Jump to content

పుట:Yenki Paatalu Nanduri Venkata Subba Rao.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యెంకి పయనం

(ప)డుకుంటె నాకేటొ బ్రమ పుట్టినాదీ!
(క)డుపులో సెయ్యేసి కలిపేసినాదీ!
ఎడతెగని జలమంట!
నడమ నో పడవంట!
పడవెక్కి నాయెంకి పయన మయ్యిందంట!

(ప)డుకుంటె నాకేటొ బ్రమ పుట్టినాదీ!
(క)డుపులో సెయ్యేసి కదిపేసినాదీ!
యెంకేటొ బ్రమపుట్టి
యెనక తిరిగిందంట
సందెగాలికి పడవ సాగిపోయిందంట!
పడుకుంటె నా కేటొ బ్రమ పుట్టినాదీ!
కడుపులో సెయ్యేసి కలిపేసినాదీ!

నీటిగాలికి యెంకి
పై టెగురుతాదంట
పడపోయి నట్టేటొ పడ వెల్లినాదంట
పడుకుంటె నాకేటొ బ్రమ పుట్టినాదీ!
కడుపులో సెయ్యేసి కలిపేసినాదీ!