---- ఏమి ? సంకల్ప మాత్ర శరీరుడవా ? సువర్లోకమున స్వేచ్ఛా శరీరము పొందు వరము ఎవరికి లేదు ? ఇందులో నీ గొప్పతన మేమున్నది ? వాయువు ( కోపముతో ) ఏయ్ ! పురుగా !! నన్ను లోనికి పోనిస్తావా లేదా ?

ఆదిశేష ---- ఏయ్ ! నలుసా ! వీలు కాదని పలుమార్లు పలికితిని, పో ! పొమ్ము !

వాయువు ---- ఓరి ! ఏమీ నీ అహంకారము !! నేను నలుసునా ? సరి ! నా దెబ్బ రుచి చూచిన వెనుక, ఆ మాట అనగలుగుదువేమ ! చూచెదను గాక ! ( అంటూ తొడ చరిచి, ఆదిశేషునితో యుద్ధాన్ని ప్రకటిస్తాడు )

ఆదిశేష ----   అటులనే  గానిమ్ము ! నీ  బల  సామర్థ్యములు  ఎంత  క్షుద్రములో  బయట  పెట్ఠెదను  గాక !  (అంటూ  బుసలు  కొడతాఢు )

( ఇరువురికీ బాహా బాహి యుద్ధం మొదలవుతుంది. వాయువు ప్రభంజనానికి, ఆదిశేషుని బుసలకి వైకుంఠం కంపిస్తుంది )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన - 5[మార్చు]

( దృశ్యము -- 5 )

( పాత్రలు--- శ్రీ మహావిష్ణువు, శ్రీదేవి, భుదేవి )

( వైకుంఠము. శ్రీమహావిష్ణువు తన దేవేరులతో ఉంటాడు. వారి ఏకాంతానికి వైకుంఠం లోని కలకలం అంతరాయం కలిగిస్తుంది )

విష్ణు ---- దేవీ ! ఏమి యీ వైపరీత్యము !

శ్రీదేవి ---- ఆనందాద్రి దగ్గరి ప్రకృతి వైపరీత్యము వైకుంఠ ద్వారానికి వచ్చినట్లుంది. ప్రభూ !

భూదేవి ----- స్వామీ ! ఆదిశేషునికి, వాయువుకు నడుమ యుద్ధము వాటిల్లినది.

విష్ణు ----- వైకుంఠ ద్వారము ముందరా వారి యుద్ధమా ? సత్వరము ఈ సమస్య పరిష్కరించెదము గాక ( శ్రీ మహావిష్ణువు లేచి బయటికి దారి తీస్తాడు )


బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన - 6[మార్చు]

( దృశ్యము 6---- వైకుంఠము లోపలి ద్వారము. వాయువు ఆదిశేషుల యుద్ధం సాగుతూ ఉంటుంది )

( పాత్రలు--- వాయువు, ఆదిశేషుడు, శ్రీ మహవిష్ణువు )

( శ్రీ మహావిష్ణువు ప్రవేశంతో ఇద్దరూ పోట్లాట ఆపుతారు. ఆదిశేషుడు ఉలికి పడుతాడు )

ఆదిశేష ------ ప్రభూ ! మీ ఏకాంతము, భంగమయినందుకు, యీ దాసుడు చింతిస్తున్నాడు. నన్ను క్షమించండి.

వాయువు ----- ప్రభూ ! ఇతడు నా ఆశయము, నా శక్తి సామర్థ్యములను గుర్తుంచిక నన్నెదరించి పోరుకు పురి గొల్పినాడు. అయినను, నా వలన మీ ఏకాంతమునకు భంగము కలిగినందులకు నన్ను క్షమించండి.

విష్ణు ---- భంగమయిన దేదో అయినది ! మీ ఇరువురి బాలబలములు తేల్చుకొనుటకు, ఇది సరియైన స్థలము కాదు.

వాయువు ----- సరియైన స్థలము చూపి నన్ను అనుగ్రహింపుడు.

ఆదిశేష --- నిజము ప్రభూ ! మీ భవన ప్రాంగణమందు పోరుకు తలబడుట పొరపాటే అయినది. సరియైన స్థలమును చూపి అనుగ్రహించండి.

విష్ణు ----- ఓహో ! మీరిరువురు పోరాటానికే సంకల్పించినారన్న మాట ! అయితే వినండి, భూలోకంలో ఆనందాద్రి మీ పోరాటానికి సరియైన రంగస్థలము !

వాయువు --- (సంతోషంతో ) ప్రభూ ! సరియైన స్థలమును చూపి నన్ను కృతజ్ఞిన్ని చేసారు, ఆ స్థలము నాకు చిర పరిచితము ! నా బలము అక్కడ ద్విగుణీకృతమగుట నిక్కము !

ఆదిశేష ------ వాయుదేవా ! నీ బలము శత సహస్రములైనను, దానిని నిలువరించు సామర్థ్యము గల అనంతుడను నేను ! ( విష్ణువుతో ) ప్రభూ ! మీ ఆజ్ఞ అయినచో నే నీతని పీచమడగించ గలను !

విష్ణు----- తథాస్తు ! అటులనే కానిండు.---- ఆదిశేషా ! నీవు నా క్రీడాద్రి అయిన ఆనందాద్రిని నీ విరాట్రూపముతో చుట్టుకొని యుండుము ! వాయుదేవుడు ఆ పర్వతముపై నీ పట్టును సడలించి, ఎగుర వేయగలిగిన యెడల-------

వాయువు ----- అట్లు చేయునెడల, నేను జయించినట్లు, అంతేనా ప్రభూ ?

విష్ణు ---- అవును ఓడినవారు నా ఆజ్ఞను పాటించక తప్పదు.

ఆదిశేష ---- ప్రభూ ! ఈ దాసునకు మీ ఆజ్ఞ పాటించుటకు, గెలుపు ఓటము;లతో సంబంధము లేదు.

విష్ణు --- తథాస్తు !!

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన - 7[మార్చు]

( దృశ్యము—7 )

( భూలోకంలోని ఆనందాద్రి రణ రంగం. ఆదిశేషుడు ఆనందాద్రిని చుట్టుకొని పడుకొని ఉంటాడు. వాయువు అక్కడికి చేరుకొంటాడు )

( ఆదిశేషుడు, వాయువు )

( ప్రవేశం-- వాయువు )

వాయువు ----- ( తనలో ) ఏమిది ! నా కన్న ముందుగా ఇతనీ చోటికి ఎలా రాగలిగాడు ! సరి, సరి ! వేగ మెక్కువ అయినంత మాత్రమున బలమెక్కువ కాదు గద !!! ( ప్రకాశంగా ) ఓరీ ! అనంతా ! నేను ఆయువు పట్టునైన వాయువును. నిమేష మాత్రమున నీ పట్టు సడలించి యీ గిరి రాజమును ఎగర వేయ గలను.

ఆదిశేషు ---- వాయువా ! నేను నీ ఆయువును ! ప్రగల్భములు వీడి పోరుకు సిద్ధము కమ్ము !

( ఇద్దరికీ పోట్లాట ప్రారంభ మవుతుంది )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన - 8[మార్చు]

( దృశ్యము—8 )

( బ్రహ్మలోకం-- కొంతమంది ఋషులు, దేవతులు, బ్రహ్మదేవును దగ్గరకు వస్తారు. )

దేవతలు ---- బ్రహ్మదేవా ! నమో నమః !!

ఋషులు ---- సృష్టికర్తా ! నమో నమః !!

బ్రహ్మ ---- సురులారా ! ఋషులారా !! మీ రాక మాకు సంతోష దాయకము. వచ్చిన కారణము ---

1 దేవత --- విధాతా ! మీ సృష్టికే వైపరీత్యము సంభవించే సంఘటన భూమి మీద జరుగుతోంది.

1 ఋషి --- అవును పద్మసంభవా ! పెద్ద ప్రమాదం వాటిల్లనుంది.

బ్రహ్మ --- మహా మహితాత్ములారా !! విషయము విస్తారముగా సెలవీయుడు.

2 దేవత --- ఆనందాద్రి దగ్గర-----

2 ఋషి ---- ఆదిశేషునకు, వాయువునకు తీవ్ర పోరాటము జరుగుచున్నది.

3 దేవత ---- ఆ పోరుకు జగత్సర్వమూ ----

3 ఋషి ---- తల్లడిల్లిపోతుంది----

బ్రహ్మ ----- అటులనా ! రండు, వారి పోరాటముని శాంతింప చేసెదను గాక !

( బ్రహ్మ , దేవతలు ఋషులు నిష్క్రమిస్తారు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన - 9[మార్చు]

( దృశ్యము – 9 )

( భూలోకంలోని ఆనందాద్రి. బ్రహ్మ, దేవతలు, ఋషులు వస్తారు )

( ఆదిశేషు, వాయువుల పోరాటం నిర్విరామంగా జరుగుతూనే ఉంది. )

( పాత్రలు---బ్రహ్మ, దేవతలు, ఋషుల గుంపు ఇంకా ఆదిశేషుడు, వాయువు )

బ్రహ్మ ------ వాయుదేవా ! ఈ పోరాటం ఆపండి. యీ ప్రాంతం లోని అలజడిని ఆపండి.

వాయువు --- ( నమస్కరించి ) బ్రహ్మ దేవా ! మీకు నా వందనములు ! మీ రెంత చెప్పినను నే నీ పోరాటమును ఆపజాలను.

బ్రహ్మ ---- ( ఆదిశేషునితో ) అనంతా ! యీ పోరాటానికి అంతే లేదా ?

ఆదిశేషు ---- బ్రహ్మదేవా ! నా స్వామికి పుత్రులైన మీ ఆజ్ఞ నాకు సిరోధార్యమే !-- అయినను నేను నా ఓటమిని అంగీకరించ జాలను.--- వాయువు ఆపినచో, నేనును ఆపగలను.

బ్రహ్మ ---- సరి, సరి ! ఈ తగువు ఇంతటితో తీరునట్లు లేదు ! దేవతలారా , ఋషి సత్తములారా !! రండు, కైలాసపతి కడ కేగి విన్నవించెదము గాక !!!

( బ్రహ్మ , దేవతలు, ఋషులు నిష్క్రమిస్తారు )


బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన --10[మార్చు]

( దృశ్యము 10 )

( కైలాసం --- బ్రహ్మ, దేవతలు, ఋషి సమూహాము ప్రవేసిస్తారు )

( శివ శంకరుడు ధ్యాన మగ్నుడై ఉంటాడు )

( పాత్రలు -- బ్రహ్మ, దేవ ముని సమూహము, ఇంకా శంకరుడు )

బ్రహ్మ ---- ఓం నమశ్శివాయ---

దేవతులు --- ఓం నమశ్శివాయ---

 ఋషులు ----  ఓం నమశ్శివాయ---

( శివుడు ధ్యాన ముద్రనుండి బయట పడి, వారి నందరినీ చిరునవ్వుతో చూస్తాడు )

బ్రహ్మ ----- మహాదేవా ! మీ ధ్యానానికి భంగం కలిగించినందుకు----

దేవతలు,/ఋషులు ---- మేమందరము క్షంతవ్యులము----

బ్రహ్మ ----- అనంత, అనిలుల మహాపోరాటము భూలోకము నందు సమస్యగా ఘనీభవించినది. మీ జోక్యము లేనిదే శాతించేలా లేదు.

శివ ---- బ్రహ్మ దేవా ! మీరు, దేవతలు, మరియు ఋషుల ప్రతినిధులై మా ముందు వచ్చినందుకు, మేము చాల సంతసించితిమి. రండు, వారి పోరును ఆపి, లోక కళ్యాణమును జరిపించెదము గాక !!

( శివుడు, బ్రహ్మ, తదితర దేవ ఋషి సమూహములు అందరూ నిష్క్రమిస్తారు. )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన - 11[మార్చు]

( దృశ్యము---11)

( భూలోకంలోని ఆనందాద్రి. ఆధిశేషుడు, వాయువుల పోరు జరుగుతూనే ఉంటుంది. )

( శివుడు, బ్రహ్మ, దేవ, ఋషి గణాలు ఇంకా మేరువు ప్రవేశిస్తారు )

( శివుని చూసిన ఆదిశేషుడు, వాయువు కాసేపు పోరాటాన్ని ఆపి, అందరికీ నమస్కరిస్తారు )

శివుడు ఆదిశేషుని దగ్గరకు వెళ్తాడు )

శివుడు ------ ఆదిశేషా ! మీ సర్ప జాతితో సంబంధము శివ, కేశవులకు చిర పరిచితము, అవునా ?

ఆదిశేష ----- అది ఏమి ప్రశ్న మహాదేవా ! మీరు పన్నగ భూషణులు, మా జాతికి మీరి ఇచ్చిన గౌరవము, నే నేట్లు విస్మరించ గలను )

శివుడు --- మంచిది అనంతా ! ఆ గౌరవము నీ కున్నది కనుకనే, చనువుతో నిన్నొక మాట అడగ దలచుకొన్నాను. నాతో పాటు, నీవు చుట్ట చుట్టుకొని బిగించి పట్టుకొని యున్న, ఆనందగిరి తండ్రి ; ‘మేరువు’ కూడ వచ్చినాడు.; ( అని మేరు పర్వతుని వంక చూపిస్తాడు శివుడు )

శివుడు --- ( మేరువుతో ) మేరు నగేంద్రా ! మీరు మీ కుమారుడు, ఆనందుని, అతనిని చుట్టి పట్టి, వాయువు తాకిడి నుంచి కాపాడుచున్న ఆధిశేషుని చూచినారు కదా ?

మేరువు ----- ( ఆదిశేషునికి నమస్కరించి ) అనంతా ! నేను నా కుమారుడు ఆనందుని, హరిసేవకే అంకితము చేసినాడను. వైకుంఠము నందు శ్రీవారికి క్రీడాద్రియై, అతడు ధన్యుడయ్యాడని తల పోసాను. ఇంతలో శ్రీవారి చిత్తము మారి, గరుత్మంతుని చేత, వానిని భూలోకమున స్థాపింపజేసి, వానికి ; గరుడాద్రి’ అని కూడ పిలిచేటట్లు, చేసినారు, ఇప్పుడు శ్రీవారి అపరావతారమైన మీరు వాని రక్షణకు పూనుకొని, మీ పేరు మీద వాడు, ‘శేషాద్రి’ అని కూడ పిలువబడే భాగ్యమును పొందినాడు.

ఆదిశేష ----- ( సంతోషంతో ) ఆనందుడైనా, ఆదిశేషుడైనా -- మేము శ్రీవారి దాసానుదాసులము ! పగవారి నుండి, మమ్ము మేము కాపాడుకొనుట మా ధర్మము !! ఇందులకు మీరు నన్నింతలా కొనియాడ నక్కర లేదు.

శివుడు ---- అనంతా !

ఆదిశేష ---- ( నమ్రతతో ) ఆజ్ఞ ! మహాదేవా !!

శివుడు ----- నేను వాయువుతో కూడ మాట్లాడి, పోరును స్థగితము చేసి, శ్రీ హరిని న్యాయ నిర్ణయమునకు పిలిచెదను. నీవు ఆనందునిపై, నీ పట్టును కాస్త సడలించుము.

ఆదిశేష --- మహాదేవా ! మీ ఆజ్ఞ నాకు శిరోధార్యము ! అటులనే చేసెదను. ( అంటూ ఆనందగిరిపై తన పట్టును సడలిస్తాడు. )

(అదిశేషుడు తన పట్టు సడలించడం చూస్తాడు వాయువు. అతనిలో ఒక దురాలోచన కలుగుతుంది )

వాయువు ----- (తనలో ) శేషుడు తన పట్థు సడలించినాడు. ఇదియే సరియైన సమయము ! శ్రీ హరి న్యాయ నిర్ణయమునకు వచ్చు లోపల, నే నీ ఆనందుని ఎగుర వేసెదను గాక !

( వాయువు ఉన్నట్లుండి విజృంభించి తన బలాన్నంతా ఉపయోగించి ఆనంద గిరిని లేపుతాడు. పట్టు వదిలిన ఆదిశేషుడు, క్రిందకు జారి పోతాడు. గాలిలో ఎగిరిన ఆనందుని చూసి, మేరువు తల్లడిల్లుతాడు. చేతులు జోడించి, వాయువును వేడుకొంటాడు )

మేరువు ---- వాయుదేవా ! నాకు పుత్రభిక్ష పెట్టుము. నా కుమారునిపై నీ పగ అర్థము కాకున్నది !! అయినను నేను ఈర్ష్యాద్వేషములతో గాక, నిండు మనసుతో ప్రార్థిస్తున్నాను. నా పుత్రుని కాపాడుము !

( వాయువు మేరువు ప్రార్థన విని, ఆనందుని, మరో క్రోసెడు దూరంలో, జాగ్రత్తగా క్రిందకు దింపుతాడు )

వాయువు ---- ఓ మేరు నగేంద్రా ! నీ కోర్కెను మన్నించి, నీ కుమారునికి ప్రాణభిక్ష పెట్టాను. సంతోషమే కదా ?,

మేరువు --- ధన్యోస్మి, వాయుదేవా ! నేనును, నా కుమారుడును నీకు ఋణపడి ఉండగలము !!

ఆదిశేష ---- ( దీనంగా శివుని వంక చూస్తాడు. ) మహాదేవా ! చూచితిరి కదా యీ అన్యాయము !! మీ మాట మన్నించి నా పట్టు సడలించుట వలన, నే నీనాడు పరాజితుడ నయినాను !!!

శివుడు --- శేషూ ! చింతింపకుము ! వాయువు మనసులోని దురాలోచన, శ్రీవారి సంకల్పమే అయి యుండనోపును !! న్యాయ నిర్ణయ సమయమున , నేను నీకు సహాయము చేసెదను .( అని శివుడు, బ్రహ్మను, తక్కిన వారిని ఉద్దేశించి చెప్తాడు ) బ్రహ్మాది దేవతలారా ! ఋషులారా ! జరిగినదంతయు శ్రీ హరి సంకల్ప ప్రకారమే జరిగినది. ఇప్పుడు అందరము కలిసి, అతనిని ఉద్దేశించి, తదుపరి కార్యక్రమమును అడిగి తెలుసు కొనెదము గాక ! రండు--- శ్రీ హరిని ధ్యానింపుడు.

( శివుడు , దేవతలు, ఋషులు అందరూ నారాయణుని ప్రార్థిస్తారు )

అందరూ --- ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !

( దేవతల స్తోత్రము ముగియగానే శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రవేశిస్తాడు అతనికి అందరూ నమస్కరిస్తారు.)

విష్ణు ------- ఆదిశేషా ! యుద్ధం మగిసినట్లే కద !

ఆదిశేష ----- ముగిసినది మహాప్రభూ ! మీ భృత్యుడు ఈ యుద్ధమున వంచితుడైనాడు.

విష్ణు ----- ఆదిశేషా ! యుద్ధమనిని కేవలము బాహుబల ప్రదర్శన కాదు. బుద్ధి బలము కూడ కావలె ! నీ పని వాయువు తాకిడి నుంచి, అనందుని రక్షణ , అవునా ?

ఆదిశేష --- అవును ప్రభూ

విష్ణు ---- నీ విధిలో నీవు అప్రమత్తత పాటించక పోవుట వలననే, ఓటమిని ఎదుర్కొన్నావు !

ఆదిశేష --- ప్రభూ ! నేను మహాదేవుని ఆజ్ఞ శిరసా వహించి-----

విష్ణు ---- ఆగు అనంతా ! శివునాజ్ఞ పాటించి పట్టు సడలించానంటావు, అంతేనా ?

ఆదిశేష ------ అవును ప్రభూ !

విష్ణు ----- శివునకు, నాకు అభేదము తెలియని వాడవా నీవు ?

ఆదిశేష ---- స్వామీ, అటులయిన -----

విష్ణు --- నా సంకల్పము, శివ సంకల్పము అభిన్నమైనవి కావు. వెయ్యి సంవత్సరముల పాటు, ఆనంద గిరిని, స్థిరముగా నొక చోట నిలుపుట, తరువాత క్రోసెడు దూరమునకు దానిని తరలించుట , ఇదియే లోక కళ్యాణార్థమై మా సంకల్పము !!!

ఆదిశేష ---- ప్రభూ ! మీరు అసురులనే కాక, ఆశ్రితులను కూడ వంచించ గలరన్న మాట !

విష్ణు ---- కర్తవ్య నిర్వహణలో కఠోర నిర్ణయములకు లోబడక తప్పదు. అనంత సృష్టికి కర్తయైన విధాతనైనా, పాలన కర్తనైన నాకైనా, సంహార క్రియా శీలుడైన శివుని కైనా, ప్రకృతి నియమములు పాటించుచూ, లోక కళ్యాణము చేయుటయే కర్తవ్యము !! ఆ విధి నిర్వహణలో అసురులు, ఆశ్రితులు కాగలరు ! ఆశ్రితులు ఉపేక్షితులు కాగలరు.!

( ఆదిశేషుడు ఖిన్నుడై తల వంచుకొంటాడు )

శివుడు ---- ఆదిశేషా ! నా వలన నీవు ఓటమిని పొందడం, విధి నిర్ణయమని తెలిసినది కదా ! నీవు వెయ్యి సంవత్సరములు అనిలుని తాకిడిని నిరోధించి, ఆనంద గిరిని, ఆ గిరికి ఆవలి ప్రాంతాన్ని, కాపాడావు ! జరిగిన మహత్కార్యాచరణలో యీ ఓటమి చాల స్వల్పమయినది అనంతా ! అర్థం చేసుకొని ఆనందించు !!

ఆదిశేష --- మహాదేవా ! మీ ఓదార్పుతో నా మనసు నిర్మల మయినది ---- ( విష్ణువితో ) ప్రభూ ! నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను, నియమము ననుసరించి, మీ ఆజ్ఞా పాలన చేయువాడను . ఆజ్ఞాపించండి.

విష్ణు ---- ఆదిశేషా! ఇప్పుడు నీవు నా ప్రియమైన అనుచరుడవని అనిపించు కొన్నావు !! నీవు పర్వతాకారములో యీ ప్రాంతమందే శయనించి , భవిష్యత్తులో కూడ వాయు ప్రకోపములను నిలువరించి, లోక కళ్యాణము చేయవలెను !

ఆదిశేష ---- ( దుఃఖంతో ) ప్రభూ ! దేవ దేవా !! మీ సన్నిధి నుండి నన్ను బయటకు పొమ్మనుట తగునా ?

విష్ణు ---- అనంతా ! నీవు నా అనుచరుడవని, ఆజ్ఞాబద్ధుడవని, భావించితిని. నీకు ఇష్టము లేకున్న పోనిమ్ము !

ఆదిశేష ---- అంతమాట అనకండి ప్రభూ ! నేను మీ దాసానుదాసుడను, మీ ఆజ్ఞా ప్రకారము అటులనే చేసెదను, కాని -----

విష్ణు ---- నీకు అభయ మిస్తున్నాను అనంతా ! నీ సేవకు మారుగా ఏదైన వరము కోరుకొనుము.

ఆదిశేష ---- ప్రభూ ! మీ సన్నిధి లోని సేవా భాగ్యమునకు దూరము చేసి, వరాన్ని ఇస్తామనడంలో ఔచోత్యం నాకు అర్థమవడం లేదు !!

బ్రహ్మ ------- ఆదిశేషా ! శ్రీ మహావిష్ణువు లీలలు ఎవరికి అర్థము కాగలవు ? వరము అడుగుమని అనుగ్రహించిన మీదట, అడుగుటయే నీ పని !!

శివుడు ---- అనంతా ! నిధి కన్న, సన్నిధి చాల సుఖమని, నిధిని నిరసించిన, నువ్వు నాకు చాల సంతృప్తిని కలిగించినావు. నా మాట మన్నించి, నీ పట్టు సడలించి భంగ పడినావు. -- కనుక శ్రీ హరి కన్న ముందు నేనే నీకు వరమీయ సంకల్పించితిని ! వినుము ఆనందగిరిని చుట్టి పరుండిన , నీ వాల భాగము నందు గల, ‘శ్రీశైలము’ నందున, మల్లికార్జున రూపంతో, భ్రమారాంబా సమేతముగ వెలిసి, నీకును, భూలోక వాసులకును సన్నిధి నీయుటకు సంకల్పించితిని !!!

ఆదిశేష ---- ధన్యోస్మి ! పన్నగ భూషణా ! ధన్యోస్మి !

( దేవతలు, ఋషులు బ్రహ్మ,విష్ణువుతో సహా అందరూ కలిసి ముక్త కంఠంతో )

అందరూ ---- సాధు ! సాధు ! సదాశివా !! సాధు, సాధు !!! మీరు అభిలషించిన మల్లికార్జున రూపము మమ్ములని తరింప జేయును గాక ! శ్రీశైలమునకు మీ రాక కొరకు, మేము చంద్రుని కొరకు చాతక పక్షుల వలె ,ఎదురు చూసెదము !!

బ్రహ్మ ---- శివ శంకరా ! నీ కరుణ అపరంపారమైనది !!! మీ యీ నూతన రూపము వినూత్న శోభలనందు గాక !!

విష్ణు ---- చంద్రశేఖరా ! మీ శ్రీశైల క్షేత్ర ప్రశస్తి ఆచంద్ర తారార్కమగును గాక !! ( ఆదిశేషునితో ) ఆదిశేషా ! శివ శంకరుని అవ్యాజ కరుణను గాంచితివి కదా ! నేను మాత్రము నీకు దూరమయి నివసింప గలనా ! నీ శిరోభాగమున నేను శ్వేత వరాహ రూపమున, భూదేవితో కలిసి, --- మరియు నీ శరీర మధ్య భాగము నందు గల, అహోబిలమందు నృశింహ రూపమున నెలకొని, నీకు నా సాన్నిధ్యాన్ని ప్రసాదించ గలను.

బ్రహ్మ ------ ఆదిశేషా ! నీవు భాగ్యశాలివి ! నీ వాల భాగమున కైలాస పతిని, శిరో_మధ్య భాగములందు, వైకుంఠ వాసుడు, నివాసము చేయగల వారు. ఇక నీకు తృప్తి కలిగినట్లే కదా !?

ఆదిశేష ----- స్వామీ ! ( అని విష్ణుపాదాలు పట్టుకొని వదలక విలపిస్తాడు )

విష్ణు ------ ఇది యేమి అనంతా ! నీ కింకను తృప్తి కలుగనే లేదా ??

ఆదిశేష ----- ప్రభూ ! మీ పరిపూర్ణావతార శ్రీ చరణములను , నా శిరస్సుపై మోపి కనికరింపక, తదితర భాగములందు , అంశావతార రూపమున సన్నిధి నిచ్చుట న్యాయమా ?! ప్రభూ ! ( విష్ణు పాదాలు పట్టుకొనే విలపిస్తాడు. )

విష్ణు ---- ఆదిశేషా ! నివు అత్యాశకు లోనగుచున్నావు.

ఆదిశేష ---- అత్యశ కాదు మహాప్రభూ ! అడియాస ! నా శిరస్సుపై మీ పురుషోత్తమ దివ్య రూప శ్రీచరణములను నెలకొల్పు, వరమిచ్చి, నన్ను కృతార్థునిగా చేయండి.

విష్ణు ----- భూలోక వాసుల శ్రేయమును కోరి, నిన్ను పర్వతాకారమున నిలిపి, నేనును కైలాస పతియును, నీ సేవలకు మారుగా వరముల నిచ్చితిమి.

ఆదిశేష ---- ప్రభూ ! దాసుని ఆంతర్యము తెలిసి కూడ, అరకొర వరము లొసగి, నన్ను తప్పు బూనుట, మీకు పాడి కాదు. ఈ భృత్యుడు మీ చరణ స్పర్శ లేనిదే మనజాలడు.

బ్రహ్మ ----- ప్రభూ ! మీ లీలలు మీకే తెలియ గలవు ! అడిగిన వరమిచ్చి, అనంతుని తృప్తి పరచుట, కరుణా సముద్రులైన మీకు సాధ్యము కానిదా ?

విష్ణు ---- బ్రహ్మదేవా ! అటులనే కానిండు ! ఆదిశేషా ! నీవు అడిగినట్లే , నీ శిరస్సు శ్రీ వేకటేశ్వర రూపమున వసించి, నీ కోరిక తీర్చగల వాడను. కాని, కొంత కాలము నీవు నిరీక్షింపక తప్పదు.

ఆదిశేష ---- ( సంతోషంతో ) ధన్యోస్మి ! ప్రభూ ! ధన్యోస్మి !


బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన --12[మార్చు]

( దృశ్యము—12 )

( భూలోకంలో భృగు మహర్షి ఆశ్రమం )

( మహర్షి భృగు గొప్ప జ్యోతిష సంహిత రచించిన వాడు. ఆగతానాగత వర్తమానాలు క్షుణ్ణంగా తెలిసిన మహా ద్రష్ట. అతనికి ఎదురుగా శిష్యుడు ద్వారకా ఋషి కూర్చొని ఉంటాడు. భృగుడు తన సంహితలోని పాఠం చెప్తూ ఉంటాడు )

భృగుడు ---- వత్సా, ద్వారకా !

ద్వారక ----- గురుదేవా !

భృగుడు ----- జాతక చక్రం పరిశీలించి. ఆయుర్దాయ నిర్ణయం చెయ్యడం తెలుసుకొన్నావు గదా !

ద్వారక ----- మీ దయవల్ల అంతా కరతలామలకం అయింది.

భృగుడు ---- నీ వంటి శిష్యుడు దొరికితే, అధ్యయనం నల్లేరు మీద బండిలా నడిచి పోతుంది ! ఇక ఈ రోజు నుంచి నవమ భావం గురించి చెప్తాను, విను.

ద్వారక ---- చిత్తం గురుదేవా !

భృగుడు ------- (శ్లోకం ) -- “ భాగ్య, ధర్మ, దయా, పుణ్య తపస్తాత్, సుతాత్మజః దానోపాసన, సౌశీల్య, గురవో నవమాదమీ “”

( అదే సమయానికి కుటీరంలోకి ఒక పాము ప్రవేశిస్తుంది . ఆ పాము మహర్షికి ఎదురుగా రాబోయి, శిష్యుడు ద్వారకని చూసి, తిరిగి వచ్చిన దారినే వెనుకకు మళ్లిపోతుంది . ద్వారక దానిని చూస్తాడు. ) ద్వారక ---- గురుదేవా ! అధ్యయనానికి అవాంతరం కలిగిస్తున్నందుకు మన్నించాలి.

భృగుడు ---- ఏమయింది ద్వారకా ?

ద్వారక --- ఒక పాము తమ దర్శనానికి వచ్చి, సంకోచంతో తిరిగి వెళ్లిపోతోంది !

( భృగుడు ఆ పాము వంక చూస్తాడు. మహర్షి చూపు పడగానే పాము ఆగుతుంది. తిరిగి ముందుకు వచ్చి నిలిస్తుంది, భృగుడు దాని వంక తేరిపార చూసి, పిలుస్తాడు )

భృగుడు ------ ఆదిశేషా ! ఎందుకిలా వచ్చావు ?

ఆదిశేష ------(మానవ రూపం దాల్చి ) మహర్షీ ! నా నవమ భావాన్ని క్షుణ్ణంగా పరిశిలించండి.

భృగుడు ----- నీ కేమి ఆదిశేషా ! శివ—కేశవుల సన్నిధిని పొందిన భాగ్యశాలివి ! భాగ్య పరీక్ష నీ కేల ?!

ఆదిశేష ---- మహర్షీ ! నా శిరస్సు పైన, పాద స్పర్శ కలిగేలాగ , నేను శ్రీ మహావిష్ణువును వర మడిగాను.---

భృగుడు ---- ఆదిశేషా ! నీకు వాయువుతో యుద్ధం ఎన్నాళ్లు జరిగింది ?

ఆదిశేష ----- సహస్రాబ్దములు మహర్షీ !

భృగుడు ----- యుద్ధములో పడి, విష్ణు సన్నిధిని అన్ని అబ్దములు విడిచి మనగలిగిన వాడివి, --- ఇప్పుడీ తొందర పాటు ఎందులకయ్యా?

ఆదిశేష ---- (సిగ్గుతో తల దించుకొని ) మీకు తెలియని దేమున్నది మహర్షీ ! పగ – ప్రతీకారములకు లోనైన నా మనసులో, పరమాత్మ గురించి ఆలోచించే వ్యవధి లేక పోయింది.

భృగుడు ----- ఆదిశేషా ! అదే విష్ణు మాయ ! ఆ మాయాజాలము నుండి తప్పించుకొనుట, సాధ్యము కాదు .

ఆదిశేష ----- మహర్షీ ! మీ మాటలు నాకు కొంత ఊఁరట కలిగించినది. కాని నా కోరిక తీరు మార్గము—

భృగుడు ----- చాల కష్ట సాధ్యము అనంతా ! ఎందరో త్యాగధనులు, ఎన్నెన్నో త్యాగాలు చేస్తేనే గాని, వైకుంఠ వాసుని కదల్చుట ---- ( భావ గంభీరంగా ) -- వీలు కాని పని.

ద్వారక ----- మహర్షీ ! ఎందరో మహానుభావులు ఎన్నెన్నో త్యాగాలు చేయాలన్నారు ! వారందరూ ఎవరు ? ఏక కాలంలో ఎలా చెయ్యగలరు ?

( సరిగ్గా అదే సమయానికి ద్వారకా ఋషి చెయ్యిమీద చేరిన ఒక చీమ అతని చేతిని, కరుస్తుంది. ద్వారక చీమని విదిలిస్తాడు. అది వదలధు . ఆ దృశ్యాన్ని చూసిన భృగుడు ద్వారకని ప్రశ్నిస్తాడు )

భృగుడు ---- ఏమయింది ద్వారకా ?

ద్వారక ---- ( నవ్వుతూ ) చీమ కరిచింది మహర్షీ !

భృగుడు ------ దానినలా విదిలించి వేయకు ద్వారకా ! శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని తెలుసుగా !

ద్వారక ----- నిజమే మహర్షీ ! ఈ చీమ నన్ను ఎందుకు కుట్టిందో , తెలుసుకోవాలని ఉంది !

భృగుడు ------ అలాగయితే దానికి నీ వాణిని ఇయ్యి, నాను రూపాన్ని ఇస్తాను .

( ద్వారక, భృగులిద్దరూ, ఆ చీమను తదేకంగా చూస్తారు, చీమ క్రిందకు జారి మానవ రూపం ధరిస్తుంది )

చీమ ---- మహర్షులారా ! ధన్యవాదములు !

భృగుడు ----- వత్సా ! ఎవరు నీవు ? ద్వారకుని అలా కుట్టి, భాదించధానికి కారణమేమిటి ?

చీమ ----- మహర్షీ ! ఈ సృష్టిలో అత్యల్ప ప్రాణినైన నా నివాసం--- హిమాచలం !

భృగుడు ---- ఏమి హిమాలయమా !!

చీమ ----- అవును, నా వయసెంతో నాకే తెలియదు ! అమృత సేవనం వల్ల నేను అమరుణ్ని అయ్యాను !

