Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/ఇంద్రయాగ నివాఱణంబు

వికీసోర్స్ నుండి

తెభా-10.1-884-వ.
అని యిట్లు నొడివిన నందుని పలుకులు విని యింద్రునికిఁ గోపంబు దీపింప దనుజదమనుండు తండ్రి కిట్లనియె.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; నొడివిన = చెప్పిన; నందుని = నందుని యొక్క; పలుకులున్ = మాటలను; విని = విని; ఇంద్రుని = ఇంద్రుని; కిన్ = కి; కోపంబు = కోపము; దీపింపన్ = చెలరేగునట్లుగా; దనుజదమనుండు = కృష్ణుడు {దనుజ దమనుడు - దనుజ (రాక్షసులను) దమనుడు (శిక్షించువాడు), విష్ణువు}; తండ్రి = తండ్రి; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = చెప్పెను.
భావము:- ఇలా చెప్తున్న నందగోపుని మాటలు విని, దేవేంద్రుడుకి కోపం రేగేలా రాక్షసాంతకుడు తండ్రితో ఇలా అన్నాడు.

తెభా-10.1-885-క.
"కర్మమునఁ బుట్టు జంతువు
ర్మమునను వృద్ధి బొందుఁ ర్మమునఁ జెడుం
ర్మమె జనులకు దేవత
ర్మమె సుఖదుఃఖములకుఁ గారణ మధిపా!

టీక:- కర్మమునన్ = పాపపుణ్యకర్మలవలన; పుట్టున్ = పుట్టును; జంతువు = జీవి, ప్రాణి; కర్మముననున్ = కర్మముచేతనే; వృద్ధిబొందున్ = పెద్దదగును, వర్ధిల్లును; చెడున్ = నశించును; కర్మమె = కర్మమే; జనులు = ప్రజల; కున్ = కు; దేవత = దైవము; కర్మమె = కర్మమే; సుఖ = సుఖములు; దుఃఖముల = దుఃఖముల; కున్ = కు; కారణము = హేతువు; అధిపా = రాజా.
భావము:- “నంద మహారాజా! తాము చేసిన కర్మము చేతనే ప్రాణి పుడుతున్నది. కర్మము చేతనే వృద్ధి పొందుతున్నది. ఆ కర్మము చేతనే లయిస్తున్నది. కనుక, కర్మమే జనులకు దైవం. కర్మమే జీవులకు దుఃఖానికీ, సుఖానికీ హేతువు.

తెభా-10.1-886-క.
ర్మములకుఁ దగు ఫలములు
ర్ములకు నిడంగ రాజు గాని సదా ని
ష్కర్ముఁ డగు నీశ్వరుండును
ర్మవిహీనునికి రాజు గాఁడు మహాత్మా!

టీక:- కర్మముల్ = చేసిన కర్మముల; కున్ = కు; తగు = తగినట్టి; ఫలములున్ = ఫలితములను; కర్ముల్ = సామాన్య మానవుల {కర్ములు - కర్మములు చేయువాడు, మానవుడు}; కున్ = కు; ఇడంగన్ = ఇచ్చుటకు; రాజు = ప్రభువు; కాని = అగును కాని; సదా = ఎల్లప్పుడు; నిష్కర్ముడు = కర్మములు చేయనివాడు; అగున్ = అయినట్టి; ఈశ్వరుండునున్ = భగవంతుడుకూడ; కర్మవిహీనుని = నిష్కామకర్ముని {కర్మ విహీనుడు - కర్మముల (బంధము) లేని వాడు, నిష్కాముగా కర్మ చేసినను అది వానికి అంటదు అందుచేత వాడు కర్మవిహీనుడు (నిష్కామకర్ముడు)}; కిని = కి; రాజు = నియామకుడు, ప్రభువు; కాడు = కాలేడు; మహాత్మా = దివ్యజ్ఞానసంపన్నా.
భావము:- మహాత్మా! కర్మములు చేయడానికి తగిన ఫలాలు ఆయా కర్మములే, ఇస్తాయి. మధ్యలో ఈశ్వరుడి ప్రసక్తి ఎందుకు. ఈశ్వరుడు కూడా కర్మములు చేసే వానికి మాత్రమే ఫలితములను ఇస్తాడు. అంతేగాని, ఏ కర్మము చేయని వానికి ఎన్నటికీ ఫలితము ఈయడు కదా!

