పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

౨

ఎఱ్ఱాప్రెగ్గడ


ఈతఁడు 14.వ శతాబ్దనువాఁడు. తండ్రి సూరనార్యుఁడు. తల్లి పోతమాంబ. జన్మస్థానము నెల్లూరు జిల్లాలోని గుడ్లూరు. ఈతఁడు పోలయ వేమారెడ్డియాస్థాన కవీశ్వరుడుగా నుండెను. ఇతనికి శంభు దాసుఁడు, లేక ప్రబంధపరమేశ్వరుఁడని బిరుదు గలదు. భారతారణ్య పర్వశేషము, నృసింహపురాణము, హరివంశము, రామాయణము లీతని కృతులు. ఈ స్తుతిపద్యములు నృసింహపురాణములోనివి. బ్రహ్మాండ పురాణో క్తమయిన శ్రీ నరసింహావతారకథ యిందలి యితివృత్తము, ఈ గ్రంథము అహోబిల నరసింహస్వామికంకిత మీయఁబడినది.

కం!! అందంద చాగి మొక్కుచు
బృందారకు లధికభ_క్తి భీతవికాసా
నందంబులు డెందంబుల
సందడి గొన మస్తక ప్రశస్తాంజలులై.

కం! ఆవిశ్వరూపరూపము
భావించుచుఁ దత్పభావభంగుల మది సం
భావించుచుఁ దత్పరమతు
లై వినుతింపంగఁ దొడఁగి రప్పరమాత్మున్.

ఉ| శ్రీవసుధాకళత్ర ! యతసీసుమనోతిమనోజ్ఞగాత్ర ! మా
యావిహితత్రిలోక ! నిగమార్థవివేకవిపాక ! భవ్యసం
సేవక సౌమ్యమానసవశీకృతరూప ! భవాంధకారని
ర్థావనదీప ! దీప్త నవతామర సేక్షణ ! విశ్వరక్షణా !