ఆదిశేష ----- చిన్న పిపీలకమైన తమరు, అమృత పానం ఎలా చెయ్యగలిగారు ?

చీమ ----- అదొక చిత్రమైన కథ ఆదిశేషా ! పరమేశ్వరుడు , సతీ వియోగ దుఃఖంతో కలత పడి, హిమపన్నగం పైన అచేతనావస్థలో నా పుట్ట ప్రక్కనే పడిపోయాడు ! అప్పుడు అతని శిరస్సు పైని చంద్రవంక నేల తాకింది ! అలా నేలని తాకిన చందమామలోని, అమృతాన్ని నేను తనివితీరా జుర్రుకున్నాను !

భృగుడు ----- ( శ్లోకం ) సతీ వియోగేన విషణ్ణ చేతసః ప్రభో శయానస్య హిమాలయా గిరౌ

  			శివస్య  చూడా కలితం సుధాశయం  పిపీలికా చుంబతి  చంద్ర మండలం

అన్న శ్లోకాన్ని నేను కవి చమత్కారమని అనుకొన్నాను ! ఇప్పుడీ పిపీలికోత్తముడు చెప్పినది వింటే నిజంగానే జరిగిందని తెలుస్తోంది !!

చీమ ---- చిత్తం మహర్షీ ! అలా నేను చిరంజీవి నయ్యాను ! శివ స్పర్శ భాగ్యవశమున కలిగింది. కాని లభ్యమయిన మహదవకాశం వల్ల, నాకు తృప్తి కలుగ లేదు !

భృగుడు ----- ఇంకా ఏం కావాలనుకొంటున్నావు ?

చీమ ----- శివ స్పర్శ కలిగినట్లే, కేశవ స్పర్శ కూడా కలగాలనుకొన్నాను. అందుకే హిమాలయం నుండి బయలుదేరిన కొందరు ఋషుల, దుస్తులలో దాగి , ఆనందగిరిని చేరుకొన్నాను---

భృగుడు ---- ఆనంద గిరినే ఎందుకు చేరుకొన్నారు పిపీలికోత్తమా ?

చీమ -----మహర్షీ ! మీరు సర్వజ్ఞులయి కూడ నా వంటి అజ్ఞానిని ఇలా ప్రశ్నించడం, ఆశ్చర్యంగా ఉంది !! వైకుంఠం లోని శ్రీ మహావిష్ణువు క్రీడాద్రిని, స్వామివారి ఆజ్ఞతో వైకుంఠం నుండి తరలించి గరుత్మంతుడు భూలోకానికి తరలించారట ! మేరువు కుమారుడైన ఆనందుడే ఆ పర్వతమట ! దానిపై స్వామి భూలోకానికి, వచ్చినప్పుడల్లా తన దేవేరులతో వాహ్యాళి చేస్తారట ! ఈ కథని నేనా ఋషుల పుంగవుల వద్దనే విని, ఏదో ఒక రోజు , కేశవ దర్శనం కావచ్చునని తలచి, వారితో పాటు ఆ గిరిని చేరుకొన్నాను.

భృగుడు ------ ఆ తరువాత ఏమయింది ?

చీమ ---- ఆ గిరిని ఆదిశేషుడు వచ్చి, చుట్టగా చుట్టి పట్టుకొని వాయువు బారి నుండి రక్షించాడు ! నేను కూడ అతని శరీరాన్నే ఆశ్రయించి, స్మామివారి స్పర్శకు ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నాను. ఈ రోజు ఆదిశేషునితో పాటు, నా భాగ్య పరీక్ష చేసుకోవాలనే, ద్వారకా ఋషిని కుట్టి బాధించాను !

భృగుడు ---- పిపీలికోత్తమా ! మీ కోరిక, ఆదిశేషుని కోరిక రెండూ ఒకటే కావడం, ఇద్దరూ విష్ణు సన్నిధి కోసం ఒకే చోటికి చేరడం, చిత్రంగా ఉంది !!

చీమ ------ మహర్షీ ! మీరు ఆగతానాగత వర్తమానాలు చెప్పగలిగిన ప్రతిభా సంపన్నులు ! శ్రీ మహాలక్ష్మికి జనకులు !! మీరు నా కోరిక తీరునో లేదో తెలియ జేసి, నా మనసుకు ఊఁరట కలిగించండి !

( అదే సమయంలో ఒక చింత చెట్టు రెమ్మ ఎగురుతూ వచ్చి, వారి మధ్య పడుతుంది. భృగు మహర్షి ఆ చింతాకు రెమ్మని చేతిలోకి తీసుకొని పరీక్షగా చూసి, తన ప్రక్కనే పెడతాడు )

భృగుడు ----- మహానుభావులారా !! ఈ చింతాకు రెమ్మ కూడ మీలాగే ఆనందగిరి నుండి వచ్చింది ! శ్రీ మహావిష్ణువు అశ్వద్థ వృక్షానికి కలిగించిన భాగ్యమే , ‘తనకి’ కూడ కలిగించమని వేడుకోడానికి వచ్చింది !! నేడు నా ఆశ్రమ సీమ పవిత్రమయింది ! హరి దర్శనాతురులైన వారి సన్నిధి పొందే భాగ్యము నాకు కలిగింది ! ఆదిశేషా ! పిపీలికోత్తమా ! ! ఓ చింత్రిణీ దళమా !!! మీరందరూ వినండి.

ఆదిశేష, చీమ --- సావధానులమై ఉన్నాము మహర్షీ !

భృగుడు ----- స్వామి ఆనందగిరి యందలి పుష్కరిణికి దక్షిణమున గల ఈ చింతచెట్టు క్రింద, విశ్రమింప గలవారు !! అందు వలన ఆ చెట్టు క్రింద ఒక చక్కని వల్మీక భవనమును నిర్మింపండి ! ఏమి పిపీలికోత్తమా , మీరా పని చెయ్యగలరు గదా !?

చీమ ----- అహో ! నా భాగ్యము,! అటులనే చేసెదను మహర్షీ !

భృగుడు ---- ఆదిశేషా ! స్వామి చింత చెట్టు క్రింద, వల్మీకము నందు రానున్నారు గనుక, నీ వీ చింత చెట్టునందు నీ యంశను నిలిపి, దీనిని నిద్ర పోనీయకము ! (ఎప్పుడూ అన్ని కాలాల లోనూ, చిగురించి ఫలించే చెట్టును నిద్ర ఎరుగని చెట్టు అంటారు ) నీవు శయనించిన రీతిగానే యీ వృక్ష శాఖలను కూడ మలచుకొనుమని చెప్పుము ! (( నాలుగు దిశల వైపు, నాలుగు శాఖలు ఉంఢే యీ ‘చింత’, అంటే నిత్య చింతన గలిగి ఉండేడట ! ))

ఆదిశేష ----- అటులనే మహర్షీ ! ( అంటూ ఆదిశేషుడు మహర్షి దగ్గర నుండి, ఆ చింత రెమ్మను తీసుకొని తన కన్నులకు అద్దుకొంటాడు. )

చీమ ---- మహర్షీ ! నాకు మరల నా రూపమును ప్రసాదించండి ! యీ మానవ శరీరము నాకు దుర్భరముగా ఉన్నది !!

భృగుడు ----- తథాస్తు ! ఇష్ట కామ్య సిద్ధిరస్తు !

( చీమ తన రూపాన్ని పొందుతుంది. ద్వారకా ఋషికి, తిరిగి తన వాణి లభిస్తుంది. )

ద్వారక ----- భృగు మహర్షీ ! నాకీ రోజు చాల సందేహములు పొడ చూపుచున్నవి ! యీ పిపీలికోత్తమునకు తెలిసిన విషయము, నాకు తెలియక పోవుట నా అజ్ఞానమునకు పరాకాష్ట అని అనిపించుచున్నది !

భృగుడు ----- వత్సా ! ద్వారకా ! దిగులు చెందకుము. యీ పన్నగ శ్రేష్టుడు, పిపీలికోత్తముడు సామాన్యులు కారు ! పరమాత్మ సన్నిధిని పొందిన మహా మహితాత్ములు !! వారితో పోలిక మనకు కూడదు. నీకు కావలసిన విషయము నన్నడిగి తెలుసుకొనుము !

ద్వారక ----- మహర్షీ ! ఈ పిపీలకోత్తముడు మిమ్ములను శ్రీ మహాలక్ష్మికి జనకులుగ పేర్కొన్నాడు ! క్షీర సాగర మథనమున శ్రీ మహాలక్ష్మి సముద్రము నుండి, ఉద్భవించెననునది లోక విదితము కదా !! ఆమె మీ కుమార్తె ఎట్లయినది ?

భృగుడు ------ ( నవ్వి ) అదియా నీ సందేహము !! అదొక చిత్రమైన వృత్తాంతము !!

ఆదిశేష ----- మహర్షీ ! నాకు కూడ ఈ వృత్తాతము తెలియదు ! దయతో చెప్పి మమ్ములని కృతార్థులను చేయుడు.

భృగుడు ----- అటులనే కానిండు ! నేను దక్షుని కుమార్తె అయిన ఖ్యాతిని భార్యగా పొంది, ఆమెయందు ధాతృ, విధాతృలనే కుమారులను, లక్ష్మియను కుమార్తెకు జనకుడ నయితిని ! లక్ష్మి జన్మతోనే సంపదలకు అధిష్టాన దేవతయై, ఆ సంపదలకు, ప్రభువైన ఇంద్రుని లోకములో ఉండేది ! ఇలా ఉండగా ఒక రోజు దూర్వాస మహర్షి, ఇంద్ర లోకమునకు విహారార్థము వెడలినాడు.

ద్వారక ----- ఆ పైన ఏమయినది మహర్షీ ?

భృగుడు ----ఒక విధ్యాధర కాంత చేతిలోని పారిజాత మాలని చూసి , ముగ్ధుడైన దూర్వాసుడు, ఆ మాలను ఆమెనడిగి తీసుకొన్నాఢు. దే సమయమున ఇంద్రుడు ఐరావతము నెక్కి అనుచరులు వెంట రాగా అక్కడికి వచ్చినాడు. దూర్వాసుడు ఆ ఇంద్రునికి పారిజాత మాలను బహూకరించినాడు. ఇంద్రుడు ఆ మాలను ఐరావతము నుండి దిగక, నిర్లక్ష్యముతో తన అంకుశముతో నందుకొని, మీదకు లాగే సమయంలో , పారిజాత సుమ సౌరభాలకు చేరిన తుమ్మెదలు రొద చేస్తూ, ఐరావతానికి చికాకు కలిగించాయి.దాంతో ఐరావతము ఆ దండను లాగి, ముక్కలు ముక్కలు చేసి విసిరి వేసినది ! ఆ దృశ్యము చూసిన దూర్వాసుడు ఆగ్రహం చెంది, ఇంద్రుని శపించాడు.

ద్వారక ---- ఏమని శపించారు, మునీంద్రా ?

భృగు ----- ఇంద్రుని సంపదలు రాళ్లుగా మారి, సముద్ర గర్భంలో మినిగి పోతాయని, అతడు పదవీ చ్యుతుడవుతాడనీ, శపించాడు.

ద్వారక--- ఇప్పుఢర్థమయింది మహర్షీ ! సంపదలతో పాటు వాటి అధిస్థాన దేవతయైన లక్ష్మి కూడ, సముద్రమందు పడి, తిరిగి క్షీరసాగర మథనము నాడు, బయట పడిందన్నమాట !?

భృగుడు ----- అవును ! అప్పుడు కూడ లక్ష్మికి కన్యాదానము నేనే చేసాను !

ఆదిశేష ---- శ్రీ మహాలక్ష్మి జన్మ వృత్తాంతము విని, నా కెంతో సంతోషము కలిగినది. పిపీలకునితో పరిచయము కథా శ్రవణము జరిగాయి. ఇక మాకు తరుణోపాయము చెప్పి సెలవీయండి.

భృగుడు ----- ఆదిశేషా ! శ్రీ మహావిష్ణువు వైకుంఠము వదిలి, భూలోకానికి నీ శిరస్సు పైన నెలకొనాలంటే దానికి శ్రీ మహాలక్ష్మి సహకారము కావలె ! లక్ష్మి కదలనిదే విష్ణువు కదలజాలడు ! అందుచేత నీకు వారివురినీ ప్రసన్నం చేసుకొనే మహా మంత్రాన్ని ఉపదేశిస్తాను, విను ! “ ఓం, హ్రీం, హ్రీం, శ్రీం, శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః “ ! ఈ మంత్రాన్ని గాని జపం చేయ్యి. పిపీలికోత్తమా ! మీరు కూడ విన్నారు కదా ?

( పిపీలిక. ఆదిశేషులు తలలు ఊపి, మహర్షికి అభివాదం చేస్తారు. )

ఆదిశేష ----- మహర్షీ ! ఇక సెలవియ్యండి, ఈ నాటి నుంచి, నేనీ మంత్రమును జపించెదను గాక ! ( అంటూ పిపీలికాన్ని తన మీదకి ఎక్కించుకొని , చింత రెమ్మను పట్టుకొని నిష్క్రమిస్తాడు )

ద్వారక ---- మహర్షీ ! ఈ పామును, చీమను చూసాక, నాకు కూడ ఆ మంత్రాన్ని, జపించాలనే కోర్కె బలీయమైంది ! మీరు అనుమతిస్తే------

( ద్వారకా ఋషి ఆ మాట అంటూ ఉండగానే , అతని నెత్తి మీద, రెండు ‘కుంకుడుకాయలు’ పడతాయి. ద్వారకుడు వాటిని అందుకొని చూస్తాడు. )

భృగుడు ----- ద్వారకా ! ఆ మంత్రము నీ ముందు ఉపదేశించినది, అందుకే సుమా ! ఈ కుంకుడు కాయలు నీ మీద పడి, నీవే చెట్టుని ఆశ్రయించాలో, చెప్పక చెప్తున్నాయి ! ఎందరో తపస్సంపన్నులు ఎన్నెన్నో త్యాగాలు చేస్తేనే గాని, శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మితో సహా భూలోకానికి తరలి రావడం జరగదు !

ద్వారక ---- మహర్షీ ! శ్రీ మహాలక్ష్మి మీ పుత్రికే కదా !! ఆమెను పుడమికి పిలిపించలేరా ?

భృగుడు ------ నా పుత్రిక నాథుని సేవలో పడి, అతని హృదయ సీమలో చేరి, నివసించి అంతర్ముఖియై-- లోకాలను చూడడం మానేసింది ! అందుకే యీ లోకం భాగ్యహీనమై, నానాటికీ దిగజారి పోవుచున్నది !! ఆమెను నా ‘ అక్షికుక్షి’ విద్య ద్వారా, జాగృతం చేస్తేనే గాని, పని నెరవేరదు !!!

ద్వారక ----- మహర్షీ ! అక్షికుక్షి విద్య అంటే ఏమిటి ?

భృగుడు ----- కంటి చూపుతో ఎదుటివారి ఆలోచనలను స్తంభింప జేసి, వారిని సమ్మోహితులుగా చేసి, మనం చెప్పాలనుకొన్నది చెప్పి, ఆదేశించి జాగృతం చేయడం !!

ద్వారక ----- శ్రీ మన్నారాయణుని హృదయాంతర వాసిని అయిన, శ్రీదేవిని , మీరు అంతలా ఎలా సమ్మోహనం చేయగలరు ? శ్రీ హరి అట్లు మిమ్ములను చేయనిస్తాడా మహర్షీ ?!

భృగుడు ------ మంచి ప్రశ్నే వేసావు , ఇంకొకరు తేరిపార చూడగల వక్షస్థలమా అది !!!

ద్వారక ---- మహర్షీ ! మరి--- మరి--- మీరా విద్యను ఎలా ప్రయోగించ గలరు ?

భృగుడు ----- ద్వారకా ! నా ఎడమ పాదంలో ఒక కన్ను ఉంది ! ఆ కంటితోనే --- నేనా విద్యను ప్రయోగించ గలను.

ద్వారక ---- మహర్షీ ! యీ వార్త నా కెంతో సంతోషము కలిగించినది ! మరి---- మరి----

భృగుడు ----- ఏమిటి ద్వారకా ?

ద్వారక ----- నా తపోభూమి ఏదో దయతో సెలవిస్తే-----

భృగుడు ---- నాకు తెలిసినచో చెప్పకుందునా వత్సా ! నీపై ఆశీర్వచనము వలె పడిన ఆ కుంకుడు కాయలు ఏ చెట్టువో, నీవే గ్రహించి తెలుసుకోవాలి ! ఆ వృక్ష మూలమే నీ తపోభూమి కాగలదు !

ద్వారక--- ( నమస్కరించి ) ధన్యోస్మి, గురుదేవా , ధన్యోస్మి !!!

( అదే సమయానికి కుటీరం బయటి నుండి పిలుపు వినిపిస్తుంది )

బయటినుంచి ---- “ భృగు మహర్షీ ! భృగు మహర్షీ !!”

( ద్వారక కుటీరం బయటికి వెళ్లి, తిరిగి కాసేపటికి వచ్చి, సంతోషంతో అంటాడు )

ద్వారక ---- గురుదేవా ! బయట అత్రి, వశిష్ఠ, జమదగ్ని మహర్షులు నిలిచి ఉన్నారు, ప్రవేశానికి తమ అనుమతి కోరుతున్నారు.

భృగుడు ----- ఎంతమాట ! నా అశ్రమ ప్రవేశానికి సప్తర్షి ప్రముఖులకు అనుమతి దేనికి ? వారిని సాదరంగా లోనికి ఆహ్వానించు !

(ద్వారక బయటికి వెళ్తాడు. అతను దారి చూపిస్తూ ఉండగా, అత్రి, వశిష్ఠ, జమదగ్నులు లోనికి వస్తారు. భృగు దిగ్గున లేచి వారిని ఎదుర్కొని, కూర్చో పెడతాడు.)

భృగుడు ---- ఋషి పుంగవులారా !! రండు, ఆశీనులు కండు ! ---నా కుటీరం, మీ రాకతో పావనమయింది ! వచ్చిన కారణం సెలవీయండి.

వశిష్ఠ ------ భృగు మహర్షీ ! భూలోకంలో ఆదిశేష, వాయువుల చిరకాల పోరాటం వల్ల, విష వాయువులు వ్యాపించి, జనులలో రకరకాల వ్యాధులు అంకురించాయి.

అత్రి ------ మునీంద్రా ! ఆ విష వాయువులు ప్రజల శరీరాల్నే కాదు, మనస్సులను సైతం మలినం చేసి, వారిని పాప కర్మలకు పురిగొల్పుతోంది !

జమదగ్ని ------ భృగు మహర్షీ ! ఆగతానాగత వర్తమానాలు తెలిసిన మీకు చెప్ప వలసినది ఏముంది ? లోక కళ్యాణం కిసం మేమందరం కలిసి, “ సత్ర యాగాన్ని “ చేయ సమకట్టాము !

వశిష్ఠ ----- ఆ యజ్ఞానికి , యజ్ఞ పురుషుని ఎంపిక మాకు అసాధ్యమయినది !

అత్రి ----- త్రిమూర్తులలో ఎవరు దానికి అర్హులో తెలియజేసే, బారాన్ని మీపై వేయడానికి. మేమిలా వచ్చాము !

జమదగ్ని ----- లోక కళ్యాణం కోసం, మీరా భారాన్ని వహించి, యజ్ఞ పురుషుని ఎంపిక చెయ్యక తప్పదు !

( భృగుడు కళ్లు మూసుకొని ధ్యానంలో పడతాడు )

భృగుడు- -------- ముని పుంగవులారా ! మీ ప్రయత్నము సమంజసము, కడుంగడు ప్రశంసనీయము ! అయినను మీరు నాపై మోపిన భారము, ఎంతో కష్ఠరమైనది ! వినయము, వివేకము, సహనము మొదలయిన సత్త్వగుణ సంపన్నులు త్రిమూర్తులలో ఎవరో, వారిలో మేటి ఎవరో, పరీక్షించిగాని, నిర్ణయించుట జరగదు !!

వశిష్ఠ ----- మహర్షీ ! ఆ పరీక్ష మీరే చెయ్యాలి !

అత్రి ----- మునీంద్రా ! మీరే దానికి సర్వ సమర్థులు !

జమదగ్ని ----- నిగ్రహానుగ్రహ తపోబల సంప న్నులు, భవిష్యావలోకన ప్రతిభా ధురీణులు------

ముగ్గరూ ------ యజ్ఞ పురుషుని నిర్ణయించి, నిర్దేశింపగల న్యాయ నిర్ణేతలు మీరే కావలెను !! ( అంటూ అతనికి నమస్కరిస్తారు )

భృగుడు ----- మహర్షులారా ! లోక కళ్యాణం కోసం, మీరు చేసే మహత్కార్యంలో, నా వంతు సేవ నిర్ణయించి, నాకు మహోపకారం చేసారు ! మీరు కోరినట్లుగ త్రిమూర్తులను పరీక్షించి, వారిలో సత్త్వ గుణ సంపన్ను లెవరో తేల్చి చెప్పెదను గాక !

( ఋషులు ముగ్గురూ వెళ్లిపోతారు. )

ద్వారక ----- గురుదేవా ! ఎందరో మహానుభావులు ఎన్నెన్నో త్యాగాలు చేయాలని , మీరన్న మాటలకు అర్థం ఇప్పుడు తెలిసింది ! అందరి కంటె మహత్తరమైన త్యాగాన్ని, మీరే చెయ్యబోతున్నారు, -- అవునా ?

భృగుడు ----- ద్వారకా !! భూలోకానికి “ లక్ష్మీ వాసుదేవులను” రప్పించడానికి, నా శరీరము , నా విద్య --- నశించిపోతే మాత్రం --- ఏం ?! చేసేది బృహత్క్యార్యమైనప్పుడు, చెల్లించే మూల్యము కూడ గొప్పదే అయి ఉండాలి !!! --- నీవు కూడ , ఆదిశేష, పిపీలక చింత్రిణీ వృక్షముల వలె. విష్ణు సన్నిధి కొరకు, నీ తపస్సును వినియోగించు ! నీ చరిత్ర అజరామరమై నిలుచుగాక !! --

( ద్వారకా ఋషి గురుదేవుల పాదాభివందనం చేస్తాడు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన –13[మార్చు]

( దృశ్యము----- 13 )

( బ్రహ్మ లోకం. బ్రహ్మ ఒక ఆసనం మీద కూర్చొని ఉంటాడు. ప్రక్కనే మరొక ఆసనం ఖాళీగా ఉంటుంది.)

( కొంత మంది ఋషులు అతనికి ఎదురుగా కూర్చొని ఉంటారు. బ్రహ్మ వారితో శాస్త్ర చర్చ చేస్తూ ఉంటాడు )

1 ఋషి ------ బ్రహ్మ దేవా ! సృష్టికి, ప్రతి సృష్టిని విశ్వామిత్ర మహర్షి చేసాడంటారు ! నిజమేనా ?

బ్రహ్మ ----- అవును, విశ్వామిత్రుడు, వశిష్ఠునితో సమానమైన బ్రహ్మర్షి అవాలని ఘోర తపస్సు చేసి, తనని వశిష్ఠుడు గుర్తించాలనే తపనతో ప్రతిసృష్టిని చేసాడు !

2 ఋషి ---- అతను బ్రహ్మర్షి ఎప్పుడయ్యాడు ?

బ్రహ్మ ----- గాయత్రి దర్శనం తరువాత ! గాయత్రి విశ్వామిత్రుని తపోబలం, సంకల్పం నుండి జన్మించిన, సత్త్వగుణ ప్రధానమైన దేవతగా, ప్రసిద్ధి పొంది, బ్రాహ్మణులకు ఆరాధ్య దేవత అయింది !

3 ఋషి ----- బ్రహ్మ దేవా ! గాయత్రీ దేవి రూపాన్ని విశ్వామిత్రుడు ఏ విధంగా ఊఁహించాడు !

బ్రహ్మ ----- చాల అధ్భుతంగా ఊఁహించాడు ! 5 ముఖములు, 8 భుజములు. ముఖములలో మొదటిది ముత్యపు రంగు, రెండవది ప్రవాళపు రంగు, మూడవది బంగారు రంగు, నాల్గవది నీలపు రంగు, అయిదవది ధవళము. ఆ విషయాన్నే శ్లోకంలో ఇలా వర్ణించాడు !

శ్లోకం ముక్తా విద్రుమ హేమ నీల ధవళ చ్ఛాయై ముఖై స్త్రీక్షణై ర్యుక్తా విందు నిబద్ధ రత్న మకుటాం, తత్త్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం ! వరదా భయాంకుశ కశా శ్శుభ్రం కపాలం గదా శంఖం చక్ర మథార వింద యుగళం హస్తైర్వహంతీం భజే !!

( శ్లోకం నడుస్తూ ఉండగానే, భృగు మహర్షి ప్రవేశిస్తాడు. శాస్త్ర చర్చలో ఉన్న బ్రహ్మను, మునులను చూస్తాడు. )

( బ్రహ్మ ఋషులు అతనిని గమనింపరు )

భృగుడు ---- ( తనలో ) ఓహో ! వీరందరును చర్చలో మునిగి, నన్ను గమనింపరైరి ! విషయం సత్త్వగుణ ప్రధాన దేవత అయిన గాయత్రీ దేవిని గురించి ! --- సరి సరి, ఇదియే మంచి సమయము ! ఈ బ్రహ్మ సత్త్వగుణ పరీక్ష చేసెదను గాక !!

(భృగుడు మునుల ప్రక్క నుండి వెళ్లి, బ్రహ్మ ప్రక్కన ఖాళీగా ఉన్న ఆసనం పైన కూర్చొంటాడు. )

( బ్రహ్మ భృగుని చూస్తాడు. అతనికి కోపం వస్తుంది )

బ్రహ్మ ------ ఓ భృగూ ! నీవు నాకు వందనాదులు చేయక, స్వాతిశయము కలవాడవై, సర్వజ్ఞడవను గర్వమున, నా ప్రక్కనున్న సరస్వతీ పీఠము పైననే. ఆశీనుడవైనావు !! నీ చర్య బ్రాహ్మణ విరుద్ధముగా నున్నది ! --- నీవును, నీ వంశము వారును, ఏడు పురుషాంతరముల పిమ్మట, దారిద్ర్యమును అనుభవింతురు గాక !! ( అని శపిస్తాడు )

భృగుడు ----- ఓ బ్రహ్మా ! నీవు రజోగుణము కలవాడవు ! నీవు సృష్టికర్త నన్న అహంకారముతో, నన్ను పలుకరింపక, గౌరవించక, -- నిష్కారణముగ నా వంశము వారిని శపించితివి ! -- నా వంశమున బ్రహ్మ ద్వేషులు, అనాచార పరులు మాత్రమే నీ శాపమునకు గురి యగుదురు గాక !! సదాచార పరులు పరోపకారము చేయువారు నీ శాపమునకు గురి కాకుందురు గాక !!! -- నీవు నన్ను అగౌరవము చేసినందున , నీకు భూలోకమున దేవాలయాదులు పూజలు లేకపోవును గాక !!!

( అని ప్రతి శాపము ఇచ్చి  నిష్క్రమిస్తాడు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన - 14[మార్చు]

( దృశ్యము-- 14)

( కైలాసంలోని ఒక తోట)

( తోట బయట ‘ కాలభైరవుడు’ కాపాలా కాస్తూ ఉంటాడు)

( భృగు మహర్షి ప్రవేశించి కాలభైరవుని చూస్తాడు )

భృగుడు ------ కాలభైరవా ! నేను సప్తర్షుల పనుపున బృహత్కర్య నిర్వహణకై వచ్చితిని ! మహా దేవునితో మాట్లాడవలె !!

కాలభైరవ ----- మహర్షీ ! మీరు కాసేపు వేచి ఉండండి. నేను వారికి మీ రాక నెరిగించి, ప్రవేశమునకు అనుమతి నడిగి వచ్చెదను. ( అని కాలభైరవుడు లోపలికి వెళ్తాడు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన - 15[మార్చు]

( దృశ్యము --15)

( కైలాసం లోని తోటలోపలి రమ్యమైన లతా నికుంజము )

( కాలభైరవుడు అక్కడికి వస్తాడు. పార్వతీ దేవి ఒక చెట్టు క్రింద కూర్చొని ఉంటుంది. శివుడు ఆమె తొడపై, తల పెట్టి పడుకొని, ఆమె ముఖంలోకి చూస్తూ ఉంటాడు )

( పార్వతి శివుని జటాజూటము లోని, చిన్న పాయను తీసుకొని, జడ అల్లుతూ ఉంటుంది. జడ బిగించి లాగిన ఆమె, అల్లరికి శివుడు గుటక వేస్తాడు ! పార్వతి నవ్వుతుంది )

శివుడు ----- దేవీ ! నీ మందహాసమునకు కారణమేమి ?

పార్వతి ----- ప్రభూ ! ఏమియును లేదు !

శివుడు ---- కాదు, ఏదియో ఒకటి ఉన్నది !

పార్వతి ----- మరేమీయు లేదు ప్రభూ ! ఇప్పుడు గుటక వేసితిరి కదా ! మీ కంఠమున కాలకూట గరళము నిగళమగుట నుండి, ఎట్లు కాపాడుచున్నారో నని నవ్వుకొంటిని.

శివుడు ----- ( పరిహాసముగా ) దేవీ ! నేనా విద్యను నీ దగ్గరనే నేర్చితిని !

పార్వతి ------ ( ఆశ్చర్యంతో ) ఏమి స్వామీ ! నా కడనా ?

శివుడు ----- అవును దేవీ ! నీ అధరములందు మధు రసములను దాచుకొని, దానిని బయటికు చింద నియ్యక, కెంపు రంగు ద్వారములను ఎట్లు ఏర్పరిచితివో. --- అటులనే నేను కూడ గరళ నిగళము కాకుండా గళములో నీలి రంగు తెరలను ఏర్పరచుకొన్నాను !!

( శివుని మాటలకు పార్వతి కిల కిలా నవ్వుతుంది. ఆ దృశ్యాన్ని చూసిన కాలభైరవుడు తన్మయత్వంతో తను వచ్చిన పని మరచిపోతాడు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన - 16[మార్చు]

( దృశ్యము 16—దృశ్యము 14 లాగే ! కైలాసం లోని తోట బయటి గేటు )

( భృగు మహర్షి కాలభైరవుని రాకకు ఎదురు చూస్తూ ఉంటాడు. అతనికి విసుగెత్తుతుంది )

భృగుడు ------ ఎప్పడనగా వెళ్లిన , యీ కాలభైరవుడు ఇంకా రాడేమిటి ! అయినను వాని రాకకై నే నెందుకు ఎదురు చూడాలి ? పరీక్షించడానికి వచ్చి, ఇలా నిరీక్షిస్తూ కూర్చొంటే ఎలాగ ? -- లోపలికి వెళ్లి చూసి వచ్చెదను గాక ! ( భృగువు లోపలికి వెళ్తాడు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన - 17[మార్చు]

( దృశ్యము 17 )

( కైలాసం లోని రమ్యమైన లతా నికుంజము , దృశ్యము 15 లాగే ! )

( భృగుని రాక కాలభైరవుడు చూస్తాడు )

కాలభైరవ ------ ( తనలో ) అయ్య బాబోయ్ ! మహర్షి విషయం మరచే పోయాను. ఇతను నారి సంధించి వదిలిన బాణంలాగ దూసుకొని వచ్చేస్తున్నాడు ! శివ శంకరునకీ విషయం చెప్పే వ్యవధి కూడా లేదు ! ఇప్పుడు కర్తవ్యమేమిటి ?---- ( ఆలోచించి ) ఆ ! అవును ! ప్రక్కకు తిరిగి పారిపోవడమే మంచిది !! (కాలభైరవుడు పారిపోతాడు )

( పార్వతీ పరమేశ్వరులు ప్రణయ సల్లాపాలలో ఉంటారు. పార్వతి కిల కిలా నవ్వుతుంది. శివుడు ఆమె నవ్వులో అందాన్ని, చూసి పరవశుడవుతాడు ! )

( భృగువు ప్రవేశిస్తాడు )

( భృగువు , ఉమా మందహాసాన్ని చూసి మైమరిచి పోతాడు ! అతని నోటి నుంచి ఆమె మందహాసాన్ని స్తుతిస్తూ, కవిత్వ ధార వెలువడుతుంది )

భృగుడు ------ ( శ్లోకం ) సహాదరేణ యోవ లక్ష పారిజాత మాలయా గలస్థలీ విభూషయా, ధ్వనిం వినైవ భాషతే, మహేశ పుణ్య యోషితో మనోజ్ఞ హాస ఏషమే విభూతయే ప్రకల్పితాం , విధూతయేచ పాప్మనాం !!

తల్లీ ! కంఠాభరణమై ప్రకాశించు , ధవళ వర్ణము గలిగియున్న పారిజాత పుష్పమాలలతో కూడి, ఆదరము గల్గి, ధ్వని లేకుండునట్లు, సంభాషించుచున్న మహేశ పత్నివగు నీ మందహాసము, నా ఐశ్వర్యమునకు, పాప ధ్వంసమునకు కారణమై , నన్ను రక్షించు గాక !

( భృగుని స్తోత్రానికి పార్వతీ పరమేశ్వరులు ఉలిక్కి పడతారు. పార్వతి నాథుని తలని పైకెత్తి, లేచి పోతుంది జరిగిన రస భంగానికి శివునికి కోపం వస్తుంది. )

శివుడు ----- ఓయి భృగూ ! నీవు అనుమతి లేక, నా కేళీవనమున ప్రవేశించి, సమయా సమయములు పాటింపక నా ప్రణయ దేవత, ఏకాంతములో నా కొసగిన మందహాసమును, వర్ణించి, రసభంగము చేసితివి ! నేను నిన్ను ఉపేక్షింప జాలను ! నా త్రినేత్రాగ్నిలో నిన్ను భస్మము చేయగలను.

భృగుడు ------ రుద్రా ! నే నామెను మాతగా భావించి , ఆమె మందహాసమును వర్ణించితిని. కవి హృదయము తెలియని నీ కది తప్పు అయినది ! నీ త్రినేత్రాగ్ని నన్నేమియు చేయజాలదు !

( శివుడు భృగుని మాటలకు మండి పడతాడు )

శివుడు ---- ఓయీ ! భృగూ !! నీ అహంకారము మితి మీరినది ! ఇక ఉపేక్షించుట తగదు. ( అంటూ శివుడు తన త్రినేత్రమును తెరుస్తాడు )

( అతని మూడో కంటి నుండి అగ్ని జ్వాలలు వెడలి, భృగుని వైపు వెళ్తాయి )

( భృగుడు భయ పడక తన ఎడమ కాలికున్న కన్ను తెరచి, ఆ మంటలకి ఎదురుగా పెడతాడు )

( అతని కాలికి ఉన్న జలనేత్రం నుండి, జలధారలు పడి శివుని త్రినేత్రాగ్ని చిత్రంగా వెనకకి మరలుతుంది !!)

శివుడు ---- శివా ! చూసితివి కదా ! నీ త్రినేత్రాగ్ని ప్రకోపము !! -- బ్రహ్మ హత్యా పాతకము నుండి, నీవీ విధమున బయట పడితివి !!