తెభా-10.1-887-వ.
కావునఁ గర్మానుయాతంబులైన భూతంబులకుఁ బురుహూతుని వలని భీతి యేటికిఁ? బురాతన జన్మసంస్కారంబులు కుప్పలుగొని కప్పినఁ గర్మంబులఁ దప్పించి పెంపు వడయ న ప్పరమేశ్వరుండును నేరం; డితరులం జెప్పనేల? సురాసురనరానీకంబులతోడి లోకంబు నిజసంస్కారవశంబై యంద డింది యున్నది; సందేహంబు లేదు; దేహి కర్మవశంబున గురుతను దేహంబులం జొచ్చి వెడలు; నొజ్జ, వేలుపు, నెచ్చలి, పగఱు, చుట్టంబులు కర్మంబులు, జీవుండు కర్మంబుతోడన వర్తించు; నతనికిఁ గర్మంబు దైవతంబు కర్మంబునం బ్రతుకుచు నితర సేవ జేయుట సతి పతిని విడిచి జారుం జేరిన చందంబగు; విప్రుండు వైదికకర్మంబున మెలంగు; నృపతి ధరణీ పాలనంబున సంచరించు; వైశ్యుండు వాణిజ్య కృషి కుసీద గోరక్షాదుల వర్తించు; శూద్రుం డగ్రజన్ముల సేవించి బ్రతుకు; రజ స్సత్వ తమోగుణంబు లుత్పత్తి స్థితి లయ కారణంబు లందు రజంబున జగంబు జన్మించు; రజోగుణప్రేరితంబులై మేఘంబులు వర్షించు; వర్షంబునం బ్రజావృద్ధి యగు; నింద్రుం డేమి చేయంగలవాఁ; డదియునుం గాక.
టీక:- కావునన్ = కనుక; కర్మ = కర్మములకు; అనుయాతంబులు = అనుసరించి వర్తించునవి; ఐన = అయినట్టి; భూతంబుల్ = ప్రాణుల {భూతములు - పంచభూత కలితములు, ప్రస్తుతము ఐ (పుట్టి) ఉన్నవి (అశాశ్వతమైనవి), జీవులు}; కున్ = కు; పురుహూతుని = ఇంద్రుని {పురుహూతుడు - యజ్ఞములందు ప్రచురమైన పిలుపు కలవాడు, పురువు అనెడి రక్కసుని చంపినవాడు, ఇంద్రుడు}; వలని = మూలమున; భీతి = భయము; ఏటికిన్ = ఎందుకు; పురాతన = ముందటి, పూర్వ; జన్మ = పుట్టుకలలోని; సంస్కారంబులు = సంచితకర్మములు; కుప్పలుగొని = రాసులుగా నేర్పడి; కప్పినన్ = కమ్ముకొన్నట్టి; కర్మంబులన్ = కర్మములను; తప్పించి = తొలగించి; పెంపు = వృద్ధి; పడయన్ = పొందించుటను; ఆ = ఆ యొక్క; పరమేశ్వరుండును = దేవుడుకూడ {పరమేశ్వరుడు - పరమ (ఉత్కృష్టమైన) ఈశ్వరుడు (సర్వ నియామకుడు), భగవంతుడు}; నేరండు = చేయలేడు; ఇతరులన్ = మిగతా వారి విషయము; చెప్పన్ = చెప్పుట; ఏల = ఎందుకు; సుర = దేవతలు; అసుర = రాక్షసుల; నర = మానవుల; అనీకంబుల్ = సమూహము లన్నిటి; తోన్ = తోటి; లోకంబు = ప్రపంచము; నిజ = తన యొక్క; సంస్కార = కర్మములకు; వశంబు = లోబడినది; ఐ = అయ్యి; అందన్ = దానిలోనే; డింది = మునిగి, అణగి; ఉన్నది = ఉన్నది; సందేహంబు = అనుమానించవలసినది; లేదు = లేదు; దేహి = జీవుడు {దేహి - దేహమున ఉండువాడు, జీవుడు}; కర్మ = కర్మమునకు; వశంబునన్ = అధీనముగా; గురు = స్థూల, పెద్ద; తను = సూక్ష్మ, చిన్న; దేహంబులన్ = శరీరము లందు; చొచ్చి = ప్రవేశించి, పుట్టి; వెడలున్ = బడటపడును, చచ్చును; ఒజ్జ = గురువు; వేలుపు = దేవుడు; నెచ్చలి = స్నేహితుడు; పగఱు = శత్రువు; చుట్టంబులు = బంధువులు; కర్మంబు = కర్మఫలములే; జీవుండు = ప్రాణి; కర్మంబు = కర్మము; తోడన్ = తోటి; వర్తించున్ = మెలగును; అతని = అతని; కిన్ = కి; కర్మంబు = కర్మమె; దైవతంబు = దేవుడు {దైవతము - ప్రకాశింప జేయువాడు, దేవుడు}; కర్మంబునన్ = కర్మమువలన; బ్రతుకుచున్ = జీవించుచు; ఇతర = ఇతరుల ఎడ; సేవ = భక్తి; చేయుట = చూపుట; సతి = భార్య; పతిన్ = భర్తను; విడిచి = వదలిపెట్టి; జారున్ = విటుని; చేరిన = చేరిన; చందంబు = విధముగ; అగున్ = ఉండును; విప్రుండు = బ్రాహ్మణుడు; వైదిక = వేదవిహితమైన; కర్మంబునన్ = కర్మల యందు; మెలంగు = వర్తించును; నృపతి = రాజు; ధరణి = రాజ్యమును; పాలనంబునన్ = పాలించుట యందు; సంచరించున్ = వర్తించును; వైశ్యుండు = కోమటి; వాణిజ్య = వ్యాపారము; కృషి = వ్యవసాయము; కుసీద = వడ్డీవ్యాపారము; గోరక్ష = పశుపాలన; ఆదులన్ = మొదలగువాని యందు; వర్తించున్ = జీవించును; శూద్రుండు = శూద్రుడు; అగ్ర = ఉత్తమ; జన్ములన్ = కులస్తులను; సేవించి = కొలిచి; బ్రతుకున్ = జీవించును; రజస్ = రజోగుణము; సత్త్వ = సత్వగుణము; తమోగుణంబులున్ = తమోగుణములు; ఉత్పత్తి = పుట్టుటకు; స్థితి = ఉండుటకును; లయ = నశించుటకు; కారణంబులు = హేతువులు; అందున్ = వానిలో; రజంబునన్ = రజోగుణమునందు; జగంబు = భువనములు; జన్మించు = పుట్టును; రజోగుణ = రజోగుణముచేత; ప్రేరితంబులు = ప్రేరేపింపబడినవి; ఐ = అయ్యి; మేఘంబులు = మేఘములు; వర్షించున్ = వానకురిపించును; వర్షంబునన్ = వర్షమువలన; ప్రజా = సంతానము, ప్రజలకు; వృద్ధి = పెరుగుట, వర్ధిల్లుట; అగున్ = జరుగును; ఇంద్రుండు = ఇంద్రుడు; ఏమి = ఏమి; చేయం గలవాడు = చేయుటకు సమర్థుడు; అదియునున్ = అంతే; కాక = కాకుండ.
భావము:- కాబట్టి, కర్మానుగుణంగా సుఖ దుఃఖాలు అనుభవించే ప్రాణులు ఇంద్రుని వలన భయపడవలసిన పనిలేదు. పూర్వజన్మ సంస్కారాలు కుప్పల వలె కప్పగా జీవులు కర్మలు ఆచరిస్తున్నారు. అట్టి కర్మఫలాలు తప్పించడం కడకు ఆ పరమేశ్వరుడికైనా శక్యం కాదు. ఇక ఇతరుల మాట చెప్పడం ఎందుకు. దేవతల తోనూ, రాక్షసుల తోనూ, మనుష్యుల తోనూ కూడిన ఈ జగమంతా తన స్వభావమునకు అధీనమై మెలుగుతూ ఉంది. ఇందులో అనుమానం లేదు. జీవుడు తన స్వభావానికి అనుగుణమైన కర్మము చేతనే కర్మానురూప మైన నానావిధ దేహాలను పొందుతూ విడుస్తూ ఉంటాడు. గురువు, దేవత, మిత్రుడు, శత్రువు, బంధువు, అంతా కర్మమే. జీవుడు స్వభావానురూపమైన కర్మమునే ఆచరిస్తాడు. అతని పాలిటికి కర్మమే దైవతం. కర్మనే అతడు దైవం వలె ఆరాధించాలి. కర్మంచేత జీవిస్తూ దానిని విడిచి మరియొక దానిని భజించడం అనేది; పతి వలన బ్రతుకుతూ, అతడిని సేవించకుండా విటుని సేవించే రంకుటాలి విధం అవుతుంది. బ్రాహ్మణుడు వైదికకర్మచేత బ్రతుకుతాడు. క్షత్రియుడు పుడమిని పాలిస్తాడు. వైశ్యుడు కృషి, గోరక్షణ, వాణిజ్యం, సొమ్ము వడ్డీకిచ్చుట సాగిస్తాడు. శూద్రుడు త్రివర్ణములవారికీ సేవ చేసి జీవిస్తాడు. సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలు ప్రాణుల పుట్టుకకు పెరుగుదలకూ వినాశనమునకూ హేతువులుగా ఉన్నాయి. రజోగుణంవలన జగత్తు పుడుతుంది రజోగుణం వలనే మేఘాలు వర్షిస్తాయి. వాన వలన ప్రజలు వృద్ధి చెందుతున్నారు. కనుక, ఇందులో మహేంద్రుని ప్రమేయం ఏమీ లేదు.

