ప్రబోధ తరంగాలు/605-655

వికీసోర్స్ నుండి

605. ఇష్టమును ప్రేమ అని చాలామంది అనుకుంటారు. కానీ ప్రేమ వేరు, ఇష్టమువేరు.

606. కామమును మోహమును రెండింటిని ఒకటే అనుకుంటారు. కానీ కామము వేరు, మోహము వేరు.

607. ఒక దేవున్ని పొగడడము భక్తి, జ్ఞానము అనుకుంటారు. కానీ అది భక్తి కావచ్చును, కానీ జ్ఞానము ఏమాత్రము కాదు.

608. ఏదో ఒక దేవతనుగూర్చిగానీ దేవున్నిగూర్చిగానీ పాడడము కీర్తన అవుతుంది. కీర్తనవేరు, ధ్యానము వేరు.

609. ఒకరిని కీర్తించడము బయటి ప్రజలకు తెలుస్తుంది. ధ్యానించడము లోపలి ఆత్మకు మాత్రమే తెలుస్తుంది.

610. నీచము, ఉన్నతము వానివాని బుద్ధిని బట్టియుండును. పందికి బచ్చలిగుంత ఉన్నతము, అది మనిషికి నీచము.

611. ఒకని బుద్ధికి దైవజ్ఞానము ఉన్నతముగ కనిపిస్తే, ఇంకొకని బుద్ధికి దైవజ్ఞానము నీచముగ, ప్రపంచ జ్ఞానము ఉన్నతముగ తోచును.

612. లోపల బుద్ధి మారినపుడు బయట నీచము ఉచ్ఛముగా మారగలదు. అపుడే మనిషికి అంతవరకు నీచముగ కనిపించిన జ్ఞానము ఉన్నతముగ తోచును.

613. నీవు చెప్పే జ్ఞానము ఇంకొకనికి నీచముగ కనిపిస్తుందంటే, అది వాని బుద్ధిలోపమే అని గ్రహించాలి.

614. అన్నముతో ఆకలి తీరుతుంది. జ్ఞానముతో కర్మతీరుతుంది. 615. ఆకలి కడుపులో బాధ కలిగిస్తుంది. కర్మ తలలో బాధ కలిగిస్తుంది.

616. ధనికుడు వస్తుదానము చేయుట, జ్ఞాని జ్ఞానదానము చేయుట మంచిది.

617. ధనికుడు జ్ఞానదానము చేయుట, జ్ఞాని వస్తుదానము చేయుట ధర్మవిరుద్ధము.

618. శాస్త్రమును పురాణమనడము, పురాణమును శాస్త్రమనడము ఏనుగును ఎలుకయనీ, ఎలుకను ఏనుగుయనీ అన్నట్లుండును.

619. నీకు సరిపోనంత మాత్రమున మంచి చెడుకాదు. అలాగే నీకు నచ్చినంతమాత్రమున చెడు మంచికాదు.

620. కర్మ అంటే అజ్ఞానులకు అర్థముకాదు. కర్మలేనిది ఎవనికి క్షణము కూడ గడవదు.

621. క్షణము గడచినదంటే కర్మలో తృణము తీరి పోయినట్లేనని తెలుసుకో.

622. నీకు వచ్చునవన్ని కర్మనుబట్టి వచ్చును. నీకున్నవి అన్ని కర్మను బట్టి ఉన్నవి. నీకు పోయినవన్ని కర్మనుబట్టి పోయినవి.

623. నాది అనుకొను నీ కులము ఏదో నిజముగ నీకు తెలుసునా? మధ్యలో ఏమైనా మారిందేమో!

624. నాది అనుకొను నీ మతమేదో నీకు నిజముగ తెలుసునా? మధ్యలో ఏమైనా మారిందేమో! 625. నీకు తెలియకుండానే ఎప్పటికి మారని మతములో, ఎప్పటికి మారని కులములో నీవున్నావు.

626. నీవు ఎప్పటికి మారని జీవకులములో ఉన్నావు. అలాగే ఎప్పటికి మారని దైవమతములో ఉన్నావు.

627. నీ గోత్రము ఎప్పటికి ప్రకృతియే. నీ ఇంటిపేరు ఎప్పటికి కర్మయే.

628. ఇంటి పేరులేనివాడు నిజమైన నీతండ్రి పరమాత్మయే.

629. ఇంటి పేరున్న తండ్రి నీ ఒంటికి సంబంధించినవాడేనని తెలుసుకో.

630. హద్దులేని మనస్సు పద్దులేని కర్మవలన పరుగెడుచున్నది.

631. దంచుతున్న దంతముల మధ్యలో భయములేని నాలుక ఏ విధముగ మసలుచున్నదో, అదే విధముగ కష్టపెట్టు కర్మల మధ్యలో నిర్భయముగ జీవుడుండవలెను.