శివుడు ----- భృగూ ! నిజము పలికితివి ! బ్రాహ్మణుడ వగుట చూచి, నా త్రినేత్రాగ్నిని, నేనే మరల్చినాడను ! కాని ఇది నీ జలనేత్ర ప్రభావము కాదు !-- జల ప్రభావము వలన అగ్ని తిరోగమనము చెందుట కాంచితివా ? అయినను నీతో చర్చలేల !! బ్రాహ్మణుడవన్న అహంకారమునకు లోబడిన నీకును, నీ జాతికిని, బుద్ధి చెప్పవలె !! ---- “ భూలోకమున నీ బ్రాహ్మణ జాతి కలియుగమున 6000 సంవత్సరముల నాటికి, నామ మాత్రమగుదురు గాక !!” ( అని శపిస్తాడు )

భృగుడు ----- “ శివా ! నీవును కలియుగమున ఆకార స్వరూపునిగా కాక, లింగ రూపమున, శిరస్సునందు అభిషేకాదులతో పూజలందుదువు గాక ! “ ( అని ప్రతి శాపం ఇచ్చి, వెళ్లి పోతాడు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన - 18[మార్చు]

( దృశ్యము – 18 )

( వైకుంఠము. శ్రీ మహావిష్ణువు పాన్పుపై అరమోడ్పు కనులతో పడుకొని ఉంటాఢు . శ్రీ మహాలక్ష్మి అతని పాదసేవ చేస్తూ ఉంటుంది ).

(భృగుడు  ప్రవేశించి ఆ  దృశ్యాన్ని చూస్తాడు )

భృగుడు ----- ( తనలో ) జామాత అరమోడ్పు కనులతో శయనించి ఉన్నాడు ! అనిమేష నయనుని నయనాలు, అరమోడ్పు లయినవి !! ఇక నా ధుహిత --- పతి పాద సేవలో ప్రపంచమునే మరిచినది !! వీరిరువురు యీ విధమున నుండిన భూలోక వాసులు సిరి సంపదలకు కరువైన వారయి, కడగండ్ల పాలవక తప్పదు !!! శ్రీవారు ప్రమత్తులయి శయనించి ఉన్న సమయమిది ! -- ఇదే మంచి సమయము--- లక్ష్మిని జాగృతమొనర్చెదను గాక !!

( భృగుడు  నేరుగా  వెళ్లి, శ్రీ  మహావిష్ణువు  గుంఢెల  పైన  కాలితో  తంతాడు )

( లక్ష్మి అదరి పడుతుంది ! విష్ణువు ఉలిక్కి పడతాడు. దిగ్గున లేచి భృగుణ్ని చూస్తాడు )

విష్ణు ---- తమరా, మహర్షీ ?! ( అని భృగువు దగ్గరగా వస్తాడు ) మీ రాక గమనించి గౌరవించ నందుకు, మంచి శాస్తియే చేసితిరి. భృగు మహర్షీ, మీరు సామాన్యులు కారు ! ( పద్యము )

సీ --- ద్విదళ సరోజమౌ , దివ్య చక్రం బీవు/ భ్రూమధ్యమున నున్న బుద్ధి వీవు కన్నులలో నుండు, కాంతి పుంజంబీవు/ చింతచే నందెడు చింత నీవు నిన్ను చేరనివారు నా దరికేగరు / నీదు పదములాన నీరజాక్ష ! కౌస్తుభంబు తగిలి కందెనా పాదంబు / భాద కలిగెనేమొ భధ్ర చరిత !

( అని మహర్షిని పాన్పుపై కూర్చోబెట్టి, అతని వామ పాదం పిసుకుతూ --)

ఆ.వె--- మౌనివర్య ! నన్ను మన్నించి గావుమా పాదములను బట్టి ప్రణతు లిడుదు తన్ని నందుకేను, చింతింప లేదయ్య భరతాక్ష్మాకుమార , భృగు మహర్షీ !!

( అంటూ కాలిలో నున్న కంటిని పొడిచి, మూసివేస్తాడు )

భృగుడు ---- శ్రీ మహావిష్ణూ ! నీవు కదా సత్త్వగుణ సంపన్నుడవు ! ---( పద్యము )

ఆ.వె--- సారసాక్ష ! వినుము, సత్ర యాగంబును, చేయదలచినారు, సప్త ఋషులు వారి పిలుపు నంది, వస్తి నే నిచటకు సత్త్వ పురుషు నెన్ను సంబరమున కాని, యెంచి చూడ కమలాక్ష నీకన్న యజ్ఞ పురుషు డెవరు, యదువరేణ్య !!

 (అని స్తుతించి ) ప్రభూ ! యాగ ఫలమును  తమరే స్వీకరింప  వలెను !

విష్ణు ----- భృగు మహర్షీ ! అట్లెయగు గాక !

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన - 20[మార్చు]

 (దృశ్యము 20 )

( భూలోకంలోని ఆనందగిరి. ఆదిశేషుడు , పర్వత రూపంలో తపస్సు చేస్తూ ఉంటాడు )

ఆదిశేష--- ఓం , హ్రీం, హ్రీం, శ్రీం, శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః

( అదే గిరి మీద, చింత చెట్టు క్రింద, చీమల పుట్ట, ఆ పుట్ట లోంచి, పిపీలకుడు తపస్సు చేస్తూ ఉంటాడు )

చీమ -- ( పుట్ట లోంచి ) ఓం , హ్రీం, హ్రీం, శ్రీం, శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన - 21[మార్చు]

 ( దృశ్యము  21 )

( భూలోకంలోని ద్వారకా తిరుమల ప్రాంతం.! అక్కడే ఉన్న ఒక కుంకుడు చెట్టు క్రింద ద్వారకా ఋషి ఒంటి కాలిపై నిలబడి, తపస్సు చేస్తూ ఉంటాడు )

ద్వారక ------ ఓం , హ్రీం, హ్రీం, శ్రీం, శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః

( దృశ్యము 21 )

( ఆకాశం--- నారదుడు ఆకాశం నుండి ఆదిశేషు, పిపీలక, ద్వారకల తపస్సు చూస్తాడు )

నారద ----- అనంతా ! నీకీ మంత్రాన్ని నేర్పిన భృగుమహర్షిని, నిజంగా అభినందించాలి ! నారాయణునితో పాటు, లక్ష్మి కూడా ప్రసన్నమవుతేనే, నీ శిరస్సుపై స్వామి ఆగమనం జరుగుతుందనేది భృగుని ముందు చూపు ! --- నిన్ను తపస్సుకి పురికొల్పి, భృగుడు --- సప్తర్షులు తల పెట్టిన యాగానికి యజ్ఞ పురుషుని ఎంచే నెపంతో, విష్ణు వక్షస్థల వాసిని అయిన లక్ష్మిని తన్నినట్లే తన్ని, రోష పూరితురాలిని చేసాడు ! భూమిక సిద్ధమయింది ! నా పాత్రను నేను నెరవేర్చెదను గాక ! నారాయణ , నారాయణ !! ---( అంటూ వైకుంఠం వైపు దారి తీస్తాడు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన - 22[మార్చు]

( దృశ్యము 22 )

( వైకుంఠము . శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి భూదేవి ఉంటారు. నారదుడు ప్రవేశిస్తాడు )

నారద --- నారాయణ, నారాయణ !! విశేషమైన శ్రవణ శక్తి గల లక్ష్మీ వాసుదేవులకు నా నమస్కారములు ! తల్లీ ! భూదేవీ !! నీకును నా నమస్కారములు !!

భూదేవి ----- నారదా ! నీ మాటలలో లక్ష్మీ వాసుదేవుల శ్రవణ శక్తి ప్రసక్తి ఏల ?

నారద ----- తల్లీ ! భూదేవీ ! నీకు తెలియని విషయమా ఇది ! నీ లోకంలో ఒక చీమ, ఒక పాము, మరొక ఋషి, ఉగ్ర తపస్సు చేస్తున్నారు ! వారి తపస్సుకు లోకములు తల్లడిల్లు తున్నాయి ! – ప్రభూ ! మీరు వైశ్రవణులు ! మీ కర్ణ పుటములకు ఇంకా వారి పిలుపు అందలేదా ?

విష్ణు ----- నారదా ! ఆదిశేషుడు , లక్ష్మీ ప్రసన్నం కోరుతున్నాడు ! నాతో పాటు లక్ష్మి రానిదే , నేను ఒంటరిగా ఎటుల వెళ్లగలను ?

నారద ---- తల్లీ ! శ్రీ దేవీ !! శ్రీవారి చిత్తము భక్తుని కడకు పోవుటకై త్వరపడుచున్నది ! మీరు ఉపేక్షించుట తగునా ?

శ్రీ దేవి ---- నారదా ! స్వామి భూలోక వాసులయిన యీ వైకుంఠమున ఎవరుండ గలరు ?

నారద --- తల్లీ ! నీ వెక్కడ నున్న శ్రీవారి కదియే వైకుంఠము కాగలదు !

శ్రీ దేవి ----- అయన నన్ను కూడ భూలోకమునకు పొమ్మందువా నారదా ?

నారద ----- తల్లీ ! వైకుంఠమున నీకు గౌరవ మెక్కడిది !? మొన్నననగా మొన్న భూలోక వాసియైన , భృగు మహర్షి వచ్చి, నీ నాథుని వక్ష స్థలమును తన్ని పోయినాడు ! --- తన్నిన వాడు బ్రాహ్మణుడని చెప్పి, దయాసాగరుడైన నీ నాథుడు అతనిని క్షమించి విడిచి పెట్టాడు !! కాని--- అతని వక్షస్థలమందు సదా నివసించే నీకు కలిగిన పరాభవము గురించి తలుపనైన తలపడు !!!

శ్రీదేవి ----- నిజమే నారదా ! భృగుని చేత అవమానము పాలైన నాటినుండి, నాకీ వైకుంఠము నందు, మనసు నిలుచుట లేదు ! స్వామి వచ్చినను రాకున్నను, నేనీ లోకమును విడిచి పోవుటకే తలచు చున్నాను !

విష్ణు ----- దేవీ ! నీవు వెడలిన చోట నీ నాథుడు, నిముషమైన మనజాలడు ----

నారద ---- తల్లీ ! శ్రీవారు ఇచ్చకపు మాటలాడుచున్నారు !!

శ్రీదేవి ----- అవును నారదా ! అవమానము జరిగినది నాకు ! అతనికి కాదు గదా !?

విష్ణు ----- దేవీ ! అటులైన -----

శ్రీదేవి ------ నేనీ వైకుంఠము వదిలి వెళ్లుటకు నిశ్చయించితిని ! ( అంటూ శ్రీదేవి అంతర్థానమవుతుంది )

విష్ణు ----- దేవీ ! శ్రీ దేవీ !!----( నారదుని వైపు చూసి-- ) నారదా ! ఎంత పని చేసితివి ? భృగు వృత్తాంతము జ్ఞాపకము చేయుట ఏల ? -- ఇప్పడేమి చేయ వలెను !?

నారద ----- స్వామీ ! నేనే పాపము ఎరుగను ! ఏదో ప్రసంగ వశమున భృగుని పేరెత్తితిని గాని -----

విష్ణు ----- నారదా ! నా కొంప ముంచితివి ! లక్ష్మి లేని వైకుంఠము నా కేల ?-- ( అని విష్ణువు కూడ అంతర్థానమవుతాడు )

నారద ---- తల్లీ ! భూదేవీ !! అందరూ నీ లోకానికే చేరుకొన్నారు. ఆదిశేషుని కోరిక తీరే సమయం ఆసన్నమయింది . మరి నీవు ---- ?

భూదేవి ----- లక్ష్మీ వాసుదేవులు బహుశా ఆనంద గిరికే వెళ్లి ఉండవచ్చును ! నేను ముందుగానే అక్కడ వెలసిన ఆది వారాహ స్వామి సన్నిధిని చేరెదను గాక !!-----( భూదేవి కూడ అంతర్థానమవుతుంది )

నారద ---- ఆహా ! విధి వైపరీత్యమనిన ఎంత బలమైనది ! --- వైకుంఠము వంటి భవ్య నివాస సౌధమునకు కూడ కళావిహీనమగు దుస్థితి కలుగ గలదని ఎవరూహించెదరు !! -- ఈ విషయమును కైలాస పతికి, బ్రహ్మదేవునికి తెలియ జేసి, శ్రీ మహావిష్ణువు భూలోక గమనాన్ని ఒక కంట కనిపెట్టి ఉండమని చెప్పవలె !! ( అంటూ నిష్క్రమిస్తాడు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన-23[మార్చు]

( దృశ్యము 23 )

( బ్రహ్మలోకం-- బ్రహ్మ జపమాలతో జపం చేస్తూ ఉంటాడు )

( నారదుడు ప్రవేశం )

నారద ------ నారాయణ, నారాయణ !

( బ్రహ్మ కళ్లు తెరచి చూస్తాడు. నారదుని వంక చూసి చిరునవ్వు నవ్వుతాడు )

నారద ----- జనకా ! నమస్కారములు !

బ్రహ్మ ----- వత్సా ! ఆశీస్సులు ! నీవు వచ్చిన కారణము ?

నారద ---- విధాతా ! కాల వైపరీత్యము వల్ల లక్ష్మీదేవి రసాతలమును, వైకుంఠమును వదిలి, భూతలమునకు ఎటు వెళ్లినదో తెలియనీయక మాయమైనది !,

బ్రహ్మ ---- నారాయణుడు కూడ, ఆమెను వెదకుచు భూలోకమునకు బయలుదేరెను, అదియేనా ?—

నారద ____ అదేయే జనకా ! వారిరువురు పోయిన జాడ తెలియక, నా మనసు ఆతుర పడుచున్నది !

బ్రహ్మ ---- నీ మనమున ఆత్రుతయా ! కలహమును ఎగత్రోసి, వారిని వేరుచేసినది నీవు ! ఇప్పుడు ఆతుర నందుట చిత్రముగా నున్నది !

నారద ----- తండ్రీ ! మీరిటుల అపహాస్యము చేసిన నేనేమి చెప్పగలను ? వైకుంఠమా రిక్తమయినది ! స్వామి భ్రమణ శీలులయినారు ! భక్తులకు వారి దర్శనమెట్లు కాగలదు ?

బ్రహ్మ ----- యోగ దృష్టితో అంతరంగమున , వారి దర్శనము చేయలేవా నారదా ? ఇంత బేలతన మేల ?

నారద ----- తండ్రీ ! ఇది నా ఒక్కని సమస్య కాదు గద !

బ్రహ్మ ----- ( నవ్వి ) అర్థమయినది నారదా ! లక్ష్మీ నారాయణులు అవతారము లెత్తిన సమయమున, శ్రీ సూర్య నారాయణుడే, నారాయణుడన్న మాట మరచితివా ? వారెటు పోయినది, కర్మ సాక్షి అయిన ఆయనకే తెలియనోపును !

నారద ----- తండ్రీ ! నాకు సెలవీయుడు ! నేను సూర్యనారాయణుని కడకు, వెళ్లి వచ్చెదను ! ( అంటూ నిష్క్రమిస్తాడు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--24[మార్చు]

( దృశ్యము 24 )

( సూర్యలోకం. సూర్యుడు కూర్చొని ఉంటాడు. ప్రవేశం నారదుడు )

నారద ----- నారాయణ, నారాయణ !

సూర్య ----- నమోవాకములు నారద మహర్షీ ! బ్రహ్మలోకము నుండియే కదా మీ రాక ?

నారద ----- అవును సూర్యనారాయణా ! జగచ్ఛక్షువయిన నీకు, నా రాకపోకల పరిశిలన కేమి గాని, శ్రీ లక్ష్మీ నారాయణుల జాడ, తెలియ జేసిన బాగుండును !

సూర్య ----- నారద మహర్షీ ! శ్రీ దేవి, భరత వర్షమున, గంగానదికి పశ్చిమ భాగాన ఉండే, “ కరివీర పురమును’ ( కొల్హాపూరు ) చేరి తన దశ దిశలయందు యోగినీ గణములను కొలువుంచి, తన జాడ శ్రీ నారాయణునుకి తెలియకుండ జాగ్రత్త పడి తపస్సు చేయుచున్నది ! మహర్షీ ! ఇది దేవ రహస్యము !!

నారద ---- అటులనా పద్మమిత్రా ! మరి నారాయణుని మాట ఏమిటి ?

సూర్య ----- దేవర్షీ ! శ్రీవారు లక్ష్మిని వెతుకుతూ, భ్రమణ శీలురై కాశీ, విశ్వనాథుని దగ్గర ఉన్నారు ! చూడండి !---

( సూర్యుడు నారదుడు కాశీ వైపు చూస్తారు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--25[మార్చు]

( దృశ్యము  25 --- కాశీ విశ్వేశ్వరాలయం. విష్ణువు  లింగానికి నమస్కారం ధ్యానం  చేస్తూ, కనిపిస్తాడు ) 

విష్ణు ----- “ బ్రహ్మ మురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం, జన్మజ దుఃఖ వినాశక లింగం, తత్ప్రణమామి సదాశివ లింగం. దేవముని ప్రవరార్చిత లింగం, కామదహన కరుద్మాకర లింగం రావణదర్ప వినాశక లింగం. తత్ప్రణమామి సదాశివ లింగం. సర్వసుగంధ సులేపిత లింగం, బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందిత లింగం, తత్ప్రణమామి సదాశివ లింగం --- “

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--26[మార్చు]

( దృశ్యము 26-- సూర్య లోకం )

( సూర్యుడు, నారదుడు ఉంటారు )

నారద ---- భాస్కరా ! ప్రభువు కోసం, ఆదిశేష, పిపీలికులు శేషాచలమందును. ద్వారకా ఋషి, కుంకుడు చెట్టుక్రింద తపస్సు చేస్తున్నారు. లక్ష్మీదేవి తన జాడ తెలియనీయక కాపలా పెట్టుకొన్నది ! అందరూ తలో దిశా తపస్సు చేస్తున్నారు ! స్వామి కనీసం భక్తుల దగ్గరకి చేరేది ఎట్లాగ ?

సూర్య ----- నారద మునీ ! మీకు తెలియని సమయాచారములు లేమున్నవి ? నారాయణునికి ఇష్టమైన తిథివారనక్షత్రాదులు మీకు తెలియవా ? వాటి నన్నింటిని కాలవశమున ఒక చోట చేర్చగలిగిన మీ సంకల్పము నెరవేర గలదు !

నారద ---- అర్థమయినది, సూర్యనారాయణా ! నీ కిష్థమయిన మాసము ఏది ?

సూర్య ----- భాద్రపద మాసము ! ఆ మాసమందే నేను స్వక్షేత్రమయిన సింహరాశిలో సంచరించు చుందును !

నారద ---- వారము ?

సూర్య ---- శ్రీవారు ఒకరికి ఒక విషయమునే అనుగ్రహించెదరు. అందువలన వారము, సోముని వారము !

నారద ---- అయన సోమవారమన్నమాట ! తిథి, నక్షత్ర యోగాదులు-----?

సూర్య ----- మహర్షీ ! యీ జ్యోతిషాంగములన్నియు చంద్రుని అధీనములు గాదా ?

నారద ---- మంచిది, అటులయిన నేను చంద్రుని కడకు పోయి, తెలుసు కొనెదను గాక !

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--27[మార్చు]

( దృశ్యము 27 . చంద్రలోకం. )

(చంద్రుడు నక్షత్రకాంత శ్రవణం ఉంటారు, ప్రవేశం నారదుడు )

నారద ----- నారాయణ, నారాయణ !

చంద్ర ------ నారద మునీంద్రులకు స్వాగతం !

శ్రవణం ------ దేవర్షీ ! ఇటు ----- వచ్చి ఆశీనులు కండు .

నారద ---- దక్షపుత్రీ ! కార్యార్థుడనై వచ్చిన వాడను, సుఖాశీనుడ నెట్లు కాగలను ?

చంద్ర ----- మునీంద్రా ! అంత అవసర పడి, వచ్చినారా ?

నారద ----- అత్యవసరమగు కార్యము ! చంద్రా, స్వామి నారాయణుడు, భూలోకమున భ్రమణ శీలుడై సామాన్యుని వలె సంచరించు చున్నాడు. అతని సన్నిధి కొరకు, ఉగ్ర తపము చేయుచున్న ఆదిశేష, పిపీలికల వద్దకు శ్రీవారిని చేర్చ వలెను ! అందుకు నీ వల్ల కాగల కార్యములు -----

చంద్ర ----- ఆజ్ఞాపించండి, మహర్షీ ! తప్పక నెరవేర్చ గలను !

నారద ----- శ్రీవారు భాద్రపద మాసమందలి సోమవారము నాడు, వల్మీకమును చేరగలరని సూర్యుడు చెప్పినాడు. తక్కిన జ్యోతిషాంగ విషయములు నీకు తెలిసిన నా పని సులభము కాగలదు !

చంద్ర ----- మహర్షీ ! శ్రీవారు రామావతారమున చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రమున జన్మించినారు. శ్రీకృష్ణునిగా శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రమున జన్మించినారు ! రాబోవు భాద్రపద మాసమున యీ నక్షత్రములలో ఏవియు వచ్చుట లేదు !

నారద ---- మరి ఏ నక్షత్ర కాంత నీతో జత కూడనున్నది , చంద్రా ?

చంద్ర ----- ( నక్షత్ర కాంత శ్రవణాన్ని దగ్గరగా తీసుకొని ) ఇదుగో ఈమెయే నా చెంత చేరనున్నది !

నారద ----- దక్షపుత్రీ ! నీ నామ మేమి ?

శ్రవణం ----- శ్రవణము, దేవర్షీ !

నారద ----- ఆహా ! శ్రవణానంద కరముగా నున్నది ! శ్రీవారు విశేష శ్రవణ శక్తి గల వైశ్రవణులు కదా ! అందు వల్ల ఆ భాగ్యము నీకే దక్కగలదు !!

శ్రవణం ----- ధన్యురాలను దేవర్షీ ! నాతో పాటు ఆ రోజు ద్వాదశి తిథి, సిద్ధయోగము జత కలువ గలవు !

నారద ---- మంచిది చాల బాగున్నది ! భాధ్రపద శుక్లద్వాదశి సోమవారము శ్రవణా నక్షత్ర యుత సిద్ధ యోగము కలిసిన పంచాంగ శుద్ధి దినమున, శ్రీవారిని శేషాద్రికి చేర్చవలె ! ---- ఇక నాకు సెలవిండు, పోయి వచ్చెదను గాక !

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--28[మార్చు]

( దృశ్యము 28 )

( కశ్యప మహర్షి ఆశ్రమము. కశ్యపుడు, అతని భార్య అదితి ఉంటారు )

నారద ---- ( ప్రవేశించి ) నారాయణ, నారాయణ !

కశ్యప ---- వత్సా నారదా ! రమ్ము, సువర్లోక విశేషములు విని చాల కాలమైనది !

నారద ---- కశ్యప మహర్షీ ! సువర్లోకమున ఇప్పుడు విశేషము లేమున్నవి ! స్వామి నారాయణుడు ఇప్పుడు వైకుంఠమున లేడు, ఆ విషయము మీకు తెలియదా ?

అదితి ------ తపోదిక్షలో ఉన్న మహర్షికి ఆ విషయములు ఎట్లు తెలియగలవు , నారదా ? అవి అన్నియు నేనతనికి సావకాశముగ చెప్పెదను ! ముందు నాకీ విషయము చెప్పుము ! నా కొడుకు నారాయణుడు ఎక్కడున్నాడు ? కోడలు లక్ష్మి ఏమి చేయుచున్నది ?

నారద ----- పుణ్యశీలీ, అదితి మాతా ! నీ కోడలు అలిగి, సంసార బంధములు త్రెంచుకొని కరివీర పురమున ( కొల్హాపూరు ) యోగినీ గణముల సేవలో, కొలువు తీరినది ! స్వామి ఆమెను వెదకుచూ, తీర్థ యాత్రలు చేయుచున్నాడు.

అదితి ---- ( దుఃఖంతో ) ఇన్ని కష్టాలలో ఉన్నా వానికి నేను జ్ఞాపకం రాలేదు ! కష్ట సమయాలలో లోకులకు, “ అమ్మ’ జ్ఞాపకం వస్తుందంటారు ! అందరి కష్టాలు తీర్చేవాడైన నా కొడుకుకి, -- అమ్మ జ్ఞాపకం ఉంఢధు !!

కశ్యప ------- నారదా ! భూలోకమునకు వచ్చిన నారాయణుడు , చేరవలసినది నా ఆశ్రమానికి లేదా ఉగ్ర తపము చేయుచున్న ఆదిశేషుని కడకు , ఇటు అటు కాక ఎటో తిరుగుట వలన ఏమి ప్రయోజనము ?

నారద ---- అందుకే నేను మీ కడకు వచ్చితిని. మీరు అతనికి సరియైన మార్గము నిర్దేశించండి !

కశ్యప ------ నారదా ! శేషాచలమే అతనికి సరియైన మార్గము గమ్యము కూడ ! అందు ఎన్నెన్నో తీర్థములు గలవు ! వాటిలో ‘దేవతీర్థము’ ఒకటి ! ఆ తీర్థములో శ్రవణా నక్షత్రయుత సోమవారము నాడు స్నాన మాడినచో సకల సౌభాగ్యములు కుటుంబ సౌఖ్యము కలుగ గలవు !

నారద ---- (సంతోషంతో ) మహర్షీ ! ఏమని సెలవిచ్చితిరి !! శ్రవణా నక్షత్రయుత సోమవారమా !!! ఆహా ఏమి యాదృశ్చిక సంఘటన !! మీ నోట విధాతయే ఇట్లు పలికించినాడు !

కాశ్యప ---- నారదా ! శ్రవణముతో కూడిన సోమవారమునకు ఇంకేమైనా విశేషములు కలవా ?

నారద ----- మహర్షీ ! ఇంత వరకు మీరు చెప్పిన విశేషము తప్ప మరేమియు లేదు ! కాని ---- మీరు సంకల్పించిన --- బహుళ ప్రయోజనము చేకూర గలదు ! సూర్య చంద్ర తారకాది జ్యోతిషాంగములతో చర్చించి, రాబోవు భాధ్రపద మాసము , ఇందువారము ద్వాదశి తిథి, శ్రవణానక్షత్ర సిద్ధయోగ నందు, శేషాచల ప్రవేశానికి ముహూర్తము పెట్టి మీ కడకు వచ్చినాను ! మీ నోట కూడ అదే మాట వినుట ---- ఆడబోయిన తీర్థము ఎదురయినట్లు అయినది !

కాశ్యప ----- నారదా ! నారాయణునికి అత్యంత ప్రీతి పాత్రుడవైన నీవు నిర్ణయించిన ముహూర్తము రిక్తము కాదు ! నేను నా పుత్రునికి స్వప్న దర్శన మిచ్చి, కర్తవ్యము గుర్తుకు తెచ్చెదను !

నారద ------ అదితి మాతా ! మీ అభిప్రాయ మేమిటి ?

అదితి ------ శేషాచలమే వానికి సరియైన నివాసము ! దేవకిగా నేను వానికి జన్మనిచ్చినా పాలిచ్చి, పోషించినది యశోదయే కదా ! ఇపుడా యశోద,, ‘‘వకుళ మాతగా’ జన్మనెత్తి ఆ కొండపైననే వాసము చేయుచున్నది !

నారద ------ అటులైన స్వామి శేషాచలమున మాతృ వాత్సల్యమును కూడ చవి చూడగలడు---- మీ అభిప్రాయము అదియే కదా అదితి మాతా ?!

అదితి ----- అవును నారదా ! తనయుడు తల్లి ఒడిని చేరుకొనుట కన్న కావలసిన దేమున్నది ?

నారద ---- కశ్యప మహర్షీ ! అదితి మాతా !! ఇక నాకు సెలవీయుడు. స్వామి దర్శనమును, శేషాచలమున చేయునట్లు నన్ను ఆశీర్వదింపుడు !

కశ్యప, + అదితి ----- తథాస్తు !!

                  • -
==బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--29==

( దృశ్యము 29)

( మధురలో కృష్ణాలయము. పూజారి, వైఖానస సాంప్రదాయానికి చెందిన గోపీనాథుడనే ఋషి ఉంటారు)

( వైఖానస ఋషి గర్భగుడి ద్వారం ముందు నిల్చొని ఉంటాడు. పూజారి హారతి ఇస్తూ ఉంటాడు )

{ ప్రవేశం-- విష్ణువు. నుధుటి మీద ఒకే ఒక నిలువు నామంతో సామాన్య బాలకునిలాగ ఉంటాడు )

( అతను ప్రవేశిస్తూ ఉండగానే , వైఖానస ఋషి అతనిని చూస్తాడు. ఇద్దరి చూపులు కలుసుకొంటాయి )

( వైఖానసునుకి అతను ‘బాల కృష్ణుని’ లాగ, కనిపిస్తాడు.)

( విష్ణువు కృష్ణుని విగ్రహానికి నమస్కరించి మధురాష్టకం చదువుతాడు )

విష్ణు ------ శ్లోకం-- అధరం మధురం, వదనం మధురం, /నయనం మధురం, హసితం మధురం, హృదయం మధురం, గమనం మధురం, / మధురాధిపతే రఖిలం మధురం వచనం మధురం, చరితం మధురం/ వసనం మధురం, వలితం మధురం చలితం మధురం, భ్రమితం మధురం / మధురాతి పతే రఖిలం మధురం.

(విష్ణువు మధురాష్టకం చదువుతున్నంత వరకు వైఖానస ఋషి, విష్ణువు ముఖాన్ని, కృష్న విగ్రహాన్ని మార్చి మార్చి చూస్తూ ఉంటాడు )

విష్ణు ----- వేణూర్మధురో, రేణూర్మధురో / పాణీర్మధురో, పాదౌ మధురో నృత్యం మధురం, సఖ్యం మధురం / మధురాధి పతే రఖిలం మధురం గీతం మధురం, పీతం మధురం / భుక్తం మధురం, సిప్తం మధురం రూపం మధురం, తిలకం మధురం / మధురాధిపతే రఖిలం మధురం

( వైఖానసునికి విష్ణువు ముఖంలో, కృష్ణుని యొక్క రక రకాల రూపాలు కనిపిస్తూ ఉంటాయి )

విష్ణు ---- కరణం మధురం, తరణం మధురం / హరణం మధురం, రమణం మధురం నమితం మధురం, శమితం మధురం / మధురాధిపతే రఖిలం మధురం గుంజా మధురా, మాలా మధురా / సలిలం మధురా, వీచీ మధురా సలిలం మధురం, కమలం మధురం / మధురాధిపతే రఖిలం మధురం

( పూజారి హారతి ఇస్తూ ఉండగా వైఖానసుడు ఆ హారతి వెలుగులో విష్ణువు ముఖం చూస్తాడు )

విష్ణు ---- గోపీ మధురా, లీలా మధురా / యుక్తం మధురం, ముక్తం మధురం దృష్టం మధురం, శిష్టం మధురం / మధురాధిపతే రఖిలం మధురం గోపా మధురా, గావో మధురా / యష్టిర్మధురో, సృష్టిర్మధురా దళితం మధురం , ఫలితం మధురం / మధురాధిపతే రఖిలం మధురం

 ( హారతి  కళ్లకి అద్దుకొన్నాక,  వైఖానసుడు,  విష్ణువుని  పలకరిస్తాడు )

వైఖానస ---- బాబూ ! నా పేరు గోపీనాధుడు, వైఖానస సాంప్రదాయ వాదిని ! యీ ఆలయ సమీపంలోని కుటీరంలో ఉంటాను. వైష్ణవ సాంప్రదాయాలు, పూజలు, సమయాచారాలు, ఆగమానుసారంగా చేయగల, చేయించగల సామర్థ్యం నాకు ఉంది ! నా కంటికి మీరు ఆ మధురాధిపతి లాగ, బాల కృష్ణుని లాగ కనిపిస్తున్నారు ! కృష్ణున్ని సశరీరంగా పూజించాలనే వింత కోరిక నాది !! --ఈ రోజు మిమ్మల్ని చూసాక , నా అవయవాలు అదిరి, నా కోరిక తీరుతుందేమోనన్న ఆశ చిగురించేలా సూచనలిస్తున్నాయి !!-- ఇంతకీ మీ పేరు తెలుసుకోవచ్చా ?!

విష్ణు ---- వైఖానస ఋషీ ! నే నిప్పుడు చాలా అలిసిపోయి ఉన్నాను. దయచేసి ఆ వివరాలేవీ అడగకండి.

( వైఖానసుడు పూజారి ముఖాముఖాలు చూసుకొంటారు. పూజారి వైఖానసుని ఒక ప్రక్కగా తీసుకెళ్తాడు )

( విష్ణువు అక్కడే ఒక రాతి స్తంభానికి చేరబడి కూర్చొంటాడు )

పూజారి ---- వైఖానస ఋషీ ! చూసారా, ఆ యువకుని నిర్లక్ష్య పూరిత సమాధానం ! మీరేమో అతనిని చూసి, ఎన్నడూ స్పందించిన విధంగా స్పందించి, మీ చిరకాల వాంఛను కూడా సిగ్గుపడ కుండా చెప్పుకొన్నారు. దానికతడు --

వైఖానస --- పూజారిగారూ ! అతని చాల అలసిపోయి ఉన్నాడు----

పూజారి ---- ఎంత అలసిపోతే మాత్రం పేరు చెప్పడానికేం ?

వైఖానస --- పూజారిగారూ ! అతనిలో నాకు నా ఆరాధ్య దైవం కనిపించాడు ! --- నా దైవం బాల కృష్ణుడు ఎంతో అల్లరివాడు ! అల్లరి పెట్టి శోధించడం అతనికి పరిపాటి !!

పూజారి ---- అయితే ఏం చేస్తానంటారు ?

వైఖానస ---- అతనిని తీసుకెళ్లి, నా ఇంట ఆతిథ్యమిస్తాను.

పూజారి ---- మంచిదే ! ఎవరి పిచ్చి వారికే అనందం !! అతనిని ఏమని పిలుస్తారు ?

వైఖానస ----- అతను, నా బాలకృష్ణుడే !! గనుక ‘ బాలాజీ ‘ అని పిలుస్తాను ! ( అంటూ ఉద్వేగంతో విష్ణువు దగ్గరగా వెళ్తాడు )

వైఖానస --- బాలాజీ !! నాతో రండి, నా కుటీరంలో విశ్రాంతి తీసుకోండి.

విష్ణు ---- ఏమని పిలిచారు, బాలాజీ అనా ?

వైఖానస ---- అవును బాబూ ! అడ్డుపెట్ట వద్దు ! మిమ్మల్ని ఆ పేరుతో పిలువ నివ్వండి ! మీ అసలు పేరు, చిరునామా వివరాలు అడుగను ! నా కుటీరంలో అతిథిగా మీ ఇచ్చవచ్చినంత కాలం ఉండి, నన్ను తరింప చేయండి ! రండి--- బాలాజీ ! రండి !