తెభా-10.1-888-శా.
కోపింపం బనిలేదు శక్రునికిఁ; దాఁ గోపించుఁగా కేమి సం
క్షేపం బయ్యెడి దేమి? పట్టణములున్ గేహంబులున్ దేశముల్
వ్యాపారంబులు మీకుఁ బోయెడినె? శైలారణ్యభాగంబులన్
గోత్వంబున నుండుచున్ మనకు సంకోచింపఁగా నేటికిన్?

టీక:- కోపింపన్ = కోపగించవలసిన; పనిలేదు = అవసరములేదు; శక్రుని = ఇంద్రుని {శక్రుడు - దుష్టులను శిక్షించుటకు శక్తిగల వాడు, ఇంద్రుడు}; కిన్ = కి; కోపించుగాక = కోపగించి నప్పటికిని; సంక్షేపంబు = సంగ్రహముగా; అయ్యెడిది = జరుగునది; ఏమి = ఏమున్నది; పట్టణములున్ = నగరములు; గేహంబులున్ = భవనములు; దేశముల్ = రాజ్యములు; వ్యాపారంబులున్ = వ్యాపారములు; మీ = మీ; కున్ = కు; పోయెడినె = పోవునా, లేదు కదా; శైల = కొండలు; అరణ్య = అడవుల; భాగంబులన్ = ప్రదేశము లందు; గోపత్వంబునన్ = ఆవులను కాచుకొనుచు; ఉండుచున్ = ఉండెడి; మన = మన; కున్ = కు; సంకోచింపగాన్ = బెదరుట; ఏటికిన్ = ఎందుకు.
భావము:- ఈ విషయంలో ఇంద్రునికి కోపం రావలసిన పని లేనే లేదు. ఒకవేళ కోపగించుకున్నాడే అనుకో, అందువలన మనకు కలిగే కొరత ఏమీ లేదు. పట్టణాలు, భవనాలు, దేశాలు, వ్యాపారాలూ పోతా యని మనకు భయమా? మనం పర్వతాలలో వనాలలో జీవిస్తున్న వాళ్ళం మనం దేవేంద్రుడిని చూసి జంకవలసిన పని లేదు.

తెభా-10.1-889-సీ.
సులకుఁ గొండకు బ్రాహ్మణోత్తములకు-
ఖము గావించుట మంచి బుద్ధి
యింద్రయాగంబున కేమేమి దెప్పింతు-
వి యెల్లఁ దెప్పింపుఁ రసి మీరు
పాయసంబులు నపూములు సైఁదపుఁబిండి-
వంటలుఁ బప్పును లయు నట్టి
లశాకములు వండఁ బంపుఁడు; హోమంబు-
జేయుడు; ధేనుదక్షిణల నిచ్చి

తెభా-10.1-889.1-తే.
హురసాన్నంబు పెట్టుఁడు బ్రాహ్మణులకు
చలులై పూజ యొనరిపు చలమునకు;
ధమ చండాల శునక సంతికిఁ దగిన
క్ష్యములు పెట్టి కసవులు సుల కిండు.

