పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

విజయనగర సామ్రాజ్యము


జూలమంది యీపని చక్రధరుని వలననై యుండునని తలఁచిరి. మఱికొందఱు ఆదిల్ శాహా వలన నెయుండు నేమోయని తలఁ చిరి. ఇంక కొందఱు మఱికొన్ని విధములందలఁచిరి. అతనికి గల విరోధులలోఁ గూడఁ జూలమంది కతఁడే యిది చేసెననుటకు నోరు రాకుండెను. వారి యంతరాత్మ యొప్పినది కాదు. కాని రామరాజు తీక్షాగ్నికణములం గురియు మొగముంజూచి భీతిల్లి పౌరులు కాని యితరులు కొని యెవరు నేమియు నన సాహసింప రైరి. అంత రామరాజు లేచి యిట్లనెను.

" ఓయీ ! పాపీ ! చిరకాలమునుండి మీతండ్రి తాతలు మావంశము వారిని నిష్కళంక బుద్ధితో సేవించిరి. పాల సముద్రమునఁ బుట్టిన విషభాండమునోలె వారికడుఫునఁ బుట్టి నీవింత పని సేయుట మిక్కిలి వ్యసనకరము, మాసొమ్ముతిని 'పాలు త్రావి రొమ్ము గుద్దె' నను సామెతగా మమ్మే నాశము సేయఁ జూచుచున్నావుగా ! చిరకాలమునుండి వచ్చుచున్న మహామంత్రి పదవి ననుభవించుటకు నీకు వెగటుగా నుండియా యిట్లు శత్రురాజులతో గూడి కుట్రలు సేయుచున్నావు ! ఛీ ! నీవంటి దేశద్రోహులయు, రాజద్రోహులయు మొగములు చూచినఁ బాపము తప్పక వచ్చును. నిన్ను ఖండములుగాఁ గోసి నను బాపము రాదు. కావున నీకిప్పుడు మరణదండనమును విధించి విజయ నగర సామ్రాజ్యమున నీవంటి . ద్రోహులు లేకుండఁ జేసెదను.”