( బాలాజీ చెయ్యి పట్టుకొని లేవ దీస్తాడు . విష్ణువు మంత్ర ముగ్ధునిలా అతనిని అనుసరిస్తాడు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--30[మార్చు]

( దృశ్యం 30 )

( వైఖానసుని కుటీరంలోని ఒక గది. విష్ణువు ఆ గదిలోని మంచంపేన పడుకొని ఉంటాడు )

( మహర్షి కశ్యపుని సూక్ష్మ శరీరం ఆ గదిలోకి ప్రవేశిస్తుంది. పడుకొని ఉన్న విష్ణువును తట్టి లేపుతుంది )

( విష్ణువు పడుకొనే ఉంటాడు, అతని ఆత్మ లేస్తుంది. కశ్యపుని చూసి ప్రశ్నిస్తుంది )

విష్ణు---- మహర్షీ మీ రెవరు ?

కశ్యప ---- నేను కశ్యపుడను ! నీవు శ్రీనివాసుడవు ! గతించిన యుగాలలో నీ విభూతి ఎన్నో అవతారాలు ఎత్తింది ! ఆ అవతారాలలో కొన్నిటికి నేను నా భార్య అదితి, మా భాగ్య వశాన తల్లి తండ్రుల మయ్యాము !! జ్ఞప్తికి తెచ్చుకో ! నీవు రాముడవు, నేను దశరథుడను, నీవు కృష్ణుడవు, నేను వసుదేవుడను !

విష్ణు ---- లేదు ! జ్ఞప్తికి రావడం లేదు ! మీరు నాకు గతంలోని జనకులని చెప్పారు !! ఇది ఏ జన్మ ? యీ జన్మలో నే నెవడను ??

కశ్యప--- ఇది నీకు మరో జన్నకాదు ! మరో అవస్థ ! నీ పేరు చెప్పానుగా, శ్రీనివాసుడని !

విష్ణు ----- నే నెవరో, నా జ్ఞాపకాలేవో మరిచి పోయిన అవస్థ నాకు ఎలా వచ్చింది !

కశ్యప ---- సప్తర్షులు చేసిన సత్రయాగ ఫలితాన్ని, నిర్ద్వంద్వంగా ఎలాంటి రక్షణ, పరిరక్షణ లేకుండా స్వీకరించడం వల్ల, నీకీ అవస్థ కలిగింది !

విష్ణు--- అయితే నేను శ్రీనివాసుడనా ?

కశ్యప --- అవును, నీవే శ్రీ మహావిష్ణువువి ! వేంకటాచలం పైన అవతరించి, వేంకటేశ్వరుడవు కానున్నావు !

విష్ణు ---- వేంకటాచలమా ! నేనా కొండపై నివసించాలా , ఎందుకని ?

కశ్యప ------ శ్రీనివాసా ! మందుగా నిన్ను నువ్వు తెలుసుకో !

( అంటూ కశ్యపుడు శ్రీనివాసుని తలపై ‘ హస్త దీక్ష’ ఇస్తాడు )

( శ్రీనివాసునికి గతం గుర్తుకి వస్తుంది. భృగు మహర్షి వచ్చి తన్నడం, లక్ష్మి అలగడం, నారదుఢు కలహాన్ని రెచ్చగొట్టడం, ఆదిశేషుని తపస్సు వగైరా ఘట్టాలు జ్ఞాపకానికి వస్తాయి. ) కశ్యప ---- శ్రీనివాసా !

విష్ణు ---- నన్నా పేరుతో పిలువకండి. ‘సిరి’ , నా నుండి విడివడిన తరువాత నేను శ్రీనివాసుడను ఎట్లు కాగలను ?

కశ్యప ----- కాదు వత్సా ! నీవు ఎప్పుడూ శ్రీనివాసుడవే ! సిరి నిన్ను వదిలి వెళ్ళలేదు, కొంత కాలం పాటు ఎడమయింది ! అదీ లోక కళ్యాణం కోసం !

విష్ణు ----- ఆమె కనిపించదేమి , ఎక్కడుంది ?

కశ్యప ---- ఆమె కనిపించదు. ఎందుకంటే నీ కన్న ముందుగా కర్తవ్యోన్ముఖురాలు అయింది. తపస్సులో కాలం గడుపుతోంది !

విష్ణు ----- కర్తవ్యమా ! ఆమె ఉన్ముఖురాలు, నేను విముఖుడనా ! -- తండ్రీ మీ మాటలు నాకు అర్థం కావడం లేదు .

కశ్యప ---- శ్రీనివాసా ! నీవు సప్తర్షులు చేసిన యజ్ఞ ఫలాన్ని, స్వీకరించావు కదా ! ఆ ఋషుల సంకల్పాన్ని సఫలం చేసేందుకు, వేంకటాచలంపై అవతరించ వలసి ఉంది .అదియే నీ కర్తవ్యము ! నిన్ను శరణు వేడు భక్తుల భోగభాగ్యములను కాపాడు భారము లక్ష్మిది . అది ఆమె కర్తవ్యము !

విష్ణు ----- తంఢ్రీ ! సప్తర్షుల సంకల్పమును నే నెటుల సఫలము చేయగలను ? అది వేంకటాచలము పైననే ఎందులకు జరుగ వలెను ?

కశ్యప ---- ఎందుకంటే, వేంకటాచలం ‘ పాపాలు పోగొట్టే కొండ ! దానికి ఇంకా చాల పేర్లు ఉన్నాయి !

విష్ణు ------ తండ్రీ, ఎన్నో పేరులు గల ఆ కొండ విశిష్ఠతను చెప్పండి .

కశ్యప ---- శ్రీనివాసా ! కృత యుగానికి ముందు, నీ ఆజ్ఞ పైన వైకుంఠము నందు యుండెడు, క్రీడాద్రిని, గరుత్మంతుడు తెచ్చి, భూమిపై నిలుపుట వలన అది ‘ గరుడాద్రి’ అయినది ! ఆ గరుడాద్రి పైన ధర్మదేవత తపస్సు చేసి, తఫః ఫలితమును ఆ కొంఢకే ధారపోయుట వలన అది ‘వృషాద్రి’ అయినది ! వృషభుడనే రాక్షసునకు, నారసిహుడు ప్రత్యక్షమై, అతని కోర్కెపై దానిని కోరికలు తీర్చే కొండగా చేయుట వలన అది “ వృషభాద్రి’ అయినది ! త్రేతాయుగమున అంజనా దేవి తపస్సు చేసి, పుత్రప్రాప్తి పొందుట వలన అది ‘ అంజనాద్రి’ అయినది ! వాయు ప్రకోపము నుండి ఆదిశేషుని వల్ల రక్షింపబడుట చేత అది ‘ శేషాద్రి’ అయినది !

విష్ణు ---- వేంకటాద్రి పాపాలు పోగొట్టే కొండ అని మీరు చెప్పారు ! ఆ పేరు దానికి ఎలా వచ్చింది ?

కశ్యప ---- ఎంతో మంది తపోధనులు తపస్సు చేసి, ఫలితములు ధార పోయుట వలన ఆ కొండ పాపములను పోగొట్టే కొండ అయింది ! ఆ కొండకి పశ్చిమాన నందనమనే ఒక నగరం ఉండేది. ఆ నగరంలో ‘ పురంధరుడనే విద్వాంసుడు, తన పుత్రుడు ‘మాధవుడు,’ పుత్ర వధువు ‘ చంద్రలేఖలతో నివసిస్తూ ఉండేవాడు---

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--31[మార్చు]

( దృశ్యము 31 )

( నందన నగరంలో పురంధరుని ఇల్లు. పురంధరుడు, అతని కొడుకు మాధవుడు ఉంటారు )

పురంధర ---- మాధవా !

మాధవ ----- ఏమిటి నాన్నగారూ ?

పురంధర ------ సాయంత్రం కొండ మీదకి వెళ్లి, హోమ సమిధలు తీసుకొని రావాలి.

మాధవ ---- అలాగే నాన్నగారూ ! నేను నా భార్య చంద్రలేఖను కూడా తీసుకొని వెళ్తాను.

( చంద్రలేఖ ప్రవేశం. వచ్చి మామగారికి పాదాలకి నమస్కరిస్తుంది )

పురంధర ---- ( ఆశీర్వదించి ) ఏమమ్మా , ఇది నీ సలహాయేనా ? భర్తతో కలిసి. వాహ్యాళికి వెళ్దామనుకొంటున్నావా ?

చంద్రలేఖ ---- అవును మామయ్యగారూ ! మీరు అనుమతి నిస్తే----

పురంధర ----- అలాగే వెళ్లి రండి.

( అదే సమయానికి పెరట్లోంచి ఒక ‘గేదె’ అరుస్తుంది. )

పురంధర ------ మాధవా ! ఈ మహిషం అరుపు అపశకునం లాగ కనిపిస్తోంది. మీరు ఇవాళ వెళ్లక పోతేనేమి ?

మాధవ ---- నాన్నగారూ ! అలాగయితే నేను ఒంటరిగా వెళ్లి, హోమ సమిధలు తీదుకు వస్తాను.

( చంద్రలేఖ ముఖం ముడుచుకొంటుంది. పురంధరుడు ఆమెను చూస్తాడు )

పురంధర ---- వద్దులే మాధవా ! నీ భార్యను తీసుకొని వెళ్లు. దుఃశకున పరిహారానికి నారాయణ నామ స్మరణ చేసి వెళ్లు .

మాధవ ---- నాన్నగారూ, వెళ్లేది పవిత్రమైన పర్వతం మీదకి ! అక్కడ కూడ అనర్థాలు కలుగుతాయంటారా ?

పురంధర ----- మాధవా ! నేను నీకు అన్ని శాస్త్రాలు నేర్పాను. శాస్త్రాలు తెలిసిన వాడివి కనుక నేను నీతో వివాదానికి దిగను. కాని ఒక్కమాట ! శాస్త్రాలు తెలుసుకోవడమే కాదు, ఆచరణలో పెట్టడం తెలివైన పని!

( మాధవుడు మౌనంగా నిలుచుండి పోతాడు )

పురంధర ----- మంచిదే, అలాగే కానియ్యండి, ఇద్దరూ కలసే వెళ్లి రండి !

                   • .

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--32[మార్చు]

( దృశ్యము 32 )

( కొండ దగ్గర తోట . మాధవుడు, చంద్ర లేఖ వన విహారం చేస్తూ ఉంటారు )

( మాలిని  అనే  యువతి  అక్కడ  చితుకులు  ఏరుతూ  ఉంటుంది )

( మాధవుడు మాలినిని చూస్తాడు. ఆమె రూపం అతనిని ఆకట్టుకొంటుంది. మాధవుడు ఆమె దగ్గరకు వెళ్తాడు )

మాధవ ---- సుందరీ , నీ పేరేమిటి ?

మాలిని ----- మాలిని.

మాధవ ----- పేరు చాలా బాగుంది ! నువ్వెక్కడ ఉంటావు ?

మాలిని ----- నగరం శివార్లలో నండి. నా కెవ్వరూ లేరండి. తోడుగా ఉండే అయ్య కాలం చేసాడండీ ! ఇలా ఈ అడవిలో చితుకు లేరుకొని, మద్యం కాచుతూ, మాంసం అమ్ముకొంటూ, బ్రతుకుతున్నానండి !

( చంద్రలేఖ వచ్చి మాలిని మాటలు వింటుంది )

చంద్రలేఖ ---- అంటే, నువ్వు పంచమురాలివా ?

మాలిని ---- అదేంటమ్మా, నేను మా అయ్యకు ఒక్కర్తే కూతురు నండి ! ఇప్పుడు ఒంటరిదాన్ని !

చంద్రలేఖ ---- అంటే చదువు, సంస్కారం, సామాన్యమైన తెలివి తేటలు కూడ లేవన్నమాట ! ( విసురుగా భర్త చెయ్యి పట్టుకొని ) దానితో మీకేం మాటలండీ ? మామయ్యగారు హోమ సమిథలు తెమ్మన్నారు మరచి పోయారా ?

మాధవ ----- అలాగే, చంద్రలేఖా ! పద ! ( అంటూ వెనక్కి, వెనక్కి చూస్తూ వెళ్తాడు )

( మాలిని కూడా అతని వైపు మనోహరంగా చూస్తుంది, కన్ను గీటి నవ్వుతుంది. )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--33[మార్చు]

( దృశ్యము 33 )

( మాలిని గుడిసె ముందు నులక మంచం )

( మాధవుడు , మాలిని మంచం పైన ప్రక్క ప్రక్కనే కూర్చొని ఉంటారు )

( మాధవుడు ఆమెతో పాటు మద్యం త్రాగుతూ, మాంసం తింటూ, కనిపిస్తాడు )

(ఒక బ్రాహ్మణ బాలకుడు ఆ దృశ్యాన్ని, చూస్తాడు. పరుగు పరుగున నగరం వైపు వెళ్తాడు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--34[మార్చు]

( దృశ్యము 34 )

( నందన నగరంలోని ఫురంధరుని ఇల్లు. పురంధరుడు కూర్చొని ఉంటాడు )

( ప్రవేశం ఒక బ్రాహ్మణ బాలకుడు పరుగు పరుగున వస్తాడు )

బాలకుడు ---- పురంధరాచార్యా ! నమస్కారములు !

పురంధర ----- విషయమేమిటి వత్సా ! పరుగు పరుగున వచ్చావు ?

బాలకుడు ---- ఆచార్యా ! మాధవుల వారు నగరం చివర, మాలిని అని ఒక కడజాతి స్త్రీ ప్రక్కన కూర్చొని , ఆమెతో పాటు మద్య- మాంసాలు సేవిస్తున్నారు !

( ఆ మాటలు వన్న పురంధరుడు స్థాణువులా నిలుచుండి పోతాడు. చంద్రలేఖ ఇంట్లోనుంచి వస్తుంది )

పురంధర ---- వత్సా ! నువ్వు చెప్పినదంతా నిజమేనా ?

( బాలకుడు అవునంటూ తల ఊపుతాడు )

చంద్రలేఖ ----- మామయ్యగారూ ! ఆ రోజు కొండకి వెళ్లవద్దని, మీరెంత చెప్పినా వినక, ఇంత అనర్థం తెచ్చి పెట్టుకొన్నాను ! ఆ మాలిని అతనికి ఆ రోజే పరిచయమయింది ! --- కాని ---ఇంతకి దిగజారి పోతారనుకోలేదు !! ( ఏడుస్తుంది )---- ఎవరితో చెప్పుకోను, మామయ్యగారూ ! మీ అబ్బాయి నా ముఖం కూడ చూడడం మానేసారు !

( పురంధరుడు ఆమెని ఓదారుస్తాడు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--35[మార్చు]

( దృశ్యము 35 )

( మాలిని గుఢిసె )

( మాలిని, మాడవుడు నులక మంచః మీద కూర్చొని మాంసం తింటూ, మద్యం త్రాగుతు ఉంటారు )

( ప్రవేశం పురంధరుడు. ఆ దృశ్యాన్ని చూస్తాడు. మాధవుడు తండ్రిని చూసి, దిగ్గున లేచి నిల్చొంటాడు )

పురంధర ---- అర్థమయిందిరా ! అంతా అర్తమయింది !! నువ్వు పూర్తిగా--- పతితుడివి, భ్రష్టుడివి అయ్యావు ! ఇక నువ్వు నా ఇంటి గడప తొక్కడానికి వీలు లేదు ! నేను నిన్ను వెలి వేస్తున్నాను .

( పురంధరుడు కోపంతో వెళ్లిపోతాడు )

బాలాజీ అర్చావతారా విశేష దృశ్యార్చన--36[మార్చు]

( దృశ్యము 36 )

( శేషాచలం కొండ )

( మాధవుడు కొండ దిగువ మాలిని కోసం చిరుకులేరుతూ ఉంటాడు )

( కొండ మీదనుంచి వస్తున్న ఒక తపస్వి అతనిని చూస్తాడు )

తపస్వి ----- మాధవా ! ఎంత దుస్థితికి దిగజారావు ?

మాధవ ----- మహానుభావా ! ఎన్నో పాపాలు చేసాను. కట్టుకొన్న ఇల్లాలిని , కన్న తండ్రిని కడగండ్ల పాలు చేసాను. నేర్చుకొన్న పాఠాలని కొరగానివి చేసుకొన్నాను.

తపస్వి ---- మాధవా ! చేసిన దానికి నిజంగా చింతిస్తున్నావా ?

మాధవ ---- అవును స్వామీ ! నాకు మార్గమేదైనా చూపించండి .

తపస్వి ------ మాధవా ! నాతో ఈ కొండ మీదకు రా ! అక్కడ కొంత మంది మునులు తపస్సు చేస్తున్నారు. వారి నడిగి సందేహ నివృత్తి చేసుకో !

( తపస్వి, మాధవిని తీసుకొని మునుల దగ్గరకు తీసుకొని వెళ్తాడు. మాడవుడు ఆ మునులకు పర్వతానికి నమస్కరిస్తాడు )

మాధవ --- ( పద్యం ) సీ--- విప్ర జన్మంబంది, విధి వంచితుడనైతి / వేద విద్యలు నన్ను విడిచి జనియె, జనకుని మసటలు జవదాటి చరియిస్తి / కర్మ దూరుడనైతి, కాలవశత. జాతి ఛండాలుడనైతి, జాయను బాపి / నీచురాలి పొందు నెంచుకొంటి, లొల్లను ద్రావుచు, లోకదూరుడనైతి / చేసిన తప్పులు చెప్ప సిగ్గు,

ఆ. వె. వేడుచుంటినయ్య, వేంకటాచలపతీ, పాప సంచయమును పారద్రోలి బ్రతుకు నిల్పి, నన్ను బ్రోచు భారము నీది; ఆదుకొనగ వయ్య అద్రిరాజ !

( పద్యం ముగియగానే చిత్రంగా అతని శరీరాన్ని, మంటలు చుట్టుముట్టుతాయి ! చిట పట లాడుతూ మండి, తిరిగి చల్లారి పోతాయి )

మునులు ----- మాధవా ! నీ పాపములను దహించిన యీ కొండ, నీవు సంభోధించినట్లే ‘ వేంకటాద్రి ‘ నామముతో ప్రఖ్యాతి నందును గాక !

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--37[మార్చు]

( దృశ్యము 37 )

( వైఖానస ఋషి కుటీరంలోని గది )

( కశ్యపుఢు , శ్రీనివాసుడు ఉంటారు )

కశ్యప ------ శ్రీనివాసా ! ఆ విధముగా మాధవుని పాపములను దగ్ధము చేసి, అతనిని పునీతుడను చేసిన పర్వతము పేరు. ‘ వేంకటాద్రి’ గా ప్రసిద్ధి పొందింది !

విష్ణు ----- తండ్రీ ! ఆ పర్వతానికి నారాయణాద్రి అనే పేరెలాగ వచ్చింది ?

కశ్యప ----- శ్రీనివాసా ! గుర్తుకి తెచ్చుకో ! నారాయణుడను విప్రుడు, ఆ పర్వతము పైన, పూర్వాభిముఖముగా కూర్చొని, వెన్నెముక నిటారుగా నుంచి, కంటి చూపులను భ్రూమధ్యమందు నిలిపి, చాలకాలము నీ గురించి తపస్సు చేసాడు ! కొంత కాలానికి అతనికి శ్రీమహావిష్ణువు కనిపించి, వరాలని అనుగ్రహించాడు .

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--38[మార్చు]

( దృశ్యము 38 )

( గరుడాద్రి కొండ )

( నారాయణుడు అనే విప్రుడు తపస్సు చేస్తూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు అతనికి ప్రత్యక్ష మవుతాడు )

విష్ణు ----- నారాయణా ! నీ తపస్సుకు మెచ్చి వచ్చాను. వరాలను కోరుకో !

నారాయణ ---- శ్రీ హరీ ! నీ దర్శన మాత్రమున , భక్తుల కోర్కెను తీర్చే పరమాత్మ స్వరూపంగా, యీ పర్వతం పైన అవతార మెత్తి, యీ పర్వతమునకు నా పేర, నీ పేర నారాయణాద్రిగా పిలువ బడేలా వరమియ్యి !

                    • .

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--39[మార్చు]

( దృశ్యము 39)

( వైఖానస ఋషి కుటీరము )

( కశ్యపుడు, శ్రీనివాసుడు ఉంటారు )

కశ్యప ---- శ్రీనివాసా ! నారాయణునికి ఇచ్చిన వరం అనుగ్రహించే సమయం ఆసన్నమయింది ! నీవు ఆ కొండను నివాసంగా చేసుకో !

విష్ణు ---- అటులనే తండ్రీ ! అక్కడకు వెళ్లి నేనేం చేయాలి ? లక్ష్మి అక్కడకు ఎలా వస్తుంది ?

కశ్యప ----- శ్రీనివాసా ! ఆ శేషాద్రి పైన, చింత చెట్టు క్రింద, పిపీలకుడు తయారు చేసిన వల్మీక భవనంలో నివసిస్తూ తపస్సు చెయ్యి. నిన్ను చూసీ చూడగానే భక్తుల పాపాలు నాశన మవాలంటే, నువ్వు అమోఘ తపోబల సంపన్నుడవు కావాలి ! కనుక భక్తులందరి వంతు తపస్సు నీవే చేయాలి ! లక్ష్మీదేవి కూడ నిన్ను చేరే భక్తుల భోగ భాగ్యాలను కాపాడేందుకు తపస్సు చేస్తోంది. మీ ద్దరి తపస్సు ఒక కొలిక్కి వచ్చేసరికి, మీ కలయిక తప్పక జరుగుతుంది ! అలా జరగాలంటే నీవు ఇంకొక పని కూడ చేయాలి !

విష్ణు ---- ఆనతినీయండి తండ్రీ !

కశ్యప ---- నీకు లక్ష్మీ ప్రసన్నమయి, ఆ కొండపై బహు కుటుంబీకుడవై, వర్థిల్లాలంటే , ఆ కొండ చరియల్లో నుండి, పారే ‘ దేవ తీర్థంలో’ శ్రవణా నక్షత్రయుత ఇందువారము నాడు, స్నానం చెయ్యాలి.

విష్ణు ---- తండ్రీ ! ఆ శుభనుహూర్తం గురించి వివరంగా చెప్పండి !

కశ్యప ---- రాబోయే భాద్రపద మాసం, సోమవారం, ద్వాదశి తిథి, శ్రవణా నక్షత్రము సిద్ధయోగము నాడు, నీవు శేషాద్రిని చేరి, దేవ తీర్థంలో స్నానమాడి, పునీతుడవై , చింతచెట్టు క్రిందనున్న, వల్మీకమును నివాస స్థానము చేసుకొని, ప్రతీ నిత్యమూ జప, హోమ, తర్పణాది క్రియలను ఆచరిస్తూ, తపస్సు చేయుము !

విష్ణు ----- తండ్రీ ! తపస్సు ఎవరి నుధ్దేశించి చేయవలెను ! ఎంత కాలము చేయవలెను ! తపోఫలమును ఎవరు సమర్పించెదరు ?

కశ్యప ----- ముక్కోటి దేవతలను, నీలో నిలుపుకొన్న నీవు, వారందరి బల, వీర్య, తేజస్సులను పొందుటకు, వారి ప్రతినిధివై, లోక కళ్యాణము చేయుట కొరకు, ప్రతీ ఒక్కరి నిమిత్తము తపము చేయవలెను ! నీ తపో ఫలమును బ్రహ్మ తెచ్చి ఇచ్చునంత వరకు, తపము చెయ్యవలెను. ఇక కాలమందువా, అది ఎవరి వశమో నీకే తెలియగలదు !

( కశ్యపుని శరీరం మాయమవుతుంది. శ్రీనివాసుని ఆత్మ తిరిగి శరీరాన్ని చేరుకొంటుంది )

( అప్పుడు పాన్పుపై పడుకొని ఉన్న విష్ణువు లెచి కూర్చొంటాడు, తనని తాను చూసుకొంటాడు )

విష్ణు ---- ఓహో ! కశ్యప మహర్షి నాకు స్వప్న నిర్దేశము చేసెనా ? స్వప్నమందైనను, తండ్రి ఆజ్ఞ ఆజ్ఞయే కదా !! సత్వరము శేషాచలము చేరెదను గాక ! ( గది తలుపులు తెరచుకొని బయటకు వెళ్లిపోతాడు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--40[మార్చు]

( దృశ్యము 40 )

( వైఖానస కుటీరము )

( వైఖానస ఋషి ప్రాతః కాల కృత్యాలను తీర్చుకొని, విష్ణువు పఢుకొన్న గదికి వస్తాడు )

వైఖానస ----- బాలాజీ, బాలాజీ ! లేచిపోయారా బాలాజీ ?

( గదిలో బాలాజీని కానక ఆశ్చర్య పోతాడు )

వైఖానస ---- బాలాజీ ఎక్కడకు వెళ్లినట్లు ? బహుశా గది బయట కాల కృత్యల కోసం వెళ్లారేమో !!

( వైఖానసుడు ఇల్లంతా కలయ తిరుగుతాడు, బాలాజీని కానక, దిగులుతో , తిరిగి, గదిలోపలికి వస్తాడు )

( ఆ గది మధ్య  మంచం  మీద  పద్మాసనం  వేసుకొని  కూర్చొన్న  కశ్యప ఋషిని  చూస్తాడు )
 వైఖానస ---- మహాత్మా  మీరెవ్వరు ! ఎప్పుడు  వచ్చారు ? యీ గదిలో  బాలాజీ  అనే  యువకుడు ఉంధాల్సింది.  ఆయనను  మీరు  చూసారా ?

కశ్యప ----- వైఖానసా రా ! ఇలా వచ్చి కూర్చో !!

( వైఖానసుడు మంత్ర ముగ్ధునిలాగ వచ్చి కూర్చొంటాడు )

కశ్యప ----- నేను కశ్యప ఋషిని .

వైఖానస ----- ( లేచి సాష్టాంగ నమస్కారం చేసి )--- కశ్యప మహర్షీ ! ఏమి నా భాగ్యము !! నా ఆరాధ్య దైవమైన బాలకృష్ణుని జనకులు వసుదేవుల వారా మీరు ? నేడు చాల సుదినము !!

ఇక వాసుదేవుల  వారిని  కూడా  చూడవచ్చును.

కశ్యప ----- పిచ్చివాడా ! నీవు ముందు వాసుదేవుడినే చూసావు. ఆ తరువాతనే నన్ను చూసావు !

వైఖానస ----- (విస్మయంతో ) మహర్షీ ! ఏమిటి మీరంటున్నది ! ఆ ‘బాలాజీ’ నా ‘బాలాజీయేనా’ ? ఆయనే వాసుదేవ కృష్ణుడా ?

కశ్యప ---- అవును, నీ బాలాజీ , యీ బ్రహ్మీముహూర్తానికి లేచి వెళ్లిపోయాడు. నేనే వెళ్లమని నిర్దేశించాను !

వైఖానస --- ( దిగులుగా ) మహర్షీ ! నేనేం అపరాధం చేసాను ? నా దైవాన్ని అర్చించే భాగ్యం నాకు లేకుండా పోయింది !!

కశ్యప ---- వైఖానసా ! చింతించకు , స్వామిని సశరీరంగా అర్చింవాలనే నీ కోరిక, తీరే సమయం రానుంది ! నీ ఇంటికి వచ్చిన ‘ బాలాజీ ‘ పేరు శ్రీనివాసుడు ! అతనిని ఆ పేరుతోనే అర్చించు. కాని ‘మధురలో’ కాదు ! వేంకటాద్రి యందు !

వైఖానస --- బాలాజీ అదే శ్రీనివాసుల వారు, అక్కడికే వెళ్లారా ?

కశ్యప --- అవును. వేంకటాద్రి పైన, చింతచెట్టు క్రింద, వల్మీకంలో స్వామి తపస్సు చేయనున్నాడు ! అతని తపస్సుకు అంతరాయం కలుగకుండా చూస్తూ, సాధనను సులభం చెయ్యి ! పూజ అర్చన కైంకర్యాదులతో నీ కోరిక తీర్చుకొని తరించు ! యీ పనిలో ‘రంగదాసుడనే’ భృత్యుడు నీకు తోడవుతాడు !

వైఖానస ---- మహర్షీ, రంగదాసుడు నాకు ఎక్కడ లభింపగలడు ?

కశ్యప ----- కొండ దిగువన, నిన్ను వెతుకుతూ వస్తాడు .

వైఖానస --- అటులనే మహర్షీ ! నేను యీ నాడే వేంకటాద్రికి బయలుదేరి వెళ్లెదను .

( కశ్యపుడు మాయమవుతాడు )

[బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--41]][మార్చు]

( దృశ్యము 41 )

( నైమిషారణ్యము. సూత పౌరాణికుడు, శౌనకాది మహామునులు ఉంటారు )

సూతుడు -- శౌనకాది ముని సత్తములారా ! శ్రీమన్నారాయణుడు , కశ్యప మహర్షి నిర్దేశము వలన, కర్తవ్యోన్ముఖుడై తపస్సు చేయుటకు ‘ వేంకటాద్రికి’ బయలు దేరెను.

శౌనక -- సూత మహర్షీ ! శ్రీమన్నారాయణుడు వేంకటాద్రిని చేరిన విధము, అతని కొరకు చిరకాల నిరీక్షణ చేయుచుంఢెడు, ఆదిశేష, పిపీలిక, తింత్రణీ వృక్షముల కోర్కె తీర్చి విధమును , మాకు తెలియ జేయుడు.

సూతుడు – మునులారా ! శ్రీనివాసుడు వేంకటాచలమును చేరిన విధము, సావధాన చిత్తులై వినుడు.

[బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--42]][మార్చు]

( దృశ్యము  42 )

( అడవి. శ్రీనివాసుడు నడుస్తూ ఉంటాడు. అతనిని ఆకాశంలోంచి , గరుత్మంతుడు, ఆంజనేయడు ఇద్దరూ చూస్తారు )

( ముందుగా గరుడుడు శ్రీనివాసుని ఎదుటకు వచ్చి నిలుస్తాడు )

గరుడ -- ప్రభూ! నేను మీ భృత్యుడను, మీ వాహనమగు గరుడుడను ! నే నుండగా మీరు పాదచారులై, సంచరించుట, ఉచితము కాదు ! ప్రభూ ! మీరు నా వీపుపై విరాజమానులు కండు, నేను మిమ్ములను చిటికెలో ‘ వేంకటాచలమునకు’ చేర్చెదను !

విష్ణు --- గరుడా ! నేను నీ సేవ నొల్లజాలను !

( గరుడుడు చిన్నబోతాడు )

విష్ణు --- చింతింపకుము, ఇటుల మీ సురుల సేవలందుట వలన, నా పుణ్యమయ క్షయమగును ! నాకు ఇప్పుడు అపారమగు పుణ్య సంచయము చేయు నవసర మున్నది !

( ఇంతలో అక్కడకి ఆంజనేయుడు వస్తాడు )

ఆంజనే -- ప్రభూ ! శ్రీరామచంద్రా ! మీ భృత్యుడనగు నే నుండగా మీ కిట్లు కాలినడక లేల ? రండు, నా భుజములపై సేద తీరుడు ! మిమ్ము తక్షణము శేషాద్రిని చేర్చెదను !

విష్ణు --- ఆంజనేయా ! వాహనము నధిరోహించుట నాకు తగదయ్యా ! నేను నా తపము ముగియునంత వరకు, సురుల సాయమును ఒల్లజాలను !

గరుడ -- స్వామీ ! అటులయిన మీ రిటుల----

ఆంజనే -- మార్గాయాసమును పొందక ------

ఇరువురూ --- గమ్యమును  చేరు  ఉపాయము  సెలవిండు !

విష్ణు -- మీ రిరువురూ, కొండ నెక్కు మార్గ మధ్యమున వెలసి, నా కొరకు కాలి నడకన వచ్చు, భక్తుల మార్గాయాసమును, శ్రమను, తగ్గంచుడు !! అదియే నేను ఆశించెడు సేవ ! నా భక్తుల సేవయే నా సేవ కాగలదు !

ఆంజనే -- ప్రభూ ! మీ ఆజ్ఞా ప్రకారము ----

గరుడ --- అటులనే చేయుదుము, కాని,-----

ఆంజనే ---- ప్రస్తుతము, మీ పాద పద్మములకు కలుగు----

గరుడ ---- కష్ట నివారణమునకు, ఏదియైన -----

ఇద్దరూ --- ఉపాయము సెలవిండు !

విష్ణు -- వినతాత్మజా ! అంజనీ పుత్రా ! -- అటులనే కానిండు ! మీ తృప్తి కొరకు, నేను పాదరక్షలను ధరింప సమకట్టితిని. నా కవి తెచ్చి ఇండు !

ఆంజనే --- ప్రభూ ! శ్రీ చరణములకు తగిన పాదరక్షలు---

గరుడ --- లభ్యమగు చోటు తెలిపి, మమ్ములను కృతార్థులను చేయుడు !

విష్ణు ---- వినుడు, ఇరువురు ‘ పంచములు ‘ శ్రావణ శనివారములు ఉపవాసముండి, కడుంగడు దారిద్ర్యమును అనుభవించుచు, నన్నే తలంచుచున్నారు ! వారు పాద రక్షలు చేయుటలో నిపుణులు ! ఒకరు కంచిలోను, మరొకరు కాళహస్తిలోను , ఉన్నారు ! నేను భాద్రపదమున కొండ పైకి చేరవలెను గదా ! అందుకని వారిరువురి కడకేగి, పాదరక్షలు చేయించి, వారి చేతనే నాకు సమర్పించునటుల చేయుడు !

గరుడ -- ప్రభూ ! నేను కంచి కేగి, ఆ మహాభక్తుని అన్వేషించి , స్వామి కార్యము నెరవేర్చెదను !

ఆంజనే -- స్వామీ ! నేను కాళహస్తి కేగి కార్యము పూర్తి చేసెదను.

విష్ణు -- గరుడా ! నీవు నా ఎడమ కాలి పాదముద్రలను తీసుకొనుము ! ఆంజనేయా , నీవు నా కుడికాలి పాద ముద్రలను తీసుకొనుము .

( ఆంజనేయుడు, తన కుడి చేతిని  చాపి, శ్రీనివాసుని, కుడి కాలుని తన అర చేతిపై  పెట్టమని ప్రార్థిస్తాడు. శ్రీనివాసుడు  అలాగే  చేస్తాడు . శ్రీవారి పాద ముద్ర అతని  అరచేతిపై పడుతుంది )

ఆంజనే -- ప్రభూ ! నాకు అనుజ్ఞ నిండు, నేను పోయి వచ్చెదను !

( గరుత్మంతుడు స్వామి ఎదుట వంగి, తన వీపుపై ఎడమ కాలు పెట్టమంటాడు, శ్రీనవాసుడు అలాగే చేస్తాడు. శ్రీవారి ఎడమ కాలి పాద ముద్ర అతని వీపుపై పడుతుంది )

గరుడ -- ప్రభూ ! నాకు సెలవిండు , పోయి వచ్చెదను !

విష్ణు -- నా ప్రియతమ భక్తులారా ! వెళ్లి రండు !

( ఇద్దరూ ఎగిరి వెళ్లిపోతారు.)

