పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన కాలమందలి మతధర్మముల స్థితి 65

విష్ణువుకన్న శివుఁడు గొప్పవాఁడని వాదించు శైవులతో నొకమాఱు విష్ణు పక్షము వహించి యితఁడిట్లు వాదించెను.

        "ఆ. కొడుకును బ్రదికించుకొనలేదు శంభుండు
              కొడుకును బ్రదికించుకొనఁడె శౌరి
              దేవతాంతరములు దీననే కనిపించె (వే.జ్ఞా., 694)

ఇట్లు తత్త్వజ్ఞాన పిపాస, వివేచననాశక్తియు మాత్రమే కాక, తీవ్రమైన న్యాయ దృష్టియుఁ గలవాఁడగుటచే, శివభక్తులు, విష్ణుభక్తులు అనఁబడు వారి దాంభిక వృత్తి , స్వార్థపరత, పాపభీతిలేమి, అర్ధములేని - కాని - కర్మలు మొదలగునవి యితనికి చాల నసహ్యమును కోపమును గలిగించినవి. శివభక్తులు.

        "ఆ. రాతి బసవని గని రంగుగా
              మొక్కుచు గునుక బసవని గని గుద్దుచుందు
              బసవభక్తులెల్ల పాపులు తలపోయ." (33o2)

            "లింగధారి కన్న దొంగలు లేరురా" (282)

అని తిట్టెను. తన దైవమగు శివుని భక్తులకే యీ మర్యాద యైనప్పు డిఁక వైష్ణవుల గతి చెప్పవలయునా ?
 
      "ఆ. వైష్ణవులనియెడు వార్త మాత్రమెకాని
            ప్రజలఁ జెఱుతురయ్య భ్రష్టులుగను" (3864)

ఇట్టి డాంభికుల, అజ్ఞానుల యాజమాన్యమున నడుపఁబడుచున్న పూజలు, ఉత్సవములు, పూర్వోత్తర కర్మములు, యజ్ఞములు, యాత్రలు మొదలగు నవియు, వాని శాస్త్రములును—ఏవిగాని, వేమనకు సహ్యములు గాలేదన్న నాశ్చర్య మేమి ? వీనిని గూర్చి వేమన వ్రాసిన పద్యము లుదాహరింప(బోయిస వేలకు మీఱును. మచ్చుకు ఒకటి రెండుదాహరింతును :

        "ఆ. రాతి బొమ్మకేల రంగైన వలువలు
              గుళ్ళు గోపురములు కుంభములును,
              కూడుగుడ్డ దాను గోరునా దేవఁడు....?" (3303)

        "ఆ. విప్రులెల్లఁ జేరి వెఱ్ఱికూఁతలు గూసి
             సతిపతులను గూర్చి సమ్మతమున
             మునుముహూర్తముంచ ముండెట్లు మోసెరా...? (3537)

        "ఆ. లంజకొఱకు మేక నంజుడు తినసాఁగి
              యజ్ఞ మెల్లఁ గామ యజ్ఞమాయె!
              మొదట సోమయాజి తుద కామయాజిరా..." (ఓ. లై., 11-5-22)

ఇట్లవన్నియు నిరర్ధకములని నిర్ణయించుకొన్న పిమ్మట, నిట్టి వాని కాచార్యులై స్వధర్మచ్యుతులైన బ్రాహ్మణులను నోటి కసిదీఱ దిట్టినాఁడు. వారి కులగోత్రముల గుట్టంతయు బైట బెట్టినాఁడు. వారు పేరుకు బ్రాహ్మణులే కాని పరబ్రహ్మము తెలుపా నలుపా యోఱుపా? తెలిసినవారు వారిలో లేరన్నాఁడు. తుదకు సంఘ మందలి యిన్ని యవస్థలకును వీరే జవాబుదారులనుకుని

       "ఆ. భ్రహ్మవంశభువులు ప్రబలులై యుండఁగ
             నితరజాతులకు గతులు కలవే ......" (2799)

అని వాపోయినాఁడు! గతులనఁగా సర్కారు జీతములని కాదు, ఆది యిప్పటి యనేక బ్రాహ్మణద్వేషుల మొఱుపువంటి, బిచ్చమెత్తియైనను విద్య నేర్చు సంప్ర