పుట:VrukshaSastramu.djvu/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరీక్షకై అభిమాన శాస్త్రముగా నభ్యసించినవారు. ఇదివఱకు దెనుగున నీశాస్త్రముపై వ్రాయబడినవి ప్రాధమిక గ్రంథములు. మేమిదివఱకు బ్రకటించిన భౌతిక శాస్త్రములు గూడ వీలయినంతవఱకు బ్రాధమిక తరగతులుకు బనికి వచ్చునట్లే వ్రాయించితిమి. అట్టి గ్రంథములిప్పుడు తెనుగు దేశమునందు బెక్కులు బయులుదేరుచున్నవి. కావున నా మార్గమున మేమంతగ బనిచేయవలసిన యావశ్యకత తీరినది. ఇంతటనుండి బ్రాధమికములగ బ్రకటితములైన శాస్త్రములనుగుఱించిన యుద్గ్రంథములు వ్రాయించి ప్రకటింపదలచినారము. జ్యోతిషశాస్త్రము, శారీరశాస్త్రము, పదార్థ విజ్ఞానశాస్త్రమందలి వేఱువేఱు విషయములు, రసాయనశాస్త్రము మొదలయిన శాస్త్రములకు సంబంధించిన పెద్దగ్రంథములు వ్రాయించి ప్రకటింపదలచినారము. అందువలన మండలి వారికి వ్యయమెక్కువయి, ఆదాయము తక్కువయు నుండుననుటకు సందేహము లేదు. కాని భాషాభివృద్ధియే దీక్షగా నవలంబించిన మండలివారు నష్టమునకు వెనుకదీయరు.

సంపాదకుడు