టీక:- పసుల్ = పశువుల; కున్ = కు; కొండ = పర్వతమున; కున్ = కు; బ్రాహ్మణ = విప్ర {బ్రాహ్మణుడు - వ్యుత్పత్తి, బ్రహ్మణి పరబ్రహ్మణి నిష్ఠావత్త్వాత్ బ్రాహ్మణః. బ్రహ్మదేవుని ఉత్కృష్టమైన దైవమనెడి నిష్ఠ యందుండువాడు, విప్రుడు}; ఉత్తముల = శ్రేష్ఠుల; కున్ = కు; మఖమున్ = యాగమును; కావించుట = చేయుట; మంచి = చక్కటి; బుద్ధి = ఆలోచన; ఇంద్రయాగంబున్ = ఇంద్రయాగమున; కున్ = కు; ఎమేమి = ఏవేవైతే; తెప్పింతురు = సమకూర్చుకొనెదరో; అవి = వాటిని; ఎల్లన్ = అన్నిటిని; తెప్పింపుడు = రప్పించండి; అరసి = విచారించుకొని; మీరు = మీరు; పాయసంబులు = పరమాన్నములు {పాయసము - పాలతో వండినది, పరమాన్నము}; అపూపములు = అప్పములు; సైదపు = గోధుమ; పిండి = పిండితో చేయు; వంటలున్ = వంటకములు; పప్పును = ముద్దపప్పు; వలయున్ = కావలసిన; అట్టి = అటువంటి; ఫల = పండ్లు; శాకములున్ = కాయగూరలు; వండన్ = వండుటకు; పంపుడు = నియమించండి, చెప్పండి; హోమంబున్ = అగ్నిహోత్రమును; చేయుడు = చేయండి; ధేను = గోదానాదులు; దక్షిణలన్ = దక్షిణలను; ఇచ్చి = ఇచ్చి.
బహురసాన్నంబు = షడ్రసోపేతాన్నములు {బహురసాన్నములు - అనేకమైన రస (రుచులు) కలిగిన ఆహార పదార్థములు, షడ్రసోపేతములు}; పెట్టుడు = పెట్టండి {షడ్రసములు - 1కషాయము (వగరు) 2మధురము (తీపి) 3లవణము (ఉప్పదనము) 4కటువు (కారము) 5తిక్త (చేదు) 6ఆమ్లము (పుల్లని) అనెడి ఆరు రుచులు}; బ్రాహ్మణుల = విప్రుల; కున్ = కు; అచలులు = చలింపనిబుద్ధికవారు; ఐ = అయ్యి; పూజన్ = పూజించుటలు; ఒనరింపుడు = చేయండి; అచలముల్ = కొండల; కున్ = కు; అధమ = నీచవృత్తిననుండువారికి; చండాల = భీకరమైనవృత్తికలవారికి; శునక = కుక్కల; సంహతి = సమూహముల; కిన్ = కి; తగిన = యోగ్యమైన; భక్ష్యములున్ = భోజనపదార్ధములను; పెట్టి = పెట్టి; కసువులు = గడ్డి; పసుల్ = పశువుల; కిన్ = కి; ఇండు = ఇవ్వండి.
భావము:- కనుక, మనకు జీవన హేతువు లైన పశువులకూ; మన పశువులను తృణజలాదులచే నిత్యమూ పోషిస్తున్న పర్వతానికి; మనకు దీవెన లొసగే విప్రవర్యులకూ సంతుష్టి కలుగునట్లుగా యజ్ఞం చేయడం మంచి బుద్ధి అవుతుంది. ఇంద్రయాగానికి ఏమేమి సంభారాలు తెప్పించదలిచారో అన్నీ విచారించి ఇప్పుడు తెప్పించండి. పరమాన్నములు, అప్పాలు, పిండివంటలు, పప్పుకూరలు వండించండి హోమాలు చేయించండి. బ్రాహ్మణోత్తములకు గోదానాలు దక్షిణములతో కూడ సరస పదార్థ సంపన్నాలైన అన్నాలు పెట్టండి. అచంచల భక్తితో కొండకు పూజలు చేయండి. పతితులకు అనాథలకూ భోజనాలు పెట్టండి. కుక్కలు మొదలైన జంతువులచే భక్ష్యములు తినిపించండి.

