పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదినాలుగవ ప్రకరణము

188


కొసంగెను. ఆ సుందరీమణు లిరువురు చెబియొకటి తీసికొనిరి. ప్రాతః కాలమగుచుండెను. ఈ నాల్గు గుఱ్ఱములును వడిగా నడువఁ దొడఁగెను.

ముందుఁబోవుచున్న నాల్గు గుఱ్ఱములు నాగియుండెను. వారు ముందువంక జూచుచుండిరి. ఆవయిపున నొక చెరువుం డెను. వారా చెరువుదగ్గలు ప్రాతః కృత్యములు నిర్వర్తింపవచ్చు నని తలఁచి గుఱ్ఱములనాపి తమ వెంటనే కొంచె మాలస్య ముగా వచ్చుచున్న స్వజనము రాక కై చూచుచు నుండిరి. ఇంతలో నా నలుగురలో నొకఁడు కెవ్వునఁ గేక వేసెను. వెంటనే కడమ మువ్వురును బ్రక్కకుఁ దిరిగి చూచిరి. వెనుక నుండి వచ్చి సుందరీమణులును కుయుక్తి పరుఁడును భటుఁడును వారిని బల్లెములతో బొడిచిరని మీకుఁ జెప్పవలయునా ? రెండు పక్షముల వారును గొంచెము సేపు పోరిరి. కాని. ముందుగాఁచిన్న బలమైన గాయముల చేత మొదటి నల్గురు పడిరి. పాపము వారు ప్రార్థించుచున్నను, సుందరీమణులు వారించుచున్నను విడువక, ఆ కుయుక్తిపరుఁడును, భటుఁడును, ఆ నల్గురలోఁ గొన యూపిరితోనున్న వారినిం బొడిచి చంపిరి. ఒక్క నిముసములో ఆ నల్గురు పరలోకమున కేగిరి.