పుట:Yenki Paatalu Nanduri Venkata Subba Rao.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మద్రాసు ఆంధ్ర పండిత మండలివారు నన్ను ప్రత్యేకం ఆహ్వానించి గౌరవించారు, ఆప్పటినుంచీ పండితులంటే భయంపోయి భక్తే మిగిలింది, వారికి నా నమస్సులు.

కావ్యవ్యాకరణతీర్థులు బ్రహ్మశ్రీ పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రుల వారికి మా యెంకి పేరు చెపితేనే యెంతోఆపేక్ష; పాటలంటే ప్రాణమే. పండితులయిన్నీ "యేమో, చదువరానివారి పాట"లని తోసెయ్యరు. యెంకిపై పదిమంది హృదయాలల్లో భక్తి కలిగించింది, వారున్నూ, బ్రహ్మశ్రీ పొక్కులూరి లక్ష్మీనారాయణగారున్నూ. వారిరువురికీ నా నమస్కారాలు.

"తెలుగుదేశంలో పేరొందిన "మేటిగాయకులు మ.రా. శ్రీ విద్వాన్ పొరుపల్లి రామకృష్ణయ్యగారు యెంతో శ్రమపడి, శ్రద్ధతో యీ పాటలకు స్వరం చేశారు. వారికి నా నమస్కారాలు, అదే నేను పాడేవిధము.

తర్క వ్యాకరణ శాస్త్రవేత్తలగు బ్రహ్మశ్రీ గంటి సూర్యనారాయణశాస్త్రులుగారు తమకుతామై కోరి, యీ పాటలు చక్కగా అచ్చువేయించినందుకు వారికి చదువరులతోబాటు నేనును కృతజ్ఞుడను.

ఈ కృతి నర్పించినది నా పెత్తల్లి కుమారునకు. నా తండ్రి నాకు నాలుగైదేండ్లున్నప్పడు కాలం చేస్తే, అప్పటినుండి యిప్పటివరకు మా కందరకు అతడే పట్టుకొమ్మ, "చంద్రున కొక్క నూలిపోగ"న్నట్లు అతని కీ కృతి సమర్పిస్తున్నాను.

మద్రాసు,

29-8-25

నండూరి వెంకటసుబ్బారావు.