632. తాను జీవుడైయుండి తన శరీరములోని తన అడ్రస్‌ ఏ జీవునికి తెలియకుండ పోయినది.

633. శరీరమను ఊరిలో తన ఇల్లుగాని, తన పొరుగువానిని గాని తెలియకుండ బ్రతుకుచున్నవాడు జీవుడు.

634. ప్రపంచ జ్ఞానములో రాజుకు పేదకు ఎంత తేడా కలదో, పరమాత్మ జ్ఞానములో బ్రహ్మర్షికి బేవర్షికి అంత తేడాగలదు.

635. ఎంతటి చెట్టుకైన గాలిపోటు తప్పదు. ఎంతటివానికైన కర్మపాటు తప్పదు. 636. ఎంత జ్ఞానికైనా మనో చలన బాధతప్పనట్లు ఎంతటి దేవతకైనా కష్టాలూ బాధలు తప్పవు.

637. మనుషులలో ధనికులు బీదవారున్నట్లు దేవతలలో కూడ ధనికులు బీదవారు కలరు.

638. మనుషులందరికి ఒకే దేవుడు ఎవడైతే ఉన్నాడో, దేవతలకందరికి కూడ అతనే దేవుడు.

639. ఎవడైన కష్టాలనుండి సుఖములలోనికి వచ్చినా లేక సుఖాలనుండి కష్టాలలోనికి పోయినా అది వాని బుద్ధిని బట్టి కాదు, వాని కర్మనుబట్టియని తెలియవలెను.

640. నీరు భూమిలోపల, భూమి విూద ఉంటుంది. అలాగే పరమాత్మ శరీరములోపల, శరీరము బయటకలడు.

641. పండులోని రసము పండులోపల అంతటా ఉంటుంది, కానీ పండు బయట ఉండదు. అలాగే ఆత్మ శరీరములోపలనే ఉంటుంది, కానీ శరీరముబయట ఉండదు.

642. చెవిటి, మూగ, కుంటి, గ్రుడ్డివాడైన బిక్షగాడు దేవాలయ ఆవరణములో ఒక్కచోట మాత్రము ఉంటాడు, కానీ దేవాలయమంతా తిరగడు. అలాగే ఏ చూపులేని జీవుడు శరీర ఆవరణములో ఒక్కచోట మాత్రమే ఉంటాడు.

643. పక్షి ఆకాశములో పైకి ఎగిరినట్లు ఉన్నతస్థితిని యోగము ద్వారా ఆత్మ జీవునికి అందివ్వాలనుకొంటుంది.

644. పాము భూమి రంధ్రములలోనికి దూరినట్లు మాయ కార్యముల ద్వారా జీవున్ని నీచస్థితిలోనికి చేర్చాలనుకొంటుంది. 645. ఊహ ఆత్మ ద్వారా పుట్టితే, ఆలోచన మనస్సు ద్వారా పుట్టుతుంది.

646. ఊహాత్మకమైనది సిద్ధాంతము, అనగా ఒక సిద్ధాంతమును మొదట ఆత్మే అందిస్తుంది.

647. సిద్ధాంతము ఆత్మద్వారా పుట్టితే, రాద్ధాంతము మనస్సు ద్వారా పుట్టుచున్నది.

648. ఊహకానీ, ఆలోచనగానీ లోపలనుండి వచ్చునవే. అందువలన ఏది ఊహనో, ఏది ఆలోచనో తొందరగ గుర్తించలేరు.

649. చాలామంది ఊహను ఆలోచనగా, ఆలోచనను ఊహగా లెక్కించుచుందురు.

650. అహము ఎక్కడినుండి మొదలుపెట్టి పని చేయుచున్నదో ఎవరికి తెలియదు. అందువలన అహమును నల్లని కాకిగ లెక్కించవచ్చును.

651. ఎవడు ఎరుకలో ఉండి నిద్రలోనికి పోలేడు. అలా పోగలిగితే వాడే బ్రహ్మయోగి అగును.

652. కాలికి ఎంత గాయమైనదన్నది ముఖ్యము కాదు. గాయము ఎంత బాధిస్తున్నదీ, జీవుడు ఎంత అనుభవిస్తున్నాడు అన్నదీ ముఖ్యము. అదియే కర్మానుభవము!

653. యోగాసనములు ఎన్ని ఉన్నా అవి శరీర వ్యాయామమునకు సంబంధించినవే, కానీ యోగమునకు సంబంధించినవి కావు.

654. యోగాసనములకు, యోగములకు ఏమాత్రము సంబంధములేదు.

655. యోగాసనములను నేర్చినవాడు యోగికాలేడు.