పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

విజయనగర సామ్రాజ్యము


వాఁడు పాపమునకు జంకగూడదు. కొంపలు తీయుటకు జంక గూడదు. ఒకరిని నాశము సేయుటకు జంకఁగూడదు. ఛీ ! నేనిపు డీకార్యము నెట్లు సేయుదును ? ”

అయ్యో ! సుప్రసిద్ధమగు విజయనగర సామ్రాజ్య మును నా చేతులతో నాశము సేయవలసి వచ్చుచున్నది. నే నీపని కేమని పూనుదును ? ఇదివఱకు నీ సామ్రాజ్యమునలన దక్షిణహిందూ దేశమునఁ దురకలకుఁ గాలు వెట్టవలను పడినది కాదు. ఇఁక నిదిగూడఁ దక్కినహిందూ దేశమువ లె వారిహింస లకు లోనుగావలసి వచ్చునుగాఁబోలు! ఛీ! కాదు. నాబోఁటి యల్పునివలన నేమగును? సర్వము కాలవశము. మనుజులవలన నేమగును? మన మేపాటివారము! సామ్రాజ్యములు పోవుటకుఁ గాని నిలుచుటకుగాని నావంటి తుచ్ఛమానవులు కారణము గాదు. దైవముతప్ప మఱేదియు నీ పనులు సేయఁజూలదు.”

“ఇట్లని శాస్త్రములు చెప్పుచుండఁగా నేను వృధాగా నిట్లు భయపడ నేల! నేనిపుడు చింతింప నేమి ప్రయోజనము ! ఇదివటి కే గోల్కొండ నవాబునకు మాట యిచ్చితిని. అది తప్పిన ద్రోహము కాదా? వెనుక నూయి, ముందు గోయి. ఎట్లా? కావలసియున్న నట్లగును. వృధాగా నాకు వచ్చు లాభమును బోఁగొట్టుకొన నేల ! గోల్కొండ నవాబు చెప్పినట్ల: నడచు కొని రామరాజును మోసపుచ్చితినేని రాజ్యము వచ్చును. సామంత రాజు నగుదును. అంత యదృష్టమా?” (7)