 *********************

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--43[మార్చు]

( దృశ్యము 43 )

( కాళహస్తిలో మారుమూల గుడిసె . ‘దాసు’ అనే హరిజన భక్తుడు, చెట్టు క్రింద కూర్చొని చెప్పులు కుట్టుతూ ఉంటాడు )

( అతని భార్య, ఒక పాత్రలో గోధుమ పిండి కలుపుతూ ఉంటుంది. వారి పిల్లలు, చాలీచాలని దుస్తులతో , చుట్టు ప్రక్కల ఆడుతూ ఉంటారు. చెట్టు మీదకు, ఆంజనేయుడు కోతి రూపంలో వస్తాడు. )

( దాసు చెప్పులు కుడుతూ, తన అరచేతితో నుదుట పట్టిన చెమటని తుడుచుకొంటాడు. )

దాసు ---- రామచంద్రా ! రామచంద్రా ! ( అంటూ నిట్టూర్పు వదలుతాడు )

భార్య -- ఉపవాసంతో ఆ చెప్పులు కుట్టక పోతేనేం ? ఇది వరకు కుట్టినవే చాన ఉన్నాయి ! కొనే వారెవరు ?

దాసు ---- నా రాముడు దయతలిస్తే, నా కేమి కొదవే ? చిటికెలో నా చింత తీరుస్తాడు !

( చెట్టుమీద ఆంజనేయుడు అదంతా చూసి, అతడే ఆ భక్తుడని తెలుసుకొంటాడు )

ఆంజనే --- ( తనలో) ఈ రోజే శ్రావణ శనివారము, ఇతడు ఉపవాసమున్నా, వృత్తి ధర్మాన్ని వదలక, ఆయాస పడినప్పుడల్లా, రామ నామ స్మరణ చేస్తూ, సేద తీరుతున్నాడు ! శ్రీవారి పాద ముద్రను ఇతనికే ప్రసాదించెదను గాక !

( కోతి చెట్టుపై నుండి దిగి, భార్య కలుపుతున్న గోడుమ పిండి తపేలాను, ఎత్తుకు పోతాడు )

భార్య --- అయ్యో, అయ్యో ! కోతి, పిండి తపేలాని ఎత్తుకు పోతోంది , చూడవయ్యా ! ( అని భర్తని పొడుస్తుంది )

దాసు -- కోతి అని చిన్న చూపు చూడకే ! ఆంజనేయల వారు అను ! పాపం దాని ఆకలి ఎలా తీరుతుంది ?

భార్య --- బాగుంది సంబరం ! కోతి ఆకలి తీరుస్తే, నా పిల్లల ఆకలి ఎలా తీరుతుంది ? నీకయితే ఉపవాసం, కూడు అక్కర లేదు ! పిల్లలు పస్తులెలా ఉంటారు ? అయినా నీతో చెప్పి ఏం లాభం ? ( అంటూ ఒక కర్ర తీసుకొని కోతి వెంట పడుతుంది. ఆమెను చూసి పిల్లలు కూడ ‘కోతి’ దగ్గరకి పరుగెడతారు )

( తల్లి పిల్లలని కోతి కొంత సేపు ఆడిస్తుంది. తరువాత తపేలాను అక్కడే వదిలి పారిపోతుంది. భార్య వెళ్లి ఆ తపేలాని తీసుకొంటుంది )

భార్య -- అమ్మయ్య ! పిల్లల నోటి కూడు, కోతి కాడికి పోకుండా దక్కింది ! అంతే చాలు---( అంటూ ఆ తపేలాలోకి చూస్తుంది. తపేలా లోని పిండి ముద్దపై, స్వామి కుడికాలి పాద ముద్ర కనిపిస్తుంది )

భార్య --- చూడయ్యా , చూడు ! పిండి మీద పాదం కొలతలు పడ్డాయి ! ( అంటూ చూపిస్తుంది )

దాసు --- అవునే, మనిషి పాదం గుర్తులేనే ! కుడి పాదం కొలతలు ! -- కోతి పట్టుకెళ్లిన పిండి తళికె మీద మనిషి పాదం గుర్తులు ఎలా వచ్చేయే !?

( చెట్టు మీద కోతి రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి పలుకుతాడు )

ఆంజనే --- భక్తా ! శ్రీమహావిష్ణువు కుడికాలి గుర్తులవి ! నీ భాగ్య వశాన నీకు లభించినవి . ఆ కొలతలతో చక్కని పాదరక్ష నొకదానిని తయారు చేసి, యీ ఊరికి దక్షిణాన అడవి చివరన ఉండే శ్రీరామాలయం దిగువ మెట్ల దగ్గరకి తీసుకెళ్లు . స్వామి కటాక్షం వలన నీ కోరికలు తీరగలవు !

 *****************

[బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--44]][మార్చు]

( దృశ్యము 44 )

( కంచి. మారుమూల ఒక గుడిశె, నంబి అనే భక్తుడు తన గుడిశె ముందు కూర్చొని, చెప్పులు కుడుతూ ఉంటాడు. అతని భార్య కొంచెం దూరంలో కూర్చొని, గోధుమ పిండి కలుపుతూ ఉంటుంది. )

( గరుత్మంతుడు విసురుగా వచ్చి, ఆ పాత్రను ఎత్తుకు పోతాడు )

భార్య -- అయ్యో, అయ్యో !--- మాయదారి పక్షి నోటికాడ కూడెత్తుకు పోయింది. ఓ, మావా ! ఇప్పుడేం చేయాలి ?

నంబి --- గరుడాళ్వారు వచ్చి తీసుకెళ్తే, అలా గావుకేకలు పెట్టకే ! అతను బెదిరి పోతాడు.

భార్య -- ఏమిటీ ! ఆ పక్షి గరుడాళ్వారా ? నీ భక్తి బుగ్గిపాలు కాను ! కూడు ఎత్తుకు పోయినందుకు ఏడవక, ఏం సంబర పడిపోతున్నావు ?! ( అంటూ కర్ర పట్టుకొని చెట్టెక్కి కూర్చొన్న గరుడ పక్షిని తరమడానికి వెళ్తుంది )

( గరుత్మంతుడు పిండి తపేళాని క్రింద పెట్టేసి, ఎగిరి పోతాడు. భార్య ఆ పాత్రని అందుకొంటుంది. అందుకొని ఆ పాత్రని చూస్తుంది. పిండి తళికె మీద శ్రీవారి ఎడమ కాలి ముద్ర ఉంటుంది )

భార్య --- (ఆశ్చర్యంతో ) ఓరి మావోయ్ ! చూడు యీ ఇసిత్రం ! పిండి మీద మనిషి కాలి కొలతలున్నాయి !!

నంబి -- ( వచ్చి, చూస్తాడు ) చూసావా, నేను చెప్తే విన్నావా , ఆ పక్షి గరుడాళ్వారు అని !? కర్ర పట్టుకెళ్లి అపచారం చేసావు, యీ పాద ముద్ర ఎవరి దనుకొన్నావు, ----

భార్య – ఎవురిదయ్యా ?

 నంబి ---- ( భక్తితో )  సాక్షాత్తు  ఆ  శ్రీరంగనిది !!!  చూసావా,  పాద  ముద్రలో  శంఖ  చక్రాలు ఎలా  కనిపిస్తున్నాయో !?

భార్య ---- అవును మావా ! అపచారం అయిపోనాది !! ( లెంపలు వేసుకొంటుంది )

( ఇద్దరూ గాలిలో తిరుగుతున్న గరుడునికి నమస్కరిస్తారు )

నంబి --- గరుడాళ్వారు స్వామీ ! శ్రీవారి పాదముద్ర నిచ్చి, నన్ను ధన్యుణ్ని చేసారు ! యీ పాద ముద్రలు ఏం చేయాలో సెలవిచ్చి పుణ్యం కట్టుకోండి.

( గరుడుడు గాలిలో తిరుగుతూనే చెప్తాడు )

గరుడ --- నంబీ ! శ్రీవారికి ఆ ముద్ర కొలతలతో పాదరక్షను తయారుచెయ్యి ! దానిని తీసుకొని , శ్రీకాళహస్తికి దక్షిణాన ఉండే అడవి చివరన ఉంఢే శ్రీరామాలయము దిగువ మెట్ల దగ్గర ఉంచు ! నీకు స్వామివారి కరుణా కటాక్షం లభిస్తుంది ! ( అని వెళ్లిపోతాడు )

( భార్యా భర్తలిద్దరూ ఆనందంతో గెంతులు వేస్తారు, పాద ముద్రలను కళ్లకి అద్దుకొంటూ )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--45[మార్చు]

( దృశ్యము 45 )

( కాళహస్తి. దాసు భార్యా పిల్లలతో, తన కుటుంబీకులతో ఉంటాడు )

( కుడికాలి చెప్పుని, ఒక బుట్టలో పువ్వుల మధ్య పెట్టి, దానిని తలమీద పెట్టుకొంటాడు. అతని వెనక అతని భార్యా పిల్లలు, వారి వెనక అతని కులస్థులు, దప్పు కొట్టుకొంటూ బూరలు ఊదుతూ, దారి తీస్తారు )

********************

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--46[మార్చు]

( దృశ్యము 46 )

( కంచి. నంబి పూల తట్టలో ఎడమ కాలి చెప్పును పెట్ఠి, ఆ తట్టను తల మీద పెట్టుకొంటాడు )

( అతని వెనక అతని భార్య, అతని కులస్థులు, మేళతాళాలతో బయలుదేరుతారు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--47[మార్చు]

( దృశ్యము 47 )

( ఒక అడవి చివర రామాలయం )

( పాదరక్షల తండాలు, రెండూ అక్కడికి చేరుకొంటారు. ఒకరి నొకరు చూసుకొని ఆశ్చర్యపోతారు )

(.తట్టలు రెంఢూ ఒక దాని ప్రక్కన ఒకటి పెట్టి, చూస్తారు . ఆశ్చర్యం ! రెండూ ఒకలాగే ఒకరే తయారు చేసినట్లు ఉంటాయి . ఆనందంతో నృత్యం చేస్తారు )

గేయం -- శరణన్న చాలు, కరుణింతువని వింటి !

 మా వైపు  చూసావా  స్వామీ !
 మా  బతుకులే  పండగయ్యేను !!   

( చెప్పులు, రామాలయం దిగువ మెట్ల దగ్గర ఉంచి, పొదల మాటున దాగి చూస్తూ ఉంటారు )

( ప్రవేశం విష్ణువు. వచ్చి నేరుగా రామాలయం లోనికి వెళ్తాడు. శ్రీరామునికి నమస్కారం చేస్తాడు )

విష్ణు ---- (పద్యము ) “ శ్రీ రాఘవం, దశరథాత్మజ మప్రమేయం సీతా పతిం, రఘు కులాన్వయ రత్న దీపం ఆజానుబాహు, మరవింద దళాయతాక్షం రామం ! నిశాచర వినాశకరం నమామి !!

( విష్ణువు తిరిగి వచ్చి, దిగువ మెట్ల మీద నున్న చెప్పులను చూస్తాడు. చిన్నగా చిరునవ్వు నవ్వుకొని , వాటిని తొడిగి చూస్తాడు. సరిగ్గా సరిపోతాయి అవి ! )

( పొదలలో దాగి ఉన్న భక్తులు ఒకరి ముఖాలొకరు చూసుకొంటారు )

దాసు – ఇదేమిటి, దేవునికని తెచ్చిన చెప్పులు------

నంబి ---- ఈ అయ్యవారు తొడిగేసేరేంటి !? పద, వెళ్లి అడుగుదాం !—

( ఇద్దరూ బయటికి వస్తారు. వారితో పాటు, వారి వారి తండాల లోని వ్యక్తులు కూడా బయట పడతారు )

దాసు + నంబి --- అయ్యవారూ, అయ్యవారూ---

( విష్ణువు ఆగుతాడు )

దాసు --- అయ్యవోరూ ! మీరు తొడిగిన చెప్పులు, మీ కోసం కుట్టినవి కాదండి ! వాటిలో కుడికాలి చెప్పును, నేను----

నంబి --- ఎడమ కాలి చెప్పును నేను----

దాసు ---- కాళహస్తి నుండి ఊఁరేగించి----నేను-

నంబి --- కంచి నుండి ఊఁరేగించి నేను---

ఇద్దరూ --  తీసుకొచ్చాం---

విష్ణు ---- తలొక పాదరక్షనీ చేసి, పట్టుకొచ్చారన్న మాట ! అయినా బాగున్నాయి. రెండూ ఒక్కలాగే ఉన్నాయి ! నాకు సరిగ్గా సరిపోయాయి.---

దాసు --- అయ్యవోరూ ! వాటిని మేము---

నంబి --- దేవుని కోసం తయారు చేసామండి----

దాసు ---- మీరు, వాటిని తొడుగు కోవడం, దేవునికి అపచారమండి !

నంబి --- వాటిని విప్పేసి, పక్కనే పెట్టేయండి. -- మీ బాగు కోసమే చెప్తున్నామండి---

విష్ణు ---- మీరు తెచ్చిన చెప్పులు, నా కోసమే చేసినట్లున్నాయి ! -- పోనీ , నేనే మీ దేవుణ్ననుకోండి !

( దాసు, నంబి ఒకరి ముఖాలొకరు చూసుకొంటారు. ఆ చెప్పులు అతనికి సరిపోయినట్లు ఉండడం వారికి ఆశ్చర్యం వేస్తుంది )

( ఇద్దరూ కూడ బలుకుకొని, విష్ణువుకు సాష్టాంగ పడుతారు )

( విష్ణువు వారివంక చిరునవ్వుతో చూస్తాడు )

విష్ణు --- దాసూ, నంబీ ! లెండి.

( ఇద్దరూ లేస్తారు )

విష్ణు --- మీకు పాద ముద్రలను పంపినది నేనే ! ఆంజనేయుడు, గరుత్మంతుడు తెచ్చి ఇచ్చారు, అవునా ?

( ఇద్దరూ మళ్లి సాష్టాంగ పడతారు )

ఇద్దరూ --- అపరాధం అయిపోయింది, స్వామీ ! క్షమించండి.

విష్ణు ---- లెండి, ఇలాగే, ప్రతీ సంవత్సరం పిండి తపేళాల మీద, నా పాద ముద్రలను, మీకూ, మీ తరువాత మీ కులాల వారికీ, ఇస్తాను ! వాటిని ఊఁరూరా, మేళతాళాలతో, ఊఁరేగించి తేచ్చి, ఏడుకొండల దిగువున ఉండే ‘ అలిపిరి’ మంటపంలో పెట్టండి. అర్థమయిందా ?

ఇద్దరూ --- అర్థమయింది, సామీ !!

( అంటూ ఒకరి వైపు మరొకరు చూసుకొంటారు . ఆశ్చర్యం ! వాళ్ల దుస్తులు మారి, చక్కటి దుస్తులుగా తయారవుతాయి. )

( వాళ్ల తండాలలో వారి ఆడంగుల మెడలు, ఆభరణాలతో నిండిపోతాయి. పిల్లల బట్టలు దర్జాగా తయారవుతాయి. మూటలలో ధన ధాన్యాలు వస్తాయి ! )

( వాళ్లు సంబరంతో ఒళ్లు మరచి, అవన్నీ చూసుకొంటూ ఉండగానే, విష్ణువు పాదరక్షలు తొడుగుకొని, చల్లగా జారుకొంటాడు )

( దాసు, నంబి విష్ణువు వెళ్లిపోయాక తేరుకొని, ఇటూ అటూ పరుగులిడి, వెతుకుతారు. అతనిని కానక, తమ తండాల దగ్గరికి, వస్తారు )

( ఆ తరువాత అందరూ కలిసి, స్వామి పాద రజాన్ని తీసుకొంటూ-- )

అందరూ – ఏడు కొండల వాడా ! స్వామీ ! ఎంకటేష్వరుడా ! స్వామీ ! గోవిందా ! గోవిందా ! ( అంటూ ఎలుగెత్తి నామ స్మరణ చేసుకొంటూ, తమ తమ ఊఁర్లకి దారి తీస్తారు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--48[మార్చు]

( దృశ్యము 48 )

( శేషాచలం పైన చింత చెట్థు, దాని క్రింద, వల్మీకము )

( విష్ణువు స్నానం చేసి, వచ్చినట్లుగా. తన గిరజాల జుట్టు, తడి తుడుచుకొంటూ, వచ్చి, పుట్ట ద్వారం లోంచి, పుట్టలోకి ప్రవేశిస్తాడు )

పుట్టలోంచి ---- “ఓం , హ్రీం, హ్రీం, శ్రీం , శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః “

( విష్ణువు ఆ పుట్టను, చేతితో నిమురుతాడు. పుట్టలోని పిపీలకునికి, తన వెన్ను నిమిరినట్లు అనిపిస్తుంది. అతనికి వాణి కూడ లభిస్తుంది )

పిపీలిక -- ప్రభూ ! శ్రీనివాసా, వాసుదేవా, గోవిందా ! నీ స్పర్శతో నా జన్మ పులకించి, పోయింది.

విష్ణు ---- పిపీలికా ! నీవు కోరినట్లు, నీ ఇంటికి వచ్చాను. కొంతకాలం ఇక్కడే తపస్సు చేసుకోనిస్తావా ?

పిపీలిక – ఎంత మాట ప్రభూ ! ఈ అల్పజీవి పైన, మీ అవ్యాజ కరుణా కటాక్షాన్ని, వర్ణించేందుకు, నాకు మాటలు రావడం లేదు. ఆదిశేషుని కైనా సాధ్యము కాదేమో !---

( కొండ రూపంలో నున్న ఆదిశేషుడు, ఆ మాటలు వింటాడు )

ఆదిశేష -- నిజమే పిపీలికా ! స్వామి వారు సశరీరంగా మనతో నివసించుటకు విచ్చేసినారు ! అతని కరుణను చాటుటకు, నాకున్న నాలుకలు చాలవు !

విష్ణు -- ఆదిశేషా ! పిపీలికా ! మీ రిద్దరూ వినండి ! నేను కొంతకాలం, యీ చింత చెట్టునీడన వల్మీక మందే విశ్రమించి, తరుగని చింతయగు తపస్సును, చేయుటకు నిశ్చయించితిని ! నన్ను సేవించుటకు, గోపీనాథుడనే పేరుగల వైఖానస ఋషి, అతని భృత్యుడు, ‘రంగ దాసుడు’ రాగలరు ! వారికి తప్ప, మరెవరికీ యీ విషయము తెలియ కూఢదు !

పిపీలిక -- అటులనే ప్రభూ ! కాని, నా దొక చిన్న మనవి !

విష్ణు ---- ఏమది, పిపీలికా ?

పిపీలిక --- ప్రభూ ! మా లాగే, -- కృష్ణా గోదావరుల మధ్యస్థమగు. పిండారకమునందు, ఉగ్ర తపస్సులో మునిగి ఉన్న , ద్వారకా ఋషిని కూడా, కటాక్షింపక మానరు కదా !?

విష్ణు --- ద్వారకా ఋషి తపస్సు చేస్తున్న కొండకి కూడ వేంకటాద్రి యనియే పేరు ! వేంకటాద్రి ఎచట నుండునో వేంకటేశ్వరుడు అక్కడ ఉండ గలడు !

పిపీలిక ---- మహాభాగ్యము ప్రభూ ! ద్వారకా ఋషిని అనుగ్రహించే ముందు మీరు. ఆ కుంకుడు చెట్టు క్రింద కూడ, నా వల్మీకమందే అవతరించ వలెను !

విష్ణు --- ( నవ్వి ) అచట కూడ, నన్ను చీమల పుట్టయందే అవతరించు మందువా, నీ కెంత స్వార్థము పిపీలికా ?

పిపీలిక --- ప్రభూ ! వాహన మెక్కుతేనే పుణ్య క్షయం కలుగుతుందని మీ వాహన శ్రేష్టులకి సేవ నిరాకరించి, మీ భక్తితో ఉపవాసముంఢి తమ వృత్తి ధర్మాన్ని, నిర్వహించిన పంచములకు, ధన ధాన్యాలని అనుగ్రహించారు ! అప్పుడు మీ పుణ్య క్షయం కాలేదా ? ఎవరిని ఎప్పుడు అనుగ్రహిస్తారో, ఎందుకు నిరాకరిస్తారో మీ లీలలు తెలియుట ఎవరి తరము !! చిన్న సేవ నఢిగిన నేను స్వార్థపరుడినా ? నా వంటి అల్ప జీవిపై కూడ, , మీ కరుణా కటాక్షములు, నిరంతరము నిలువ గలవని, ప్రకటించుటకే, నేనట్లు పలికితిని !

విష్ణు ---- బాగున్నది ! బాగుగానే యున్నది, నీ లౌక్యము ! అయినను నీ కోరిక నేనెందుకు కాదన వలె ! అటులనే కానిమ్ము, సశరీర ధారినై రెండు చోట్ల అవతరించుట సాధ్యము కాదు గనుక, ద్వారకా తిరుమల యందు, శిలా రూపమున అవతరించెదను గాక ! ‘ త్రిపతి’ యగు నేను, నివసించు యీ వేంకటాచలము, ‘ తిరుమల ‘ యను పేరుతోను, ద్వారకా ఋషి తపము చేయు వేంకట గిరి ప్రాంతము‘ ద్వారకా తిరుమల’ యను నామధేయముతోను, వెలుగొంద గలవు గాక !

( ప్రవేశం వైఖానస ఋషి, రంగదాసుడు. వైఖానస ఋషి స్వామి మాటలు వింటాడు )

వైఖానస--- ప్రభూ ! దేవదేవా ! మీ కరుణ అపరంపారమైనది ! ద్వారకా ఋషిని అనుగ్రహించినట్లే, నన్ను కూడ, నేను మీకు పెట్టిన ‘ బాలాజీ ‘ యని పేరుతో విలసిల్లి, అనుగ్రహించెదరు గాక !

( విష్ణువు చిరునవ్వుతో తన సమ్మతిని తెలియ జేస్తాడు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--49[మార్చు]

    ,

( దృశ్యము 49 )

( వేంకటాచలం దిగువ కపిల తీర్థము )

( మాధవుడు ఆ తీర్థ స్నానం చేసి, బయటికి వచ్చి, కొండకు నమస్కరిస్తాడు)

మాధవ --- ఓ వేంకటాచలమా ! దర్శన మాత్రమున నా పాపములు దహించిన నీ వెంతటి మహిమాన్వితమగు గిరి రాజమవో కదా !! ( పద్యము )

సీ-- శృంగార  రాయుని  చెలువు మీరిన కొండ / ఫణిరాజ  పేరిట  పశిడి  కొండ

పుష్ప జాజుల, విష్ణు పూజింపగల కొండ / కల్ప వృక్షము లెల్ల గలుగు కొండ చిలుకలు, కోవెలలును చేరి యాడెడి కొండ / మృగజాతి కండ్లను మెలగు కొండ ఘోర దురితము లణచు, కోనేర్లు గల కొండ/ ఘనమైన మోక్షంబు గలుగు కొండ

	అమర వరులకు నాధారమైన  కొండ / ఆళ్వారులకు ప్రత్యక్షమైన కొండ

అలరు జూచిన బ్రహ్మాండమైన కొండ / యేను పొడగంటి శ్రీ వేంకటేశు కొండ.

( అని ఆ కొండను పొగిడి, ఆ తీర్థం ఎగువన ఒక గుహను చూస్తాడు. ఆ గుహలోకి వెళ్తాడు )

( ఆ గుహలో కపిల మహర్షి కూర్చొని ఉంటాడు. మాధవుడు అతనిని చూసి, నమస్కారం చేస్తాడు. ముని కూడ కళ్లు తెరచి మాధవున్ని చూస్తాడు )

కపిల --- నీవు పుండరీక పుత్రుడవు మాధవుడవేనా ?

మాధవ -- అవును మహర్షీ ! ఈ వేంకటాచల ప్రభావము వలన,నా సంచిత పాపములన్నియు దగ్ధమయినవి ! నా తండ్రికి నేను చేసిన అపచారము మాత్రము నన్ను వదిలి పోక, పితృ ఋణము తీరకున్నది ! ఈ క్షేత్రములోని తీర్థములను అందుకే ఆశ్రయించి, కాలం గడుపుతున్నాను.

కపిల --- మాధవా ! నేను కపిలుడను, యీ కొండ మీద నా పేరు మీద నున్న ‘కపిల తీర్థము’ లో స్నానము చేయుట వలన , నీ పితృ ఋణము కూడ నేటితో తీరినది . ఈ జన్మలోనే కాదు, నీవు గత జన్మలో చేసిన ప్రారబ్ధ జనిత పాపములన్నియు, స్వామి పుష్కరిణిలో స్నానమాడినందున పోయినవి ! నీవు పూర్తిగా పునీతుడవైనావు !!

(కపిలముని మాటలతో మాధవుడు పులకితుడవుతాడు )

మాధవ -- కపిల మహర్షీ ! మీరు కద్రుమ ప్రజాపతికి, దేవమాత వలన, సాక్షాత్తు విష్ణు అంశతో పుట్టిన వారని, భృగు మహర్షి భార్యయగు ఖ్యాతికి తమ్ములని విన్నాను ! మీ దర్శనముతో నాకు విష్ణు దర్శనము కూడ అయినది మహర్షీ ! నాకీ జన్మ రాహిత్య మెప్పుడు ? నా భవితవ్యము ఎటుల నుండును !

కపిల --- మాధవా ! నీవు మరు జన్నమున ఆకాశ రాజు అను పేరుతో, పిలువబడి, మహాలక్ష్మి అంశతో అయోనిజగా పుట్టిన పద్మావతికి, తండ్రివై, ఆమెను యీ వేంకటాచలేశ్వరుని కిచ్చి, కన్యాదానము చేసి తరించ గలవు ! నీకీ విషయము తెలియ జేయుటకే నేను దర్శన మిచ్చితిని ! ( అంటూ కపిలుడు అంతర్థాన మవుతాడు )

మాధవ -- ఆహా ! ఏమి నా భాగ్యము ! మరు జన్మమునందు నేను శ్రీ మహావిష్ణువునకు మామగారిని కాగలనా ! ఏమి భాగ్యము !! ఇక యీ జన్మము నాకేల ? ఈ గుహయందే సమాధిని పొంది, జన్మావశేషము గడిపి వేయుదును గాక !!

( మాధవుడు కపిలముని కూర్చొన్న చోటనే, పద్మాసనము వేసుకొని కూర్చొంటాడు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--50[మార్చు]

( దృశ్యము 50 )

( చోళరాజు సువీరుని భవనము )

( చోళరాజు సువీరుడు, అతని భార్య , కొడుకు సుధర్ముడు, కోడలు మనోరమ ఉంటారు )

( సుధర్ముడు, మనోరమ నవదంపతుల వేషంలో. మెడలో పూల దండలతో ఉంటారు )

సువీరుడు -- కుమారా , సుధర్మా ! పాండ్య రాజును నీ శక్తియుక్తులతో మెప్పించి, అతని గారాల పుత్రిక మనోరమను అర్థాంగిగా చేసుకొని వచ్చిన నిన్ను గాంచి, నా మనము ప్రసన్నత చెందినది !

( మహారాణి కోడలుని దగ్గరకు తీసుకొని , ఆమె నుదుటిని ముద్దాడుతుంది )

రాణి -- కుమారా ! పాండ్యరాజు పుత్రిక పుష్పించిన లత వలె, పేరుకు తగ్గట్లు, మనోహరంగా ఉంది. ఈమెను, ఈమెతో పాటు ----

సువీరుడు --- చోళరాజ్య రమారమను కూడ చేపట్టి, ఏలుకొనెదవు గాక !

సుధర్ముడు -- తండ్రీ ! ఇప్పటి నుండి, ఇబ్బడి భారము నాపై మోపుట, మీకు భావ్యము కాదు !

సువీరుడు -- కుమారా, సుధర్మా ! బుద్ధి కుశలత గల మంత్రులు, శూర వీరులైన సేనానులు నీకు బాసటగా ఉంటారు. నాలో తపము నాచరించ వలెనన్న కోరిక బలీయమైనది ! సరియైన సమయము రాలేదని ఇంత వరకు దానిని అణిచి వేసితిని, ఇక ఆగుట నా వలన కానేరదు !

రాణి -- అవును, కుమారా ! ( అని కోడలు చేయి పట్టుకొని ) మనోరమా ! నీవు మెట్టిన యీ చోళ రాజ్యము, చంద్ర వంశము వారిది. వారి పూర్వీకులు శ్రీకృష్ణ, రుక్మిణీ దేవులకు అత్యంత ప్రీతి పాత్రులైన పాండవులు ! శ్రీ కృష్ణుని అనుంగు సోదరి అయిన సుభద్ర వలె, నీవు నీ భర్తను ప్రేమించి పరిద్మయ మందినావు ! నీవు నీ పతి ప్రేమ పూర్వక సపర్యలతో పాటు., అంతఃపుర భాద్యతలు కూడ స్వీకరింపుము !

మనోరమ -- అత్తయ్యగారూ ! పాదాల పారాణితో మీ గడప త్రొక్కాను ! అది ఇంకా ఆరక ముందే, మీరు నన్ను ఒంటరి దాన్ని చేసి ,వెళ్లి పోతాననడం భావ్యం కాదు !

సుధర్ముడు--- అమ్మా ! నా గురించి కాక పోయినా మీ కోడలు ముచ్చట్లు తీర్చుట కైనను, మీరును నాన్నాగారును మాకు తోడుగా నుండక తప్పదు.

( సువీరుడు, రాణి ఒకరి ముఖాలొకరు చూసుకొంటారు )

సువీరుడు--- అటులనే కుమారా ! ఆరు నెలల కాలము నీ కడ గడిపిన పిమ్మట , మేము వానప్రస్థముకు పోయెదము !

( అని రాజు సువీరుడు రాణితో పాటు వెళ్లిపోతాడు )

సువీరుడు--- మనోరమా ! పితృపాదులు ఎట్టకేలకు ఆరు నెలలపాటు ఉండుటకు అంగీకరించినారు. వారిని మరికొంత కాలము నిలుపుట, --- నీ చేతులలోనే కలదు !

మనోరమ-- ( చేతులు చూసుకొని ) నా చేతుల లోనా , ఎటుల స్మామీ ?

సుధర్ముడు-- చేతులలో అంటే చేతుల్లో కాదు, చేతలలో అని అర్థం !

మనోరమ --- చేతలా ! ఎటువంటి చేతలు ? మీరు చేప్పినట్లయిన తప్పక ఆచరించెదను !

సువీరుడు--- చెప్పమంటావా ప్రియా ! ( నవ్వుతూ ) అవి ప్రణయ చేష్టలు ! వాటిని ‘తూ.చ’ తప్పకుండా, ఆచరించినట్లయితే, మా తల్లి తండ్రులను--- తాతలుగా మార్చి, వారి వాన ప్రస్థమును ఆపగలవు !

మనోరమ --- ( సిగ్గుతో ) పొండి, స్వామీ !

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--51[మార్చు]

( దృశ్యము 51 )

( వేంకటాచలం లోనో కపిల తీర్థము )

( యువరాజు సుధర్ముడు , వేటాడి వచ్చి, అలసట తీర్చుకోడానికి, కపిల తిర్థం లోని నీరు త్రాగుతూ ఉంటాడు.)

( కపిల తీర్థం పైన ఉన్న కొండ చరియపై, ఒక దొండపాదు ఉంటుంది.)

( ఆ పైనుంచి ఒక భటుడు క్రిందకు దిగుతాడు. యువరాజుకి నమస్కారం చేసి, అతను ముఖం తుడుచుకోడానికి అంగ వస్త్రాన్ని ఇస్తాడు. సుధర్ముడు దానితో ముఖం తుడుచుకొంటాడు ) భటుడు -- యువరాజా ! వేంకటాచలం పైకి వచ్చే యాత్రికులకి, క్రూర మృగ బాధ లేకుండా, మీరీ రోజు, వేటలో , చాల సమర్థతతో, ఎన్నో మృగాలను కడ తేర్చారు !

సుధర్ముడు--- అవును, వేట వినోదం కోసం కాక, ప్రజా రక్షణ కొరకు చేస్తేనే దానికి సార్థకత చేకూరుతుంది ! యాత్రికులను ఇబ్బంది పెట్టే పులులు, భల్లూకాలు ముగిసినట్లే కదా ?

భటుడు --- యువరాజా ! మీ ప్రచండ పరాక్రమానికి, రణ నీతికి, శత్రు రాజులే భయకంపితులై పారిపోగా, యీ అడవి మృగాలు ఒక లెక్కా ? ( ఆగి ) యువరాజా ! యీ వేటలో మీరు చాల అలసి పోయారు, కాస్త విశ్రాంతి చాల అవసరం !

సుధర్ముడు--- ఈ కపిల తీర్థంలోని నీరు , త్రాగినంత మాత్రమున, సేద తీర్చు గుణము కలది ! నా కిప్పుడు అంతగా అలసట అనిపించుట లేదు !

భటుడు -- యువరాజా ! కొండ చరియపైన దొండ పందిరి దగ్గర ఎంతో చల్లగా, ప్రశాంతంగా ఉంది ! మీకు అక్కడ విశ్రమించడానికి తగిన ఏర్పాట్లు చేసాను.

( సుధర్ముడు పైకి వెళ్లి, అక్కడనుంచి కొండ యొక్క రమణీయ ప్రదేశాలను చూస్తాడు )

సుధర్మడు--- నీ వన్నది నిజమే! ఇచట కాస్త విశ్రమించి తిరిగి బయలు దేరుట మంచిది ! నాకు ఏకాంతము కావలెను ! నీవు దూరమున నుండి నేను పిలుచునంత వరకు, రాక వేచి యుండుము !

భటుడు ---అటులనే ప్రభూ ! మీ  విల్లంబులను,  ఖడ్గమును  విశ్రామ స్థలమందే  ఉంచినాడను .

సుధర్ముడు--- సరి , సరి ! నీవు సెలవు తీసుకొనుము.

( భటుడు నమస్కరించి వెళ్లిపోతాడు. రాజు అక్కడే నిలబడి, ప్రకృతి సౌందర్యం చూస్తూ ఉంటాడు.)

( ఒక పాము ప్రవేశిస్తుంది ! సుధర్ముడు దానిని చూస్తాడు. ఆ పాము నుంచి రక్షణ ప్రయత్నం చేస్తూ ఉండగానే, ఆ పాము చక్కని నాగకన్యగా మారిపోతుంది. )

( సుధర్ముడు ఆమె చక్కదనాన్ని చూసి మైమరుస్తాడు ! ఆ కన్యక కూడ లేచి నిలబడి, తల వంచుకొని, అతనిని క్రీగంటి చూపులతో చూస్తూ మోహ పరవశురా లవుతుంది.)

సుధర్ముడు--- సుందరీ ! ఎవరు నీవు ?

నాగకన్య-- రాజా ! నేను నాగ కన్యను ! ధనంజయుడనే నాగరాజు నా తండ్రి.

సుధర్ముడు—సుందరీ ! నీ సౌందర్యము నా మనము నాకట్టుకొన్నది ! -- సుదరియగు కన్య వీర పురుషుని సొత్తు, అనునది ఆర్యోక్తి !!

