తీగముషిణి:- తీగెపెద్దది. పువ్వులుచిన్నవి. పచ్చాగానుండును. పక్షులు దీని పండ్లను తినును. దీని వేరు నుండి రసము తీసి పాముకాటునకిత్తురు గాని అంతగా పని చేయునట్లు తోచదు.
కాకిమఱ్ఱితీగె:- ఆకులుపెద్దవి. దీనికాయలను దినరాదు. అవి విషము గింజల నుండి చమురు తీసి కొబ్బరి నూనెలో గలిపి వ్రాసిన తామరమొదలగు చర్మ వ్వాధులు తగ్గును. దీని పండ్లను , గింజలను అన్నముతో కలిపి కాకులను జంపుటకు బెట్టుదురు.
కలువ కుటుంబము.
కలువమొక్కలు మన దేశమందంతటను బెరుగుచున్నవి. వేళ్ళు బురదలో నాటుకొనియుండును.
ప్రకాండము నీళ్ళలోనె పొట్టిగా నుండును.
ఆకులు:- పెద్దవి. గుండ్రము, తొడిమలు మిక్కిలిపొడుగుగాను గుండ్రముగాను నున్నగాను నుండును. ఇవి కడ్డివలెగట్టిగాలేవు. వీని పొడుగునను సొరంగములలో గాలియుండును. కావున ఆకులు నీటి మీద తేలును. కాడలు వంగగల్గుట చేతను సాగగల్గుటచేతను నీరు తగ్గినను హెచ్చిననను ఆకులు నీటి మీదనే తేలుచుండును. కాడ పత్రముతో గలియు చోట నెత్తుగాకణుపు వలెనున్నది. పత్రము రెండు వైపుల సన్నగా నుండును.