బసవరాజు అప్పారావు గీతములు/శారదాభంగము

వికీసోర్స్ నుండి

వృధాన్వేషణము

       విశ్వమం దెంతగాలించి వెదకిచూచి
       నా త్వదీయమయమ్మూ కానట్టిచోటు
       కానిపించుటలేదు నా కన్నులకును
       వెఱ్ఱినై లేనిదానికే వెదకినానొ ?

       ఊహపై యూహ లల లట్టు లుబ్బియెగసి
       ఊతలూగించు నా లోలహృదయనౌక
       చెలియరో! తీరమన్నది చేరగలదొ?
       మునిగిపోవునొ ప్రలయంపు ముంపులోన!

శారదాభంగము

       అమ్మరో! శారదా! యిటు లాతురమ్ము
       తోడ బరువెత్తె దే కీడు మూడెనమ్మ?
       నెమలివాహన మేమాయె, నెమ్మొగమ్ము
       వాడి, కళదక్కి, శుష్కించి వ్రాలెనేమి?

       విద్యలకు పుట్టినిల్లువై విమలకీర్తి
       వెల్గుదేవివి నీ విట్లు వెఱ్ఱివోలె

       నెమ్మొగమ్మెల్ల వెండ్రుకల్ గ్రమ్ముకొనగ
       నటునిటులు పరువెత్తెద వక్కటకట!

       కనుల కాటుక చెఱగెను, కళల దేఱు
       నెమ్మొగమ్మెల్ల నల్లనై నింద్యమయ్యె;
       వదనము లలాటశూన్యమై పాడువడియె
       నింత యేహ్యపు రూపము నెపుడు గనమె!

       దివ్యముగ వీణ మీటుచు, తేజరిల్లు
       మోమునందుండి త్రిభువన మోహనమగు
       విమలగానము వెడలి లోకములనెల్ల
       ప్రణయరసవార్ధి ముంపగ పరమసంత
       సమున ఋషులెల్ల నాట్యముల్ సల్పుచుండ
       పంచవన్నియల నెమలి పైన నెక్కి
       మానస సరోవరంపు విమానవీథి
       స్వైర సంచార మొనరింప కూర కిట్లు
       పేదవడినట్టి మోముతో పెంపుదక్కి
       వెఱ్ఱివలె పర్వులెత్తద వేల నమ్మ?
       ఎప్పటట్టులు వెల్లగా నిన్నుజూచి
       కన్నులు గలందుకు ఫలంబు గాంచగలనె?