పుట:Yogasanamulu.djvu/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

15


భ్యాసమునకు ఉచితమైనట్టి ఆహారమును మాత్రమే భుజింప వలయును. పరిమాణమున తిన గల్గినంత ఆహారములో సగము మాత్రమే భుజింప వలయును. మిగిలిన సగభాగములో సగము అనగా నాలుగవ వంతు నీరు త్రాగవలయును. ఆప్పుడు ఆహార కోశము నాల్గింట మూడు వంతులు ఆహారముచే నిండి పాతిక భాగము ఖాళీగా విడిచి పెట్ట వలయును. ఇది వాయువు చేత ఆక్రమించ బడును. ఆ విధముగా భుజించు నెడల తేలికగా జీర్ణమగును. జీర్ణమయిన ఆహారము రక్తమున కలియును. జీర్ణము కాక మిగిలిన పొట్టు పదార్థము మలాశమున చేరి బహిష్కరింప బడును. సాధకుడు తినబోవు ఆహారము మెత్తని దై బాగుగా పచనము చేయబడ వలయును. మధురముగా వుండి శరీరమున వున్న జీవుని కొరకు గ్రహింపబడునది మితాహారము అనబడును. యోగాభ్యాసము చేయు వారు అనతి కాలముననే సత్పలితమును సాధింప గోరుదురేని వారి ఆహార నియమమును తప్పక పాటించ వలయును. అట్టి వారు చేదు, పులుపు, కారము, సముద్రపు ఉప్పు, మాంసము, చేపలు, క్షుద్ర ధాన్యములని చెప్పబడు ఉలవలు, బొబ్బర్లునూ, ఉల్లి, వెల్లుల్లి, యింగువ, నూవులు, ఆవాలు బెల్లము, నూనె మొదలగు అహార పదార్థములను, స్త్రీ సాంగత్యము (స్త్రీ సాధకుకలు పురుష సాంగత్యము) దుర్జన సహ వాసము, ప్రాతః స్నానము చలిమంట కాగుట, శరీరమును అధికముగా శ్రమ పెట్టుట అనునవి వర్జింప వలయును. చెక్కర, పటిక బెల్లము, ఆవుపాలు, ఆవు వెన్న, ఆవు నేయి (దొరకని పక్షమున గేదె పాలు, వెన్న, నేయి) పంచ శాకములు అనగా జీవంతి, వాస్తు