పుట:VrukshaSastramu.djvu/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సునాముఖి: ఆకును చిరకాలమునుండి వైద్యమున ఉపయోగించు చున్నారు. అది రాగడి నేలలో ఏపుగా పెరుగును. విత్తులు చల్లుటకు పూర్వము పొలము దున్ని కలుపుదీసి నీరు పెట్టుదురు. మొక్కలన్నిటిని గోసివేయక, ముదురాకులను మాత్రము కోయుచు వానినెండ బెట్టి ఎగుమతి చేయు చున్నారు. ఆకులకు విరేచనుము చేయించు గుణముగలదు. కావునాఔషధములలో వాడుదురు.

అడ్డాకుల:- తీగెపెద్దది. మ్రానులావుగానుండును. ఆకులు పెద్దవి. ఆకులక్రింద నులితీగెలు గలవు. పువ్వులు మొదట తెల్లగా నుండును గాని తరువాత పచ్చగ మారును. ఆకులు పెద్దవి గాన విస్తళ్ళుకుట్టుదురు. అరటిఆకులులేని కాలమందు వీనినే వాడుదుము. దీని కాయలను కూడ కొందరు తిందురు. గింజ లెండిన తరువాత వాని రుచి జీడిగింజలవలె నుండును.

మోదుగ:- మొక్కలు కొండప్రదేశములో పెరుగును. ఆకుల మీదనుకొమ్మల మీదను మెత్తని తెల్లని పదార్థము గలదు. ఆకుల మిశ్రమపత్రములు. దీని పువ్వులు చిక్కుడుపువ్వుల యాకారముగను ఎర్రగను పెద్దవిగను నుండును. వీనిమీద వెండివలె మెరయు రోమములు గలవు.