నాగకన్య-- మీరనునది ఆర్యోక్తి కాదు, చతురోక్తి ! సుక్షత్రియ వంశజుడైన వీర పురుషుడే నా పతి కాగలడని నా తండ్రి చెప్పినాడు !

సుధర్ముడు-- సుందరీ ! నేను చంద్రవంశపు మూల పురుషులైన పాండవుల వంశజుడను ! మా పూర్వీకుల కీర్తి ప్రతిష్టలు జగద్విదితములు !! మీ పితృపాదులన్నట్లు , నేను వీర పురుషుడను కూడ ! నీకు సమ్మతియైన నిన్ను యీ క్షణమే గాంధర్వ వివాహము చేసుకొనెదను !

నాగకన్య-- ఆర్యా ! మీరు సుక్షత్రియులే గనుక వివాహ ప్రస్తావన తెచ్చినారు గనుక, నాదొక విన్నపము !

సుధర్ముడు-- ఏమది సుందరీ ?

నాగకన్య-- మీతో వివాహము నాకు సమ్మతమే కాని--- నా సంతానమునకే రాజ్యార్హత కలుగ వలెను !

సుధర్ముడు-- సుందరీ ! నాకు పాండ్యరాజు పుత్రికయగు మనోరమా దేవియందు ‘ ఆకాశరాజు’ అను పేర ఒక కుమారుడు కలడు ! జ్యేష్ట పుత్రుడు ఉండగా, కనిష్ఠునకు రాజ్యము నిచ్చుట ధర్మ విరుద్ధము గాన, నే నటుల చేయజాలను !!

నాగకన్య-- అటులయిన రాజ్యమును చెరి సగము పంచి ఈయవలెను !

సుధర్ముడు--- సుందరీ ! నీవు అడిగినది ‘కలియుగ ధర్మము’ ప్రకారము న్యాయమే గనుక అటులనే చేసెదను.

నాగకన్య-- ఆర్యా ! -- అటులయిన-- నేను , మీ పత్ని నగుటకు--- ( అని రెండు చేతుల లోను ముఖాన్ని దాచుకొంటుంది )

సుధర్ముడు--  ( ఆమె  చేతులను  విడిపించి -- )  సుందరీ !  నీ సమ్మతము  తెలిసినది  కనుక  నీ ముఖ సందర్శనము  నాకు  దూరము చేయకుము !  మరి యేవియైన కోరికలున్నచో  సత్వరము తెలు జేయుము.

నాగకన్య-- ఆర్యా ! నాగకన్యను గనుక, నేను మీ అంతఃపురమున నుండజాలను ! నా ముఖము చూడ నిచ్చగించు నపుడెల్ల, మీరే ఇటకు రావలెను !

సుధర్ముడు--- అటులనే కానిమ్ము !

నాగకన్య-- నాకు పుత్ర సంతానమే కలదని దైవజ్ఞులు చెప్పినారు ! కనుక నేను నా కుమారుని నా కడనే పెంచి, పెద్ద చేసి యుక్త వయసు వచ్చిన వెనుక, మీ కడకు పంపెదను !

సుధర్ముడు-- సుందరీ ! నా కుమారుని మోము శైశవ ప్రాయము నుండి, చూడక నే నతనిని, పోల్చుకొనుట ఎట్లు ?

నాగకన్య-- ప్రభూ ! మీరు వివాహమునకు ముందే పుత్రోత్సాహము ప్రకటించుచున్నారు !!

సుధర్ముడు-- అవునవును ! ప్రస్తుత కర్తవ్యమదియే కదా !

( అని దొండ పందిరి నుండి, రెండు దొండ తీగలు లాగి, వాటిని మాలలుగా చేస్తాడు. ఒక మాలను నాగకన్యకకు ఇచ్చి, తానొకటి తీసుకొంటాడు )

సుధర్ముడు-- సుందరీ ! క్షేత్ర రాజమైన ఈ వేంకటాచలము సాక్షిగా, పరమ పావనము, పాపనాశనము , తీర్థరాజమైన యీ ‘కపిలతీర్థము’ సాక్షిగా నేను , నిన్ను గాంధర్వ విధిని, నా పత్నిగా స్వీకరించుటకు, వివాహమాడుచున్నాను !!!

( అని ఆమెకి ఎదురుగా నిలబడి, తన తల వంచుతాడు )

నాగకన్య-- స్వామీ ! త్రికరణ శుద్ధుగా మీకు అర్థాంగి నగు భాగ్యము కొరకు, నేను కూడ మిమ్ములను గాంధర్వ విధిని వివాహమాడుచున్నాను !

( అని తన చేతిలోని మాలను అతని మెడలో వేస్తుంది . మళ్లీ వారు దండలు మార్చుకొంటారు )

( ఇద్దరూ దొండ తీగల మాలలను వేసుకొని, ప్రక్క ప్రక్కగా నిలబడతారు ! సుధర్ముడు ఆమె ఎడమ చేతిని , తన కుడి చేతిలోకి తీసుకొంటాడు )

నాగకన్య-- స్వామీ ! ఈ దొండ తీగల సంబంధము చాల అపురూపముగా నున్నది !

సుధర్ముడు-- అవును సుందరీ ! ఇది మనకు మాత్రమే పరిమితము !!

నాగకన్య-- ఏమంటిరి స్వామీ ! ఇది మనకు మాత్రమే పరిమితమా ?

సుధర్ముడు-- అవును సుందరీ ! దొండ తీగల మాలలతో, మనకు గాక మరెవరికి కళ్యాణము జరుగ గలదు ?

నాగకన్య-- అటులయిన, మీరు మీ పుత్రుని పోల్చుకొనుట సులభమే కాగలదు ! వాని నడుముకు ఈ దొండ తీగలను చుట్టి, వానిని మీ కడకు పంపగలను !

సుధర్ముడు-- చక్కని ఆలోచన సుందరీ ! ఇదుగో ఈ రాజముద్రికను కూడ నీవు వానికి ఇచ్చి పంపుము !

( అని తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి ఆమెకు తొడుగుతాడు )

నాగకన్య--అటులనే స్వామీ ! రండు మృగయా వినోదము చేత మీరు చాల అలసి ఉన్నారు, విశ్రమించెదరు గాక !

సుధర్ముడు-- విశ్రమించుట , ఎచట సుందరీ, నీ బాహు బంధములోనా ?

నాగకన్య-- బాహుబంధములో కాదు, నాగబంధములో---!!!

( అని కిల కిలా నవ్వుతుంది. సుధర్ముడు కూడ ఆమెతో పాటు నవ్వుతాడు. ఇద్దరూ ఆ దొండ పందిరి క్రిందకు దారి తీస్తారు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--52[మార్చు]

( దృశ్యము 52 )

( వేంకటాచలము )

( రంగదాసు ఒక బావి తవ్వుతూ ఉంటాడు. ప్రవేశం వైఖానస ఋషి )

వైఖానస-- రంగదాసూ ! ఏం చేస్తున్నావు ?

రంగ -- ( చెమట తుడుచుకొంటూ ) బావి తవ్వుతున్నానండీ !

వైఖానస -- ఈ కొండమీద ఎన్నో సెలయేర్లు ఉండగా, యీ బావి దేనికయ్యా ?

రంగ -- నిజమేనండి ! అవన్నీ దిగువగా చాల దూరంలో ఉన్నాయండి. స్వామి పూజకని, ఇక్కడే పూల తోట వేశాను కదండి, కుండలతో నీళ్లు తెచ్చి, పొయ్యడం చాల కష్టంగా ఉందండి. అందుకని ఇక్కడే బావి తవ్వుతున్నానండి.

వైఖానస-- అదా విషయం ! స్వామివారి కైంకర్యానికే బావి తవ్వుతున్నా వన్నమాట ! మంచిదే, అలాగే కానియ్యి ! ( అని వెళ్లిపోతాడు )

( రంగదాసు నిష్ఠతో అలా తవ్వుతూనే ఉంటాడు. అలసినప్పుడల్లా, --)

రంగ --- వేంకటేశా ! గోవిందా ! ( అని సేద తీరుతూ ఉంటాడు )

బాలాఅజీ అర్చావతార విశేష దృశ్యార్చన--53[మార్చు]

( దృశ్యము 53 )

( వేంకటాచలం )

( స్వామి పుట్టకు కొంత దూరంలో, రంగదాసు, మరో ముగ్గురు కూలీలతో, ఆ పుట్టకి నాలుగు ప్రక్కలా గోడ కట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు )

( ప్రవేశం వైఖానసుడు )

వైఖానస-- రంగదాసూ, ఏం చేస్తున్నావు ?

రంగ-- గోడ కట్టిస్తున్నానండి. అందుకని రాళ్లు పేరుస్తున్నాను.

వైఖానస-- ఇదంతా ఎందుకు రంగదాసూ ?

రంగ --- వానలు పడితే పుట్ట తడిసిపోదా అయ్యవారూ ! ఇప్పుడు నాలుగు వైపులా మూడడుగుల గోడైనా కడితే, తరువాత కర్రదుంగలతో, పైకప్పు వేసి గుడిశె వేయవచ్చు.

వైఖానస-- రంగదాసూ యీ పనులన్నీ చేయడం వల్ల స్వామి వారి తపస్సుకు అంతరాయం కలుగుతుందేమో !

రంగ --- సద్దు లేకుండా, పని చేయిస్తాను.

వైఖానస--- సరే ! ఈ పనిలో పడి, స్వామి పూజకు, పువ్వులు, తులసి దళాలు తేవడం మరువకు.

రంగ -- అలాగేనండి !

==బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--54--

( దృశ్యము 54 )

( వేంకటాచలం లోని ఒక లోయ.! ఎగువున ఉన్న పూల తోటలో రంగదాసు పూలు కోస్తూ ఉంటాడు )

( ఆ లోయలోపల ఒక యక్షిణీకాంత నిల్చొని, తన ప్రియున్ని పిలుస్తూ ఉంటుంది. ఆమె పేరు క్షీరార్ణవ యక్షిణి )

క్షీరార్ణవ--- ప్రియా, నలకుబేరా ! ఇటు, ఇటు---( అని బిగ్గరగా పిలుస్తుంది )

( నలకుబేరుడు ఆమె వెనక నుండి, చప్పుడు చెయ్యకుండా వచ్చి, ఆమె కళ్లు మూస్తాడు . ఆమె అతని చేతుల పైన తన చేతులు వేసి, క్రిందకు లాగుతుంది. అతడు ఆమె మెడలో తన చేతులు హారంలాగ వేస్తాడు. క్షీరార్ణవ కోపం తెచ్చుకొంటూ-- )

క్షీరార్ణవ--- ఏమిటిది ప్రియా ! నా వెనకనే ఉండి, నన్ను ఎలుగెత్తి పిలిచేలాగ చేస్తున్నారు.

నలకుబేర-- ప్రియా ! అలా పిలిచేటప్పుడు, నీ గళంలోని నరాలు, బిగుసుకొని, వాటిలోంచి, క్షీరధారలు ఉబికి, నీ పేరు ‘ క్షీరార్ణవ’ అని చెప్పక చెప్తున్నాయి, తెలుసా !

( క్షీరార్ణవ అతని చేతులు విఢిపించుకొని, గోముగా అలుగుతుంది )

క్షీరార్ణవ--- ఏమంటిరి ప్రియా ! నా గళసీమలోని నరాలలో పాలు ప్రవహిస్తున్నాయా ? ఏమి హేళన !—

నలకుబేర-- హేళన కాదు ప్రియా ! ప్రియావలోకన !! నీ నరాలలో పాలు, నీ బుగ్గలలో పాలు, అంతెందుకు, నీ శరీరమంతా పాలు--- అందుకే నీ పేరు సార్థకం అయిందని అంటున్నాను.

( క్షీరార్ణవ సిగ్గు పడి దూరంగా పారిపోతుంది. నలకుబేరుడు ఆమె చెయ్యి పట్టుకొంటాడు )

క్షీరార్ణవ--- అబ్బ ! కాస్త మృదువుగా పట్థుకోండి !

నలకుబేర—ఒడిసి పట్టకుంటే, నువ్వు పాలనురుగులా జారిపోతావేమో !!

క్షీరార్ణవ-- మీ చేతికి చిక్కాక, జారిపోవధమూ, పారిపోవడమూ కాదు---

నలకుబేర-- మరి !---

క్షీరార్ణవ-- కలిసిపోతాను !

( ఇద్దరూ ఆనందంగా నవ్వుకుంటూ ఉంటారు )

( రంగదాసు చేస్తున్న పని మరచిపోయి ఆ జంటవైపు చూస్తూ ఉండిపోతాడు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--55[మార్చు]

( దృశ్యము 55 )

( స్వామి పుట్ట )

( వైఖానసుడు స్వామికి ఎదురుగా కూర్చొని, అతనికి పూజ చేస్తూ ఉంటాడు )

వైఖానస--- వన మధ్యే, తరోర్మూలే/ స్వామి పుష్కరిణీ తటే. తిష్టంతం పుండరీకాక్షం, శ్రీ భూమి రహితం హరిం— చించా వృక్షస్య మూలేతు / ప్రాదురాసీ జనార్దనః తింత్రిణీ వృక్ష మూలస్థం / వల్మీకం పరం హరిం---

( పూల కోసం వైఖానసుడు బుట్టలో చెయ్యి పెడితే, అది ఖాళీగా ఉంటుంది . వైఖానసుడు పూల బుట్టను చూస్తాడు. పూజ ఆపి,--- )

( స్వామి తపస్సులోకి జారుకొంటారు. అలా తపస్సులోకి వెళ్లిపోయిన స్వామిని చూసి, వైఖానసుడు నిరుత్సాహ పడతాడు )

వైఖానస--- (తనలో ) పూలు తేకుండా, ఈ రంగదాసుడు ఏం చేస్తున్నట్లు !--- మళ్లీ ఏ నుయ్యో, గొయ్యో తవ్వుతున్నాడు కాబోలు ! --- రానీ, వీడి పని చెప్తాను !

( ప్రవేశం రంగదాసు. చేతులో పూల సజ్జతో, వైఖానసుడు మండిపడతాడు )

వైఖానస--- రంగదాసూ ! చాల ఆలస్యం చేసావు. ఇవాళ స్వామికి పూల మాల వేయడం కుదరలేదు.--- ఇంతకీ నీ ఆలస్యానికి కారణం ?—

( రంగదాసు మాట్లాడడు )

వైఖానస--- ఏవేవో పిచ్చి పనులు చేస్తున్నావు ! అసలైన కైంకర్యం మానేసి, అవునా ?

( రంగదాసు మాట్లాడడు )

వైఖానస-- మాట్లాడవేం, ఏం చేస్తున్నావు ?

రంగ --- అయ్యగారూ. అయ్యగారూ !--- అపచారం అయిపోయిందండీ ! ఇంకెప్పుడూ ఇలా చేయనండి !

వైఖానస--- ఆ సంగతి అలా ఉంచు, ఏం చేసావో చెప్పు ?

( రంగదాసు చేతులు జోడిస్తాడు, కాని మాట్లాడడు )

వైఖానస-- నువ్వు చెప్పవన్న మాట ! చెప్పకుండా మూగనోము పడితే నేను తెలుసుకోలేనను కొన్నావా ?

( అని కళ్లు మూసుకొని రంగదాసు ఏం చేసాడో తన మనో నేత్రంతో చూస్తాడు )

( క్షీరార్ణవ నలకుబేరుల ప్రణయ దృశ్యాలు అతనికి కనిపిస్తాయి. అతని మనస్సు విచలిత మవుతుంది ! తనని ఆ స్థితికి తీసుకెళ్లిన రంగదాసు పైన చాల కోపం వస్తుంది వైఖానసునికి )

వైఖానస--- రంగదాసా ! --- ప్రణయ దాసుడవై హరికైంకర్యానికి ఆలస్యం చేసి అపచారం చేసావు ! ఇన్నాళ్లూ నీవు చేసిన హరిసేవకి ఫలితం లేకుండా చేసుకొన్నావు--- ( కోపంతో ) వెళ్లు ! ఇక నీ ముఖం నాకు చూపించకు, స్వామి పుష్కరిణిలో పడి చావు !!---( అని అంటాడు )

( రంగదాసు అతని కాళ్లు పట్టుకొని ఏడుస్తాడు.)

( పుట్టలోంచి స్వామి మాటలు వినిపిస్తాయి )

విష్ణు --- వైఖానసా ! విరాగి వైన నిన్నే ఉద్వేగానికీ, తద్వారా అపరిమితమైన కోపానికీ, గురిచేసిన యక్షిణీ ప్రేమలీల --- రంగదాసు వంటి సామాన్యునికి మైమరుపు కలిగించిందంటే ఆశ్చర్యమేముంది ! నీ నిర్ణయం ప్రకారం రంగదాసు ప్రాణత్యాగం చేసుకోవాలి, అంతేనా ?---

వైఖానస--- ప్రభూ ! నన్ను క్షమించండి. క్షణికమైన ఆవేశానికి లోబడి, అలా అన్నాను. అంతేగాని---

విష్ణు --- ఆవేశంతో వెలువడినా, అవి ఋషి నోటనుండి వచ్చాయి గనుక. అమలు జరగ వలసిందే ! రంగదాసూ !

రంగ--- స్వామీ !

విష్ణు ---- నీవు చింతింపకము, స్వామి పుష్కరిణిలో స్నానము చేసి, ప్రాణత్యాగము చేయుటకు సంకల్పించుము. నీ మరు జన్మమున ఆకాశరాజూకి అనుజుడివై, ‘’తొండమానుడ’ వన్న నామథేయంతో వెలుగంది, నా పరమ భక్త శిఖామణివై. నా కొరకు ఆలయము నిర్మింతువు గాక !

( రంగదాసు సాష్టాంగ పడతాడు పుట్టముందు )

విష్ణు --- వైఖానసా ! నీ కైంకర్యము ముగియు సమయమైనందునే , నీకా చిత్త చాంచల్యము అయినది ! మహత్తరమైన దైవ కార్యమునకు నాంది పలుకుటకై నీవు ఇచటి నుండి మరలి పోవక తప్పదు !

వైఖానస-- ప్రభూ ! బాలాజీ ! రంగదాసుని వలె నాకు కూడ ప్రాణత్యాగము చేయుటకు అనుజ్ఞ నిండు ! మీ సేవ నుండి మాత్రము దూరము చేయవద్దు !

( పుట్టలోని విష్ణువు మాట్లాడడు.)

( రంగదాసు స్వామి పుష్కరిణి వైపు వెళ్తాడు. )

( వైఖానసుడు పుట్ట ముందు సాగిలబడి ఎంతో దుఃఖిస్తాడు )

వైఖానస--- ప్రభూ ! బాలాజీ ! నా బాలాజీ !—( అంటూ)

( పుట్టలోని విష్ణువు మాట్లాడడు )

వైఖానస--- ప్రభూ ! బాలాజీ ! మహత్తర దైవ కార్యమునకు నాంది జరుగనున్నది గావున , నే నుండరాదని శాసించితిరి ! కానిండు, -- ఆ దైవ కార్యమేదో ముగిసిన పిమ్మట --- (ఎంతో ఉద్వేగంతో ) -- నన్ను పిలువకుందురా, నేను రాకుందునా ? -- నేను మీకు అడ్డమయినందున, ఎడమగుచుంటిని, ప్రభూ ! బాలాజీ ! పోయి వచ్చెదను గాక ! అంతియే గాని నేను నేరస్థుడను కాను ! బాలాజీ ! నేను నేరస్థుడను కాను !

( స్వామి పుట్ట ఏమీ పలకదు ! విష్ణువు దీర్ఘ తపోదీక్ష కొరకు తన కింకరులను దూరం చేసుకున్నాడు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--56[మార్చు]

( దృశ్యము 56 )

( ఆకాశం )

( నారదుడు పుట్టలో నున్న విష్ణువు తపస్సును ఆకాశం లోంచి చూస్తాడు )

నారద -- ప్రభూ ! శ్రీమహావిష్ణూ ! ఏమి యుగ్ర తపమయ్యా నీది ! చాంద్రమానము గిర్రున తిరిగి ( 60 సంవత్సరములు ) మరల భాధ్రపదము వచ్చు వరకు నిరంతరము సాగుతూ, కలియుగమున నిన్ను సేవించు భక్తుల నాదరించుటకై , నీవు చేయు యీ తపస్సు ఫలవంతమగు, సమయము ఏతెంచినది ! ఇక---ఇక—

వృ.-- ఖలారి కేశవ వినోద తాండవ / ఫణాళి కాళియ బాలకా ! కులారి రాజస సురారి మర్దన / పులోమ రుక్మిణి లోలకా ! జ్ఞానము నిచ్చుచు, జగాన / మోహము, భవాన తాపము గూర్చుచున్, మానవ లోకము, సులీల నేలుచు / రమించు మించుము నేర్పుతోన్ !

( అని పాడుతూ తాండవం చేస్తూ వెళ్తాడు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--57[మార్చు]

( దృశ్యము 57 )

( బ్రహ్మ లోకం )

( బ్రహ్మముందు, శివుడు, సూర్యుడు, మరికొంత మంది దేవతలు మరియు నారదుడు ఉంటారు )

నారద --- దేవతలారా ! శేషాచలమున అకుంఠ తపోదీక్షలో మునిగిన శ్రీమన్నారాయణునికి, మీ - మీ తపో ఫలితములు ఇచ్చు సమయము ఆసన్నమయినది !

శివుడు --- నారదా ! దేవతలందరి ప్రతినిధిగా ఈ మహత్కార్యమును నెరవేర్చుటకు, నీ జనకుడే సమర్థుడు !

నారద – ( బ్రహ్మతో )-- జనకా ! విన్నారు కదా, సదాశివుని ఆదేశము ! ఇక-- మీరీ కార్య నిర్వాహక భారము వహింపక తప్పదు.

బ్రహ్మ --- శంకరా ! మీ ఆదేశము నాకు శిరోధార్యము ! -- దేవతలారా ! నేను ‘‘గోవు’ రూపమున , శ్రీమన్నారాయణుని కడకు వెడలి, గోక్షీర ధారలతో నా బల, వీర్య, తేజో, జ్ఞానములను అతనికి సమర్పించుటకు నిశ్చయించితిని !

శివుడు --- బ్రహ్మదేవుని ఆలోచన కడుంగడు సమంజసము ! క్షీరధారల రూపమున బల, వీర్య, తేజో, జ్ఞానములను ఇచ్చుట నేనును, సిద్ధముగా నున్నాను. బ్రహ్మకు తోడుగా ‘గోవత్సముగా’ నారాయణుని కడకేగెదను !

సూర్యుడు + దేవతలు -- విధాతా ! శివ శంకరా ! మీరు తలచిన యీ కార్యాచరణములో, మా వంతుగా మేము మా బల, వీర్య, తేజో, జ్ఞానములను , మీరిచ్చు క్షీరధారలలో నిహితము చేసి శ్రీమన్నారాయణునికి సమర్పించ గలము !

నారద -- బాగున్నది ! బహు బాగున్నది ! జనకా, గోవుగా మారనున్న , మిమ్ములను శ్రీమన్నారాయణుని కడకు చేర్చువారెవరు ?

బ్రహ్మ --- ( సూర్యునితో ) సూర్యనారాయణా ! నీవు కరివీర పురమున కేగి, లక్ష్మీదేవితో యీ విషయము చెప్పి, ఆమెను చోళరాజు ‘సువీరుని’ రాజ్య సీమలకు చేరవేయుము. నేనును, శివ శంకరుడును, గో-వత్సముల’ రూపమున ఆమె కొరకు వేచి యుందుము.

నారద --- జనకా ! లక్ష్మీదేవి వచ్చి, గో-వత్సములను సువీరునకు అమ్మివేయునా ఏమి ?

బ్రహ్మ --- అవును నారదా ! చక్కగా సెలవిచ్చితివి.

సూర్య --- విధాతా ! మీ ఆదేశము మేరకు, నేను నా విధిని నెరవేర్చెదను గాక !

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--58[మార్చు]

( దృశ్యము 58 )

( చోళ రాజు సువీరుని రాజ్యము )

( లక్ష్మీదేవి, మాయా గోవత్సములను తోలుకొంటూ, ఒక వీధిలోకి ప్రవేశిస్తుంది )

( ఆ వీధిలోని ఒక ఇల్లాలు ఆవు దూడలను చూస్తుంది )

ఇల్లాలు --  ఆహా ! ఎంత  చక్కని  ఆవు !  దూడ  కూడ  చూడ  ముద్దొస్తూ ఉంది ! ( అనుకొంటూ  ఇంటి  బయటికి  వస్తుంది )
ఇల్లాలు ---  ఓసి  గొల్లమ్మా !  ఆవు  నమ్ముతావా ?

లక్ష్మి --- ( ఆగి ) అవునమ్మా, అమ్మకానికే తోలుకు వెళ్తున్నాను.

ఇల్లాలు --- ( దగ్గరగా వచ్చి ఆవుని చూస్తుంది ) అబ్బ ! ఎంత చక్కగా ఉందీ ఆవు !

లక్ష్మి ---- అంతేనమ్మా ! చూసి సంతోషించు ! అందరాని వాటికి అర్రులు చాచకూడదమ్మా !

ఇల్లాలు -- ఏమేమి ! ఈ గోవు నా తాహతుకి, అందరానిదా ? అంత గొప్పదా నీ ఆవు ?

( వీళ్ల మాటలు విని కుతూహలంతో వీధిలోని జనం గుమి కూడతారు )

లక్ష్మి -- ఆవు గొప్ప చెప్ప నలవి కాదమ్మా ! ఇది తలరాతలు రాసే ఆవు ! తలపుల్లో నిలిచే ఆవు ! తపో ఫలితాలు ఇచ్చే ఆవు !---

ఇల్లాలు --  ఏంటో !  మాయమాటలు  చెప్తున్నావు !  నువ్వు  చెప్పిందే కాక,  పాలిస్తుందా  , ఇవ్వదా ?

లక్ష్మి --- ఇవ్వకేమమ్మా ! సాధారణమైన పాలు కాదు ! వరాలిచ్చే దేవతల బలాలు నిండిన పాలు ! సంపదలిచ్చే సురుల సంపదలు నిండిన పాలు ! చదువుల నిచ్చే తల్లి వెలుగులు నిండిన పాలు ! దీని పాలకి ఏ పాలూ సాటిరావు !!

( ఇల్లాలు అర్థం కాక తల గోక్కుంటుంది )

ఇల్లాలు -- ఏం చోద్యమమ్మా ! ఒక్క మాట అర్థం కాలేదు ! మొత్తానికి మాయదారి ఆవని తెలిసింది. నా కెందుకులే తల్లీ ! ( అని ప్రక్కకి తప్పుకొంటుంది )

( లక్ష్మి మాటలు విన్న వారు అర్థమయి కొందరు, అర్థం కాక కొందరు, ముఖాముఖాలు చూసుకొని, గుస గుస లాడుకొంటూ ఉంటారు )

( ఇంతలో ,ఒక ఇంటి కిటికీ చాటునుంచి, ఒక గొంతుక వినిపిస్తుంది )

గొంతు ---- తల్లీ ! యాదవ వనితా ! నీ పేరేమిటమ్మా ?

లక్ష్మి --- ( కాస్త ఆలోచించి ) నా పేరా ?! రుక్మిణి !

గొంతు -- రుక్మిణమ్మా ! మీరు మీ ఆవు గురించి చెప్పిన మాటలన్నీ నిజమేనా ?

లక్ష్మి -- అవునయ్యా ! అంతా నిజమే ! అయినా చాటునుండి అడుగుతావెందుకు , కొనేవాడివయితే బయటికి వచ్చి, అడుగు !

గొంతు --- అలాగేనమ్మా ! బయటికి వచ్చే అడుగుతాను !

( అంటూ ఆ మనిషి కిటికీ చాటునుంచి లేచి, తలుపు తీసుకొని వస్తాడు. )

( ఆశ్చర్యం ! -- అతని ముఖం గాడిద ముఖం, శరీరమేమో మనిషి శరీరం !! ప్రజలు అతని చుట్టూ చేరుతారు. గార్ధభ ముఖుడు, లక్ష్మి, ఆవు , దూడలు మధ్యలో ఉండగా , చూసే ప్రజానీకం వాళ్ల చుట్టూ వలయాకారంగా నిలబడతారు.)

( ఆ వలయాన్ని నెట్టుకొంటూ ఇద్దరు రాజభటులు కూడ వచ్చి నిలబడతారు )

( గార్ధభ ముఖుడు ముందుగా లక్ష్మికి, ఆవుకి, దూడకి నమస్కారం చేస్తాడు )

గార్ధభ --- రుక్మిణమ్మా ! నే నొకప్పుడు చక్కని రూపుగల బ్రాహ్మణ పండితుణ్ని ! ఒక రోజు నా ఇంటికి వచ్చిన అతిథికి, ఎలాగూ ఆ రోజు, మా తండ్రిగారి ఆబ్దికమే గనుక, శ్రాద్ధ భోజనానికి పిలిచి, పెట్టించాను ! ఆ రోజు నుంచే , నా ముఖం ఇలా మారిపోయింది ! --- నేనే తప్పు చేసానో తెలియదు. దీనికి తరుణోపాయం ఏమిటో అంతకన్న తెలియదు ! ఆ నాటి నుంచి దుర్భర జీవితాన్ని గడుపుతున్నాను ! తల్లీ ! రుక్మిణమ్మా ! నీకు, నీ నాధునికీ, నీ వంశం వారికీ, అందరికీ మొక్కుతాను ! నీ గోవుకీ , దూడకీ కూడ పదే పదే మొక్కుతాను. ( మొక్కుతాడు )

లక్ష్మి --- ( జాలితో ) అలాగే బాపనయ్యా ! బెంగపడకు, అడుగుతాన్లే ! ( అని గోవు దగ్గరకి వెళ్లి ) విన్నావా బిడ్డా ! నీకు నీ తండ్రి మీద ఆన ! ఈ బాపనయ్యకి ఈ గతి ఎందుకు పట్టిందో చెప్పు !!

( గోవు తల ఆడించి, తన ముందుకాలి గిట్టలతో, నేల మీద ఏదో రాస్తుంది. అది బ్రహ్మ రాత ! ఎవరికీ అర్థం కాదు ! లక్ష్మి ఆ రాత చూస్తుంది, చదివి చెప్తుంది .)

లక్ష్మి --- ఇదుగో బాపనయ్యా ! నువ్వొక అయోగ్యుడికీ, సంతానం లేని వాడికి శ్రాద్ధ భోజనం పెట్టావు. నీ పితృ దేవతలు కోపించడం వల్ల. నీకీ ముఖం ఏర్పడింది ! అర్థమయిందా ?

గార్ధభ --- అర్థమయింది తల్లీ ! నా తప్పు తెలిసింది ! తరుణోపాయం కూడ చెప్పి, నన్ను కటాక్షించు !

( ఆవు తనకి తెలియదన్నట్లు తల తిప్పుతుంది. దూడ నుదురు నాకి , దూడ నడగమని సంకేతం ఇస్తుంది. లక్ష్మి దూడని అడుగుతుంది )

లక్ష్మి --- ఓ ! గోవుని మించిన గోవత్సమా ! ఈ గృహ మేథికి , గార్ధభ ముఖం పోయే ఉపాయం చెప్పు !

( దూడ చెంగు చెంగున ఎగిరి తన ముంగోటితో నేల మీద వ్రాస్తుంది. లక్ష్మి ఆ రాత చూసి చెప్తుంది )

లక్ష్మి ---- ఇదుగో బాపనయ్యా ! కొంగు బంగారం లాంటి కొండను వదిలి ఎక్కడికి పోనక్కర లేదయ్యా ! వేంకటాచలం పైని, ఆకాశగంగ తీర్థ స్నానము, స్వామి పుష్కరిణీ స్నానము చేస్తే చాలు, నీ రూపు నీకు తిరిగి వస్తుంది !

(గుంపులో ఉన్న రాజభటులు ఒకరికొకరు సైగ చేసుకొని ఈ విషయం రాజుగారికి చెప్పేందుకు వెళ్తారు)

 **********************

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--59[మార్చు]

( దృశ్యము 59 )

( చోళరాజు సువీరుని ఉద్యాన వనం )

( మహారాజు సువీరుడు, రాణితో పాటు కూర్చొని ఉంటాడు. ఇద్దరు రాజభటులు ముందు దారి చూపుతూ ఉండగా లక్ష్మి ఆవు దూడలను తోలుకొంటూ వస్తుంది. లక్ష్మి మహారాజుకి నమస్కరిస్తుంది )

లక్ష్మి -- మహారాజులకు జయమగు గాక ! మహారాణులకు మంగళమగు గాక !

సువీరుడు--- యాదవ వనితా !

లక్ష్మి -- మహారాజా ! నా పేరు రుక్మిణి !

సువీరుడు--- రుక్మిణీ ! నీ గురించి, యీ గోవత్సముల గురించి, మా భటులు చాల విషయాలు చెప్పారు ! అవన్నీ నిజమేనా ?

లక్ష్మి --- మహారాజా ! మీ భటులు ఏం చెప్పారో నాకు తెలియదు ! ఈ ఆవు దూడలు మాత్రము సామాన్యమయినవి కావని చెప్పగలను !

రాణి --- రుక్మిణీ ! నీ ఆవు జ్యోతిషం చెప్తుందట కదా !

లక్ష్మి ---- జోస్యం చెప్పదు మహారాణీ ! ధర్మ సందేహాలు తీరుస్తుంది.

సువీరుడు--- అవి మాకెలా తెలుస్తాయి ? ఈ గోవు వ్రాసే వ్రాత మేము చదువలేము కదా !

లక్ష్మి --- నుదుటి వ్రాత చదివే దైవజ్ఞులు, యీ గోవు వ్రాతలు చదవగలరు మహారాజా !

రాణి --- అదికాదు రుక్మిణీ ! ఈ ఆవుతో పాటు నువ్వు కూడ మాతోపాటు ఉండి పోవాలి.

లక్ష్మి --- క్షమించండి మహారాణీ ! ‘ పతి ఆనతి’ లేనిదే నేను పరాయి చోట ఉండలేను. నా పతి తపో దీక్షలో ఉన్నారు గనుక , అనుజ్ఞ తీసుకొనే అవకాశం లేదు.

సువీరుడు--- సరి, సరి ! ఇంతకీ ఈ ఆవు కొరకు, చెల్లించాల్సిన మూల్యం ఏమిటి రుక్మిణీ ?

లక్ష్మి --- మహారాజా ! ముందుగానే చెప్పాను గదా ! ఈ గోవత్సములు సామాన్య మయినవి కావని ! అటులనే అవి అమూల్యమయినవి ! ఆ గోవుకి మీ గోశాలలో ఉండడం ఇష్టమో కాదో అడిగి తెలుసుకోండి. ఇష్టం కాని చోట అది ఉండదు !

సువీరుడు--- అలాగా !

( అని గోవు దగ్గరకి వెళ్లి, దాని గంగడౌలు ప్రేమగా నిమిరి అడుగుతాడు )

సువీరుడు-- గోమాతా ! నమోనమః !

