పుట:VrukshaSastramu.djvu/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దుము. మానున కడుగునుండి పుట్టక, చెఱుకు మర్రి (ఊడలు) మొగలి మొదలగువాని యందు కొన్ని వేరులు పైనుండియే బుట్టుచు క్రిందకు బోవుచున్నవి. ఇవి, వానిస్థలము తప్పి పుట్టుచున్నవిగాన, ఆగంతుక వేళ్లందుము. మిరియాల తీగయందును ఇట్లాగంతుక వేళ్లు బుట్టుచున్నవిగాని అవి భూమిలోనికి దిగవు. అవి విస్తారము పొడుగుగూడ నెదుగవు. తీగ దేనిమీద బ్రాకుచున్నదో దానిని అంటి పెట్టుకొని యుండి తీగను క్రింద బడిపోకుండునట్లు జూచుటయే వీని పని. బదనిక మొక్కల వేరులును భూమిలోనికి దిగుటలేదు. బదనికమొక్క లేచెట్టుమీద బెరుగుచున్నవో ఆ చెట్టు లోపలకు వేరులు చొచ్చుకొనిపోయి, అవి సంపాదించుకొనిన యాహార పదార్థములను దస్కరించుచున్నవి. ఇట్లు పరాన్న భుక్కు లగుటయే వాని పనియైయున్నది. వీనినే బదనికవేరు లందుము.

చెట్లమీదనే పెరుగు చిన్నచిన్న మొక్కలు మరికొన్ని గలవు. వానివేళ్లును భూమిలోపలికేగవు. బదనికవేళ్లవలె కొమ్మలోపలికిబోయి దాని యాహారమును తస్కరించవు. భూమిలో నాటుకొనుటకు బదులు ఆ కొమ్మను అంటిపెట్టుకొని గాలిలో దొరకు నావిరిని బీల్చుకొనుచుండును. ఇట్టివి అంటువేరులు.