పుట:VignanaSarvasvamuVol4.djvu/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దర్శన సమీక్ష

దర్శన స్వరూప, స్వభావములు


మానవుడు సాధారణముగా తన జీవితమును గురించి, ప్రపంచమును గురించి పరిశీలన, ఆలోచన, లేదా చింతన చేయకుండ గడుపును. తన పరి స్థితిని గూర్చి గాని, బ్రతుకుచున్న విధానమును గూర్చి గాని సాధారణముగా ఆలోచింపడు. తన పూర్వగులు, సంమము, సంస్కృతి ప్రవర్తింపచేసి సాంప్రదాయిక ముగా చేసిన లక్ష్యములకొరకై పనిచేయుచు, తోటి వ్యక్తులు, సంఘము ఆమోదించు విధముగా నడుచు కొనవలెనని, తనకు సుఖము, తృప్తి కలుగునట్లు చూచు కొనవలెనని మనుష్యుడు మామూలుగా ప్రయత్నిం చును. అయితే వీటన్నిటికిని సమన్వయము పూర్తిగా జరుగదు; వీటి మధ్య సంఘర్షణ ఏర్పడును. అప్పుడు కర్తవ్య నిశ్చయము చేసికొనుటకు ఆలోచన అవసర మగును. నే నెందుకు సంఘము గాని, తోటి మాన వులుగాని ఆమోదించు విధానమునే అనుసరింపవలెను ? నా కెక్కువ సుఖము, తృప్తి కలుగునట్లు నే నెందుకు వర్తింపకూడదు? లేదా నా సుఖమును, తృప్తిని త్యాగము చేసి సాధింపవలసిన లక్ష్యము ఏమైన ఉన్న దా? ఉన్నచో అది నాకు గోచరము కావలసినదే! ఇతర మనుష్యులకు - వారు పూర్వగులు కావచ్చును, సమకాలికులు కావచ్చును - తెలిసిన విషయము స్వయ ముగా నారును బోధపడవలెను కదా! అన్యులను, సంఘమును ప్రమాణముగా నే నెందుకు తీసికొన వలెను?" ఇటువంటి ప్రశ్నలు ఒక విధమైన చింతనను రేకె తించును. దార్శనిక సమస్యలు : ప్రపంచములో ఏదో ఒక విషయము గాని, సమస్త విశ్వమును గూర్చిన భావము గాని ఒక్కొక్కసారి మనకు కుతూహలమును, ఆశ్చర్యమును కలిగింపవచ్చును. ఉదాహరణమునకు ప్రపంచములో కన్పడుచున్న క్రమము, వ్యవస్థ మనకు ఆశ్చర్యకారణము కావచ్చును. మానవుని బుద్ధిబలము, హస్త కౌశలము - వీటి ద్వారా అతడు సాధించిన నిర్వాహమును, అతడు తక్కిన జీవకోటి పైన, ప్రకృతి పైన పొందిన విజయమును , అతడు భావనాశ కి (imagination) ద్వారా సృజించిన కవిత్వ, శిల్ప, సంగీతములను మననము చేయుట వలన మానవుని మహిమ, శ్రేష్ఠత్వము తెలిసి మన కాశ్చర్యము కలుగ వచ్చును. అట్లే, ఇంత ఉత్కృష్టుడైన మానవుడు కూడ లోకములో కొంచెము కాలమే మను నని, అతడును తక్కిన పశు పక్షి వృక్షాదుల వలె మరణించు నని తెలిసికొన్నప్పుడు ““అతని పర్యవసాన మేమి? గమ్య మేడి? అతని ఆలోచన, కృషి, ఆరాటము, ఉద్వేగము ఇవన్నియు మరణాంతము లేనా? లేదా అతనిలో ఏదైన శాశ్వతత్వము కల్గిన సారవస్తువు ఉన్నదా? మానవ జీవితమునకు ఒక అర్థము, ప్రయోజనము ఉన్నవా? ఇటువంటి విచికిత్స మానవుని గురించి, లేదా ఏదైన వస్తువును గురించి, సంఘటనను గురించి ప్రారంభింపవచ్చును. లేదా యావత్తు ప్రపంచమునే ఇట్టి విచికిత్సకు విషయముగా చేయ వచ్చును. |