శ్రీ
శ్రీ జగదీశ్వరాయ నమః
శ్రీ గణపతయె నమః
శ్రీరస్తు శ్రీః
యాత్రా చరిత్ర పూర్వభాగము.
శ్రీ జగదీశ్వరుని యొక్క జగద్రూప విలాసములో గొంత వశమైనంత వరకు జూడవేడుక గలిగి 1886 సం|| జనవరి 24వ తేదీకి సరియైన పార్ధివ నామ సం|| పుష్య బ 5 ఆదివారమునాడు సుముహూర్తమునందు ప్రస్థాన లాంచన పుర్వకముగా గొంత పరివారమును ముందుగా బంపి తే 25వ దిని శ్రీ బొబ్బిలి వేణుగోపాలస్వామివారిని సేవించికొని పగలు 10 గంటలకు బయలుదేరి 4 గంటలకు విజయనగరము నొరసియున్న కంటన్మేంటులో బసచేసినాము. నడుమనున్న మజిలీ గ్రామములు 1. రామభద్రపురము. మైళ్ళు 7|| 2. మరడాము. మై 7|| 3. గజపతినగరము. మై 9. విజయనగరము మై 13. బస్తీ పట్టణము సుందరముగా నున్నది, ఇది శ్రీ పూసపాటి యానందగజపతిరాజ మహారాజావారి రాజధానియైయున్నది. ఇందు నాలు బురుజులుగల సాధారణమైన రాతి కోటయు సంస్థానపు బియ్యే కాలేజీయు - తంతి యాఫీసును పెక్కండ్రు వర్తకులును - సాహుకారులును 4, 5 శివకేశవ నివేశంబులును మేలైన పూలతోటయు మంచి కోనేరును - పెక్కంగళ్లును - హూణ వైద్యశాలలును - సంస్కృతపాఠశాలయు నొక సత్రంబును గలవు.