పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 66

దాయము, కొంతవఱకు వంశపరంపరా సిద్ధమగు మేధాశక్తియుఁ గలవారు గావున, విద్యాశాలల వేలము పాటలలో నెక్కువ నవాలుచేయగలిగి, నియమించిన కార్యము న్యాయముగాఁ గాకున్నను తెలివితో నిర్వహింపఁగలవారు గనుక, సర్కారువారి చనవు సంపాదించిన బ్రాహ్మణులను జూచి కడుపు చిచ్చుగల నేఁటి బ్రాహ్మణేతరులలో చదువుకొన్నవారు కొందఱు "బ్రాహ్మణులతో ప్రపంచము పాడైపోయినచో!" యని యఱచు చున్నారే కాని, ధర్మము న్యాయము మొదలగు నేవిషయము లందును వారికన్న వీరేమియు యోగ్యతగలవారు కాకపోవుటచే, వీరి ద్వేషము, ఎవరనుకొనని పనికిరాని ప్రాఁతమనుస్మృతి కాపీలను కచ్చితో కాల్చుటకు తప్ప నింకెందుకును పనికిరాకపోయినది. తత్త్వదృష్టి, ధర్మబుద్ధి, న్యాయాభిమానముఁ గాక అసూయ మూలమగుటచేత, ఈ బ్రాహ్మణద్వేషముచేత బ్రాహ్మణులు తమ తప్పలను దిద్దు కొనుట యట్లుండగా, ఏగుణములచే వారిట్లు నైయాయిక ప్రపంచమున సథఃపాతముఁ జెందుచున్నారో, ఆ గుణములనే యబ్రాహ్మణులును వృద్ధిచేసుకొని వాడ పాతాళ లోక యాత్రలో పోటాపోటీ చేయుచున్నారు! కాని వేమన్నకు బ్రాహ్మణ ఖండన మం దంతకన్న నెంతో యుదారమైన యాశయము గలదు.

       "ఆ. బ్రాహ్మణులకు సకల భాగ్యంబు లీవచ్చు
             గౌరవింపవచ్చుఁ గోరివారు
             జ్ఞాన మొసఁగి జనులఁ గడతేర్పఁ గలిగిన." (2810)

అట్లు లేకున్నప్పుడు. -

      "ఆ. బ్రాహ్మణులకు(బెట్ట ఫలము కద్దందురు
            కుక్కలకును బెట్ట కొదవయేమి...?" (2809)

ఇట్లు చెడఁదిట్టినను తిట్టుటకు మూలము అసూయగాక, వారిలోపములను దిద్ద వలెనను నిష్కళంక శ్రద్దయే యగుటచే, వేమన్నను అట్టి విప్రులుగూడ గౌరవించిరి.
 
      "ఆ. ఇలను శూద్రుఁడౌట యెఱుఁగరా వేమని
            మనసు నతనితోడ మరులు కొనియె
            కొలిచిని ద్విజులెల్ల కోటాన(గోటులై.." (ఓ. లై., 12-1-30)

ఈ పద్యము వేమన్న చెప్పినను, చెప్పకున్నను, కోటానగోట్లు ద్విజులు ఇతనిని గొలుచుట యసత్యమేయైనను, కొంచఱైనను ఆతనిని గౌరవించి యుండుట సత్యము. ఇట్లు తమ దోషముల నెఱిగినవారు, న్యాయ ధర్మములను గౌరవించు శ్రద్ధా వంతులు బ్రాహ్మణులలోఁ గొందరైనను సర్వకాల సర్వావస్థలయందును ఉండుట చేతనే, యెన్ని మతములు మాఱినను, ఎన్ని రాజ్యములు తలక్రిందైనను, ఎందఱు ఎదుర్కొని పోరినను, బ్రాహ్మణజాతి మూలమట్టుగ నశింపక యివరకును నిలిచి గౌరవింపఁబడుచున్నది. నేఁటికిని అబ్రాహ్మణుఁడగు గాంధిని మహాత్ముఁడని నిష్కల్మషముగా నమ్మి, యతని ఖండనఖడ్గములకు చెవియొుడ్డి, యతని యుపదేశ ములను త్రికరణ శుద్ధిగా నాచరించువారిలో, బ్రాహ్మణు లున్నంతమంది బ్రాహ్మణేతరు లున్నారనుట నాకు సందేహము. అది యట్లుండె,

ఇట్లు బ్రాహ్మణులు తత్త్వజ్ఞానమునకుఁగాని, ధర్మస్థాపనకుఁగాని పనికి రారైరి. కేవలము జాతిలో మేమధికులమని మర్యాదలు లాగుకొనుచుండిరి. వట్టి 'గుడ్డెద్దు జొన్న” వంటిదే కాని వారియాధిక్యమెందును గానరాదయ్యెను. అందఱివలెనే రోగ ములు చావును వారికిని వచ్చుచున్నవి. తాపత్రయములలో నేది గాని వారిని మన్నించి వదలలేదు.