పుట:Yenki Paatalu Nanduri Venkata Subba Rao.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకటి రెండు మాటలు

శ్లో. యదిసంతి గుణాశ్శ్లాఘ్యాః వికసంత్యేవతే స్వయమ్,
నహి కస్తూరికామోదః కపటే న నివార్యతే.__

అని యొకానొక మహాకవి చెప్పినట్టులు, మృదుమదురరసార్ద్రములయి, సహజకోమలములను భావనామాత్రసంవేద్యములును నైన కవికుమారుల కవితా కల్ప ప్రసూనములందలి పరిమళలహరులు స్వయముగఁ దమంతతామే సమస్త దిగంతములను సయితము వ్యాపించి, విశ్వవ్యాప్తములును విబుధజనశ్లాఘ్యము లును నై విలసిల్లుచుండగా, నందలి గుణవిశేషములను సహృదయులసన్నిధి నెఱుకపఱచుటకై నావంటి పరిమిత ప్రజ్ఞుని పరిచయవాక్యము లంత నవసర ములు కావని తలంచుచున్నాను. ఏలయందురా ? - మందారప్రసూనములలోని మకరందమాధుర్యమునుగ్రోలి సొక్కుటకు మిళిందకుమారునికి ఎవ్వరు పరిచయ మును గలిగించిరి ? మలయచందనమందలి శైత్యసౌరభ్యముల కుబ్బి తబ్బిబ్బై వానిని లోకమునందెల్లయెడల నింపదివిరిన దక్షిణానిలాంకూరమున కేసుధీవరుని పరిచయవాక్యములు ఉద్దీపనమును గలిగించినవి ? అట్లే ప్రస్తుతము ప్రకటిత ములై భావుకలోకము సన్నిధిని ఆర్పింపఁబోవుచున్న యీ వెంకిపాటలనెడి ప్రేమపూతములగు కవితాకల్ప ప్రసూనముల వినయమునందుగూడ నని మనవి. అయినను ప్రస్తుత మాంధ్రలోకమునందు తక్కిన యన్ని యలవాటులతోఁ బాటు, ఎంతటి తేనెవాకలనూరించు సరసకావ్యమునకైనను ఏవో ఒకటి రెండు మాటలు పీఠికాకృతిని గ్రుచ్చవలసియుండుట యాచారమైపోవుటచేత, నందు లకు విధేయులమై ఒకటి రెండు మాటలను యిచ్చట మనవిచేయ సాహసించితి మేగాని ప్రజ్ఞాపారమ్యమునుబట్టిమాత్రము కాదు.

వెంకిపాటలు ఈ ఇరువదవ శతాబ్దిని మన యీ ఆంధ్ర వాఙ్మయకల్పశాఖికను ప్రసవించిన సర్వాంగపరిపూర్ణ పరిణతీవిలసితంబులగు దివ్య ప్రసూన రాజములు గాని, ఫూపబెడంగుల పచరించు పసరు మొగ్గలు కావు. బ్రహానంద సహోదర మనియు, నవాఙ్మానసగోచరమనియును, నిర్వచించు రసస్వరూపమును - పండితులకు సైతము రూపింపశక్యముగాని రసస్వరూపమును-భావనాశక్తిగల ప్రతివారికిని గోచరమగునట్లు మూ ర్తీభవింపజేసిన అమృతఘటికలుగాని అన్యములు కావు. దివ్యతాపూర్ణములగు భావనాసీమలందు ప్రయత్న విశేనమున