పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/80

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                           వేమన   74

ఇవి యైదును బైటి సాధనలు.

ఇట్లు శరీరము స్వాధీనమై మనన్సునకు చాంచల్యము తగ్గినపుడు తమకిష్ట మైన యే వస్తువునందైన మనసు నిలుపవలయును. ఇది ధారణ, అది తప్ప తక్కిన వృత్తులందు మనసును పోనీయక నిలుపుట ధ్యానము. ఈ రెంటియందును " నేను, దీనిని, ధ్యానించుచున్నాను" అను ధ్యాత, ధ్యేయము, ధ్యానము అను మూఁడు పదార్ధములు గలవు. ఈ ధ్యానము ఇల్లే సాఁగనిచ్చినయెడల మనము ధ్యానముచేయు వస్తువు మాత్రము నిలిచి, నేననుకర్త, ధ్యాన మనుక్రియ ఈ రెండును అంతరించును. దీనినే సమాధి యందురు. ఇదే అష్టాంగ యోగము.

ఈ సమాధి రెండువిధములు : సంప్రజ్ఞాతమని ; అసంప్రజ్ఞాతమని, మొదటి దానిలోఁ గూర్చున్న యోగికి మొదలు ధ్యేయవస్తువుయొక్క స్థూలరూపము గోచరించి క్రమముగా దాని నూక్ష్మరూపముగూడ స్పష్టమగును. ఆ మూలప్రకృతి గోచరించినపుడు 'బుతంబర' యను నొకవిధమైన ప్రఙ కలుగును. దానిచే యదార్థ జ్ఞానము గలిగి సందేహములన్నియు నివర్తించును. శ్రుతిప్రమాణముచేతను, అనుమాన ప్రమాణముచేతను గలుగు తెలివికన్న ఈ 'ఋతంబర' యను తెలివి గొప్పది. ప్రత్యక్షము, పరోక్షము, భూతము, వర్తమానము, భవిష్యత్తు అను భేదము లేక యన్ని విషయములును సాక్షాత్తుగా నిందుగోచరించును. ఈ సంప్రజ్ఞాత నమాధిగూడ అభ్యాన బలముచే క్రమముగా నశించి అసంప్రజ్ఞాతసమాధిగా మాఱును. ఆ యవస్థలో ఆ మిగిలిన ధ్యేయవస్తువు స్పూర్తియగుటగూడ నశించి కేవల నిర్మలజ్ఞానముగా మాత్రము శేషించియుండును. ఇదే కైవల్యావస్థ. ఇవి పాతంజలియోగశాస్త్రముచే గ్రహింపఁగల ముఖ్యవిషయములు.

కాని యీ యభ్యాసప్రవాహములో ముఖ్యమైన యీశ్వరవ్యక్తి యొక్కడనో మునిఁగి పోయినాఁడు ! ఈ మతము ప్రకారము ఈశ్వరుఁ డక్కరయే లేదు. ఉన్న, యోగసాధనమునకు మేలు. అంతే. నామరూప మయమైన యీ ప్రపంచ మందలి పరిణామములు, తాపములు, సంస్కారములు, పరస్పరవిరుద్ధములగు సత్త్వరజస్తమో గుణములు—వీనిచేత పుణ్యమైనను పాపమైనను, సుఖమైనను దుఃఖమైనను అంతయును వివేకముగల వానికి దుఃఖముగానే తోఁచును గావున*[1] ఇన్ని వ్యవహారములకు హేతువైన చిత్తమును స్వాధీనము చేసికొనుట, దాని కల్ప నలు తన్ను ఆవరింపకయుండునట్లు అడ్డగించుట, ఇవే పరమార్థమని వీరిమతము. అదే మోక్షము. ఇట్లగుటచే, మూలకారణమును వెదకc బ్రయత్నించి, తుదకది దొరకక యీ కష్టములనుండి తప్పించుకొను మార్గమును వెదకుకొని వీరు కృతార్డుల మనుకొనిరా యని సందేహము గలుగుచున్నది. కాని, సంప్రజ్ఞాత సమాధిలో నున్నపుడు అతీతానాగతజ్ఞానము, అపరోక్షజ్ఞానము, విచిత్రమగుప్రతిభయుఁ గలుగు నని చెప్పదురు గాన, ఆదియే సత్యమగునేని మనకు సామాస్యముగఁ గలుగు ప్రశ్నలకన్నిటికిని అందు ప్రత్యుత్తరము దొరకవలసి యుండును. ఐనను యోగు లెవరును ఆ ప్రత్యుత్తరములు నిస్సందేహముగాఁ జెప్పి మనల నుద్ధరించి యుండ లేదు. కావున నీ యోగశాస్త్ర కైవల్యము, అప్పులవారి భాధలు పడలేక యింటి మూలలో దాఁగుకొని తలుపువేనుకొనుట వంటిది తప్ప, నిజమైన జ్ఞానమోక్షమగునా యని శంకింపవలసియున్నది. ఇట్లు సందేహించిన వారికిట్లు ప్రత్యుత్తరము గలదు:

 1. * చూ, పాతం, యోగ, సూ. 2, పా, సూ. 15.