( గోవు తల ఆడిస్తుంది )

సువీరుడు--- గోమాతా ! మా గోశాలలో , మా రక్షణలో ఉండడం నీకు సమ్మతమేనా ?

( గోవు ‘ అంబా ‘ అని అరిచి తల ఊపుతుంది )

లక్ష్మి--- మహారాజా ! గోవు తన సమ్మతిని తెలియ జేసింది !

సువీరుడు-- అలాగయితే, నేను చెల్లించాల్సిన మూల్యం ఏమిటి రుక్మిణీ ?

లక్ష్మి --- మహారాజా ! మూల్యము క్రింద నాకు ఇవ్వ వలసింది ఒకే ఒక మాట !

సువీరుడు-- ( ఆశ్చర్యంతో ) మాటా !?

లక్ష్మి --- అవును మహారాజా !

సువీరుడు అలాగే ఏమిటా మాట ?

లక్ష్మి --- అనాలోచితంగా , తొందర పాటుతో ఏ విధమయిన నిర్ణయము తీసుకోనని మాట ఇవ్వండి !

సువీరుడు-- ఓహో ! ఇది సర్వ సాధారణమయిన నియమమే ! ఇదేమంత కష్టము ! ఇంత వరకు నేను అనాలోచిత నిర్ణయము చేయనే లేదు ! ఇకపైన కూడ చేయనని మాట ఇచ్చుచున్నాను

లక్ష్మి --- మహారాజా ! అయిన నా మూల్యము చెల్లించినట్లే !! ఇక నాకు సెలవు ఇప్పించండి !

( అని ఆవు దూడలను ఒక సారి లాలించి వెళ్లిపోతుంది. )

                     • .

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--60[మార్చు]

( దృశ్యము 60 )

( వేంకటాచలం దగ్గర ఒక పచ్చిక బయలు )

(ఒక గొల్లవాడు, ఆల మందలను ఆక్కడికి తోలుకొస్తాడు. మాయా-గోవు , దూడ కూడ వాటిలో ఉంటాయి )

( గోవుల్ని మేతకి వదిలి, గొల్లవాడు ఒక చెట్టు దగ్గర విశ్రమిస్తాడు. ఆ సంగతి గమనించిన గోవు మందను విడిచి, కొండ ఎక్కుతుంది. దూడ కూడ వెనక పడుతుంది )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--61[మార్చు]

( దృశ్యము 61 )

( స్వామి  పుట్ట )

( గోవు అక్కడికి చేరి, ‘అంబా’ అని అరుస్తుంది. ఆ తరువాత పుట్ట దగ్గరకి చేరి, పుట్ట లోపలికి’ ‘క్షీరధారలు’ వదులుతుంది. పుట్టలోని విష్ణువు గోవు అరుపుకి తెప్పరిల్లి, ఆ క్షీరధారలను ఆప్యాయంగా త్రాగుతాడు )

( విధాత తనయొక్క , శివ శంకరుని యొక్క బల, వీర్య, తేజో, జ్ఞానములను, క్షీరధారల రూపమున విష్ణువుకి అందిస్తాడు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--62[మార్చు]

( దృశ్యము 62 )

( మహారాజు సువీరుని గోశాల )

( గొల్లవాడు పాలు పిండేందుకు పాత్ర తీసుకొస్తాడు. గోవు పాలివ్వదు ! సామాన్యమైన పాలా అవి !! )

( గొల్లవాడు ఆవు వంక ఆశ్చర్యంతో చూస్తాడు )

గొల్లడు --- ( తనలో ) ఇదేంటబ్బా ! ఆవు పాలివ్వదేంటి ? దూడగాని తాగేసిందా ? రేపు దూడను దాని దగ్గర లేకుండా చేయాలి !

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--63[మార్చు]

( దృశ్యము 63 )

( వేంకటాచలం దగ్గర ఒక పచ్చిక బయలు )

( గొల్లవాడు దూడను తన దగ్గరే కట్టి పడేసి, ఆ తరువాత విశ్రమిస్తాడు. గోవు సమయం చూసుకొని పారిపోతుంది )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--64[మార్చు]

( దృశ్యము 64 )

( స్వామి పుట్ట )

( గోవు అక్కడకు చేరి ‘ అంబా” అని అరుస్తుంది. ఆ తరువాత పుట్ట దగ్గరకి చేరి, పుట్ట లోపలికి క్షీరధారలు వదుల్తుంది. పుట్టలోని విష్ణువు గోవు అరుపుకి తెప్పరిల్లి, ఆ క్షీరధారలను ఆప్యాయంగా త్రాగుతాడు )

( ఆ విధంగా గోవు రూఫంలోని బ్రహ్మ , శివుడు తప్ప, తక్కిన దిక్పాలకుల మరియు , సకల దేవతా సమూహముల యొక్క,, బల, వీర్య, తేజో, జ్ఞానములను తన క్షీరధారల ద్వారా విష్ణువుకి తపో ఫలంగా సమర్పిస్తాడు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--65[మార్చు]

( దృశ్యము 65 )

( మహారాజు సువీరుని గోశాల )

( గొల్లవాడు ఆవు పాలు పితికేందుకు వ్యర్థ ప్రయత్నం చేస్తాడు. ఆవు పాలివ్వదు. ఎందుకిస్తుంది? సామాన్యమైన ’క్షీరధారలా’ అవి !! )

గొల్లడు --- ఇదేమిటిది ? ఇవాళ కూడ పాలివ్వదేంటి ? ఏమయిందీ గొడ్డుకి ? దూడను నా దగ్గరే కట్టి వేస్తిని కదా ! రేపు దీని సంగతేదో కనిపెట్టి చూడాలి !

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--66[మార్చు]

( దృశ్యము 66 )

( వేంకటాచలం దగ్గర పచ్చిక బయలు. గొల్లడు చెట్టు దగ్గర పడుకొన్నట్లే నటిస్తూ, గోవును ఒక కంట కనిపెఢుతూనే ఉంటాడు. )

( మాయా గోవు మందను వదలి, దారితీస్తుంది )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--67[మార్చు]

( దృశ్యము 67 )

( స్వామి పుట్ట.! గోరూపంలోని బ్రహ్మ పుట్టలోకి క్షీరధారల ద్వారా, ముగ్గురమ్మల యొక్క తక్కిన సకల మాతృకా గణాల యొక్క, బల, వీర్య, తేజో, జ్ఞానములను, తపో ఫలముగా విష్ణువుకి సమర్పిస్తుంది )

( పుట్ట బయటినుంచి గొల్లనికి , విష్ణువు కనిపించడు . గోవు అలా పుట్టలో పాలు వదలడం చూసి, అతను నిర్ఘాంతపోతాడు. )

గొల్లడు -- అమ్మ ! మాయదారి గొడ్డా ! ఇదా నువ్వు చేస్తున్న పని ! పాలంతా పుట్ట పాలు చేస్తున్నావా ? ఉండు నీ పని చెప్తాను. ( అని తన చేతిలోని గండ్ర గొడ్డలిని , ఆవు పైకి విసురుతాడు )

( పుట్టలోని విష్ణువు గభాలున పైకి లేచి, గోవును రక్షింప బోతాడు. గొడ్డలి విష్ణువు తలకి తగిలి, గయమయి రక్తం ధార కడుతుంది. గొల్లవాడు ఆ దృశయం చూసి భయంతో మూర్ఛ పోయి ప్రాణాలు వదులుతాడు ! ఆ వెంటనే గోవు అంబా అని అరుస్తూ, మహారాజు దగ్గరకు బయలు దేరుతుంది )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన ---68[మార్చు]

(దృశ్యము 68 )

( మహారాజు సువీరుని ఉద్యానవనం )

( సువీరుడు, రాణి కూర్చొని ఉంటారు. గోవు అంబా అని అరుస్తూ, పరుగు పరుగున వస్తుంది. రంకె వేసి ముందు కాలితో నేలని తవ్వుతుంది. తరువాత వెనక్కి తిరిగి నడుస్తుంది )

రాణి -- మాహారాజా ! ఏమంటుంది యీ గోవు ?

సువీరుడు-- మహారాణీ ! ఏదో అవాంతరము జరిగినదని అనిపిస్తోంది ! గోవు తనతో రమ్మనమని చెప్తోంది. ( అంటూ గోవు వెనకనే వెళ్తాడు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--69[మార్చు]

( దృశ్యము 69 )

( స్వామి పుట్ట )

( గోవు దాని వెనకగా సువీరుడు అక్కడికి వస్తారు )

( గొల్లవాడు చనిపోయి ఉంటాడు.. విష్ణువు తలకి తగిలిన గాయాన్ని చేతితో అదుము కొంటూ, చింత చెట్టుని ఆనుకొని కూర్చొంటాడు .)

( సువీరుడు ఆ దృశ్యాన్ని చూస్తాడు. గొల్లని దగ్గరగా వచ్చి శ్వాస ఆదుతున్నాదీ లేనిదీ చూస్తాడు .అతడు చనిపోయాడని అనుకొంటాడు )

( ఆ ప్రక్కనే ఉన్న రక్తసిక్తమయిన గొడ్డలిని కూడ చూస్తాడు )

సువీరుడు-- ( తనలో ) ఓహో ! ఈ యువకుడెవరో మన గోపాలుని కొట్టి, అతని మృత్యువునకు కారణమయ్యాడు ! ( అనుకొని సరాసరి విష్ణువు దగ్గరకు వస్తాడు. )

( రాజు విష్ణువుని తట్టి లేపుతాడు )

సువీరుడు-- ఏమయ్యా ! మా గోపాలుని మృతికి కారణమయిన వాడివి నీవేనా ? వాడు ఏ అపచారం చేసాడు !?

విష్ణు -- ఈ వల్మీకములో తపము నాచరించుచున్న నా క్షుదార్తిని, యీ గోవు తన క్షీరధారలతో తీర్చు చుండగా, మీ గోపాలుడు, వచ్చి, తన పరశువుతో గోవును దండించ బోయాడు ! అడ్డుపడిన నన్ను ఆ పరశువు గాయ పరచినది ! అంతకు మించి ఏమయినది నాకు తెలియదు ! అయినను, మీరెవరు ? ఆ గోపాలునకు యజమానులా ?

సువీరుడు-- గోపాలునకు , ఆ గోవుకు, యీ రాజ్యమునకు, ఈ పర్వత రాజమునకు, అంతటికీ నేనే యజమానిని ! ఈ దేశపు మహారాజును ! గోవు తన క్షీరమును తన యజమానికి గాక, తమకి సమర్పించుట దండనీయమైన నేరము కాదా ! గోపాలుడు దానిని దండించబోగా, అడ్డుపడి, గాయపడుట మీ అజాగ్రత్తయా, లేల వాని అపరాధమా ? పాపము యీ మాత్రము దానికి శాపమిచ్చి, వాని ప్రాణములు బాపుట తాపసులగు తమకు తగిన పనియేనా ?

విష్ణు --- రాజా ! పూర్వాపరములు తెలుసుకొనక ఊఁహా జనిత భావనతో ఏమి న్యాయనిర్ణయము చేసితివి !! గోపాలుని మృతికి నేను కారణమని నన్ను దూషించితివి ! సత్యశోధన చేయక తొందర పాటు తనముతో నాపై నేరము మోపినందుకు నీకు శాపమిస్తున్నాను ! నీవు తక్షణము పిశాచమగుదువు గాక !!

( సువీరునికి, యాదవ వనిత తన దగ్గర తీసుకొన్న మాట జ్ఞాపకానికి వస్తుంది. గతం అతని కళ్ల ముందు ధృశ్యమవుతుంది ! అతనికి జ్ఞానోదయం అవుతుంది )

( గోవు బ్రహ్మ అని, యాదవ వనిత రుక్మిణి మహాలక్ష్మి యని, తనకి శాపమిచ్చినది మహావిష్ణువని అర్థమవుతుంది )

సువీరుడు-- ప్రభూ ! దేవదేవా ! నారాయణా ! వాసుదేవా ! గోవిందా ! శరణు ! మీరన్నట్లు నేను తొందర పాటు తనముతో సత్య శోధన చేయక, చేయించక తప్పు చేసాను ! శ్రీమహాలక్ష్మికి ఇచ్చిన మాట తప్పాను ! నాకీ పిశాచ జన్మ సరియైన శిక్ష ! ప్రభూ ! నా యందు దయయుంచి శాప విమోచన మార్గము తెలియ జేయుము ! ( అని విష్ణువుకి సాష్టాంగ నమస్కారం చేస్తాడు )

విష్ణు --- సువీరా ! నీ పిశాచ జన్మనుండి, ‘స్వామి పుష్కరిణీ ‘ స్నాన మహిమచే కాలక్రమమున విముక్తి నంద గలవు ! నీ కుమారుడు సుడర్మునికి రాజ్య పట్టాభిషేకము చేయుము ! నీ మనుమడు ఆకాశరాజుకు లక్ష్మీ అంశతో కలుగబోవు కన్యను నేను పరిణయ మాడినప్పుడు, నీకు పుణ్యలోకములు కలుగ గలవు !!

( సువీరుడు పిశాచంగా మారిపోతాడు )

( గోవు బ్రహ్మగాను, మందలోని దూడ శివునిగాను మారి తమ తమ లోకాలకు వెళ్లిపోతారు.)

( విష్ణువు , తలమీద గాయాన్ని చేతితో అదుముకొంటూ, స్వామి పుష్కరిణి వైపు దారి తీస్తాడు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన --70[మార్చు]

( దృశ్యము 70 )

( స్వామి పుష్కరిణి )

( విష్ణువు తన నుడుటి మీద గాయాన్ని, నీటితో తుడుచుకొంటూ ఉంటాడు )

( అతని వెనుక నుండి శ్రీ వరాహ స్వామి వస్తాడు. వచ్చి శ్రీనివాసుని భుజము మీద తన చెయ్యి వేస్తాడు . విష్ణువు అతనిని వెను తిరిగి చూస్తాడు )

వరాహ-- నీ వెవరవు ?

విష్ణు -- నేను వైకుంఠ వాసుడను ! వైకుంఠమున నా పేరు విష్ణుమూర్తి ! నా భార్య యగు లక్ష్మి నన్ను వీడిపోవుట వలన ఆమెను వెదకుచు, భూలోకమున అనేక పుణ్యక్షేత్రములు తిరిగి, చివరికు యీ వేంకటాచలమునకు నా తండ్రియగు ‘కశ్యప మహర్షి’ ఆదేశము వలన , వచ్చితిని ! ఇక్కడ నున్న చింతచెట్టు మూలమున నున్న పుట్టలో తపము నాచరిచుచున్నాడను ! నా తండ్రి నాకు పెట్టిన పేరు ‘ శ్రీనివాసుడు’ ! ఇంకొక భక్తుడు పెట్టిన పేరు ‘బాలాజి’! స్వామీ మీరెవరు ?

వరాహ --- నేనును ఒకప్పుడు వైకుంఠవాసినే ! హిరణ్యాక్షుడను దానవుడు, వర గర్వముచే, అహంకరించి భూమి నంతయు తన బాహు మూలమున బంధించి, సముద్రమున ముంచివేయ ప్రయత్నించుట చూచి, నేను శ్వేతవరాహస్వామిగా నవతరించి, వానిని వధించి, భూమిని తిరిగి ప్రతిష్టించితిని ! అప్పటి నుండి ఇచ్చోటనే నివసించు చున్నాను !! భిన్న రూపముల వెలుగు నీవును, నేనును ఒకే జ్యోతి నుండి, వచ్చిన వారము ! అర్థమయినదా ?

( విష్ణువు ఆనందంతో వరాహ స్వామిని కౌగలించుకొంటాడు )

వరాహ ---- లోక రక్షకా ! శ్రీనివాసా !! మీ రిచట ఎంత కాలము నివసింతురు ?

విష్ణు -- కలియుగాంతము వరకు నివసించుటకు నిశ్చయించితిని !

వరాహ --- మీరు కలియుగమున మానవులను కష్టవిముక్తులను చేయుటకే ఇచటకు వచ్ఛి యుందురని తలంచెదను !

విష్ణు ---- అవును ! శ్వేత వరాహ స్వామీ ! గడిచిన యుగములలో, లోక కళ్యాణమునకు ఎన్నియో అవతారములు ఎత్తినను, అవియన్నియు ఒక లక్ష్యము కొరకే ఎత్తనాడను !! ఈ కలియుగమున మానవులను పాప పంకిలము నుండి తప్పించుటకు వేంకటాచల మందు, అర్చావతారమెత్తుటకు సంకల్పించితిని !

వరాహ --- శ్రీనివాసా ! ఈ ప్రాంతమంతయు నా పేరుపై, వరాహ ప్రాంతముగా పిలువబడుచున్నది ! మీరు ఇచట నివసించుటకు కొంత ద్రవ్యము చెల్లించ వలసి యున్నది !

విష్ణు --- నిజమే ! ప్రస్తుతము లక్ష్మి నన్ను వీడిపోయినందున మీకు ద్రవ్యము నెట్లు చెల్లించ గలను ?

వరాహ -- శ్రీనివాసా ! తాము మానవుల శుభమును గోరి ఇచట నివసింప దలచితిరి ! మీ భక్త సందోహము, మీకు చేయు నివేదనలోని మొదటి భాగము నాకు చెల్లించదనని మాట యిచ్చిన చాలును !

విష్ణు --- చాల సంతోషము ! అట్లే యగు గాక ! నా దర్శనార్థము వేంకటాచలమునకు వచ్చు భక్తులు, తొలుత స్వామి పుష్కరిణిలో స్నానమాడి, మిమ్ములను సేవించి, మీకు నివేదనలు సమర్పించి, మీ యనుగ్రహము పొందిన పిదుప, నా సన్నిధికి వచ్చి, తమ నివేదనలను సమర్పించెదరు ! అట్టివారి నివేదనలను నేను అత్యంత ప్రీతితో స్వీకరించెదను !

వరాహ -- తథాస్తు !

( ప్రవేశం వకుళమ్మ )

వరాహ-- వకుళమ్మా ! ఓ వకుళమ్మా !

వకుళ--- వరాహ స్వామీ ! తమరిచటనే ఉన్నారా ?

వరాహ --- వకుళమ్మా ! నేటితో మీరు నాకు సేవలు చేయనక్కర లేదు !

(వకుళమ్మ బిత్తర పోతుంది )

వరాహ -- ( నవ్వుతూ ) అవును వకుళమ్మా ! ఈ నాటి నుంచి మీరు నా సేవలు చేయనక్కర లేదు !

వకుళ -- అదేమి స్వామీ ! నేనేం అపచారం చేసాను ?

వరాహ -- అపచారము కాదు వకుళమ్మా ! మీ పుణ్యఫలము మీకు దక్కబోవు సమయము వచ్చినది ! ఇదుగో చూడుడు ! ఇతడే నీ కృష్ణుడు !!

( వకుళమ్మ శ్రీనివాసుని తేరిపార చూస్తుంది. ఆమెకు అతను శ్రీకృష్ణుని లాగే కనిపిస్తాడు )

వరాహ -- ఇప్పుడితడు శ్రీనివాసుడను పేర వైకుంఠము నుండి వచ్చి, చింత చెట్టు క్రింద వల్మీకములో నివసించుచున్నాడు ! తలమీద గాయమయి బాధపడుచున్నాడు ! కనుక నేటినుంచి, నాకు బదులుగా, ఈతనికి తగిన సేవలందించుచు మాతృవాత్సల్యము తీర్చుకొనుము ! ( అని వెళ్లిపోతాడు )

విష్ణు -- అమ్మా, వకుళమ్మా ! నీవే ద్వాపరమున నన్ను పెంచిన యశోదమ్మవు ! గుర్తు వచ్చినదా ?

వకుళ --- వచ్చినది ! కన్నా ! వచ్చినది. నీ లీలలలో ఏది ముందు తలచుకోవాలో తెలియక సతమతమవుతున్నాను ! నాయనా ! నా శ్రీనివాసా ! నీకీ తలపైన గాయమేమిటి ? పద ! ముందు మందు వేసి కట్థు వేస్తాను ! ( అంటూ శ్రీనివాసుని తీసుకొని వెళ్తుంది )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--71[మార్చు]

( దృశ్యము 71 )

( నైమిశారణ్యము )

( సూత పౌరాణికుడు శౌనకాది మునులు ఉంటారు )

సూత --- ముని పుంగవులారా ! ఆ విధముగా శ్రీనివాసుడు, శేషాచలము చేరి, వల్మీకము నందు ఉగ్ర తపస్సు చేసి, తపో ఫలము నందుకొను సమయమున వైఖానసాదులను బయటకు పంపి, గోరూపము ధరించిన బ్రహ్మ వలన సకల దేవతల , బల , వీర్య , తేజో, జ్ఞాన , సంపదలను తపః ఫలముగా పొంది, గొల్లవాని కుఠార ఘాతమును నిమిత్తముగా చేసుకొని, బయటపడి, స్థిర నివాసమునకై వరాహ స్వామి అనుజ్ఞ పొంది, వకుళా మాత కోరిక తీర్చు నెపమున , ఆమెను తల్లిగా స్వీకరించిన వాడయ్యెను !

శౌనక --- సూతమహర్షీ ! శ్రీనివాస స్వామి సశరీరముగా వేంకటాద్రి యందు విహరించెనందురా ?

సూత --- వేంకటాచల విహారము చేయుట వలననే ఆయన వేంకట రమణుడు అయునాడు !

1 ఋషి -- సూతమహర్షీ ! వకుళా మాత పూర్వ జన్మమున యశోదయని మీరు చెప్పినారు కదా !

సూత --- అవును, ఆమె శ్రీకృష్ణుని బాల్య లీలలు మాత్రమే చూడగలిగినది. తన కుమారుని, వివాహ వేడుక చూడవలెనను, కోరిక బలీయమయి ఆమె మరల జన్మమెత్త వలసి వచ్చినది.

2 ఋషి --- సూత మహర్షీ !  ద్వాపరమున  శ్రీ కృష్ణ భగవానుడు, అష్ట  భార్యలను వివాహమాడినను,  యశోదా మాత  ఒక్క  కళ్యాణమైనను,  చూడలేక , ఆ  కోరికతో  వకుళ మాతగా  జన్మించెనని  తెలిసినది.  అటులైన  యీ జన్మమందు  ఆమె  ఎన్ని  కళ్యాణములు  ఛూసినది ?
సూత ---  పద్మావతీ పరిణయాన్ని!,  స్వామి  సశరీరముగా ఉన్నప్పుడు , అతను  కోరుకొన్న  కోడల్ని, తెచ్చుకొని  ఆనందించినది.  

3 ఋషి -- స్వామి అర్చావతారము దాల్చిన తదుపరి, ఎన్ని కళ్యాణములు జరిగినవి ?

సూత -- గోదా దేవితో ఒకటి, బీబీ నాంచారితో ఒకటి, రెండు కళ్యాణములు జరిగినవి.

4 ఋషి -- సూతమహర్షీ ! మాకా కళ్యాణ వేడుకలు, వినుటకు కుతూహలముగా నున్నది !

సూత --- మునిసత్తములారా ! స్వామి కళ్యాణ గాథలను, శ్రవణానంద కరముగా వినుడు.

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--72[మార్చు]

( దృశ్యము 72 )

( సుధర్ముని అంతఃపురము. )

( రాజు సుధర్ముడు, రాణి మనోరమ, సుధర్ముని కొడుకు ఆకాశరాజు, కూర్చొని ఉంటారు )

( ప్రవేశం తొండమానుడు. అతని నడుముకి దొండ తీగలు చుట్టబడి ఉంటాయి. తొండమానుడు వచ్చి, తన చేతికి ఉన్న రాజముద్రికను తీస్తాడు )

తొండ --- రాజ దంపతులకు నమస్కారము ! యువరాజు ఆకాశరాజుల వారికి నమస్కారము ! ( అని వారికి నమస్కారం చేస్తాడు )

సుధర్ముడు-- యువకుడా ! ఎవరు నీవు ? ఏమి ఆశించి వచ్చావు ?

తొండ --- మహారాజా ! నా నడుమునకు, యీ దొండతీగలను చుట్టి పంపిన నా తల్లి, మీకు కపిల తీర్థముందు గల దొండ పందిరిని జ్ఞాపకము చేయమన్నది ! అదిగాక, ఈ రాజముద్రికను కూడ ఈయమన్నది. ( అని ఉంగరాన్ని రాజుకి ఇస్తాడు )

( సుధర్ముడు ఆ రాజముద్రికను తీసుకొని, చూస్తాడు. అతనికి నాగకన్యక ఉదంతం జ్ఞాపకానికి వస్తుంది. వెంటనే ఆసనం నుండి లేచి, ఆ యువకుని కౌగలించుకొంటాడు. )

సుధర్ముడు--- దేవీ ! ఈ యువకుడు, నాగకన్యక యందు నాకు కలిగిన కుమారుడు. ( అని ఆకాశరాజుతో ) కుమారా ! వీడు నీ తమ్ముడు !

( అని పరిచయం చేస్తాడు.  యువకుడు  మనోరమకు పాదాభివందనం చేస్తాడు )

మనోరమ-- ( వానిని లేవనెత్తి ) కుమారా ! నీ పేరేమిటి ?

తొండ --- మాతా ! నన్ను కన్నతల్లి, నాకు పెట్టిన పేరు దొండ తీగలకు సంబంధించినది !

మనోరమ--- అంటే ఏమిటి కుమారా ?

తొండ --- మాతా ! నా పేరు తొండమానుడు !

ఆకాశరాజు--- తొండమానుడా ! చిత్రమైన పేరు, -- నీవు నా కనిష్థ భ్రాతబన్న విషయము అర్థమయినది ! రమ్ము ! ( అంటూ తొండమానుని కౌగలించుకొంటాడు )

( మనోరమ వారిద్దరనీ తృప్తిగా చూస్తుంది. రాజుకి చూపిస్తుంది )

మనోరమ-- చూసితిరా స్వామీ ! వీరిరువురు రామ లక్ష్మణుల వలె నున్నారు కదా !

సుధర్ముడు-- ( అనందంతో కళ్లు చెమ్మగిల్లగా ) అవును దేవీ !

మనోరమ--- అటులయిన , మీ వాగ్దానమును నెరవేర్చు సమయము వచ్చినది.

సుధర్ముడు-- వాగ్దానమా ? అది ఏది దేవీ !

మనోరమ--- ఈ యువకుడైన తొండమానుడును, నా కుమారుడు ఆకాశరాజునకును, రాజ్యము చెరి సగము పంచి ఇత్తునను, మీరు మీ ప్రణయసఖి, నాగకన్యకకు ఇచ్చిన వాగ్దానము !

సుధర్ముడు--- లేదు దేవీ ! నేనా వాగ్దానమును మరువ లేదు ! నీ యభిప్రాయము కనుగొనుటకు, అటుల ప్రశ్నించితిని. – కుమారా , ఆకాశరాజా ! నీవేమందువు ?

ఆకాశరాజు-- తండ్రీ ! మీ ఆజ్ఞ, దానికన్న ముందు మీరిచ్చిన వాగ్దానము, నాకు శిరోధార్యములు !

=బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన --73[మార్చు]

( దృశ్యము 73 )

( ఆకాశ రాజు గది )

( రాజు అతని భార్య ధరణీదేవి, మంత్రి, పురోహితుడు, మరో ఇద్దరు జ్యోతిష పండితులు కూర్చొని ఉంటారు )

ఆకాశరాజు-- మహామాన్యులారా ! ఎన్నెన్ని బోగాలు, భాగ్యములు ఉన్నా, అవన్నీ సంతానంతో సరితూగవు !-- నా భార్య ధరణీదేవిని, ‘ఇంకా సంతానం కలుగలేదా’ అన్న ప్రశ్న నిరంతరము రేయింబగళ్లు, స్వప్న సుషుప్తులలోను, వెంటాడి వేధించు చున్నది.—ఈ నాలుగు మాటలతో నేను నా మనోవ్యధను సరిగా చెప్పలేక పోయినా, పండిత ప్రకాండులయిన ,మీకు, అర్థం చేసుకోగలరని తలస్తాను ! నాకు సంతతి కలిగే ఉపాయం చెప్పి, పుణ్యం కట్టుకోండి !

( ఇంతలో అక్కడికి ఒక రాజభటుడు వస్తాడు )

భటుడు --- మహారాజులకు అభివాదములు ! శ్రీ శుక మహర్షులవారు, బయట తమ ప్రవేశానికి అనుమతి అడుగుతున్నారు.

( ఆకాశరాజు దిగ్గున ఆసనం నుండి లేస్తాడు. అందరూ అతనిని చూసి లేస్తారు )

ఆకాశరాజు-- శుక మహర్షుల వారికి, నా సభ యందు ప్రవేశానుమతియా ? ఎంత మాట ! అమాత్యా !!

మంత్రి -- ప్రభూ !

ఆకాశరాజు --- మీ రతనికి ఎదురేగి, సగౌరవముగా నిచటకు, తోడ్కొని రండు !

మంత్రి -- అటులనే ప్రభూ !

( మంత్రి భటునితో పాటు బయటికి వస్తాడు. ఆకాశరాజుతో పాటు అందరూ ద్వారం వంక చూస్తూ ఉంటారు)

( మంత్రి శుకమహర్షిని వెంట పెట్టుకొని వస్తాడు. మహర్షి లోపలికి రాగానే ఆకాశ రాజు చేతులు జోడించి )

ఆకాశరాజు--- శుక మహర్షీ ! మీ రాకతో నా రాజప్రాసాదము పావనమయింది ! మేము ధన్యుల మయ్యాము ! రండు, ఆశీనులు కండు ! ( అంటూ తన ప్రక్కనే ఉన్న ఆసనం పైన కూర్చో పెట్టుకొంటాడు )

( శుకమహర్షి కూర్చొన్న తరువాత, రాజు తరువాత తక్కిన వారు కూర్చొంటారు )

( ధరణీదేవి లేచి వచ్చి, శుక మహర్షికి నమస్కరిస్తుంది )

ధరణి -- శుకమహర్షుల వారికి, ఈ అభాగిని అయిన ధరణీ నమస్కరిస్తున్నది !

శుక --- ( లేవనెత్తి ) పుత్రీ ! విశాల సామ్రాజ్యమునకు మహారాణివి ! నీవు అభాగినివి ఎట్లయినావు ?

ధరణి –ఎన్ని సంపదలున్నను, పుత్రవతి కాని స్త్రీ , పుణ్య స్త్రీ ఎట్లగును మహర్షీ ?

శుక -- అదియా నీ మనోవ్యధ !

( చిరు నవ్వుతో ఆమె వంక చూసి. కూర్చోమని సైగ చేస్తాడు . ఆమె తన ఆసనంపై కూర్చొంటుంది )

మంత్రి -- మహర్షీ ! ఇది ఈ రాజదంపతులకే కాదు, మాకును తీరని మనోవ్యద !

పురోహిత--- మహర్షీ ! మహారాజుల వారును, మహారాణీ వారును, అధుగ దలచు కొన్నది----

1 పండిత-- బ్రహ్మర్షులయిన తమ రాక వల్ల సానుకూలమయింది !

2 పండిత-- వేదవ్యాస పుత్రులయిన తమకు తెలియని ధర్మ సూక్ష్మములు ఉపాయములు లేవు ! పుత్రార్థులయిన ఈ రాజదంపతులకు---

1 పండిత-- ఇష్ట కామ్య సిద్ధి కలిగే ఉపాయం సెలవివ్వండి.

శుక---ఆకాశరాజా ! మీ దంపతుల జాతక చక్రములను ,జ్యోతిర్విదులైన యీ పండితులు పరిశీలించినారు కదా !

ఆకాశరాజు—అవును మహర్షీ !

శుక--- మీకు సంతతి కలుగదని ఎవరైనా చెప్పారా ?

ఆకాశరాజు--- దైవజ్ఞులయితే కలదనే చెప్పారు-- కాని---

శుక -- కాలము కలిసి రానందువల్ల కలుగుట లేదు, అంతేనా ?

ఆకాశరాజు--- ( ఆనందంతో ) అటులయిన మాకు పుత్రప్రాప్తి కలదా మహర్షీ !

శుక --- పుత్రుడే కావాలన్న తపన దేనికి మహారాజా ?

ఆకాశరాజు--- ‘ అపుత్రస్య గతిర్నాస్తి’ అని ధర్మ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా , మహర్షీ ?

ధరణి --- (ఉద్వేగంతో ) లేదు, మహర్షీ ! పుత్రుడే పుట్టాలన్న కోరిక నాకు లేదు ! నాకు కావలసినదల్లా నన్ను, ‘ అమ్మా’ అని పిలిచే సంతానము !.

శుక--- పుత్రీ ! నీ మాతృత్వ కాంక్ష నాకు విశదమయినది ! నీ కోరిక తప్పక నెరవేరగలదు !

ఆకాశరాజు + ధరణి ---- నిజమా మహర్షీ !

శుక --- రాజ దంపతులారా ! వినుడు. మీ రాజ్య సరిహద్దులందు గల వేంకటాచలము కామితార్థములిచ్చు కొండ ! ఆ పర్వత రాజమును దర్శించిన పిదుప, పుత్ర కామేష్టి యాగమును చేయుము ! తొల్లి త్రేతా యుగమున , మిథిలా నరేశుడయిన జనక మహారాజునకు, సీతాదేవి లభించినట్లు, ఈ యాగము వలన నీకు పుత్రికా రత్నము లభింపగలదు !!

ధరణి --- నిజమేనా మహర్షీ ?

శుక -- అవును పుణ్యవతీ ! అయోనిజయైన ఆ బాలిక సామాన్యురాలు కాదు, వాక్సుద్ధి కల ఆ బాలిక, ఏ నాడు, తన నోటితో ‘ సోదర’ శబ్దమును, ఉచ్ఛరించునో ఆ నాడే నీ గర్భము ఫలించి, పుత్రోదయము కూడ కాగలదు ! -- నేను యీ వార్త తెలుపుటకే మీ నగరికి విచ్చేసినాను ! ఇక నాకు సెలవిండు !

( అని లేస్తాడు, అందరూ అతనికి నమస్కరిస్తారు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--74[మార్చు]

( దృశ్యము 74 )

( నైమిశారణ్యము )

( సూత మహర్షి, శౌనకాది మునులు ఉంటారు )

సూత --- శౌనకాది మునులారా ! శుక మహర్షి చెప్పిన విధమున, పుత్ర కామేష్టి యాగము చేసి, నాగలి పట్టి దున్నిన ఆకాశ రాజున కొక పెద్ద మందసము కనిపించెను. ఆ మందసమందు, వికసించిన పద్మముల మధ్య, పూర్ణ చంద్రుని ధిక్కరించు శరీర కాంతిగల చక్కని పసిపాప కన్పించినది ! ఆ పాపకు పద్మావతి యని నామకరణము చేసి, రాజదంపతులు ఆనందముతో పెంచసాగిరి !

శౌనక --- మహర్షీ ! ఆ ఆకాశరాజునకు పుత్రోదయము ఎట్లయ్యెను ?

సూత --- ఆరేళ్ల ప్రాయమున, పద్మావతి తన చిలుక పలుకులతో, “ అమ్మా ! నాకు తమ్ముడు కావాలే ! “ అని అనినంతనే ధరణీదేవి గర్భము ధరించి, వసుధానుడను పుత్రుని బడసినది !