తెభా-10.1-890-శా.
గంధాలంకరణాంబరావళులచేఁ గైచేసి యిష్టాన్నముల్
బంధుశ్రేణియు మీరలుం గుడిచి నా భాషారతిన్ వేడుకల్
సంధిల్లన్, గిరి గో ద్విజానల నమస్కారంబు గావింపుఁడీ;
సంధిల్లున్ సకలేప్సితంబులును మీ న్మంబు ధన్యం బగున్. "

టీక:- గంధ = సుగంధ ద్రవ్యముల; అలంకరణ = ఆభరణముల; అంబర = వస్త్రముల; ఆవళులన్ = సమూహములను; కైచేసి = చేపట్టి, స్వీకరించి; ఇష్ట = ఇష్టముగా నుండెడి; అన్నముల్ = ఆహార పదార్ధములను; బంధు = చుట్టముల; శ్రేణి = సమూహములు; మీరలున్ = మీరును; కుడిచి = తిని; నా = నా యొక్క; భాష = మాట యందలి; రతిన్ = ప్రీతితో; వేడుకల్ = వినోదములు; సంధిల్లన్ = కలుగునట్లుగా; గిరి = కొండకు; గో = ఆవులకు; ద్విజ = బ్రాహ్మణులకు; అనల = అగ్నులకు; నమస్కారంబు = నమస్కారములు; కావింపుడా = చేయండి; సంధిల్లున్ = ఒనగూడును; సకల = సమస్తమైన; ఈప్సితంబులును = కోరికలు; మీ = మీ యొక్క; జన్మంబు = పుట్టుకలు; ధన్యంబు = కృతార్థములు; అగున్ = అగును.
భావము:- తండ్రీ! మీకు ధర్మమని తోచినట్లయితే నామాటపై నమ్మముంచి, మీరు మీబందువులూ చందనం పూసుకుని ఆభరణాలు అలంకరించుకుని, కొత్తవస్త్రములు ధరించి, ఇష్టపదార్ధాలు హాయిగా భుజించి, ఎంతో వేడుకగా గిరికీ గోవులకూ బ్రాహ్మణులకూ అగ్నిహోత్రమునకు ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించండి. మీ జన్మ ధన్యమవుతుంది.”

తెభా-10.1-891-వ.
అని మఱియు నిలింపపతి సొంపు దింపు తలంపున ని మ్మఖంబు తనకు సమ్మతం బని గోవిందుండు పలికిన నందాదులు మేలుమేలని తద్వచన ప్రకారంబునం బుణ్యాహవాచనంబులు చదివించి ధరణీసురులకు భోజనంబు లిడి పసులకుం గసవు లొసంగిరి; అప్పుడు.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; నిలింపపతి = దేవేంద్రుని {నిలింపపతి - నిలింపుల (దేవతల)కు పతి (ప్రభువు), ఇంద్రుడు}; సొంపు = అతిశయము, గర్వము; దింపు = తగ్గించవలె ననెడి; తలంపునన్ = భావముతో; ఈ = ఈ యొక్క; మఖంబు = యాగము; తన = అతని; కున్ = కి; సమ్మతంబు = అంగీకారము; అని = అని; గోవిందుండు = కృష్ణుడు; పలికినన్ = చెప్పగా; నంద = నందుడు; ఆదులు = మున్నగువారు; మేలుమేలు = బహుబాగు; అని = అని; తత్ = అతని; వచన = మాట; ప్రకారంబునన్ = ప్రకారము; పుణ్యాహవాచనంబులు = పుణ్యాహవాచనము {పుణ్యాహవాచనము - దైవాది కర్మ ప్రారంభమున మంగళార్థము చేయు కర్మ}; చదివించి = పఠింపజేసి; ధరణీసురుల్ = విప్రుల; కున్ = కు; భోజనంబులు = భోజనములు; ఇడి = పెట్టి; పసుల్ = పశువుల; కున్ = కు; కసవులు = గడ్డి; ఒసంగిరి = వేసిరి; అప్పుడు = ఆ సమయమునందు.
భావము:- అంటూ కృష్ణుడు దేవేంద్రుని గర్వము అణచుటకై, ఈ కొత్తయాగం తనకు సమ్మత మైనదని చెప్పాడు. అది విని నందుడు మొదలైనవారు “అవునవును. ఇది లెస్స” అని కృష్ణుడు చెప్పిన తీరుగానే చేసారు. పుణ్యాహవాచనాలు చదివించి, బ్రాహ్మణులకు తృప్తిగా భోజనాలు పెట్టారు. పశువులకు కడుపు నిండా కసవు వేశారు.