పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది యెనిమిదవ ప్రకరణము


తురు ష్కులు

హిందూ దేశమునఁ బశ్చిమ భాగమునఁ గొండలవరుస యొకటి కలదు. అది ప్రకృతి సౌందర్యమునకుఁ దావు. దానినే యస్తాద్రియందురు. అందుఁ గృష్ణ గోదావరీ మొదలగు నదులు, శాఖానదులు పెక్కులు జనించుచుండను. ఆపర్వత శ్రేణియొక్క యుత్తరార్ధభాగము హిందూ సామ్రాజ్యమును మహమ్మదీయుల నుండి విముక్తి నందించి, బానిస తనమును విముక్తిగావించి, స్వతంత్ర సామ్రాజ్యమును స్థాపించుటకై ప్రయత్నించి విఖ్యాతిగాంచిన మహా రాష్ట్రులకు వాసస్థానము. అందు, అహమ్మదు నగరను నొక పట్టణముకలదు.


అది కృష్ణా గోదావరీ జన్మప్రదేశములకు సమీపముగా నున్నది. అది పూర్వము గొప్పపట్టణమై ప్రసిద్ధికెక్కి యుండెను. ఆ కాలమున నది యొక రాజ్యమునకు రాజధాని. ఆ రాజ్యము పేరు “అహమ్మద్ నగరు రాజ్యమందురు. దానికి నిజాంశాహి యనియు మాఱు పేరుకలదు. ఆ రాజ్యపుఁ బ్రస్తుతపు నవాబు పేరు బుర్ హాన్ నిజాంశాహా.


ఒకనాఁటి సాయంసమయమున నతఁడును, అతని మంత్రియుఁ గూడి యిట్టు లాలోచించుకొనుచుండిరి.