26వ తేది మంగళవారము నాడిచ్చటనుండి బయలుదేరి 5 గంటలకు విశాఖపట్టణములో బ్రవేశించితిమి. నడుమనున్న మజిలీలు 1. నీలయ్య సత్రము. మై 9. 2. తాళ్లవలస సత్రము. మై. 8 3. మధురవాడ సత్రము. మై. 7. 4. వాల్తేరు, మై 10. నీలయ్య సత్రము దాటిన పైని చంపావతీ నదీతీరమందు చిట్టివలస యనునూరున్నది. ఇచ్చట గోనెలు నీలిమందు తయారు సేయదగిన ఫాక్టరీలున్నవి. ఆ పైని సముద్రతీరమందు భీముని పట్టణమున్నది. ఇందులో మునసబు వగైరాల ఖచేరీలున్నవి. దొరలు సైతమున్నారు. రేవుస్థలమైనందున ధనిక వర్తక భూయిష్టమైయున్నది. ఇది కొండదిగువనున్నందున నిమ్నోన్నతముగా నున్నది. కొండమీద శ్రీ నృసింహస్వామి వారి గుడియున్నది. భోగరాగము లనుకూలముగానే జరుగుచున్నవి. సముద్ర ప్రాంతమునుండి విశాఖపట్టణమునకు బోవు త్రోవలో నడుమ ఋషికొండ దిగువ నొక దేవాలయంబును సత్రంబును గలవు.
వాల్తేరులో గొప్ప దొరలు పెక్కండ్రు నివసించియుండిరి. వేసవిలో సముద్రపు గాలికి దొరలును గొప్ప సుకుమారులును వచ్చియుందురు.
విశాఖపట్టణము జిల్లాస్థలము, జడ్జీ, కలెక్టరు వగైరా ఖచేరీలున్నవి. హిందూస్కూలు- మిషన్ స్కూలు- ఆస్పత్రులు పెక్కు మహడీలు- భవంతులు. శ్రీ జగన్నాధాది దేవతా మందిరములు గలిగి ధనిక వర్తక సంపన్నమై సుందరముగా నున్నది. ఇచ్చట బర్వతములయందు సముద్రస్నానము సేయదగిన తీర్థపుఱాళ్ల ఱేవునకు బశ్చిమముగా విశాఖ నామముగల కుమారస్వామి యొక్క మందిర మున్నందున దీనిని విశాఖపట్టణమనుటకు గారణమైనది.
ఇచ్చటకి 8 మైళ్ల దూరముగా వాయవ్య భాగమందు శ్రీ సింహాచల క్షేత్రమున్నది - 1096 మెట్లు గలవు. కొండమీదినుండి గంగధా