1 ఋషి --- సూత మహర్షీ ! జనక మహారాజునకు సీత వలె, ఆకాశరాజునకు పద్మావతి లభించడం, యాదృచ్ఛికమా ? లేక ----

2 ఋషి --- ఆ సీతా - పద్మావతుల మధ్య జన్మ సామ్యములకు, కారణమేదైన కలదా ?

సూత --- మంచి ప్రశ్నయే వేసితిరి ! సీతా పద్మావతుల సంబంధము త్రేతాయుగము నాటిది ! ఒకనాడు నారద మహర్షి, పౌలస్త్యుడయిన రావణాసురుడు, లోక కంటకుడయిన విషయమును, శ్రీమహావిష్ణువుకు విన్నవిస్తూ ఉండగా, అత్యధిక సంవేదన శీలయగు శ్రీలక్ష్మికి, రావణ వధకు, తానే ముందు నాంది పలుక వలెనను సంకల్పము పుట్టినది ! ఆమె సంకల్పము తక్షణమే ఒక బాలికగా జన్మమెత్తి, కుశడ్వజ మహర్షి, హోమగుండము సమీపమున , దర్భగడ్డిపై, అయోనిజగా, ప్రకటితమయినది !

3 ఋషి --- సూత మహర్షీ ! అటుల సీతకన్న ముందు, శ్రీమహాలక్ష్మి సంకల్ప అయోనిజగా పుట్టిన వేదవతి ----

4 ఋషి -- రావణ వధకు ఏ విధమున తోడ్పడినది ?

సూత -- మునిపుంగవులారా ! సంకల్ప అయోనిజగా జన్మించిన వేదవతియే, జన్మాంతరమందు ‘పద్మావతి’ అయినది ! ఇక రావణ వధకు వేదవతి, ఎటుల తోడ్పడినదో వినుడు !

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--75[మార్చు]

( దృశ్యము 75 )

( భూలోకంలో కుశధ్వజ ఋషి కుటీరం )

( ఋషి కుశధ్వజుడు , మహర్షి అతని కమార్తె వేదవతి, అగస్త్యుడు, ఉంటారు )

( అగస్త్యుడు ఎత్తైన ఆసనం మీద కూర్చొని ఉంటాడు. కుశధ్వజుడు ప్రక్కనే నిలబడి, అతనికి విసనికర్రతో విసురుతూ ఉంటాడు )

( వేదవతి పాత్రతో నీరు తెచ్చి, అగస్త్య మహర్షికి ఇస్తుంది. అగస్త్యుడు ఆ నీరు కొంచం త్రాగి, ఆ నీరు పాత్ర క్రింద పెడతాడు )

అగస్త్యుడు --- కళ్యాణీ ! నీ పేరు ఏమిటి ?

వేదవతి --- మహర్షీ ! నా తండ్రి నాకు పెట్టిన పేరు వేదవతి !

అగస్త్యుడు --- వేదవతీ ! నీకీ పేరు తండ్రి పెట్టినదని చెప్పావు ! మరి నీ అసలు పేరేమిటి ?

వేదవతి –ఆత్మకు పేరెక్కడుంటుంది మహర్షీ !

అగస్త్యుడు --- మరేముంటుంది ?

వేదవతి -- అహం ఉంటుంది ! అరిషడ్వర్గాలు దానిని పెంచి పెద్ద చేస్తాయి !

అగస్త్యుడు --- ( ఆశ్చర్యంతో ) వేదవతీ ! రూప, యవ్వన లావణ్యాలు చిగిర్చి, పూత పెట్టిన యీ ప్రాయంలో, నీకీ వైరాగ్య చింతన, చిత్రంగా ఉంది ! – సరే , ఆత్మ నంటిన అరిషడ్వర్గాలను త్రుంచితే ఏమవుతుంది ?

వేదవతి -- అహం క్షీణిస్తుంది !

అగస్త్యుడు --- ఆ అహన్ని కూడ లోబరచుకొంటే ?

వేదవతి ---- ఆత్మ, పరమాత్మకి సమర్పిత మవుతుంది .

( అదే సమయానికి కుశధ్వజుని మేనల్లుడు, ‘ ఋతుపర్ణుడు’ ప్రవేశిస్తాడు. ఋతుపర్ణుడు అగస్త్యునికి, నమస్కరిస్తాడు )

ఋతుపర్ణుడు-- అగస్త్యమహర్షీ !  నా అభివాదము స్వీకరించండి.

అగస్త్యుడు --- కుశడ్వజా ! ఈ చిరంజీవి ఎవరు ?

కుశధ్వజుడు-- మహర్షీ ! ఇతను నా మేనల్లుడు. మీ ఆశీస్సులు లభిస్తే, నాకు కాబోయే అల్లుడు.

అగస్త్యుడు --- కుశధ్వజా ! నీ కమార్తె మాటలు విన్నాక, అలాంటి ఆశీస్సులు ఇచ్చేందుకు మనసు శంకిస్తోంది. వేదవతీ, నివేమంటావు ?

( వేదవతి దీనంగా అగస్త్యుని పాదాల మీద పడి, ఏడుస్తుంది )

వేదవతి-- మహర్షీ ! మీరు,నాలుగు మాటలాడి నా మనస్సు తెలుసుకో గలిగారు ! చిరకాల సాహచర్యమున్నా, ఎరుక తెలిసిన నా తండ్రి, నా మనసెరిగి మాట్లాడుట లేదు !

అగస్త్యుడు --- ( గంభీరంగా ) కుశధ్వజా !

( అతని  కంఠం లోని  తీవ్రతకి  కుశధ్వజుడు  కంపిస్తాడు. చేతులు  జోడించి అంటాడు )

కుశధ్వజుడు-- చిత్తం మహర్షీ !

అగస్త్యుడు --- కన్యక వరణ స్వాతంత్ర్యాన్ని ధిక్కరించి, పెళ్లి జరిపించాలను కొంటున్నావా ? అది, నేరమని నీకు తెలియదా ?

కుశధ్వజుడు-- మహర్షీ ! కూతురు కోరికను మన్నించి, వివాహం చేయడం, ధర్మసమ్మతమని నాకు తెలియక కాదు !-- కోరరాని కోరిక కోరితే, ఏ తండ్రైనా , ఏం చెయ్యగలడు ?

అగస్త్యుడు --- వేదవతీ ! నువ్వు చెప్పు, నీవు కోరినది భ్రష్టుడినా ?

వేదవతి--- కాదు.

అగస్త్యుడు --- వ్యసన పరుడినా ?

వేదవతి--- కాదు.

అగస్త్యుడు --- నిషిద్ధ జాతి కులములలో, జన్మించిన వాడినా ?

వేదవతి--- కాదు !

అగస్త్యుడు --- సత్పురుషుడేనా ?

వేదవతి-- సచ్చిదానంద స్వరూపుడయిన పురుషోత్తముడిని !

అగస్త్యుడు --- అర్థమయింది ! నీవు, నీ చిత్తాన్ని శ్రీమన్నారాయణునికి, అంకితం చేసావు, అంతేనా ?

వేదవతి-- అవును మహర్షీ ! తపస్సు చేసి, అతనిని పతిగా పొందాలని, తండ్రి ఆజ్ఞ అడిగాను.—

కుశధ్వజుడు-- మహర్షీ ! మీరే చెప్పండి, ఇదేమైనా తీరే కోరికా ? ఋతుపర్ణుడు రూప, యవ్వన , గుణ సంపన్నుడు. పోనీ, అతనిని కాక, యోగ్యుడయిన వరుని, ఇంకెవరి నయినా----

అగస్త్యుడు --- కుశధ్వజా ! శ్రీమన్నారాయణుడు యోగ్యుడయిన వరుడు కాడంటావా ?

కుశధ్వజుడు-- మహర్షీ ! ఆ మాట అనే అర్హత నాకెక్కడిది ? అతడు, మానవ మాత్రుడు కాదని మాత్రము అనగలను !

అగస్త్యుడు --- పర్వత రాజ పుత్రి పార్వతి, తపస్సు చేసి, పరమేశ్వరుని పతిగా పొందిందా, లేదా ?

కుశధ్వజుడు-- మహర్షీ ! ఆమె కారణ జన్మురాలు గనుక, అలా చెయ్యగలిగింది.

అగస్త్యుడు --- కుశధ్వజా ! ఈ వేదవతి కూడ అయోనిజయై, హోమ గుండము సమీపమున, దర్భలపై పడి, నీకు దక్కిన మాట మరచితివా ?

కుశధ్వజుడు--- మహర్షీ ! -- ఈమె కారణజన్మురాలు కావచ్చును ! కాని తపము చేయుటకు, తగిన వయసా ఇది ? ఈమె సుందర సుకుమార శరీరము గల అబల కాదంటారా ?

అగస్త్యుడు --- వేదవతీ ! నీ తండ్రి అడిగిన ప్రశ్నలో నిజం ఉంది. దానికి నీ జవాబేమిటి ?

వేదవతి-- మహర్షీ ! నా రూపము, యవ్వనము, వయసు, సుందర సుకుమార శరీరము--- వీటిలో ఏది -- నా మనో నిశ్చయమయిన తపస్సుకి, ఏ నాడు-- అడ్డు రాగలవో , -- ఆ నాడే నన్ను నేను అగ్నికి అర్పించుకొందును, కాని తపమును వీడజాలను !

అగస్త్యుడు --- శరీరము , అగ్నికి ఆహుతి అయిన పిమ్మట , తపమెట్లు చేయగలవు ?

వేదవతి-- జన్మాంతరమందు----

అగస్త్యుడు --- ఆ జన్మాంతరమందు కూడ, నీ కోరిక సిద్ధించక పోయినచో ?—

వేదవతి--- కల్పాంతరము వరకు, వేచి యుండగలను !

అగస్త్యుడు --- సాధు, సాధు ! వేదవతీ ! నీవు సామాన్యురాలివి కాదు---కుశధ్వజా !

కుశధ్వజుడు-- ఆజ్ఞ, మహర్షీ !

అగస్త్యుడు --- సత్వరము హోమగుండము ప్రజ్వలింప జేయుము !

( కుశధ్వజుడు, ఋతుపర్ణుని వంక చూస్తాడు.

ఋతుపర్ణుడు—అలాగే మహర్షీ !

( అంటూ , ఆ కుటీరంలో ఒక మూలగా ఉన్న హోమగుండంలో, సమిధలు వేసి, అగ్ని రాజేస్తాడు )

అగస్త్యుడు --- కుశధ్వజా ! వేదవతి వంటి బాలికను, పెంచిన మమకారము నుండి, విడివడి ధారాదత్తము చేయడం చాల కష్టము----

కుశధ్వజుడు --- ( దుఃఖంతో ) మహర్షీ ! ఏమిటి మీరంటిన్నది ! వేదవతిని ధారాదత్తం చేయాలా ? ఎవరికి ?—

అగస్త్యుడు --- అగ్నికి !—

కుశధ్వజుడు---అగ్నికా!! -- అంటే వధువుగానా ?—

అగస్త్యుడు --- ( నవ్వి ) కాదు కుశధ్వజా ! ఆమెను , అగ్నిపుత్రికను చెయ్యి ! అలా చేస్తే, ఆమె ఆశయ సాధనకు, సహాయం చేసిన వాడవు అవుతావు.

కుశధ్వజుడు--- ( దీనంగా ) మహర్షీ ! -- మీరు ఆమెకు నచ్చజెప్పి, సంసారిక జీవితం వైపు మరలిస్తారనుకొన్నాను !

ఋతుపర్ణుడు--- ( దుఃఖంతో ) అగస్త్యమహర్షీ ! వేదవతికి ఇష్థం లేనప్పుడు, నేనామె కరస్పర్శ కూడ చెయ్యను ! అసలామె నిల్చొన్న చోట, కూర్చొనే సాహసం కూడ చెయ్యను ! కాని--- ఆమెను, ఈ ఆశ్రమానికి దూరం చెయ్యకండి !

అగస్త్యుడు --- కుశధ్వజా ! నీవు ఋషివి, సామాన్యుని వలె, అలా బేలగా ప్రవర్తింపకుము ! ఋతుపర్ణా ! నీవు వేదవతి మాటలు విన్నావు కదా, ఆమె ఏమన్నది ! --తన రూపము, యవ్వనము, సుందర సుకుమార శరీరము, ఏనాడు తన తపస్సుకి అడ్డు వస్తాయో, ఆ నాడే వాటిని త్యజిస్తానంది ! -- ఏమంటావు వేదవతీ ! నీ నిశ్చయం అదే కదా ?

( వేదవతి అగస్త్యునికి మోకాళ్ల మీద వంగి నమస్కరిస్తుంది )

వేదవతి--- మహర్షీ ! మీ దీవనతో , మీ అండ దండలతో, నా జీవితం సార్థకమయింది ! నా మనో నిశ్చయానికి ఊఁపిరి పోసి లక్ష్య సాధనకు మార్గం చూపెట్టారు ! -- నా వారితో-- భవ బంధాలు త్రెంచుకొనే, మార్గం నుండి, నన్ను మరలించకండి !

అగస్త్యుడు---- ( వారిద్రరి వంక చూస్తూ-- )—విన్నారు కదా ! ఈ అమ్మాయి మాటలు ! కారణ జన్మురాలైన, యీమె నిర్ణయానికి తిరుగు లేదు . మీ నిర్ణయం ఏమిటో తెలియజేయండి !

( కుశధ్వజుడు, ఋతుపర్ణుడు ఒకరి ముఖాలొకరు చూసుకొంటారు. తరువాత మౌనంగా, రాజుతున్న దగ్గరకి వెళ్లి, దానికి ఇరుప్రక్కలా నిలబడతారు. దుఃఖాన్ని అదుపులోనికి తెచ్చుకొంటూ, కళ్లు తుడుచు కొంటారు )

కుశధ్వజుడు—మహర్షీ ! మీ ఆజ్ఞ ప్రకారం నేను దత్త హోమానికి సిద్ధంగా ఉన్నాను.

( అగస్త్యుడు, వేదవతిని హోమగుండం దగ్గరకి తీసుకు వస్తాడు. ఆమెకి ఎదురుగా తాను నిలబడుతాడు. ఆ తరువాత అతను అగ్ని గుండానికి నమస్కరించి )

అగస్త్యుడు----వైశ్వానరా ! నేను నీ అంశతో, సూర్యుని తేజస్సుతో, జలకుంభమున పుట్టిన అగస్త్యుడను ! పరమేశ్వరునకు అత్యంత ప్రీతి పాత్రుడను ! నా కోరిక మన్నించి, వేదవతి యను పేరు గల ఈ కన్యను నీ పుత్రికగా స్వీకరింపుము ! నీకు అంగీకార మగునో కాదో, సత్వరము తెలియ జేయుము !

( హోమగుండం నుండి, అగ్ని ప్రత్యక్ష్య మవుతాడు )

అగ్ని --- అగస్త్య మహర్షీ ! మీ ఇచ్చకు విరుద్ధముగా నే నెట్లు ప్రవర్తంచగలను ? ఈ నాటినుంచి ఈ వేదవతి, నాకు పుత్రిక ! ఈమెను రక్షించు భారము నేను వహింపగలను !

( అగస్త్య మహర్షి వేదవతి చేతిని అగ్ని చేతిలో పెడతాడు. )

అగస్త్యుడు---- వేదవతీ ! నేటినుండి, అగ్ని నీ జనకుడు ! నీ ఆశయ సాడనకు జనకుని ఆజ్ఞ గైకొనుము !

వేదవతి--- ( అగ్ని నమస్కరించి ) తండ్రీ ! శ్రీమన్నారాయణుని పతిగా, పొందు తలంపుతో, తపము నాచరించుటకు నిశ్చయించినాను ! మీ అనుజ్ఞ నిండు !

అగ్ని -- పుత్రీ ! నీ సంకల్ప బలము, అగస్త్యమహర్షి ఆశీర్వాదము, నిన్ను గమ్యమునకు తప్పక చేర్చ గలవు ! నా రక్షణ నీకు నీ సంకల్ప మాత్రమున లభించ గలదు ! హిమవత్పర్వతము నందు తొల్లి పార్వతి తపస్సు చేసిన స్థలమే నీ తపో స్థలము ! నేను నిన్ను అక్కడకు చేరెదను, నాతో రమ్ము !

( అని ఆమె చెయ్యి పట్టుకొని, హోమగుండంలోకి దూకుతాడు ! ఇద్దరూ అదృశ్యమవుతారు )

( అగస్త్యుడు తృప్తితోను, కుశధ్వజ, ఋతుపర్ణులు ఆశ్చర్యంతోను చూస్తారు )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--76[మార్చు]

( దృశ్యము 76 )

( హిమాలయాలలో తపోభూమి )

( వేదవతి నిశ్చలంగా కూర్చొని, తపస్సు చేస్తూ ఉంటుంది.)

( ప్రవేశం రావణాసురుడు. వచ్చి వేదవతిని చూస్తాడు )

రావణ -- ( తనలో ) ఆహా ! ఏమి ఈ అద్వితీయ సౌందర్యము ! మునికన్య పరిధానములోనే, సొగసుగత్తెగా ఉన్న ఈమెకు, పట్టు పీతాంబరములు కట్టి, స్వర్ణ భూషణములు అలంకరించిన ఎంత మనోహరముగా నుండునో గదా ! నా మనోహారిణి యైన , యీమెను చేపట్టని జన్మమేల ! ప్రయత్నించెదను గాక !!

 రావణ -- ( ఆమె  దగ్గరగా  వెళ్లి,  పిలుస్తాడు )  సుందరీ !

( వేదవతి మాట్లాడదు )

రావణ --- సుందరీ ! నేను పులస్త్య బ్రహ్మ పుత్రుడనైన రావణుడను ! లంకేశ్వరుడను ! నీ ధ్యానము రవంత నిలిపి, నా మాటలను ఆలకింపుము !

( వేదవతి మాట్లాడదు )

రావణ --- సుందరీ ! నీవు నాకు సమాధాన మివ్వని, పక్షమున, నీ తపో భూమితో పాటు, నిన్ను పెళ్లగించి, నా లంకకు తీసుకొని పోగలను ! నా ప్రతాపము తెలిసిన దానివైతే, ----

( వేదవతి కళ్లు విప్పి చూస్తుంది )

వేదవతి --- రావణాసురా ! ఉగ్ర తపస్వి వయిన నీవు, నా తపమునకు ఆటంకమేల కలిగింతువు ?

రావణ -- తపము పేరిట నిన్ను గౌరవించి విడిచి పెట్థిన, నా మనోతాపము ఎట్లు తీరగలదు ? వికసించిన పుష్పములను వెదకు భృంగము పగిది, నీ వద్దకు వచ్చాను. ఇక మధువును ఆస్వాదించుటయే తడవు !

వేదవతి--- రావణా ! పొగరు తలకెక్కి, ఇటుల పలుకుచున్నావు---

రావణ --- పొగరు కాదు, నీ రూపజనిత-- నయనోన్మాదము , కైపెక్కి, పలుకుచున్నాను ! సుందరియగు కన్య వీర పురుషుని సొత్తు అని మరువకుము !

వేదవతి--- రావణా ! సుందరియగు కన్య వీర పురుషుని సొత్తు కావచ్చును ! కాని, నీవు మాత్రము వీర పురుషుడవు కావు !

రావణ --- ఏమి ? ఏమంటివి సుందరీ ! నన్ను మించిన వీరుడీ ముజ్జగములలో లేడను మాట తెలియని దానవా నీవు ?

వేదవతి-- నీ వనునట్లు, నాది లోకోత్తర సౌందర్యమే యగునెడల, నేను నిన్ను మించిన వీరపురుషుని సొత్తు కాగలను ! కాని నీ దానను కాజాలను !

రావణ --- సుందరీ ! నీ మాటలు నా బలమును , శౌర్యమును ,వేలెత్తి చూపుచున్నవి ! నన్ను మించిన వీరపురుషుడెవరో, చెప్పుము ! వాని పీచమడఫించి వచ్చి, నిన్ను చేపట్థెదను !

వేదవతి-- రావణా ! నేను—నా మనమును, నారాయణునికి అర్పించి, అతనిని పతిగా పొందగోరి, తపము చేయుచున్నాను ! అన్యాక్రాంత మనస్వినిని, తపస్వినిని అయిన నన్ను ఆశింపక, నా తపమునకు ఆటంకము కలిగించక, మరలి పొమ్ము !

రావణ -- ఏమి ! నీ మనసు నారాయణా క్రాంతమా? ( నవ్వి ) హురే ! బాగున్నది, బహు బాగున్నది !! అతడు నా శతృవర్గము లోని వాడు ! నా మనోహారిణిని అతనికి అర్పించుటకు నే నొల్లను ! --కనుక నీవు నా కాంతవు కాక తప్పదు !

( రావణుడు వేదవతి చెయ్యి పట్టుకోబోతాడు. వేదవతి తప్పించుకొని పరుగెడుతుంది. రావణుడు వెంబడిస్తాడు )

( వేదవతి నిస్సహాయురాలై, ఒక మూలకి చేరి, చేతులు జోడించి, అగ్నిని ప్రార్థిస్తుంది. ఆమెకెదురుగా అగ్ని గుండం వస్తుంది )

వేదవతి--- ఓరీ, కామాంధుడా !! వనితల బలాత్కారమే నీ వంశాంతమునకు మూల కారణ మగు గాక !

( అని శపించి, అగ్ని గుండం లోకి, దూకేస్తుంది. రావణుడు హతాశుడై వెళ్లిపోతాడు )

,==బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--77==

( దృశ్యము 77 )

( అగ్ని లోకం )

( వేదవతి తపస్సులో ఉంటుంది. ప్రవేశం, అగ్ని దేవుడు )

అగ్ని --- అమ్మా, వేదవతీ ! నీవు నిరంతరం స్మరించే శ్రీహరి సేవ చేసే భాగ్యం లభ్యమయింది !

( వేదవతి కళ్లు తెరచి చూస్తుంది. ఆమె కళ్లల్లో కాంతులు చోటు చేసుకొంటాయి )

వేదవతి--- నిజంగానా, తండ్రీ ?

అగ్ని ---అవును, ముందు  నిస్వార్థ భావంతో  నీ సేవలందించి,  నీ  జీవితాశయాన్ని తరువాత తెలియజేసి, అర్థించడం  మంచిదని  నా అభిప్రాయం, నీవేమంటావు ? 

వేదవతి--- హరిసేవా భాగ్యాన్ని మించిన తపస్సేముంది తండ్రీ ! ఇంతకీ నేను చేయాల్సిన సేవ ఏమిటి ?

అగ్ని ---- శ్రీమహావిష్ణవు యీ త్రేతాయుగమున, శ్రీరామచంద్రునిగా అవతరించుట , నీకు తెలిసినదే కదా ?

వేదవతి--- అవును, అతను తన అవతార లీలా విశేషం వల్ల, పంచవటిలో వాసం చేస్తున్నారనీ, అక్కడే ‘ ఖర-దూషణాదులను’ సంహరించారనీ, రావణుని సోదరి, శూర్పణఖ , అతనిని కామించి, లక్ష్మణుని చేత పరాభవం చెందిందనీ విన్నాను.

అగ్ని ---- వేదవతీ ! శూర్పణఖ తన పగ తీర్చుకొనేందుకు, పన్నాగం పన్ని, శ్రీరామచంద్ర పత్ని అయిన సీతా మహాలక్ష్మి సొగసును తన అన్న రావణుని కడ, వర్ణించి చెప్పినది.

వేదవతి--- అయ్యయ్యో ! ఆ రావణాసురుడు ఉత్త కామాంధుడే !! సీతా మహాలక్ష్మికి అపచారము చేయునేమో ?

అగ్ని --- అవును వేదవతీ ! ఆ కామాంధుడు, ఆ సీతాదేవిని మాయతో అపహరించి, తన పుష్పక విమానములో ఎక్కించి, లంకకు తీసుకొని పోవుచున్నాడు.

వేదవతి--- ( ఆందోళనతో ) తండ్రీ ! ఆ సాధ్వీమణిని ఎలా రక్షించాలి ?

అగ్ని --- అది నీ వల్లనే సాధ్యమవుతుంది ! నీకు, సీతామహాలక్ష్మికి రూప సామ్యమున్నది గనుక, ఆ సీత స్థానమున, నీవు లంకకు పోయినట్లయిన, ఆమెను రక్షింప గలవు !

వేదవతి--- తండ్రీ ! సీతామహాలక్ష్మిని కాపాడేందుకు, నేను, ఏ త్యాగమైనను, చేయుటకు సిద్ధముగా నున్నాను ! కాని అదెట్లు నెరవేరును ?

అగ్ని -- చాల సంతోషం వేదవతీ ! నేను నిన్ను తీసుకెళ్లి, రావణాసురుని దారిలో సంధించి, నీవే శ్రీరామ పత్నివని, అతను తీసుకొని వెళ్తున్న వనిత, మాయా సీత అని చెప్తాను ! శ్రీరామచంద్రుడు అసలు సీతవైన నిన్ను, నా దగ్గర దాచాడని చెప్పి, నిన్ను అప్పగించి, ఆమెను నాతో తీసుకు పోతాను ! రమ్ము, సత్వరముగా బయలుదేరుము.

( వేదవతి బయలుదేరుతుంది )

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన --78[మార్చు]

( దృశ్యము 78 )

( సూత పౌరాణికుడు, శౌనకాది మునులు ఉంటారు )

సూతుడు -- మునులారా ! వేదవతి కథను విన్నారు కదా ! శ్రీహరిని పతిగా పొందుటకు, ఆమె చేసిన తపస్సు, శ్రీమహాలక్ష్మికి ఆమె చేసిన సేవల ఫలితముగా, ఆమె పద్మావతిగా జన్మించి, ఆకాశరాజుకి పుత్రిక అయినది.

శౌనక--- సూతమహర్షీ ! చోళ రాజపుత్రిక అయిన పద్మావతి, వేంకటాచల రమణుడైన శ్రీనివాసుని, ఏ విధముగా కలిసి, కళ్యాణము చేసుకొనినది, మాకు విన కుతూహల మగుచున్నది !

1 ఋషి -- మహర్షీ ! లోకోత్తరమైన ఆ కళ్యాణ గాథను, మీ నోట వినుటకు మనము ఉవ్విళ్లూరుచున్నది !

2 ఋషి -- పద్మావతీ , శ్రీనివాసుల కళ్యాణము కడు రమణీయమని విన్నాము !

3 ఋషి -- కథా కథన సామర్థ్యమున సాటిలేని మేటి అయిన, మీ నోట ఆ వృత్తాంతము వినుట ----

4 ఋషి -- కడుంగడు కమనీయమగునని మా తలపు !

సూతుడు--- మునులారా ! మీరన్నది నిజమే ! కమనీయమే కాదు, కామితార్థము కూడ నిచ్చునట్థి, ఆ కళ్యాణమునకు, నాంది పలుకుటకై, కలహభోజనుడైన నారదుడు కూడ, కుతూహలముతో, వృద్ధ బ్రాహ్మణ వేషమున, పద్మావతి మనమున రాగబీజము నాటుటకై, చోళరాజ్యమునకు వెడలినాడు.

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--79[మార్చు]

( దృశ్యము 79 )

( ఆకాశరాజు కోటలో ఉపవనము )

( పద్మావతి ఒక పూలచెట్టు నీడ, గట్టుపైన కూర్చొని ఉంటుంది )

( ప్రవేశం నారదుడు. వృద్ధ బ్రాహ్మణ వేషంతో )

నారద ---- అమ్మా, పద్మావతీ ! ( అని పిలుస్తాడు )

( పద్మావతి అకస్మాత్తుగా వచ్చిన ఆ ముసలి బ్రాహ్మణుని చూచి, భయపడుతుంది )

నారద -- భయపడకమ్మా, పద్మావతీ ! నేను వృద్ధ బ్రాహ్మణున్ని ! నీవా రాకుమారివి ! నీకు, నేనేం అపకారం చేయగలను ?

ఫద్మావతి--- ( తేరుకొని ) భూసురోత్తమా ! మీరెవరు ? నాతో ఏమి పని ?

నారద --- నీకు జ్యోతిషం చెప్పడానికి వచ్చాను. ఏదీ,-- నీ చెయ్యి ఒకసారి , చూపించు !

పద్మావతి--- జ్యోతిషమా ! నాకా --- ఎందుకు ?

నారద--- ఎందుకేమిటి తల్లీ ! నీ ముఖ కవళికలు చూస్తే, భయము ఇంకా తగ్గినట్లు లేదు ! విను నీవు ఆకాశరాజు పుత్రికవు , పద్మావతివి, అవునా ?

పద్మావతి--- అవును.

నారద -- నీ కొక తమ్ముడున్నాడు, పేరు -- వసుధానుడు, అవునా ?

పద్మావతి--- ఇవన్నీ అందరికీ తెలిసినవే ! ( అని కిలా కిలా నవ్వుతుంది )

నారద--- అమ్మయ్య ! ఎంత సేపటికి నవ్వావమ్మా ! వెన్నెల వెదజల్లినట్లుంది !

( పద్మావతి సిగ్గు పడుతుంది )

నారద -- ఏమ్మా ! నేను అడిగింది, నువ్వు ఇవ్వనే లేదు ?

పద్మావతి--- ఏమడిగారు మీరు ?

నారద -- నీ చెయ్యి ఒకసారి చూపించ మన్నాను.

పద్మావతి -- నా చెయ్యి చూసి, ఏం చెప్తారు ?

నారద -- అన్నీ చెప్తాను. నువ్వెవరివో చెప్తాను ! నీకు రాబోయే వరుడు ఎలాంటివాడో చెప్తాను ! చూడు--- నీ చెలికత్తెలు కూడ దగ్గరగా లేరు, చప్పున చూసి, చెప్పవలసినవి చెప్పి, చల్లగా జారుకొంటాను.

( పద్మావతి తన చెయ్యి చూపిస్తుంది. నారదుడు ఆమె చెయ్యివంక పరీక్షగా చూస్తాడు )

నారద -- తల్లీ ! ఏమి హస్తమమ్మా నీది ! భర్తృ కారకుడైన శుక్రుడు, మీనరాశిలో పరమోచ్ఛలో ఉన్నాడు ! కంకణ ప్రాప్త సమయమయింది ! పురుషోత్తముడైన వరుడు, నిన్ను వెతుకుకొంటూ వస్తాడు ! దేవతలే నీ పెళ్లికి పెద్దలవుతారు !

పద్మావతి--- నిజమా ? !

నారద -- అవును (పద్యము )

ఆ.వె-- పూర్వ పుణ్యమునను, పురుషోత్తముని చేయి బాల రుక్మిణమ్మ బట్టినట్లు, హరియె పాణి బట్టు, నాశ్చర్య పడబోకు, కమలనేత్రి, నిన్ను గాంచి వచ్చు, అమరులెల్ల వచ్చి, ఆశీర్వదింపుచున్ పెండ్లి చేతురమ్మ, భామ వినుము !,

పద్మావతి -- మరి నా గురించి చెప్తానన్నారు !

నారద -- నీ గురించా తల్లీ ! చెప్పేందుకు చాలా ఉంది ! విను ---

( ఇంతలో చెలికత్తెలు అటువైపు వస్తూ ఉంటారు. నారదుడు అది చూసి-- )

నారద -- వస్తానమ్మా ! వచ్చిన పని అయిపోయింది ! ( అంటూ వెళ్లిపోతాడు )

1 చెలి- రాకుమారీ ! ఎవరతను ?

పద్మావతి – ఎవరో, పాపం ! వృద్ధ బ్రాహ్మణుడు !

2 చెలి -- మీ చెయ్యి చూసి, ఏం చెప్తాడమ్మా ?

( పద్మావతి మాట్లాడదు )

3 చెలి -- మీ పెల్లి గురించి ఏమైనా చెప్పారా ?

( పద్మావతి అవునన్నట్లు తల ఊఁపుతుంది )

1 చెలి -- ఏయ్ ! పదవే ! అతన్నే వెతికి పట్టుకొందాం . రాకుమారి ఎలాగూ చెప్పదు !

2 చెలి -- అవునే ! పద, కాస్త పరుగెడితే, చాలు,-- పాపం ముసలాడు, ఎలాగూ వేగంగా వెళ్లలేడు !

3 చెలి -- పదండే !

(చెలులు నారదుడు వెళ్లిన వైపు పరుగెడుతారు. నారదుడు ఇటు, ఆటు తిరిగి, వారిని ఆట పట్టిస్తాడు. చివరికి అంతర్థానమవుతాడు )

( చెలికత్తెలు అతనిని వెతికి అలిసిపోతారు. పద్మావతి దగ్గరకు వస్తారు )

౧ చెలి- అబ్బ ! ముసలి బాపడు ఎంత వేగం పరుగెత్తాడే ?

పద్మావతి--- ఆ భూసురుని ముసలి, ముతక అనకండే !

౨ చెలి --- ఏమమ్మా ! మాకన్న ఆ భూసురుడే , ఎక్కువయ్యాడా నీకు ? ఇంతకూ ఏం చెప్పాడేంటి జోస్యం ?

పద్మావతి-- పోవే ! నేను మీతో చెప్పను.

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన --80[మార్చు]

( దృశ్యము 80 )

( చోళరాజు అంతఃపురం. ధరణీ దేవి, ఆకాశరాజు ఉంటారు )

ధరణి --- మహారాజా ! ఈ వార్త విన్నారా ? ఈ రోజు మన పద్మావతికి--- - ఆకాశ ---- ఏమయంది, పద్మావతికి ?

ధరణి -- ఆబ్బ ! ఎంత ఆత్రుత ? మీ కూతురుకేమీ కాలేదు లెండీ ! చెప్పేది వినండి, ఈ రోజు మన ఉద్యానవనానికి, ఒక వ్రుధ్ధ బ్రాహ్మణుడు వచ్చి, అమ్మాయి చెయ్యి చూసి, ---

ఆకాశ్ -- అదా సంగతి ! ఏం చెప్పాడేమిటి ఆ భూసురుడు ?

ధరణి -- మన పద్మావతికి పురషోత్తముడైన వరుడు, తనంత తానే, వెతుకుకుంటూ వస్తాడట ! ఆమె పెళ్లికి దేవతలే పెద్దలవుతారట !

ఆకాశ --- ఆహా ! ఎంత చల్లని వార్త చెప్పావు ! మొన్న ఉగాదికి రోజున, మన రాజ సభకి వచ్చిన దైవజ్ఝ్ఝులు కూడ ఇవే మాటలు చెప్పారు. చూడబోతే పద్మావతికి, కళ్యాణ యోగం పట్టినట్లే ఉౙది !

ధరణి --- ఆమె పెళ్లి ఎంతో, వైభవంగా చెయ్యాలండీ ! ఆఆ పెళ్లికి శుక మహర్షుల వారిని, తప్పక పిలవాలి !

ఆకాశ --- అవును దేవీ ! అతనిని తొలి పిలుపు పిలిచేందుకు, మన తొండమానుని, పిలువ నంపుదాం.

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన --81[మార్చు]